File No.6





మేలుకొలుపు (ఆత్మ)
1)         తెల్లవారెను భ్రాంతి చీకటి | దీరిపాయెను జ్ఞానము
            దయంబల్ల నాయెను| మనసు తిరమై | యెల్ల బయ లాయెన్‌ |
            ఆత్మా మేలుకొనవే ||
2)        ఉన్నదున్నట్లుండి పాయెను | విన్న కన్నది లేకపాయెను |
            యెన్నగా యీ యెఱుక మూలము | యేమి లేదాయెన్‌ ||
            ఆత్మా మేలుకొనవే ||
3)        తోచు వృత్తులు దొలగి పాయెను | సూచనయు
            గురువాక్య మాయెను | ఉచ్ఛ నీచంబనెటి పలుకులు
            ఉత్తవై పాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
4)        భూతపంచక శూన్యమాయెను | కూత లేమియు
            లేకపాయెను | పాతకంబులు పారిపాయెను | పరమ
            పదమాయెన్‌ ఆత్మా మేలుకొనవే ||
5)        ఇల్లు బయలై తెల్లనాయెను | కల్ల బోధలు చెల్లి
            పాయెను | పిల్ల లాటల పోలికాయెను | ప్రేమ
            లేదాయెన్‌ ||            ఆత్మా మేలుకొనవే ||
6)        పిండ బ్రహ్మాండముల నుండెటి |
            దండియహముల తెలివి బాయెను | ఖండ
            ఖండములోను జూడ య | ఖండమై పాయెన్‌ ||
            ఆత్మా మేలుకొనవే ||
7)        హరిహరాదుల కందకుండెటి | గురుని
            వాక్యము నమ్మికాయెను | పరమపదమే బట్ట
            బయలై | భావమిక బాయెన్‌ ||             ఆత్మా మేలుకొనవే ||
8)        జనన మరణము జడుపు తీరెను | కనుల వేడుక
            కాలిపాయెను | మనసు యింద్రియ చలము
            లెల్లను | మాయామై పాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
9)        జగతి విబుధుల స్వప్నమాయెను | పగలు రాతిరి
            లేక పాయెను | ఒకటి రెంటి మూలమారెను |
            ఊహా లేదాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
10)      ఇంపుగా నలగండ్ల వెలిగెటి | వెంపటి నరసింహ్వ
            గురువరు | పంపునను గోపాల కవిలో | బయలు
            బయ లయ్యెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
                        -*-*-*-
1)         తెల్లవారెను మోహతిమిరం | బెల్ల బాయెను జ్ఞాన
            వుదయం | బల్ల ప్రబలం బాయ | తన మనసెల్ల
            స్థిరమాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
2)        మూడు గుణములు | ముణిగి పాయెను |
            ఏడు ధాతువు | లెనుక బట్టెను | ఏడ యేమియు |
            లేకపాయెను | ఎఱిగి మేల్కొనవే ||
            ఆత్మా మేలుకొనవే ||
3)        అష్ట తనువులు అడవి బట్టెను | అష్ట మదము లహామిక
            మణగెను | కష్ట సుఖముల | కాంక్ష దీరెను |
            ఘనత మేల్కొనవే ||         ఆత్మా మేలుకొనవే ||
4)        అష్ట ప్రకృతుల ఆటలుడిగెను | అష్టపాశములపుడె
            వీడెను | ఇష్ట మేమియు లేకపాయెను |
            ఇపుడు మేల్కొనవే ||        ఆత్మా మేలుకొనవే ||
5)        వాసనాత్రయ మొదలి పాయెను | ఈషణ త్ర
            యమిపుడె వీడెను | విన్న దేమియు లేక పాయెను |
            వేగ మేల్కొనవే || ఆత్మా మేలుకొనవే ||
6)        సాగరంబుల చప్పు లుడిగెను | వాద భేదము
            వదలిపాయెను | నాద మప్పుడె నశ్యమాయెను |
            నయమె మేల్కొనవే ||      ఆత్మా మేలుకొనవే ||
7)        మండలములనె మమతమానెను | కుండలస్థలి
            కూలిపాయెను | పండు వెన్నెల భావమాయెను |
            బరగ మేల్కొనవే || ఆత్మా మేలుకొనవే ||
8)        మనసు బుద్ధియు మరల జనియెను | మాని పాయెను
            జనన మరణము | మమత ఏమియు లేక పాయెను
            మరియు మేల్కొనవే || ఆత్మా మేలుకొనవే ||
9)        గురుడు శిష్యుండేక మాయెను | కులము గోత్ర
            ము లేక పాయెను | కుడి యడమలు సమమె
            ఆయెను | గురు తెఱుక బాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
10)      పరశురాముని సీతరాముల | భజన నిత్యము
            సేయుటాయెను | బాగుగా శేషమ్మ భావము |
            బయలులో లే దాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
                        -*-*-*-
మేలుకొలుపు (జీవ)
1)         కటకట మోసమాయెను |
            మోసమాయెను జీవ చూడగ | మోహపాశము
            లధిక మాయెను | గాశి జెందగ, జేసె నీగతి |
            కర్మ మేమందూ || జీవా మేలుకొనవే ||
2)        కల్పశతముల కన్న మిక్కిలి | కాల మాయెను,
            తిరిగి చూడగ | అల్ప సుఖ మని, కలలో మురి
            యుచు | ఆడుచున్నావు ||  జీవా మేలుకొనవే ||
3)        కోటి జన్మము లెత్తియును | శతకోటి దుఃఖ
            ము లనుభవించుచు | నాటి మాటలు దలచు
            కొంటె నాటు నీ మదికి ||  జీవా మేలుకొనవే ||
4)        ఇరువ దొక వెయ్యి ఆరు నూరులు | జరుగు హం
            సలు తరుగు నాయువు | హరిహరాదులు వచ్చి
            నిలచిన | ఆగదీ తనువూ ||  జీవా మేలుకొనవే ||
5)        లేనిపోని దుఃఖజాలము | లోనబడి చెడి
            పోవు టెందుకు | మాన అవమానంబు లని | నీ మమత    
            విడ లేవూ ||  జీవా మేలుకొనవే ||
6)        నిజగురుండగు సూర్యుడిప్పుడు | నిజముగా
            ఉదయించె చూడుము | త్రిజగముల వారంత
            మేల్కొని | తెలివి గన్నారు || జీవా మేలుకొనవే ||
7.        బట్టబయలును గురుడు జూపిన | నట్టు లేకను
            పుడమి అంచున | పట్టు విడువక గుట్టు మరు
            వక | దిట్టమై పోవె ||  జీవా మేలుకొనవే ||
8.        మాయ తనువై మాయతానై | మాయ పను
            లను జేయుచును మరి | మాయ తన మర్మం
            బుగనే | మాయమై పోవున్‌ ||  జీవా మేలుకొనవే ||
9.        ద్వాదశిషోడషులనె జలధార కర్ణములందు
            సోకిన | బాధలన్నియు తొలగి నీవిక | భ్రాంతి
            వొదిలెదవూ ||  జీవా మేలుకొనవే ||
10.      భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరుండిటు
            రానె వచ్చెను | వేగ గని తను మన ధనంబులు
            వీడి | శరణనవే ||  జీవా మేలుకొనవే ||
11.        పీలుఖాన శంకరుండని పిలిచి | ప్రభువరుం
            డేలినారట | మూలమూ లేనట్టి యెఱుకను |
            ముంచి వేసిరటా ||  జీవా మేలుకొనవే ||
శ్రీ మద్రాజాధిరాజ మహరాజా యోగీంద్ర చంద్ర
భాగవత కృష్ణ దేశిక ప్రభు మహరాజుకీ
జై జై జై
oo
తత్‌సత్‌
శాంతిః శాంతిః శాంతిః
-*-*-*-
సాయిరాం! చెప్పండి, ఏమైనా అడుగుతావా?
ఇల్లు బయలై తెల్లనాయెను, కల్లబోధలు చెల్లిపాయెను, పిల్లలాటల పోలికాయెను, ప్రేమలేదాయన్‌ |ఆత్మామేలుకొనవే| ఇల్లు అంటే దీని అర్థంలో ఏంటి? ఇది ఇల్లుకాదు లేదంటే శరీరం ఇల్లు. కానీ అక్కడ ఏ ఇల్లు చెబుతున్నాడంటే, విశ్వం అనే ఇల్లు లేకుండా పోయిందయ్యా బాబు, (ఇది కాదు, అది కాదు) విశ్వమనే ఇల్లే లేకుండా పోయి, బయలైపోయింది అంతా! అటువంటి స్థితిలో కల్లబోధలు చెల్లిపాయెను - ఏ బోధైనా ఏం చెబుతోంది? ఇదిగో ఇది ఆధారం నాయనా, ఇది ఆశ్రయం నాయనా! ఇదిగో ఇది సిద్ధాంతం నాయనా! ఇది రాద్ధాంతం నాయనా! అని చెబుతోంది ఏ బోధైనా కూడా. విశ్వమే లేకుండా పోయినటువంటి స్థితిలో ఈ సిద్ధాంత రాద్ధాంతాలు ఎక్కడున్నాయి? ఈ ఆధార ఆశ్రయాలు ఎక్కడున్నాయి? కల్లబోధలు - ఇవన్నీ కల్లబోధలు, లేనటువంటి దానిని గురించి చెబుతున్నాయి. కల్ల అంటే లేనిది. లేని దానిని గురించి మాట్లాడుతున్నాయి. లేని విశ్వం గురించి వివరించేటటువంటి బోధలు ఇవన్నీ కూడా. విశ్వమే లేనిది. అటువంటి లేని విశ్వాన్ని గురించి బోధిస్తున్నాయి ఇవన్నీ కూడా. అటువంటి కల్లబోధలు చెల్లిపాయెను. ఇంకా ఈ వినేది ఏమిటి? లేకుండా పోయినాయి, లేని బోధలు లేకుండానే పోయినాయి.
            ఇప్పుడేమిటట? విశ్వం ఎట్లా కనబడుతోంది? ఈ స్థితిలో విశ్వం ఎట్లా కనబడుతోందయ్యా నాకు అంటే? పిల్లలాటల పోలికాయెను, ఓహో! ఈ విశ్వమంతా పిల్లలాటల పోలికాయెను, అలా కనపడుతుంది, ఆడుకుంటున్నారు, ఆడుకోనివ్వండి. కొంతకాలం అయినాక వాళ్ళుకూడా తెలుసుకుంటారు, ఇది కూడా లేనిదే! వదిలేస్తారు. ప్రేమలేదాయెన్‌ - ప్రేమ విశ్వజనీనమైనది అని కదా అందరూ అనేది? అంటే ఈ విశ్వానికి ఆధారం ప్రేమయే నండి. ఈ విశ్వం అంతా వ్యాపించి వున్నది ప్రేమేనండి. ఈ విశ్వంలో సత్యమైనది అంతా ప్రేమేనండి. మరి విశ్వమే లేకుండా పోయినప్పుడు మరి ప్రేమ ఎలా వుంది? కాబట్టి ప్రేమలేదాయెన్‌. ఆత్మా మేలుకొనవే. (అది మీకు ఇప్పుడే అందే అంశం కాదు) ఆత్మ ఆ స్థితిలో మేలుకోవాలట, రోజూ ఆ స్థితిలో ఉదయం మేలుకొనేటప్పుడు ఆత్మ ఆ విశ్వమే లేనటువంటి స్థితిలో మేలుకోవాలట. అది ఆ స్థితి నుంచి అన్నీ ఉత్పన్నం అయినాయి. ఏమీ లేని స్థితినుంచి అన్నీ ఉత్పన్నం అయినాయండీ! ఆ ఏమీ లేని స్థితిలో ఏదైతే వున్నదో, అదే ఉన్నది. ఎల్లకాలం అదే వుంటుంది. దాంట్లో ఏ మార్పు వుండదు. ఈ విశ్వమే లేకుండా వున్నప్పుడు కూడా ఒకటి వున్నది. ఆ వున్నది ఏదో వున్నది, దానికి ఏ వ్యక్తీకరణ లేదు. దానికి మార్పు లేదు. విశ్వం రావడం వల్ల దాంట్లో ఏ మార్పు చెందదూ. విశ్వం పోవడం వల్ల కూడా ఏ మార్పు చెందడం లేదు. ఎల్లకాలం ఒక్క తీరుగా శాశ్వతంగా వున్నది ఏదో అదే సత్యం. దానికే ఏ పేరు పెట్టుకున్నా! దాని పేరు అచలం కదలదు. విశ్వమేమో చలిస్తుంది, కదులుతుంది. అర్థమైందా అండీ!
