File No.9



అంతరాత్మ నిర్ణయం మేరకు ప్రవర్తించాలి. కానీ స్వయంగా ప్రవర్తించేస్తున్నాము. ఎలా ప్రవర్తిస్తుంది ఇది? ‘శరీరమే నేనుగా ప్రవర్తించేస్తున్నాము. అందువల్ల ఏమై పోయింది? నేను నిర్ణయం చేశాను, నువ్వు ఎందుకు పాటించవు? నువ్వు నిర్ణయం చేస్తే వాడు పాటించడం ఏమిటి? నువ్వు కదా పాటించాల్సింది. ఎవరు అసలు ఎవరి నిర్ణయం పాటించాలి? నీ అంతరాత్మ చేసిన నిర్ణయాన్ని నీ బుద్ధి పాటిస్తోందా? అదే పాటించడం లేదు. నువ్వు నిర్ణయం చేసింది ఇంకొకరు పాటించడం లేదు అంటావేమిటి? అర్థముందా ఏమైనా? మన దుఃఖాల్లో సగం దుఃఖాలు ఇవే నండి. సగభాగం ఇదే గొడవ. నేను చెప్పాను నువ్వు వినలేదు. నేను చెప్పాను నువ్వు వినలేదు. ఏమిటి నువ్వు చెప్పేది, వాడు వినేది? అర్థముందా? నువ్వు చెప్పింది ముందు నువ్వు విను. నీ అంతరాత్మ నీ లోపలినుంచి బోధిస్తున్నది. దానిని విను నువ్వు సరిగ్గా ముందు. ఇది వినటం చేతకాదు కానీ, వాడు వినలేదు అంటావేమిటి? నీలోపల సంగతి నీకొకటి తెలియడం లేదు. అదేం బోధిస్తుందో గుర్తుపట్టే తెలివితేటలు లేవు. నీకున్న ఆ కొంచెం తెలివితేటలతోటి, ఇంకెవరో కొంచెం తెలివితేటలు వున్నవాడికి చెబితే, ఆ కొంచెం తెలివితేటలు వున్నవాడు, ఈ కొంచెం తెలివితేటలు వున్నవాడు చెప్పినది వినలేదంట. ఏమిటట నాకు అర్థమైంది ఏమైనా...?
            పూర్ణ జ్ఞానం వీడికి వుందా? వీడికి లేదు. పోనీ వాడికి వుందా? వాడికీ లేదు. ఇద్దరూ అజ్ఞానులే కదా! మరి అటువంటప్పుడు వీడు చెప్పింది, వాడు చెప్పింది ఒక్కటే కదా! నీకు ఏమైనా పూర్ణజ్ఞానం వుంటే, నువ్వు దానిని సాంగంగా వాడికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే సామర్థ్యం వుంటుంది. ఎందుకు వినటం లేదు వాడు? నువ్వు వాడికి సాంగంగా వాడికి ఎందుకు అర్థమయ్యేటట్లు చెప్పలేక పోతున్నావు? వాడి గుణబలాన్ని అర్థం చేసుకుని, వాడు సత్వం గుణంలో ఎప్పుడు వుంటే, అప్పుడు చెబుతావు నీకు పూర్ణజ్ఞానం వుంటే. ఆ పూర్ణజ్ఞానం లేకపోవడం చేత ఏమైంది? వాడు తమోగుణంలో వున్నప్పుడు ఎదురెళ్ళి చెబుతున్నావు. ఏమైంది? వాడు విరుచుకుపడుతాడు. నువ్వు అసలు వాడు తమోగుణంలో వున్నాడనే గుర్తెరిగే తెలివితేటలు లేవు నీ దగ్గర. ఏమైందిప్పుడు? అంతా వ్యతిరేకమే. దుఃఖమే. దుఃఖం ఎట్లా వచ్చింది నీకు? అందుకే. ఆ తెలివితేటలు లేవు. ఆ జ్ఞానం లేదు. నువ్వు ఈ అనంత సృష్టిలో జీవులంతా ఏ గుణబలానికి లొంగి వున్నారో, ఆ గుణబలాన్ని గుర్తించి నువ్వు ప్రవర్తిస్తే, అసలు సమస్య ఎక్కడ వచ్చింది? రాలేదుగా! వాడు కళ్ళు, ఫెళ్ళు స్పీడుగా వున్నాడు, ఏం చెయ్యాలి ఇప్పుడు? వాడికి అప్పుడు చెబితే ఏమి ఎక్కుతుంది? ఏమీ ఎక్కదు. కాబట్టి జ్ఞానం వున్నవాడు ఏం చెయ్యాలట అప్పుడు? వాడికి అది దిగిపోయేంత వరకూ వేచి చూడాలి. దిగిపోయినాక సత్వగుణంలోకి వస్తాడు. అప్పుడు సూచనగా ముందు చెప్పి చూడాలి. వినే పరిస్థితి వుంది, వాడు అడుగుతాడు అప్పుడు. ఇందాక అంటే నేను స్పీడులో వున్నాను, అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు చెబితే అర్థం అవుతుంది. అప్పుడు కూడా మళ్ళా కొంచెం స్పీడులో వున్నాడు, వదిలేయ్‌! మళ్ళా తగ్గుతుంది ఎప్పుడో! తగ్గినప్పుడు మళ్ళా సూచన చేయ్‌. నాయనా! నీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పిచూశాను, మళ్ళా ఇప్పుడు చెబుతున్నాను. నీ సంగతి ఏమిటి? ఏమన్నా విచారణ చేశావా? ఈ ధోరణిలో మాట్లాడుతామా మనం? మాట్లాడము. అది అట్లా కదా! ఇది ఇట్లా కదా! ఏమైంది అప్పుడు? అంతేకదా! వాడికి అనుభవ పాఠం వచ్చినాక కదా! లొంగేది వాడు. వాడికి అనుభవ పాఠం రాక ముందే, అడుగక ముందే ఎదురు వెళ్ళి వాడికి చెబుతుంటే, ఏమైంది ఇప్పుడు? వాడు అసలే అజ్ఞానం, మనం అంతకంటే పెద్ద అజ్ఞానం. ఎందుకని? వాడి స్థితి గుర్తించలేక పోవడం నీ తెలివితక్కువ తనం కదా! కాబట్టి పెద్దవాళ్ళు సర్దుకోవాలా? చిన్నవాళ్ళు సర్దుకోవాలా? అసలు ఇప్పుడు. (పెద్దవాళ్ళే సర్దుకోవాలి). ఎందుకు? (వాడి బుర్ర ఎలా వుందో చూసి) కాదు. జీవితం యొక్క అనుభవజ్ఞానం అంతా ఎవరిదగ్గర వుంది? నీ దగ్గరే కదా వుంది. కానీ మనం ఎప్పుడు ఎవరిని సర్దకోమని చెబుతాం? (నేను పెద్దవాడిని నేను చెబితే నువ్వు వినాలి) ఎందుకు వినాలి వాడు, అసలు ఎట్లా వింటాడంట? వాడికి తెలియదు కదా! (అనుభవ జ్ఞానం) అవునండి. అసలు తెలియదు కదా! వినటానికి. ఇప్పుడు చిన్నపిల్లాడున్నాడమ్మా! వాడు ఉయ్యాలలో ఆడుకుంటున్నాడండి. వాడు ఏం విన్నాడు? విన్నాడా? వినలేదు కదా! వాడికి తెలియదు కదా! ఆ తెలియదు అనే లక్షణం వాడికి ఎప్పుడూ వుంది కదా! ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా వాడికి తెలియదు కదా! తెలియదు కాబట్టే కదా వాడు ఆ స్థితిలో వున్నాడు. తెలిస్తే నీ లాగానే వుంటాడు కదా! తెలిసినవాడివి అంటున్నావు. కానీ ఎవరిలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు మాత్రం? వాడి వలనే ప్రవర్తిస్తున్నావు కదా! తెలిసిన వాడివైతే ఎలా ప్రవర్తించాలి? వాడికి ఎప్పుడు చెబితే జ్ఞానం అబ్బుతుందో తెలిసి నువ్వు చెప్పాలి. అంతే కదా! నేను నా దగ్గర జ్ఞానం వుంది కదా అని, నా దగ్గర అన్నీ వున్నాయి కదా అని, నీకు బోధిస్తాను అంటే నువ్వు వస్తావా? రావు కదా! నీకు ఎప్పుడు దాని అవసరం వస్తే అప్పుడు వస్తావు. అప్పుడే చెప్పాలి నీకు. అంతే కానీ ఎప్పుడు పడితే అప్పుడు చెబితే, ప్రయోజనం లేదు కదా! అది వుపయోగపడదు. అర్థమైందా అండీ!
            అలాగే, కానీ ఏంటంటే సూచన ప్రాయంగా చెబుతూ వుంటాం. ఇదిగో ఇది ఇట్లాగా, అది అట్లాగ, ఇది ఇట్లాగ. నీకు సమయం వచ్చినప్పుడు ఈ జ్ఞానంతో అవసరం వస్తుంది. అవసరం వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తావులే నువ్వేం కంగారు పడమాకు. ఆ సమయానికి చూద్దాంలే అని దాట వేస్తూ వుంటాడు. ఎందుకని? వాడికి ఒక బీజం, ఒక స్ఫురణ వేస్తూ వుంటాడు. ఆపద కాలంలో నన్ను స్మరించు నాయనా! నేను వస్తాను అప్పుడు, సమయానికి సహాయమో, సలహానో చెబుతాను. ఉపయోగపడుతాను ఎప్పటికైనా. దాంట్లోనుంచి బయటపడుతావు. కాబట్టి నన్ను గుర్తు పెట్టుకో. అని అనుభవజ్ఞానాన్ని అనునయంగా చెబుతాడు ఎప్పుడూ కూడా. కానీ, ఎప్పుడైతే ఫెళ్ళు, ఫెళ్ళుగా చెప్పావనుకో, ఏమైందప్పుడు? ఇప్పుడూ అదే అజ్ఞానమే. అర్థమైందా అండీ! ఇప్పుడు ఎవడు పెద్దా? ఎవడు చిన్నా? అజ్ఞానంలో ఇద్దరూ పోటీ పడుతున్నట్లేగా. ఒకడు పెద్దా ఒకడు చిన్నా ఏముంది?
            కాబట్టి ఎప్పుడైన నిజజీవితంలో మీరు ఈ ప్రాథమిక సూత్రాలను గుర్తు పెట్టుకోవాలి. మనం మనుషులతో ప్రవర్తించే టప్పుడు, ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా ఆ మూడు గుణాలకు లొంగి వుంటుంది. ఆ మూడుగుణాలకు వున్న లొంగుబాటులోంచి విడివడటమే ముక్తి. అర్థమైందా అండీ! కర్మబంధం అంటే వేరే ఏమీ లేదు. ఈ మూడు గుణాలే కర్మబంధం వేరే ఇంకేమీ లేదు. ఈ మూడు గుణాలకు అతీతంగా వుండగలగడమే ముక్తి. ఆ మోహం అనేది ఎందువల్ల ఏర్పడింది? ఈ మూడుగుణాలవల్లే ఏర్పడింది. ఆకర్షణ ఎందువల్ల ఏర్పడింది? మూడుగుణాల వల్లే ఏర్పడింది. అన్నీ మూడు గుణాలవల్లే ఏర్పడ్డాయి ఈ సృష్టి మొత్తం అంతా కూడా. ఎలాగండీ నిర్ణయం?
