File No.5




అద్దం యొక్క ప్రతిబింబం, నీ లోపల సరిగా వుంటే, నీ బయటంతా ఎప్పుడూ సరిగ్గానే వుంటుంది. దానిని ఏం సరిచేయక్కర్లేదండీ! కానీ మనం జీవితం మొత్తం ఏం ప్రయత్నిస్తాము? బయట దానిని సరిచేయడానికే జీవితమంతా సరిపోతుంది. అది ఎప్పటికీ అది ఒక తీరు తెన్నుగా వచ్చినట్టు కనపడదు. అసలు ఎక్కడ సరిచేసుకోవాలట? నీ లోపల సరిచేసుకోవయ్యా! నీ లోపల వున్న మూడు గుణాలను సరిచెయ్యి. మూడు అవస్థలను సరిచెయ్యి. మూడు వాసనలను సరిచెయ్యి. వాటికి సాక్షిగా వుండటం నేర్చుకో. అప్పుడు నీ బాహ్యం నిన్ను ఏం చేసింది? ఏమీ చెయ్యలేదు. (మనం అనుకునే దానిని బట్టి అది వుంటుంది) అంతే, సద్భావంతో చూడు అంతా సద్భావంగానే కనబడుతుంది. వ్యతిరేకమైన దృష్టితో చూశావు, వాడు మంచికే చెప్పినా నీకు వ్యతిరేకం తోస్తుంది. అసలు అయినా ఇద్దరు లేరు ఇక్కడ. చెప్పేవాడు, వినేవాడు లేరయ్యా బాబూ! ఆత్మ స్వరూపంలో ఇద్దరూ నేనే. ఇద్దరు ఎక్కడున్నారు? నీ లోపల వున్న సూక్ష్మమే, ఆ జీవి యొక్క స్థూలాన్ని ఆశ్రయించి పలికిస్తోంది. ఇది సత్యం. అర్థమౌతోందా అండీ! నేను మొదట్లో కూడా చెప్పాను మీకు. మీరందరూ ఇప్పుడూ నేను మాట్లాడుతున్నాను, మీరందరూ వింటున్నారు  అని మీ అభిప్రాయం అంతే కదండీ! ఎంతో దూరం నుండి మీరు హైదరాబాదు నుంచి ఎందుకొచ్చారు? నేనేదో చెప్తాను మీరేదో వింటారని అంతేనా అండీ? కానీ నాయందు పల్కుతున్నది నీ ప్రజ్ఞ. ఈ శరీరాన్ని ఆశ్రయించి పలుకుతున్నది ఎవరయ్యా? నీ అంతరాత్మయే. నీ అంతరాత్మ, నీ సూక్ష్మం, నా యందు చేరి, దీనిని పనిముట్టుగా వాడుకుని, నీకే వినిపిస్తోంది. ఈ జ్ఞానం, ఇప్పుడు నేను చెబుతున్న జ్ఞానం నాది అనేగా నీ అభిప్రాయం అంతేనా కాదా? నాలోపల వున్న జ్ఞానమైనా, నీ లోపల వున్న జ్ఞానమైనా రెండూ ఒక్కటే. నీ జ్ఞానమే ఈ శరీరాన్ని (ఉపాధిని) పనిముట్టుగా వుపయోగించుకుని నీకే వినిపిస్తున్నది.
            (మరి మా జ్ఞానం ఇలా వుంటే మాకెందుకు తెలియడం లేదు?)