            మనం మాట్లాడుతున్నవన్నీ కదిలే దాంట్లోనే! కదలనిది మాట్లాడదు. తిరగదు, కరుగదు, మొరుగదు, విరుగదు. అదేమన్నా తిరుగుతుందా? తిరగదు. కరుగుతుందా? కరుగదు. విరుగుతుందా? విరగదు. మొరుగదు మనలాగా ఏమీ మాట్లాడదు అది. శాశ్వతమైనది, శుద్ధమైనది, బుద్ధమైనది, నిత్యమైనది, సనాతనమైనది, అనంతమైనటువంటిది, ఎల్లకాలం ఒక్కతీరుగా వుండేది అదే అచలం. కదలదు. అదే ఎప్పటికైనా ఆ స్థితే. ప్రతి దేవాలయంలో విగ్రహం కదులుతోందా? ఏం బోధిస్తోంది ఇప్పుడు? ఎందుకు అలా పెట్టారు? ఆ విగ్రహాలని. నాయనా! ఈ విశ్వమంతా ఏ స్థితి నుంచి వచ్చింది? కదలని స్థితినుంచి, కదలని దాని మీద ఏర్పడింది. అట్టి కదలని స్థితే సత్యమైనటువంటిది. ఎప్పటికైనా దేనిని తెలుసుకోవాలి నువ్వు? ఎప్పటికైనా దేనిని తెలుసుకోమని చెబుతున్నది విగ్రహము? కదలని స్థితి గురించి తెలుసుకోవయ్యా! కదలని స్థితి స్థిరంగా వుండి మాట్లాడు. కదలని స్థితి, నువ్వు కదిలే స్థితిలో వున్నావు. నన్ను నువ్వు ఆశ్రయిస్తున్నావు కాబట్టి నీకు ఒక ఆశీర్వచనము చెబుతున్నాను. ఏమిటి? నా వలె నువ్వు వుండు. ఆ విగ్రహం వలె నువ్వు వుండు. ఏదీ స్వీకరించమాకు. ఏమీ చెయ్యమాక. ఎన్నన్నా ఏదన్నా జరగనీ, ఆ విగ్రహం ముందు ఏది జరిగినా ఏదైనా మాట్లాడుతుందా? ఏ మన్నా స్వీకరిస్తోందా? ఏమన్నా సమాధానం చెబుతోందా?
            స్థిరం అంటే, సాపేక్షం. అంటే కదలికల ద్వారా ఆగిపోవడం. ముందు కదులతూ వుంది. తరువాత ఆగింది. అప్పుడు స్థిరమైంది అన్నాము. అచలం అంటే అసలు కదలనే కదలనిది కదా అది. దాంట్లో కదలికలే లేవు. ఇక స్థిరం ఏముంది? నువ్వు కదులుతూ వుంటే, ఆగితే స్థిరం. (ఊరకే కదులుతూ వుంటే, స్థిరంగా కూర్చో అంటారు) అది, దీనికి అసలు కదలికే లేదుగా. విగ్రహానికి కదలికే లేదుగా. కాబట్టి ప్రతి దేవాలయంలో విగ్రహం ఏమి బోధిస్తున్నది? అది జీవుడైనా, రాముడైనా, దేవుడైనా, అమ్మ అయినా, అయ్య అయినా, ఎవరైనా, ఏ విగ్రహమైనా బోధిస్తున్నది, ఒకే బోధ చెబుతున్నది ఏమిటయ్యా? ఈ అనంత విశ్వమూ కూడా చిట్టచివరికి ఏమవ్వాలయ్యా? కదులుతూ వున్నదంతా, కదలకుండా పోక తప్పదు. మనమైనా అంతే కదండీ! నీ శరీరం కదలడంలేదా? తర్వాత ఏమైందండీ? చిట్టచివరికి ఏమైందండీ? కదలకుండా పోయింది. కాబట్టి అంత్యకాలమున ఏదైనా అది తప్పదు. చూడండి. ఎంత స్పష్టమైనటువంటి బోధను ఏర్పాటు చేశారో! ఆలయంలో.
            ఈ బోధను కనుక ఎవరైతే స్వీకరిస్తారో, వాడు కదా! నిజమైనటువంటి ఆలయానికి వెళ్ళి వచ్చిన వాడు. వాడికి కదా భగవత్‌ దర్శనం అయినట్టు. వాడికి కదా అమ్మో, అయ్యో కనపడినట్టు. అంతే గాని, 18 చేతులతో అమ్మ కనపడిదండీ, 4 చేతులతో విష్ణువు కనపడ్డాడండీ. 66 చేతులతోటి శ్రీ కృష్ణుడు కనపడ్డాడండీ! ఇవన్నీ వట్టివే నాయనా!  ఎందుకని? కల్లబోధలు అవి. లేకుండా పోతాయి కొంతకాలానికి. ఏమని? ఆ విగ్రహం ఏమని చెబుతుంది? ఇవన్నీ లేకుండా పోయేవని చెబుతుంది. నువ్వు అక్కడ ఎదురుగుండా కూర్చొని అష్టోత్తరాలు, సహస్రనామాలు, బోల్లెడు చదువుతున్నావు. అందులో నువ్వు అట్లా వున్నావనీ, ఇట్లా వున్నావనీ, అలా చేశావనీ, ఇలా చేశావనీ, స్తుతిస్తున్నావు. ఏమన్నది విగ్రహము? ఏమన్నా అన్నదా? నీ స్తుతులకు ఏ మన్నా స్పందించిందా? నీ సహస్రనామాలకు ఏమన్నా స్పందించిందా? నీ లక్ష కోటి కుంకుమార్చనకు ఏమన్నా స్పందించిందా? ఏమని చెబుతోంది? కదలని దానిని పట్టుకో! అది సంగతి.
            ఇప్పుడు దేనిని గురించి సహస్రనామం చదువుతావు? విగ్రహము గురించి చదువుతున్నావా? నీ గురించి చదువుతున్నావా? పొరపాటు. నీ గురించి నీవే చదువుకుంటున్నావు. కానీ, చిట్టచివరకు ఏం చెబుతోంది? ఆ సహస్రనామం కూడా చివరికి ఏం చెబుతోంది? కదలని స్థితే నాయనా!
            చెప్పాగా మీకు ఇందాకే, ఏదీ తెలియనప్పుడు బాల్యంలో, నిన్ను బాల్యంలో సరియైన దారిలో పెట్టాలి అనంటే అవన్నీ అవసరం. అక్కడి నుంచి మొదలు పెట్టాలి నీకు. ఇవన్నీ ఎప్పుడు నేర్పారు? బాల్యంలో నేర్పారు. అప్పుడు నీకు ఏం తెలుస్తుంది నీకు? ఈ మాట చెప్పానండీ!  ఎట్లా తెలుస్తుంది నీకు? నీకు 8 ఏళ్ళ వయస్సు, 10 ఏళ్ళ వయస్సు పూర్వ కాలంలో విద్యాభ్యాసం ఎప్పుడు?
            (నేనేదో జపం చేసుకునేదానిని, అమ్మవారికి దండం పెట్టుకునే దానిని) ఏమైంది ఇప్పుడు? ఒకటి గుర్తు పెట్టుకోండి. అమ్మ తీసుకెళ్ళడం, అయ్య తీసుకెళ్ళడం లేవు ఇవన్నీ. ఇవన్నీ వట్టి మాటలు. సత్యాన్ని తెలుసుకోనంత వరకూ. నీవే సత్యము. నీలో వున్న ఆత్మ స్వరూపమే సత్యము అనే జ్ఞానంతో నువ్వు శరీరాన్ని విడవాలి. అంతేకానీ అమ్మ తీసుకుపోవడం, అయ్య తీసుకుపోవడాలు ఏమీ లేవు. వట్టివి ఇవన్నీ! 
            ఏమైందట? ఇక్కడొక అంశం ఉందండీ ! అంటే, అట్లా చెబితే తెలుస్తుందా? అట్లా చెబితే అస్సలు తెలియదు. ఇప్పుడు వాళ్లు అరుస్తున్నారు కదా అని మనం కూడా అరిచే చెప్పామండీ ! నీకు ఎట్లా తెలుస్తుంది? (అంటే వాళ్ళు ఇట్లా అరవడం తప్పితే దానికి అర్థం తెలియదు) అంటే అర్థం తెలియదంటే, నీ నిజజీవితానికి అన్వయం చేసుకోవడం లేదు. (అదే మరి) ఆఁ..  ఏమయ్యిందట ఇప్పుడు? అందుకే ఏం చేప్తున్నాడు? బోధించడం కూడా పొట్టకూటి విద్యలు అయినాయి. నీకు వేదాంతంతోటి ఆత్మానుగతమైన జీవితాన్ని, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని పరమాత్మను దృష్టిలో పెట్టుకుని జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడవలసిన విద్య భోజనానికి ఉపయోగపడింది. అయితే ఇక్కడొక అంశం వుంది, జీవికి ఏదో ఒక ఆధారం అవసరమే, ఆహార సంపాదనకు నీకు ఏదో ఒక మార్గం అవసరమే, కానీ అదే సత్యం కాదు.
            ఎట్లా అయితే వీడికి ఇహ లోక విద్యలు సత్యం కావో, పరలోక విద్యలు ఇహలోకానికి ఉపయోగపడుతాయి, ఉపయోగపడకపోవు. కానీ, అదే సత్యమై ఊరుకుంటే భ్రాంతి కలిగింది. అట్లా భ్రాంతి చెందకూడదు. దాని అర్థాన్ని దానికే వదిలెయ్యి. ఆత్మ పరమాత్మ సత్యమైనదనే భావనలో నువ్వు నీ జీవితంలో జీవించు. అప్పుడేమయ్యింది? అంతటా నీకు ఏం కనపడింది? ఆ పరమాత్మయే కనపడుతున్నాడు. ఆ ఆత్మ స్వరూపమే కనబడుతున్నది. అది దేహాత్మగా వున్నా, అంతరాత్మగా వున్నా, పరమాత్మగా వున్నా, సూత్రాత్మగా వున్నా, ఆత్మకు నాలుగు స్థితులున్నాయండీ!  (సూత్రాత్మ అంటే అది ఆఖరు స్థితి). ఇప్పడు అక్కడ మాట్లాడుతున్నది అది. విశ్వమే లేదన్న స్థితిలో వున్నటువంటి స్థితి పేరు సూత్రాత్మ. అలాంటి సూత్రాత్మ దాకా మాట్లాడుతున్నారు అందులో. ఆ మేలుకొలుపులో ఎక్కడి దాకా మాట్లాడుతున్నారు అంటే, నాల్గవ స్థితి, ముందు కిందది దేహాత్మ, అది జీవుడన్నమాట. దానిపైది ఏమిటి? అంతరాత్మ. దాని పైది ఏమిటి? పరమాత్మ. దానిపైది ఏమిటయ్యా? సూత్రాత్మ.
            పరమాత్మ కూడా విశ్వం అంతా వ్యాపించి వున్నాడు. అంతవరకే ఆయన పని. విశ్వమే లేదయ్యా! అప్పుడేమిటి? అది సూత్రాత్మ. లేని ఎఱుక. దాని పేరే లేని ఎఱుక. తెలుసుకునే ఎఱుకే లేకుండా పోయింది. విశ్వమే వున్నది అనేటువంటి స్థితి ఏదైతే వున్నదో అది ఎఱుక. విశ్వమే లేదు అంటే, అది లేనెఱుక. అర్థమైందా అండీ! విశ్వమే లేనిది అయిపోయింది, అప్పుడు ఎఱుకే లేదు. ఎందుకని? ఉంటే కదా గుర్తించడం. విశ్వమే లేదన్నప్పుడు ఇంకేమైనా గుర్తించే అవకాశం వుందా? కాబట్టి, గుర్తు అంటే ఎఱుక. నువ్వు ప్రతీదానిని దేనితో చేస్తున్నావు? గుర్తు తోటే చేస్తున్నావు. ఆ గుర్తే లేకపోతే చెయ్యి చూద్దాం!  కాబట్టి, జీవుడిగా వచ్చినప్పుడు నీలో వున్న బుద్ధి పనిచేస్తోంది. ఆ ఎఱుక ప్రభావం వల్లనే పనిచేస్తోంది. ఆ విశ్వశక్తి యొక్క ప్రభావం చేతనే నీ బుద్ధి కూడా పనిచేస్తోంది. ఆ విశ్వశక్తి ప్రభావం చేతనే నీలో ప్రాణం పని చేస్తోంది.
