File No.3



ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

ఓం తత్‌ సత్‌

ఓం సహనా వవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతవస్తు మావిద్విషావహై ఓం శాంతిః శాంతిః శాంతిః
సాయిరాం,
మొదట్లో మనం ఇక్కడే కదా మొదలు పెట్టింది, ధర్మార్థకామమోక్షాల దగ్గరే మనం కూడా క్లాస్‌ మొదలు పెట్టాము. దానిని ఎలా విచారణ చేశాం?
ధర్మాన్ని ఆచరించాలి, ఎట్లా ఆచరించాలయ్యా?
మోక్షం దృష్ట్యా ధర్మాన్ని ఆచరించాలి.
అర్థాన్ని సంపాదించాలి, ఎట్లా సంపాదించాలయ్యా?
మోక్షం దృష్ట్యా అర్థాన్ని సంపాదించాలి.
కామాన్ని (కోర్కెని) అనుభవించాలి, ఎట్లా అనుభవించాలి?
మోక్షం దృష్ట్యా కోర్కెను అనుభవించవయ్యా!
అలా చేసినట్లయితే అవి నిన్ను బంధించవు. ఇప్పుడు మనని బంధించేవి ఏమిటి? ఈ ధర్మార్థకామాలే. వేరే ఇంకేమీ లేదు. చూడండి మీరు, ఏ పని చేయనివ్వండి, అది ధర్మం కాదు కదా! అవునా కాదా? లేకపోతే అది నష్టం కదా! ఇది లాభం కదా! అది ఇష్టం కదా! ఇది అయిష్టం కదా!
ఇష్టాయిష్టాలు ఎందులోవి?
కామంలోవి. కోర్కెలోవి. అర్థమైందా?
'అది లాభం కదా, ఇది నష్టం కదా' అనేవి అర్థం లోవి.
అది ధర్మం కదా, ఇది అధర్మం కదా అనేవి ధర్మం లోవి.
మనం మాట్లాడే వాటన్నిటిలోనూ ఇవేనా వున్నాయి?
అన్నీ రూల్స్‌ ఇవేగా మనం మాట్లాడేది, ఏదన్నా చేయనివ్వండి. మీరే పొద్దున్న లేచారండీ, ఏదో పొరపాటున కారణం చేత బొట్టు పెట్టుకోలేదండీ! ఇప్పుడేమైందట? ప్రమాదం ఏమన్నా వచ్చిందా? ఏం రాలేదుగా. వున్న నొసలును ఎవరూ తీసేయలేదుగా. అర్థమైందా? నిలువు బొట్టు పెట్టినా, అడ్డబొట్టు పెట్టినా, అసలు బొట్టు పెట్టకపోయినా వున్న నొసలను ఎవరూ ఏమీ మార్చలేరుగా. అవునా కాదా? కానీ అందరూ ఎట్లా అలవాటు పడిపోయారు? మీకు మీరే అద్దంలోకి చూసుకోగానే, ఏదో పెద్ద బ్రహ్మాండం బ్రద్దలైపోయినట్లు, ప్రమాదం వచ్చేసిందనే భావన మీకు కలుగుతుంది. ఎందువల్ల?
అది ధర్మం కాదు కదా!
ఏమిటి ధర్మం కాదు?
అది ఆచరించడం ద్వారా, నీవు మోక్షం మీద దృష్టితోనే ఆచరిస్తున్నావా దాన్ని?
ఆచరించడం లేదు కదా!
మరప్పుడు అది ధర్మం ఎలా అయ్యింది?
ధర్మం అంటే అర్థం ఏమిటయ్యా అంటే నువ్వు అది ఆచరించినప్పుడు నీకు మోక్షం గుర్తుకురావాలి నాయనా!
(ఇన్నాళ్ళు) ఆ వివరణ ఎవ్వరూ మాకు ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడు మార్చుకోవాలి.
చెప్పేది ఏమిటంటే, గతం గతః. ఇప్పుడు ఆచరించేటప్పుడు నేను ఈ పని చేస్తున్నాను ధర్మం అని. ఇది ధర్మం ఎప్పుడు అయ్యింది? ఇది చేస్తున్నప్పుడు నాకు మోక్షం యొక్క జ్ఞాపకం కనుక వచ్చినట్లయితే, నేను ఈ మానవజన్మ ఎత్తి ఈ ధర్మాన్ని ఎందుకు ఆచరించ వలసిన పరిస్థితి వచ్చింది? అంటే, ఈ మానవజన్మకు గమ్యం ఏమిటి? మోక్షమే గమ్యం, వేరే లక్ష్యం లేదు. మోక్షం అంటే ఏమిటయ్యా? మళ్ళా పుట్టడానికి వీలు లేదు, మళ్ళా చావడానికి వీలు లేదు. జన్మ మరణం రెండూ లేకుండా చేసుకోవడమే మోక్షం. అర్థమైందా అండీ? కాబట్టి నేను ఈ ఆచరణ చేసేటప్పుడు నేను ఆ దృష్టితో చేస్తున్నానా? ఆ శాశ్వతమైనటువంటి దృష్టితో కనుక చేస్తే, అది ధర్మం అయ్యింది. ఈ ఆచరణ ద్వారా నాకది లభించాలి. అంతేకదా!
ఏం చేసినా ఎవరైనా మోక్షాన్ని ఆచరించడానికి వీలౌతుందా?
వీలు కాదు కదా!
ఏం ఆచరించుతాం మనం?
ధర్మం అర్థం కామం. ఈ మూడింటిని ఆచరించేది.
ఆచరించేది ఈ మూడే, కానీ ఏ లక్ష్యంలో? ఆ మూడు ఆచరిస్తే ఫలితం ఏది రావాలట?
మోక్షం అనే ఫలితం రావాలి.
కానీ ఈ మూడు ఇప్పటి వరకూ ఆచరించ లేదా?
ఆచరించాం.
కానీ ఏం రాలేదు?
మోక్షం అనే ఫలితం రాలేదు.
అంటే ఏమనుకుంటాం?
అది నాలుగోది, ఈ మూడు అయిపోయినాక ఆ నాలుగోది చేద్దామని మన అభిప్రాయం.
అంటే ఆ నాలుగోదాని యొక్క సంగతే లేదు, ఆ జోలే లేదు మనకి.
ప్రతి వాళ్ళు మీకు పెళ్ళిలో చెప్పనివ్వండి, నామకరణంలో చెప్పనివ్వండి, ఎప్పుడన్న చెప్పనివ్వండి ధర్మార్థ కామ మోక్షాలు నాలుగు చెబుతున్నాడుగా అక్కడ. నాలుగు పురుషార్థాలని జీవుడనేవాడు ప్రయత్నించాలి, పురుషార్థములు అంటే ప్రయత్న సాధ్యములు. సాధనతో సాధింపబడేవి. నీవు ప్రయత్నం చేసి సంపాదించాలి వాటిని. అని చెబుతున్నాడుగా. పురుషార్థములు అంటే పురుషులు చేసేవని కాదు. మానవ దేహం ఎత్తినటువంటి ప్రతి జీవుడికి ధర్మార్థ కామ మోక్షాలను ఆచరించేటటువంటి అర్హత వున్నది. ఆ మోక్షం అనే ఫలితాన్ని పొందే అవకాశం వున్నది. జంతువులకు లేనిది, మానవులకు కలిగినది ఇది ఒక్కటే. పరమాత్మ ఇవ్వగలిగేది కూడా ఇది ఒక్కటే.
            ప్రతి నిమిషం నువ్వు పరమాత్మని నాయనా నువ్వు కొబ్బరికాయ ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని అడగాల్సిన పనిలేదు. ఆయన చేసేదేదో ఒకసారే చేసేశాడు, ఏమిటి చేశాడు?
84 లక్షల జీవరాశులలో, వాటికి ధర్మం వుందా వాటికి?
ధర్మం అనే విచక్షణ వుందా?
ధర్మాధర్మ విచక్షణ లేదు.
లాభనష్టాల విచక్షణ వుందా?
లేదు.
కోర్కె ఒక పరిమితమైన దాని మేరకే అన్నం ఆహారం సంపాదించుకోవడం, నిద్రపోవడం, వాటి సంసారాన్ని చేయడం. ఇంతవరకే వాటికి పరిమితులు విధించి, 84 లక్షల జీవరాశులు జీవిస్తున్నాయి. కానీ
ఈ ధర్మార్థ కామాలలో నూరుశాతం స్వేచ్ఛ ఎవరికి ఇచ్చాడు?
మానవుడికి ఇచ్చాడు.
కోర్కె అనేది వుంటుందా వాటికి (జంతువులకు)?
అయ్యో! కోర్కె లేకుండా సంసారం ఎలా చేస్తుంది అది? పునరుత్పత్తి ఎలా ప్రారంభిస్తుంది? జన్మని ఎలా ఇస్తుంది శిశువుకి జీవరాశులు? కోర్కె లేకుండా అసాధ్యం కదా!
కానీ పరిమితమైన స్థితి వరకే వుంది, వికసించలేదు. విచక్షణ చేయలేదు దానిని. కానీ ధర్మార్థకామాలని మూడింటినీ కూడా పూర్తి స్వేచ్ఛతోటి ఆచరించగలిగే సామర్థ్యం ఏ ఉపాధికి వుంది ఇప్పుడు?
మానవ ఉపాధికి వుంది.
ఇంక పరమాత్మ నీకు చేసే సహాయం ఏమిటి?
ఇదే మొదటి సహాయం, ఇదే ఆఖరి సహాయం కూడా. కానీ మనిషి భ్రాంతికి లోనై, నాయనా నాకు భోజనం లేదు, భోజనం పెట్టు. నాకు గుడ్డలేదు, గుడ్డ ఇవ్వు. నాకు అది లేదు, ఇదివ్వు. అదిలేదు, ఇదిలేదు, ఇలాగ ఏకరవు పెట్టుకోవడం అలవాటుపడిపోయాడు. నాకు ఆరోగ్యము లేదు, ఆరోగ్యాన్నివ్వు. మా అబ్బాయికి ఉద్యోగం లేదు, ఉద్యోగాన్నివ్వు. మా కోడలకు అది లేదు, ఇది ఇవ్వు. ఇట్టాగ వరుసపెట్టి ఏ కరువు పెట్టుకోవడం అలవాటు పడిపోయాడు. అందువలన ఏమైపోయింది? నువ్వు ఆచరించినటువంటి ప్రతీది, మోక్షమనే ఫలితం లేకుండా పోయింది. ఆఁ... ధర్మాన్ని ఆచరించావు, ఎందుకు ఆచరిస్తున్నావు? [అడిగితేనే ఇవ్వట్లేదు, అడగకపోతే అసలువ్వడేమో?] (పొరపాటు పడుతున్నావు అక్కడే) భగవంతుడు ఇచ్చేది మొదటిది, ఆఖరిది ఒక్కటే సారి ఇస్తాడు, మళ్ళా మాటి మాటికి ఇవ్వడం ఏమీ వుండదండీ. ఇదేం మనం పెట్టినట్టు కాదు కదా! పరమాత్ముడు జీవుడికి మొదటి సహాయం, చివరి సహాయం ఒక్కటే చేస్తాడు. ఏమిటయ్యా అంటే, నిన్ను జంతువు శరీరంలోనుంచి పరిణామం చెందించి, మానవ ఉపాధికి వచ్చేట్టుగా చేయడమే, మొదటి, చివరి, ఆఖరి సహాయం. ఇక అంతకు మించి కొత్తగా చేసేది ఏమీ లేదు. (మరీ ఏమీ చెయ్యకపోతే మరి ఈ పూజలు ఇవన్ని ఈ కోరికలన్నీ ఎందుకు?) ఇవన్నీ నీకు ఈ సత్యం తెలియజెప్పడం కోసమే. ( కోరికలు కోరుతున్నాము కదా, సత్యం తెలియజెప్పడానికి)  ఎందుకని? కోరగా కోరగా చాంతాడంత కోరావండీ, 30 ఏళ్ళ నుంచి కోరావు ఏమైంది? ఏమన్నా అయ్యిందా? ఏమీ అవ్వలేదు. ఏమైందిప్పుడు, ఏం తేలింది ఏతా వాతా? ఆయన విగ్రహం. అంటే ఏమిటి? నీవు చెప్పేది ఏమన్నా స్వీకరిస్తాడా? స్వీకరిస్తే విగ్రహం అవుతుందా అది? ఇప్పుడీ 40 ఏళ్ళ నుంచి రకరకాల నైవేద్యాలు పెట్టావండి, ఏమన్నా స్వీకరించిందా అది? నువ్వు పెట్టిన నైవేద్యమే స్వీకరించలేనటువంటిది, నువ్వు కోర్కెల్ని ఇస్తే, చాంతాడంత చెబితే అదేమి సమాధానం చెబుతుంది? చెబుతుందా? చెప్పదు కదా!
