File No.8




ఎట్టి దోషమూ లేదనమాట దీనికి. కారణం ఏమిటంటే, శ్రవణ మనన నిధి ధ్యాసనములు అనే నాలుగు సాధనముల ద్వారానే ఆత్మ విచారణ స్థిరపడాలి, వేరే మార్గము లేదు. నవవిధ భక్తి మార్గాలలో అయితే మీకు, రకరకాల అంశాలు అక్కడ వుంటాయి. చెయ్యడానికి, వినడానికి, చూడడానికి, చెప్పడానికి, అనుసరించడానికి చాలా వుంటాయి. కానీ ఆత్మ విచారణ మార్గంలో కేవలం శ్రవణం, మననం, నిధి, ధ్యాస అంటే నేను ఆత్మస్వరూపుడని అని గురువు అనుభవజ్ఞానంతో చెబుతూ వుంటే నీవు విని, దాన్ని అలాగే విన్నదానిని స్థిరపరచుకొని, దానిని మననం చేయాలి. ధారణ చేయాలి మొట్టమొదట. వేరే మార్గం లేదు. ధారణ చేసి, ఆ ధారణ చేసిన దానినే మననం చేయాలి. ఆ మననం చేసిన దాని దృష్ట్యానే నీవు దానిని స్థిరపరచుకుని జీవించాలి. ధారణ అంటే ధరించడం. మనం వస్త్రాలు ధరించడం లేదా? శరీరం ధరించలేదా? అదే సహజంగా. దానికి ఆ గీటు దాటలేని నియమానికి లోబడి జీవించాలి. ఆ నియమం ఎవరూ చెప్పరు. నీవు ఎంత కఠినంగా ఆ నియమాన్ని పోషిస్తావో, ఎంత పటిష్ఠంగా ఆ నియమం మీద నిలబడి జీవిస్తావో, నీకు ఆ అనుభవం అంతతొందరగా కలుగుతుంది. ఆత్మానుభవం కలగడానికి ఎంత? రెప్పపాటే. ఏమీ లేదండి. దీంట్లో ఎక్కువ కష్టపడాల్సిన అంశం ఏమీ లేదు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగాలి అంటే, ఎంత సులభమయ్యా అంటే, శత పత్రములు కలిగినటువంటి పువ్వు, అంటే 100 రేకులు కలిగినటువంటి తామర పువ్వులోనుంచి, ఒక సూదిని ఎక్కించాలంటే ఎంత సులభమో, అంతటి సులభం ఆత్మసాక్షాత్కార జ్ఞానం. ఎందుకని? అది నీవే అయివున్నావు. అక్కడ వేరేదేమీ తెచ్చేది ఏమీ లేదు. కొత్తది బోధించేది ఏమీ లేదు. కానీ ప్రతివాళ్ళు ఆత్మసాక్షాత్కార జ్ఞానం చాలా కఠిన తరం, చాలా అసాధ్యం, జీవితమంతా పెట్టే వుంది, అది అయ్యేపని కాదు, ఈ జన్మకు అయ్యేపని కాదు, ఇలా అక్కడ ఏమనుకుంటున్నారంటే, అదే మీకు ఇక్కడ చెబుతోంది. మీరందరూ కూడా మనం ఒకదాంట్లో దిగుడు బావిలో పడిపోయామండి. ఊబిలో చిక్కుకున్నామండి. ఇప్పుడు మీకు ఏం కావాలి? నువ్వు ఎంతగా తున్నుకుంటే, ఎంతగా తన్నుకున్న కొద్దీ కిందకు పోతావు. స్వప్రయత్నంతో నువ్వు ఎంతగా తన్నుకున్న కొద్దీ, అంతగా కిందకి పోతావు. కాబట్టి నీకు ఏం కావాలట? ఒక బలమైన ఆధారం వుంటే తప్ప నువ్వు పైకి రాలేవయ్యా! వేరే మార్గం లేదు. ఆ బలమైన ఆధారం ఏమిటి? నేను ఆత్మస్వరూపుడిని అనేటటువంటి భావన బలమైనటువంటి ఆధారం. అది ఎవరు చెప్తాడు? అనుభవజ్ఞానం వున్నవాడు చెప్తాడు. అది వేరే విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, నేను ఆత్మస్వరూపుడిని అనే భావాన్ని గనుక నీవు ఆశ్రయించినట్లయితే, ఆ ఒక్క భావనే, నిన్ను ఇందులోనుంచి బయటకు లాగేటట్లు చేసేస్తుంది. అది తప్ప నువ్వు మిగిలినవి ఏవి పట్టుకున్నా, అవి మళ్ళానిన్ను ఊబిలోకే పడేస్తాయి. వేరే మార్గం లేదు. అందువల్ల తప్పని సరిగా నేను ఆత్మస్వరూపుడిని అనే భావంలోనే, మేల్కోవాలి. నేను ఆత్మస్వరూపుడిని అనే భావంతోనే నిద్రపోవాలి.
            ముందు ప్రధానంగా నిద్రా సమయాన్ని ముందు చక్కగా వినియోగించాలి. ఈ నిద్రాసమయం సాధనగా ఎవరికైతే మారుతుందో, వాడికి ఆత్మసాక్షాత్కార జ్ఞానం తప్పనిసరిగా కలుగుతుందన్నమాట. చాలా మంది దీనిని, మిగిలిన నవవిధభక్తి మార్గాలు చేసినట్టుగా, మెలకువలో ఏదో ఉదయం పూట అరగంటో, గంటో చేసి విడిచి పెడుతారు. దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు. పగలు రాత్రి అనే భేదం లేకుండా, నేను ఆత్మస్వరూపుడు అనే భావంతోనే, ప్రతి ఆలోచనని ప్రారంభించాలి. ప్రతి పని, ప్రతి ధర్మం, ప్రతి చేత, ప్రతి కర్మ, ప్రతి మాట నువ్వు ఏదైనా చెయ్యి, ఇంద్రియాలని ఉపయోగిస్తే ముందు నేను ఆత్మస్వరూపుడను అనే భావంతో మొదలు పెట్టాలి.
            మొదలు పెడితే అప్పుడు నీకు ఆ గుణ దోషం అంటదు. అవస్థాత్రయదోషం అంటదు. నీకు ఏ దోషము అంటదు ఇక. అంటకుండా సహజంగా సాక్షిగా వుంటావు. ఒకవేళ అక్కడ ఏదన్నా గుణాలు ప్రవర్తిస్తూ వున్నాయి, ఓహో! సాక్షిగా చూస్తూ వుంటావు అంతే. ఆహా! కాని, ఇప్పుడు అబ్బాయి అనటం లేదు మనని, అబ్బాయిలో వున్న రజోగుణం, నీలో వున్న రజోగుణంతో ప్రవర్తిస్తున్నది. ఆ రజోగుణం ఈ రజోగుణంతో మాట్లాడుతున్నదండి. అంతే, అంతకు మించి ఏముంది? మనలో ఇంకా రజోగుణం బాకీ వుందని దాని ద్వారా తెలిసింది. ఓహో! మంచిదే కదా! దాని వలన నష్టం ఏముంది? ఒక దుఃఖం కలిగింది,   ఎందువల్ల కలిగింది? అజ్ఞానం వల్ల కలిగింది. అజ్ఞానం వుంటే కలిగింది. అజ్ఞానం ఎందుకు వుంది? అహంకారం వుంది కాబట్టి. దుఃఖం కలిగింది అంటే వెనుక తప్పనిసరిగా ఇవి వున్నాయి అని తెలుసుకోవాలి. అజ్ఞానం అంటే ఏమీ లేదు. ఆ మూడు గుణాలలో దూరడమే అజ్ఞానం. పాపం అంటే ఏమీ లేదు, మూడు గుణాలలో దిగటమే పాపం. మూడు గుణాలు అంటకుండా వుండడమే పుణ్యం. మీరు అంటున్నారు చూశారా, తీర్థయాత్రలు చేస్తే పుణ్యం, యజ్ఞం చేస్తే పుణ్యం. ఈ పుణ్యం అంతా ఏమిటంటే, నీవు మూడు గుణాలని అంటకుండా వుండే అవకాశం అప్పుడు వుంది కాబట్టి పుణ్యం. నువ్వు మూడు గుణాలను అంటితే పాపం. అంతకు మించి వేరే ఏమీ లేదు నాయనా! జీవుడు అనుకొనుటయే పాపం. నేను ఆత్మస్వరూపుడిని అని స్థిరంగా వుండటమే పుణ్యం. ఇంకా వేరే ఏమీ లేదు. ఆ పుణ్య ఫలితం అంతా ఇదే. అనేక జన్మార్జితమైనటువంటి పుణ్యఫలితమంతా కలిపితే, is equal to ఏం ఫలితం వస్తుందయ్యా అంటే, ఆత్మసాక్షాత్కారజ్ఞానం వస్తుంది. కాబట్టి అందరిని పుణ్యం సంపాదించమని పెద్దలు ఆచారంగా పెట్టారు. ఎందుకని? చేయగా చేయగా చేయగానైనా గానీ, నీకు ఆ స్ఫురణ కలిగి, నేను ఎందుకు చేస్తున్నాను ఇది? ఏ నిమిత్తము చేస్తున్నాను? వెనక్కు తిరిగి చూసుకుంటే, నేను ఏదో చాంతాడంత కోరికలు చదివాను. అవేమీ తీరలేదు. అవేమీ ఆయన చేయలేదు. ఎందుకు చేయలేదు? చేయడు కాబట్టి. చేయడు కాబట్టి అనే స్థిరం అయినా రావాలి కదా! చేయడు కాబట్టి అనే స్థిరం రాలేదు. ఇంకా చేస్తాడులే, ఇంకా చేస్తాడులే అని కోరుతూ పోవడమే గానీ, ఆయన చేసేది ఒకటే ఒక పని చేశాడు. నిన్న కూడా చెప్పాను. నీకు మానవ ఉపాధిని ఇవ్వడమే మొదటి, చివరి సహాయం. ఇంకా వేరే సహాయం ఏమీ లేదు. ఇదే మొదటిది, ఆఖరి సహాయం పరమాత్మ చేసేటటువంటిది. ఎందుకంటే ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో అన్నిటికంటే ఉత్తమమైన ఉపాధి మానవ ఉపాధి. భగవంతుడిని తెలుసుకోవడానికి, సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి, సృష్టిని అధిగమించడానికి, ఆత్మభావంలో జీవించడానికి, నేను పరమాత్మనే అనే సహజమైన స్థితిని కలిగివుండడానికి, అవకాశం వున్నటు వంటి ఉపాధి మానవ ఉపాధి ఒక్కటే. ఈ మానవ ఉపాధిలో ఏం తరతమ భేదాలు లేవు. ఆ మానవులందరికి అర్హత వున్నది. అయ్యో! ఇది నాకు లేదని నిరాశ చెందవలసిన అవసరమే లేదు. వివేక చూడామణి ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వచనమిదే. నీవు మానవుడిగా పుట్టడమే దీనికి అర్హత. వేరే ఇంకేమీ అర్హతలు లేవు. ఈ జ్ఞానం పొందాలి అంటే, మానవుడికి ఒక్కడికే అవకాశం వుంది. అదే నాయనా మొదటిది, చివరిది నీకు పరమాత్ముడు ఇచ్చే ఆశీర్వచనము. పరమాత్ముడు చేసే సహాయం.
            నీకు బుద్ధిని ఇచ్చాడు, చక్కగా విచారణ చేయగలిగే శక్తిని ఇచ్చాడు. ఈ విచారణాజ్ఞానాన్ని చక్కగా వుపయోగించుకో. ఎట్లా వుపయోగించుకోవాలో అనుభవజ్ఞుడైన గురువును ఆశ్రయించి తెలుసుకో. అంతేగాని శాస్త్రం మీద ఆధారపడి విచారణ చేయమాకు. ఎందుకని? విచారణ జ్ఞానం అనేది సరైన పద్ధతి వుందన్నమాట. అంటే ఏమిటి? అసలు గురువు అంటే ఎవరో తెలియదు కాబట్టి, ఏం తెలుసుకోవాలి? గురువును వెళ్ళి ఏం అడగాలి? అని తెలియడానికి ప్రాథమికంగా శాస్త్రం అవసరం. కాబట్టి శాస్త్ర దృష్టం, శాస్త్రం ఎట్లా చూపెడుతోందో మొట్టమొదట చదివి చూసి తెలుసుకో. తెలుసుకున్న దానిని మళ్ళా ఆ శాస్త్రాన్ని పట్టుకుని మళ్ళా ఎవరి దగ్గరకు వెళ్ళాలట? అనుభవజ్ఞానం వున్నటువంటి గురువు దగ్గరకు వెళ్ళి, గురోర్వాక్యం, దానిని ఎట్లా జీవించాలో చెబుతాడు. శాస్త్రం ఏం చెబుతుందంట? ఎట్లా జీవించాలో చెప్పదు. సిద్ధాంతం వరకూ చెబుతుంది. ఇదిగో నీళ్ళను విడగొడితే హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ వస్తుంది. దాని వల్ల నీకు ఏమిటి ప్రయోజనం? ఆ హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ వస్తోంది అంటే అదొక సిద్ధాంతం. నీకేం ప్రయోజనం? అది ఎట్లా వుపయోగించుకుని జీవిస్తే, నీకు ఆత్మానుభవం కలుగుతుందో, నీకు తెలియచెప్పాలి అంటే, అట్లా జీవించి వున్నటువంటి మహానుభావుడు దగ్గరికైనా వెళితే, వారు నీకు ఆ సిద్ధాంతాన్ని నిజజీవితంలో ఎట్లా వుపయోగించి, జీవించాలో చెప్తాడు.