ఆ విశ్వశక్తి ప్రభావం చేతనే నీలో ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆ విశ్వశక్తి ప్రభావం చేతనే ఇంద్రియాలు చలిస్తున్నాయి. విషయాలు పనిచేస్తున్నాయి. ఆనందం అంటున్నావే, ఆ ఆనందం కూడా ఆ విశ్వశక్తి ప్రభావమే. అంతా ఎఱుక ప్రభావమేనయ్యా! బాబూ!  ఆ ఎఱుక ప్రభావం లేనిది ఏదైనా వుందా? ఏమీ లేదు. కారణం ఏమిటట? ఎఱుక చలిస్తూ వున్నది. విశ్వం చలిస్తూ వున్నది. అర్థమైందా అండీ?
            ఎఱుక అంటే ఏమిటి? చలించేది. బయలు అంటే ఏమిటి? చలించనిది. బయలు అంటే, చలించదు, అచలం. ఎఱుక అంటే, చలించేది. కాబట్టి చలించేవన్నీ ఎఱుక క్రిందకే వస్తాయి. నువ్వు దేనినైనా తీసుకో. అన్నీ చలించేవే, చలించనివి అంటూ ఏమీ లేవు. (మరీ ఎఱుకతో వుండు, ఎఱుకతో వుండు అనేది ఎందుకు)
 ఎందుకంటే ముందు ఇలాంటి జ్ఞానం రావాలి. జ్ఞానం వచ్చి పోవాలి ఎప్పుడైనా సరే! మీరు, పిల్లలు వున్నారండీ! ఆటలు ఆడుతున్నారండీ, ఎందుకు ఆటలు ఆడాలి? జ్ఞానం రావడం కోసం. ఆ ఆటల ద్వారా వాడికి జ్ఞానం కలిగింది. తెలివి పెరిగినాక ఏమైంది? ఆటను వదిలేశాడు. అర్థమైందా? ఆజ్ఞానం లేదా? అయిపోయింది. జ్ఞానం సహజమైపోయింది. ఇంకో తెలివిలోకి వచ్చేశాడు. మళ్ళా పుస్తకాల తెలివి. అది అయిపోయింది. ఇహ ఎంతకాలం చదువుతాడు, పుస్తకాల తెలివి అయిపోయింది. నిజజీవితంలోకి ప్రవేశించేశాడు. నీ జీవితంలో ఇప్పుడు విషయాల మీద ఆధిపత్యం, ఆనందం మీద ఆధిపత్యం కోసం పోరాడుతూ వున్నాడు. ఈ జ్ఞానం వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది. ఇప్పడింకా విషయాలు వున్నాయా? ఏమీ లేవు. ఎందుకని? ఉడిగి పోతూవున్నాయి. వాటి వల్ల జ్ఞానం వచ్చేసింది. అవి రాగానే ఇప్పుడు ఏమంటున్నావు? నాకెందుకు? నా కెందుకు? నాకేమన్నా పనా దాంతోటి? నాకేం పని లేదండి. అవేం నాకు అవసరం లేదండీ! ఎందుకని? అయిపోయింది. చేసేశావు, చూసేశావు, అధిగమించేశావు, ఆ జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా అందులో నేర్చుకోవడానికి ఏం లేదు. (మరి అయినా ఇంకా కొన్ని విషయాలను పట్టుకుని వేళాడుతుంటాం కదా!) అంటే ఇంకా అందులో నీకింకా కొంత బాకీ వుందన్నమాట. అపేక్ష వున్నది. ఇంకా కొత్తదనం వున్నది. ఇంకా నీకు దానిని అనుభవించాలనేటటువంటి బాకీ వున్నదన్నమాట. లోపల ఇంకా గుర్తు చెబుతోంది. ఇంకా నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు. ఇంకా నువ్వు అది చెయ్యాలను కున్నావు కదా! ఇంకా ఇది చెయ్యాలనుకున్నావు కదా! ఇంకా నీకది మిగిలే వుంది కదా! అని చెబుతోంది. ఎన్నింటిలో అయితే మిగలకుండా పోయిందో, అది అధిగమించేస్తావు. అర్థమైందా అండీ!
            ఎన్నింటిలో అయితే మిగల్లేదో, అవన్నీ కూడా అధిగమించేసేయ గలుగుతావన్నమాట. ఇదే గుర్తు దానికి. కాబట్టి ప్రతి చోట ప్రతి దేవాలయంలో కూడా ఆ దేవాలయంలో నువ్వు ప్రవేశించగానే ఈ సత్యాన్ని తెలుసుకో. అని చక్కగా బోధిస్తున్నది. ఏమని బోధిస్తున్నది? ఈ కదిలే విశ్వమంతా కూడా, కదలకుండా పోవలసిందే! ఎప్పటికైనా సరే. నీతో సహా. నువ్వు నేననే భేదం లేదు. నేను నువ్వు అనే భేదం లేదు. ఎవ్వరైనా సరే. అదంతా కూడా కదలకుండా పోవలసిందే. కదిలేదంతా శాశ్వతం కాదు. కదలకుండా వున్నది ఏదైతే వుందో అదే శాశ్వతము. కాబట్టి ఏదైతే కదులుతూ వున్నదో అదంతా ఎఱుకకు సంబంధించిన విభాగము. ఏదైతే కదలకుండా వున్నదో, అదంతా బయలుకు సంబంధించినటు వంటి విభాగము. ఆ బయలు ఏదైతే వున్నదో అదే శాశ్వతము. అదే సత్యము. అదే సనాతనము. దానిని గురించే అన్ని వేదాలు, ఉపనిషత్తులు ఏవి చెప్పినా అంతా ఆ బయలు గురించే. ఆ కదలని స్థితి గురించే. కదలని స్థితే సత్యము అనేటటువంటిదే ఎప్పుడూ కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కదులుతూ చేస్తున్నావు. మనస్సు కదులుతోంది, బుద్ధి కదులుతోంది, ప్రాణం కదులుతోంది, ఇంద్రియాలు కదులుతున్నాయి. విషయాలు కదులుతున్నాయి. సుఖం కదులుతోంది. దుఃఖం కదులుతోంది. పుట్టటం కదులుతున్నావు, మరణం కదులుతున్నావు. అసలు ఆ కదిలిక లేనిదనేది నీ పుట్టుక నుంచి మరణం దాకా ఏదీ లేదు. కాబట్టి ఇదంతా అశాశ్వతం అయినటువంటిది. జననమరణముల జడుపు తీరెను - స్పష్టంగా చెబుతున్నాడు. కదలని దానిని పట్టుకున్నప్పుడు కదలిక నిన్నేం చేసిందయ్యా? నువ్వు దేనిని ఆశ్రయించాలట? ఆ శాశ్వతమైనటువంటి కదలని స్థితిని ఆశ్రయించు. అప్పుడు ఈ కదలికలన్నీ ఏమైపోయినాయట? లేకుండా పోయినాయి. తల్లి గర్భంలో కదలడం మొదలు పెట్టిన దగ్గర నుంచి, పోయిన తరువాత కూడా కదులుతూనే వుంది, ఏది పోయింది? స్థూలం పోయింది, సూక్ష్మం కదులుతూనే వుంది. అది ఎక్కడికి పోయి చచ్చింది? అది కదులుతూనే వుంటుంది. కారణం అలానే కదులుతూ వుంటుంది. మహాకారణం అంతకంటే కదులుతోంది. ఎందుకని? స్థూలంలో వున్నటు వంటి ప్రాణ మనో బుద్ధులు సూక్ష్మం అవి కదులుతూనే వున్నాయి. స్థూలం విడిచిపెట్టిన తరువాత కూడా సూక్ష్మం సూక్ష్మంలోనే వుంటుంది. అది ఎక్కడికి విడిచిపెట్టి వెళ్ళదు. దానికి చావు పుట్టుకలు లేవు. (అది బయటకు వచ్చేసింది, అంతే!) మళ్ళా ప్రాణ మనో బుద్ధులు పంచభూతాల్లో అలాగే వుంటాయి. అవి ఎక్కడికి పోవు. మళ్ళా ఉపాధిని ధరించివేస్తాయి. మళ్ళా శరీరమును ధరించివేస్తుంది. ఇప్పుడు శరీరం పేరు రామలక్ష్మి, ఇప్పుడు శరీరం పేరు జయమ్మ, ఇప్పుడు శరీరం పేరు మరొకటి, ఇప్పడు శరీరం పేరు విద్యాసాగర్‌, మరొకటి ఇంకొకటి. శరీరానికే ఇవన్నీ కాని, ప్రాణ మనో బుద్ధులకు పేర్లు లేవు. నీలో వున్న ప్రాణానికి పేరు వుందా? లేదు కదా! నీలో వున్న మనసుకు పేరు వుందా? లేదు కదా! బుద్ధికి పేరు వుందా? దానికి అంతకంటే లేదు. శరీరానికే పేరు. ఏ ఎవ్వరు చేశారయ్యా అనంటే, నిజంగా చేస్తున్నదేమో ప్రాణమనోబుద్ధులు, శిక్షేమో శరీరానికి వేస్తున్నాం. అర్థమైందా అండీ! అసలు చేస్తుంది ఎవరు? ప్రాణ మనో బుద్ధులు సూక్ష్మం. తప్పంతా ఎక్కడ వుంది ఇప్పుడు ఆ సూక్ష్మంలో వుంది. సమస్యను ఎక్కడ పరిష్కరించాలి? సూక్ష్మంలో పరిష్కరించాలి. స్థూలంలో పరిష్కరిస్తున్నావు, ఏమైంది ఇప్పుడు? నేరం ఒకరికి, శిక్ష ఒకరికి. కారణం ఏమిటట? నిన్ను దానిని ఎవడు ఆశ్రయించమన్నాడు? నీ తెలివి ఏమయింది? నువ్వు తప్పుదారి పట్టే దానిని ఎందుకు ఆశ్రయించాలి? ప్రాణ మనో బుద్ధులను సక్రమంగా నడపాలి కదా! ఎటు నడపాలి? కదలని దానిని ఆశ్రయించమని దానిని నడపాలి. కదిలే సూక్ష్మాన్ని కదలిని స్థితిని ఆశ్రయించమని చెప్పాలి దానికి. కానీ నువ్వేమి చెప్పావు? కదిలే శరీరాన్ని ఆశ్రయించమని చెప్పావు. అర్థమైందా అండీ? ప్రాణ మనో బుద్ధులు ఎందుకు