మరి ఎవరయ్యా చెప్పేది?
నీ హృదయంలో వున్నటువంటి పరమాత్మ.
వినేది ఎవరయ్యా?
నీ హృదయంలో వున్న పరమాత్మ.
సమాధానం ఇచ్చేది ఎవరయ్యా?
నీ హృదయంలో వున్న పరమాత్మే.
నీలో ఒక పరమాత్మ స్థితి వున్నది. అది సమాధానం చెబుతోంది. ఏది విచక్షణ, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిర్ణయం, ఏది కాదు, ఏది ఏం  చేయాలి? నీకు మార్గదర్శకత్వం లోపలి నుంచి అంతః స్ఫురణ ద్వారా ఇస్తుంది. కానీ మనం అంతఃస్ఫురణని మూసేశాం. (గమనించకుండా) దాన్ని వదిలేశాం. నువ్వు ఇట్లాగే చెబుతావులే. నాకు ఇదే కావాలిలే. అనడం అలవాటు చేశావు. అభ్యాసం ఇలా చేశావు.
ఇప్పుడు పరమాత్మ స్ఫురణ లేదా ఎవరికైనా సరే?
వుందది, లోపల ఎప్పుడూ పనిచేస్తూనే వుంది అది.
(ఒకే సారి చెప్తుంది కదా!)
మరి స్ఫూర్తి అంటే అర్థం అదేగా. నువ్వు దాన్ని ఆధారం చేసుకుని జీవిస్తే, అదే జీవితం అయిపోతుంది. మామూలుగా నీవు నీ మనసు మీద బుద్ధిమీద ఆధారపడి జీవించాల్సిన అవసరం లేదు.
(అదేమో ఒక్కసారి చెప్పేటప్పటికి, ఈ మనసేమో 10 సార్లు చెప్తుంది)
ఎవడు వినమన్నాడు నిన్ను? అంటే అర్థం ఏమిటి? ఏది స్ఫురణో, ఏది మనసో విచక్షణ లేదన్నమాట. అర్థమైందా అండీ? నువ్వు ప్రశ్న వేశావండి, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ప్రశ్న వేస్తే ఏ పరిస్థితులలోనైనా ఒకే సమాధానం చెప్పేది అంతఃస్ఫురణ (మరలా మరలా చెప్పదు కదా అదీ!) రెండవసారి చెప్పదు. ఒకసారే చెప్తుంది, ఎప్పుడడిగినా ఒకే సమాధానం చెప్తుంది. ఎట్లా అంటే, చెబుతా వినండి. ఎప్పుడడినా అంటే అర్థం ఏమిటి? మనస్సేమో పరిస్థితులను బట్టి మార్చి సమాధానం చెప్తుంది. కానీ, అంతఃస్ఫురణ అనేది పరిస్థితులను బట్టి మార్చి చెప్పదు సమాధానం. నీ పరిస్థితి ఎలా వున్నా, తనదైన పద్ధతిలో సమాధానం చెప్తుంది. అంతేగాని నాలుగు సమాధానాలు ఇవ్వదు. నీ ఇష్టం. ఇలా కాకపోతే అలా చేసుకో, అలా కాకపోతే ఇలా చేసుకో, ఇలా కాకపోతే అలా కూడా చేయొచ్చుకదా! ఇలా ఏం మాట్లాడదు. అడిగిన ప్రతిసారి అదే సమాధానం repeat అవుతుందా? అవుతుంది. మళ్లా అదే సమాధానం చెప్తుంది. ఒకే సమాధానం కూడా మరళా మరళా వస్తుంది. ఎందుకని? ఎన్ని పరిస్థితులు వున్నా గుణాలు అవే కదా! గుణాల యొక్క వ్యక్తీకరణయే కదా పరిస్థితులు. అంతేనా కాదా! నీకు రజోగుణం కలిగినప్పుడల్లా విషయం మారవచ్చు. కానీ గుణం అదేగా. అంతేనా కాదా? సత్వగుణం - గుణం అదే, చేసే పని ఏదైనా కావచ్చు. జపం కావచ్చు, యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, ధ్యానం కావచ్చు, పూజ కావచ్చు, తపం కావచ్చు, నువ్వు ఎన్ని పనులైతే చేస్తున్నావో, ధర్మ అర్థ కామాలనే మూడూ కూడా ఆ మూడు గుణాలతో కూడుకుని వున్నాయి. అందువలన పరిపరి విధాలుగా కనపడుతున్నాయి. కానీ, నీ లోపల వున్న అంతః స్ఫురణ ఏం చేస్తోంది? ఆ మూడు గుణాలనీ, ఈ ధర్మార్థ కామాలని సరియైన దిశగా నడుపుతూ వుంటుంది. ఆ అంతఃస్ఫురణ ఎప్పుడూ కూడా. అదే అంతర్యామి. అదే అంతరాత్మ. పైనున్న శరీరమేమో దేహాత్మ అయితే, దాని లోపల పనిచేసేది అంతరాత్మ. నీ అంతరాత్మను అడిగి చెప్పు అంటాం మనం అందుకే. అప్పుడేమిటి? నిర్థారణగా తెలుస్తుంది అని. వాడి హృదయంలో వున్నటువంటి అంతరాత్మ, వాడిని అడిగి చెప్పు, నీ గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పు, నీ అంతరాత్మను అడిగి చెప్పు అంటున్నావు. కానీ అదసలు వుందని నీకు గుర్తు వుంటే కదా! ఎందుకని? నీ జీవిత ఆచరణలో దానిని ఆశ్రయించి జీవించడం లేదుగా.
            ధర్మార్థకామాలను ఆచరించేటప్పుడు ఇవి మోక్ష ఫలితాన్ని ఇవ్వాలి కదా! మరి ఇవి మోక్ష ఫలితాన్ని ఇవ్వటం లేదు కదా! నేను ఎక్కడ తప్పుదారి పట్టి పోయాను అని ఎప్పుడైనా కానీ విచారణ చేశామా? చెయ్యలేదు కదా! విచారణ చేస్తే మేలుకొనేది ఎవరయ్యా ఇప్పుడు. అంతరాత్మ మేలుకొంటోంది.
            ఆత్మ విచారణ చేస్తే ఏమిటయ్యా ప్రయోజనం? ఈ అభ్యాసం వల్ల ఏమిటి ప్రయోజనం? అంటే, ఇప్పటి వరకూ ఎవరినైతే నువ్వు పట్టించుకోకుండా వదిలేశావో, ఆ అంతరాత్మ మేలుకొంటోంది. అది నిరంతరాయంగా నిన్ను హెచ్చరిస్తూ వుంటుంది. అది గుణాలకి లొంగదు. అది పరిస్థితులకు లొంగదు. అది విషయాలకు లొంగదు. అది ఇంద్రియాలకు లొంగదు. అర్థమైందా అండీ! మిగిలినవి ఎంత బలమైనవి అయినా కానీ, అది దానికి లొంగదు. నేను అది చెప్పే సమాధానం ఎప్పుడూ చెబుతుంది. నువ్వు నీ మనస్సు ఎన్నన్నా చెప్పనీ, నీ బుద్ధి ఎన్నన్నా చెప్పనీ, నీ అనుభవజ్ఞానం ఎన్నన్నా చెప్పనీ, అది లాభం రానీ, నష్టం రానీ, ధర్మం గానీ, అధర్మం గానీ, ఫలితం రానీ, రాకపోనీ, దానీ సమాధానం ఎప్పుడూ ఒక్క తీరుగానే వుంటుంది. అంటే ఏమిటి అది అంతఃస్ఫురణ. అని మనం గుర్తుపట్టడం లేదు. అది అంతరాత్మ చెబుతోంది, అరె దాన్ని పట్టుకుంటే ఈ గొడవంతా వదిలి పోతుంది, అనేటటువంటి సూత్రం తెలియక పోవడం చేత, ఎంతసేపు నీకు అనువుగా వున్నటువంటి మనసునో బుద్ధినో ఇంద్రియాలనో పట్టుకుని వేలాడుతూ వుంటావు.
            (అది ఒకసారి చెబితే ఇది 10 సార్లు చెబుతుంది కాబట్టి ఇదే గుర్తు వుంటుంది)
            ఎందుకు వినాలి? ఈ పది సార్లు చెప్పేది వింటే దుఃఖం వుందిగా మరి! అప్పుడు దీనినే కదా విచారణ చేయవలసినది, అప్పుడు అంతరాత్మ ఏం చెబుతోంది? ఒక్కసారి ఆలోచించు. పూర్వం అంతా ఇలాగే చేశావు కదా! ఇలా చేస్తే దుఃఖం వచ్చింది కదా! మరి ఎందుకు నువ్వు అటు పోతున్నావు? అని హెచ్చరిస్తోంది కదా అది. కానీ ఏం చేస్తోంది ఇది? అదే సుఖంగా వుంది అంటోంది. అర్థమైందా అండీ?
            ఆ కారణం చేత, అభ్యాసబలం అటువైపు వుండటం చేత, ఆత్మ విచారణ లేకపోవడం చేత, రెండు సమస్యలు అన్నమాట. ఏమిటట? 1. తెలుసుకోవలసినది తెలుసుకోకపోవడము, 2. తెలుసుకోకూడని దానివెంట పడడం. రెండు చిక్కులు వున్నాయన్నమాట అందులో. ఏమిటట? దేనిని అనుసరించకూడదో, దేనిని ఆశ్రయించ కూడదో, దానిని ఆశ్రయించడం. దేనిని అనుసరించాలో, దేనిని గుర్తించాలో, దానిని గుర్తించక పోవడం. ఈ రెండూ నీ లోపలే వున్నాయి. చిక్కులు. బయట ఎక్కడా లేవు. మనం అన్నీ ప్రతీ సమస్యకు కారణం ఎక్కడ చెబుతాం? బయట చెబుతాం. ఇదిగో ఈ సమస్యకు కారణం వాడు. అని ఎప్పుడూ బయటకు చూపెడుతావు. నీ సమస్యకు కారణం బయట కాదు. నీ లోపల వుంది. ఏమిటి? నీ అంతరాత్మను సరిగ్గా పట్టించుకో మొట్టమొదట. వాడు (అంతరాత్మ) ఏం చెప్తున్నాడో విను. ఈ సమస్య మూలాన్ని వాడు పరిశోధిస్తాడు. పరిశోధించి ఏం చెప్పాడు? నీకు ఈ విషయంలో రజోగుణ ప్రభావం వుంది కాబట్టి నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఇట్లా ప్రవర్తించావు కాబట్టి పరిస్థితి ఇట్లా తయారైంది. నిన్ను రజోగుణంతో ఎవరు ప్రవర్తించమన్నారు? ఈ విషయంలో. అని నిన్ను నిట్టనిలువున నిలదీస్తుంది అంతరాత్మ ఎప్పుడూ కూడ. నీ తప్పును అదేం క్షమించదు అది. దానికేం తన మన పర భేదం వుండదు అక్కడ. అది నిట్టనిలువుగా మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు చేయాలి ఇట్లాగ? నువ్వు ఇట్లా చేయడం ఎందుకు? వాడిది తప్పు అని అనడం ఎందుకు? నువ్వు వాడిది తప్పు అన్నంత మాత్రానా ఇప్పుడేమన్నా అయ్యిందా? (ఇంత విమర్శ చేస్తుందా?)