            ఎందుకునయ్యా? నిన్ను నువ్వు చూసుకోవడం నీకు చేతకాదు కాబట్టి. ఎందుకని? నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు పక్షపాత ధోరణితో చూస్తావు. నీ మీద నీకు పక్షపాతం వుంటుంది కదా! నీలోపల మనసు ఎటువైపుకు ఓటు వేస్తుంది? దానివైపే ఓటు వేసుకుంటుంది. నిరసించే వైపు ఓటు వేస్తుందా? వెయ్యదు కదా! అదే గురువు అయితే ఏం చేస్తాడు? గురువు దగ్గరకు ఎందుకు వెళ్ళావు? నీ లోపాలను సరిచేయమనే కదా వెళ్ళావు. కాబట్టి గురువు ఏం చేస్తాడు ఎప్పుడూ కూడా నీకు దుఃఖం కలిగే అంశాలే చెప్తూవుంటాడు. అది విన్నప్పుడల్లా నీ మనసుకి దుఃఖం కలుగుతూ వుంటుంది. ఎందుకని? నిన్ను మారమంటాడు కదా! అది సరైనది కాదు, ఇది సరైనది కాదు. అది అట్టా పనికి రాదు, ఇది ఇట్టా పనికి రాదు. ఇవి మారితేనే నువ్వు అవుతావు, లేక పోతే నువ్వు అవ్వవు. ఇట్లా కఠినంగా చెబుతూ వుంటాడు. ఏమౌతుంది? దుఃఖం వస్తుంది. ఎందుకని? ఎత్తి చూపెడితే. నీది నీకే ఎత్తి చూపెడుతేనే నీకు దుఃఖం కలుగుతోందే, మరి ఇంతకాలం నువ్వు చేసిన పని ఏమిటి? అదే కదా!
            ఇతరుల వల్ల నీకు ఎందుకు దుఃఖం ప్రాప్తించింది? నువ్వు అదే పనేగా చేశావు. కానీ అక్కడేమో జ్ఞానం రాలేదు, అజ్ఞానమే వచ్చింది. ఈ లోపాన్ని సరిచేసుకుంటే, దానిని నిరసించేసేస్తే, ఏమయ్యావు? జ్ఞానం కలిగింది. మళ్ళా దుఃఖం ఏర్పడే అవకాశం రాలేదు. ఇక. కాబట్టి నీ యొక్క సంస్కార బలాన్ని బట్టి, ఏం చేస్తే, ఎలా జీవిస్తే, నువ్వు దాంట్లో నుంచి బయటపడగలవో, అందరికీ ఒకే రకమైన సంస్కార బలం వుండదు. ఈవెడకు బోధించే సంస్కార బలం వుంది. నీకు వినే సంస్కార బలం వుంది. నీకు కొంత చెప్పే, కొంత వినే సంస్కార బలం వుంది. అట్లా ప్రతి ఒక్క జీవికి, ఒక్కోరకమైన సంస్కార బలం వుంటుంది. ఆ సంస్కార బలాన్ని బట్టే, నిజజీవితంలో అన్నీ ఏర్పడుతాయి. అర్థమైందా అండీ!
            నాకు కఠినాతికఠినంగా పనిచేసే సంస్కారబలం వుంది. కాబట్టి నిరంతరాయంగా అట్లా కఠినంగా పనిచేసేటటువంటి పరిస్థితులే వస్తూ వుంటాయన్నమాట. ఎందుకని? ఉపాధి ధరించినప్పుడు లోపల వున్న సంస్కారబలం అట్లా వుంది. అర్థమైందా అండీ! ఆ కఠినమైనటు వంటి శ్రమ కూడా రజోగుణమే. ఆ కఠినమనే శ్రమ లోపల వుండిపోవడం, దానితో దేహం ఏర్పడింది. అందువలన ఏమైంది? కఠినమైన పనులే వస్తాయి, ఇక ఎప్పటికీ కూడా, కఠినమైన పనులన్నీ ఇక చేయవలసిందే అంతే! పోయేదాకా చేయాల్సిందే. ఎందుకని? దేహం ఏర్పడిందే దాంతో ఏర్పడింది. దాన్నేమీ తప్పించడానికి వీలుకాదు. ఎంతటి సుఖంగా చేయగలిగిన పనైనా సరే, దీనికి వచ్చేటప్పటికి అత్యంత కఠినమైపోతుంది అది. ఎందుకని? అదే నాయనా రహస్యం. ఇదే సృష్టి రహస్యం. తెలుసుకోండి. అరె వాడు ఈజీ గానే చేస్తున్నాడు కదా! వాడికి అది ఈజీనే. ఎందుకని? అందులో వున్నటువంటి వాడి గుణ బలం అలావుంది. వాడి గుణబలం. సత్వగుణంతో వున్నాడు, సుఖంగా పూర్వజన్మ. నిదానంగా జరిగిపోతూవుంటుంది. అర్థమైందా అండీ!
            రజోగుణం, తమోగుణంతో వుంటావు. కఠినం అంతా వుంటుంది అందులో. కాఠిన్యం అంతా మరి ఎక్కడికి పోతుంది? బాగా మెడలు వంచి పనిచేస్తే కానీ, అది పోదది. అందుకని ఏమౌతుంది? (ఏ పని చేద్దామన్నా ఆటంకమే నాకైతే). ఇదే కదా నేను చెబుతోంది. అది తమోగుణ ప్రభావమన్నమాట. తెలుసుకోవాలి మనం. ఓహో! మనలో తమోగుణ ప్రభావం వుంది కాబట్టి, ప్రతిదానికి ఆటంకం వస్తున్నది. తమో గుణాన్ని నిరసించేస్తేగానీ అది పోదు. అర్థమైందా అండీ!
            అట్లాగే, దేహం ధరించడానికి ప్రధానంగా మూడు నాలుగు సంస్కారాలే కారణం అవుతాయి. మన మిగిలిన జీవితం అంతాకూడా చాలా ఇతరత్రా సంస్కారాలు చాలా వుంటాయన్నమాట. అవన్నీ కూడా మనం విచారణ చేసి పోగొట్టవచ్చు. కానీ దేహం ధరించడానికి కారణమైన ప్రారబ్ధం ప్రారబ్ధం అంటున్నావే, ఆ ప్రారబ్ధం - ఆరబ్ధ కర్మ అంటారండి. ప్ర+ఆరబ్ధ. పూర్వం నుంచి ఇప్పుడు వచ్చింది అని అర్థము. ప్రారబ్ధము అంటే ఏమి లేదు అక్కడ అర్థం. సంస్కృత పదం కదా అది. ప్ర అంటే ముందు. ఆరబ్ధం ముందు నుంచీ ఇప్పటివరకూ వచ్చింది. అని అర్థము. అర్థమైందా అండీ! ఆ ప్రారబ్ధం అంటే ఏమిటయ్యా అంటే, దేని చేత అయితే ఈ దేహం ఏర్పడిందో, ఏ సంస్కార బీజములచేత దేహం ఏర్పడిందో, అదే ప్రారబ్ధం.
            ఇక అది అంతే. ఎందుకనయ్యా? ఆ దేహం దానితోనే ఏర్పడిందయ్యా! బాబు! దానిని ఏం చేయాలి? ఆత్మజ్ఞానంతోనే శుద్ధిచేయవచ్చు. వేరే మార్గం లేదయ్యా! ఎందుకని? వేరే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేహం దానితోనే ఏర్పడింది, అది వచ్చి కూర్చుంటుంది ముందు. అర్థమైందా అండీ! నేను ఎన్నో ప్రయత్నాలు చేశానండీ, ఏదీ ముందుకు సాగలేదండీ! అని చెప్పేవాళ్ళు చాలా మంది వుంటారు. కారణం ఏమిటి? ఆ దేహం అట్లాగే ఏర్పడింది. అదొచ్చి ముందు కూర్చుంటుంది. అది పోగొట్టాలి అనంటే, వేరే ఇతరత్రా జ్ఞానాలతో దానిని శుద్ధి చేయడానికి వీలుకాదు. నిన్నటి నుంచి చెబుతున్నది ఇదే. ప్రాణ మనో బుద్ధులు అనే సూక్ష్మంలో వుంటాయి సంస్కారాలు, వాసనలు. వేరే ఎక్కడా వుండవు. ఆ ప్రాణ మనో బుద్ధులను ఆశ్రయించే ఈ శరీరం పని చేస్తోంది. నువ్వు శరీరానికి వాతలు పెడితే ప్రయోజనము లేదు. దానిని సరిచేయాలి. దానిని సరి చేయాలి అంటే నువ్వు విచారణ చెయ్యాలి. ప్రాణ మనో బుద్ధులని శుద్ధి చేయాలి అంటే విచారణ చేయాలి. అర్థమైందా అండీ! దేహాన్ని 10సార్లు తోమినంత మాత్రాన ప్రాణ మనో బుద్ధులు బాగుపడుతాయా? బాగుపడవు కదా! పోనీ దీనికి పైనుంచి కింది వరకు తడిబట్టలు బురఖా వేస్తే ఏమన్నా మారిందా? ఏమన్నా ప్రాణ మనో బుద్ధులు మారవు కదా! కాబట్టి సూక్ష్మాన్ని సూక్ష్మంగా బుద్ధిని బుద్ధితోనే పరిష్కరించాలి. ముల్లుని ముల్లుతోనే తియ్యాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే సామెతలు అన్నీ ఇందులోంచి వచ్చినవే. బుద్ధి యొక్క సమస్యను బుద్ధితోనే పరిష్కరించాలి. దానిని ఎటు తిప్పితే విచారణని ఏ లక్ష్యం దృష్ట్యా తిప్పితే దాని పరిష్కారం వస్తుందో, అట్లా విచారణను తిప్పాలి. అంతేగాని ముడిపడిపోయే పద్ధతిలోకి తిప్పకూడదు.
            ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాము? మరింతగా సంస్కార బంధాలు బలపడిపోయేట్లుగా, ముడులు వేసుకుంటున్నావు ఇంకా. బాగా ముడులు వేసుకుంటున్నావు. ఎంతగా ముడులు వేసుకుంటున్నావు అంటే, ఇక విప్పడానికి వీలుకానంతగా ముడులు వేసేసుకుంటున్నావు. మళ్ళా ఉత్తర జన్మకు విప్పాల్సిందే, మళ్ళా వచ్చేజన్మకు విప్పాల్సిందే. వీటిని. ఈ జన్మకు విప్పడానికి వీలు కాదు ఇక. అంతగా ముడి వేసేసుకున్నావు. మరి ఈ జన్మకు కనీసం విప్పే జ్ఞానం అన్నా వుండాలి కదా! (విప్పాలి అని) అది ఆ తెలివితేటలు అన్నా రావాలి కదా! అదైనా కనీసం ఈ జన్మలో స్ఫురిస్తే, అది ఏమౌతుంది? వీలైతే ఈ జన్మలోనే బంధ రాహిత్యం కలుగుతుంది. బంధాలనుంచి బయటపడవచ్చు. లేదయ్యా అధవా, ఏం నష్టం లేదు నాయనా! ఈ జ్ఞానం తప్పని సరిగా వచ్చే ఉపాధికి ఉపయోగపడుతుంది నాయన. ఎలాగ నాయనా? బాబూ ఎనభైనాలుగులక్షల జీవరాశుల్లో నువ్వు జీవించినప్పుడు ఏ జ్ఞానాన్నైతే ఒక్కొక్క ఉపాధిలో సముపార్జించావో, ఆ జ్ఞానమంతా నీకు మానవ ఉపాధిలో ఉపయోగపడుతుంది కాబట్టే, అవి చేయగలిగిన అన్ని పనులూ నువ్వు ఇప్పుడు చేయగలుగుతున్నావు. అర్థమైందా అండీ! అన్ని జంతువులు చేయగలిగిన అన్ని పనులూ మానవుడు చేయగలడు. ఆ జ్ఞానం అంతా మానవుడిలో వుంది. అందుకే చూడండి ఒక్కొక్కడికి ఒక్కో విద్యలో రాణింపు వుంటుంది. ఒకడు తీగల మీద నడువ గలడు. వాడు ఎట్లా నడువగలిగాడు? మనం ఎందుకు నడువ లేకపోయాము? (చీమలు, బల్లి నడుస్తాయిగా). వాడిలో ఆ తెలివి, ఆ సంస్కార బలం బలీయంగా వుంది. ఆ పని చేయగలుగుతున్నాడు. అర్థమైందా అండీ! ఈ రకంగా ఆ ఉపాధిని ధరించేటప్పుడు నీకు ఏ సంస్కారబలమైతే వున్నదో, దానిని బట్టే నీకు ఏర్పడుతూ వున్నాయి. కొంతమంది వికలాంగులుగా, కొంతమంది సకలాంగులుగా పుడుతున్నారుగా. మరి వాళ్ళెలా పుడుతున్నారయ్యా? ఆయా ఇంద్రియ ధర్మాలను, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా, అంటే ఏమిటి? మానవ ఉపాధిగా కాకుండా జంతువు ఉపాధిగా దానిని వుపయోగించి నట్లయితే, సృష్టి యొక్క వినాశనానికి, సృష్టినియమానికి తప్పి వుపయోగించి నట్లయితే, గాఢ తమోగుణంతో గనుక వుపయోగించి నట్లయితే, అప్పుడు ఆ ఇంద్రియ లోపం ఏర్పడుతుంది. సృష్టి నియమం అన్నమాట అది. సృష్టిలో ధర్మంగా అలా వచ్చేస్తుంది అది. కాబట్టి అందుకని ఏం చెప్పారు? నాయనా! చేతులతో మంచి పనులే చేయి. చెడ్డపనులు చేయమాకు. ఉత్తరోత్తరా ఏమౌతుందట? వచ్చేజన్మకు? ఇంద్రియాలు ఏ నియమం నిమిత్తమై ఈ సృష్టిలో ఏర్పరచబడ్డాయో, ఆ నియమం మేరకే వాటిని నీవు ఉపయోగించు నాయనా! నియమం తప్పి వుపయోగిస్తే, అవి బలహీనం అయిపోతాయి. ఉత్తర జన్మకైనా బలహీనం అయిపోతాయి. అవి లేకుండా పోలేదు. వున్నాయి. కానీ వుపయోగపడవు. అర్థమౌతుందా అండీ! వికలాంగుడు అంటే ఏమిటి? వాడికి లేదా? మానసిక వికలాంగుడు వున్నాడు, వాడికి బుద్ధి లేదా? వుంది, కానీ ఉపయోగపడదు. గ్రుడ్డివాడు కళ్ళు లేవా? వున్నాయి, కానీ వుపయోగపడవు. అర్థమైందా అండీ! ఇలా ప్రతిదీ అంతే. అలా ఆ వికలాంగత్వము ఎలా వచ్చిందయ్యా నీకు? ఆ ఇంద్రియాలను సక్రమంగా సృష్టి నియమాలకు లోబడి వినయోగించలేదు కాబట్టి, సృష్టి ఒక నిర్ణయం చేసింది, ఒక రహస్యం, ఇదే సృష్టి రహస్యమంటే నండి. అదేం చేసింది? వచ్చే ఉత్తర జన్మకి, సంస్కార బలమంతా వచ్చే జన్మకు ఏం చేసిందంటే, ఆ అనుభవ పాఠం రావాలి అంటే, ఆ పరిణామ పాఠం రావాలి అంటే, ఆ ఇంద్రియం బలహీనపడిపోయేట్టుగా తల్లి గర్భంలో ఇంద్రియాలను సృజించింది. ఎక్కడ సృజించిందంట? తల్లి గర్భంలోనే సృజిస్తున్నది. మా అబ్బాయికి మూడో ఏడు వచ్చినాక పోలియో వచ్చిందండి. పొరపాటు. మూడో యేడు వచ్చిన తరువాత పోలియో రావడం, మూడోయేడు వచ్చినాక మానసిక వికలాంగుడు అవ్వడం ఏమీ వుండదండీ! మూడేళ్ళ వరకూ బాగానే వున్నాడండీ! తరువాత వచ్చిందండీ అంటారు. ఎలాగ? అది లోపల already వుంది. తయారయ్యేటప్పుడే వుంటుంది. అలాగే. ఉదాహరణ చెబుతా మీకు. బందరులో మా ఇంటి పక్క ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి M.Sc చదివింది. ఏమీ లేదు ఒక రోజు వున్నట్టువుండి జ్వరం వచ్చి పడిపోయింది అంతే! హాస్పిటల్‌కు పట్టికెళ్ళారు. జ్వరమే కదా అనుకున్నారు, ఊరుకున్నారు. ఏమీ కోలుకోలేదు. మంచంలో పడిపోయింది. ఎందుకు మంచంలో పడిపోయిందో తెలియదు. శరీరం నల్లబడిపోయింది. ఎందుకు నల్లబడిపోయిందో తెలియదు. వెంటనే ఎవరో చూసిన వాళ్ళు అన్నారు, ఈ అమ్మాయికి heart disease వున్నట్టుగా వుంది, చూపెట్టండి. అన్నారు. వెళ్ళి చూపెట్టారు. చూపెడితే అప్పటికి గుండె పాతిక శాతమే పనిచేస్తోంది. 75% పనిచేయడం లేదు. మరి మొన్న M.Sc చదివేవరకు బాగానే వుంది కదండీ! వారంలోనే గుండె పనిచేయడం 75% ఎలా పడిపోయింది? మొన్నటిదాకా బానే వుంది కదండీ! (అది క్రమేపీ క్షీణిస్తూ వచ్చింది) క్రమేపీ కాదు. లోపల వున్న సంస్కార బలానికి సమయం, time scale వుంటుందన్నమాట. ప్రతీదానికీ కూడా సమయం మేరకు రాసి వుంటుంది. ఇదిగో ఇన్ని ఆయుర్దాయములు, ఇన్ని ఆయుష్షులు, ఇన్ని హంసలు పూర్తి అయ్యేటప్పటికి ఇది వ్యక్తీ కరించబడాలి. తల్లి గర్భంలోనుంచి శిశువు బయటకు ఎలా వస్తోంది? లెక్క ఎలాగ? సమయం లెక్క ఎలాగ దానికి? దానికి ఎలా తెలిసింది? చెప్పండి. బయట వున్న వాళ్ళకు, మీకైతే సమయం లెక్క తెలుస్తుంది. గడియారం చూసుకుంటున్నారు. తల్లిగర్భంలో వున్న శిశువుకు ఎలా తెలిసింది? ఆయుష్షు. (ఏమో దేవుడికే తెలియాలి) అదే పొరపాటు. ఏడవ నెల నుంచి స్వీయ శ్వాస పనిచేస్తూ వుంది. ఆ 21,600 హంసలు జరుగుతూ వున్నాయి. అప్పటినుంచే దానికి లెక్క మొదలయ్యింది. ఆ లెక్క మొదలయ్యేటప్పటికి ఆ లెక్క ప్రకారం సంస్కార బలం, ప్రారబ్ద బలం చెబుతోంది. నీ టైం అయిపోయిందిరా బాబు. బయటకు రా ఇక. నీ లోపల వున్నటువంటి అంతరాత్మ, సాక్షి అక్కడినుంచే పనిచేస్తుంది. మరి ఇప్పుడు ఎవరు పనిచేశారు? ఇదీ అదే! అంతరాత్మ సాక్షే. టైం అయిపోయింది రా బాబు. ఒక్క సారి 75% గుండె పనిచేయడం తగ్గిపోయింది. ఎన్నో ప్రయత్నాలు చేశారు. అటు తిరిగారు, ఇటు తిరిగారు. ఎన్ని చేసినా సరే, నేను కూడా వెళ్ళాను. ఓహో! సమయం అయిపోయింది. ఆ అమ్మాయికి చెప్పాను. అమ్మాయ్‌! నీ సమయం అయిపోయింది. మిగిలినటువంటి సమాయాన్ని నువ్వు ఇప్పుడు దుఃఖంతో కాకుండా, సుఖంగా వుండే పద్ధతిలో చూసుకో నువ్వు. అని ఆ అమ్మాయికే స్వయంగా చెప్పాను. ఆ అమ్మాయికి తెలుసు, నా టైం అయిపోయిందని ఆ అమ్మాయే చెబుతోంది. నా టైం అయిపోయింది, మీరు దుఃఖపడవద్దు అని తల్లిదండ్రులకు చెబుతోంది. ఇప్పుడు ఎవరికి జ్ఞానం వుంది? (ఆ అమ్మాయికే వుంది). అయ్యో! మరి చూడండి. అర్థమైందా అండీ! మానవుడికి లోపల సహజంగా జ్ఞానస్వరూపుడంటే ఇదే నేను చెప్పేది. ఆ సహజజ్ఞానం తప్పనిసరిగా వుంటుంది ఎప్పుడూ కూడా. అది ఎక్కడికీ పోదు. కానీ నువ్వు దానిమీద విషయావరణ చేత, ఇంద్రియావరణ చేత కప్పుకున్నావు. నీవే కప్పుకున్నావు. అన్నమయ్యకోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, మనోమయకోశాన్ని, విజ్ఞానమయకోశాన్ని, ఆనందమయ కోశాలు అనే పంచకోశాలని నమ్ముకుని, ఆ పంచకోశాలే నీవు అనే పద్ధతిలో జీవిస్తూ, ఐదు దుప్పటిలు కప్పుకున్నావు. ఐదు ఆవరణలు కప్పుకున్నావు. ఆ జ్ఞానం మీద. అంతరాత్మ అనే జ్ఞానం మీద. అందువల్ల ఏమైపోయింది? ఏదో ఒక కోశ పరిధిలో చేరిపోవడమే అలవాటు పడ్డావు కానీ, నేను సాక్షిని, ఈ ఐదు కోశాలకి అనేటటువంటి స్ఫురణని మర్చిపోయావు. తద్వారా ఏమైంది? సహజంగా అలాంటి పరిస్థితి ఎదుర్కోగలిగే స్థితి వచ్చినప్పుడు గానీ, ఆ జ్ఞానం బయటకు రాదు. అంటే రామకృష్ణ పరమహంస అంటారు, ‘దారి లేనటువంటి సందులోకి వెళ్తే కానీ నీకు ఈశ్వరస్ఫురణ కలుగదు’. నీకు అసలు మార్గమే లేదు, బయటపడే అవకాశమే లేదు అన్నప్పుడే అన్యథా శరణం నాస్తి అన్నప్పుడే ఈశ్వరుని యొక్క స్ఫురణ కలుగుతోంది. అప్పుడే నీకు ఆత్మ స్ఫురణ కలిగే అవకాశం వున్నది. నీకు ఆత్మజ్ఞానం అప్పుడే తోస్తుంది. అప్పటి వరకూ తోచే అవకాశం లేదు నాయనా! ఎందుకని? ఇదిగో ఇవన్నీ పెట్టుకున్నావు కాబట్టి. కాబట్టి ముందే మేలుకో! ముందు మేలుకొని ఈ ఐదు దుప్పటిలను, ఈ ఐదు ఆవరణలను విసిరి అవతల పారేయ్‌! ఆ భావం, ఆ ఐదు ఏమిటి? భావములు. బాహ్యము కాదు అవి ఏవీ కూడా. ఆ భావంలో వాటిని తోసి రాజు అనవయ్యా! సాక్షిగా నిలబడవయ్యా! అప్పుడు నీ ఇంద్రియాలు నిన్ను ఏమీ చెయ్యవు, నీ విషయాలు నిన్ను ఏమీ చెయ్యవు, నీ పంచకోశాలు నిన్ను ఏమీ చెయ్యవు. నీ మూడు అవస్థలు నిన్ను ఏమీ చెయ్యవు. అవన్నీ అలా వుంటాయి. నీ ఇంట్లో అన్ని వస్తువులు లేవు? ఏ సమయానికైతే ఆ వస్తువును తీసి వాడటం లేదా? మళ్ళా ఆ వస్తువు అక్కడకు పోతుంది, ఏమౌతుందట ఇప్పుడు? ఆ వస్తువును ఉపయోగిస్తున్నావు, శుద్ధి చేస్తున్నావు, మళ్ళా అక్కడ పెడుతున్నావు, మళ్ళా అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తున్నావు, శుద్ధి చేస్తున్నావు, అక్కడ పెడుతున్నావు. ఇదీ అంతేనయ్యా బాబూ! ఆ ఇంద్రియంతో అవసరం వచ్చింది, వాడావు, శుద్ధి చేశావు, పక్కన పెట్టావు, భావంతో అవసరం వచ్చింది, ఈ భావాన్ని వాడావు, దీనిని వుపయోగించావు, తీశావు, పక్కన పెట్టావు.