            ఆవు చూడండి, సాధు జంతువు కదా అది. సత్వగుణం. దాని పక్కన ఎద్దు వుంది కదండీ! అది ఏమిటి మరి? రజోగుణం. అర్థమైందా అండీ? ఇలా ప్రతీ దాంట్లోను వుంటాయన్నమాట. సత్వగుణం, రజోగుణం జంతువుల్లో కూడా వుంటాయి. అలాగే మనుషుల్లో కూడా వుంటారు. అయితే ఏమిటి? మనిషికి వచ్చేటప్పటికి ఏమిటంటే, ఎప్పుడూ ఒక గుణంలో వుండడు. (అది మారుతూ వుంటుంది.) ఆఁ... నీకు ఆ గుణ ప్రేరణ, అవి (జంతువులు) ఎప్పుడూ ఒకే గుణంలోనే వుంటాయి, అందుకని జంతువుని పంజరంతో పోల్చింది. ఒక జైలు అది, ఆ జైలు, ఆ శరీరం జైలు, ఏ జైలు వస్తే ఆ జైలు వరకే వుంటుంది అంతే. ఆ జైల్లో వుండి, వాటికి తెలిసినంతగా పరమాత్మ మనిషికి తెలియదు. జంతువులకు తెలిసినంతగా దైవం, మానవుడికి తెలియదు. ఎందుకని? వాటికి ఒక పరిమితమైన జ్ఞానమే వుంది. నిరంతరాయంగా అవి పుట్టింది మొదలు, పోయేవరకూ పరమాత్ముడిని వేడుకొంటూ వుంటాయి. నాయనా! ఈ జంతువు పంజరం నుంచి నన్ను విముక్తి కలిగించు. దానికి ఒక్కటే కోరిక వుంటుంది. నేను ఈ జంతువు పంజరం నుంచి ముక్తిని పొందాలి. అని. దైవం సహజంగా కనబడుతుంది వాటికి. (మరి ఆ కోరిక వున్నప్పుడు అవి) జంతువు పంజరం నుంచి ముక్తి పొందింది కదా! మానవ ఉపాధికి వచ్చింది కదా! (చివరికి కదా వచ్చేది) అంతేగా మరి ఎనుబది నాలుగు లక్షల జీవరాశుల్లో చరించి రావలసిందే. (ప్రతి జీవి అట్లా రావల్సిందేనా?) ఆఁ.. అలా రావాల్సిందే. అది లేకుండా నీకు మానవ ఉపాధి లభించదు. మరి ఇందాక ఏం చెప్పాడు? ‘కల్పశతములకన్నా మిక్కిలి కాలమాయెను’ - అమీబా నుంచి మానవుడి వరకూ, అమీబా నుంచి మానవుడి వరకూ కూడా అనేక జంతువుల జన్మలలో కదా నువ్వు తిరుగుతూ వచ్చావు. మరి ఎంత టైం పట్టి వుంటుందంటావు? ఒకసారి ఆలోచించు? (లక్ష జన్మలంటే ఎన్ని..?) లెక్క ఏముంది దానికి లక్షో, కోటో! కాబట్టి మనం అన్నీ కూడాను ఇప్పటి వరకు గతించిన 50 సంవత్సరాల గురించి ఆలోచించమాకు. ఈ 50 సంవత్సరాలు అనేది నువ్వు ఇప్పుడు లెక్క వేసుకుంటున్నావు. ఈ 50 సంవత్సరాలలో ఏం జరిగింది అనే దానికంటే కూడా సమస్య ఏమిటయ్యా అంటే అసలు ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఎన్నో జన్మలలో దేహాన్ని ధరిస్తూ వున్నావు, వదిలిపెడుతూ వున్నావు. ఇదేం కొత్తకాదు నీకు. కాకపోతే ఎందుకు దుఃఖిస్తున్నావు మరి? దేహం పోయిందని దుఃఖిస్తున్నావా? లేదు దేహం వున్నవాళ్ళతో సంబంధాలు పోయిందని దుఃఖిస్తున్నావా? లేదూ అంతరాత్మను గుర్తెరగలేదు అని దుఃఖిస్తున్నావా? లేదు దేని నిమిత్తమై, పరమాత్మ కోసమై వచ్చావు కదా మానవ ఉపాధిలోకి అది లభించలేదు అని దుఃఖిస్తున్నావా? నీ దుఃఖం దేనికి అసలు? కాబట్టి అర్థం వుందా ఏమైనా? మరణాన్ని కోసం దుఃఖించడం ఏమిటి? అసలు మరణం దుఃఖించదగిన అంశమేనా? దాని అంత పవిత్రమైనది ఏదీ లేదు కదా! మరి దానిని అశుభంగా ఎందుకు చూశావు? తప్పు కదా! దృష్టి భేదం కదా అది. పరమాత్మ మృత్యువును ఎందుకు సృజించాడు? ముందు మృత్యువును సృజించినాక జీవునకు జన్మను ఇచ్చే విధానాన్ని సృజించాడు. అర్థమైందా అండీ! పంచీకరణలో చెబుతాడు అందుకోసమే. మృత్యుదేవత 25వది మొట్టమొదట సృజించబడిందండి. 1st మృత్యు దేవతను సృజించిన తరువాతనే, మిగిలిన అధిష్టాన దేవతలను అందరినీ ఏర్పాటు చేస్తూ, ఇంద్రియాలను ఏర్పరిచాడు. ఎందుకని? నీకు పరిణామం రావాలి అంటే, అదే కారణం. కొంతకాలం జీవించేశావండీ! ఇంక ఈ ఉపాధి పనికిరాదు పరిణామానికి. ఇప్పుడు ఏం చెయ్యాలి మరి? ఈ ఉపాధిని విడిచిపెట్టి వేరే ఉపాధిలోకి వెళ్తే కానీ నీకు పాఠం, జ్ఞానం రాదు. పరిణామం రాదు. మరి అసలు మృత్యువే లేకపోతే ఏమైపోతావు? (ఇట్లాగే వుండిపోవడమేగా) ఎట్లా? ప్రయోజనం ఏముంది? ఉన్నదాంట్లో పరిణామం రాదు. ఆ పాఠం రాదు. పరిణామం రాదు. జ్ఞానం రాదు. ఎప్పటికీ. వాడు ఏమైపోవాలి ఇప్పుడు? కాబట్టి ఏం చేశాడు? ఎంతో ముందుచూపుతో ఆలోచించాడండీ! నీకు అజ్ఞానం చేత మృత్యువుని, మరణాన్ని అశుభం అని అనుకుంటున్నావు. మైలు అని అనుకుంటున్నావు. నిష్ప్రయోజనం, అజ్ఞానం. శుద్ధ అజ్ఞానం. కేవలం తమోగుణ అజ్ఞానం అది. అందుకనే దాంట్లోనుంచి ఎప్పటికీ బయటకు రాలేనంతగా కూరుకుపోయావు. నిజానికి దానిని మించిన పవిత్రమైన ప్రదేశమే లేదు, దానిని మించిన పవిత్రమైన స్థితే లేదు. ఎందుకని? (సన్యాసం పుచ్చుకుంటే మళ్ళీ మైలు వుండదట) అర్థం లేదండి. ఏమండీ! సన్యాసం అంటే ఏమిటి? అనేది ముందు లేకపోవడం అన్నమాట. సమ్యక్‌ న్యాసము, సమ్యక్‌ న్యాసము అంటే సన్యాసము అని అర్థము. న్యాసము అంటే ఏమిటి? జీవితం ఎలా మొదలౌతున్నది, జీవితం ఎలా అంత్యం అవుతున్నది. జీవుడి యొక్క రాకడ, పోకడ తెలిస్తే న్యాసము అని అర్థము. మహన్యాసము అంటున్నారా? మీరు. శివాభిషేకం చేసేటప్పుడు ఏం చెబుతారండీ? మహన్యాసమేనా? ఏమిటి మహన్యాసమంటే? మహత్‌ అనేటటువంటి సృష్టి ఎలా వచ్చింది? ఎలా పోషించబడుతున్నది? ఎలా పోతుంది? చెబితే మహన్యాసము అయ్యింది. అర్థమైందా అండీ! మరి సమ్యక్‌ న్యాసము అంటే ఏమిటి? ఆ జీవుడి యొక్క రాకడ ఎలా వుంది? ఎలా జీవిస్తున్నాడు? ఎలా పోతున్నాడు? ఏది మిగుల్తుంది చివరకి? ఆత్మస్వరూపం మిగుల్తుంది. అని ఎవరికైతే తెలుస్తోందో, ఎవరైతే ఆ కర్మఫలాన్ని త్యజిస్తున్నాడో వాడు సన్యాసి. దానికి కాషాయం గుడ్డలు కట్టక్కర్లేదు, రుద్రాక్షలు ధరించనక్కర్లేదు, విభూది అంతకంటే పెట్టక్కర్లేదు. (ఆ సన్యాసిపోతే మైలు వుండదు) ఎందుకంటే, ఒకానొకప్పుడు మహానుభావులు అలా జీవించారు. ఎవరు? దాని కోసమే జన్మించి, సిద్ధాంతాన్ని ఉద్ధరించి, లోకోద్ధరణకే జన్మించినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవన విధానాన్ని తీసుకుని, వాళ్ళు చేసిన దానిని ఆధారంగా తీసుకుని, నీకు అనువుగా పెట్టుకున్నావు. అర్థమైందా అండీ! వారెవరో ఆ మహానుభావునికి వర్తింపజేసింది, నీకు ఎలా వర్తింపజేయడానికి వీలౌతుంది? సాధ్యమేనా? నీవు కర్మజీవివి. వారు కారణజన్ముడు. కారణజన్ముడు పుట్టుకనుంచే కర్మఫలత్యాగం అనే జ్ఞానాన్ని కలిగివున్నాడు. ఆ స్థితిలో వుండి జీవిస్తున్నాడు. అలా జీవించేటటువంటి వానికి, వానికి సన్యాసం అంటే ఏమిటో తెలుసు. వాడు పుట్టుకతోనే ఆ స్థితిలో వచ్చాడు వాడు. మరి అటువంటప్పుడు వాడికి, వాడు పోతే అంటే, వాడి జీవన విధానం ప్రకారం మరణానంతర శుద్ధి అనేది ఎలా అయితే వుంది. వాడికి తెలుసు, దేహం వాడు తెలిసి విడిచిపెడుతున్నాడు. సమస్య ఏమీ లేదు కదా ! దేహము తెలిసి విడిచిపెట్టినవాడు అనే జ్ఞానంలో వున్నాడు వాడు. వాడికి మరణానంతర విధి లేదు. వాడికి సమాధి కట్టమన్నాం. వాడికి దహన క్రియలు లేవు. వాడికి, జీవన్ముక్తుడైనటువంటి వాడికి సమాధిని నిర్మించి, వాడు జీవించి వున్నప్పుడు ఎలా అయితే గృహస్థులు వారిని ఆశ్రయించారో, అట్లాగే అతని సమాధిని ఆశ్రయించినా కూడా నీకు జ్ఞానం కలుగుతుంది పో! అన్నారు. (మరి నీళ్ళల్లో వదిలేది ఏమిటి?) అదే చెప్పేది, రకరకాల సమాధులు ఇవన్నీ కూడా. జలసమాధి, భూసమాధి ఇవన్నీ రకరకాల సమాధులు. ఇవన్నీ సమాధి నిర్ణయం. సరే! అది ఎలా వున్నా కూడా, ఇదంతా కేవలం బాహ్య ఆచార ఆడంబర ప్రక్రియే కానీ, దాంట్లో ఏమీ లేదు. సమాధి అంటే కట్టినటువంటి అది కాదు. అర్థమైందా అండీ! ఏదైతే ఇప్పుడు అక్కడ ఒకటి కడుతున్నారుగా అదా సమాధి అంటే? అది కాదండి. అతను నీకు ఉపయోగపడాలి అంటే, ఏ స్థితిలో వున్నాడు? పరమాత్మ స్థితియందు వున్నాడు, ఆత్మభావంలో వున్నాడు. నీవు సమ+ధీ సమాధి స్థితిని నీవు కూడా పొందితే, అతడు అశరీర రూపంలో వున్నాడు కాబట్టి, సశరీరుడిగా లేడు కాబట్టి, ఆ అశరీరుడుగా వున్న మహానుభావుడిని అలాగే దర్శించగలిగే సామర్థ్యాన్ని పొంది నీకు అట్లా వుపయోగపడుతాడు ఆయన. అని చెప్పడం అక్కడ వుద్దేశ్యం. అదిపోయి చివరికి సిమెంటుది మిగిలింది. అర్థమైందా అండీ! ఇలా అంతా కూడా బాహ్యం మిగిల్చుకోవడం చేత, ఆ బాహ్యం, ఆంతరిక జ్ఞానం అసలు లేదు, విచారణ అసలు లేదు. ఎందుకు పడుతున్నావో తెలియదు, ఎందుకు విడుస్తున్నావో తెలియదు. కాబట్టి కేవల తమోగుణ జ్ఞానంచేత, ఆచరించడం చేత మరింతగా కూరుకుపోయారు. కాబట్టి తప్పనిసరిగా ఆత్మవిచారణలోకి వచ్చినవాడు అందుకే ఈ లోక ధర్మాలను అన్నింటినీ తోసిరాజు అంటాడన్నమాట. ఎప్పుడూ కూడా. ఎందుకని? అవి అజ్ఞానపూర్వక కర్మానుష్టానములు. వాటిని చేస్తాడు, కానీ జ్ఞానపద్ధతిలో చేస్తాడు. అజ్ఞానపూర్వకంగా చేయడు. ఆచరణలో భేదం వుంటుందన్నమాట ఇతనికి, అతనికి. జ్ఞానపూర్వకంగా చేస్తాడు. అది తెలిసి చేస్తాడు. ఏం చేస్తున్నాడో, తెలిసి చేస్తాడు. దానివల్ల సాధించబడేది ఏమిటో తెలిసి చేస్తాడు. స్వయంగా అందరకీ చెబుతాడు. ఇదిగో దీని వల్ల చేస్తున్నది ఇది. ఇది ఆ నిమిత్తమై చేయబడడం లేదు. ఇదిగో ఈ నిమిత్తమై చేయబడుతోందని, పాటించి మరీ, చెప్పి మరీ చేస్తాడు. అది జ్ఞానబలం వున్నటువంటివాడు చేసే విధానం. అదే అజ్ఞానంలో వున్నవాడు ఏం చేశాడు? బాహ్యకర్మాచరణలో బంధితుడు అయిపోయి, అదే సత్యంగా చేసేటప్పటికి మరింత శరీరమే నేనుగా బిగుసుకుపోయాడు. కాబట్టి మీరందరూ కూడా విచారణ చేసేటప్పుడు ఏ పనినైనా సరే, అది ఆచారం కావచ్చు, సాంప్రదాయం కావచ్చు మరొకటి కావచ్చు. ఏదైనా సరే, ఆత్మజ్ఞానం అనే గీటురాయిమీద సాధ్యమైతేనే దానిని ఆచరించాలి. అలాకాక లోకుల కొరకు నేను ఆచరిస్తాను అనుకున్నావే అనుకో, ఎప్పటికీ నీవు ఆ పరిమితులలోనే వుండక తప్పదు. పూర్వ జంతువు లక్షణం పోలేదన్నమాట.