            ఆఁ... ఎంతటి బలమైన స్ఫురణ వుంటుందంటే అది, అంటే నువ్వు దానిని ఆశ్రయించడం లేదు కాబట్టి నీకు ఆ స్ఫురణ తెలియడం లేదు. అంతే. అర్థమైందా అండీ. ఆశ్రయిస్తే ఏమౌతుంది? దానికే బలం పెరుగుతుంది. అదే నేను ఉదయం చెప్పింది కూడా. నేను అనేది నీలోపల వున్నది. ఈ నేను ఎటువంటిదట? నువ్వు బాల్యంలో వున్నావండీ! ఆట వస్తువే నీ ప్రపంచమా? ఎందువల్ల? 'నేను' అనేది ఆ ఆటవస్తువు విషయంలో చేరిపోయింది. చేరిపోతే ఏమయ్యింది? అదే ప్రపంచం అయిపోయింది. తరువాత పుస్తక ప్రపంచం. ఆ తరువాత విషయ ప్రపంచం. ఆ తరువాత సంసార ప్రపంచం. ఆ తరువాత తాపత్రయ ప్రపంచం. వస్తున్నాయా లేవా? లైన్‌ లో అందరికీ. ఎలా వచ్చినాయి? అంటే నీ నేనుకు ఒక శక్తి వుంది. నువ్వు ఎటు చూపెడితే అందులో చేరిపోతుంది అది. ఈ అహం అనే నేను, నువ్వు ఆకారం వైపు చూపెట్టావు, అందులో చేరిపోతుంది. కాదు... పరమాత్మ వైపు చూపెట్టావు, అందులో చేరిపోతుంది. కాబట్టి తప్పెవరిదయ్యా? దానిని సరిగ్గా నడపలేకపోవడం, ఆ అహం అనే నేను అనే వృత్తి బుద్ధిలో వున్నదే, ఆ బుద్ధిని నువ్వు ఎటు నడపాలట? తన మూలమైనటువంటి ఆత్మ భావంలోకి, పరమాత్మ భావంలోకి కనుక నువ్వు నడిపితే, ఏమైందట అప్పుడు? నేను ఎప్పడూ ఆత్మస్వరూపుడనే. కాదూ... సమిష్టిగా పరమాత్మ స్వరూపుడనే. నాకు ఏ భేద భావన లేదు కదా! ఎవరి యెడలా లేదు కదా! అందరి యెడలా సర్వ సముడుని కదా! నేను సాక్షీ స్వరూపుడుని కదా! నేను జ్ఞాన స్వరూపుడుని కదా! నాకు ఏ అజ్ఞానము లేదు కదా! నాకు ఏ దుఃఖము లేదు కదా! నాకు ఏ కోరికలు లేవు కదా! నేను శాశ్వత స్వరూపుడను కదా! నేను అనంతుడిని కదా! ఇలాంటి వాక్యాలు వుంటాయి అంతరాత్మలో. ఈ వాక్యాలు అన్నీ ఎక్కడినుంచి వచ్చానాయి? ఎక్కడి నుంచి విన్నారు ఈ పుస్తకాలలో వన్నీ, తన యొక్క అంతరాత్మయందు వున్నాయి ఇవి అన్నీ. ఆ స్ఫురణలో వున్నాయి. దానిని ఆశ్రయించి జీవించినవాళ్ళకు ఈ వాక్యాలు అన్నీ తోచినాయి. ఆయనేం చేశాడు? గ్రంథస్తం చేశాడు. నాయనా! నువ్వు ఈ వాక్యాలను నిరంతరం మననం చేయి, మననం చేస్తే ఏమిటయ్యా వుపయోగం? అంటే, నీ అంతరాత్మ ఇదే వాక్యాలు చెబుతూ వుంటుంది. ఆ వాక్యాలు చెప్పినప్పుడు ఈ వాక్యాలు అక్కడ తోస్తాయి కదా! వెంటనే నీకు తెలుస్తుంది నా అంతరాత్మ మేలుకుందిరా బాబు. లోపలనుంచి నీకు ఈ వాక్యాలు వినపడుతూ వుంటాయి. ఈ సమాధానాలు వస్తూ వుంటాయి. ఎవరు చెబుతున్నారు ఈ సమాధానాలు? నీ అంతరాత్మ చెబుతోంది. దానిని పట్టించుకో. ఇంతకుముందు ఈ వాక్యాలలో అది చెబుతుందని నీకు తెలియదు కదా! దాని ధోరణిలో అది చెబుతూ వుంటుంది. అది ఎట్లా చెబుతుందో నీకు ఆ విషయమే తెలియదు కాబట్టి ఏం చేశావు? అది మనసు చెబుతోందా? అంతరాత్మ చెబుతోందా అనే భేదాన్ని గుర్తించలేవు. అందుకని ఆత్మ విచారణలో భాగంగా నీకు ఏ వాక్యాలు చెబుతున్నారయ్యా అంటే, నీకు నీ అంతరాత్మ ఎలా స్ఫురణను ఇస్తుందో, ఆ వాక్యాలే ఇక్కడ చెబుతూ వుంటారు. అందువల్ల ఏమౌతుందిఅనుభవజ్ఞుడు అయినటువంటి గురువుగానీ, శాస్త్రం గానీ ఆ అంతరాత్మ స్ఫురణ మీలోనుంచి ఎలా ఇస్తూ వుంటుందో ఆ వాక్యాలు నిరంతరాయంగా చెబుతూ వుంటారు. ఏమౌతుంది వినటం ద్వారా నీకు? నీలోపల స్థిరపడుతాయి. నీ అంతరాత్మ చెప్పే వాక్యాలు, నువ్వు బుద్ధిలో విన్న వాక్యాలు రెండూ కూడా ఒకటే అయిపోతాయన్నమాట. ఎప్పుడైతే ఒకటైనాయో, నువ్వు వెంటనే గుర్తు పట్టకలుగుతావు. ఓహో! నా అంతరాత్మ మేలుకొందిరా బాబు, దీనిని పట్టుకోవాలి నేను. ఇప్పటి వరకూ ఈ వాక్యాలు తెలియక పోవడం చేత ఏం చేశావు? మనసు చెప్పే వాక్యాలే సత్యం అనుకున్నావు.  అర్థమైందా అండీ!
            "దొండపండు రంగు చీర అండీ, అద్భుతంగా వుంటుందండీ!" ఎవరు చెప్పారు? అంతరాత్మ చెబుతుందా ఇలాగ? దానికేం పని? దొండపండు రంగైతే ఏమిటి? బంగారు రంగైతే ఏమిటి? దానికేమన్నా తేడా వుందా? ఏమీ లేదు. ఎక్కడైనా, ఏ శాస్త్రంలోనైనా ఇలా వుందా? లేదు కదా! ఎందుకని? అది మనసు చెప్పే వాక్యం కాబట్టి, విషయానికి సంబంధించిన వాక్యం, దృశ్యానికి సంబంధించిన వాక్యం, శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే ఐదు విషయాలకు సంబంధించిన వాక్యాలు నీ మనసులో వుంటాయి ఎప్పుడూ కూడా. వాటికి సంబంధించిన సాక్షిత్వానికి సంబంధించిన వాక్యాలు అంతరాత్మలో వుంటాయి. అంతరాత్మ ఎప్పుడూ సాక్షిగా ప్రవర్తించమని చెబుతూ వుంటుంది. నువ్వు గుణాలకు లొంగమాకు. ఇంద్రియాలకు లొంగమాకు. అవస్థలకు లొంగమాకు. నువ్వు సాక్షివి. నేను అనే సాక్షి అందులోకి చేరిపోకూడదు అని అంతరాత్మ ఎప్పుడూ నిరంతరాయంగా చెబుతూ వుంటుంది.      
            మీరు చూసుకోండి ఒక్కసారి, మీకు బాగా క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు లోపల నుంచి ఒక స్ఫురణ వస్తుంది. నీకేంపని దానితోటి? ఈ రెండు మాటలు అది చెబుతుంది. ఎవ్వరికైనా చెబుతుంది ఈ మాటలు. వెంటనే నీకు విచారణ కలుగుతుంది. అవును నాకెందుకు అసలు ఇందులో? నాకేం పని? వెంటనే వెనక్కు తగ్గేస్తావు. ఈ రెండు ప్రశ్నలు రాగానే, వెంటనే విరమించేస్తావు, వెనక్కి విరమించేస్తావు. పరిస్థితి ఎంత బలంగా అయినా వుండనివ్వండి. నీ లోపల స్ఫురణ ఈ రెండు ప్రశ్నలు వేయగానేఏం చేస్తావు? అమ్మో! ఏదో ప్రమాదం వుందిరా బాబు. అని నా లోపల చెబుతోంది. ఆఁ... ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. అది అట్లా చెప్పినా కూడా వెళ్ళావండీ, ఏమౌతావు?
(దానికంటే బలంగా ఈ మనసు చెబుతుంది)
నువ్వు చేయ్‌, నువ్వు చేయ్‌ నువ్వు పో! నువ్వు పో అంటుంది. అనేటప్పటికి ఏమయ్యావు? దీనిని ఆశ్రయించావు. పోయి ఊబిలోకి పడిపోయావు. అర్థమైందా? చెబుతోందిగా లోపలినుంచి, నీకెందుకు? నీపని కాదు కదా! నీ కర్తవ్యం కాదు కదా! నీ విషయం కాదు కదా! నీ విషయం కానప్పుడు నీకెందుకు? ప్రశాంతంగా వుండు నువ్వు. మౌనంగా వుండు. అని లోపలినుంచి చెబుతోంది కదా అది. చెప్పినా దాని మాట ఎందుకు పట్టించుకోవడం లేదు మనం? దానికి ఉల్టా మనమే చెప్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడకపోతే అదౌతుంది. నేను చెయ్యకపోతే అదౌతుంది. నేను చెప్పకపోతే ఇదౌతుంది. ఏమిటి అయ్యేది? ఎత్తి కుదేస్తే ముందు నువ్వేమౌతున్నావో చూసుకో అంటుందది. అది ఎప్పుడూ ఏం చెబుతుంది? ముందు నీ సంగతి ఆలోచించవయ్యా బాబు. (ఇది రజోగుణమా వెంటనే స్పందించడం అనేది?) అంతేగా మరి ఇప్పుడు కాంక్ష వుంటుంది కదా లోపల. విషయం మీద కాంక్ష వుంటే రజోగుణం. అంతే కదా! విషయం మీద కాంక్ష లేదు. అప్పుడు సత్వగుణం. విషయం మీద కాంక్ష బలపడిపోయింది తమోగుణం. అందువల్ల ధర్మార్థకామాలని అందుకే వాళ్ళేం చెబుతున్నారు? మోక్షము పరమపురుషార్థము. అంటే లక్ష్యము అన్నమాట. పరమపురుషార్థము అంటే అర్థం ఏమిటి? మోక్షాన్ని ఆచరించడానికి వీలౌతుందా ఎవరికైనా? మోక్షం అనేది ప్రత్యేకంగా ఆచరించడానికి ఏముంది అక్కడ? అక్కడేం లేదు మోక్షం అంటే. ధర్మార్థకామాలని మోక్షం అనే లక్ష్యంలో ఆచరించడమే మోక్షం. అంటే అర్థం ఏమిటి? ధర్మార్థకామాలలోనూ విషయరూపంలో బంధీవైపోయావు. దాంట్లోనుంచి విడుదల పొందు. అదే నయ్యా మోక్షం. ఎందుకు విడుదల పొందాలయ్యా? సర్వధర్మాన్‌ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ ఆ అన్ని ధర్మాలలోకెల్ల ఉన్నత ధర్మం ఏమిటయ్యా? అంటే నా శరణాగతి పొందటమే. సర్వ సమర్పణ భావం. నిన్ను నువ్వు నాకు అర్పించుకోవడమే. నీ నేనును నాకర్పిస్తే, నీ అహంకారాన్ని నాకు అర్పిస్తే, నీ అజ్ఞానాన్ని నాకు అర్పిస్తే అంతకంటే ఉన్నతమైన ధర్మం లేదు నాయనా!
