File No.4



నిరంతరాయంగా నీ స్ఫురణలోనే వుంటాడు. పరమాత్మ ఎలా వుంటాడో, గురువుకూడా అలానే వుంటాడు. సర్వవ్యాపకుడు కాబట్టి. అందరిలో పనిచేసే సత్తా గురు సత్తాయే. కాబట్టి ఆ గురుసత్తా ప్రభావం చేతనే సర్వవ్యాపకంగా వుంటాడు. నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు అక్కడే వుంటాడు, పరమాత్మ కూడా అంతే. గురువు ఎలా వున్నాడో, పరమాత్మ కూడా అలాగే వుంటాడు. కానీ అతను నీకు ఎప్పుడు వుపయోగపడుతాడయ్యా? అని అంటే, నువ్వు నీ నిజ జీవితంలో ఆ స్ఫురణతోటి జీవిస్తూ వుంటే, గురువు ఆ విషయంలో ఎలా చెప్పాడు? ఆయన వాక్యం ఎలా చెప్పాడు? ఆ వాక్యంతోటి మనం ఎట్లా జీవించాలి? ఎట్లా మార్పు చెందాలి? ఏ మార్పు చెందితే గురువు గమనించగలుగుతాడు? నువ్వు ఎంతగా మార్పు చెందాలట? నువ్వు అక్కడకు రానక్కర్లేదు. నువ్వు ఆ గురువాక్యాన్ని అనుసరించి జీవిస్తూ వుంటే చాలు. నీ ఆర్తి ప్రభావం, నీ విచారణా ప్రభావం, నీలో కలిగే తపన అది గురువును మేల్కొలుపుతుంది. పరమాత్మను మేలుకొల్పుతుంది. నీలో అంతఃస్ఫురణ మేల్కొంటే చాలు నీ అంతరాత్మ చెబుతుందన్నమాట. నీకు నాకు వారధి ఎవరయ్యా? అంతరాత్మయే వారధి. ఎందుకని? నాలోపల వున్న అంతరాత్మ, నీలోపల వున్న అంతరాత్మ ఒక్కటేగా. ఆ అంతరాత్మ అనే వారధి ద్వారా తెలుస్తుంది. నువ్వు చెబితే నాకు తెలిసేదంతా వట్టిదే. ఎందుకని? ఇది ఇంద్రియాల సమక్షంలో జరిగేది. ఇప్పుడు నీకు ఏం చెప్పినా తాత్కాలికమే. శాశ్వతమైనది ఎలాగయ్యా అని అంటే, నువ్వు నీ అంతరాత్మని పట్టుకో! నీ అంతరాత్మ సాక్షి మేల్కొనేట్లయితే, ఆ సాక్షి అనే అంతరాత్మ ద్వారా, ఆ వారధి ద్వారా తెలుసుకునేదంతా సత్యం. అర్థమైందా అండీ! ఆ రకంగా తెలుసుకోవాలి. అయితే అప్పుడప్పుడూ నువ్వు మోసపోయే అవకాశం వుంది. ఏది అదో, ఏది మనసో, ఏది అంతరాత్మో స్పష్టంగా తెలియదు కాబట్టి ప్రాథమిక దశలలో అప్పుడప్పుడు మధ్యలో ఇలా వచ్చి విచారణ చేస్తూ, ఏవండీ ఇప్పుడిది ఇలా జరిగింది, ఈ సంఘటనలో ఇలా స్ఫురణ తోచింది, ఈ స్ఫురణ కరెక్టేనా? ఇది మనసా? అంతరాత్మా? (ఇది స్ఫురణ అనేది గుర్తుండడంలేదు కదా!) ఒకటి గుర్తు పెట్టుకోండి, చిన్న పిల్లవాడు ఇప్పుడే అక్షరాభ్యాసం మొదలు పెట్టాడండీ! ఏం గుర్తు వుంటుంది వాడికి? నువ్వు అప్పుడే వాడిని ఏదో, పెద్ద పండితుడి level లో చెయ్యాలి అంటే ఎలాగ?