            అదేగా చిక్కు. అదేగా సమస్య. తెలుసుకోలేక పోవడానికి కారణం నీ దృష్టి భేదం. నీవు మూడు గుణాలని, మూడు వాసనలని, ఇంద్రియాలనే పట్టించుకుంటూ జీవిస్తున్నావు. కాబట్టి అది కనబడడం లేదు, వినబడడం లేదు. అదే, సత్యం ఏమిటి ఇప్పుడు? నేను మీ అందరికీ సంబంధించి, నాకేమన్నా తెలుసా మీ జీవితాలు ఈ నలభై యాభై ఏళ్ళు ఏం చేశారో? నాకేం తెలియదు కదా! కానీ నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాను? మీ జీవితాలన్నీ నాకు బాగా తెలిసినట్టే మాట్లాడుతున్నాను. మీ జీవితాలకు సంబంధించిన ఉపమానాలనే చెబుతూవుంటాను. మీకు సరిపడే ఉపమానాలే వస్తూ వుంటాయి. మీకు ఏం చెబితే మీకు అది కరెక్ట్‌గా తెలుస్తుందో ఆ ధోరణిలోనే మాట్లాడుతాం. ఇప్పుడు నేను ఎలా? నాకు ఎవరన్నా training ఇచ్చారా? ఎక్కడన్నా తయారయ్యానా? ఏదన్నా పుస్తకంలో చదువుకుని వచ్చానా? ఏం లేదు కదా! ఎలాగు చెప్తుంది అంటే, అదే సర్వసమర్పణభావం నాయనా! నువ్వు పరమాత్మకు సర్వ సమర్పణ భావంలో వుండు. ఎందుకని? సర్వత్రా వ్యాపించివున్న పరమాత్మకు సమర్పణ భావంలో నువ్వు ఎప్పుడైతే వుంటావో, ఎవరికి ఏది అవసరమో వాడు వస్తాడు, వాడికి నీ ఉపాధి, నీలో వున్న జ్ఞానం, నీ అంతరాత్మ, నీ సూక్ష్మ శరీరం, నీ స్థూల శరీరం అన్నీ ఆ పరమాత్మకు దాసోహం అయి వున్నాయి కదా! అప్పుడు ఏమయి వున్నదట? ఎవరొస్తారో నీలో పనిచేసేదీ ఆ గురు సత్తాయే. ఆ పరమాత్మ సత్తయే. నాలో పనిచేసేది, ఆ గురు సత్తాయే, ఆ పరమాత్మ సత్తాయే. ఇందులో చెప్పేది ఆ గురుసత్తాయే, ఆ పరమాత్మ సత్తాయే. నీలో వినేది ఆ గురు సత్తయే, ఆ పరమాత్మ సత్తాయే. అలా గనుక కాకపోయినట్లయితే నువ్వు వినలేవు, నేను చెప్పలేను. ఎందుకనిట? కాసేప్పటిలో నీకు ఇంద్రియాలు స్ఫురణలోకి వచ్చేస్తాయి, నాకు ఇంద్రియాలు స్ఫురణలోకి వచ్చేస్తాయి. ఏమైపోతుంది అప్పడు? ఇద్దరూ వేరు వేరు అయిపోయారు, భేద భావం వచ్చేసింది. అన్నీ తేడాలు వచ్చేసినాయి. ఎప్పుడైతే ఇద్దరూ ఆత్మభావంలోనే వున్నారండీ! ఎన్ని గంటలు చెప్పినా కానీ, నువ్వు వింటూనే వున్నావు, నేను చెప్తూనే వున్నాను. ఇన్ని గంటలు చెప్పడానికి ఏముందండీ? మిమ్మల్ని అడుగుతారు మీ ఇంటి దగ్గర, ఇన్ని గంటలు మీరు ఏం విని వచ్చారండీ? అంతాకలసి ఏం చెప్పారు మీరు? (మా కోడలు వెళ్ళంగానే అడుగుతుందండీ!) ఆత్మభావంలో జీవించడం ఎలాగో చెప్పారండీ! అంతేకదా! మరి ఎందుకని చెప్పలేకపోతున్నావు? అంటే, నీలో చెప్పే గురుసత్తా వుండి పనిచేయడంలేదు. వాడిలో