శరీరంలోకి వచ్చాయి అసలు? తమ కదలికను పోగొట్టుకోవడానికి, తమ మూలమైనటువంటి కదలని స్థితిని తెలుసుకోవడం కోసం శరీరంలోకి వచ్చాయి. ఎందుకని? అవి సూక్ష్మంగానే వుంటే తెలుసుకునే తెలివి లేదు కాబట్టి. మరి వాటికి వ్యక్తీకరణ లేదు కదా! అనుభవం లేదు కదా! అనుభవం లేదు కాబట్టి, అనుభవం కావాలంటే శరీరం కావాలి. ఏ అనుభవం కోసం వచ్చాయి? తమ కదలికలను పోగొట్టుకునేందుకు కావలసినటువంటి సాధనమయ శరీరం కోసం, పనిముట్లు కోసం వచ్చినాయి. శరీరం పనిముట్లుగా పనిచేయాలి. కానీ ఏమైపోయింది ఇప్పుడు? శరీరమే సత్యమై కూర్చుంది. అందువల్ల ఏమైపోయింది? అన్ని వాతలు శరీరానికి పెడుతున్నావు. ప్రయోజనము ఏమి వుంది? దీనికే ఉపవాసాలు, దీనికే అన్నీ, అన్నీ దీనికే. ఏమన్నా ప్రయోజనము వుందా? ఏమిటి ప్రయోజనము? ఇంద్రియాలు క్షీణించిపోతున్నాయి. అంతకు మించి ఆ ఉపవాసం వల్ల ఏమీ ప్రయోజనము లేదు. కాబట్టి సాధకుడైన వాడు ఏం చేయ్యాలి? నిత్యోపవాస దీక్షను పట్టవయ్యా! జీవితకాలం దీక్షను పట్టు. ఈ ఒకరోజు, రెండు రోజులు 40 రోజులు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఇలా ఎన్ని పడుతావు? పట్టదలచుకుంటావా? వచ్చావుగా శరీరంలోకి, మళ్ళా పోయే వరకూ పట్టు. ఈ వచ్చిన శరీరం పోయేవరకు, నువ్వు పోవడం అనేది ఎప్పటికీ లేదు. ఎందుకని? ప్రాణ మనో బుద్ధులకే జనన మరణాలు లేవు. నీకు ఎలా వున్నాయి? నువ్వు వుంటే తప్ప ప్రాణ మనోబుద్ధులు పనిచేయవే? నీ ఉనికి వల్లనే ప్రాణమనోబుద్ధులు పనిచేస్తున్నాయి. ఆధారం నేను. ఆధారం ఎప్పుడూ నేను. నా మీద ఆధారపడి ప్రాణమనోబుద్ధులు పనిచేస్తున్నాయి. ప్రాణమనోబుద్ధుల మీద ఆధారపడి శరీరం పనిచేస్తుంది. కాబట్టి ఎవరు పుట్టు పోయే అవకాశం వుంది? శరీరం పుట్టు పోయే అవకాశం వుంది. ఎందుకని? నాకు చావు లేదు పుట్టుక లేదు. ప్రాణ మనో బుద్ధులకు అంతకంటే లేదు. కేవలం పనిముట్లకు వుందయ్యా బాబు. కాసేపు పనిముట్లు వచ్చినాయి. పనిచేసినాయి. పోయినాయి. (మరి శరీరానికి ఎందుకు బాధ కలగాలి? చేసేవి అవి కదా!) బాధ శరీరానికి కాదు. శరీరము నందు వ్యాపించి వున్న ప్రాణ మనో బుద్ధులే గుర్తిస్తున్నాయి. గుర్తించే ఎఱుక, తెలివి దానిది. చీమ కుట్టుందండి. కుట్టింది కాలుని. కాలుకి తెలివి వుందా? కాలుకి తెలివి లేదు. ప్రాణ మనోబుద్ధులు పనిచేస్తేనే. శవానికి చీమలు కుడుతున్నాయండి. ఏం తెలిసింది? (శవానికే కాదు) నిద్రపోతున్నావండి, అసలు నిద్రపోతున్నావు, నిన్నే తీసుకో! ఏం తెలిసింది? ప్రాణ మనోబుద్ధులు పనిచేసినంత సేపే నీకు ఏదైనా తెలిసేది, ఆ ప్రాణ మనో బుద్ధులు పనిచేయక పోతే, ఏమీ తెలియదు. కాబట్టి నీ యందు అనుభవిస్తున్నదంతా ఆ ప్రాణ మనో బుద్ధులే. ఈ శరీరంలో ఇంద్రియాలనే పనిముట్లను ఉపయోగించి, అనుభవాన్ని సంపాదిస్తున్నదంతా ఆ ప్రాణ మనో బుద్ధులే. శరీరం కాదు. ఈ శరీరం కేవలం పనిముట్టు. గిన్నె లాంటిదది. గిన్నె లాంటిది అంటే, గిన్నె తప్ప దాంట్లో ఏమీ లేదు. గిన్నె అన్నం అవుతుందా? ఎప్పటికీ అవ్వదది. నువ్వు ఎన్ని సార్లు దానిని పొయ్యలో పెట్టినా, లోపల బియ్యం వుడకనిదే గిన్నె అన్నం అవుతుందా? గిన్నె అన్నం అవ్వదు కదా! ఆ ప్రాణ మనో బుద్ధులు లేనిదే ఈ గిన్నెకు ఏమిటి ప్రయోజనము? కానీ ప్రాధాన్యత అంతా దేనికి ఇచ్చావు ఇప్పుడు? గిన్నెకి. పోయే! అక్కడ పోయిందన్నమాట. నువ్వు పనిముట్టుకు ప్రాధాన్యత ఇచ్చి, పనిముట్టును రాజును చేశావు. నీ ప్రాణ మనో బుద్ధులు అసలు దేనిని తెలుసుకోవాలట ముందు? దానికి ఆధారమైన నేనును తెలుసుకోవాలి. ఆ నేను పరమాత్మను తెలుసుకోవాలి. చూడండి. ఎట్లా వుందో రహస్యం. నేను అనే అంతరాత్మ. నేను అనేది ఏమిటి? అంతరాత్మ. అది ప్రాణ మనో బుద్ధులను ఆజ్ఞాపించే సామర్థ్యం వున్నటువంటిదన్నమాట అది. ఎందుకని? ఆ నేను వుంటే తప్ప ఈ ప్రాణమనోబుద్ధులు పనిచేయవు. అంతరాత్మ వుంటే తప్ప ఈ ప్రాణమనోబుద్ధులు పనిచేయవు. ఆ అంతరాత్మ ఏమి తెలుసుకోవాలట? పరమాత్మను తెలుసుకోవాలి. అంతరాత్మ ఈ ప్రాణ మనో బుద్ధులని పనిముట్లుగా వాడుతోంది. ఆ ప్రాణ మనో బుద్ధులు శరీరాన్ని పనిముట్టుగా వాడుతున్నాయి. ఈ అంతరాత్మ దేని నిమిత్తం ఈ రెండిటిని పనిముట్టుగా వాడుతోందయ్యా అని అంటే, పరమాత్మను తెలుసుకునే నిమిత్తమే వాడుతోంది. కానీ ఏమైపోయింది? ప్రాణ మనో బుద్ధులు శరీరాన్ని ఆశ్రయించగానే, ఈ అంతరాత్మతో సహా, శరీరమే సత్యమనే భ్రాంతిలో కూరుకుపోయాయి. పరమాత్మ భావాన్ని మరచిపోయి, ఈ శరీరం నేను ఎందుకు తెచ్చుకున్నాను అసలు? శరీరం తెచ్చుకున్నాననే భావనే లేకుండా పోయింది. శరీరమే నేనైపోయింది. (అంతరాత్మ నేనుకు సంబంధం లేదని అంటున్నాడుగా) ఎందుకని అంటున్నాడు? అందులో రెండు భాగాలున్నాయి. శరీరంతో కలిసి పనిచేసే భాగం ఒకటి వుంది, సాక్షి భాగం ఒకటి వుంది. అదే అంతరాత్మలో వ్యవహరించడం కోసమని, సగభాగమేమో చైతన్య భాగం శరీరంలో కలిసి పనిచేస్తోంది. అందులోనే సాక్షి భాగం ఒకటుంది. అదేమో గమనిస్తూ వుంది. గమనించే సాక్షి ఏమైపోయాడు? గుర్తించకుండా పోయాడు. కాబట్టి ఏమైపోయింది? శరీరంతో కలిసిపోయినటువంటిదే సత్యమైపోయి, ఈ శరీరంలో ఇంద్రియాలు పనిచేసేదే సత్యమైపోయి, స్థిరమైపోయి వున్నది అన్నమాట. అలా ఎప్పుడైతే స్థిరమైపోయి వున్నదో, చివరకి ఏమైంది? శరీరమే సత్యంగా మారిపోయింది. అట్లా శరీరమే సత్యం కాకుండా వుండాలి అంటే, నీవేం చెయ్యాలయ్యా? నీవు ఈ సత్యాన్ని గ్రహించు. శరీరం తెచ్చుకున్నా నేను. మళ్ళా శరీరం విడిచి పెడుతాను. ఒక పని నిమిత్తమై ఒక పనిముట్టును తెచ్చావండి మీ ఇంట్లో. పని కాగానే తీసిపడేస్తున్నావు అంతేనా? కాదా? అట్లాగే పరమాత్మను తెలుసుకునే నిమిత్తమై, అంతరాత్మ ఈ పనిముట్టును తెచ్చుకున్నదండి. ఆ పనిముట్టుతో పని అయిపోయింది. విసిరి అవతల పారేసింది అంతే. దానికేమీ లెక్క, జమా లేదు. ఎందుకని? ప్రాణ మనో బుద్ధులు అంటేనే లెక్క జమా లేదు దానికి. సూక్ష్మం అంటేనే లెక్క, జమా లేదు దానికి. ఎందుకని? నేను వుంటేనే సూక్ష్మం పనిచేస్తుంది. నేను లేకపోతే సూక్ష్మం పనిచేయదు. నేను సర్వసాక్షిని. నేను ఆత్మస్వరూపుడిని. నీ అంతరాత్మయే లేకపోతే ఆ ప్రాణ మనో బుద్ధులు పనిచేయలేవు. నీ అంతరాత్మ ఆధారం. ప్రాణ మనో బుద్ధులు ఆధేయము. ఆశ్రయము అన్నమాట. ఆశ్రయము ఎవరు అంతరాత్మ. దానిమీద ఆధారపడి వున్నది ఏదీ? ప్రాణ మనో బుద్ధులు. ప్రాణ మనో బుద్ధులు ఆధారము. దాని మీద ఆధారపడి వున్నది ఏది? శరీరం. కాబట్టి ఏది ఆధారమో దానిని ఆశ్రయించాలి. ఈ మూడింటికి కూడా ఆధారమేది? పరమాత్మ. ఈ మూడు ఎవరిమీద ఆధారపడి వున్నాయి? పరమాత్మ మీద ఆధారపడి వున్నాయయ్యా బాబు.