            అది అర్పిస్తామా మనం? అది అర్పించాలంటే నువ్వు దేనిని పట్టుకోవాలి? నీ అంతరాత్మను పట్టుకోవాలి. ఎందుకని? పరమాత్మకు దారి చూపెట్టేది అదే. ఎందుకని? ఆత్మ మూడు విధాలుగా పనిచేస్తుంది. శరీరంలో దేహాత్మగా పనిచేస్తుంది. దానిలోపల సూక్ష్మంగా అంతరాత్మగా పనిచేస్తుంది. దానిలోపల పరమాత్మగా పనిచేస్తుంది. ఆత్మ మూడు స్థితులలో పని చేస్తుంది. అంతటా ఆత్మ స్వరూపమే అని ఎందుకు అంటున్నాము? మీ అందరికీ సందేహము రావచ్చు, ఏవండి అంతటా ఆత్మ స్వరూపం అంటున్నారు ఎలా సాధ్యం? ఇదిగో ఇలా సాధ్యం. ఎందుకని? నీ శరీరం వుందా? అది దేహాత్మ. నీ లోపల ప్రాణము, బుద్ధి, మనస్సు పనిచేస్తున్నాయా? పనిచేస్తుంది కదా! దానిలోపల నేను అనేది అంటున్నావు కదా! నా ప్రాణము, నా మనస్సు, నా బుద్ధి అంటున్నావు కదా! అంటే నేను వుందిగా అక్కడ. ఆ నేను ఎవరయ్యా? అది అంతరాత్మ. అర్థమైందా అండి? ఆ నేను ఎవరు? అంతరాత్మ. మరి సర్వసృష్టి పనిచేస్తుందా లేదా? దానికి నీతో ఏమన్నా పని వుందా? నువ్వేమన్నా దానికి ఆధారమా? కాదు కదా! మరి ఈ అనంత సృష్టికి ఆధారం ఏదో, ఈ అనంత సృష్టి అంతా వ్యాపించి వున్నది ఏదో, ఏదో ఒకటి వుంది కదా! వుంటుంది అని ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోక తప్పదు. ఎందుకని? నువ్వేం చెయ్యడం లేదు కదా దానిని. కాబట్టి అది పరమాత్మ. నీలో నేనంటావా? అది అంతరాత్మ. నీ బయట చూసి అంటావా? అదే పరమాత్మ. కాదు శరీరమేనంటావా? అది దేహాత్మ. కాబట్టి ఈ జగత్తంతా ఆత్మలో భాగమై వున్నది. సృష్టి అంతా ఆత్మలో భాగమై వున్నది. నీ నేను అదీ ఆత్మలో భాగమై వున్నది. నీ శరీరం అంటావా? అది కూడా ఆత్మలో భాగమై వున్నది. కాబట్టి ఆత్మ సర్వవ్యాపకం అని ఒప్పుకుంటావా? లేదా? ఇప్పుడు. ఒప్పుకోక తప్పదు నాయనా! ఎందుకని? నీకు వున్నది ఈ మూడే కదా! నీ దగ్గర ఏమున్నాయి? నేను, శరీరం, జగత్తు. మూడే కదా వున్నాయి నీకు. ఎటుతిరిగి చూసినా ఈ మూడే. నువ్వు మెలకువలో చెప్పు, కలలో చెప్పు, నిద్రలో చెప్పు, ఎప్పుడు చెప్పినా నేను, శరీరం, జగత్తు ఈ మూడూ కూడా ఆత్మస్వరూపమేనా కాదా? అవును నాయనా! ఎలాగ? ఆత్మ అంటే నేను. ఎలాగ? శరీరం దేహాత్మ. నీలోపల వున్న జీవుడు? నేను కదా! వాడు అంతరాత్మ. అంతటా వ్యాపించి వున్నవాడు, జగత్తు అంతా వ్యాపించి వున్నవాడు వాడు పరమాత్మ. మరి సమస్య ఏమి వుంది? ఏం లేదు కదా! ఇప్పుడు ఆత్మ స్వరూపమే కదా! అంతటా వున్నది? (అది గుర్తించటమే సమస్య). ఆఁ.... వేరే ఏమీ లేదు నాయనా! నువ్వు ఈ పద్ధతిలో గుర్తించడం నేర్చుకో. అప్పుడు ఏమైంది? అక్కడ కాజా పెట్టావండి. ఎక్కడినుంచి ఎవరో కాకినాడ నుంచి కాజా తెచ్చారు. ఏమిటట అయితే? ముందు నీలోపల నీ మనసు ఏం ప్రశ్నించుకోవాలి? కాకినాడ కాజా! ఓహో! అయితే ఏమిటట? ఏదైనా పంచదారతో తయారు చేసిందేనా? లేదా సముద్రంలో ఉప్పు తెచ్చి చేశావా? ఏమైందీ? పూర్వ జ్ఞాపకంలో అబ్బా! కాకినాడ కాజాలండీ, తింటే ఎంత అద్భుతంగా వుంటుందో నండీ అని జ్ఞాపకానికి బలం చేకూర్చావు. అభ్యాసబలం చేత అలా బలాన్ని చేకూర్చావన్నమాట. అందువలన ఏమైంది? ఆ వస్తువు గానీ, ఆ మాటగానీ, ఆ భావన గానీ ఎదురుగుండా రాగానే, ఆ జ్ఞాపకం మేల్కొంది.
            మేల్కోగానే ఎవరు మేల్కోవాలి దాని ప్రక్కనే? ఆత్మ విచారణతో కూడిన అంతరాత్మ మేలుకోవాలి వెంటనే. నా మాట బయటకి రాక ముందే, అంతరాత్మ మేలుకోవాలి. మేలుకుని అయితే ఇప్పుడు ఏమిటట? అనంగానే ఏమైంది? ఇది శాంతంగా మాట్లాడుతుంది. అంతరాత్మ ఎప్పుడూ ఘల్లుఘల్లుగా మాట్లాడదు. ఆహా! ఓహో! కాకినాడ కాజా అద్భుతమని మనసు గొప్పలు చెప్పినట్టుగా ఇదేం చెప్పదు. ఒకటే మాట, అయితే ఇప్పుడు ఏమిటట? (అంటుంది, ఒక పక్కన మనసు తిను తిను అంటోంది)
            అవునండీ! తింటే తిను, తినకపోతే మానేయి. దాని వలన అంతరాత్మకు ఏమీ ప్రమాదము లేదు. కానీ ఎట్లా చెయ్యమంటోంది ఆ పని? అయితే ఇప్పుడేమిటట? దాని ప్రత్యేకతను తీసేయి. కాకినాడ కాజా అద్భుతం అని అనుభవించావా? మళ్ళా మళ్ళా అనుభవించమంటోంది. అయితే ఇప్పుడేమిటట? అనంగానే ఏమైపోయింది? సామన్యమైపోయిందా? దాని ప్రత్యేకత పోయిందా? ప్రత్యేకత పోయినాక, అనుభవించినా, అనుభవించకపోయినా జ్ఞాపకం బలంగా పడడం లేదు. అర్థమైందా?
            అంతరాత్మను ఆశ్రయిస్తే ఏమిటి ఉపయోగం అనంటే, దాని ఎదుట అంతా సామాన్యమే. నీ ఇంద్రియాలు కానీ, నీ ఇంద్రియ విషయాలు కానీ, నీ జగత్తు కానీ, ఆఖరికి నీ నేను కానీ అన్నీ కూడా దాని ముందు సామాన్యమే. దానికే ప్రత్యేకత లేదు. అన్నింటినీ సామాన్యం చేసేస్తుంది. అర్థమైందా అండీ! ఏవండీ 2 లక్షల రూపాయిలు పెట్టి కారు కొన్నాడండీ మనబ్బాయి, ఓహో! అలాగ! అయితే ఏమిటట ఇప్పుడు? అంటుంది మనలోపల ఇప్పుడు. బయటకి అనమని కాదు, నువ్వు వెళ్ళి వాడితో అయితే ఏమిటట అన్నావంటే వాడితో తగాదా వస్తుంది. నీకు నీకు. నీకు తెలియాలి. ఓ అయితే ఏమిటట ఇప్పుడు? అందులో ఏమన్నా ప్రత్యేకత ఏమన్నా వుందా? వాడికి అవసరం వుంది, డబ్బు వుంది కొన్నాడు. నీకేమన్నా దానితో పనివుందా? మా అబ్బాయి కొన్నాడు. ఏమిటట అయితే? అసలు నువ్వు వున్నావా ముందు? నీ జన్మ మరణాల సంగతి నీకొకటి తెలియదు. ఎవరికి ముడిపెట్టావు నీవిప్పుడు? మీ అబ్బాయికి. వాడు కొన్న కారుకి. ఆ కారులో వున్న సుఖానికి. అర్థం వుందా? ఎక్కడికి పోయావు? కొంచెం విచారణ చేయి. ఏమైంది ఇప్పుడు? శాశ్వతత్వం వెంట ఆశ్రయించి పరుగెడుతున్నావా? అశాశ్వతం వెంట ఆశ్రయించి పరుగెడుతున్నావా? నువ్వు కన్నుమూస్తే నీ అబ్బాయి ఎక్కడో నీవెక్కడో నీకే తెలిసేది. వాడు కొన్న కారెక్కడ? ఆ కారులో వున్న ఏసీ ఎక్కడ? ఆ ఏసీలో కూర్చొన్న సుఖం ఎక్కడ? వున్నదా ఇదంతా? లేనిది కదా! మరి లేనిదాని వెంబడి ఎందుకు పరుగెడుతున్నావు? అని అంతరాత్మ మనసుకు బుద్ధి చెప్తున్నది కదా! ఎప్పుడు చెబుతుంది? నువ్వు దీనిని ఆశ్రయిస్తే. ఇంత బలంగా వుండి కూడా, నీవు సింహమై వుండి కూడా ఏమయ్యావు? దానిని గుర్తించకపోవడం చేత, దానికి వాయిస్‌ లేకుండా అయిపోయింది. దానికి బలం లేకుండా అయిపోయింది. దానిని పట్టించుకునే నాథుడు లేడన్నమాట ఇప్పుడు. ఎంతసేపూ మేక అయినటువంటి మనస్సు సింహం వలె చెలరేగిపోతున్నది. ఎందుకని?