            భయపడడము, భయపెట్టడము రెండూ జంతువు లక్షణాలండి. గుర్తు పెట్టుకోండి. అది నీవు లోకులకు భయపడ్డా, పరమాత్మకు భయపడ్డా, ఎవరికి భయపడ్డా భయపడటం అనే లక్షణం జంతువు లక్షణం. మనిషి లక్షణం కాదు. అంటే, మానవ దేహంలో వున్నటువంటి జంతువుగానే వున్నావు. మానవుడు అనే వికాసమే రాలేదు ఇంకా. భయపడుతూ వున్నంత కాలం, ఇదే నిర్ణయం గుర్తుపెట్టుకోండి. నువ్వు భయపెట్టరాదు, భయపడరాదు. ఎందుకంటే, పరమాత్మను ఆశ్రయిస్తే కలిగేటటువంటి మొట్టమొదటి ఉపయోగం అభయం. అర్థమైందా అండీ! ఏ దేవుడినైనా చూడండి. ఏ హస్తం కలిగి వుంటారండి? అమ్మవారు గానీ, అయ్యవారు గానీ అభయహస్తమేనా అండి? ఇంకేమన్నా వుంటుందా? కాబట్టి అసలు భగవంతుని యెడల నీకు విశ్వాసము, భక్తి వున్నాయి అంటే, మొట్టమొదటి వుపయోగం ఏంటయ్యా అంటే అభయం. నీకు ఆ లక్షణం పోవాలి. అంటే భయపడే లక్షణం పోవాలి, భయపెట్టే లక్షణం పోవాలి. ఎందుకని? అది జంతువు స్వభావం కాబట్టి. నువ్వు మానవదేహంలోకి వచ్చావు కాబట్టి. భయపడరాదు, భయపెట్టరాదు. భయపడితే కచ్చితంగా భయపెడతావు. గుర్తుపెట్టుకోండి. భయపెడితే కచ్చితంగా భయపడతావు. అందులో సమస్యే లేదండి. ఎందుకని? రెండూ తమోగుణ లక్షణాలు అవి. ఒకటి వుంటే, ఒకటి వుంటుంది కచ్చితంగా. (భయపెట్టకపోయినా, భయపడుతూ వుంటాం) భయపడితే నువ్వు కచ్చితంగా ఎవరినో ఒకరిని భయపెడతావు. ఎందుకంటే, నువ్వు భయపెట్టే పరిస్థితి, నీకు లొంగివుండే వాడు రాలేదు కాబట్టి, నువ్వు భయపెట్టకపోయివుండవచ్చు. కానీ నీలోపల అది బలవత్తరముగా పనిచేస్తూ వుంటుంది. నీలోపల భయపెట్టే లక్షణం వుంటేనే, నువ్వు భయపడతావు అసలు. గుర్తుపెట్టుకోండి. బయట భయపెట్టే లక్షణం వున్నవాడు, వాడంత పిరికివాడు వుండడండి. లోకంలో వాడు చాలా పిరికివాడు, అన్నిటిల్లో కూడా. అందుకని బయట భయపెడుతూ వుంటాడు. అర్థమైందా అండీ!
            భయపెట్టే వాడికంటే భయపడే వాడు ఒకింత మెరుగు అన్నమాట. ఎందుకని? (పక్కవాడిని బాధ పెట్టడు) వాడిని వాడే బాధపెట్టుకుంటాడు. కానీ లోపల ప్రతీకారేచ్ఛ వుంటుందన్నమాట. దానిని తీర్చుకోవాలనే కక్ష, ప్రతీకారేచ్ఛ వుంటుందన్నమాట. వీడు నన్ను భయపెడుతున్నాడు. వీడిని అధిగమించాలి ఏమైనా సరే! వీడిని అధిగమించాలి. దీనిని అధిగమించాలి. వాడిమీద ప్రతీకారేచ్ఛ వుంటుందన్నమాట. అది మరింత ప్రమాదం. అర్థమైందా అండీ! వాడికేమో పిరికితనం, లోపల పిరికితనం వుండి, పిరికితనం వల్ల ఎక్కడ ప్రమాదం వస్తుందో అని బయట గాంభీర్యంతోటి భయపెడుతూ వుంటాడన్నమాట. కానీ, నిజమైన సందర్భం వచ్చినప్పుడు వాడు పారిపోతాడు. వాడు నిలబడలేడు. సామర్థ్యం వుండదు వాడి దగ్గర. అదే నిజంగా భయపడుతూ వుంటాడు ఒకడు. కానీ సరైన స్థితి వచ్చినప్పుడు వాడు నిలబడుతాడండి. వాడు భయపడేవాడు అయినా కూడా, అసలైన విషయము వచ్చినప్పుడు వాడు నిలబడుతాడు. ఎందుకనిట? లోపల భయపెట్ట గలిగే సామర్థ్యం వుండి కూడా, బయటకి భయపడుతున్నాడు. కాబట్టి సమయం వచ్చినప్పుడు వీడు నిలబడగలుగుతాడు. కానీ, లోపల భయపడుతూ, బయటకి భయపెట్టే వాడు వుంటాడు, వీడు పారిపోతాడు. అర్థమైందా అండీ! కాబట్టి ఇందులో ఒకటి వుంటే, రెండవది తప్పనిసరిగా వుంటుంది. ఈ రెండూ కూడా జంతువు యొక్క లక్షణాలే. మానవుడి లక్షణాలు కావన్నమాట. కాబట్టి నీవు దైవాన్ని ఆశ్రయించాలి అంటే మొట్టమొదట విడిచిపెట్టవలసినది ఈ రెండు లక్షణాలు. (భయపెట్టడం, భయపడడం). దేనికీ భయపడవద్దు, ఎవరికీ భయపడవద్దు. ఎవరినీ భయపెట్టవద్దూ. దేనినీ భయపెట్టవద్దు. ఏ జంతువునైనా కావచ్చు. ఏ పరిస్థితినైనా కావచ్చు. ఏ మనిషినైనా కావచ్చు. భయపెట్టరాదు, భయపడరాదు. అలా వుంటేనే, దాని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయండీ! అయితే దైవాన్ని విడిచిపెట్టవలసిందే. నువ్వు భయపడే లక్షణాన్ని విడిచిపెడుతావా? దైవాన్ని ఆశ్రయించడం అనే లక్షణాన్ని విడిచిపెడుతావా? ఇప్పటివరకూ ఏం చేశావు? (భయపడుతూ వచ్చాను) దైవాన్ని వదిలేశావు. దైవాన్ని విస్మరించావు అంతే. దీనికి లొంగావు అంటే, కచ్చితంగా దైవాన్ని విస్మరించక తప్పదు. ఎందుకంటే, దైవాన్ని విశ్వసిస్తే మొట్టమొదటి లక్షణం అభయం. భయపడడు వాడు. దేనికీ భయపడడు. ఎందుకని? ఏంపోతుందండీ? ఏం తెచ్చావు గనుక? ఏం పోతుంది? ఏమన్నా తెచ్చావా? ఏమీ తేలేదు. శరీరం. ఈ శరీరం ఎవడో కొల్లగొడతాడని భయం. ఏమిటి కొల్లగొట్టేది? అయ్యో! ఏం చేస్తాడు వాడు నీ శరీరాన్ని? ఏం చేసుకుంటాడు? ఏం ప్రయోజనం ఏముంది? కాబట్టి దేనికి భయపడుతున్నావు? శరీరం మీద వేసుకున్న వాటికోసం. అంతేనా? అయ్యో! ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే చెప్పేది.  ధనము ఎచ్చటనుండునో అచ్చట సర్పభయం, చోరభయం, సర్పభయం తప్పదు. (ఎందుకొస్తుంది ధనమున్నచోట). ఆఁ... ఎందుకు వస్తుందంటే, అక్కడ ఒక అంశం వున్నదండీ! ధనానికి కాపలా ఎప్పుడూ సర్పం. (ధనం ఎవరి ఇంట్లో వుంటే, అక్కడికీ వస్తుందా?) కాదండి. అక్కడ ఉద్దేశ్యము అదికాదు. అంటే ఉపమానం అన్నమాట అది. దాని వెనుకాల రహస్యం వుంటుంది ఎప్పుడూ కూడా. ఎక్కడైతే నీవు, అధర్మార్జన వుంటుందో, ఆ అధర్మార్జనకు మొదటి వారసుడు ఎవరయ్యా? అంటే దొంగ. మొదటి వారసుడు ఎవరయ్యా అంటే దొంగ. నీ దగ్గర వున్న అధర్మార్జన తప్పనిసరిగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. ఏ పరిస్థితిలో నైనా సృష్టి నియమం అండి. మీరు ఎంతగా కాపాడుకున్నా, ఎవరు ఎంతగా కాపాడుకున్నా. ఎంత కోటీశ్వరుడైనా సరే! అధర్మార్జన ఏదైతే వుంటుందో, ఆ అధర్మార్జన అంతాకూడా తప్పనిసరిగా పోవలసిందే. అధవా పోలేదనుకోండి. దొంగవచ్చి తప్పనిసరిగా దానిని తీసుకుపోతాడు. నువ్వు ఏదో ఒక రూపంలో అన్నా దానిని పోగొట్టుకుంటావు. సప్తవ్యసనాలలో ఏదో ఒక రూపంలో దానిని పోగొట్టుకుంటావు. ఒక వేళ సప్తవ్యసనాలలో నీకు అధర్మార్జన పోలేదనుకోండి, తప్పనిసరిగా దొంగైనా సరే దానిని పట్టుకుపోక తప్పదు. ఈ రెండూ కూడా తప్పిందనుకోండి. మూడవది అగ్నిభయం. అగ్నిప్రమాదం తప్పనిసరిగా జరిగితీరుతుందండి. కచ్చితంగా అగ్నిప్రమాదంలో వెళ్ళిపోతుంది. అంతాకూడా. స్వాహా! ఈ అగ్ని ప్రమాద సూచిక సర్పం. అర్థమైందా అండీ! అందుకని పూర్వం ఏదైనా ఇళ్ళల్లోకి పాము వచ్చిందంటే, శాంతులు చేయించాలి, శాంతులు చేయాలి అంటుంటారు. పెద్దవాళ్ళు అంతా కూడా. కారణం ఏమిటంటే, (వీళ్ళ అమ్మగారు వున్నారు, పైన గరుడ పక్షి వాలింది అంటే శాంతులు చేయించాలి అంటారు, ఇంట్లో గబ్బిలం వచ్చిందంటే శాంతి చేయించాలా? తేనెతుట్టె పడితే శాంతి చేయించాలంట, మొన్న 10 తేనెతుట్టెలు పట్టినాయి, మల్లె చెట్టుకింద, పొగపెట్టాము, పోయినాయి, ఎందుకని అది) ఏవండీ! ఇదే చెప్పేది. ఇదంతా సూక్ష్మం. పూర్వకాలంలో సూక్ష్మజ్ఞానం వున్నవాళ్ళు వున్నప్పుడు సంగతి ఇదంతా. ఇప్పుడు మీకు అసలు స్థూలజ్ఞానమే లేదు. కాబట్టి మీకు అసలు శాంతే లేదు. (శాంతి అక్కర్లేదు) అసలు ఇదేమీ అక్కర్లేదు మీకు. (మాకు ఏం లేదు) అసలు ఆ భ్రాంతే లేదు మీకు. (ఏమో ఏమౌతుందో అనేది లేదు) ఆఁ.. ఆ భ్రాంతి వుంటేనే కదా శాంతి. (ఈ భయం వుంటే శాంతి). ఒకటి గుర్తుపెట్టుకోండి, దేనికైనా భయం వుంటే, ఆ భయానికి శాంతి. నేను అందుకే చెప్పేది. ఎన్నింటికని ఇట్లా చేస్తావు? అవునండీ, ఇక్కడొక అంశము వుందండి. ఎన్నిటికని ఇట్లా భయపడుతావు? గబ్బిలానికి భయపడి, గురుడపక్షికి భయపడి, కాకికి భయపడి, పిల్లికి భయపడి ఎన్నిటికి భయపడతావు? సృష్టిలో. ఇప్పుడు వాటిలో నువ్వు ఏం చూశావు? 84 లక్షల జీవరాశులలో వున్నది పరమాత్మే అయితే, నువ్వు దేనిని గుర్తిస్తున్నావు ఇప్పుడు? అర్థమైందా? ఆ నోరు లేని జంతువులలో కూడా చెడునే చూస్తుంటివి. ఇది అపవిత్రమైన జంతువు, ఇది పవిత్రమైన జంతువు. ఇప్పుడు ఏమైంది? భేదభావం పెరిగిందా తగ్గిందా? ఈ భయాలు శాంతులు వల్ల ఎప్పుడూ నిష్ప్రయోజనం అండీ! ఇదంతా కూడా శరీరపద్ధతి. ఆత్మానుసారమైనటువంటి జీవితంలో వీటికి తావు లేదు. చోటు లేదన్నమాట. అర్థమైందా అండీ!