            పరమాత్మ మీద అంతరాత్మ ఆధారపడి వున్నది. అంతరాత్మ మీద ప్రాణ మనో బుద్ధులు ఆధారపడి వున్నాయి. ప్రాణమనోబుద్ధుల మీద శరీరం ఆధారపడి వున్నది. ఇప్పుడు మనం అసలు ఎవరిని పట్టుకోవాలయ్యా? పరమాత్మను పట్టుకోవాలి అసలు. లెక్క ప్రకారం నువ్వు శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నావు? ఆ పరమాత్మ స్థితిని తెలుసుకోవడం కోసమని శరీరం తెచ్చుకున్నావు. కానీ దేనిని పట్టుకున్నావు? పనిముట్టును పట్టుకున్నావు. పనిముట్టే నువ్వు అంటున్నావు. ఇంతకంటే అజ్ఞానం ఏమైనా వుందా? నీదైనటువంటి స్వస్థితి, స్వరూపజ్ఞానం ఏమిటి? అంతరాత్మ. ఆ స్వరూపజ్ఞానంలో ఏమైవున్నావు? నేను ఆత్మస్వరూపుడునై వున్నాను. అని ఎప్పుడైతే గుర్తెరిగావో, అప్పుడు నీ చేతిలో పనిముట్లు అయిపోయినాయా లేవా? ఇవన్నీ? ప్రాణ మనో బుద్ధులు పనిముట్లు అయిపోయినాయి. శరీరం పనిముట్టు అయిపోయింది. నేను ఎవర్ని? నేను ఆత్మస్వరూపుడిని. ఇప్పుడు ఏం చెబుతోంది? ప్రాణ మనోబుద్ధులు ఇట్లా చేయి, అట్లా చేయి అని నీకు సూచన చెబుతున్నాయే, అలా పో, ఇలా పో అంటుందే లోపల నుంచి, అవి ఏమిటి? ప్రాణ మనో బుద్ధులు. నేను ఎవరిని? నేను ఆత్మ స్వరూపుడిని. నేను గమనించే వాడను. వాటిని గమనిస్తున్నాను. ఓహో! ఇప్పుడిది చేయాలా వద్దా? ఆత్మ స్వరూపుడు గమనించడం. ప్రాణ మనో బుద్ధులు చేయమని ప్రేరణ. (చేయించడం) ప్రేరణ. శరీరం చేయడం. శరీరమేమో చేయడం. ప్రేరణేమో ప్రాణ మనో బుద్ధులు. గమనించే వాడు అంతరాత్మ. ఇప్పుడు ఎక్కడ వుండాలి నువ్వు అసలు? గమనించేవాడి స్థానంలో వుండాలి. కానీ ఎక్కడికి వచ్చేశావు? ప్రేరణలోకి వచ్చేశావు. ఇంకేంచేశావు? చేతలోకి వచ్చేశావు. ఇప్పుడేమైంది? అంతరాత్మ అసలు ఏమన్నా చేస్తోందా? చెయ్యడం లేదుగా. ఏం చేసినా ఎవరు చేశారు? శరీరం చేస్తోంది. కాబట్టి వాతలు ఎవరికి పెట్టాలి? శరీరానికే పెట్టాలి. అందుకని శరీరానికే శిక్ష వేస్తున్నాము. కనీసం అట్లానైనా తెలుస్తుందేమోనని? కానీ అజ్ఞాన పూర్వకంగా చేస్తున్నావు కదా ఎలా తెలుస్తుంది? శిక్షణను ఇవ్వాలి. శిక్ష వేస్తే లాభం లేదు. Training ఇవ్వాలి దానికి. శిక్షణను ఇవ్వాలి. దానికి అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేసి నేను ఆత్మస్వరూపుడను అని స్థిరపడాలి కాని, నేను దానిని నిలువునా కోదండం వేయిస్తానండి, తలక్రిందులుగా వ్రేళాడుతానండి, ఒంటికాలు మీద నిలబడుతానండి... ఇవన్నీ ప్రయోజనము లేదు నాయనా! ఇవన్నీ శిక్షలు. ఈ శిక్ష వేస్తే ప్రయోజనము వుందా? ఈ శిక్ష వేస్తే ప్రయోజనము లేదు. శిక్షణను ఇవ్వాలి. ఇంద్రియాలకు శిక్షణను ఇవ్వాలి. ప్రాణ మనో బుద్ధులకు శిక్షణను ఇవ్వాలి. నేను ఎవరిని? నేను ఆత్మస్వరూపుడిని. నేను గమనించే వాడను. నేను మేల్కొని వున్నంత సేపు కూడా నీవు ఏమీ చేయజాలవు. ఎలాగ? నువ్వు ఎట్లా అయితే మేల్కొని వుంటే, కుక్క ఎట్లా అయితే ఇంట్లోకి రాదో, ఈ ఉపమానం ఎందుకు చెబుతున్నాడు? కుక్కకు వాసనాబలం చాలా ఎక్కువ. అది ఎక్కడ వున్నా కూడా వంటింట్లో వున్నటువంటి ఆహారపదార్థాన్ని తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది కుక్క అన్నమాట. అలాగే మనప్రాణమనోబుద్ధులు కూడా దేనికి వశమై పనిచేస్తున్నాయట? వాసనాబలానికి లోనై పనిచేస్తున్నాయట. అంతరాత్మ వాసనాబలానికి లోనయ్యే అవకాశం లేదు. ఎందుకని? అది సాక్షి స్వరూపము. వాసనాబలానికి ఏది లోనై వున్నదట? ప్రాణ మనోబుద్ధులు లోనై వున్నాయి. ఆ వాసనాబలమే వ్యక్తీ కరించినప్పుడు మూడు గుణాలు అయినాయి. అర్థమైందా అండి?
            వాసనాబలం అంటే ఏమిటయ్యా? శరీర వాసన (దేహవాసన), శాస్త్ర వాసన, లోక వాసన. ఏం చేసిన నీ జీవితమంతా, ఈ మూడింటి కోసమే. పెళ్ళి చేసుకున్నావండి, దేని కోసం? దేహవాసన? శాస్త్ర వాసన? లోకవాసన? మూడు కనపడుతన్నాయా? లేదా? శరీరానికి సుఖం కావాలంటావా? దేహవాసన. కాదండి లోకం కోసం, సృష్టి పునరుత్పత్తి కార్యంలో భాగం కోసం అంటావా లోక వాసన. కాదండి, శాస్త్రార్థం మేరకు ఐదురోజు పెళ్ళి చేశానండి అంటావా? శాస్త్ర వాసన. కాబట్టి ప్రతిపనిలో కూడా ఏమున్నాయి? ఈ మూడు వున్నాయా? లేవా? లేనిది ఏదో చూపెట్టు? (వాసన త్రయం అంటే అదే) ఇదే వాసనాత్రయం అంటే. అర్థమైందా అండి? వాసనా త్రయం అంటే ఏమిటి? శాస్త్రవాసన, లోక వాసన, దేహవాసన.
            నిద్రపోతున్నావండి, నిద్రపోయే పనిని తీసుకో. నిద్రపోయే పనిలో ఏమున్నాయి? వుందా లేదా దేహవాసన? ఎందుకని నిద్రపోకపోతే దేహం పనిచేయదురా బాబు. విశ్రాంతి లేకపోతే దేహం పనిచేయదురా నాయనా! అనే భావం చేత లోపలికి పోయావనుకో అది దేహవాసన అయ్యింది. నేను ఆత్మస్వరూపుడిని అని గమనిస్తూ, నిద్రను కూడా నేను గమనించేవాడను, నిద్ర ఇంద్రియాలకే కాని, నాకు కాదయ్యా! నిద్ర ఇంద్రియాలకే కాని, నాకు కాదు. నేను ఆత్మ స్వరూపుడను. అవస్థాత్రయానికి సాక్షిని అనే పద్ధతిలో నిద్రలోకి వెళ్ళావయ్యా! అప్పుడు ఏమయ్యింది? నిద్రకూడా జ్ఞానమే అయ్యింది. అదే పద్ధతిలో మరణంలో కూడా వుంటావు. మరణం ఎవరికయ్యా? ఇంద్రియాలకయ్యా. నాకు కాదు కదా! నేను సాక్షిని కదా! మరణానికి కూడా సాక్షిని. పుట్టుకలో సాక్షిగా వున్నవాడిని, మరణంలో సాక్షిని కాదా! ఎందుకని? నేనే లేకపోతే శరీరం ఎట్లా ఏర్పడింది తల్లి గర్భంలో? ముందు ఏది ఏర్పడింది తల్లి గర్భంలో? నేను వున్నాను. జీవుడనే నేను వుండబట్టి, నాకు ఆధారం ఆశ్రయం కావలసినదాన్ని నేనే కుమ్మరి  పురుగు వలె, ఆ సాలె పురుగు వలె, ఈ ఇల్లు అట్లా అల్లాను. సాలె పురుగు అల్లడంలేదా? అల్లుతోంది గూడుని. అట్లాగే నేను నాకు కావలసిన జీవితం, భవిష్యత్తులో నా అనుభవానికి ఎలాంటి ఇంద్రియాలు కావాలో, అటువంటి ఇంద్రియాలను తల్లి గర్భంలో అల్లుకున్నాను. సాలె పురుగును ఊరికే ఉదాహరణ చెప్పడం లేదండి జీవుడికి. ఆ సాలెపురుగు ఎట్లా అయితే, తనలో నుంచే ఆ దారాన్ని తీసి తన గూడును అల్లుకుని, అందులోనే వుండి, ఆహారాన్ని అందులోనే సంపాదించుకొని అక్కడే చస్తుంది. ఆ సాలెపురుగు అదే. జీవుడు కూడా అంతే. తల్లి గర్భంలో వున్నటువంటి జీవపదార్థాన్ని వుపయోగించుకుని, తనలో వున్నటువంటి శక్తిని ఉపయోగించి, ఆ ఇంద్రియాలను నిర్మించింది. నిర్మించిన ఇంద్రియాలలోనే జీవుడు అలాగే వుంది. అక్కడే ఆహారాన్ని సంపాదించుకుంది. అక్కడే ఆనందాన్ని సంపాదించుకుంది. అదే సత్యమనుకుంది. అక్కడే చనిపోయింది. ఇప్పుడు మానవ జీవితం, శరీరమే సత్యమంటే, దేనితో సమానంగా జీవిస్తున్నావు? సాలెపురుగువలె జీవిస్తున్నావయ్యా! అదే గూటిలో చిక్కుకుని జీవిస్తున్నావు. ఎవ్వరూ నీకు జైలు సృజించలేదు. ఎవ్వరూ నీకు బంధాలు సృజించలేదు. ఎవ్వరూ నీకు కష్టాలు కలిగించడంలేదు. ఎవ్వరూ నీకు దుఃఖాలు కలిగించడంలేదు. నీ జీవితం అంతా ఇతరులను నిందించినది అంతా వట్టి వృధా. ఇతరులు ఎవరూ కారణం కానే కాదు. ఎందుకని? నువ్వు ఈ సాలె పురుగు వలె జీవిస్తున్నావు. తల్లి గర్భం నుంచి మరణం వరకూ కూడా నీ జీవితం సమస్తం అదే సాలెపురుగు వలె వాసనాబలంతో జీవిస్తున్నావు. ఆ దేహవాసనాబలం ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు. మానవుడివి అయినా కూడా. ఎక్కడ క్రిమి కీటకాదులలో వున్నటువంటి సాలె పురుగు? ఎక్కడ మానవుడు? 84 లక్షల జీవరాశులలో అంతకంటే ఉత్తమమైనటు వంటి జన్మలు ఎన్నో అనుభవించి, ఆ నాటి క్రిమి కీటక దశను ఇంకా వదులుకోలేకపోతివే. చూడండి. మానవుడిగా ఏం ప్రయోజనము? ఇంత ఉపాధి, ఉత్తమమైన ఉపాధి కలిగి, ఏమైనా ప్రయోజనము కలిగిందా? ఏమీ ప్రయోజనము లేదు కదా! తల్లి గర్భంలో ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయి అనేటటువంటి జ్ఞానమే లేదు. ఆ ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయి? ఆ సాలెపురుగు ఎట్లా అయితే నిర్మిస్తుందో అట్లా ఏర్పడుతున్నాయి. అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుండి. అందులోనే తన ఆహారాన్ని సంపాదించింది. నువ్వు కూడా అలాగే చేస్తున్నావయ్యా! అని నీ ఆనందమంతా బయట నుంచి రావడం లేదు. నీ యందే వున్నది. ఆ ఆనందం ప్రతిబింబిస్తున్నది. ఈ పూట మజ్జిగ పులుసులో ప్రతిబింబిస్తే, రేపు ఉలవచారులో ప్రతిబింబిస్తుంది. అంతకు మించి ఏముంది తేడా? నీ యందు ఆ ఆనందమనే స్థితే లేకపోయినట్లయితే వున్నదా ఇంకేమైనా కానీఅలాంటిది ఏమీ లేదు కదా! అందువల్ల ఏం జరుగుతోంది ఇప్పుడు? కాబట్టి ఆ క్రిమి కీటక జంతువు అవస్థ నుంచి, నువ్వు పరిణామం చెందాలి. ఈ ఉత్తమమైనటువంటి మానవ ఉపాధిని ఇవ్వడమే పరమాత్మ చేసేటటువంటి మొదటి, ఆఖరి సహాయం. ఇంతకు