వినే గురుసత్తా పనిచేయడం లేదు. ఎందుకుని? మీరు సమర్పణ భావంతో జీవించడం లేదు. నిన్ను నువ్వు సమర్పించుకో. నీ అహాన్ని సమర్పించుకో. నీ అహంకారాన్ని సమర్పించుకో. నీ నేనును సమర్పించు. నేను అనేది లేకుండా చేసుకో. పరమాత్మభావంతో జీవించడం నేర్చుకో. అప్పుడు ఏమైంది? ఏం చెప్పారండీ? యథాతథంగా వచ్చేస్తుంది పాఠం. ఎక్కడుంది? అంతా పరమాత్మలో స్థిరం అయ్యి వుంది. ఎప్పుడయ్యా? నువ్వు సమర్పించబడిన భావంలో వుండు. అర్థమైందా అండీ! మా గురువు ఎట్లా నేర్పారయ్యా? అంటే, ఏ పాఠం మాకు ఎప్పుడూ ఏం చెప్పేవాళ్ళు కాదు. ఏం పుస్తకం చదివించేవాళ్ళు కాదు. ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చేవారు, వాళ్ళేవో తెచ్చేవాళ్ళు పుస్తకాలు గట్రా వాళ్ళ సందేహాలు, ఇదిగో వాళ్ళేదో అడుగుతున్నారు గానీ చెప్పు, అనేవాళ్ళు అంతే. అంతే! నాకేమన్నా పనుందా? వాళ్ళేమి అడుగుతారు? నాకేం ప్రశ్నలు లేవు. అడిగేది ఎవరిని? గురువు గారిని. చెప్పేది ఎవరు? గురువుగారు. మధ్యలో నేను ఎవరిని? నిమిత్తమాత్రం పనిముట్టు. మధ్యలో నాకెందుకు? ఆయనేమి అడిగాడు? నేనేం చెప్పాను? ఆ రకంగా ఎప్పుడైతే నువ్వు సమర్పించబడ్డ భావంలో జీవిస్తావో ఏమైంది? అంతా జరిగిపోయింది సవ్యంగా. వాళ్ళు అడగడం అయ్యింది. చెప్పటము అయ్యింది. సంతృప్తి చెందడం అయ్యింది. అందరూ నమస్కారాలు పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి పెట్టారు నమస్కారాలు? అందుకని మన సిద్ధాంతంలో ఎక్కడా పాదనమస్కారాలు కానీ ఏమీ లేవు. ఎందుకని? నీ లోపలా పని చేసేది ఆ అంతరాత్మయే, నా లోపల పనిచేసేది ఆ అంతరాత్మయే. నువ్వు నేను పరమాత్మయందు ఒక్కతీరుగా వున్నాము. వేరుగా ఎక్కడ వున్నాము? కాబట్టి కలిసి జీవించు. కలిసి జీవిస్తే ఏమైంది అప్పుడు? నావలె నీవు జీవించే ప్రయత్నం చేస్తావు. అప్పుడు సహజంగా ఉద్ధరించబడిపోతావు. సహజంగా నీకు ఆ సమర్పించబడిన జీవితము వచ్చేస్తుంది. అప్పుడు ఏమౌతావు? నీ అహాన్ని కోల్పోయావు. నీ అహాన్ని రద్దు చేసేసుకున్నావు. అహం లేకుండా జీవించేటట్టు. అప్పుడు ఏమయ్యావు? సహజంగానే ఆత్మానుభవంలో వున్నావుగా అప్పుడు. అదేగా ఎవ్వరు చెప్పినా, ఎన్ని వేదాలు చెప్పినా, ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎన్ని సారాంశాలు, ఎన్ని ఉపనిషత్తులు చదివినా. అట్లాంటి జీవితం కోసమేగా. మరి జీవితం కోసం ప్రయత్నించాలి కానీ, శాస్త్రం కోసం ప్రయత్నించ కూడదు ఎప్పుడూ కూడా.