            కాబట్టి ఏమీ, ఇవన్నీ కూడా, ఇదంతా కూడా కేవలము శరీరానుసార జీవితమన్నమాట. శరీరమే నేను అనుకున్నప్పుడు, నీకు జంతువు లక్షణమే వుంటుంది. నీవు భయపడుతావు. భయపడ్డ పిల్లవాడిని అనునయించడం కోసం, నువ్వు ఎట్లా అయితే వాడిని ఓదార్చుతున్నావో, ఆ ఓదార్పు చేసే ప్రక్రియలు ఈ శాంతులన్నీ కూడా. దాని వల్ల ఏదీ జరిగేది, జరుగబోయేది, జరుగుతున్న దాంట్లో మార్పు ఏమీ వుండదు. అర్థమైందా అండీ! ఇంకా కూడా చెబుతా. నీకు ఎంతగా దాని వెంబడి పోతావో, అవి ఇంకా మళ్ళా మళ్ళా వస్తూ వుంటాయండి. ఎందుకు వస్తయయ్యా అంటే, ఆయా జీవుల యెడల నీకు కలిగిన వ్యతిరేక భావం చేత, వాటి చేత ఆకర్షించబడుతూ వుంటాయి. ఆ జీవుల యెడ నీకు సమత్వ భావన రాగానే నిన్ను విడిచిపెట్టేస్తాయి. నీ జోలికి రావు అవి ఇక. (మరి గ్రహస్థితి బాగుండలేదు, దీనికి ఇది కాబట్టి వీరికి ఇలా బుద్ధుల పుడుతాయి, ఇది చేయిస్తే ఈ బుద్ధి పోతుంది, ఈ కపట బుద్ధి పోయి మంచి బుద్ధి వస్తుంది) అంతేనా? ఒక్కటి చెబుతా మీకు వినండి. ఇదంతా కూడా కేవలము, పొట్టకూటి విద్యలు ఇవన్నీ కూడా. అంటే ఏమిటి? ఏం చెబితే నీ ఇహలోకంలో నువ్వు ఉపశాంతి పొందుతావో, ఆ ఉపశాంతికోసం చెప్పేటటువంటి, మానసిక ఉపశాంతి మార్గాలు మాత్రమే. (రాత్రి వీళ్ళు కూర్చుని పినతల్లి, కొడుకు ఓ జాతకాలు తిరగేసుకున్నారు, నువ్వు రాలేదుగా రాత్రి) కర్తవ్యప్రభావాన్ని, కర్మప్రభావాన్ని మార్చగలిగే సామర్థ్యం దేనికీ లేదు. బ్రహ్మజ్ఞానికూడా దేన్ని కూడా మార్చడు. ఒక్కటే విధానం. కర్మ ప్రభావానికి నువ్వు లోబడకుండా చేయగలుగుతాడు. ఎలాగ? జ్ఞాన ప్రభావం చేత. నీకు జ్ఞానం వచ్చేట్టు చేస్తాడు అంతేగాని, తానేదీ స్వయంగా సంకల్పించి, నీకు ఈ కష్టం రాకుండా చేయాలని ఆలోచించడానికి వీలుకాదు. (ఆ కష్టం ఆ బ్రహ్మజ్ఞానికి వుండదు కదా!) అతను అనుభవించే తీరులో తేడా వుంటుంది. ఎట్లా వుంటుందంటే, నువ్వు అనుభవించడానికి, నేను అనుభవించడానికి తేడా ఇందాకే చెప్పా నేను. ఎట్లా అంటే, నీవు అది అయిపోతావు. అది వచ్చినప్పుడు నువ్వు అది అయిపోతావు. (అయిపోయి నేనే బాధ పడుతూ వుంటాను) దుఃఖించేస్తావు, అనుభవించేసేస్తావు. అంతా నాకే వచ్చింది, నేనే అనుభవిస్తున్నాను, అని కృంగిపోతావు పాతాళంలోకి. జ్ఞానం వున్నవాడు ఏమిటంటే , ఓహో! అనారోగ్యం వచ్చింది. ఎవరికి వచ్చింది? శరీరానికి వచ్చింది. శరీరానికి ఎందుకు వచ్చింది? క్షయ, వృద్ధులు దాని సహజధర్మం. వృద్ధి చెందడం ఎలాగో, క్షయించడం కూడా దాని ధర్మమై వున్నది. ఎందుకని? షడూర్ములున్నాయి. ఆరు రకాల కష్టాలు వున్నాయట మనకి. ప్రతి మానవుడికి కూడా, ప్రతి జీవికి కూడా. అవి ఏమిటయ్యా? అస్తి - పుట్టటం, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే అన్నీ సంస్కృత పదాలు తెలుగులో చెప్పుకుంటే, పుట్టటం, పెరగటం, వృద్ధి చెందటం, స్థిరపడటం, కృశించటం, లేకుండా పోవటం. ఈ ఆరు లక్షణాలు ఎవరివట? శరీరానివి. అందులో భాగంగా జరుగుతోంది. జరగని. నేను ఎవరిని? అనారోగ్యానికి కూడా సాక్షిని. అనారోగ్యం అంటే ఏమిటి? రెండు ఆరోగ్యస్థితుల మధ్య వున్న భేదమేగా. సమత్వంలో వచ్చిన లోపం అనారోగ్యం. సమత్వంగా వుంటే ఆరోగ్యం. అంతే కదా! ఆరోగ్యం అంటే ఏమిటి? ఆయుః + యోగము. ఈ రెండూ కలిస్తే ఆరోగ్యమండి. వేరే ఏమీ లేదు. నీ ఆయుష్షు, నీ యోగము ఈ రెండూ నీకు తెలిస్తే, అది ఆరోగ్యము. నీ ఆయుష్షు ఎంతో నీకు తెలుసా? తెలియడం లేదు. నీవు ఏ యోగ స్థితిలో వున్నావో తెలుసుకుంటున్నావా? అదీ లేదు. ఇహ ఆరోగ్యం ఏమిటి ఆరోగ్యం? ఎంత అనారోగ్యంలో వున్నావు? అదీ ఆరోగ్యం అనుకుంటున్నావు. ఇది కాదయ్యా బాబు. ఆరోగ్యము, అనారోగ్యము అంటే అర్థం ఏమిటంటే, నిన్న చెప్పుకున్నాం, ప్రతిరోజు మేలుకొలుపులో పాడుతున్నారా  ఇరువది ఒక వెయ్యి ఆరు నూరులు జరుగు హంసలు, ఆ హంసలు గుర్తెరిగినవాడికి తెలుస్తుంది. ఓహో! నా ఆయుష్షు ఎలా క్షీణించిపోతుందో వాడికి కనపడుతూ వుంటుందండి. ఆ meter reading తెలిసిపోతూ వుంటుంది. అలాగే యోగస్థితి, యోగసాధన చేసినవాడికి, యోగం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యోగము అంటే వున్న స్థితిని కాపాడటం. క్షేమం. యోగక్షేమం అంటారు కదా! అంటే ఏమిటి? ఉన్నతమైన స్థితి కలగటం, ఆ వున్నతమైన స్థితి చెదరకుండా స్థిరంగా వుండటం. క్షేమంగా వుండటం అన్నమాట. ఈ యోగక్షేమములే యోగంగా మాట్లాడుతూ వుంటాము. ఆయుః యోగము. అర్థమైందా అండీ! ఆ రెండూ కలిపితే ఆరోగ్యము అయ్యింది. ఈ రెండూ వున్నవాడికి, అది తెలుస్తుంది. అనారోగ్యము అంటే ఏమిటి? ఆ యోగస్థితిలో మార్పు వచ్చింది. అందువల్ల ఆయుష్షులో భేదం వచ్చింది. ముందు ఏం చెడిందట? యోగం చెడింది. అర్థమైందా అండీ! నేను ఆత్మస్వరూపుడిని, నేను పరమాత్మస్వరూపుడిని అనే స్థితిలో సహజంగా వుంటే, నాకు ఏ అనారోగ్యము రాలేదు. అర్థమైందా అండీ! ఆ యోగం చెడింది. ఆ భావన చెడింది. దేహభావనలోకి వచ్చాను. రాగానే ఏమైంది? ఆ సుఖదుఃఖాదులు అన్నీ పనిచేసినాయి. పని చేయగానే, శరీరం తల్లడిల్లిపోయింది. అందువల్ల 21,600 జరిగే హంసలు కాస్తా ఏమైంది? ఆ గుర్తు పోయింది, ఆ తెలివి పోయింది. అజ్ఞానంలోకి వచ్చేశాం. అప్పుడేమైంది? ఇంద్రియాల యొక్క దుఃఖాలే నీ దుఃఖాలు అయిపోయినాయి. కాబట్టి నీవు ఈ విచారణంతా చేసి, ఇదంతా శరీరానికి సహజం. ఇవి క్రమ వృద్ధి, క్షయాలు పొందుతూ వుంటాయి. ఇది నా సహజమైనటువంటి సృష్టి ధర్మం. నాది కాదు ఇది. ఇది కేవలం ఈ పనిముట్టును వాడటం కోసం వచ్చాను. పనిముట్టు చిల్లుపడకుండా చూసుకోవడమే నీ పని. అంతవరకే. దానిని వుపయోగించావు, విసిరి అవతలపారేసి వెళ్ళిపోతావు రేపొద్దిన. ఏముంది అందులో అంతకు మించి? అంతకు మించి ఏమీ లేదయ్యా. ఈ కాస్త ప్రయత్నానికి ఓ బ్రహ్మాండం బ్రద్దలు కొడుతూ వుంటివి. ఒక గిన్నె, ఒక పాత్రను తెచ్చుకొంటివి, పాత్రను వుపయోగించి, పాఠం పొందాలి. పరిణామం చెందాలి. పరమాత్మనేను అనేటటువంటి పాఠం నేర్చుకోవాలి. ఆ జ్ఞానం కోసం ఈ పాత్రను తెచ్చుకున్నావు. ఈ పాత్రను వాడుతావు, విసిరి అవతల పారేసి వెళ్ళిపోతావు. ఇంతే జీవితం అంటే. ఒక్కమాటలో చెప్పాలి అంటే. మానవ జీవితం ఇంతకు మించి ఏమీ లేదు. ఈ మాత్రం ఒక్క వాక్యానికి, దాన్ని ఓ సాగలాగి, అటు పీకి, ఇటు లాగి, దాన్ని గ్రహాలు లెక్కేసి, గడులు లెక్కేసి, ఇళ్ళు లెక్కేసి, దాన్ని అటు చేద్దామా? పోనీ ఏమన్నా ఆ ఇళ్ళు ఏమన్నా మారుస్తావా? ఆ గ్రహాలను ఏమన్నా నీకు అనువైనట్టుగా కూర్చోబెడుతావా? ఆ సామర్థ్యం వున్నటువంటి రావణాసురుడి వల్లే కాలేదు దాన్ని తప్పించటం. ఎందుకు రామాయణం చదువమంటారంటే, ఇందుకే చెప్పేది. గ్రహాలని శాసించగలిగేటటువంటి సామర్థ్యం వున్నటువంటి మహామహుల వల్లనే సాధ్యం కాలేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయమాకు. అదంతా వృధా ప్రయాస. అవన్నీ వట్టివే. లేనివే. ఆ లేనిపోని దుఃఖజాలంలో పడిపోవడం ఎందుకు? అర్థమైందా అండీ! అందువలన ఏమౌతుంది? నీకేమన్నా దుఃఖం పోతోందా? పోవడం లేదు. పోకపోగా ఏమైంది? మరింత వృద్ధి చెందింది. అర్థమైందా అండీ! కావాలంటే చూసుకోండి మీరు, ఇదిగో ఈ కెంపురాయ పెట్టుకోండి, కెంపు రాయ పెట్టుకుంటే మీకు అంతా మారిపోతుంది. ఏమిటి మారిపోయేది? ఏమిటి మారిపోయేది? (ఏమీ మారల) అయ్యో! ఏవండీ! ఈ భూమండలం మొత్తం మీద, రత్నగర్భ అయినటువంటి భూమండలంలో ఎన్నో వేల, లక్షల, కోట్ల జాతి రత్నాలన్నీ దీంట్లో వున్నాయండి. ఏమైనా భూమండల గమనం మారిందా? (మరి పెట్టుకుంటారు కదా!) నేను ఒక్కటే అడుగుతున్నా! (ఓ నమ్మకం... మారుతుందేమో అని) భ్రాంతి. నీకు ఆ భ్రాంతి వుంది. అంతకు మించి వేరే ఏమీ లేదు. ఏమీ మార్చటం ఏమీ వుండదమ్మా! నిన్ను ఏమార్చుతున్నారు అంతే!