మించి ప్రత్యేకంగా నీ లలితా సహస్రనామాలకో, విష్ణు సహస్రనామాలకో, నీస్తుతిలకో, స్తోత్రాలకో ఆయనేదో పొంగిపోయి ఇచ్చేటటువంటింది ఏమీ లేదు. ఆయన ఇవ్వడం ఒకటే సారి ఇచ్చేశాడు. ఏమిటి? మానవ ఉపాధిని ఇచ్చేశాడు. ఉత్తమమైనటువంటి జన్మను ఇచ్చేశాడు. ఆ ఉత్తమమైనటు వంటి జన్మను సద్వినియోగ పరచుకోవడమే నీ పని. కానీ ఇది తెలియక ఏం చేస్తున్నావయ్యా అంటే, బాల్యంలో ఎట్లా అయితే కామ్యక కర్మలు, కోరికతో చేయటం, కోరిక కొరకే చేయడం అనేటటువంటి అజ్ఞానావస్థలో ఎట్లా అయితే వున్నావో, జీవితకాలం అక్కడే ఆగిపోయావు. అక్కడే వుండిపోయావు. ఎవరుండమన్నారు? ఒక్కొక్కటి జీవనదశలలో ఎట్లా అయితే, దాన్ని చూస్తూ, ఆ జ్ఞానాన్ని పొందుతూ, అధిగమిస్తూ, బాల్యం నుంచి ఎట్లా అయితే పరిణామం చెందుతూ వచ్చావో, అట్లా నీవు పరిణామం చెందాలి కదా! అన్నింటినీ వదులుకోవాలి కదా! వదులుకోకుండా ఎందుకువున్నావు? ఆ వదులుకోలేక పోవడం అనేటటువంటి, నిగ్రహం లేదన్నమాట. అందుకని ఏం చెప్పారు? సాధన సంపత్తి, సాధన చతుష్టయం అనే నాలుగు సంపదలు వుండాలంట. నీ ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే, నీకు సాధన చతుష్టయ సంపత్తి వుండాలి నాయనా! ఎందుకని? (సాధనాచతుష్టయ సంపత్తి సంపాదించిన తరువాతే వేదాంతం చెప్పమన్నారండి) కానీ ఎందుకు ముందు చెప్తున్నామంటే, దీని ఔన్నత్యం తెలియదు కదా! నీకు direct గా సాధన చతుష్టయ సంపత్తి చెప్తామే అనుకోండి, ఎందుకయ్యా నాకిది? ఏం చేసుకోను? అంటావు కదా! అందుకని, నువ్వు ఎందుకని సాధనాచతుష్టయ సంపత్తి సంపాదించాలో ముందు ఆత్మ విచారణ చెప్పాలి. చెబితే ఏమయ్యిందట? ఇప్పుడు నీకు తెలిసింది. ఓహో! జీవితంలో ఇప్పటి వరకూ ఏం కోల్పోయాను నేను? ఇప్పటి వరకూ సంపాదించింది ఏమైనా నావేనా అవి? అవేవీ నావి కాదు. మరి నీవైనవి ఎవయ్యా? నీవంటు కొన్ని సంపాదనలు సంపాదించవచ్చు. ఏమిటయ్యా అవి? అవి సాధన చతుష్టయ సంపత్తి. ఆ నాలుగు సాధనాలు కనుక, నీ దగ్గర కనుక వుంటే, వాటితో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఈ జ్ఞానం మరణంలో కూడా పోకుండా నిలబడుతుంది. ఎలా నిలబడుతుందయ్యా? ఇంతకు ముందు జన్మాంతరంలో అనేక జీవులలో జంతు శరీరాలలో నువ్వు పరిణామం చెందుతూ, మార్పు చెందుతూ వచ్చావు కదా! అట్టి పరిణామం చెందినటు వంటి జంతు జ్ఞానం వుందా పోయిందా? వుంది కదా!  వుంటేనే కదా! నువ్వు మానవుడిగా ఇన్ని చేయగలిగావు? లేకపోతే నిన్ను బోర్లా వేసింది ఎవరు? నిలబడేటట్టు చేసింది ఎవరు? మాట్లాడేటట్టు చేసింది ఎవరు? అవన్నీ ఎవరు నేర్పించింది? ఎవరూ నేర్పే అవకాశం లేదు, నీలో సహజంగా పూర్వ జన్మాంతరం నుంచి ప్రాప్తించిది అది. కాబట్టి జ్ఞానం శరీరం పోయినా నిలబడుతుందని తెలిసింది కదా! మరి అట్టి జ్ఞానాన్ని నిలబెట్టుకో. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయి. ఎంత ప్రయత్నం చేసినా నష్టం ఏముంది? మధ్యలో పోతే పోతుంది ఈ ఉపాధి. వచ్చేజన్మకైనా ఉపయోగపడుతుంది ఆ ఆత్మవిచారణ జ్ఞానం. ఎక్కడికి పోదు. కాబట్టి జ్ఞానంలో ఎంతమేరకు కృషిచేసినా దాని వల్ల నష్టం లేదయ్యా! నిరాశ పడమాకు. అయ్యో! వృద్ధాప్యం వచ్చేసిందే, అయ్యో! ఇంద్రియాలు బలహీనపోయినాయే, అని నిరాశపడమాకు. ఈ చివరి కాలంలో అయినా కాని కనీసం కృషి చేయి. నీకు సాధ్యమైనంత మేరకు కృషిచేయి. వచ్చే జన్మలో ప్రారంభం నుంచే మొదలు పెడుతావు. ఆదినుంచే ఆస్థితిలో నిలబెడుతావు. అప్పుడు ఏమౌతుంది? ఆ జన్మతో కడతేరిపోతావు. కనీసం ఈ జన్మ పోయిందని దుఃఖపడమాకు, జన్మ దేనికి? శరీరానికి కానీ నీకు కాదు. ఈ పనిముట్టులో శక్తి అయిపోయింది అనుకుంటున్నావేమో? ఏం కంగారు పడమాకు. బోడి పనిముట్లు పోతే వస్తాయి. ఎక్కడికి పోతాయి? ఈ పంచభూతాలతో ఏర్పడ్డాయి, ఈ పంచభూతాలతోనే పోతాయి. మళ్ళా ఈ పంచభూతల్లోనే ఏర్పడుతాయి. ఎక్కడికి పోతాయి? (ఇంత తెలివి వుండాలి కదా! పుట్టిన దగ్గర నుంచి) అదే నీకు చెప్పింది. ఆ ఎలా వస్తుందో చెబుతుంది అదే. ఆ జ్ఞానం నీతో పాటుగా, నీ ప్రాణ మనో బుద్ధులతో పాటుగా సూక్ష్మంలో వుంటుందన్నమాట. అదే సూక్ష్మం మళ్ళా శరీరాన్ని ధరించేటప్పుడు ఈ జ్ఞానంతో వచ్చేస్తుంది మళ్ళా. ఎందుకని అంటే? ఎప్పుడంటే, అందుకే చెప్పేది... అంతకాలేచ మాం ఏవ స్మరణ్‌ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం నన్ను కచ్చితంగా చేరుతావు. నువ్వు కనుక మరణకాలంలో కనుక నన్నే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే. నన్ను గుర్తు పెట్టుకో అంటే, నన్ను అంటే ఎవరు? శ్రీ కృష్ణుడు కాదు, విశ్వరూపం 36 చేతులు కాదు. నేను అనే ఆత్మ స్వరూప జ్ఞానం. పరమాత్మ జ్ఞానం. ఆత్మ పరమాత్మలకు సంబంధించిన జ్ఞాన స్థితిలో కనుక నువ్వు మరణాన్ని విడిచిపెట్టినట్లయితే, మరణంలో విడువమంటున్నాడు శరీరాన్ని. నువ్వు శరీరాన్ని విడుస్తున్నావు అంతే. ఏమీ అవ్వడం లేదు అంతకు మించి. రోజు వస్త్రాన్ని విడిచి, నూతన వస్త్రాన్ని ఎట్లా అయితే ధరిస్తున్నావో, అట్లా శరీరాన్ని విడిచి ఇంకో శరీరాన్ని ధరిస్తున్నావనేటటువంటి, సాక్షిగా వుండేటటువంటి ప్రయత్నం మరణంలో ఎప్పుడైతే నీకు వున్నదో, అప్పుడు ఏమయ్యావు? అదే సాక్షిత్వజ్ఞానంతో మరల వచ్చేసింది ఉపాధి. ఇప్పుడు ఏమయ్యావు? నీకు అదే ఆఖరి జన్మ. Finish. దాంతో అయిపోతుంది జనన మరణాలు లేకుండా దాటిపోతావు. అట్టివారికి అన్నీ సాధ్యమే. కాబట్టి అలాంటి స్థితి నీకు రావాలి అంటే, ఈ సాధన చతుష్టయ సంపత్తి వుండాలయ్యా. ఇది నిజమైనటువంటి సంపద. ఎందుకని? ఈ సంపద మరణకాలంలో ఉపయోగపడుతుంది. నీవు ఇప్పటి వరకూ చేసినవన్నీ మరణకాలానికి ముందే వదిలేసినాయి. ఎందుకని? చిన్న నిద్రలోకి పోతేనే నిలువనటువంటి సంపదలు పెద్ద నిద్రలో ఎక్కడుంటాయి? తెలివి తప్పగానే, ప్రాణం కూడా పోవక్కర్లేదు, తెలివి తప్పగానే, నువ్వెక్కడో, నీ శరీరమెక్కడో, నీ బంధుగణం ఎక్కడో, నీ సంపదలు ఎక్కడో, నీ వగైరాలన్నీ ఎక్కడో. నీదంతా వెళ్ళిపోయింది అంతే ఒక్క దెబ్బకి. రెప్పపాటులో గతించిపోయింది అంతే. తీసుకెళ్ళడానికి అవకాశం లేదు అంతే. మళ్ళా పేజీ తిప్పే అవకాశం లేదు అక్కడ. మరి దీని కోసం ఎంతో విలువైనటువంటి 100 సంవత్సరాల జీవితాన్ని వృధా చేశావే, ఒక్కసారి ఆలోచించు. మనం పావలా వృధా అయ్యిందని దుఃఖపడుతున్నావే, అయ్యయ్యో! ఎంత విలువైన జీవితం పోతోంది అని దుఃఖ పడటం లేదే, ఎవరు అజ్ఞాని? ఆలోచించండి? తోటకూర కట్టకోసం వాడితో పావలా బేరం ఆడుతావే, అయ్యో! జీవితం పోతోందే! జ్ఞానం లేకుండా పోయిందే, అజ్ఞానం వచ్చిందే, నలభై ఏళ్ళు, యాభై ఏళ్ళు గడిచిపోయినాయే, ఏనాడో, ఈనాడో మరణం ఎప్పుడొస్తుందో, ఏనాడు ఈ జీవితం పరిసమాప్తం అయిపోతుందో, పొందవలసినది పొందలేకపోయావే, అయ్యయ్యో! ఎంతో విలువైన మానవ ఉపాధి నేలపాలు అయిపోయిందే! ఎన్నో జన్మలు, ఎన్నో లక్షల సంవత్సరాలు జంతువు ఉపాధుల్లో తిరిగి తిరిగి తిరిగి తిరిగి అన్ని లక్షల సంవత్సరాలపాటు పరమాత్మను వేడుకుంటే, పరమాత్మ ఇచ్చిన దయతో వచ్చిన మానవ ఉపాధి కదా ఇది. అన్ని లక్షల సంవత్సరాలపాటు చేసిన శ్రమ, చూడండి. పావలా కోసం వృధా అయిపోతుందే. వెల లేనటువంటి ధనం కోసం, దానికి వెల ఎలా వచ్చింది? మనం ఇస్తే వచ్చింది. దానికి ఏం విలువ వుందండి? మనం ఈనాడు చెప్తున్నటువంటి విలువైన వస్తువులు, ఎవరిచ్చారు వాటికి? విలువ ఎలా వచ్చింది? నువ్వు ఇచ్చావు. ఆపాదించావు దానికి. పరమాత్మ ముందు అవి ఏ మూలుకు? ఈ విశ్వం ముందు ఏ మూలకు అవి? ఆ విశ్వానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందితే, పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి అర్హత వున్నటువంటి ఉపాధి లభించింది. పనిముట్లు లభించినాయి. కానీ ఆ పనిముట్లతోటి ఏం చేస్తున్నావు?     కంట్లో ఆపరేషన్‌ చేయడానికి సాధ్యమైన సునిశితత్వం వున్నటు వంటి పనిముట్టుతో, బీరకాయలు తరుగుతుంటివి.  ఏమిటయ్యా అని అంటే, నాకు ఇదే వచ్చు అంటుంటివి. ఇంతకన్నా అజ్ఞానం ఏమైనా వుందా? ఇప్పుడు దేనికోసం బాధపడుతావు? దేని కోసం దుఃఖిస్తున్నావు? అర్థం వుందా ఏమైనా నీ దుఃఖానికి. ఒకసారి ఆలోచించు? దుఃఖం కలిగినప్పుడల్లా ఈ మాటలు గుర్తుకు రావాలండి. అయ్యో! నా జీవితం వృధా అయిపోంది. దుఃఖం కలుగగానే ఈ మాటలు స్ఫురించాలండి. దుఃఖం కలిగిందంటే అజ్ఞానం వుంది, అహంకారం వున్నది. పోయింది. అయ్యో! పోయిందిరా బాబు. ఇంతకాలం ఎన్నో సంవత్సరాల పాటు, ఈ నలభై ఏళ్ళు, యాభై ఏళ్ళపాటు జీవితం అంతా ఇలాగే కదా పోయింది. ఈ వెల లేనటువంటి అంశాల కోసం, ఎందుకూ కొరగాని అంశాల కోసం, దుఃఖించితినే.