అదే పట్టించుకుంటున్నావు, అదే దేవత అని కొలుస్తున్నావు. అందువల్ల ఏమైంది? దానికి బలం పెరిగిపోయింది. కాబట్టి అభ్యాసబలాన్ని మార్చుకో. ధర్మ, అర్థ, కామాలను మోక్షం దృష్ట్యా చెయ్యి, ఈ కోరికను ఎంతవరకూ అనుభవించవచ్చు? దీంట్లో నేను బంధం పొందనంతవరకూ అనుభవించవచ్చు. ఇది నాకు బందిఖానా జైలు అయ్యేటట్లైతే, ఆ జైలు అయ్యే పద్ధతిలో నువ్వు అనుభవించకూడదు. నీ స్వేచ్ఛ పోకూడదు. నీ ముక్త స్వభావం పోకూడదు. నేను ఆత్మ స్వరూపుడను అనే భావం పోకూడదు. నేను జ్ఞాన స్వరూపుడను అనే భావం పోకూడదు. ఆ సాక్షిత్వము పోకూడదు. కలిసిపోకూడదు అందులో. పరవశత్వం చెందకూడదు. కోర్కెలో పరవశత్వం చెందకూడదు. పరవశత్వం అయితే ఏమైంది? పర+వశత్వం పేరులోనే చెబుతున్నావు. దానికి వశుడవు అయిపోయావు. అబ్బా! ఏం సినిమానండీ! ఏం తీశారండీ! అంతా అద్భుతమండీ! ఏమైంది ఇప్పుడు? పరవశత్వం అయ్యింది. పరవశత్వం అంటే ఏమిటి? మరి అదేగా జీవుడంటే. అదేగా శరీరం అంటే. కాబట్టి జ్ఞానికి ముక్తుడికి అనుభవజ్ఞానం ఎవరికైతే వుందో వాడికి పరవశత్వం వుంటుందా? వుండదు వాడికి. ఎందుకని? అన్నీ సామాన్యములే. ఎవరెస్ట్‌ పర్వతము చూశానండీ, నేనేమన్నా పరవశత్వం చెందానా? ఏమీ చెందలేదు, ఎందుకని? నాక్కిక్కడ దుర్గగుడి కొండ, హిమాలయ పర్వతము రెండూ ఒక్కతీరుగానే కనబడుతున్నాయి. ఏముంది తేడా? మహా అయితే దీనిమీద మంచు లేదు, దాని మీద మంచు వుంది. అంతేనా తేడా ఇంకేమన్నా వుందా? ఏమీ లేదుగా? ఏమన్నా వుందా తేడా? ఆహా! హిమాలయ పర్వతం, ఓహో! హిమాలయం అనంగానే పరవశత్వం వచ్చేసింది. ఆ మోహం వచ్చేసింది. దృశ్యజగత్తు అంతే కదా! ఏముంది? ఎంతసేపు వుంటుందది నీకు? మొదటిసారి చూసినప్పుడు వుంది, కాసేపయ్యేటప్పటికీ? చలి, ఇంకా కాసేపు అయ్యేప్పటికి ఆయాసం. ఇంకా కాసేపు అయ్యేప్పటికి అనారోగ్యం. ఇప్పుడు ఏది కరెక్ట్‌? అర్థమైందా? ఏమైపోయింది సుఖం? ఓహో! అద్భుతం అన్నావుగా, ఏమైంది నీ సుఖం? కాసేపట్లో దుఃఖంగా పరిణమించింది. అర్థమైందా అండీ! అదే సాక్షిత్వంలో వున్నావు. దాని వల్ల ఏమైంది? తరువాత నీకు ఆయాసం వచ్చినా, సరేలే శరీరానికి సరిపడని వాతావరణంలోకి వచ్చింది కాబట్టి ఇలా ప్రతిస్పందిస్తోంది. సరే! స్పందించని అనుకుంటాడు.
            (అందరికీ  ఎందుకు ఇట్లాంటి బాధలు ఇచ్చాడు భగవంతుడు?)
            నువ్వు పట్టించుకునే జీవన విధానాన్ని బట్టి కదా! నీ దుఃఖానుభవాన్ని బట్టే, దుఃఖానుభవం లేదు. నీకే ప్రశాంతంగా బానే వున్నావుగా. ఆ విషయసుఖమే ఆనందిస్తూ వుంటావు. దుఃఖానుభవం వుంటే, ప్రశ్న వచ్చింది. నాకు ఎందుకు దుఃఖం కలుగుతోంది? నేను అన్నీ బానే చేస్తున్నాను కదా! అది దేని వల్ల వచ్చింది? విషయం మీద వున్న అనురాగం వల్ల దుఃఖం వచ్చింది. ఇప్పుడు దేని వల్ల వస్తోంది? విచారణ వల్ల. దుఃఖాన్ని విచారణ చేస్తున్నావు ఇప్పుడు. కొత్తగా దుఃఖం ఏమీ రాలేదు. పూర్వ దుఃఖాన్ని ఇప్పుడు విచారణ చేస్తున్నావు. మరలా ఆ దుఃఖం రాకుండా వుండే పద్ధతిలో జీవస్తున్నావు. అర్థమైందా అండీ!
            ఇంకొక విషయం, అందరి సంగతి నీకెందుకు? ఇప్పుడు వెంటనే ఈ ప్రశ్న వేసుకోవాలి. అందరి సంగతి నీకెందుకు? నీకు ఏమన్నా ప్రయోజనము వుందా? నువ్వు నిద్ర పోతే నీ అందరూ ఎక్కడ? నీ మరణంలో నీ అందరూ ఎక్కడ? నీ జన్మలో ఈ అందరూ ఎక్కడ? నీ అంతరాత్మకు ఈ అందరితో ఏమన్నా పనివుందా? లేదు కదా! నీ నేనుకు ఈ అందరితో ఏమన్నా పనివుందా? లేదు కదా! ఆ పరమాత్మకు ఈ అందరితో ఏమన్నా పనివుందా? ఏమీ లేదు కదా! మరి ఎవరికి వుందయ్యా? ఆ అందరూ గుర్తించేది నీ శరీరాన్ని. నువ్వు కూడా గుర్తించేది వాళ్ళ శరీరాన్నే. ఏమయ్యావు అప్పుడు? శరీరమే నేను. అందరినీ గుర్తించగానే ఏమయ్యావు? శరీరమే నేను అయ్యావు. ఎవరు అవమన్నారు నిన్ను ఇప్పుడు? ఇలా దాన్ని విచారణ చేస్తూ, నచ్చచెప్పాలి దానికి. ప్రతి అంశంలో కూడా. శరీరభావాన్ని నిరసించేయాలి. ఎప్పుడైతే శరీరభావాన్ని పూర్తిగా నిరసించేస్తావో, అప్పుడు ఆత్మభావమే మిగిలివుంటుంది. క్రొత్తగా అక్కడ తీసుకొచ్చి పెట్టేది ఏమీ లేదు. అందుకే దీనికి ఉపమానం ఏమి చెబుతున్నారు?
            ఒక గాజుగ్లాసులో రంగు నీళ్ళు వున్నాయండి. గ్లాసు పగులకొట్టే అవకాశం లేదు. కానీ అందులో రంగునీళ్ళు పోయేట్లు చేయాలి. ఏం  చెయ్యాలట అయితే ఇప్పుడు? ఎలా సాధ్యం? అదే రంగునీళ్ళు పోస్తే మారుతుందా? మారదు. వేరేరంగు నీళ్ళుపోస్తే మారుతుందా? అసలు మారకపోగా వింత వింత రంగులన్నీ వస్తాయి దానికి. ఇప్పుడేం చెయ్యాలట? మంచినీళ్ళు పోస్తూ వుండవయ్యా! రంగునీళ్ళు పొర్లిపోయి సాంతం మంచినీళ్ళు మిగిలేవరకు, పొయ్యవయ్యా మంచినీళ్ళు దాంట్లో. కాబట్టి, ఎంతవరకైతే నీకు నీ శరీరమేనేను అనే అభ్యాసబలం మిగిలి వుందో, ఆయా మిగిలి వున్నటు వంటి, మొత్తం అభ్యాసబలం అంతాకూడా పూర్తిగా మారిపోయేంత వరకూ, శరీరమే నేననే అభ్యాసబలం అంతా పూర్తిగా నిరసించబడే వరకూ దాన్ని అభ్యాసం చెయ్యి. అప్పుడు ఏమైంది? నేను ఆత్మస్వరూపుడు అనే భావన సహజమైపోయింది. ఎప్పుడైతే సహజమైపోయిందో నేను స్త్రీని, నేను పురుషుడను అనుకుంటున్నావా ఇక? అనుకోవడం లేదుగా. ఇప్పుడు ఎట్లా అయితే నేను స్త్రీని అని అనుకోకుండా జీవిస్తున్నావా లేదా? అట్లా నేను ఆత్మస్వరూపుడను అనేభావంలో సహజంగా వుండాలి. రోజు అనుకుంటున్నారా? నేను స్త్రీని అని అనుకుంటున్నారా? అనుకోవడం లేదుగా. సహజంగా జీవించేస్తున్నారు. ఔనా కాదా? అట్లా నేను ఆత్మస్వరూపుడను అనే పద్ధతిలో జీవించాలి. ఔనా కాదా? నిజానికి మీకెవరికైనా కానీ బాల్యంలో మీరు స్త్రీ నా, పురుషుడా ఏమన్నా భావం వుందా? లేదుగా. తల్లి గర్భంలో వున్నప్పుడు వుందా? బయటకు వచ్చినాక వుందా? ఎనిమిది ఏండ్ల వయసు వచ్చేవరకూ వుందా? లేదు కదా ! బుద్ధి వికాసం కలిగినప్పటి నుంచి దానికి చెప్పడం మొదలు పెట్టావు. నేను స్త్రీని, నేను స్త్రీని. నేను ఇట్లా వుండాలి. నేను అట్లా వుండాలి. ఇలా దానికి మొట్టికాయలు వేసి, వేసి, వేసి దానిని అట్లా తయారు చేశావు. చేశావా లేదా? అభ్యాసబలమేనా కాదా? అదంతా? అలవాటేనా కాదా? అలవాట్లన్నీ పెట్టి నువ్వు స్త్రీవి నువ్వు ఇలాగే వుండాలి. నువ్వు పురుషుడివి నువ్వు ఇలాగే వుండాలి. అని గీతలు పెట్టావా? పెట్టలేదా? ఎవరు పెట్టారు ఇప్పుడు పరమాత్మ పెట్టాడా? లేదు కదా! శరీర భావన చేత నీవే పెట్టుకున్నావు. దీనిని ఏం చేయాలట ఇప్పుడు? అట్లా అభ్యాస బలం చేత నీకది సహజం అయిపోయిందా? అవ్వలేదా? ఎందుకని? అట్లా అనుకోకుండానే నువ్వు అట్లా వుంటున్నావు ఇక. ఇహ అంతకు మించి నిన్ను కొత్తగా మార్పు చేయాలంటే వీలుకాదు. నిన్ను పురుషుడు వలే జీవింపచేయాలంటే సాధ్యమౌతుందా? ఇహ ఇప్పుడు సాధ్యం కాదు, ఎందుకని? సాంతం సహజమైపోయిందది. అలవాటు ఆ చేయగా చేయగా చేయగా అదే సహజమైపోయింది. కాబట్టి నీ బుద్ధికి ఇప్పుడు ఆ శక్తి వుందా? లేదా? వుంది కదా! దానినే దీనికి వుపయోగించు. నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపడను. అని నీ అంతరాత్మను మేలుకొలుపు. అంతరాత్మను ఆశ్రయించు. అప్పుడు ఆ ధర్మార్థకామాలను మోక్షం దృష్ట్యా చేసే అవకాశం వస్తుంది. అప్పుడు నీకు అసలు ధర్మం అంటే ఏమిటి? ఎలా ఆచరించాలి? ఈ విధమైనటువంటి అర్థం అప్పుడు కనబడుతుంది. ఆఁ... లాభం అంటే ఏమిటి? నష్టం అంటే ఏమిటి? యదృశ్చా లాభ సంతుష్టౌ అంటాడు అందుకని. ముక్తుడు అర్థంలో ఎలా ప్రవర్తిస్తాడయ్యా? జీవన్ముక్తుడనేవాడు అర్థ విషయంలో ఎలా ప్రవర్తిస్తాడయ్యా? యదృశ్చా లాభ సంతుష్టౌ లాభమా నష్టమా అని విచారణ చెయ్యకుండా, ఎలా జరిగినా అది ఆత్మస్వరూపంగానే భావించి, తనయందే జరుగుతున్నదిగా భావించి, తనకు అన్యముగా తోచకుండా ఆచరించును. అంటే అర్థం ఏమిటి? తనలోనుంచి బయటకురాడు ఇక ఎప్పుడూ కూడా. అదేదన్నా అక్కడ జరిగితే ఓ! ఇది నాయందే జరుగుతున్నది. ఈవెడ ఎక్కడున్నారు? నాయందే వున్నారు. నేనెక్కడున్నాను? ఆవిడయందే వున్నాను. ఆత్మభావంలో ఇద్దరూ ఒక్కటే కదా! నేను ఒక్కటే కదా! అక్కడ నేనుకు, ఇక్కడ నేనుకు భేదం ఏమున్నది? ఏదన్నా ఆకారంలో భేదం వుందేమో కానీ, నేను దగ్గర ఏ భేదం వుంది? ఏ భేదమూ లేదు. అయితే అంతరాత్మ లేకపోతే పరమాత్మ. అంతరాత్మ స్థితిలోనూ భేదం లేదు, పరమాత్మ స్థితిలోనూ భేదం లేదు. మరి ఈ అనంత జగత్తులో జరిగేదంతా ఎక్కడ జరుగుతుంది? నాయందే జరుగుతున్నది. నాకంటే అన్యంగా జరగడం లేదుగా. ఏందుకని? నేను సర్వవ్యాపిని. నేను అనంతుడను. అప్రమేయుడను. సర్వకాల సర్వ అవస్థలలో వున్నవాడను. నేను శాశ్వతుడను. నేను గంభీరుడను. దేనికి చలించని వాడను. మరి ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? నాయందే జరుగుతున్నాయి. ఈ అనంత బ్రహ్మాండము నాయందే జరుగుతున్నది. ఎందుకని? నేను అంతటా వ్యాపించి వున్నాను గనుక. పిన్నిగారు వేరే వున్నారా? పిన్ని లేదు, నాయనా లేదు, అమ్మా లేదు, ఎవ్వరూ లేరు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః జీవన్ముక్తుడికి ఎవరున్నారయ్యా? ఎవ్వరూ లేరు నాయనా! ఎందుకు లేరు? వాళ్ళంతా ఆయనలోనే వుంటే, బయటనుంచి ఎక్కడనుంచి వచ్చారు? రెండోవాడనేవాడు ఎవరన్నా వుంటేనే కదా! తల్లో, తండ్రో, బంధువో అని చెప్పడానికి. 84 లక్షల జీవరాశులు అతడే అయివున్నాడు. చరాచర సృష్టి అతనే అయివున్నాడు. ఇప్పుడు రెండవవాడు ఎక్కడ? లేడు. ఈ స్థితి యందు అతనికి తండ్రి ఎవరు? లేరు. ఆత్మస్వరూపానికి తండ్రి ఎవరు? లేరు. పరమాత్మ స్వరూపానికి స్థితికి తండ్రి ఏది? తల్లి ఏది? బంధువులు ఏరి? ఎవ్వరూ లేరు. ఎందుకని? వాళ్ళంతా అందులో అంశీభూతములై వున్నారు. అర్థమైందా అండీ!