                        చిన్న పిల్లవాడు పడ్డాడండీ! ఏం చేశావు వాడిని? ఏంచేశావు? వాడి దుఃఖాన్ని ఏమన్నా తగ్గించావా? తగ్గించలేదు. బాధను నువ్వు ఏమన్నా తీసుకున్నావా? తీసుకోలేదు. వాడిని ఏమార్చావు. వేరే వైపు దృష్టిని మార్చావు. దృష్టిని మార్చడం కోసం ఏం చెబితే వీడు దుఃఖాన్ని మరిచిపోతున్నాడో అట్లా ఏమార్చావు. నిన్ను అదే చేస్తున్నారు. (యద్భావం తద్భవతి అంటారు కదా !) ఏమీ లేదు, యద్భావం తద్భవతి జ్ఞానానికి సంబంధించినది. ఆత్మజ్ఞానానికి సంబంధించినది అది. అంతేగాని, నువ్వు కెంపు రాయి పెట్టుకున్నంత మాత్రాన యద్భావం తద్భవతిఏమౌతుంది? ఏమి అవ్వదు. (ఏమో తగ్గుతుందనే నమ్మకమే..) అబ్బే! సర్వశక్తి స్వరూపుడవు నీవే. సర్వజ్ఞాన స్వరూపుడవు నీవే. పరమాత్మతో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలతో మానవుడిని సృజిస్తే, మానవులు రాయి, రప్పనీనూ, మూలికలను పట్టుకుని, తాయిత్తులను పట్టుకుని వేళాడంలో అజ్ఞానమా? భ్రాంతా ఇది. నీవు పరమాత్మతో సమానమైనటువంటి వాడవయ్యా! అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు నీయందే వున్నాయయ్యా! అని పరమాత్ముడు చెబుతూ వుంటే, నువ్వు ఏం చేశావు? అర్థమైందా? ఇలాగ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా నిన్ను ఏమార్చడానికి చేసేటటువంటి పనులన్నమాట. నీ బాల్యంలో నీకు దుఃఖం కలిగితే, నువ్వు మీ చిన్నపిల్లల్ని, పిల్లవాడిని ఎలా ఏమార్చారు? ఆటబొమ్మల వైపో, పుస్తకాల వైపో, బొమ్మల వైపో, వాడిని ఏది ఆకర్షింపచేస్తే దుఃఖాన్ని మరిచిపోయాడో, అలా నీకు ఏమార్చే ప్రయత్నం అన్నమాట. కాసేపు. తాత్కాలికం. కాసేపు ఆ విషయాన్ని మరచిపోతావు. మళ్ళా దుఃఖం వస్తుంది. మళ్ళా మామూలే. ఈసారి కెంపు కాకపోతే ఇంకొకటి పెట్టు. ఇప్పుడు అదీ ఇదీ మార్చుకోకుండా, తొమ్మిదీ వున్నవి ఒకేసారి పెట్టారు. గొడవే లేదని. ఇది మరీ బాగుంది. అర్థమున్నదా అండీ! ఏమైనా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. (దేనినుంచీ ఏమీ ఉపయోగము లేదంటారు) సర్వశక్తిమంతుడవు నీవే. నీకు నీవు ఉపయోగపడనంతకాలం, నిన్నునీవు తెలుసుకోనంతకాలం, అన్నీ వృధానే. గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వు తెలుసుకోగలగాలి. నీయందు వున్న శక్తి సామర్థ్యాలు నీకు తెలియబడాలి. అది ఏమైనా వుపయోగం. అంతేతప్ప మిగిలినవన్నీ వట్టి వృధా. ఎందుకని? జ్ఞానం ముందు ఇవి ఎందుకూ కొరగావు. నలుసు అంత కూడా, ఆవ గింజ అంత కూడా వీటికి విలువలేదు. ఆత్మజ్ఞానంలో. అందుకే చెప్పేది. ఆత్మవిచారణ ఎవరికి చెప్పాలయ్యా? అంటే, ఎవరికైతే భ్రాంతి లేదో, ఏ భ్రాంతి లేదో, తీర్థభ్రాంతి అర్థమైందా అండీ? తీర్థ భ్రాంతి లేదో వారికి చెప్పాలి. ఆహా! దేహభ్రాంతి పోగొట్టడం కోసమే కదా! ఈ జ్ఞానం చెప్పేది. ఆ దేహభ్రాంతి ఇన్నింటితో ముడిపడి వచ్చింది. ఒకటికాదు ఇది. ఈ దేహభ్రాంతికి ఎన్నిముడులు వేశారు ఇప్పుడు? (మ్రొక్కులు, వ్రతాలు, యాత్రలు) అన్నీ ఇన్నీ కాదు. అబ్బే! అసలు ఎన్ని వస్తే, అన్నిటికి అన్ని ముడులు వేసుకుంటూ కూర్చొంటివి. అర్థమైందా అండీ! కాబట్టి నీవు శరీరమే సత్యము అనుకున్నంత కాలము, ఇలా నువ్వు అజ్ఞానము చేత ఏమార్చబడుతూనే వుంటావు. తప్పనిసరిగా. దానిని ఏమీ మార్పు చేయజాలరు ఏమైనా సరే! ఏం చేస్తారు మహా అయితే? నీ స్వభావం ఏమిటో, నీ లక్షణమేమిటో చెప్పవచ్చు. జాతకం వలన ఉపయోగం ఏమిటంటే, ఫలానా ఫలానా గ్రహాల వల్ల, నక్షత్రాల వల్ల, ఫలానా కాలాల్లో జన్మించినటువంటి వాడికి ఏ రకమైన స్వభావం వుంటుంది అని ఊహించే ప్రయత్నం అది అంతే. అసలు నిజంగా అవన్నీ ఎందుకు పెట్టారయ్యా అని అంటే, మృత్యువు యొక్క అవగాహన కలిగించడం కోసం పెట్టారు, అర్థమైందా అండీ! విశ్వం అంటే ఎలా వుంది? అది ఎంత విశాలంగా వుంది? దానికి ఆద్యంతములు లేకుండా ఎలా వున్నాయి? పరమాత్మ ఆ విశ్వాన్ని ఎట్లా నియమించాడు? ఆ పరమాత్మ ఎట్లా విశ్వనియమంతో ఈ సృష్టిని పోషిస్తున్నాడు? ఈ సృష్టిని పరమాత్మ పద్ధతిగా ఎట్లా నిర్వహిస్తున్నాడనేది తెలియజెప్పడం కోసమని ఏర్పడిన జ్యోతిషం, చివరకి ఏమైపోయింది? నువ్వు తూర్పుకు అడుగు వేయాలా? పడమరకు అడుగు వేయాలా? దొంగతనానికి ముహూర్తం పెట్టాలా? హత్యకు ముహూర్తం పెట్టాలా? దాకా వచ్చేసింది. అర్థమైందా అండీ! (వాటికి కూడా ముహూర్తాలా) ఆఁ.. అయ్యో! వాడు వచ్చాడు, డబ్బు ఇస్తే ముహూర్తం పెడతానన్నాడు, డబ్బు ఇచ్చాడు, తప్పేముంది అందులో, నా వృత్తి అది అని అంటాడు ఆయన. ఇప్పుడు ఒక్కటి మీరు అడగండి. మీరు ఎవరైనా ఇవన్నీ చెప్పేవారిని, ఏమండీ మీ జీవితం ఏమైనా మారిందా? అని వాళ్ళను అడగండి. ఒకసారి. ఒకసారి మీరు అడిగి చూడండి. వాళ్ళే చెబుతారు, ఏమీ మారలేదు నాయనా! ఏమీ మార్పు చెందలేదు నాయనా! ఎందుకనయ్యా? మారడానికి ఇది చాలదు. ఆత్మజ్ఞానం వల్ల మారడానికి సాధ్యం అవుతుంది కానీ, వీటివల్ల ఏమీ మార్పు చెందదూ. ఉదాహరణకు నేను ఒకటే అడుగుతానండీ! నవరత్నాల షాపు వాడు వున్నాడండీ! వాడు ఏం మారాడు? వాడికి ఏ అద్భుతం జరిగింది? మరి 9 రత్నాలను వాడు పుట్టి, బుద్ధి ఎరిగిన దగ్గర నుంచీ అమ్ముతూనే వున్నాడు కదా! ఏమైందట? వాడికి రాలేదా మరణం? వాడు పోలేదా? (మరణాన్ని గురించి కాదు కదా! వాడు ఎంత వున్నత స్థితికి వస్తాడు... ) మీరు అడిగి చూడండి. ఏవండీ! మీకు ఏ దుఃఖాలు లేవా? వాడు ఏకరువు పెట్టిన దుఃఖాలు అన్నీ ఇన్నీ కాదండి. (అవును). ఎందుకనిట? ఇప్పుడు వాడికేమీ దుఃఖాలు వుండకూడదు కదా మీ లెక్కప్రకారం? (వాడిది వ్యాపారం అండీ!) ఏమైంది మరి? ఎవరి మీద వ్యాపారం? నీ అజ్ఞానం మీద వ్యాపారం. వేరే ఏమీ లేదు. అంతకు మించి. అర్థమైందా అండీ! ఇదంతా కూడా కేవల భ్రాంతి నిర్ణయాలు, శరీరం నేను అనేటటువంటి పద్ధతిలో జీవించే జీవన విధానము. వీటిని ఆశ్రయించి వున్నంత వరకూ నీకు ఆత్మ విచారణ ఎప్పటికీ అబ్బదు. ఆత్మవిచారణలో వున్నవాడు, వీటిని ఎన్నటికీ పాటించడు. ఒకటే గుర్తు పెట్టుకోండి. మీరు ఇవి పాటిస్తారు, మీరిక తరువాత ఆత్మవిచారణలో నిలబడే అవకాశమే వుండదు. కచ్చితంగా ఏ పరిస్థితులలోనూ వుండదండి. ఎందుకని? మళ్ళా వాటిజోలికే వెళ్తావు. ఆ తాత్కాలికమైనటువంటి పద్ధతిలోకే వెళ్తావు. ఆ తాత్కాలిక సుఖాన్నే ఆశ్రయిస్తావు. చిన్నపిల్లల్ని ఎట్లా అయితే నువ్వు, వాడికి దెబ్బతగిలినప్పుడు, ఏమార్చినప్పుడు వాడికి తాత్కాలిక సుఖము ఎట్లా కలుగుతోందో, అలాగే నీకు ఆ బాల్యావస్థలో వున్న బుద్ధే వుంటుంది తప్ప, ఎప్పటికీ కూడా బుద్ధి వికాసము పూర్తి అవ్వదు. కాబట్టి, అన్ని భ్రాంతులని నిరసించాలి అనుకున్నవాడికే, ఈ ఆత్మజ్ఞానం వుపయోగపడుతుంది. నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడిని అనే నిర్ణయానికి జీవించాలనుకునే వాడికే ఈ వుపయోగం అంతా. ఈ వివేక చూడామణిగానీ, ఆ అష్టావక్రగీత గాని, ఈ భగవద్గీతగాని ఇవన్నీ వాళ్ళకు మాత్రమే. అంతేగాని వేరే మార్గం లేదు. (జాతకాలు చూపించామా, రాళ్ళు చూశామా, ఉంగరాలు చేయించామా...) అబ్బే! ఇవన్నీ వట్టి మాటలండి. (మన ఆచార వ్యవహారాలు అన్నీ మారితే కానీ..) అంతే! కచ్చితంగా మారవలసిందే నండి. మీరు మీ ఆచార వ్యవహారాలు అనే పంజరంలో చిక్కుకుని వున్నంత కాలము నువ్వు శరీరంగానే వుంటావు కచ్చితంగా. ఎందుకని? అవన్నీ శరీరానుసారం ఏర్పాటు చేసుకున్నావు. ఆత్మానుసారంలో వాటికి చోటులేదు. భ్రాంతికి చోటే లేదు అసలిక్కడ. అర్థమైందా అండీ! ఎందుకని అంటే, అవన్నీ నువ్వు ఎలా ఏర్పాటు చేసుకున్నావు? వాటికి అర్థమే లేదు. వాటిని ఏ లక్ష్యంతో పెట్టుకున్నావు? ఆ లక్ష్యమే సిద్ధించలేదు. ఎన్నో ఏళ్ళు వాటిని అనుభవిస్తూనే వున్నావు, ఆచరిస్తూనే వున్నావు ఏం సాధించావు? ఏతావాతా ఏమీ సాధించలేదు. కాబట్టి వాటిని వీలైనంత మేరకు తగ్గించుకుని, ఆ తగ్గించుకున్నవాటిని కూడా ఆత్మజ్ఞాన పద్ధతిలో ఆచరిస్తే, అవే నిన్ను వదిలేస్తాయి. కాబట్టి వాటిని నువ్వు వదుల్చుకోవడం ఒక ఎత్తైతే, అవి నిన్ను వదిలేట్టుగా జీవించడం మరో ఎత్తు. అవి నిన్ను వదిలేట్టు జీవించాలి అనేది సరైన విధానం. వాటిని నువ్వు వదిలేస్తే మళ్ళా వస్తాయి. ఎవడో ఒకడు పక్కననుంచీ చెబుతాడు, అయ్యో! మీరు అది కదండీ! (అవే మనల్ని వదిలేట్టుగా చూడాలి) ఆఁ... అవే నిన్ను వదిలేట్టుగా జీవించాలి. అది శాశ్వతమైన పద్ధతి అన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఉదాహరణ చెప్తాను చూడండి.
            ఇప్పుడు మొన్న నేను ఆబద్దీకము పెట్టాలి. అంతే కదండీ! ధ్వంజం కావాలా వద్దా అప్పుడు? వేసుకున్నాను. మరలా దాంతో పని అయిపోయింది. ధ్వంజం విసిరి అవతల పారేశాను. ఎందుకని? రోజువారి జీవితంలో నాకేమీ దానితో అవసరం లేదు. ఎందుకని? ఏదైతే నువ్వు నవావరణ సహితమైన శక్తి స్వరూపము అని, ఏదైతే ఆ ధ్వంజాన్ని ఏదైతే పెట్టావో, ఆ నవావరణ అంశలకు మూలమైనటువంటి బిందు స్థానము ఏదైతే వున్నదో, ఆ బిందు స్థానంలో వున్న పరమశివుడు ఎవరో, అట్టి పరమశివుడికి మీరినటువంటి స్థితి ఏదైతే వున్నదో, అక్కడిదాకా జ్ఞానం తెలిసిన వాడికి, ఈ ధ్వంజంతో ఏం పని? ఎందుకు పెట్టారు నీకు అది? ఈ స్థితిని సూచించడం కోసం అని, ఒక సూచనగా అది పెట్టారన్నమాట. అర్థమైందా అండీ! మీ అందరికీ కూడా అంతే. మంగళసూత్రం ఎందుకు పెట్టారు మీకు? మీ ఆయన కట్టాడు కాబట్టి వేసుకున్నావు. తీసి గట్టున్న పెడితే, మీ ఆయన ఎక్కడ పుటుక్కుమంటాడో అని నీ భయం అంతా కూడా. కానీ నీ మంగళ సూత్రానికి, ఆయన ఆయుర్దాయానికి ఏమన్నా సంబంధం వున్నదా? (లేదు). ఒక్కసారి చూపెట్టండి. అంటే గతించినవారందరూ (మరి ఆ మంగళ సూత్రం ఎందుకు కట్టారు?) అదేనండి, గతించినవారందరూ కూడానూ మంగళ సూత్రం గట్టున పెడితే పోయారా? ఈవెడేమన్నా పోనీ పలుకు తాడంత మంగళ సూత్రం వేసుకుంటే, ఏమన్నా కలకాలం నిలిచి వుంటాడు. వాడి ఆయుర్దాయానికి, నీ మంగళ సూత్రానికి ఏం సంబంధము లేదు. ఇదే భ్రాంతి అంటే. కానీ దాని వెనుక ఒక రహస్యం వున్నది. ఏమిటంటే, బిందుస్థాన నిర్ణయం చెప్పడం కోసమని పెట్టారు.  