            కానీ ఎప్పుడైనా గానీ, వుపయోగించేవాడవు కదా నువ్వు. సాక్షివి కదా నువ్వు. కానీ గిన్నె నువ్వు ఎందుకు అయ్యావు? అర్థమైందా అండీగిన్నె నువ్వు అయితే ఏమైపోయావు? అప్పుడు మంట మీద కాలక తప్పదు నాయనా! దానిని ఎవరూ తప్పి్ంచడానికి వీలుకాదు. నువ్వు అదేగా చేస్తున్నావు. నువ్వు వంట చేసేటప్పుడు నువ్వు వెళ్ళి మంట మీద కూర్చున్నావా? కూర్చోలేదు కదా! ఎందుకని? నీ పనిముట్టును ఉపయోగించావు అక్కడ. అలాగే ఇది పనిముట్టుగా చూశావు, అప్పుడేమైంది? శరీరం పనిముట్టు అయిపోయింది. నువ్వు శరీరం కాదన్నమాట ఇక. అదే శరీరం నువ్వు అయ్యావు. అప్పుడు కచ్చితంగా మంట మీద కూర్చోక తప్పదు. ఆ దుఃఖానుభవం పొందక తప్పదు. దానిని తప్పించడానికి వీలుకాదు. ఇలాగ నీ జీవితం అంతా పనిచేస్తూ వున్నది. (మొన్నకటి చెప్పారు, శివుడు వేరు, ఈశ్వరుడు వేరు అంటారేమిటి?) ఎట్లాగయ్యా అంటే, ఈ సృష్టి అంతాకూడా ఎలా వున్నది అనేదానికి విధాన నిర్ణయం వున్నదన్నమాట. అంటే మనం అందరం ఎట్లా అయితే తల్లి తండ్రి కొడుకు మనవడు అని నువ్వు ఎట్లా అయితే ఇక్కడ చెప్పుకుంటున్నావో, అలాగే ఇక్కడ పనిచేయడానికి రాజు, మంత్రి వగైరా ఎలాగైతే పరిపాలనా విధానం వున్నదో, అలాగే పైన కూడా సూక్ష్మంలో కొన్ని విధాన నిర్ణయాలు వుంటేనే కదా, ఈ సూక్ష్మం సరిగా పనిచేసేది? అందుకని వాటిని ఏం చేశారయ్యా అంటే, ఈ సృష్టి సరాసరి వ్యక్తమైందా అవ్వలేదు కదా! ముందు ఇంద్రియ అధిష్టాన దేవతలు వ్యక్తమైనారు. ఆ దేవతల నుంచి ఇంద్రియాలు వ్యక్తమైనాయి. అంటే అర్థం ఏమిటి? మీరు రోజూ చదువుకుంటూ వుంటారు, ‘చంద్రమా మనసో  జాతః సూర్యో చక్షురజాయతాఅని, అంటే అర్థం ఏమిటి? మనస్సు యొక్క అధిష్టాన దైవం ఎవరు? చంద్రుడు. అంటే చంద్రుడు సృష్టిలో ఏర్పడ్డాక, చంద్రుని ప్రభావం చేత జీవులకు మనస్సు ఏర్పడింది. అర్థమైందా అండీ! చంద్రుని ప్రభావం చేత, జీవులకు మనస్సు ఏర్పడింది. అలాగే సూర్యో చక్షు రజాయతా! నీ కన్ను పనిచేస్తుందయ్యా అంటే, ఈ కన్ను యొక్క అధిష్టాన దైవం ఎవరు? సూర్యుడు. సూర్యుడు వుండబట్టి కన్ను పనిచేస్తుంది. కాబట్టి సూర్యుని ప్రభావం చేత నీకు కన్ను ఏర్పడింది. కళ్ళు లేనటువంటి జంతువులు లేవా? క్రిమి కీటకాదులు ఎన్నో వున్నాయి. కొన్ని లక్షల జీవరాశులు. కోట్ల జీవరాశులకు కన్ను లేదు. అర్థమైనదా అండీ? ఆ సూర్యదేవుని యొక్క అనుగ్రహము, ఆ సూర్యాధిష్టాన దైవం, ఆ దైవం యొక్క అనుగ్రహం చేత నీకు కన్ను పనిచేస్తుంది. ఇట్లా నీ యొక్క ప్రతి ఇంద్రియానికీ కూడా ఒక అధిష్టాన దేవత వున్నారన్నమాట. ఆయా అధిష్టాన దేవతల ప్రభావం చేత నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అనేది మీకు పంచీకరణలో చెబుతారన్నమాట. ఆయా పంచీకరణలో చూసినప్పుడు, ఏమిటయ్యా మరి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదా శివుడు. ఈ ఐదుగురూ కూడా పంచబ్రహ్మలు అని పిలువబడుతారు. ఈ ఐదుగురు పంచ బ్రహ్మలు. వీళ్ళే ఈ సృష్టి మొత్తాన్ని నడిపేది. ఎవరయ్యా? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులు. రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు ఒక్కరు కాదా? అంటే ఏమిటి? పూర్వం భక్తి భావంలో చూసుకొన్నప్పుడు నీకు ఈ జ్ఞానంతో పనిలేదు కదా! అంతా ఒక్కటే. నీకు బ్రహ్మ, విష్ణువు, శివులు వుంటే చాలు అప్పుడు. (అంతేకదా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు). అంటున్నావు. కానీ, వివరణ చెప్పమంటే, తెలీదు. బ్రహ్మ ఎలా పనిచేస్తాడు? ఏ స్థితిలో వుండి పనిచేస్తాడు? ఏ శక్తితో పనిచేస్తాడు? ఎలా ఈ సృష్టిని నియమించగలుగుతున్నాడు? ఎలా సృజించ గలుగుతున్నాడు? తెలుసా నీకు? తెలియదు. అలాగే విష్ణువు ఎలా పోషించగలుగుతున్నాడు? అలాగే రుద్రుడు ఎలా లయించగలుగుతున్నాడు? లయకారకుడు రుద్రుడు కదా! లయించడం అంటే అర్థం ఏమిటి? మనందరి దృష్టిలో? లేకుండా చేయడం. నాశనం చేయడం. అని కదా మనందరి అర్థం. కానీ లయించడం అంటే నాశనం చేయడం అని అర్థం కాదు. దీనికి ముందు వున్న స్థితి, సృష్టికి  ముందు వున్న స్థితికి సృష్టిని పట్టుకు వెళ్ళేవాడు. మరలా సమయం వచ్చినప్పుడు సృష్టి వ్యక్తీకరించబడుతుంది. అర్థమైందా అండీ!
            కాఫీలో పంచదార కలిపారండీ! పంచదార కాఫీలో లయం అయ్యందా? లేకపోతే లేకుండా పోయిందా? లయం అయిపోయింది. ఎందుకని? కాఫీకి ఆ లక్షణం వచ్చిందిగా. వచ్చిందా రాలేదా? నీళ్ళల్లో ఉప్పు కరిగిందండి. లయం అయ్యిందా అవ్వలేదా? (లయం అయిపోయింది కదా!) లయమయిపోయాక నీళ్ళకు ఇప్పుడు ఆ లక్షణం వచ్చిందా రాలేదా? (ఉప్పగా వుందిగా ఉప్పు లక్షణం) అలాగే, ఈ సృష్టి లేకముందు స్థితి నుంచి ఈ సృష్టి వచ్చింది. అంతే కదా! ముందు ఈ సృష్టి లేదు కదా! అందులోంచి ఈ సృష్టి వచ్చింది. ఆ రావడానికి బ్రహ్మ కారణం. అలా తయారు చేయడానికి బ్రహ్మ కారణం. వచ్చిన సృష్టిని సరిగ్గా నడపడానికి కారణం విష్ణువు. ఈ నడిపేటటువంటి సృష్టి మరలా సృష్టి ముందు వున్నటువంటి స్థితికి పోవడానికి రుద్రుడు. అయిపోయిందిగా మరి. మరి మహేశ్వర, సదాశివులతో నీకేం పని? అంటే, ఈ రెండు స్థితులు కూడా ఇంకా పై మెట్టులో వున్నాయి. అంటే ఎక్కడిదాకా మాట్లాడుకుంటున్నావు? స్థూలము, సూక్ష్మము, కారణము వరకే మాట్లాడుకుంటే, బ్రహ్మ విష్ణు రుద్రులే. కారణం పైన ఏమీ లేదా? మహాకారణం వున్నది కదా! మహాకారణం పైన ఏమీ లేదా? దానిపైన ఇంకా కేవలం వుంది కదా! మరి వీటన్నింటికి సంబంధించిన పంచశక్తులు చెప్పుకుంటున్నాం కదా! పంచశక్తులు అంటే ఏమిటి? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆది శక్తి, పరాశక్తి. మరి ఐదు శక్తులు వున్నాయి కదా! పంచబ్రహ్మలు, పంచశక్తులు. అర్థమైందా అండీ?
            బ్రహ్మ దగ్గర ఏముండాలి? సృష్టించాలి అంటే ఇప్పుడు? ఇచ్ఛాశక్తి వుండాలి. సృష్టించాలి అంటే ఇచ్ఛాశక్తి వుండాలి కదా మరీ! విష్ణువు దగ్గర ఏముండాలి? పోషించాలి అంటే? (క్రియాశక్తి) అంతే కదా మరీ! క్రియ లేకపోతే ఆయన ఏమన్నా పోషించ గలడా? ఏమన్నా పనులు చేయగలుగుతాడా? చేయలేడు కదా! కాబట్టి క్రియాశక్తి ప్రభావం చేత కదా విష్ణువు. మరి లయించాలి అంటే సృష్టికి ముందువున్న జ్ఞానం వుంటేనే కానీ, ముందున్న స్థితికి తీసుకెళ్ళలేరు కదా సృష్టిని. కాబట్టి రుద్రుడికి ఏముండాలి? జ్ఞానశక్తి వుండాలి కదా! మరి మహేశ్వరుడికి ఏముండాలయ్యా? ఆ సృష్టికి ముందువున్న స్థితిలో మహేశ్వరుడు వున్నాడయ్యా! అదయ్యా ఆదిశక్తి. అందుకే కదా ఏమంటున్నావు? ఆదిశక్తి నుంచే అంతా ఉద్భవించిందండి అని అంటున్నావుగా. అంటే సృష్టికి ముందు వున్న స్థితి ఏమిటి? ఆది శక్తి. ఈ సృష్టి ఏమీ ఏర్పడలేదండి. ముందున్న స్థితిలో ఏముంది? ఆది శక్తి వుంది. ఆ ఆదిశక్తే ఇన్నిశక్తులు అయ్యిందయ్యా! అంటున్నాము కదా ! మాటకు అంటున్నావు. కానీ జ్ఞానంలోకి వచ్చేటప్పటికీ మాత్రం అట్లా నిలబడటం లేదు. అట్లా చూడటం లేదు. అట్లా చూస్తే ఏమైంది అప్పుడు? ఈ సమిష్టి అంతా ఎలా పని చేస్తుందో అవగాహన అయ్యింది. సృష్టి రహస్యం అంతా బోధపడింది. ఇప్పుడు ఏమైంది? ఆదిశక్తికి అధిష్టానం మహేశ్వరుడు. దానికంటే ముందున్న స్థితి వుందయ్యా! సృష్టి ఏర్పడే ముందున్న స్థితి కంటే కూడా, అసలు ఏమీ కదలకుండా వున్న స్థితి ఒకటుందయ్యా! దానికి సదాశివుడయ్యా. ఆ సదాశివుడి దగ్గర ఏముందయ్యా? పరాశక్తి వుందయ్యా బాబు. శక్తికి పరమైనటువంటిది. అంటే శక్తే ఏర్పడలేదయ్యా అసలు. ఆది శక్తి అనే శక్తి ఏర్పడ్డాక సృష్టి ఏర్పడింది. అసలు శక్తి కూడా ఏర్పడక ముందు ఏముందయ్యా? అది పరాశక్తి అయ్యా. శక్తికి పరమైనటువంటిది. అక్కడ ఎవరయ్యా అధిష్టానం? సదాశివుడయ్యా! అని ఏర్పాటు చేశారు. కాబట్టి నీవు ఏ లక్ష్యంతో జీవించాలట ఇప్పుడు? ఈ కనీసం సదాశివత్వం, పరాశక్తి స్థితి సదాశివత్వం వరకూ నీకు అనుభవానికి, అవగాహనకి వస్తే, నీకు బ్రహ్మానుభవము అంటే ఏమిటో తెలుస్తుంది. బ్రహ్మ విద్య అంటే ఏమిటో తెలుస్తుంది. బ్రహ్మజ్ఞానము అంటే ఏమిటో తెలుస్తుంది. ఇది నాయనా బ్రహ్మానుభవము అంటే. పంచబ్రహ్మలు, పంచశక్తులతో ఈ అనంతసృష్టి ఎట్లా జరుగుతోంది, ఎట్లా వస్తోంది, ఎలా పోతోంది? చివరకు పోయిన తరువాత మళ్ళా ఏమౌతుంది? ఇదంతా నీకు అనుభవానికి వస్తే, ఈ సమిష్ట్యానుభవం కలిపి బ్రహ్మానుభవం అంటారు. కాబట్టి, నువ్వు అనుకునే రూపాలు అవికావు. నువ్వు అనుకునే బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, లేకపోతే నాలుగు చేతులు ధరించిన విష్ణువు, లేకపోతే ఎప్పుడూ మెడలో పాములు వేసుకునే శివుడు ఈ ఆకారాలన్నీ నీవు భక్తి మార్గంలో ఏర్పాటు చేసుకున్నవే గానీ, యథార్థంగా అలా లేవు అవి. అవన్నీ స్థితులే కానీ అక్కడ ఆకారం లేదు. అవన్నీ  కేవలం స్థితులు. బ్రహ్మ అనే స్థితి, విష్ణువు అనే స్థితి, రుద్రుడు అనే స్థితి. ఇవన్నీ నీలోపల కూడా వున్నాయి నాయనా! మీరు లలితా సహస్రనామంలో చదివేటప్పుడు చెబతున్నారు కదా! బ్రహ్మగ్రంధి విభేదిని - ఎక్కడుందండి? మణిపూరాం తరుదితా విష్ణుగ్రంధి విభేదిని, అవునా అండీ! దాని కంటే క్రింద ఏముందండీ? మణి పూరక చక్రం ముందు బ్రహ్మ గ్రంధి విభేదిని, మూలాధారం స్వాధిష్ఠానంలో వున్నాడు బ్రహ్మగ్రంధి. అర్థమైందా అండీ? మణిపూరాం తరుదితా విష్ణుగ్రంథి విభేదిని. అవునా అండీ! మరి ఎక్కడున్నారు వీళ్లు అంతా? నీలోపలే వున్నరయ్యా! వాళ్ళందరూ నీలో వుంటేనే నీ శరీరం పని చేస్తోందయ్యా. నీవల్ల నువ్వు ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు, నీ వల్ల నువ్వు ఏమీ చేయడం లేదు నాయనా! ఈ అధిష్టాన దేవతలు అందరూ నీలో పనిచేస్తేనే, నీ శరీరం అనే యంత్రం పనిచేస్తోంది. నీ ప్రాణ మనో బుద్ధులకు అధిష్టాన దైవంగా వుండి వారందరూ నీ సూక్ష్మాన్ని నడిపితే నీ స్థూలం నడుస్తోంది. నువ్వు కర్తను అంటావేమిటి? నేను చేశాను అంటావేమిటి? నేను పెట్టానండీ 150 కాయల ఆవకాయి. ఏంటి నువ్వు పెట్టింది ఆవకాయి? ఎలా పెడతావు? ఆ కర్త, క్రియ, కర్మ ఎవరు? నీవు కాదు కదా! నీ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు. అయితే వాళ్ళు. కాదంటావా? బాహ్యంలోకి వస్తావా? నీ ఇంద్రియాలు. నువ్వు ఎలా అయ్యావు? నువ్వు కాదు కదా! నీవు ఎవరివి? ఈ పంచబ్రహ్మలకి, ఈ పంచశక్తులకి కూడా అధిష్టానం అయినటువంటి బ్రహ్మస్వరూపుడవు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ’ - ఒకేఒక్కడుగా వున్నటువంటి స్థితిలో వున్నటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైతే వుందో అది నీవైవున్నావయ్యా. ఆ పరమాత్మ నీవయ్యా బాబు. ఆ పరమాత్మ నుంచి, ఈ పంచ బ్రహ్మలు, ఆ పంచశక్తులు ఉత్పన్నమైనాయి. ఈ సృష్టి అంతా నడుస్తూ వుంది. ఆ పరమాత్మవు నీవు అవుతావు గానీ, ఈ ఐదు బ్రహ్మలు నీవు కాదు, ఆ ఐదుశక్తులు నీవు కాదు. మరి ఎందుకని? అది నువ్వైతే సూక్ష్మం నువ్వు అవుతావు. సూక్ష్మం నువ్వు కాదు కదా మరి! నేను ఎవరిని? సాక్షిని కదా! కాబట్టి ఇలా విధాన నిర్ణయం తెలుసుకోవాలి. ఇలా తెలియనంతవరకూ కూడా (ఈశ్వరుడికీను, శివుడికి ఇదీ తేడా) ఆఁ.. అంటే అర్థం ఏమిటంటే, సాధరణ నామంలో ఈశ్వరుడు అని వాడేస్తాము. ఎందుకని? జగదీశ్వరుడు, జగత్తంతా వ్యాపించి వున్నవాడు ఈశ్వరుడయ్యా. అని సాధారణ నామంలో వాడేస్తారు. శివుడు అన్నారు, శివుడు అంటే శుభము కలిగించేది, అదీ సాధారణంగా వాడేదే, ఆ ఈశ్వరుడు అన్నవాడికీ స్పష్టత లేదు, ఈ శివుడు అన్నవాడికీ స్పష్టత లేదు. ఎవరికైతే ఈ పంచీకరణ క్రమం తెలుస్తుందో, వారికి తెలుస్తుంది. ఓహో! ఎక్కడ మాట్లాడుతున్నాడు? దేనికి సంబంధించి మాట్లాడుతున్నాడు. ఏ స్థితి గురించి మాట్లాడుతున్నాడు? ఈ జ్ఞానం వున్నవాడికి తెలుస్తుందన్నమాట.