            జీవితం కోసం ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది. శాస్త్రం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, అది రాదు. ఎందుకని? ఏదేదో రకరకాల భాషాజ్ఞానం వ్యాకరణ సూత్రాలు, బాగా ఆ సంస్కృత జ్ఞానం, భాషంతా నేర్చుకుని ఎప్పటికి అయ్యేది ఈ ప్రయత్నం? అవునా కాదా? యాభై ఏళ్ళు, అరవై ఏళ్ళ వయస్సులో ఇప్పుడు మొదలు పెడితే ఈ ప్రయత్నం ఎప్పటికి అవుతుంది? కాబట్టి శాస్త్రం నేర్చుకోవడానికి రావడం లేదు నువ్వు. జీవితాన్ని ఎట్లా మార్పు చేసుకోవాలో నేర్చుకోవడానికి వస్తున్నావు. సమర్పించబడినటువంటి, పరమాత్మకు సమర్పించబడినటువంటి విధేయతతో కూడిన జీవితాన్ని ఇప్పటి వరకూ విధేయత లేదు మనదగ్గర ఎంతసేపు తల ఎగరేయడమే. ప్రతిచోట తల ఎగరేయడమే. అహం నేను నేను తల ఎగరేయడమే. అందువల్ల ఏమయ్యావు? పరమాత్మ భావాన్ని కోల్పోయావు. గొప్ప మూల్యాన్ని చెల్లించుకున్నావు, తీవ్రంగా నష్టపోయావు. తెలుసుకోవడం లేదు. ఏదో సాధించాను, ఏదో సంపాదించాను అనుకుంటున్నావేమో, మొత్తం నష్టపోయావయ్యా బాబూ. అర్థమైందా అండీ! అందుకే పరమాత్ముడు ఏం చెబుతున్నాడు? మొత్తం ఇచ్చుట ఎందుకొరకయ్యా? సాంతం పొందుట కొరకే. సర్వం సమర్పించుకొనుట ఎందుకయ్యా? సర్వము పొందుటకే. పరమాత్మకు సమర్పిస్తే ఏమిటట వుపయోగం? నీవు పరమాత్మ ఒక్కడే అని తెలుసుకుంటావు. అప్పుడు ఏం పొందుతావు? దేని కోసం కొత్తగా ప్రయత్నిస్తావు? దేనిని విడిచిపెడుతావు? ఏది నువ్వు కాదు? అక్కడేమీ భేదం లేదు. అంతటా నేనే అయి వున్నాను. అర్థమైందా అండీ?
            ఈ రకమైనటువంటి స్థిరమైనటు వంటి జీవితాన్ని కలిగివుంటావన్నమాట. ఇది స్వేచ్ఛ అంటే, ఇది ముక్తి అంటే. అప్పుడు జనన మరణాలకు ఏం భయపడవు, ఎందుకని? అవి నాలో భాగాలయ్యా. ఔనా కాదా? అంతటా నేనే అయి వుంటే, కొత్తగా పుట్టింది ఎక్కడ? కొత్తగా పోయింది ఎక్కడ? శరీరం అంటావా? కాసేపు వచ్చింది, కాసేపు వుంది, కాసేపు పోయింది. సూక్ష్మం దానికి చావు పుట్టుకలు లేవు. సూక్ష్మానికే లేనప్పుడు దానికి అధిష్ఠానమైన నాకెక్కడవి. ప్రాణ మనో బుద్ధులకే చావు పుట్టుకలు లేనప్పుడు, నాకు వున్నాయా? నాకెట్లా వుంటాయి? నేను వాటికి సాక్షిని కదా! ఇలా ఆలోచించాలి. సాయిరాం.


ఓమ్‌ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం తత్‌ సత్‌

ఓమ్‌ సహనా భవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతవస్తు మా విద్విషావహై ఓం శాంతిః శాంతిః శాంతిః