            రాముడెక్కడ? కృష్ణుడెక్కడ? వాళ్ళెవరూ లేరు నాయనా! అంతా పరమాత్మయందు ఇమిడిపోయారు అంతే. అందుకనేగా భగవద్గీతలో ఏం చెబుతున్నారు? బ్రహ్మాండ మీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంశ్చ దివ్యాన్‌ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం న అంతం న మధ్యం న గుణస్తవాధిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా - అది నీ రూపం. ఈ అనంత విశ్వము నీవే అయి వున్నావు. ఆ విశ్వరూపమే నీవై వుండగా, ఈ జానాబెత్తెడు వున్నటువంటి ఈ రూపం శరీరం నేనంటావేమిటి? అర్థం వుందా ఏమైనా? కొండని అద్దంలో బంధించడానికి వీలౌతుందా? ఎట్లా సాధ్యం? నీవెవరు? ఆ కొండవంటివాడవు. ఈ శరీరం ఎటువంటిది? అద్దంలో వున్న ప్రతిబింబం లాంటిది. ఇప్పుడు కొండ అద్దంలో వుందా? అదెట్లా సాధ్యం? సాధ్యం కాదు కదా! అట్లాగే విశ్వరూపుడైనటు వంటి పరమాత్మ యొక్క అణువు, ఈ శరీరంలో ప్రతిబింబిస్తున్నది. అయినంతమాత్రాన ఈ శరీరం పరమాత్మ కాకపోయిందా ఇప్పుడు? శరీరం కూడా పరమాత్మే. ఎప్పుడు? ఆ పద్ధతిలో వినియోగించు. విషయాల దృష్టిలో ఎందుకు వినియోగించావు? దుఃఖం వచ్చే పద్ధతిలో ఎందుకు వినియోగించావు? అజ్ఞానపద్ధతిలో ఎందుకు వినియోగించావు? ఇట్లా వినియోగిస్తే ఇదే ఈజీ. దృష్టిని మార్చు. జ్ఞానపద్ధతిలో వినియోగించు. అప్పుడు అవే ధర్మార్థకామాలే మోక్షహేతువులు అయినాయి. మోక్షానికి కారణం, మోక్షమనే ఫలితాన్ని ఇచ్చాయి. ఆ ధర్మార్థకామాలే విషయం దృష్ట్యా చేశావు, ఇంద్రియం దృష్ట్యా చేశావు, తాత్కాలిక సుఖాన్ని ఆశ్రయించి చేశావు బంధములు అయినాయి. వేరే ఏం లేదు. కాబట్టి మనఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయ అంటే అర్థం ఇది. ఆ మనస్సు ధర్మార్థ కామాలలో ప్రవర్తిస్తున్నది. ఆ మనసు ధర్మార్థకామాలలో ప్రవర్తించి నీకు ఆలోచనలు ఇచ్చేటప్పుడు, వాటిని ఏం చేయాలట? కారణం బంధ మోక్షయ. ఆ కారణమైనటువంటి మనసు, విషయమలు, ఇంద్రియములు చెబుతున్నప్పుడు నువ్వు దానిని ఆశ్రయించే గనుక చేస్తే బంధమవుతున్నది. అలా కాక సాక్షి అయినటువంటి ఆత్మస్వరూపాన్ని, పరమాత్మని గుర్తించే పద్ధతిగా గనుక విచారణ చేసి కనుక నువ్వు ఆచరిస్తే, ఆ ధర్మార్థకామములే మోక్షకారణములు అవుతున్నాయి.
            ఈ మనస్సే ఆ మోక్షకారణం అవుతున్నది. సమస్య ఏముంది? పనిముట్టుని అటు తిప్పి వాడే బదులు, ఇటు తిప్పి వాడవయ్యా! లక్ష్యాన్ని మార్చుకో. దృష్టిని మార్చుకో. ఇదే జీవితమే, ఈ చేష్టలే, ఈ భోజనమే, ఈ కళ్ళు, చెవులు, ముక్కులు, ఈ ఇంద్రియాలే, కొత్తవి ఏమీ అవసరం లేదు. కానీ ఏం మారాలి? దృష్టి మారాలి. సృష్టిని మారమని చెప్పకూడదు ఎప్పుడూ కూడా. నేను ఇంతగొప్పవాడిని, నా బట్టి నువ్వు మారు, అది కుదిరే పని కాదు. ఎందుకనిట? వాడు వేరైపోయాడుగా, నువ్వు మారు అని ఎప్పుడైతే చెబుతున్నావో, అప్పుడు నువ్వేమైపోయావు? ఇద్దరైపోయారా లేదా? ఇద్దరైపోతే ఏమౌతావు? పోయింది ఆత్మస్వరూపం. ఎందుకని? ఆత్మస్వరూపం సర్వవ్యాపకం. పరమాత్మ సర్వవ్యాపకం. రెండోవాడు ఎవరున్నాడు అక్కడ? నువ్వు మారు అని చెప్పాలంటే ఎవరుండాలి ఇప్పుడు? ఇద్దరు వుండాలా? నేను నువ్వు ఇద్దరుండాలా? నేను నువ్వు ఇద్దరు వుంటే ఏమయ్యారు? జీవుడైపోయాడు. శరీరభావం వచ్చేసింది. (రకరకాలుగా వున్నారుగా) ఇంకేమయ్యావు అప్పుడు? ఇంకా ప్రతిబింబ ప్రతిబింబాలు.
            (ఇన్నాళ్ళిలా అలవాటు పడిపోయి, చెప్పేవాళ్ళు లేక) ఆఁ... ఇప్పుడు మార్చుకోండి. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, గతం గతః అని మనవాళ్ళు ఊరికే చెప్పలేదు. ఈ క్షణానికి గతించిపోయిన క్షణం, ఇంతకు ముందు క్షణం గతమే. దాని జోలికి వెళ్ళమాక. వెళ్ళావా దుఃఖం తప్పదు నాయనా! ఎందుకని అంటే గతజల సేతు బంధనమేల? అక్కడ జలమే లేదు, వారధి ఏం కడతావ్‌? బ్రిడ్జ్‌ దేనికి కడతావ్‌? నీళ్ళు వుంటే కదా! బ్రిడ్జ్‌ కట్టడానికి, ప్రస్తుత వర్తమానాన్ని కోల్పోతున్నావే. రాని భవిష్యత్తునేమో ఊహిస్తున్నావు, గతించిపోయినటువంటి గతాన్ని జ్ఞాపకాల రూపంలో వెంటాడుతున్నావు, ప్రస్తుత వర్తమానాన్ని కోల్పోతున్నావు. అసలు ఈ మూడింటిలో వున్నది ఏది నీ దగ్గర? ఎప్పుడూ వర్తమానమే వుంది నీదగ్గర. గతం నీ దగ్గర ఎప్పుడూ లేదు. వుంటే ఎక్కడుంది? నీ జ్ఞాపకాల రూపంలో వుంది. ఆ జ్ఞాపకాలే కదా బుద్ధి. అది ఇంద్రియం కదా! పనిముట్టు కదా! నువ్వు కాదు కదా అది. అంతే కదా మరీ! అన్ని జ్ఞాపకాలు బుద్ధే. మనస్సు ఆలోచనలు, సంకల్ప వికల్పాలు అంతే. ఆ జ్ఞాపకాలే ఈ రూపంలో వస్తున్నాయి. ఆ జ్ఞాపకాలమేరకే ఈ ఆలోచనలు వస్తున్నాయి. వేరే ఏమీ లేదు. ఏనుగు ఇలా వుండాలి. ఎలా చెప్పావు? ఎప్పుడో ఏనుగును చూసి వుంటావు కదా! చూడకుండా చెప్పగలవా? చెప్పలేవుగా. నువ్వు ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఒక దీవి వుందండి. మీకు నాకు తెలియదండీ! అక్కడ ఏదో దాని గురించి చెబుతున్నాడండీ, నువ్వు ఊహించగలవా? ఎందుకని ఊహించలేవు? చూడలేదు కాబట్టి. దానికి సంబంధించిన ఏ జ్ఞాపకం నీ దగ్గర లేదు కాబట్టి. అంతేనా కాదా? మీరు వంటలు బాగా అద్భుతంగా చేస్తారు కదండీ! మీరు urgent గా నాకొక పిజ్జా తయారు చేసిపెట్టండి. పిజ్జాకు సంబంధించిన జ్ఞాపకాలు నా దగ్గర ఏమీ లేవు అంటుంది బుద్ధి వెంటనే. ఎందుకని? చూడలేదు, వినలేదు, తినలేదు కాబట్టి దాని జ్ఞాపకాలు అన్నీ దేనికి సంబంధించినవి? చూచుట, వినుట, తినుట నీ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి వాటి ద్వారా జ్ఞాపకాలు బుద్ధి అవుతుందది. వేరే ఏముంది? అంటే ఏమిటి? వాటికి సంబంధించిన సమాచారం ఏమన్నా వుంటే వాటికి సమాధానం ఇస్తుంది. ఆ సమాచారం నువ్వు అవుతావా? సమాచారం నువ్వు కాదుగా. నా బుద్ధి ఇలా వుంది కాబట్టి ఇలా వున్నానయ్యా, నేను వేరే వున్నాను. నా బుద్ధి వేరే వుంది. (బుద్ధి సక్రమంగానే చెబుతుంది కదా!) ఎందుకు సక్రమంగా? దానికి సక్రమం, అక్రమం ఏమీ లేదు దానికి. వున్న జ్ఞాపకాన్ని చెబుతుందది. నా లోపల వున్నది ఇదయ్యా!