            వ్యష్టిగా ఆత్మజ్ఞానం వుండాలి, సమిష్టిగా బ్రహ్మజ్ఞానం వుండాలి. ఈ రెండు అనుభవ జ్ఞానాలు వున్నవాడికి, అతను ఏ స్థితి గురించి మాట్లాడుతున్నాడని అంచనా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి బ్రహ్మవిద్యయే అన్నిటికి మూలమైనటువంటి విద్య. చావు లేని విద్య చదువంగ వలయు. విద్యలన్నీ చదివామా ఇప్పటికి? అందరూ బోల్లెడు certificates సంపాదించారా? ఏం చదువుకోలేదు? చావు లేని విద్యను చదువుకోలేదు. అర్థమైందా అండీ?
           
                        చదువులన్నియు చదివి చదివి చావంగ నేటికి చావులేని విద్య చదువంగ వలయు అని వేమనార్యుడు చెప్పాడు. అర్థమైందా అండీ! కాబట్టి ఎన్నో డిగ్రీలు, మన జీవితంలో ఏం చేస్తామంటే, రెండు డిగ్రీలు సంపాదిస్తాము. ఇంకా ఖాళీగా వున్నాం కదా అని ఇంకో రెండు డిగ్రీలు సంపాదిస్తాము. ఇంకా ఖాళీగా వున్నాం కదా అని ఇంకో రెండు కట్టమంటాము. ఇంకో రెండు కట్టావు. ఏమైంది? వరుసగా రాసుకోవడానికి ఆరు డిగ్రీలు వున్నాయి. కానీ తరువాత ఏం చేస్తావు? మరణకాలంలో ఇవేమీ పనికిరావే. కాబట్టి మరణకాలంలో నీకేదైనా పనికి వచ్చేది వుందయ్యా అని అంటే, సాధన చతుష్టయ సంపత్తి తప్ప, మరేదీ పనికి రానిదే.
            ఈ సాధన చతుష్టయ సంపత్తిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పొందవలసిందే. సాధించవలసిందే. అదేమిటయ్యా? మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకము. మొదటిది నిత్యానిత్య వస్తు వివేకము. ఏమిటయ్యా? అది, నిత్యానిత్యవస్తువివేకము అంటే, ఏది నిత్యము, ఏది అనిత్యము? నిత్యము అంటే ఎల్లకాలము వుండేది, ఏ మార్పు చెందనిది, శాశ్వతమైనటువంటింది. అది నిత్యము. అర్థమైందా అండీ! దానికి ఆద్యంతములు లేవు. రాకడా పోకడా లేవు. అది నిత్యమైనటువంటిది. అనిత్యమైనటువంటిది దానికి వ్యతిరేకం. రాకడాపోకడా వున్నది, మార్పుచెందేది. శాశ్వతం కానిది. స్థిరం కానిది. చలించేది. దీనికి ఎన్ని లక్షణాలైనా మనకు తెలిసినవన్నీ పెట్టుకోవచ్చు దానికి. ఇప్పుడు మనకు బాగా తెలిసినది ఏది? అనిత్యం. అనిత్యంలోనుంచి ఏం తీసేయాలట ఇప్పుడు? అనిత్యంలో నీకు స్ఫురిస్తున్నవాటన్నిటినీ ఉల్టా, వ్యతిరేకంగా జీవించాలి. వ్యతిరేకంగా భావనను మార్చి నిరసిస్తే తప్ప, అది పోదు. అంటే అర్థం ఏమిటి? నీకు స్ఫురిస్తున్నవన్నీ కూడా అనిత్యమని తెలుసుకుని, వాటిని భావనలో నిరసించాలి. నిరసిస్తేనే, అది సాధ్యమౌతుంది. (ఆ భావన కూడా బలపడిపోతున్నది కదా!) ఎందుకని? అట్లాకాదు, నిరసించాలనుకున్న కొద్దీ అంటే అక్కడ ఏం చెయ్యాలట? అదే నీకు చెప్పింది, నీలో నువ్వు తన్నుకుంటూ వుంటే ఊబిలో క్రిందకు దిగిపోతావు, నువ్వేంచేయాలట అసలిప్పుడు ముందు? అలా నిరసించాలి అనుకుంటే, నిరసించాలి, నిరసించాలి అంటే నిరసించలేవు. దానిని ఏ భావన, ఏ వాక్యాన్ని దాని ఎదురుగుండా పెడితే, అది నిరసించబడుతుందో, అది తెలుసుకుని దానిని పెట్టాలి. అంటే అర్థం ఏమిటి? ఉదాహరణ చెబుతాను చూడు.
            ఒకడికి మౌనంగా వుండడమే వాడి సంస్కారబలంలో వుందండి. వాడికి ఆ సంస్కారబలం వదిలిపోవాలి, జ్ఞానం రావాలి అంటే ఏం చెయ్యాలి? బాగా మాట్లాడించాలి. నిరంతరాయంగా మాట్లాడడం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే గాని, ఆ మౌనంలో వున్నటువంటి తమోగుణం పోదు. (మౌనంలో కూడా తమోగుణం వుందా?) ఆఁ... . వుంది కదా! ప్రతిదాంట్లో వుంటుంది. అర్థమైందా అండీ! ఒకడికి విపరీతంగా మాట్లాడే అలవాటు, వీడిని ఏం చెయ్యాలి ఇప్పుడు? వీడినేంచెయ్యాలి? వీడికి మౌనాన్ని పెట్టాలి. (రజోగుణమా అది?) అంతేకదండీ మరి! మాట్లాడాలి అంటే రజోగుణం కావాలి. (వీపరీతంగా మాట్లాడుతాడు) అంతే కదా! దానికేంచెయ్యాలయ్యా సాధన? మౌన సాధన చెయ్యాలి. నీకు నువ్వే చూసుకోవాలన్నమాట! నీ సంస్కార బలం ఎలా వుంది? నీ ఆలోచన ఎలా పనిచేస్తుంది? దానికి ఏం చెయ్యాలట ఇప్పుడు వెంటనే? వ్యతిరేకం చెయ్యాలి. దానికి వ్యతిరేకంగా నువ్వు జీవించాలి. వ్యతిరేకంగా జీవిస్తేనే కానీ అది balance అవ్వదన్నమాట. అదిపోదు అది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ అనంత సృష్టిమీదా ఒక రహస్యం వున్నదండి. ఏదైనా సరే, నీవు ఒక పక్కకి వెళ్ళిపోతూ వుంటావు, సృష్టి ఏం చేస్తుందంటే, దానిని balance చేయడానికి వ్యతిరేక దిశలో ఏర్పాటు చేస్తూ వుంటుంది ఎప్పుడూకూడా. ఎందుకని? సృష్టి అంతా ఎప్పుడూ సమత్వంలోనే వుంటుంది. అసమతౌల్యంగా ఎప్పుడూ వుండదండి. అది జీవుడైనా, భావమైనా ఏదైనా సరే! కాబట్టి, ఈ నడక అంతాకూడా సమత్వంగా వుండేటట్టు చేస్తుంది. అదే పరిణామ పాఠం అంటే, వేరే ఏమీ లేదు. అర్థమైందా అండీ! కాబట్టి నీవు సాధన ద్వారా తెలుసుకుని, ఆ దిశగా ప్రయత్నం చేస్తే, తొందరగా సమత్వం వచ్చేస్తుంది. సర్వసమత్వం రానిదే ఆత్మసాక్షాత్కారం రావడం అసాధ్యం’. ఇది గుర్తుపెట్టుకోండి.
            నీకు అడ్డం ఏమిటయ్యా? భేదభావమే అడ్డం నాయనా! ఆత్మ నీలో వున్నటువంటిది, నీది నీకు తెలియకపోవడానికి, నిన్ను నువ్వు తెలుసుకోలేక పోవడానికి, నీకు నువ్వు కనపడక పోవడానికి, కారణం ఏమిటయ్యా అని అంటే, భేదభావములే కారణం. అది తీసేస్తే, సర్వసమత్వాన్ని గనుక నీవు నిజజీవితంలో సాధిస్తే, నీవు జీవించేటప్పుడే సాధించాలండి, ఇదేదో నేను పుస్తకం చదివాను, రాత్రి సినిమా చూశాను, టీవిలో చూశాను, అంతమంది కట్టిన ఆశ్రమాల దగ్గరకు వెళ్ళాను, నువ్వు ఎన్నైనా చెయ్యి, నీకు నిజజీవితంలో సర్వసమత్వభావన రావాలి.