            పూర్వకాలంలో ఎవరైతే భర్తలు వున్నారో వాళ్ళకి జ్ఞానం వున్నది. అర్థమైందా అండీ! వాళ్ళు బ్రహ్మచర్యం పాటించేవారు. గురుకులాన్ని ఆశ్రయించి, బ్రహ్మజ్ఞానాన్ని పొంది, గురువు అనుజ్ఞ మేరకు గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించేటప్పుడు ఆ భర్తయే, ఈ భార్యకి గురువు అన్నమాట. మరి అప్పుడు వాళ్ళు భార్యాభర్తలు కాదు. గురుశిష్యసాంప్రదాయ పద్ధతిలో గృహస్థాశ్రమాన్ని స్వీకరించేవాళ్ళు.  అప్పుడు ఆయన ఆ బిందువు నిర్ణయపద్ధతిని, ఈ బిందువునుంచి సృష్టి ఎలా వుద్భవించింది అనేటటువంటి రహస్యాన్ని తెలియచెప్పడానికి సూచనగా దీన్ని ఏర్పాటు చేశారు. అర్థమైందా అండీ!
            ఏనాటి నుంచి, కృతయుగకాలం విషయం. కృతయుగ కాలంలో అందరికీ ఆత్మజ్ఞానం వుండేది ఆ కాలంలో. అందరూ ఆత్మస్వరూపులుగానే వుండేవాళ్ళు. కేవలం పరమాత్మ నిమిత్తమే జీవించేవాళ్ళు. వాళ్ళకు ఏ ఇబ్బందీ లేదు. ఆ పరమాత్మ నిర్ణయపద్ధతి చెప్పడం కోసం, సృష్టి రహస్యాన్ని బోధించే నిమిత్తమై, భర్త భార్యకు ఈ బిందువు నిర్ణయాన్ని చెప్పి, ఈ బిందువునుంచి సృష్టి ఎలా వుద్భవించింది, మరళా బిందువులో ఎట్లా లయమైపోతుంది అనే దాని నిర్ణయం చెప్పే పద్ధతిలో ఆ సూచన నిమిత్తమై, ఈ మంగళ సూత్రం యొక్క గుర్తును వాడారు. అర్థమైందా అండీ!
            మీరు చూసుకోండి కావలసి వస్తే, బయట ఒక సున్నా వుంటుంది, మధ్యలో ఒక బిందువు ఉంటుందండి. ఆ బయట వున్నదేమో సృష్టి అన్నమాట. ఆ మధ్యలో వున్నది బిందువు అన్నమాట. ఆ బిందువు నుంచీ సృష్టి వ్యక్తీ కరించబడింది, మళ్ళా అదే బిందుస్థానంలో లయం అయిపోతుంది. అని ఆ గుర్తును వాడాడు. ఒక పేపరు మీదో లేకపోతే ఒకదానిమీద గీసి చూపెట్టి దీనిని వివరించడాన్నమాట దీనిని. ఇదే మీకు కామకళావిలాసము అని శ్రీవిద్యారహస్యము అనే పుస్తకము ఒకటి వుందండి. దాంట్లో ఇది వుంటుంది. ఇదే ఈ మంగళ సూత్రం గుర్తు వుంటుందన్నమాట. ఆ గుర్తును ఉపయోగించి, అప్పట్లో శ్రీ విద్యారహస్యాన్ని బోధిస్తారు. అది బోధించడానికి ఎవరికి అర్హత వుందయ్యా అంటే, భర్తకి భార్యకు బోధించే అర్హత వుందన్నమాట. శ్రీవిద్యారహస్యం బోధించాలి అంటే, భర్తే బోధించాలన్నమాట దానిని. అందుకని అలా పెట్టారు దానిని. అలా పెట్టి వాళ్ళు ఆ బోధ కోసం వుపయోగించిన గుర్తుని, తర్వాత కాలంలో ఆ శ్రీవిద్యపోయింది, రహస్యం పోయింది, భర్త గురువు పోయింది, భార్యశిష్యులు పోయింది, అన్నీ పోయి చివరకు ఏమి మిగిలింది? మంగళసూత్రం కట్టటం, అది మిగిలిపోయింది. ఆ గుర్తు ఏదైతేవుందో ఆ గుర్తురూపంలో ఒక రూపు తయారు చేసి, ఆ రూపు నీకు గుర్తుండాలనే వుద్దేశ్యంతో మెడలో కట్టడం తయారైంది. ఈ మెడలో కట్టడమే బోధించడం ఇక. వీడికి తెలిస్తే కదా వాళ్ళకి బోధించడానికి అసలు. అర్థమైందా అండీ! ఇలా ఆ మంగళ సూత్రం వెనుకాల వున్న రహస్యం ఇది. అందుకే మీరు 9 తంతువులు పోసిది దానికి. 9 దారాలు పోస్తారండీ కచ్చితంగా. ఆ 9 దారాలు పోయడం వెనుకాల వున్న రహస్యం ఏమిటంటే, ఆ నవావరణ సహితమైనటువంటి శ్రీవిద్యారహస్యాన్ని బోధించడం అన్నమాట అది. ఆ బోధించే నిమిత్తంకోసమనే అప్పుడు ఐదు రోజులు పెట్టారు పెళ్ళి. పూర్వకాలంలో ఐదురోజులు ఊరకే పెట్టలేదు. ఆ ఐదు రోజులు అందరూ ఊరకే భాజాభజంత్రీలతోటి అందరూ వచ్చి, భోజనం చేసి వెళ్ళడానికి కాదు పెట్టింది. ఆ ఐదురోజుల్లో క్రతువు వుంటుందండీ! ఆ క్రతువులో, ఆ ఐదురోజుల క్రతువులో ప్రతిఘట్టమూ కూడా ఇప్పుడు మనం ఏదైతే మూడుగంటల్లో మొత్తం పూర్తి చేసేస్తున్నామో, ఈ మూడు గంటల్లో పూర్తి చేసేది, ఐదురోజుల్లో చెయ్యాలి అది. ఆ ఐదు రోజుల్లో ఈ భర్త గురువుగా స్థిరపడతాడన్నమాట. భార్యకు బోధిస్తాడు అన్నీ! ఒక్కొక్కటీ వివరించి చెప్పి బోధించే విధానం అంతా ఐదురోజుల్లో వుంది. ఐదురోజుల పెళ్ళి అందుకోసమే పెట్టారు. ఆ ఐదురోజుల పెళ్ళిలో ఈ బ్రహ్మగారు ఎవ్వరికీ బోధించరండీ! బ్రహ్మస్థానంలో ఈ భర్తగారే వుంటారు. ఈయనే మొత్తం అంతా, ఎట్లా అయితే యజ్ఞం చేయాలి? ఎలా అనుసరణ చేయాలి? గృహస్థాశ్రమ ధర్మంలో ఎలా వుండాలి? ఇవన్నీ ఈ విధివిధానాలన్నీ, ధర్మాలన్నీ, నియమాలన్నీ ఆ శ్రీవిద్యారహస్య సహితంగా బోధిస్తారన్నమాట. ఎప్పుడో కృతయుగకాలంలో వుండేది అది. ఇప్పుడు ఆ పనంతా పురోహితుడు చేస్తున్నాడు. వీళ్ళు చేతులు త్రిప్పుతున్నారు. అర్థమైందా అండీ! వీళ్ళు చేతులు తిప్పుతున్నారు అంతే! ఆ తమలపాకు ఇక్కడ పెట్టయ్యా? ఎందుకు పెట్టాలో వీడికి అనవసరం. అంతే! పెట్టేస్తాడు అంతే. (మంత్రాలలో వచ్చేది కూడా ఇదేనా?) అంతేకదా! మంత్రాలలో చెప్పేది అంతాకూడా ఇదేనండీ! ఆ మంత్రాలలో వచ్చేదంతా కూడా ఈ విద్యే. జీవుడు ఎలా వస్తాడు? జీవుడు ఎలా పోతాడు? సృష్టి ఎలా వస్తుందో, సృష్టి ఎలా పోతుందో చెప్తాడు అంతే. అందువలన ఏమైపోయింది? అదంతా పోయి చివరికి, అన్నీ గుర్తులు మాత్రమే మిగిలిపోయినాయి. కాబట్టి నీ మంగళ సూత్రం మీద ఆధారపడి ఈ భూమండలంలో ఏదీ లేదన్నమాట. అర్థమైందా అండీ!
            కాబట్టి నీకది మంగళసూత్రం ఎప్పుడైంది? నీకు శ్రీవిద్యారహస్యం బోధపడితే, ఆ గుర్తు చూడగానే అది స్ఫురణకు రావాలన్నమాట. ఆ వుద్దేశ్యము అది. అది తెలిస్తే ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరికీ ధ్వంజం కూడా ఇలాగే అయిపోయిందండి. ఈ ధ్వంజం కూడా ఇలా ఎందుకు అయిపోయింది అంటున్నానంటే, ‘జగమెరిగిన బ్రహ్మణుడికి ధ్వంజమేల?’ అంటే అర్థం ఇదేనండి. ఎవరికైతే సృష్టి రహస్యం తెలిసిందో, తెలియటం కోసమని ఈ విద్యను పెట్టాము. ఇక్కడ ఒకటే అంశం గుర్తుపెట్టుకోండి. నీవు ఎప్పుడైతే విద్యను పొట్టకూటికి ఉపయోగిస్తావో, లక్ష్యం పోతుంది. నీవు పొట్టకూటికోసం విద్యను ఉపయోగించకూడదు. అందుకే వేదాంత విద్యను బోధించేవాళ్ళు శిష్యుల దగ్గరనుంచి నక్షత్రం విలువ కూడా స్వీకరించకూడదని నియమం వుంది. అంటే అర్థమేమిటిట? తమలపాకు తొడిమనుకూడా గ్రహించరాదు. (ఆశించరాదు) గ్రహించరాదు, ఆశించరాదుకాదు గ్రహించరాదు. నీ దగ్గరనుంచి నేను తొమలపాకు తొడిమను కూడా గ్రహించరాదు. అందుకని స్పష్టంగా ఏం చెబుతున్నాము? అందుకే మీరు వట్టి చేతులతో రండమ్మా! మీరు ఏమీ తేమాకండి. ఏమీ సాగిల పడమాకండి. ఎవరూ నమస్కారాలు చేయడానికి కాని, ఎవ్వరూ నమస్కారాలు స్వీకరించడానికి కూడా ఎవ్వరికీ అర్హత లేదు. (ఊరికే రాకూడదు అని అంటారు కదండీ!) ఊరికే రాకుడదు అంటే ఏమి తీసుకురమ్మని? ఏ గురువుగారైనా? నీవు ఇందాకడినుంచీ చెబుతున్నావే భ్రాంతితో కూడుకున్నటువంటి వాడు. శరీరమే సత్యమని, నిన్ను ఏమార్చి, తాత్కాలిక ఉపశమనం చెప్పే గురువులు వేరే. అర్థమైందా అండీ! ఆత్మజ్ఞానానికి సంబంధించిన గురువులు అందరూ ఇలానే వుంటారు. (ఆ రోజుల్లో కూడా వున్నారు కదండీ!) ఏ రోజుల్లో? (ధనాలు పంపించేవాళ్ళు కదా!) ఎవరు పంపించారు? వశిష్ఠ మహర్షి ఏమి స్వీకరించాడు? ఏమీ స్వీకరించలేదు. బ్రహ్మజ్ఞానం వున్నవారు ఎవ్వరూ ఏదీ స్వీకరించరు, వాళ్ళు ఏదీ అవసరం లేదు వాటితోటి. దశరథ మహారాజు రాముడికి విద్య బోధించమని పంపించాడండీ! ఆ విద్య బోధిస్తే రాముడు ఏమి ఇచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. దశరథ మహారాజు ఏమి ఇచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. మణులా, మాణ్యాలా, రాజ్యాలా? ఏమి ఇచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. అందుకే యోగవాసిష్టం చదువమని చెప్పేది. అందులో ఏమీ ఇవ్వడం అనేది ఏమీ వుండదండి. నీవు జ్ఞానం కోసం వచ్చావు. జ్ఞానాన్ని సంగ్రహించు. పో! నీకు జ్ఞానం వచ్చింది, పది మందికి నేర్పు. ఇంతే. (అదే దక్షిణ) అసలు గురు దక్షిణతో పనిలేదు. ఎందుకని? గురువు శిష్యుడు ఏకమైపోతేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు. బ్రహ్మవిద్యను పోషించినవారికి ఎట్లా వుంటుంది అంటే, గురువుతో సమానం అవుతావు. బ్రహ్మలో ఇద్దరూ సమానమే. మరి ఇద్దరూ సమానమైనప్పుడు ఇచ్చేవాడు ఎవడు? పుచ్చుకనే వాడు ఎవడు? గురు దక్షిణే లేదు ఇక్కడ. గురు దక్షిణ సాంప్రదాయం క్షత్రియ రాజ విద్యలలోనే వున్నది. బ్రహ్మవిద్యలో లేదు. అంటే అర్థం ఏమిటి? బాణాలు వేయడం, యుద్ధం నేర్పడం అలాంటి చోట గురు దక్షిణ విధానం పెట్టారు. క్షత్రియ - రజోగుణంతో కూడికుని వున్నదన్నమాట అది. ఆ రజోగుణ విద్యా విధానం నుంచీ పుట్టింది గురుదక్షిణ. అర్థమైందా అండీ!