            ఇప్పుడు నేను నిన్ను ఏమడిగాను? నీకు అన్నీ బాగా వంట చేయడం వచ్చు కదా! పిజ్జా చేసివ్వు నాకు అన్నాను. ఏమని చెప్పావు? ఆ పిజ్జాలేమిటో నాకు తెలియదు నాయనా! నేను ఎప్పుడూ చూడలేదు. వినలేదు, తినలేదు అన్నావు. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి నుంచి వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి మనసుకి అందించింది. దానికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఏమీ లేదు అంది బుద్ధి. మనసు అదే ఆలోచన రూపంలో వ్యక్తీ కరించింది. వాక్కు అదే రూపంలో మాట్లాడింది. అర్థమైందా అండీ! అదే నీకు సంబంధిన అంశం మళ్ళా ఇంకోటి ప్రతిపాదించాడు, పిజ్జా వద్దులే ఊతప్పం చెయ్యి అన్నాడు, ఊతప్పం ప్రయత్నించి చూస్తాను, జీవితంలో ఓసారి చేశాను, మళ్ళా నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇంకోసారి చేస్తా. అంటే ఎప్పుడో ఓసారి చూశావు, ఓ సారి విన్నావు, ఓసారి తిని చూశావు, దానికి సంబంధించిన జ్ఞాపకాలు నీ దగ్గర వున్నాయి కాబట్టి ఆ జ్ఞాపకాలను వ్యక్తీ కరిస్తున్నావు, అంతే కదా! కాబట్టి బుద్ధికి దాంట్లో అక్రమం, సక్రమం ఏదైనా వుందా? ఏమీ లేదు. అది ఊరికే ఒక బీరువా లాంటిది, అది లోపల ఏమేమి వస్తువులున్నాయి, ఏ ఏ జ్ఞాపకాలున్నాయో తెరుస్తుంది. ఈ జ్ఞాపకాలున్నాయి, నా దగ్గర సమాచారం ఇది వుంది. అని చెబుతుంది అంతే. (మరి కొన్ని మరచిపోతూ వుంటాం కదా!) అవసరం లేనివి. (అవసరం వున్నది కూడా మరిచిపోతుంటాం) పోనీ. ఎట్లా అంటే అది, ఉపయోగించకపోతే అది ఏం చెబుతుంది? బాబూ! ఈ సమాచారాన్ని నువ్వు చాలా కాలం నుంచి ఉపయోగించడం లేదు, కాబట్టి ఇది అనవసరం. నేను పడేస్తున్నాను అంటుంది. అర్థమైందా? బీరువా నిండిపోతూ వుంటుంది కదా! బీరువా నిండిపోతే ఏం చేయాలి మరి అది! వున్నవి తీసిపారేస్తేనే కదా! కొత్తవి అందులో పడేది. మరి బయట పడవేయటం అంటే ఏమిటి? ఇదే బయట పడేయటం. అది ఏమడుగుతుంది? నీకు ఈ సమాచారం కావాలా? అదే కల. వేరే ఎక్కడ నుంచి కల రాదండి. ఆ కల ఏమిటంటే ఇదే. బీరువా నిండిపోయింది. బీరువాలో నిండిపోయినవి బయటపారేసేవి అన్నీ కలలో వస్తాయండి. ఆ కలలో వచ్చేసి ఇక దీనికి స్థానం లేదు. నా దగ్గర బుద్ధిలో దీనిని నిక్షిప్తం చేయడానికి ఇక స్థానం లేదు, అవకాశం లేదు, (వివరణ వుండ కుండా వస్తాయి కదా!) అది వేరే విషయం. వివరణ నీకు తెలియదు, నీకు అప్పుడు తెలివి లేదు కాబట్టి వివరణ లేదంటున్నావు అంతే. మెలకువలోకి వస్తే వివరణ వస్తుంది. కలలో కాబట్టి వివరణ లేదు.(కొన్ని కలలకు అసలు అర్థం వుండవు, ఏమీ వుండవు) అవునమ్మా! నీ బుద్ధి ఇవాళ వచ్చిందా? 84 లక్షల జీవరాశుల నుంచి వచ్చిన జ్ఞాపకాలు అన్నీ ఎందులో వున్నాయి? అన్నీ అందులోనే వున్నాయి. నీ godown అంతా ఆ బుద్ధే. వుండబట్టే కదా! నువ్వు వెల్లకిలా పడుకున్నవాడివి బోర్లా ఎవడు పడేశాడు నిన్ను? ఆ బుద్ధియే. తల్లి గర్భంలో నీ శరీరాన్ని తయారు చేసింది ఎవరు? ఆ బుద్ధే. (ఇప్పుడు ఈ ఆలోచనలు ఇవన్నీ ఈ జన్మవి కాదు కదా!) జ్ఞాపకం. జ్ఞాపకం వ్యక్తీ కరించ బడుతున్నదండీ, అంతకుమించి వేరే ఏమీ లేదు. అందులో ఇది ఈ జన్మదా, ఆ జన్మదా అని నువ్వు లెక్కలు వేసుకోవడమే. దానికి, బుద్ధికి అసలు జన్మతో పనిలేదు. మనసుకు అంతకంటే జన్మతో పనిలేదు. సూక్ష్మం అది. ఇక్కడ అంశం ఏమిటంటే, సూక్ష్మానికి మరణం లేదు. స్థూలానికే మరణం వుంది. జన్మకూడా స్థూలానికే వుంది, సూక్ష్మానికి లేదు. సూక్ష్మం ఎప్పుడూ వున్నది.  నీ ప్రాణ మనో బుద్ధులు ఈ ప్రపంచం వున్నంత వరకూ వుంటాయి అవి. సృష్టి వున్నంత కాలం ప్రాణ మనో బుద్ధులు వుండక తప్పదు. దానికి 'జయమ్మ' అనే పేరు లేదు. అర్థమౌతుందామీరు ఏదైతే నేను నేను నేను అని మీరు అనుకుంటున్నారో, అది మీ సూక్ష్మానికి లేదు ఆ పేరు. అర్థమౌతుందా? దాంట్లో ఏమున్నాయి? మూడు గుణాలున్నాయి, మూడు అవస్థలున్నాయి. దానికి సంబంధించిన జ్ఞాపకాలున్నాయి. అంతే. మూడు వాసనలు ఏమిటి? శాస్త్రవాసన, దేహవాసన, లోకవాసన. ఆ మూడు వాసనలు, మూడు గుణాలు, మూడు అవస్థలు. అలా మూడు మూడుగా వున్నవి ఏవైతే వున్నాయో, అవి ప్రాణమనోబుద్ధుల రూపంలో వున్నాయండి. వాటికి ఏ పేరు లేదు, విద్యాసాగర్‌ అనే పేరు లేదు, జయమ్మ అనే పేరు లేదు, ఆది శంకరుడు అనే పేరుకూడా లేదు. వివేకానందుడు అనే పేరు అంతకంటే లేదు. అదేమిటి అసలు సూక్ష్మం. అర్థమైందా? ఆ బలం పెరగగానే ఏమైంది? నాకు స్థూలం కావాలి అంటే స్థూలం వచ్చింది. ఈ స్థూలం నాకు పనికిరాదు పో అంటే పోయింది. అంతే. కాబట్టి సూక్ష్మం చేతిలో కీలుబొమ్మగా వుంది, ఈ స్థూలం. మరి స్థూలాన్ని పట్టుకుని వేళాడుతావేమిటి నాకు అర్థంకాదు? అర్థం వుందా ఏమైనా?
            ఆ ప్రాణ మనో బుద్ధులే లేకపోతే ఈ ఇంద్రియాలను పనిచేయమను. అనుభవించమను. ఏదైనా నీకు తెలియజెప్పమను. సాధ్యమేనా? మరేమైంది స్థూలం అంతా? అవి లేకపోతే ఎందుకూ పనికి రాదు ఇది. కానీ, విలువ అంతా దేనికి ఇచ్చావు? పోయే, అక్కడ పోయింది. అర్థమైందా అండీ? ఇలా అభ్యాసబలం అంతా కూడా, మార్పు చెందాలి. ప్రతిదీ ఇట్లా విచారణ చేయాలి. ధర్మార్థకామాల దృష్ట్యా ఆచరించే ప్రతీ దానిని ఇలా విచారణ చేయాలి. ఇలా విచారణ చేసి, ఆలోచన చేసి, ఏది సత్యము? ఏది శాశ్వతము? ఏది సనాతనము? ఏది అనంతము? ఏది జ్ఞానము? ఏది సర్వ వ్యాపకము? అనే పద్ధతిలో మనం చూడాలి. ఏది సాక్షిత్వాన్ని ఇస్తుంది? ఎట్లా చేస్తే నేను సాక్షిగా నిలబడకలుగుతున్నాను? అనే దానికే ప్రాధాన్యతను ఇచ్చి జీవితాన్ని నడపాలి. అప్పుడేమయ్యింది? ఆ ధర్మార్థకామాలే మోక్షాన్ని ఇస్తాయి.
            తరువాత వాక్యం, (లోకములో వేరు వేరు పుణ్య కర్మలచే లభించు స్వర్గాది లోకములు కూడా క్షీణించునట్టివే, మోక్షము బ్రహ్మజ్ఞానము వలననే లభించును)
            ఏమని చెబుతున్నారు ఇప్పుడు? నేను ఆ యాగం చేశా, ఈ యాగం చేశా, ఈ యజ్ఞం చేశా, ఆ పుణ్యం చేశా, ఈ పుణ్యం చేశా ఇవి అన్నీ వున్నాయా? అక్కడ ఎక్కడైనా? జ్ఞాపకాల రూపంలో బుద్ధిలో వున్నాయి. అంతేకదా! శతరుద్ర చండీ యాగానికి వెళ్ళి వచ్చానండీ! ఓహో! అలాగా అయితే ఏమిటట? ఏమన్నా వుందా? మోక్షం వచ్చిందా? దేంట్లో నుంచన్నా ముక్తి పొందావా? శరీర భావంలోనుంచి ముక్తి పొందావా? ఏమిటి దాని వల్ల ప్రయోజనం? అంటే ఏమైంది? పుణ్యం అనేది భావనేనా? బాహ్యం కాదుకదా! పదార్థం కాదు కదా! మరి భావనంతా ఎందులో వుంది ఇప్పుడు? బుద్ధి రూపంలోనే కదా వుంది. జ్ఞాపకమేగా. ఇప్పుడు రేపొద్దున మరణం వచ్చేటప్పుడు నీ శతరుద్ర చండీ యాగం ఏమన్నా మరణాన్ని ఎదురించ కలుగుతుందా? లేకుండా చేయకలుగుతుందా? లేదే. పోనీ, ఏదైనా దుఃఖం వచ్చిందండీ, ఆ దుఃఖం వచ్చినప్పుడు ఈ శతరుద్ర చండీ యాగం ఏమన్నా దుఃఖాన్ని పోగొట్టిందా? పోగొట్టలేదే. పోనీ ఏమన్నా సాక్షిత్వం వచ్చిందా? రాలేదే. పోనీ ఏమన్నా జ్ఞానం వచ్చిందా? అదీ రాలేదే. మరి ఏమైంది ఇప్పుడు? అంతా యాంత్రికమే. ఆ పుణ్యం కూడా అనుకుంటున్నావే కానీ, అక్కడే ముంది? దానికేమన్నా రూపా పాడా? (లెక్క కొలమానమా?) వున్నాయా ఇవన్నీ? అన్నీ నీ బుద్ధిలోనే వున్నాయిరా బాబు. ఆ స్వర్గ నరకాలు కూడా నీ బుద్ధిలోనే వున్నాయి. నీ సూక్ష్మమే అంతా కూడా. ఇది స్థూలం, అది సూక్ష్మం. అంతే తేడా. ఎంత సేపు అలా వుంటావు? కొంతసేపైనాక అది పోతుందిగా. అది కూడా శాశ్వతం కాదు కదా! మార్పు చెందేదే కదా! కాసేపు అయినాక ఏమయ్యింది? నాకు ఇది మొహం వత్తింది అంది. ఏమైంది? మరో స్థూలం తీసుకో అయితే. ప్రకృతి ఏం చెప్పిందినీకు అది చాలటం