            అందుకే స్పష్టంగా రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి ఒకాయన ఉపదేశం అడుగుతాడన్నమాట, నాకు ఉపదేశం చేయండి అని, ఈ వీధి చివర ఒకాయన వుంటాడు, ఆయన దగ్గరకు వెళ్ళు పో, అంటాడు. అక్కడ ఒకాయన కుప్పతోటి ప్రక్కన భోజనం చేస్తూ వుంటాడు. చెత్తకుండీ వుంటుంది కదండీ! దాని పక్కన విస్తరాకులో భోజనం చేస్తూ వుంటాడు. ఆయనతోపాటు ఒక కుక్క విస్తరాకులో భోజనం చేస్తూ వుంటుందన్నమాట. ఆయన దగ్గరకు వెళ్తాడు ఈయన. ఈయనేమిటి? మంచి సన్యాసి, జటలు వగైరా అన్నీ రెడీ చేసుకుని వచ్చాను కదా నేను. Tip top గా తయారయ్యి వచ్చాడు ఉపదేశం తీసుకుందామని. ఆయన దగ్గరకి వెళ్ళాడు. వెళ్తే ఆయన పైకీ, క్రిందకీ చూశాడు, ఆయన పనిలో ఆయన వున్నాడు. ఈయన స్వామీ, మరి ఆయన చెప్పినాయన ఎవరు? పరమహంస. ఈయన ఇక్కడ చూస్తే, ఏముంది? ఇక్కడ పరిస్థితి ఎలా వుంది? ఆయన ఉపదేశం అంటే ఆయన ఏమనుకుని వచ్చాడు? ఏదో ఆశ్రమము, విధానము, పీఠము, మహానుభావులు వుంటారు, వెళ్ళి కాళ్ళమీద పడితే, ఏమన్నా చెబుతారు, ఏదో ఉపదేశం చెబుతారు అనుకొని, మంత్రం చెబుతాడని అనుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఈయన ఎలా వున్నాడు? చెత్తకుండీ పక్కన విస్తరాకులో భోజనం చేస్తున్నాడు, ఈయనతోపాటు కుక్క తింటోంది, ఈయన అలా వున్నాడు. ఈయన దగ్గరికి పంపించాడు ఏమిటి? ఆయన అసలు? ఆయనకు బుద్ధి వుందా? ఈయన ఆలోచన చూడండి! ఆ పరమహంసగారికి ఏమన్నా బుద్ధి వుందా? ఈయన దగ్గరకు నన్ను పంపడమేమిటి? ఇలా తోస్తుందండీ! ఒక్క క్షణంలో తెప్పరిల్లాడు. పరమహంస అంతటి మహానుభావుడు ఈయన దగ్గరకి పంపించాడు అంటే, ఇందులో ఏదో రహస్యం వుంది, మర్మం వుంది. లేకపోతే ఎందుకు పంపిస్తాడు నన్ను? సరే చూద్దాం ఇప్పుడు ఏం పోయింది అనుకున్నాడు ఆయన. అడిగాడు మహానుభావా, పరమహంసగారు నన్ను పంపించారండీ, మీ దగ్గర ఉపదేశం తీసుకోమని అని. ఆయన పైకీ కిందకీ చూసి మళ్ళా తనపనిలో తాను వున్నాడు. ఎందుకని? ఉపదేశం చెప్పేంత సమయం రాలేదు. ఎందుకని? అంతకు ముందు ఏం తోచింది ఈయనకి? పరమహంస గారిని బుద్ధి హీనుడు అనుకున్నాడు కదా! ఆ భావన ఆయనకు తెలియదా? సరే! మళ్ళా ఆయన పనిలో ఆయన వున్నాడు. మళ్ళా కాసేపు ఆగాడు, ఆగిన తరువాత మళ్ళా అడిగాడు. పైకీ కిందకీ చూచి, ఈయన చేతిలో ఏముందట? కమండలం వుంది కదా! అన్నీ పట్టుకుని సిద్ధమై వచ్చాడు కదా! ఉపదేశానికి. అందులో ఏముంది అన్నారట? పవిత్రగంగానదీ తీర్థం వుందండీ ఇందులో అన్నాడట. ఓహో! ఇదేమిటి అన్నాడట, అది చీచీచీ మురికి కాలువలో వున్నటువంటి నీరు అండీ! అన్నాడట. ఆ గంగానదీ తీర్థము, ఈ మురికి కాలువలో నీరు రెండూ ఒకటిగా నీకు ఎప్పుడు తోచినచో, అప్పుడు రా పో! అన్నారట. అర్థమైందా? ఉపదేశం పొందడానికి అర్హత ఏమిటట ఇప్పుడు? (ఆ నీరు ఈ నీరు ఒకటే) ఆఁ.. సర్వ సమత్వభావమే ఉపదేశానికి అర్హత. అంటే అర్థం ఏమిటయ్యా అని అంటే, ఉపదేశం పొందిన వెంటనే నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగాలి. కనీసం సంవత్సరంలోపు కలగాలి. అది చాలా ఎక్కువ సమయం. ఉపదేశం పొందిన సంవత్సరంలో ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగితీరాలి. అలా కనుక కలుగక పోయినట్లయితే ఆ ఉపదేశం వృధా అయిపోతుంది. నీ జీవితకాలానికి అది ఉపయోగపడదు. మళ్ళా వేరే మార్గం ప్రయత్నం చేయాల్సిందే నువ్వు ఇక. అప్పుడు ప్రయత్నించిన విధానం సరిపోలేదన్నమాట. కాబట్టి అందరూ ఉపదేశాలు తీసుకుంటారు, అది ఎందుకు కలుగలేదయ్యా అంటే, నీకు సర్వ సమర్పణ భావం ఏర్పడలేదు. అది ఏర్పడేటట్టుగా ముందు నిన్ను నువ్వు బాగు చేసుకోలేదు. అర్థమైందా అండీ! విత్తనాలు వేయాలంటే ఏం చెయ్యాలండీ? క్షేత్రాన్ని బాగుచేయాలి కదా! భూమిని దున్ని, బాగా చదును చేసి, నీళ్ళుపెట్టి ready చేయాలి కదండీ! మనం అలా చేయలేదన్నమాట. ప్రాణ మనో బుద్ధులను చక్కగా, వ్యవసాయం చేయడానికి అనువుగా, తీర్చిదిద్దలేదన్నమాట. ఆ విత్తనాలు, జ్ఞానబీజాలు మొలకెత్తడానికి కావలసినటువంటి విధంగా దానిని తయారు చేయలేదు. మొదటినుంచి చేయలేదు కదా! ఇప్పుడేగా మొదలు పెట్టావు. చేయి ఇప్పుడు. అందుకని ఉపదేశం కావాలని ఎవరి దగ్గరకైనా వెళ్ళేముందు అది తీసుకనే అర్హత నీకు వుందో లేదో చూసుకో! ఏముండాలంట అర్హత? గంగానదీ తీర్థము, మురికి కాల్వలోని నీరు రెండూ ఒక్కతీరుగా ఎప్పుడు తోస్తే, అప్పుడు నీకు అర్హత వచ్చేసినట్లే. ఎందుకనిట? సర్వ సమత్వ భావన. అప్పుడు ఈయన ఇక్కడినుంచి తిరిగి వెళ్ళిన తరువాత ఆయన అడిగారట. అయ్యా! వారు ఎవరండీ అని? వారు సదాశివబ్రహ్మేంద్రులు నాయనా! అవధూత వారు. అదేమిటండీ? మరి అలా వున్నారు? అదే నాయనా! అవధూతలు అంటే. వారికి సర్వ జీవుల యెడలా ఒకే ప్రేమ. వారిని వారు ఎట్లా చూసుకుంటారో, ఆ కుక్కలో కూడా వారే వున్నారు. వారు ఇద్దరూ కలిసి చక్కగా భోంచేస్తున్నారు కదా! విస్తర్లో. మరి అదేమిటండీ? అది అంతే నాయనా! వారే కదా ముక్తులంటే! వారికి ఏ భేదభావన లేదు. ఏ జీవి యెడలా లేదు. ఈ అనంత సృష్టి పరమాత్మగానే తోస్తుంది ఆ ముక్తుడికి. అన్యంగా తోచదు. ఎంతటి హీనుడైనా సరే, వారికి పరమాత్మగానే తోస్తాడు. అర్థమైందా అండీ! హత్యలు చేసినవాడైనా సరే, వ్యభిచారి అయినా సరే, ఆత్మహత్యకు పూనుకున్నవాడైనా సరే, ఎంతటి హీనుడు, ఇహలోకంలో ఎంతటి హీనుడు, ఎంతటి నీచుడు అని నీవు అంటున్నావో, వాళ్ళందరూ పరమాత్మ స్వరూపులుగా తోస్తారు ముక్తుడికి. ఈ అవధూతలు కానీ, ఈ ముక్తులు అందరూ ఎవరి కోసం వున్నారని ప్రశ్న అడిగాడు, వీళ్ళంతా ఎవరు? వాళ్ళ లాంటి వాళ్ళకోసమే వున్నరయ్యా! నీలాంటి వాళ్ళ కోసం లేరు పో! అన్నారాయన. అర్థమైందా అండీ!
            ఎవరైతే హీనుడు, దీనుడు వున్నాడో, ఆ హీనుడు హీనుని యొక్క హైన్యాన్ని, దీనుడి యొక్క దీనత్వాన్ని పోగొట్టడమే ఆ ముక్తుల యొక్క పని. వేరే ఏమీ లేదండి. వాళ్ళు ఎవరి పక్షం వహిస్తారయ్యా? వాళ్ళు వాళ్ళ పక్షమే వహిస్తారయ్యా! ఎందుకని? వాళ్ళు సృష్టిచేత బాధించబడినటువంటి వాళ్ళు. ప్రారబ్ధ కర్మచేత బాధించబడుతున్నటువంటి వాళ్ళు. ఆ గుణ ప్రభావం చేత, ప్రారబ్ధ కర్మ ప్రభావం చేత, అలా హీనుడు, దీనుడు అయిపోయాడు. ఆ హీనుడు, దీనుడుని ఉద్ధరించడమే వాళ్ళ పని. ఎందుకని? మిగిలిన వాళ్ళ వల్ల ఎవరి వల్ల అవ్వదయ్యా! అది. మామూలు సామన్య మానవుల వల్ల అయ్యే పని కాదు. సమాన్యజ్ఞానం వున్నటువంటి వాడివల్ల అయ్యేపని కాదు. ఎవడైతే సహజంగా ముక్తస్థితిలో వున్నాడో, వాడు ఎవరి పక్షం వహిస్తాడయ్యా అంటే, ఇదిగో ఇలాంటి హీనుడు, దీనుడు అయినటువంటి వాడి పక్షం వహిస్తాడయ్యా! భగవద్గీతలో వున్నటువంటి అర్జున విషాదయోగం చెబుతున్నది ఇదే. ఎందుకు శ్రీ కృష్ణుడు అర్జునిని పక్షం వహించాడయ్యా? అతను దీనుడై శరణుజొచ్చాడు. ఎంతో సవ్యసాచి అయ్యుండి, ఎంతో శస్త్రాస్త్ర బలం వుండి, దైవీ సంపత్తి వుండి, అన్ని రకాల లక్షణాలు వుండీ కూడా, ప్రారబ్ద కర్మ వశం చేత దీనుడు అయిపోయాడు. రాజ్యం కోల్పోయాడు, అడవులపాలు అయ్యాడు, అజ్ఞాత వాసం చేశాడు, సర్వం హరించిపోయింది. అంత దీనత్వం వచ్చిన తరువాత కానీ, నీవే సర్వస్వం అని అనలేదు. అందుకని ఆ అర్జున విషాదయోగ ప్రభావం చేత, తరువాత భగవద్గీత బోధించవలసిన అవసరం వచ్చింది. లేకపోతే అర్జున విషాదయోగంతో పనిలేదు. అర్థమైందా అండీ! కాబట్టి నీవు కూడా, నీ గొప్పలన్నీ విడిచిపెట్టి, నీ ప్రత్యేకతలు అన్నీ విడిచిపెట్టి, సామాన్యంగా క్రిందికి దిగివచ్చి, సర్వసమత్వభావంతో నీవు ఎప్పుడైతే వుంటావో, వెంటనే నీకు ఉపదేశ అర్హత కలుగుతుంది.
            ఉపదేశాన్ని కనుక నీవు ఉపదేశపద్ధతిలో జీవిస్తే, సంవత్సర కాలంలో లోపల  కచ్చితంగా ఆత్మానుభవం కలిగి ముక్తుడవు అవుతావు. సద్గురువు సచ్చిష్యుడు గనుక, అర్హత కలిగినటువంటి సద్గురువు, అర్హత కలిగినటువంటి సచ్చిష్యుడు లభిస్తే, ఆరునెలల కాలంలో, ముక్తి సిద్ధము. ఆరు నెలలు చాలా ఎక్కువ అంటాడు పరమహంస. అర్థమైందా అండీ! ఎందుకనిట? నీకు అర్హత లేదు అంతే! సచ్ఛిష్యుడు అనే అర్హత పొందు నువ్వు మొట్టమొదట. దానికి ప్రయత్నం చేయ్‌. నువ్వు సచ్ఛిష్యపదవికి ప్రయత్నం చేస్తే, అన్నీ సాధ్యమే. ఎందుకని? సద్గురువుతో సమానంగా, అనుభవాన్ని పొందగలిగే అర్హత ఆ ఒక్కడికే వుంది. మిగిలిన వాళ్ళు అందరూ అనుసరించే వాళ్ళు. అనుసరించే వాళ్ళకి అవకాశం వుండదు. ఈ అనుసరించే వాళ్ళల్లో వీళ్ళందరినీ దాటుకుంటూ ఒకడు వెళతాడు. ఎవడు వాడు? వాడు సచ్ఛిష్యుడు. వాడు మొట్టమొదటివాడన్నమాట. వాడు రెప్పపాటు కూడా గురువాక్యంలోనుంచి అవతలికి వుండడు. వాడి అర్హత అది. వాడి సామర్థ్యం అది. నిర్ణయం చేసేస్తాడు అంతే! గురువాక్యం ఇంతవరకే వుంది కాబట్టి, ఇంతవరకే జీవిస్తా. ఏదైనా కానీ. అనంత సృష్టిని త్యజిస్తాడు. త్యాగేనైవ అమృతత్వ మాసీత్‌ అని అందరూ చెప్పుకుంటున్నారు. దానికంటే ముందు వున్నాయి. న ధన - నిర్ధనేన, న ప్రజయా, నర్ధనే అని ముందు వాక్యం వుంటుంది. అంటే ప్రజల వల్ల కానీ, ధనం చేత గానీ, మరేదాని చేతగానీ నీకు అమృతత్వం కలుగదు. కేవలము త్యాగము చేతనే కలుగుతుంది. ఏమిటి త్యజించాలయ్యా? నీ గుణాల్ని త్యజించు, నీ అవస్థలను త్యజించు, నీ పంచకోశాలను త్యజించు, నీ ఇహాన్ని త్యజించు, నీ జ్ఞానాన్ని త్యజించు, నీ సర్వాన్నీ త్యజించవయ్యా! నీవు అనుకుని