            అందువల్ల బ్రహ్మవిద్యా సాంప్రదాయంలో ఎక్కడా గురుదక్షిణ లేదు. (అవును అప్పుడున్నాయి మన గురుకులాలు వేదం నేర్పినారు, స్మార్తం నేర్పినారు, అన్నం పెట్టి, తింటం, నేర్చుకోవడం) అదేమిటది? మధూకర వృత్తి. వృత్తి అయితే మధూకరం. మధూకరం అంటే అర్థం ఏమిటి? మధువు అంటే అమృతం అండీ! కరము - పెట్టే చెయ్యి అమృత హస్తము. నువ్వు ఏం పెడుతున్నావట ఇప్పుడు? అన్నం పెట్టడం లేదు, జ్ఞానం. నిన్ను ఏమి అడుగుతున్నాడు? నేను ఏ వృత్తి నిమిత్తమై వచ్చానండి? మధూకర వృత్తి. నీది అమృత హస్తం అయితే పెట్టు. అమృత హస్తంతో నువ్వు ఏం పెట్టాలి? అమృతాన్ని అందించాలి కదా! అమృతం అంటే అర్థం ఏమిటి? జ్ఞానమే అమృతం. నీ దగ్గర వున్న జ్ఞానాన్ని అడుగుతున్నాను నేను. నీ దగ్గర వున్న అన్నాన్ని అడగడం లేదు నేను. (ఇక్కడ రెండు భావాలు లేవు, ఇచ్చిన వాడు లేడు, తీసుకునే వాడు లేడు.) ఏమైంది అప్పుడు? వాడి కడుపు నిండాలి కాబట్టి అన్నం పెడుతున్నాను, వాడేమో అన్నం తినాలి కాబట్టి తింటున్నాడు. అది. అర్థమైందా అండీ! ఇలా ప్రతిదాంట్లో అసలుది పోయి, శరీరభావం నిలిచిపోయింది. అట్లాగే అతను ఏమి అడుగుతున్నాుడ? మాధవ కబళం. అర్థమైందా? మాధవకబళం. మాధాకోళం కాదండి. మాధవ కబళంఅది. (మాధవ కబళం) ఆఁ.. నువ్వు తినే వాటిల్లో, భగవంతుడి నిమిత్తమై ఏదైనా తీసిందంటూ వుంటే, అది నాకు పెట్టు. నేను ఎవరిని ఇప్పుడు? పరమాత్మ స్వరూపుడను. అడిగేవాడు ఎవడు? ఆ మాట. పరమాత్మ స్వరూపుడు. ఏమి అడుగుతున్నాడు? నువ్వు పరమాత్మ నిమిత్తము ఏమైనా నిలిపి వున్నది ఏమైనా వుంటే, అది ఇవ్వు నాకు. (అలా వచ్చే వాళ్ళూ లేరు, ఇలా పెట్టే వాళ్ళూ లేరు). అసలు ఇప్పుడు ఎందుకుపోయింది? ఎలా పోయిందిది? లక్ష్యం పోయింది కాబట్టి. అసలు విషయం పోయేటప్పటికి, మీకు ఆచరణలో ఎక్కువ కాలం నిలబడదండి. నేను చెబుతున్నాను కదా! ఈనాడు మీరు చెబుతున్నవి ఏమైనా సరే, ఒక్కటి చెబుతున్నా వినండి. మీ తాతల తరం నాడు, మీరిప్పుడు ఆచరిస్తున్న ఆచార సంప్రదాయాలు ఎలా వున్నాయి? ఇప్పుడు ఎలా వున్నాయి? ఎంతో మార్పు వచ్చేసిందండి. ఇప్పుడు చూస్తున్నారు మీరు. నాలుగు తరాల తరువాత చూడండి. ఏమీ వుండదండి. ఎందుకని? జ్ఞానలక్ష్యం లేకపోతే ఏ ఆచార, సాంప్రదాయం నిలబడదు. సమస్యే లేదండి. మహా అయితే ఒక 100 ఏళ్ళు వుండచ్చు. ఒక 50 ఏళ్ళు వుండచ్చు. ఒక 200 ఏళ్ళు వుండవచ్చు. అంతే తప్ప జ్ఞానలక్ష్యంపోతే ఏ ఆచరణా నిలబడదండి. మీ మంగళ సూత్రం ఇవాళ ఎంతమంది కడుతున్నారు? అయిపోయింది దాని బ్రతుకు కూడా అయిపోయింది. ఎందుకుని? వేసుకునే వాడికి ఆ భావన లేదు. కట్టే వాడికి ఆ భావన అస్సలు లేదు. బోధించగలిగే సామర్థ్యం లేదు. వీరికి శిష్యుడు అనే భావన లేదు. గురుశిష్య సాంప్రదాయమే లేదు అసలిప్పుడు. భార్యాభర్తల మధ్య అస్సలు లేదు. ఒకరు బోధించడం, ఒకరు వినడం అనే విధానం అసలు లేదుగా ఇప్పుడు. ఎవరికి వాళ్ళే. ఎవరికి వాళ్ళే గురువులు. శిష్యులు ఎవరూ లేరు. శిష్యులు లేకుండా గురువులు ఎలా వున్నారు అసలు? వినేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు ఎవరు? అర్థమైందా అండీ? గురునిర్ణయం ఎవరు చేయాలి? శిష్యుడు చేయాలి. వినేవాడు వుంటేనే కదా! అయ్యా! నాకు జ్ఞానాన్ని బోధించమని అడిగితే, గురు నిర్ణయం అయ్యింది. జ్ఞానాన్ని బోధించమని అడుగకపోతే, శిష్యులే లేరు, గురువు ఎక్కడ? కాబట్టి అంతాకూడా ఇప్పుడు ఇలా మార్పు చెంది, కాలమే పరిష్కరించేస్తుందండి వీటన్నింటిని. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఏ సమాజంలో అయినా సరే, గాఢతమోగుణమైనటువంటి ఆచార, సాంప్రదాయాలు ఎప్పుడైతే వచ్చేస్తాయో, దానిని బ్రద్ధలు కొట్టేది కూడా దాని పక్కనే వచ్చేస్తుంది వెంటనే. దాని వేరు పురుగు దాని పక్కనే వచ్చేస్తుందన్నమాట. అది ఎంతగా వెళ్ళి, ఆ మనిషిలో వున్నటు వంటి అహం అంతా చేరిపోతుందండి. చేరిపోయి అంతా అది బిగుసుకుపోతుందన్నమాట. ఎప్పుడైతే బిగుసుకుపోయిందో, మానవుడు దాంట్లోనుంచి వెంటనే ఉద్భవిస్తాడు. స్వేచ్ఛాగత మానవుడు ఉద్భవిస్తాడండి. దానిని వెంటనే బ్రద్ధలు కొడుతాడు. (ఒకాయన వున్నాడు, అది మెడలో వుండడం వల్ల వచ్చింది ఏమిటి? పోయింది ఏమిటి అంటాడు) ఎట్లాగో చెబుతా వినండి. దుఃఖ నివృత్తి దాని వల్ల నీకు వాదనకు మాత్రమే తీసేశావు అది. వాదనకు తీసేస్తే నీకు దుఃఖ నివృత్తి వుండదు. దుఃఖం కలుగకుండా వుండదు. (దాని వల్ల ఏమిటి ఉపయోగం) ఉపయోగం లేదు. నేను చెబుతున్నాగా. ఆఁ.. ఇప్పుడు ఉపయోగం లేదు కరక్టే. నీకు ఉపయోగించుకోవడం తెలిసి నువ్వు విసర్జించడం వేరు. తెలియక విసర్జించడం వేరు. ఇప్పుడు ఉదాహరణ చెబుతానండి. ఇప్పుడు కర్మకాండ చేయాలి. మా అమ్మగారు గతించారు. ఎవరి కోసం చేశావు? ఎవరికోసం చేస్తున్నారు అని చేయించే ఆయన అడిగారు. నాకోసం చేస్తున్నాను నాయనా! నీ కోసం చేయడమేమిటి? మీ అమ్మకోసం కాదా? మా అమ్మకోసం నేను కాదు నాయనా! హరిహరాదులు వచ్చినా చెయ్యటం కుదరదు నాయానా! ఎందుకని? ఒకసారి శరీరం విడిస్తే, దానికి addres  లేదు మరో శరీరం ఈ పాటికి వచ్చి వుంటుంది. నువ్వు దానిని వెతికి పట్టడానికి వీలుకాదు. నువ్వు చెప్పేదంతా నాకు, చేసేది నాకోసం. ఆత్మజ్ఞానం బోధిస్తున్నావు, జీవుడి యొక్క రాకడ, పోకడ బోధిస్తున్నావు. ఇదంతా సత్యం నాకు తెలుసు. నువ్వు చెప్పే సంస్కృత వాక్యాల అర్థం అంతా, తెలిసి నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు నువ్వు ఏం చెబుతున్నావో, ఏం చేస్తున్నావో. కావాలంటే నువ్వు అడుగు. నీకు కూడా చెబుతా. (పోయిన వాళ్ళకోసం కాదు) పోయినవాడికి అడ్రెస్‌ ఏది? శరీరం విడిచిపెట్టిన తరువాత నీ అడ్రెస్‌ ఎక్కడ? (మరి వీళ్ళంతా కలల్లోకి రావడం ఇదంతా ఏమిటి అసలు?) నీ జ్ఞాపకాలు. నీవే. నీ జ్ఞాపకాలే. నీ ప్రాణమనోబుద్ధులే. నీ లోపల వున్న స్ఫురణే. వాళ్ళు ఎవరు, మరొకరు ఎవరూ నీ మూడు అవస్థలలో ప్రవేశించే అవకాశమే లేదు. (మా అమ్మమ్మ రేపు చనిపోతుందనంగా నేడు కలలోకి వచ్చింది) ఇవన్నీ వట్టిదేనండి. అంతా భ్రాంతి గతం. శరీర నిర్ణయం. నీ జ్ఞాపకాలు. నీకు బలంగా ఏవి వుంటే, అవే వస్తాయి. వేరే ఏమీ లేదు అందులో. ఈ జీవుడైనా అంతే. ఎవ్వరైనా అంతే. దేవుడైనా, దెయ్యమైనా, అన్నీ అంతే. అవి ఏమైనా, నీ కలలోకి మరొకరు ప్రవేశించే అవకాశమే లేదు. ఒక్కడికి వుంది అవకాశం. ఎవడయ్యా అంటే, సచ్ఛిష్యుడు, సద్గురువుకు వుంది ఆ అవకాశం. ఎందుకనయ్యా అంటే, సచ్ఛిష్యుడు అవస్థాత్రయాన్ని అధిగమించే స్థితిలో వుంటాడు. మూడు అవస్థలని దాటిపోయినటువంటి స్థితిలో వస్తాడు సచ్ఛిష్యుడు. వచ్చినప్పుడు గురవు ఒక పరీక్షపెడుతాడు. వీడికి కల వుందో లేదో తెలుసుకోవాలి. కల ప్రభావం వుందో లేదో తెలియాలి అంటే, నీవు గాఢ నిద్రావస్థలో వుండగా, అశరీర పద్ధతిలో నిన్ను మేల్కొల్పుతాడు. అది ఒక పరీక్ష అన్నమాట. అశరీర పద్ధతిలో మేల్కొలిపితే, నీకు తెలియాలి అప్పుడు. తెలియాలి అంటే నీకు తెలివి వుండాలి. గాఢ నిద్రావస్థలో కూడా తెలివి వుండాలండి. తెలివి వుంటేనే గురువు మేల్కొలిపింది తెలుస్తుంది. లేకపోతే తెలియదు. అది ఆ పరీక్ష పెడతాడన్నమాట. నువ్వు ఆ స్థితికి వచ్చావో లేదో తెలుసుకోవాలంటే ఈ పరీక్షపెడతారు. అంతకు తప్పితే, ఎవడికైతే అనంత సృష్టికి సంబంధించినటువంటి సృష్టి సంకల్ప బీజం అంటే ఓంకారం దాటినటువంటి స్థితి కలిగినటువంటి మహానుభావులు, సద్గురువులు ఎవరైతే వున్నారో, వారికి ఈ పరీక్షపెట్టే సామర్థ్యం వుంటుంది. వాళ్ళు సంకల్పంతో, ఎప్పుడూ సంకల్పం లేకుండా వున్నటువంటి వాళ్ళు, సంకల్పంలోకి దిగి వస్తారు. దిగివచ్చి ఆ శిష్యుడిని ఉద్ధరించే నిమిత్తమై, సంకల్పంలోకి దిగివచ్చి, ఆ గాఢనిద్రావస్థలో వున్న శిష్యుడిని అక్కడ మేల్కొల్పుతాడు. అశరీర పద్ధతిగా మేల్కొల్పుతాడు అది కూడా. ఏమీ శబ్దాలు వుండవు, ఏమీ వుండవు. నువ్వు తట్టి లేపినట్టుగా వుండడం ఏమీ వుండదు. ఒక్క సంకల్పమాత్రంతో, ఎక్కడో వుండి సంకల్పిస్తాడు. అతడికి వెంటనే