            ఒక మనిషి బాధ పెడుతన్నాడు, అతని చేత నేను బాధించబడుతున్నాను అనేదే కదా!  అతను ఎక్కడున్నాడు? నేను ఆత్మస్వరూపుడను. అంటే నేను అంతటా, సర్వత్రా వ్యాపించి వున్నవాడను. అతనిలో వున్న అంతరాత్మ ఎవరు? నేనే. పరమాత్మ ఎవరు? నేనే. ఏం తేడా వుంది? శరీరం తేడా వుంది. అంతే కదా! ప్రాణ మనో బుద్ధులు? ఒకటే. ఏం తేడా వచ్చింది? గిన్నె తేడారా బాబు. అంతకు మించి ఏమీ లేదు. ఈ గిన్నె ఆ గిన్నెను ఎలా బాధించింది? (నన్ను కాదు అనుకోవడమేనా?) నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా విను. మీ ఇంట్లో బోల్డు గిన్నెలు వున్నాయండి. ఈ గిన్నె ఆ గిన్నెను బాధించగలిగిందా? (అలా అనుకున్న మనసు ఊరుకోవడం లేదు కదా! మరి) అంటే అర్థమేమిటి అక్కడ? ఏదో ఒక వాసనకు లొంగింది అది. ( అది కాదు ఎవరన్నా వచ్చి ఏమన్నా అన్నారనుకోండి, ఆ మాటకు ఈ మనసు నన్ను కాదు అనుకోవడం లేదు) విను చెబుతా విను స్పందిస్తోంది అక్కడ. ఎలా స్పందిస్తోందంటే, దేహవాసనకు లోబడి స్పందిస్తోంది. ఎందుకని? ఈ పెద్దగిన్నె వచ్చి ఆ చిన్న గిన్నెను కొట్టుకుందండి. గిన్నెలు సర్దుకునేటప్పుడు గిన్నెలు కొట్టుకుంటున్నాయా? కొట్టుకోవడం లేదా? ఏమన్నా గిన్నె దుఃఖపడిందా? దుఃఖపడిందా? దానికి ప్రాణం లేదుగా. ఎందుకు అనుకుంటున్నావు? నీకు కనపడడం లేదు అంతే. నీకున్న ప్రాణం నీకు వున్నట్లుగా దాంట్లో లేదు అంతే. దాంట్లో వుండే చైతన్యం దానికి వుండబట్టే దానికి గిన్నె అనే ఆకారం వుంది. లేకపోతే ఆకరం ఎట్లా వుంది? అంతేకదా! ఆ గిన్నె అనే ఆకారం చెడకుండా వుంచేటటువంటి శక్తి లోపల లేకపోతే గిన్నె ఆకారంలో వుంటుందా? ఎలా వుంటుంది? వుండదు కదా మరి. కాబట్టి నీ యందు ప్రాణ శక్తిగా వున్నది. దాని యందు చైతన్యం జడశక్తిగా వున్నది. (నన్ను కాదు అనేనా?) నన్ను కాదు అనేది కాదు అంశం అక్కడ గుర్తు పెట్టుకోవలసినది అతడు నా ప్రతిబింబం. అతను ఎక్కణ్ణుంచో రాలేదు. నాలో వున్న ప్రాణమనోబుద్ధులలో వున్న రజోగుణమే, అతనిలో పనిచేస్తోంది. అతనిలో వున్న రజోగుణాన్ని నిద్ర లేపుతోంది. అతను అలా ప్రవర్తించేటట్లు చేస్తోంది. నా సూక్ష్మాన్ని ముందు సరి చేయాలి. నాలో వున్న ప్రాణమనో బుద్ధులలో వున్న రజోగుణాన్ని కనుక ముందు వదిలేసుకుంటే నేను, నాకు మూడు గుణాలలో కనుక స్పందన లేకపోయినట్లయితే, (అతను అలా అన్నారనే మాట వుండదు) అతను అసలు అనే పరిస్థితే రాదు. అర్థమౌతుందా అండీ!
            అతను అంటున్నాడంటే ఎలా అంటున్నాడు? నీ లోపల సూక్ష్మం అందులో చేరింది. ఆ గిన్నెలో ఏం చేరింది? నీ ప్రాణ మనో బుద్ధులే వెళ్ళి చేరినాయి. నీ సూక్ష్మం వెళ్ళి అతని సూక్ష్మంతో సంయోగం చెందింది. నీకు రమణ మాస్టారు ఎట్లా నచ్చాడు? ప్రపంచంలో ఇంతమంది వుండగా? ఎట్లా నచ్చాడు? ఇక్కడ ఒక అంశం వుంది. అంటే అర్థమేమిటి? నీ తల్లిదండ్రులలో కూడా ప్రాణమనో బుద్ధులు అనే సూక్ష్మం వుంది కదా! ఆ సూక్ష్మం ఏం చేసింది ఇప్పుడు? మరొక జీవిలో, మరొక ఉపాధిలో వున్న సూక్ష్మంతో సంయోగం చెంది, నిర్ణయం చేసేస్తుంది. కానీ అసలు నిర్ణయం ఎవరు చేయాలి? అంతరాత్మ చేయాలి. సాక్షి చేయాలి నిర్ణయం ఎప్పుడూ కూడా! అంతే కదా ! కానీ ఏవి చేసేస్తున్నాయి? ప్రాణ మనో బుద్ధులు చేసేస్తున్నాయి. దేనికి లోబడి చేసేస్తున్నాయి? శాస్త్ర వాసన, దేహ వాసన, లోకవాసనకు లోబడి చేసేస్తున్నాయి. కాబట్టి తప్పు ఎవరిది? నాదే. నేను అంతరాత్మలో కనుక స్థిరంగా వున్నట్లయితే, అతను అరుస్తున్నాడండీ, నేను ఎవరిని? గమనించే వాడిని. సాక్షిని. అంతేకదా! ఎందుకని? అతనిలో వున్న అంతరాత్మ ఎవరు? నేనే. అక్కడా గమనించేవాడినే. ఇక్కడా గమనించేవాడినే. ఆ గమనించేవాడి దృష్ట్యా చూస్తే ఇద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు లేరు. ఒక్కడే వున్నాడు. మరిప్పుడు ఎవరు ఎవరిని అన్నారు? ఎవరూ ఎవరిని ఏమీ అనలేదు నాయనా! పరిణామ సూత్రం మేరకు, ఒకరితో ఒకరిక్కడ పరిణామం చెందుతూ వున్నారు. ఒకరికొకరు పాఠం నేర్చుకుంటున్నారు. ఒకరికొకరు గురుశిష్యులుగా బోధ సంగతి జరుగుతుంది. ఎందుకండి? విను చెబుతా విను. నాలో వున్న రజోగుణం నాకు నేనే తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి, పరమాత్మ ఏం చేశాడు? నీలాంటి జీవులనే నీ చుట్టుపక్కల ఏర్పాటు చేశాడు. నీలో వున్న రజోగుణాన్ని వాడు ఎత్తి చూపుతున్నాడు. నీలో వున్న తమో గుణాన్ని వాడు ఎత్తి చూపుతున్నాడు. ఎందుకని? వాడు లేకపోతే నువ్వు తెలుసుకోలేవు. నీలోపల నువ్వు ఎంతసేపు తొంగి చూసినా అవి కనపడుతాయా? కనపడవు కదా ! అవి వాటిలో ప్రతిబింబిస్తేనే కదా! అద్దం ముందుకు వెళ్ళి నిలబడితేనే కదా! నువ్వు దానిని చక్కదిద్దుకునేది? కాబట్టి వాడు ఎవడయ్యా? నీ ప్రతిబింబం. అద్దంలో కనపడుతున్న ప్రతిబింబం. నీ ప్రతిబింబమే అది. నీలో ఎంత రజోగుణం బలంగా వుందో, వాడు అంత బలంగా మాట్లాడుతున్నాడు. నీలో తమోగుణం ఎంత బలంగా వుందో, వాడు అంత తీవ్రంగా ప్రవర్తిస్తున్నాడు. నీలో సత్వగుణం ఎంత బలంగా వుందో, వాడు అంత సత్వగుణంతో ప్రవర్తిస్తున్నాడు. (నా ఇది లేకుండానే వాళ్ళు అట్లా చేస్తుంటారు కదా!) నీ ఇది అంటే ఇప్పటి వరకూ శరీరం, మాట్లాడడం వరికే పెట్టుకున్నావు. శరీరం మాట్లాడక పోయినా, ప్రాణ మనో బుద్ధులు పనిచేస్తున్నాయా? పనిచేయడం లేదా? నువ్వు మౌనంగా కూర్చున్నావు, ప్రాణ మనో బుద్ధులు పని చేస్తున్నాయా? (పనిచేస్తూనే వున్నాయి) అంతే కదా! నోరు కట్టేసినంత మాత్రాన, అవి కట్టుబడలేదు కదా! అవి పనిచేస్తూనే వున్నాయి కదా! అలాగే ఆ ప్రాణ మనో బుద్ధులు, ఆ శరీరంలోకి వెళ్ళి అలా పనిచేస్తున్నాయి. (నా ప్రమేయం లేకుండా) ఏం పని లేదు. స్థూలంతో సూక్ష్మానికి ఏమీ పని లేదు. కల వుందండి, నీకు కల జరుగుతుందండి. నీ స్థూలానికి ఏమైనా పని వుందా, ఆ కలతో? కల జరుగుతోందా లేదా? జరిగిపోతూనే వుంది. అట్లాగే మెలకువలో వున్నప్పుడు నీవు శరీరాన్ని మాత్రమే గుర్తిస్తున్నావు కానీ శరీరం కంటే ముందు ఏది మేల్కొంది? సూక్ష్మం మేల్కొంది. నీ స్థూలం కంటే, సూక్ష్మమే ముందు మేల్కొంటుంది. కాబట్టి సూక్ష్మం మేలుకొన్నాకే కదా, ఈ స్థూలం మేలుకొంటుంది? కాబట్టి ఈ స్థూలం పని చేస్తున్నది అంటే ఆ సూక్ష్మం పనిచేస్తుంటేనే కదా! కాబట్టి ఈ సూక్ష్మం ఎప్పుడూ ముందు వుంటుందా? వుండదా? ముందున్నప్పుడు మరిప్పుడు ఏమైంది? దాంట్లోనుంచి మాట్లాడుతున్న సూక్ష్మం ఇప్పుడు ఎవరు? నీ సూక్ష్మమే. దాంట్లోనుంచి ప్రవర్తిస్తున్న సూక్ష్మం ఎవరు? నీ సూక్ష్మమే. దాంట్లో నుంచి పనిచేస్తున్న కర్మ ఎవరు? నీ సూక్ష్మమే. దానినుంచి వస్తున్న పరిణామం ఎవరికి? నీ వల్ల నీకే కలుగుతోంది. రెండోవాడు ఎక్కడున్నాడు ఇక్కడ? ఎవరూ లేనే లేరు ఎప్పుడూ కూడా. (ఇటువంటి గురువుగారిని ఎదురుగుండా పెట్టుకుని ఏమీ తెలుసుకోలేక పోవడమే పెద్ద అజ్ఞానం). ఇక్కడొక అంశం వుందండి. ఏంటంటే ఎప్పుడూ కూడా ఇతరులను వేరుగా చూడడమే మనం ఇప్పటి వరకూ అలవాటు పడ్డాము. ఎందుకని? నేను వేరు, నువ్వు వేరు. నేను వేరు, నువ్వు వేరు. నేను వేరు, నువ్వు వేరు. అలా కాదు. నీలో వున్న ప్రాణ మనో బుద్ధులు, అక్కడ వున్న ప్రాణ మనో బుద్ధులు ఒక్కటే. ఎవరు ఎవర్ని అన్నారు? ఎవరూ ఎవర్నీ అనలేదు. గిన్నె గిన్నెను అన్నదండి. గిన్నెను గిన్నె అంటే గిన్నెకు ఏమైంది? ఇంకొకటి, అది వుపయోగమే. నాకు వుపయోగమే. ఎందుకని? గురువై బోధిస్తూ వున్నాడు. అర్థమైందా