ఇప్పటివరకూ ఎన్నైతే పెట్టుకున్నావో అవన్నీ త్యజించవయ్యా! (త్యజించు త్యజించు అంటున్నారు కానీ... ) భావనలో. (భావనే అంత తేలికగా బలపడడంలేదు కదా!) అభ్యాసబలం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, (ఎక్కడికక్కడ అదే వచ్చేస్తుంది కదా!) ఎప్పటికప్పుడు అభ్యాసం. అందుకే భగవద్గీత అంతా దేని చుట్టూ తిప్పుతుంది? ‘అభ్యాసయోగయుక్తేనస్పష్టంగా చెబుతోంది. నీకు రెండు వుండాలి. అభ్యాసం అంటే ఏమిటి? విద్య నేర్చుకోవడం అభ్యాసం. కొత్తగా జీవించడం. నూతన జీవితం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం గురువును ఆశ్రయించాము అంటే మనం నూతన జీవితాన్ని తీసుకున్నాం. అర్థమైందా అండీ! పూర్వకాలం నుంచి ఉపదేశం తీసుకునేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళో తెలుసా? ఏమండీ మీకు ఎంత వయసండీ అని చెబితే, ఉపదేశం తీసుకున్న దగ్గరనుంచి ఎంతకాలమైతే అంత వయసే చెప్పేవారు. అర్థమైందా అండీ? ఒక పదేళ్ళు అయ్యింది అనుకోండి, నా వయస్సు పదేళ్ళే అని చెప్పేవాళ్ళు. వాళ్ళకు 60 ఏళ్ళు వుండచ్చు. ఏవండీ మీరు అరవైయేళ్ళవాళ్ళా? అది శరీరం వయస్సు. నూతన జీవితం ప్రారంభించి ఎంతకాలం అయ్యింది? నా వయస్సు పదేళ్ళేనండి. కాబట్టి గురువును ఎప్పటినుంచైతే నీవు ఆశ్రయించావో, నీ పూర్వ జీవితాన్ని నీవు మరచిపో! అర్థమైందా అండీ! మరచిపోవడం నీ చేతులోనే వుంది. నీ చేతిలో లేకుండా పోలేదు అది. నీ పూర్వ జీవితాన్ని నీవు మరచిపో. నూతన జీవితాన్ని జీవించు గురువు చెప్పినట్టుగా. నూతన జీవితం ప్రాప్తిస్తుంది. ఆత్మానుసార జీవితం ప్రాప్తిస్తుంది. ఆత్మానుభవం సాధ్యమౌతుంది. అందుకని గురువు ఎప్పుడూ ఏం చెబుతూ వుంటాడు? నీ పూర్వజీవితంలో వున్నటువంటి సంస్కారాలన్నీ అంచనా వేసే, అవన్నీ చెబుతూ వుంటాడు. అవన్నీ మరచిపో, అది వదిలేసుకో, ఇది వదిలేసుకో. అట్లా మారు, ఇట్లా మారు అని చెబుతూ వుంటాడు. ఇలా అన్నీ కూడా. అది నీకు నువ్వే విచారణ చేసినప్పుడు ఏమౌతుంది? అందుకని రోజు నిద్రపోయేటప్పుడు విచారణ చేయమంటున్నాము. నీకు నువ్వే విచారణ చెయ్యాలి. ఏది నిత్యము, ఏది అనిత్యము? ఇది నాయనా నువ్వు రోజు నిద్రపోయే ముందు చేయవలసిన పని. అది అప్పుడు నిద్ర అంతా సాధన అవుతుంది. ఆ నిద్రా సమయము అంతా సాధనా సమయం ఎవరికైతే అవుతుందో, ఎవడైతే ఈ నిత్యానిత్య వస్తువివేకాన్ని విచారణ చేస్తాడో, వాడయ్యా సాధకుడు. ఏమిటి వాడు సాధించేది? ముక్తిని మాత్రమే సాధిస్తాడు. ఇంక మిగిలినవి ఏవీ సాధించే అవకాశమే లేదు. ఎందుకనిట? అది ఒక్కటే సాధ్యం, అది ఒక్కటే సాధించవలసినది కూడా. మిగిలినవి ఏవీ సాధించనక్కర్లేదు. అవన్నీ నీ సంస్కారబలం మేరకు ఏవి రావాలో అవి వస్తూ వుంటాయి, ఏవి పోవాలో అవి పోతూ వుంటాయి. అర్థమైందా అండీ! నువ్వు ఏదో ప్రయత్నం చేసి బ్రహ్మాండం బ్రద్ధలు కొట్టానంటే వట్టి అబద్ధం. One town లో నా పాత ఇల్లు వుంది, ఓహ్! నేను 30 యేళ్ళు వున్నానండీ అంటావా? దాన్ని వదిలేసి ఇక్కడ మూడు అంతస్థుల మేడ కట్టానండి. ఓహో! అలాగా. అది పోవడమూ ప్రారబ్దములో భాగమే, ఇది రావడమూ ప్రారబ్దములో భాగమే. అది సంస్కార బలములో భాగమే, ఇది కూడా సంస్కార బలములో భాగమే. అది గుణబలములో భాగమే. ఇది గుణబలములో భాగమే. నేను అనేది దాంట్లోను లేదు, దీంట్లోను లేదు. కట్టింది నీవు కాదు, పడగొట్టింది నీవు కాదు. అర్థమైందా అండీ! (అదీ శాశ్వతం కాదు, ఇదీ శాశ్వతం కాదు). ఎందుకని? నిత్యానిత్య వస్తు వివేకంతో చూడు ఒక్కసారి. ఏది వదిలేశావు? ఏదీ వదిలెయ్యలేదు. అన్నీ జ్ఞాపకంలో భద్రంగా దాచిపెట్టుకున్నావు. ఇంక వదిలేసింది ఏమిటి? (వదిలేద్దామన్నా వదలడం లేదు కదా!) అదే చెబుతున్నది. వదిలేటటువంటి వాక్యాలు నీ దగ్గర వుండాలి. ఆయా స్ఫురణ కలిగినప్పుడు దానికి వ్యతిరేకవాక్యం నీకు స్ఫురించాలి. అందుకని వేదాంత వాక్యాలు ఏకరువు పెట్టి చెప్పేది. ఎందుకు ఇంత వరుసగా ధారా ప్రవాహంలా మాట్లాడుతారు? అంటారు. ధారాప్రవాహంగా ఎందుకు మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఈ మాట్లాడేటప్పుడు ఈ వరుసక్రమం మాట్లాడుతున్నాడే ఇందులో వేదాంత వాక్యాలు వచ్చేస్తూ వుంటాయన్నమాట. ఆ వాక్యాలను పట్టుకో. ఆ వాక్యాలను కనుక మనసులో స్థిరం చేత, శ్రవణ మనన నిధి ధ్యాసలు ఆ వాక్యాల యెడ చేయాలన్నమాట. చేస్తే ఏమౌతుంది అప్పుడు? నీకు బలంగా ఇవి స్ఫురించగానే ఇటు కూడా ఇవి బలంగా స్ఫురిస్తుందన్నామట. స్ఫురించగానే ఏమౌతుంది? దీనికి దీనికి పోటీ వస్తుందన్నమాట. ఇప్పటి వరకూ నీకు పోటీ లోపల లేదు. ఒక పక్షమే వుంది. రెండో పక్షము లేదు. ఎందుకని బలవంతంగా గురువు ఇటుపక్క ఎక్కిస్తున్నాడు తన శక్తినంతా ధారపోసి? నీ మనసులో వీటిని నిక్షిప్తం చేస్తున్నాడన్నమాట. ఎందుకని? దానిని అధిగమించే బలం కావాలి నీకు. నీ దగ్గర ఏమి లేదు? ఏమి లేక నా దగ్గరకు వచ్చావు? దాంతో పోరాడుతున్నానండీ, ఓడిపోతున్నానండీ, నా దగ్గర శక్తి లేదు అన్నావు. ఏం చెయ్యాలి ఇప్పుడు నీకు? దాన్ని ఏ వాక్యాన్ని ఆశ్రయిస్తే, ఏ భావాన్ని ఆశ్రయిస్తే దానిని అధిగమించగలవో వాటిని నీకు చెప్పి, వాటిని నీలో స్థిరపడేటట్టు చేస్తే, వీటిని ఆశ్రయించి, వీటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతావు. ఇది గురువు చేయాల్సిందే కానీ, శాస్త్రం చేయలేదు. వచ్చిన చిక్కు ఇది. శాస్త్రం కూడా వాక్యాలు ఏకరువు పెడుతుంది. కానీ ఏ క్రమంలో చెబితే నీకు అది శక్తిగా స్థిరపడుతుందో, నీకు అంటుకుంటుందో, అది శాస్త్రం చెప్పలేదు. శాస్త్రం జనసామాన్యంగా చెబుతుంది. (పది మందికి ఉపయోగపడేటట్లు) ఎంతమంది చదివితే ఏ, లక్ష మంది చదవమనండి, లక్షమందికీ సరిపడినట్లే వుంటుంది అది. కానీ అందులో నీకు సరిపడ్డట్టుగా మార్చడం దానిని నీవల్లే వీలౌతుంది. అందుకని గురువు అవసరం. కాబట్టి గురువు అనేవాడు ఏం బోధించాలయ్యా? ఆత్మజ్ఞానాన్నే బోధించాలయ్యా! ఇహలోకానికి సంబంధించినవి నీవు అడిగినా, వాటిని నిరసించవలయునే కానీ, వాటికి అది చేసుకో, ఇది చేసుకో అని చెప్పరాదు. దీనికి భగవాన్‌ రమణులు ఒక సూత్రం చెబుతారండి. ఎవరికయ్యా ఈ విచారణ మార్గం? అంటే, వాడికి ఒక పరీక్ష పెట్టాలట. ఏంటట? వచ్చిన తరువాత అడుగుతావు కదా! అడిగితే నేను ఏదైనా చెప్పి పంపిస్తాననుకోండి, తిరిగి వచ్చి మళ్ళా నువ్వు ప్రశ్నిస్తే, విచారణ మార్గం చెప్పాలి. తిరిగి రాలేదనుకో ఇక అక్కడితో సరి. అర్థమైందా అండీ! అందుకని ఇప్పుడు ఎవరైనా కూడా మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళారనుకోండి, ఇదిగో ఈ మంత్రం జపం చేసుకోండి, తగ్గిపోతుంది అన్నాననుకోండి, మీరు ఏం చేస్తున్నారు? తిరగి వచ్చేస్తున్నారు అంతే. అంతేగానీ మరలా తిరిగి వెళ్ళి ఏవండీ, why Mantra Japam? మంత్రజపం ఎందుకు చేయాలి? ఈ మంత్రజపం అర్థం ఏమిటి? ఈ మంత్రజపం నేను చేస్తే ప్రయోజనం ఏమిటి? నాకు కావలసింది ఆత్మజ్ఞానమైతే మంత్రజపం చెప్పి పంపించారు నాకు. అని తిరిగి వెళ్ళి ప్రశ్నించావా? ప్రశ్నించలేదు కదా! కాబట్టి ఆయన తప్పు ఏమీ లేదు. తిరిగి ప్రశ్నిస్తే విచారణ మార్గం చెబుతాడు. వీళ్ళైనా అంతేకదా! పాఠం చెబుతారు, తిరిగి ప్రశ్నిస్తే, (దానికి అర్థం) వివరాలు చెబుతారు. అంతేకదా! లేకపోతే ఎంతవరకూ చెబుతారు? కొంతమేరకే చెబుతారు. అంతే! లోకసహజమైన విద్య అయినా అంతే. బ్రహ్మవిద్య అయినా అంతే. అంటే నీవు విచారణ మార్గంలో స్థిరపడాలి అంటే, ప్రశ్నించడం సరిగ్గా నేర్చుకో. అర్థమైందా అండీ! నీ మనసుని, నీ బుద్ధిని ప్రశ్నించడం రావాలి. ఇప్పటి వరకూ బయటకి ప్రశ్నించావు అందరిని. నువ్వెంతా, నువ్వెంతా? నువ్వేమిటి, నీ లెక్కేమిటి? బయటకి ప్రశ్నించావు. బయటకి కాదు. బయటకి మౌనం. అర్థమైందా అండీ! బయటకు అంతా మౌనం. ఎందుకని? మౌనంగా వుంటేనే సాక్షిత్వం వీలౌతుంది. దానికి వీలౌతుంది. ఎంతసేపు మౌనమే. ఎందుకని? లోపలికి వేస్తావు అప్పుడు ప్రశ్న. నిన్ను నువ్వు వేస్తవు ప్రశ్నలు. వాడు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఇప్పటివరకూ ఏం చేశావు? వాడిని చూశావు. వాడిని అడగడం కాదు, నిన్ను అడుగు. వాడు ఆ జీవి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో, (వాడు కాదు ఆ జీవి, ‘వాడుఅనేది పోవాలి ఇప్పుడు నీకు, వాడు అంటే మళ్ళా ఒక సంబంధం ఏర్పరచుకున్నావు) ఆ జీవి ఎందుకు అలా ప్రవర్తించింది, ఈ జీవితో? ఇప్పుడు వీడి పేరు ఏమిటి? వీడు జీవుడే. అర్థమైందా అండీ! నేను పోయింది ఇప్పుడు. ఆ జీవి ఈ జీవితో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నది? అక్కడున్న శరీరం జడం. ఇక్కడున్న శరీరం జడం. అక్కడున్న ప్రాణమనో బుద్ధులు సూక్ష్మం. ఇక్కడున్న ప్రాణ మనో బుద్ధులు సూక్ష్మం. అక్కడున్న అంతరాత్మ సాక్షి, ఇక్కడున్న అంతరాత్మ సాక్షి. ఈ మూడింటిలో ఏమైనా భేదం వుందా? ఏమీ లేదు. శరీరం అంటావా? సప్త ధాతు నిర్మితం. శరీర, అస్తి, మజ్జ, మేథో, రోమ అంతే కదండీ! ఏమున్నాయి అందులో, ఏముంది మాంసము, ఎముకలు, రక్తము, నరాలు, రోమములు ఇవే కదా వున్నాయి. నీకు ఏమున్నాయో, దానికి అదే కదా వుంది. కొత్తది ఏముంది? ఏమీ లేదు కదా! సప్తధాతు నిర్మితం శరీరంలో ఏమైనా భేదం వుందా? ఏమీ లేదు. అర్థమైందా అండీ! పొట్టి బీరకాయి, పొడుగు బీరకాయి. అంతేకదా! బీరకాయలో difference వుందా? ఏమీ లేదు. లక్షణంలో ఏమీ భేదం లేదు. అదే. కానీ పొట్టి, పొడుగు చేత ప్రభావితం అవుతున్నావు నువ్వు. అవునా కాదా? ఆవెడ అలా వుందండి, ఈవెడ ఇలా వుందండి. ఆయన అలా వున్నాడండి, అబ్బా! మా అల్లుడుగారు ఎంత అందంగా వున్నాడండి? ఏమిటి అందం? ప్రాణ మనో బుద్ధులదా? బయటవున్న శరీరానిదా? లోపల వున్న అంతరాత్మదా? ఏమైంది ఇప్పుడు? పొట్టిబీరకాయ, పొడుగు బీరకాయ. బీరకాయ అదే ఏతావాతా. అంతేకదా! లక్షణం ఏం మారింది? ఏమీ మారలేదు నాయన. కేవలము పైనున్నటువంటి సప్తధాతునిర్మిత ఆకార భ్రాంతికి లోనయ్యావు బాబూ. ఈ ఆకారం అనిత్యం కదా! అని ఇట్లా విచారణ చెయ్యాలి. ఎవరికి వాళ్ళు నిన్ను నువ్వు, లోపల విచారణ, ఈ ఆకారము అనిత్యము కదా! మరి ఆ సూక్ష్మమో? అది మూడు గుణాలు, మూడు వాసనలు, మూడు అవస్థల చేత నిర్మితమైనది కదా మరి! మరి దానికీ దీనికి మూడు అవస్థలు ఒకటేగా. జాగ్రత్‌ స్వప్న సుషుప్తిలు ఒకటే. సత్వ రజస్తమో గుణాలు ఒకటే. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన దానికీ ఒకటే, దీనికీ ఒకటే. మరి ఎందుకు స్పందిస్తోందయ్యా? అది దానికి లోబడింది కాబట్టి. ఎవరు లోబడమన్నారు నిన్ను? నేను రజోగుణానికి లోబడబట్టి అది అట్లా ప్రవర్తిస్తున్నది. నేను దేహవాసనకు లోబడబట్టి అది అలా ప్రవర్తిస్తున్నది. అంతేనా అండీ! మీరందరూ మీ అమ్మాయిలకు పెళ్ళిచూపులు బాగా చూశారా? ఎందుకు చూశారు? ఎలా చూశారు? ఎలా నిర్ణయం చేశారు? చివరకు ఏమైంది పరిణామ ఫలితాలలో? చేసినప్పుడు అంతా అద్భుతమే అన్నామా? తర్వాత ఏమైందండీ? తరువాత ఏ జీవి ప్రారబ్దానుసారం పరిణామ ఫలితం ఎలా వుందో, అలా అవుతూ పోతూ వుంది. నువ్వు ఏమనుకున్నావు? అప్పుడు అంతా అద్భుతమనే చేశా కదా అన్నావు. అప్పుడు అంతా అద్భుతమే  ఇప్పుడు దిబ్బ అని ఎవరన్నారు? ఏ ఇప్పుడు కూడా మంచే, పరిణామ పాఠం వస్తోంది చక్కగా. జీవన పాఠం రావాల్సింది వస్తోందిగా. మంచిదేగా జరుగుతోందిగా. జరిగేదంతా మంచికే అని పెద్దలు ఎందుకు చెప్పారు? పరిణామపాఠం నీకు జ్ఞానం వస్తోంది నాయనా! ఈ సుఖాపేక్ష తగ్గిపోయింది నాయనా! శరీరం, ఆకార భ్రాంతి తగ్గిపోతోంది నాయనా! ఏది తగ్గిపోవాలో, అది తగ్గిపోయేట్లుగా ఏర్పాటు చేయడమే సృష్టి ధర్మం. సృష్టి తన ధర్మాన్ని చక్కగా పోషిస్తున్నది. ఎక్కడా లోపంలేదు దాంట్లో. నీవే వ్యతిరేకంగా ఆలోచిస్తూ వున్నావు. అసహజ పద్ధతిలో జీవిస్తూ వున్నావు. ఆ సృష్టి రహస్యాన్ని తెలియక, జీవన రహస్యాన్ని తెలియక, వ్యతిరేకంగా బుద్ధిని పెట్టుకుని, నా బుద్ధి ప్రకారం జీవితం లేదే అంటున్నావు. నీ బుద్ధి జీవితం నీది అంతా కూడాను సృష్టి ప్రకారం మారవలసిందేగాని, సృష్టి నీ ప్రకారం మారుతుందా? ఎలా సాధ్యం? మనం ఎంత సేపు ఏమి అడుగుతున్నాము. నాకు బుద్ధి చెప్పినట్టు సృష్టి అట్లా మారలేదండి, ఎట్లా సాధ్యం? అసలు సృష్టి ఎంత? నీ బుద్ధి ఎందులో భాగం అసలు? ఆ సృష్టిలో భాగం కదా!  అర్థమైందా అండీ! సముద్రంలో వున్న ఉప్పును తెచ్చి బొమ్మ చేశామండి. ఈ ఉప్పుబొమ్మ అందట. సముద్రం ఉప్పగా వుంది. నువ్వు ఎక్కడి నుంచి తయారయ్యావేమిటి? ఈ ఉప్పుబొమ్మ ఏమంటుంది? సముద్రం ఉప్పగా వుంటుందంట. నువ్వు ఎక్కడినుంచి తయారయ్యావు? నువ్వు దాంట్లోనుంచేగా తయారయ్యావు. నీకు అదే లక్షణమేగా వుంది. నువ్వు ఏమవ్వాలట ఏతావాతా? నిన్ను తీసుకెళ్ళి దాంట్లో పడేస్తే ఏ గోలా లేదు. (అది తెలుసుకో లేక, అది ఉప్పు అంటుంది). నేనేదో సత్యం, నువ్వు ఉప్పు అంటోంది. అర్థం వుందా ఏమైనా? కాబట్టి ప్రాణమనోబుద్ధుల వ్యవహారం అంతా ఇలా వున్నది. ఈ సత్యం తెలుసుకో! ఇప్పుడు నేను ఎవరిని? నేను అంతరాత్మని. నిత్య స్వరూపుడను. నాకు ఏ భేదము లేదు. నాకు మార్పులేదు. పరిణామము లేదు. శాశ్వతమైనటు వంటి వాడను, సాక్షిని, సనాతనమైనటువంటి వాడను. ఆద్యంతములు లేనటువంటి వాడను. ఇలాంటి వాక్యాలు నీలోపల కనుక స్థిరపరచుకున్నట్లయితే, ఇప్పుడు అక్కడ ఎదురుగుండా ప్రవర్తించేది ఏమైపోయింది? ఓహో! ఇంకా మనలో రజో తమోగుణాలు వున్నాయి. ఎత్తిచూపెడుతున్నాయి. సరే కాని. ఎప్పటికైనా సాధన చేసి వీటిని అధిగమించాలి కదా! నాకు మేలే చేశాడుగా. సంస్కారం రద్దైపోతుంది కదా! ఈ జీవితో నాకు సంస్కారబంధం రద్దైపోతోంది కదా! ఒకటి గర్తుపెట్టుకోండి. గురువు తనయొక్క జీవితాన్ని, అనుభవజ్ఞానాన్ని, మీ ఎదురుగుండా వుంచి, తాను ఎట్లా జీవిస్తున్నాడో చూపెట్టి, నీకు బోధిస్తున్నాడు. ఎందుకు అలాగ? నీ పూర్వం అలా లేవని అతనికి తెలియదా? తెలుసు. పిల్లాడికి అక్షరాభ్యాసం. అక్షరాలు వస్తే అక్షరాలు బోధించే ప్రయత్నం ఏముంది? అక్షరాలు రావనే కదా బోధించింది. అర్థమైందా? అక్షరాలు రావని స్ఫురణకు తెచ్చుకుంటే మళ్ళా వచ్చింది పోతుంది. ఎప్పుడూ మీరు వెనక్కి వెళ్ళకూడదండి. మీకు మొదటినుంచి ఇదే చెబుతున్నాను. మిమ్మల్ని ఎంతో కష్టపడి ఇటుపక్కకి ఎక్కిస్తాము. ఎక్కించిన తరువాత మీరు కిందపడడానికి ఎంత సమయము కావాలి? ఒక రెప్పపాటు చాలు. నీ గతాన్ని స్ఫురణకు తెచ్చుకుంటే చాలు వెనుకబడిపోతావు. కాబట్టి గతాన్ని స్ఫురణకు తెచ్చుకోమాకు. నాకు చేతకావడం లేదు అనుకోమాకు. నీకు చేతనయ్యేదేమిటి? చేతనయ్యే గురువు వున్నాడు. నిన్ను పైకి లాగడానికి. అర్థమైందా అండీ! భారం పరమాత్ముడిమీద వెయ్యి. భారం గురువుమీద వేసి ప్రయత్నం చెయ్యి. నీ మీద వేసుకుంటున్నావు, అందుకని కచ్చితంగా కిందపడిపోతావు. ఇప్పటి వరకూ ఏంచేశావయ్యా? నీమీద వేసుకుంటున్నావు. ఈ అనంత సృష్టిని నడుపుతున్నటువంటి పరమాత్మమీద భారం వెయ్యకుండా నీ మీద వేసుకున్నావు. ఏమైంది? పడిపోయావు. నువ్వు పడిపోవడానికి కారణం ఎవరు? నువ్వే. నువ్వు పడిపోవడానికి లక్ష్యం ఎందుకు పెట్టుకున్నావు? పరమాత్మ మీద భారం వేసి చెయ్యి. అప్పుడు ఏమైంది? సహజంగా అధిగమించేస్తావు. గురువు మీద భారం వేసి చేయి. సహజంగా అధిగమించేసేస్తావు. ఎందుకని? అది అంతే నాయనా! ఆ అనుభవజ్ఞానం అందులో వుంది సత్తా. ఆ వాక్యంలో వుంది సత్తా. బలంగా చెబుతున్నాడు, తన సత్తా అంతా వుపయోగించి చెబుతున్నాడు. తన శక్తినంతా ఆ వాక్యంలో నిక్షేపిస్తున్నాడు. ఆ శక్తిని, ఆ ప్రభావం చేత నీలో బలమైనటువంటి జ్ఞాపకం ఏర్పడేటట్లు చేస్తున్నాడు. ఈ బలమైన జ్ఞాపకం ప్రభావం చేత నీకు ఆ వాక్యం స్ఫురణకు వస్తుంది. ఆ సమయం వచ్చేటప్పటికి. నీకు చెప్పడం లేదు. నీ లోపల వున్న ప్రజ్ఞకు చెబుతున్నాడు. చైతన్యం మీద ముద్ర వేస్తున్నాడు. ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. గురువు దగ్గర మీరు వినేటప్పుడు శ్రద్ధ వున్నట్లయితే, ఆ శ్రద్ధ ప్రభావం చేత, అవి మీకు బుద్ధిలో పడవండి. బుద్ధికి అవతల పడుతాయి. బుద్ధిలో పడితే మళ్ళా నువ్వు వాటిని manage చేసేస్తావు. నీకు లోబడిపోతుంది అది. నువ్వు చెప్పినట్టు వినేస్తుంది. కానీ, అవి అట్లా వుండకుండా వుండానికి ఏం చేస్తాడంటే, బుద్ధికి అతీతంగా, బుద్ధికి అవతల వున్నటువంటి ప్రజ్ఞాస్థితిలో ఈ వాక్యాలను నిక్షిప్తం చేస్తున్నాడు. తన శక్తితోటి. అతను తనకు వున్నటువంటి ఈ అతీతమైన ప్రజ్ఞచేత, ఆ అతీతమైన సత్తా చేత, ఆ వాక్యం ద్వారా, ఆ శబ్దం ద్వారా, నీలో ప్రజ్ఞాస్థితిలో వీటిని నిక్షిప్తం చేస్తున్నాడు కాబట్టి నీకు ఆ సమయం రాగానే ఈ వాక్యాలు స్ఫురణకు వస్తాయి. అది నీ ప్రభావం అనుకుంటావేమో, అది నీ ప్రభావం అయితే, బుద్ధిలో పెడితే మర్చేపోతావు. కాబట్టి గుర్తు పెట్టుకోండి. గురువు దగ్గర పాఠం నేర్చుకునేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. వేరే అన్యధ్యాసే పనికిరాదండి. ఎందుకని? నీకు అన్యధ్యాస కలిగితే, తప్పనిసరిగా అది నీ బుద్ధి స్థితిలోకి వచ్చి పడిపోతాయి. మళ్ళా ఇదంతా పాఠం అంతా మళ్ళా వినవలసిందే. కాబట్టి ప్రతిరోజూ నిత్యానిత్య వస్తు వివేకాన్ని, చక్కగా విచారణ చెయ్యాలి. నిత్యవస్తువు ఏది? అనిత్యవస్తువు ఏది? అనే విచారణ తోటే, నిదులోకి వెళ్ళాలి. ఇవాళ నేను ఏం చేశాను? నిత్యాన్ని ఆశ్రయించానా? అనిత్యాన్ని ఆశ్రయించానా? నిత్యము సత్యము అని చేశానా? అనిత్యము సత్యమని చేశానా? Thumbs Up సత్యమా? Pepsi సత్యమా? ఈ రెండూ సత్యం కాదు. మంచినీళ్ళు సత్యం. అలాగ ఎప్పుడూ కూడా, దాహం సత్యమే కదా! కానీ ఆ దాహం కూడా అసత్యమే కదా! ఎందుకని? ప్రాణ ప్రభావం చేత ఏర్పడుతున్నదది. అంతరాత్మ ప్రభావం చేత ఏర్పడుతన్నదా? ఏర్పడడం లేదు కదా! ప్రాణం. నేను ప్రాణాన్నా మరి ఇప్పుడు? కాదు కదా! ఆ ప్రాణానికి సాక్షిని. కాబట్టి దాహం చేత నేను చలించిపోవడం ఏమిటి? దాహమేస్తే ఆగలేరు మనుషులిక. ఎందుకని? ఆ ప్రాణానికి లోబడి వున్నావు కాబట్టి. అదే అంతరాత్మ స్థితిలో వుంటే, నిన్ను ఏది చేరేది? నువ్వు గాఢనిద్రావస్థలో వున్నవండీ, దాహం నిన్ను ఏమన్నా చేసిందా? (లేదు) ఎందుకని? ప్రాణాన్ని అధిగమించేసి వున్నావు. ఆ మనసు బుద్ధి దాటేసి వున్నావు. కాబట్టి అది నిన్ను ఏమీ చెయ్యలేదు. కాబట్టి అధిగమించిన స్థితిలో వుంటే ఈ ప్రాణ మనో బుద్ధులు నిన్ను ఏమీ చేయజాలవయ్యా. ఈ సత్యాన్ని తెలుసుకుని జీవించు. సాయిరాం.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం తత్‌ సత్‌
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః

సాయిరాం.