తెలుస్తు్ంది. అతడు గాఢనిద్రావస్థలో వుండే సమాధానం చెప్తాడు గురువుకి. బాహ్యం నిదురపోతూనే వుంటుంది. కానీ అంతరంగం మాత్రం, ప్రజ్ఞమాత్రం గురువుతో లీనమౌతుంది. అలాగ తురీయావస్థను, తురీయానుభవాన్ని పొందుతాడు. ఇలా వీటన్నింటికీ నిర్ణయభేదాలతోటి, రకరకాల పరీక్షలు, రకరకాల ఫలితాలు, రకరకాల నిర్ణయాలు వుంటాయి. ఇదంతా ఆత్మజ్ఞాన విషయం జరుగుతూ వుంటుంది. (అంటే కొంతమంది అంటుంటారు దేవుడు కనపడుతుంది, దెయ్యము కనపడుతుంది) ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడొక అంశముందండి. కనపడ్డాయి అన్నవాళ్ళకి కలే అది. కనపడలేదు అన్నవాడికీ కలే. కనపడలేదు అన్నా కలే. కనపడుతోంది అన్నా కలే. ఒకటే గుర్తుపెట్టుకోండి. (కనపడేవాళ్ళంతా భ్రాంతుల్లో వున్నారన్నమాట) అదేం లేదండి. నీదో ఏది ఎంత బలంగా వుంటే, అది అంత బలంగా అక్కడ కనపడుతాయి. మెలకువ అయినా భ్రాంతే. కల అయినా భ్రాంతే. నిద్ర అయినా కూడా భ్రాంతే. కాకపోతే కలలు ఎక్కువగా వచ్చేవాడికి చంచలత్వం ఎక్కువ వుంటుంది. కలలు తక్కువ వచ్చేవాడికి చంచలత్వం తక్కువ వుంటుంది. చంచలత్వం తక్కువ వుండే దాంట్లో మళ్ళా రెండు గుణాలు వుంటాయి. ఒకటి శుద్ధ తమోగుణంతో కూడినటువంటి తెలివి వుంటుంది. శుద్ధ సత్వగుణంతో కూడిన తెలివి వుంటుంది. శుద్ధ సత్వగుణంతో కూడిన తెలివి అయితే, కలలు ఏవీ రాకపోయినా కూడా తెలివి వుంటుందండి. అర్థమైందా అండీ! కలలు ఏవీ రావు వాడికి. కానీ తెలివి వుంటుంది. సహజజ్ఞానం వుంటుంది కలలో కూడా. వాడికి సాధ్యం. కానీ శుద్ధ తమోగుణంలో వున్నవాడికి కలలు ఏమీ రావు. వచ్చినా వాడికి తెలియబడదు. కేవలం మొద్దు నిద్రగా వుంటుంది. ఇలాగ ప్రతీ దాంట్లో కూడాను, మెలకువలోను మూడు గుణాలు వుంటాయి. కలలోనూ మూడు గుణాలు వుంటాయి. నిద్రలోకూడా మూడుగుణాలు వుంటాయి. (మరి కలలు ఎక్కువ వచ్చేవాడికి?) రజోగుణం బలంగా వుంది. పనిచేస్తూ వుంటుంది. కలలో కూడా, నిద్రలో కూడా వాడు స్థిరంగా వుండడు. ఇటూ అటూ పరిగెడుతూ వుంటాడు. పరిగెడుతూ వుంటాడన్నమాట ఆ నిద్రలో కూడా. అది. అందుకని మనసు పరిపరి విధాలుగా అక్కడ ప్రయాణం చేస్తూ వుంటుంది. ఆయా గుణ ధర్మాలను బట్టి, విషయాలను బట్టి, ఏ విషయాలు బలంగా వుంటే, ఆ విషయాలు విమర్శిస్తూ వుంటుంది కలలో. తద్వారా అవి బయటకు రావడమో, లోపలికి పోవడమో, ఆయా వాసనాబలం మేరకు జరుగుతూ వుంటాయి. కలలో ఏం జరుగుతూ వుంటుందంటే, కేవలం వాసనాబలం నిరూపణ. అంతవరకే తప్ప వేరే అందులో ఏమీ లేదు. ఈ రకంగా మూడు అవస్థలు... (తెల్లవారు ఝామున కలవస్తే జరుగుతుంది, అదేమిటి మరి?) ఒక్కటి చెప్తా వినండి. తెల్ల .. వారు.. ఝాము.. అంతేనా అండీ! మొన్న చెప్పాను మీకు. సంధ్యాసమయము. సంధ్యాసమయములో ప్రతిజీవికీ కూడా హంస సుషుమ్నా నాడిలో పనిచేస్తూ వుంటుంది. ఆ తెలివి వున్నటువంటి వాడికి, ఆ సుషుమ్నా నాడిలో హంస పనిచేసేటప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలిగే అవకాశం వుంది. ఆ జ్ఞానం వున్నటువంటి వాళ్ళు అందరూ బ్రహ్మముహూర్తంలో కూడా పనిచేస్తూ వుంటారు. కొంచెం తెలివి కలిగి, నిష్ఠ, ఉపాసనను కలిగి వుంటారు. ఎవరైతే పూర్తి మెలకువలో వున్నాడో, వాడికి కల వచ్చే అవకాశం లేదు. కల అంటే అర్థం ఏమిటి? సగం నిద్ర + సగం మెలకువ. అర్థ జాగృతి అంటారండీ దానినే. అంటే సగం తెలివి వుంటుంది, సగం నిద్రపోతూ వుంటుంది. కల అంటే లేనిది అని నిర్ణయం. అది తెల్లవారు ఝాము కానీ, మిట్టమధ్యాహ్నం కానీ, అర్థరాత్రిగానీ, పగలు గాని. కల అంటే లేనిది. అంతవరకే. అది తెల్లవారు ఝామైనా, మరొకటైనా ఏ భేదమూ లేదు. కల అంటే లేనిదే. అంతకు మించి వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా బండరాతి మీద పెట్టిన గుర్తుల వలే, మానవజీవితంలో మనం, శరీరానుసారంగా పెట్టుకున్నటువంటి గుర్తులన్నమాట. ఆయా శరీరాను సారంగా చేసిన నిర్ణయ ఫలితాల వల్ల, వాటి చుట్టూ తిరగుతూ వుంటావు ఎప్పుడూ కూడా. ఎప్పటికప్పుడు తిరగుతూ ఏం చేస్తూ వుంటావు? అది అలా అయ్యింది, ఇది ఇలా అయ్యింది అని బేరీజు వేసుకోవడం తోటే జీవితం సరిపోతుంది. (మంచి కల వచ్చింది అని) మళ్ళా రేపటికోసం ఎదురు చూస్తూ వుంటావు. రేపు ఏ కల వస్తుందా? రేపు ఏం జరుగుతుందా? ఏమైంది ఇప్పుడు దానివల్ల? వర్త మానంలో జీవించవయ్యా బాబు, నిత్యవర్తమానుడవై జీవించవయ్యా! ఆత్మ జ్ఞానంతో జీవించవయ్యా! అంటే, ఏమైంది ఇప్పుడు? మెలకువలో వుండే మామూలు తెలివితేటలుకూడా పోయినాయి ఇప్పుడు. ఎంతసేపు గతించిన కాలాన్ని తలచుకోవడమే సరిపోతుంది. ఆ కల ఇప్పుడుందా? లేదు. గతించిన కల ప్రభావం, మెలకువ మీద చూపెడుతుందనే భ్రాంతి చేత, మెలకువలో వున్న వివేకాన్ని కూడా కోల్పోయావు.
(సుషుమ్నా నాడి అంటే...)
            కుడిముక్కు, ఎడమ ముక్కు మధ్యలో సుషుమ్నా. అలాగే వెనుక వెన్నుపాములో కూడా మధ్యలో సుషుమ్న, అటు ఇటు ఇడా, పింగళ. అవేమో అంతర ఇడా పింగళ సుషుమ్నలు అంటారు. ముక్కులో వున్నవాటినేమో బాహ్య ఇడా పింగళ సుషుమ్నలు అంటారు. ఈ అంతర సుషుమ్నా, బాహ్యసుషుమ్నా రెండూ ఒక స్థానంలో కలిసిపోతాయి. ఆ స్థానం పేరే బ్రహ్మరంధ్ర స్థానము. అదే ఇంద్రయోని, అదే అన్నీ కూడా. అది ఎక్కడయ్యా అంటే, కొండనాలుక దగ్గర కలిసిపోతాయండి ఇవన్నీ కూడాను. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కులు ఇవన్నీ ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి నాడులు అన్నీ కూడా, కలిసేటటువంటి నాడీ గ్రంధి ఎక్కడుందయ్యా అంటే, కొండనాలుక దగ్గర వుంది. గోమాంసభక్షణం అనే యజ్ఞంలో చెప్పేది ఏదైతే వున్నదో, గోఅంటే అర్థం ఏమిటంటే జీవుడు, ఆ వ్రేళాడుతున్నటువంటి మాంసఖండం ఏమిటయ్యా అని అంటే కొండనాలుక. ఆ కొండనాలుక దగ్గర నుంచి, ఆ నాడీ గ్రంథ భేదనము జరిగినప్పుడు, జ్ఞానప్రభావం చేత, ఆ నాడిగ్రంథభేదనము జరిగినప్పుడు ఒక అమృత బిందువు శ్రవిస్తుంది. అది 24 గంటలకు ఒకసారి. ఒక బిందువు పడుతుంది. ఎవరికయ్యా ఇది అంతా అంటే, ఎవరైతే హఠయోగ సాంప్రదాయికులు వున్నారో, వాళ్ళకి. అందరికీ కాదు. ఇది కేవలం మీరు అడిగారు కాబట్టి మాట మాత్రంగా చెబుతున్నా. ఇది ఆచరణకు పనికిరాదు. ఎవరికైతే లంబికా శివయోగ దీక్ష కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే వుంటారో, ఆ లంబికా శివయోగ దీక్షితులు వాళ్ళ యొక్క విధాన నిర్ణయంలో అలా చేస్తుంటారన్నమాట. అంటే ఈ నాలుకను వెనక్కు తీసుకుంటారు వాళ్ళు. ఈ జిహ్వాగ్రాన్ని తీసుకెళ్ళి, తాళు మూలంలో అంటే కొండనాలుకకు తగిలించి వాళ్ళు ఉపాసన చేస్తారన్నమాట. ఆయా ఉపాసనా విధానం, తాంత్రిక విధానం కలిగివున్నటువంటి వాళ్ళకి మాత్రమే అది ఉపయోగపడుతుంది. కేవలం మీకు యోగ పరిచయం వుండాలన్న వుద్దేశ్యంతో ఇడా పింగళ సుషుమ్న విషయం చెబుతున్నారు. కానీ యోగాన్ని ఆచరించడం కంటే, కేవలము ప్రాణాన్ని గుర్తుపట్టి, శ్వాస ఎలా వెళుతోంది, ఎలా వస్తోంది, సమవేగంతో శ్వాసను నడుపుకోవడం చాలా అవసరం. జ్ఞానం కోసం. కాబట్టి ప్రతివారు వారి యొక్క శ్వాస ఎలా నడుస్తోందనేది మాత్రం గుర్తించాలి. తప్పనిసరిగా. (ఈ రెండు ముక్కులలోంచే గుర్తించాలా? మామూలుగా అయినా గుర్తించవచ్చా?) నువ్వు ఎలా అయినా గుర్తించు. కుడి నుంచి ఎడమకు వెళ్ళాలి, ఎడమ నుంచి కుడికి రావాలి. (అట్లాగే రావాలా?) అలా తిరిగి రావాలి. (మాములుగా వస్తే) మామూలుగా రాదు, కుడికే వెళ్తుంది, కుడికి తిరగివస్తుంది. ఎడమకు వెళ్తుంది, మళ్ళా ఎడమకు తిరిగి వస్తుంది. ప్రయత్న సాధ్యం చేసుకుని దీనిని తిప్పుకున్నట్లయితే, జ్ఞానానికి ఉపయోగపడుతుంది. అథవా తిప్పుకోవడానికి వీలుకాలేదు, కనీసం సమవేగంతో ప్రాణం జరుగుతూ వుందో లేదో చూసుకో! అంటే, ఒకసారి ఎక్కువ తీసుకోవడం, ఒకసారి తక్కువ తీసుకోవడం కాకుండా, పూరక రేచక కుంభకాలు మూడూ కూడా సమంగా వుండేటట్లు చూసుకుంటే, అది నీకు జ్ఞానానికి ఉపయోగపడుతుంది. కారణం ఏమిటంటే, మనసు వాయువు మీద ఆధారపడి వుంది. అర్థమైందా అండీ! ఆ మనసు వాయువు మీద ఆధారపడి వుండడం చేత.