అండీ! లేకపోతే నన్ను నేను తెలుసుకునే అవకాశం వుందా? ఈ మనుషులు ఎవ్వరూ లేరు అనుకోండి, ఏం తెలుసుకుంటావు? ఎలా తెలుసుకుంటావు? సాధ్యమేనా? నీకు జ్ఞానం కలిగే అవకాశం వుందా? (అట్లా అనుకో బట్టేగా) తెలిసేదినీకు పోలిక. ఆ పోలికే లేకపోతే దేనితో పోల్చుకుంటావు? ఎట్లా సాధ్యం? ఒక్కడివే వున్నావండి. జ్ఞానం ఎట్లా వస్తుంది? కాబట్టి పరమాత్మ ఎంతటి ముందుచూపుతోటి ఈ సృష్టిని రచించాడు? నీకు మొత్తం గురువులనంతా నీ చుట్టూనే ఏర్పాటు చేశాడు. నువ్వు ఎక్కడికో పోకుండా. తెలుసుకోగలిగే తెలివి, జ్ఞానం కనుక నీకు వున్నట్లయితే, నీవే కదా సత్యం. నీవు సత్యమని, సాక్షివనీ తెలుసుకోవాలి అంటే, వీళ్ళందరూ అవసరమేనా కాదా? అందుకే కదా! నీ వాసనాబల ప్రభావం మేరకు, వీరందరినీ ఏర్పాటు చేసుకున్నావు. ఒక్కొక్కడూ ఒక్కో ప్రతిబింబం. ఒకడు రజోగుణానికి ప్రతిబింబం, ఒకడు తమో గుణానికి ప్రతిబింబం, ఒకడు సత్వగుణానికి ప్రతిబింబం. ఒకడు సాక్షికి ప్రతిబింబం. అర్థమైందా అండి? ఇలాగ ఎందుకని? అందరూ అవసరమే. “నీ చుట్టుపక్కల వున్న అందరూ గురువులే. నీవు శిష్యుడవు. ఈ సృష్టి గురువై బోధిస్తూ వున్నది. నేను శిష్యుడై, సాధకుడై నేర్చుకుంటున్నాను. అని ఎప్పుడైతే ఈ సృష్టిని గురువుగా స్వీకరిస్తావో, ఆనాడు నువ్వు కడతేరుట ఖాయము”. గర్తుపెట్టుకోండి. ఇదే వాక్యము. ఈ సృష్టి బోధిస్తున్నదని ఎవరైతే స్వీకరిస్తారో, ఆ జన్మలో వాడు కడతేరుట ఖాయము. ఎందుకని? వాడు జనన మరణాలను అధిగమించేస్తాడు. కారణం ఏమిటి? సృష్టిని అధ్యయనం చేశాడు. తనని తాను అధ్యయనం చేశాడు. సృష్టిని, తనని ఏకంగా సాక్షిత్వంగా అధ్యయనం చేశాడు. పరమాత్మ నిర్ణయంగా సృష్టిలో జీవించేస్తాడు ఇంకా. ఎందుకని? సృష్టి అతనిని బాధించలేదు. ఎందుకని? గురువై బోధిస్తున్నది అది. ఇంకా బాధించేది ఏముంది? శిక్షణను ఇస్తోంది, మంచి ట్రైనింగ్‌ ఇస్తోంది. మంచి పాఠం వచ్చేట్టు చేస్తోంది. జన్మ జన్మలకి గుర్తుండే పాఠాన్ని ఇస్తోంది. మరి అదే కదా జ్ఞానం అంటే. ఆ జ్ఞానం ఎట్లా వచ్చింది నీకు? ఆ సృష్టి నుంచే వచ్చిందయ్యా బాబు. ఈ సృష్టే ఈశ్వరుడు. ఈ సృష్టే పరమాత్మ. ఈ సృష్టే గురువు. సృష్టి గురువై బోధిస్తూ వుండగా, ఎక్కడ ఒక తలకాయి, రెండు కాళ్ళు, రెండు చేతులు వున్న గురువు కోసం వెతుకుతావు ఎందుకు? వెయ్యికోట్ల జనాభాలో ఎక్కడ వున్నాడని ఎట్లా వెతుకుతావు? ఈ అనంత సృష్టి నీ ఎదుట గురువై బోధిస్తూ వున్నది. సాలెపురుగు దగ్గరనుంచి కూడా నీకు బోధిస్తున్నది. నీవు ఎట్లా జీవిస్తున్నావనేది. కాబట్టి నీకు ఏం చేయగలడయ్యా? సశరీర గురువు నీకు స్ఫురణను ఇవ్వగలుగుతారు అంతే. ఒహో ! ఇలా కాదు, దృష్టిని ఇలా మార్చుకో. అని నీకు చెప్తాడు అంతే. మార్గ దర్శనం చేస్తాడు. జీవించేది ఎవరు? నువ్వే. కాబట్టి ఈ జీవితాన్ని ఎప్పటికైనా సరే, సాధకుడిగా జీవించడానికి మార్చుకో ఇప్పటికైనా. మరణ కాలంలో వుపయోగపడేటటువంటి సాధనాచతుష్టయ సంపత్తిని సంపాదించుకునేందుకు ప్రయత్నం చేయి. ఏం చేయాలయ్యా అని ఎవ్వరినీ అడుగమాకు. ఏ సాధన చేయమంటారు అని అడుగమాకు. ఏమి చెయ్యాలయ్యా అంటే జపం, తపం, యజ్ఞం, యాగం, హోమం నువ్వు ఏం చేస్తావో అనేది అనవసరం అక్కడ. కానీ నీ దగ్గర ఏముండాలయ్యా? మరణకాలంలో వుపయోగపడే సాధనచతుష్టయ సంపత్తి వుండాలి. ఎందుకని? ఈ నువ్వు చేస్తున్న జపం, యజ్ఞం, యాగం, హోమం ఇవన్నీ మరణ కాలంలో సాధ్యమేనా? అసలు అసాధ్యం నాయనా!  ఎందుకని? కాళ్ళు చేతులు తెలివికి ఎగువ పడ్డాక యజ్ఞము లేదు, యాగము లేదు. కావన్నీ ఇవన్నీ స్థూలభాగంలో లేవు. యజ్ఞభావంతో జీవించాలట. నీ శరీరమే హోమగుండం. నీ యందు వున్నటువంటి ప్రాణమే హవిస్సు. నీ యందు వున్నటువంటి మనస్సు బుద్ధులే, నీలో వున్నటువంటి వాసనాబల సంస్కార బలమే సమిధలు. అందులో బయలుదేరినటువంటి అగ్ని వైశ్వానరుడు. నీలోపల వున్న వైశ్వానరుడే అగ్ని. నీ వాక్కులే శ్రోతస్సు. నాదం నీలో వున్నదండి. ఓంకార నాదం నీలో ప్రతి ధ్వనిస్తున్నది. ఆ ఓంకార నాదం మేరకే నీలో ప్రాణం జరుగుతూ వున్నది. ఆ ఓంకార నాదమే మంత్రము. ఇట్లా యజ్ఞభావంలో నీ శరీరంలో యజ్ఞం జరుగుతూ వున్నది. కానీ ఈ యజ్ఞాన్ని గుర్తించలేక పోతున్నావు. ఈ యజ్ఞాన్ని ఎవరైతే గుర్తించారో, నేను ఎవరిని ఇప్పడు? ఆ యజ్ఞపురుషుడైనటువంటి సాక్షిని. ఆ యజ్ఞపురుషుడైనటువంటి బ్రహ్మను. ఆ యజ్ఞం ఎవరినైతే చేరుతుందో ఇట్లా జీవించేవాడు కదా సాక్షి స్వరూపుడు. ఇప్పడు ఏది ఏది? ఏది కాదు? అర్థమైందా? ఈ రకంగా ఎవడైతే జీవితాన్ని జీవిస్తాడో, ఇది యజ్ఞం చేయడం అంటే. ఇది సోమయాజిత్వం అంటే. ఇది మకర కుండలాలు. ధరిస్తారు చూడండి. ఎందుకు ఆ మకర కుండలాలు? మకరం దేనికి గుర్తు? నీలో వున్నటువంటి మూడు గుణాలకి గుర్తు అది. గజేంద్ర మోక్షంలో ఎవరు పట్టుకున్నారు? మొసలి పట్టుకుంది. ఆ మొసలి ఏంటయ్యా? నీ మనస్సు. మనస్సు చివరకు ఏమైపోయిందట? కుండలములు. చెవులకు ఆభరణములు. మనస్సు అనేది నా చేతిలో పనిముట్టు అయ్యా బాబూ. ఇదిగో కుండలములు ఎట్లా అయితే... (మరి శంకరాచార్యుల వారి మొసలి పట్టు్కుంది అంటే అది ఏమిటి?) ఆయన పుడుతూనే కారణ జన్ముడిగా పుట్టాడు. సన్యాసనిమిత్తమై దానిని సంకల్పించాడు. అమ్మని అడిగాడు. బాల్యంలో సన్యాసం కాదంది ఆవెడ. కాదంటే మరిప్పుడు ఏం చెయ్యాలి? ఆవెడని ఒప్పించాలి. ఒప్పించాలంటే ఒకటి కల్పించాడు. కల్పించాడక్కడ. తను సంకల్పించాడు. ఆ సంకల్పమే మొసలి రూపంలో భ్రాంతి ఆవెడకు కలిగేటట్లు చేశాడు. ఆవెడకు కలిగేటట్లు చేశాడు, అక్కడేమీ మొసలి లేదు, పాడు లేదు. (నన్న మొసలి పట్టుకుంది) ఏం చేయమంటావు? నేను సన్యాసం పట్టుకుంటేనే కానీ వదలనంటుంది అన్నాడు. ఆవెడకు బిడ్డ మీద ప్రేమ. కాబట్టి పో నాయనా తీసుకో! నీవు బ్రతుకుతావుగా అంది. సరే అయిపోయింది. ఆయన పని అయిపోయింది. అంతేగాని అక్కడ మొసలి లేదు. ఆవెడకి ఆ భ్రాంతి కలిగేటట్లు చేశాడు. చూడండి. ఎనిమిదేళ్ళ వయస్సులోనే తల్లికి, ఎట్లా అయితే శ్రీ కృష్ణుడు యశోదకు ఎట్లా చూపెట్టాడు? (లోకాలు అన్నీను) అంతే! అలాగ ఒకటి సంకల్పించాడు. ఆవెడకు ఆ మొసలి పట్టు్కుంది అనంగానే ఒప్పుకునేటట్టు భ్రాంతి కలుగజేశాడు అంతే. అక్కడ మొసలి లేదు, పాడు లేదు. అలాగ వాళ్ళందరూ కూడా కారణ జన్ములు. అందుకని మనం కర్మ జీవులం. కాబట్టి వాళ్ళకేంటి? జన్మతః జ్ఞానం వుంటుంది వాళ్ళకి. ఆ నిమిత్తమే వస్తాడు వాడు. అంటే ఉపాధిని ఎంపిక చేసుకోగలిగే సామర్థ్యం వుంటుంది. తల్లిని ఎంపిక చేసుకోగలిగే సామర్థ్యం వుంటుంది. అన్నీ ఏర్పాటు చేసుకుని వస్తాడు. ఉపాధిలోకి. మనం ఏం చేశాము? ఉపాధిలోకి వచ్చినాక ఏర్పాటు చేసుకుంటున్నాము. వీళ్ళందరూ కారణ జన్ములన్నమాట. వీళ్ళందరూ ఏమిటి? ముందే ఏర్పాటు చేస్తారు అంతాకూడా!  వాళ్ళకు కావలసినవన్నీ. (ఈ మామూలు వాళ్ళు కూడా అనుకునే వస్తారు కదా! ఫలానా వాళ్ళు కావాలని) కర్మను ఆశ్రయించి. వాసనా బలాన్ని ఆశ్రయించి నువ్వు తల్లి తండ్రిని ఎంపిక చేస్తావు. వాడు జ్ఞానాన్ని ఆశ్రయించి ఎంపిక చేస్తాడు. అదీ తేడా. సాక్షిత్వ జ్ఞానాన్ని ఆశ్రయించి ఎంపిక చేస్తాడు. అర్థమైందా అండి? సాయిరాం.

            (Next class సాధన చతుష్టయ సంపత్తి)

ఓం ఓం ఓం
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం తత్‌ సత్‌
ఓం సహనా వవతు సహనౌ భునక్తు సహవీర్యం కర వావహై  తేజస్వి నావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతిఃశాంతిఃశాంతిః

సాయిరాం