లేదు, అది అనుభవించడానికి వీలు కావడం లేదు, బయట పడటానికి వీలుకాదు, సూక్ష్మం సూక్ష్మంగానే వున్నంతవరకూ బయటపడడానికి వీలుకాదు. ఏం కావాలి మరినీకు? (సూక్ష్మం అంటే ఏమిటసలు?) ప్రాణ మనో బుద్ధులే సూక్ష్మం. వేరే ఏమీ లేదు. లోపల ప్రాణం పనిచేస్తుందా? ఆ ప్రాణం ఎలాగా? అక్కడ సమిష్టి ప్రాణం వుంది కాబట్టి నీలోపల ప్రాణం కొట్టుకుంటుంది. నీలోపల మనసు పనిచేస్తుందా? సమిష్టి మనస్సు అక్కడ వుంది. అందువల్లే నీలో మనస్సు పనిచేస్తుంది. (సమిష్టిగా వున్నప్పుడు అందరూ ఒక రకంగా వుండాలి కదా!) ప్రాణ మనో బుద్ధుల రూపంలో అదే నీకు చెబుతుంది ఇప్పుడు, ప్రాణ మనో బుద్ధులుగా వున్నప్పుడు అందరూ ఒక్కతీరుగానే వున్నారు. నీలో రజోగుణం వుందండి. ఈవెడలో రజోగుణం వుంది. రజోగుణ రూపంలో ఒకటే. విషయంలోకి వచ్చేటప్పటికి మార్పు వచ్చేసింది. ఇంద్రియాలలోకి విషయంలోకి దిగినప్పుడు మార్పును గుర్తిస్తున్నావు అంతే. తేడా వచ్చింది ఎలాగా? నాకు పిజ్జా కావాలి, నీకు ఊతప్పం కావాలి. ఎలాగా? (ఇవన్నీ ఒకటైనప్పుడు ఇవి కూడా ఒకటి కావాలి కదా!) ఆగు చెబుతా విను. నాకు పిజ్జా కావాలి అనేది రజోగుణమే. నీకు ఊతప్పం కావాలి అనేది రజోగుణమే. ప్రాణ మనో బుద్ధులు ఏం చెబుతున్నాయి? రజోగుణ ధర్మంలో అందరూ సమానమే. నువ్వు ఇంద్రియంలోకి దిగావు. ఇంద్రియంలోకి దిగితే ఏమైంది? ఆ జ్ఞాపకం ఇంకా బలపడింది. జ్ఞాపకం బలపడింది, ఆ జ్ఞాపకం ఎట్లావుంటే ఆ తలుపు తెరిచావు, ఆ జ్ఞాపకంలో ఎట్లా వుంటే అట్లా చేశావు, వాడి జ్ఞాపకంలో పిజ్జా వుంది, నీ జ్ఞాపకంలో ఊతప్పం వుంది, అదే సూక్ష్మ దృష్ట్య చూశావు, రెండూ ఒకటే. ఎందుకని? రెండింటిలో కూడా రసనేంద్రియం పనిచేస్తుంది అంతే. రుచి పనిచేస్తుంది. వాడు పిజ్జాని ఆనందించిన నీవు ఊతప్పాన్ని ఆనందించినా ఆ సుఖం ఎక్కడిది? నాలుక యొక్క రుచి వలన వచ్చిన సుఖం. ఏమిటట అయితే రజోగుణ సుఖం. అవి ఎక్కడున్నాయి? మనో ప్రాణ బుద్ధుల్లో వున్నాయి. ప్రాణ మనో బుద్ధుల్లో ఏం భేదం లేదు. అక్కడికి వచ్చేటప్పటికి సూక్ష్మంలో అంతా సూక్ష్మీకరించబడిపోయింది. అంతా వంద సంవత్సరాల జీవితం అంతా చిన్న ఒక సంఘటనలోకి మార్పు చెందేసింది. సూక్ష్మీ కరించబడిపోయింది మొత్తం అంతా కూడా. ఎంతసేపు బుద్ధి అలా నిర్ణయిస్తుందంటే, అందులో ఎలా, ఆ అరలో ఎలా సర్దుతుందయ్యా అంటే, సత్వగుణ జ్ఞాపకాలు అన్నీ ఒకప్రక్కన, రజోగుణ జ్ఞాపకాలన్నీ ఒక ప్రక్కన, తమోగుణ జ్ఞాపకాలు అన్నీ ఒక ప్రక్కన. సాక్షిత్వానికి సంబంధించినవన్నీ పై వరుసలో, అంతరాంతరాళలో వుంటాయన్నమాట సాక్షిత్వానికి సంబంధించినవి. పైవన్నీ రజో, తమో, సత్వగుణానికి సంబంధించినవన్నీ వుంటాయి. తలుపు తీయగానే అవి వచ్చేస్తాయి బయటకి. ఇవి అన్నీ అయితే గానీ ఆ లోపలిది రాదు. అయితే మనమేంటట ఇవి రాగానే ఇవి వచ్చినాయిగా అని ఇవే చేసేస్తున్నాం, ఇవే ఆచరించేస్తున్నాము. కాసేపు ఆగు నిదానించు, ఒక నిమిషం ఆగు, అది ఏం చేస్తుంది? రజోగుణానికి సంబంధించినవి, ముందు బలమైనవి ఇస్తుందండీ. ఏవి బలంగా వుంటే అవి ఇస్తుంది. నీ అభ్యాస బలంలో సత్వగుణానికి సంబంధించింది బలంగా వుందనుకోండి, ముందు అవే ఇస్తుంది. లేదు రజోగుణానికి సంబంధించి బలంగా వుంటే అవే ఇస్తుంది. లేదూ తమోగుణానికి సంబంధించినవి బలంగా వుంటే అవే ఇస్తుంది. ఆ జ్ఞాపకాలు ముందు ఇస్తుంది. కాసేపు నిదానించావనుకో ఏం చేస్తుంది? ఓహో! ఇవి కాదా నీకు కావలసింది? ఇంకా లోపల వున్నాయి, లోపల అరలను తెరుస్తుంది అప్పుడు. అప్పుడు సాక్షిత్వానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు బయటపడుతాయి. ఆ వాక్యాలు బయటకు వస్తాయి. ఆ అనుభవాలు బయటకు వస్తాయి. అప్పుడు ఓహో! ఇది కదా నేను. (నిదానంగా ఆలోచించి) ఆఁ... నిదానమే ప్రధానము నాయనా! అంటే అర్థం ఇది. విచారణ చేసి, విచక్షణ తోటి, ఒక్కక్షణం ఆలోచించి, నిదానించి, ఏది తోస్తే అది చేసేయటమేనా? కొంచెం ఆగు. నిదానించు. విచారణ చెయ్యి. ఏమిటి విచారణ చెయ్‌? ఇదిగో ఇదే. అది ఏం చెబుతోంది? ముందు ఏది అందిస్తోంది? నాలో ఇది బలంగా వుంది కాబట్టి ఇది అందిస్తోంది. తర్వాత ఏది అందిస్తోంది? కాసేపు ఆగు. ఏమీ ఇవ్వలేదు. అంటే దానిలోపల ఇంకేం లేదు. ఇదే వుందన్నమాట. అర్థమైందా అండీ! అయినా నిదానించు. నిదానిస్తే పోయే నష్టం ఏం లేదు. (ఆ నిదానం రావాలిగా) ఆఁ.. అంటే ఏం చెయ్యాలి? నువ్వు ఇలా అభ్యాసం చెయ్యి. నిదానం రావాలంటే ఎక్కడినుంచో రాదు కదా! ఎక్కడినుంచి వస్తుంది?(automaticగా వస్తుంది) auto లేదు matic లేదు అసలు. ఒక్కటే గుర్తుపెట్టుకో! ఏదీ ఈ సృష్టిలో ఆటోమేటిక్‌ లేదు. అన్నీ ఒకపద్ధతి, ఒక సూత్రానికి లోబడే పనిచేస్తున్నాయి. (మొదటినుంచి ఇట్లా అలవాటు చేశాం కాబట్టి) అవును, ఇప్పుడు మార్చుకో! కాబట్టి జీవన రహస్యం అంతా కూడా ఇలాగ ఈ సూత్రానికి లోబడి పనిచేస్తుంది. కాబట్టి ఈ సూత్రాన్ని అర్థం చేసుకుని, జీవితాన్ని పరిష్కరించాలి. ఇప్పటి వరకూ గతంలో వున్నటు వంటి విధానాన్ని మరళా స్ఫురణకు తెచ్చుకోమాకండి. నేను ఎప్పుడూ మీకు చెబుతుంది అదే! నువ్వు సాధనతో కూడిన జీవితాన్ని జీవించాలి అనుకున్నప్పుడు, సాధనకు వ్యతిరేకమైన జీవితాన్ని మళ్ళా స్ఫురణకు తెచ్చుకోకూడదు. ఏమౌతుంది తెచ్చుకుంటే? మళ్ళా పడిపోతావయ్యా! నిన్ను బలవత్తరంగా లేపడానికి నా శక్తి అంతా వుపయోగించి నిన్ను లేపడానికి ప్రయత్నిస్తూ వుంటాను, నువ్వు దేనిని గుర్తు తెచ్చుకుంటావు? తద్‌ వ్యతిరేకాన్ని గుర్తుకు తెచ్చుకోవడం వల్ల, నువ్వు ఓడిపోతున్నావు, నాకు శ్రమ అవుతున్నది. కాబట్టి గురు సమక్షంలో, గురు సన్నిధానంలో వున్నప్పుడు, భగవంతుడి సన్నిధానంలో వున్నప్పుడు, నువ్వు వ్యతిరేకాన్ని ఆలోచించకూడదు. నీ పూర్వజ్ఞాపకాలను గురించి ఆలోచించకూడదు. నీ గతం గురించి ఆలోచించకూడదు. నూతనమైన జీవితాన్ని జీవించడానికి ఇక్కడికి వచ్చాను. అనేటటువంటి భావంతో భగవంతుని ఆలయంలోకి వెళ్ళాలి, గురువు దగ్గరకు వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా గుడిలోకి వెళ్ళండి, వెళ్ళినప్పుడు ఏమైంది? ఇవాళ్టి నుండి నేను నూతనమైన జీవితాన్ని జీవించబోతున్నాను. భగవంతుని దృష్టిలో పెట్టుకుని, పరమాత్మను దృష్టిలో పెట్టుకుని, జీవించడానికి నిశ్చయించుకుని భగవంతుని దగ్గరకు వచ్చాను. అనే భావంతో నువ్వులోపలికి వచ్చి, స్థిరపడి, అదే భావంతో ఇంటికి వెళ్ళాలండి. ఇదీ అసలు ఆలయానికి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం. నిజంగా మనం అలానే వెళ్తున్నామా? ఏమైంది ఇప్పుడు అక్కడ? విచారణ లేదు. నేను చెప్పేది అది. నువ్వు ఆ పని చేస్తున్నావు, కానీ విచారణ లేదు. సంవత్సరంలో 365 రోజుల్లో 300 సార్లు దుర్గ గుడి మెట్లు ఎక్కి ఎక్కి ఎక్కి రాళ్ళు అరిగిపోయినాయి, కాళ్ళకు చెప్పులు అరిగిపోయినాయి. ప్రయోజనం ఏమి వచ్చింది? ఏమీ రాలేదు. ఎందుకని? ఈ భావన లేదు. అర్థమైందా అండీ! భగవంతుడు భావంలో వున్నాడు కానీ, బాహ్యంలో లేడే. నువ్వేం చేశావు, బాహ్యాన్ని పట్టుకుంటివి, భావాన్ని వదిలేస్తివి. అర్థమైందా అండీ! నువ్వు ఏ పూజారినైనా అడుగు. ఏవండీ మీరు ఆలయానికి వెళ్తున్నారు కదా! అమ్మవారిని నిజంగా చూశారా మీరు? ఆ అవకాశం లేదు నాయనా! ఎవరికో నూటికో కోటికో ఎవరికో నాయనా! అది సాధ్యం అవుతుందో లేదో కూడా నాకే తెలియదు నాయనా! ఇది కేవలం నా భోజన వృత్తి మాత్రమే. అన్నావా అప్పుడు ఏమైంది ఇప్పుడు నీకు? అప్పుడు భావం ఎక్కడకి బిగుసుకు పోయింది? నువ్వు ఎంత ఆ విగ్రహం ప్రక్కనే వుండి, మూల విరాట్‌ కు పూజలు చేస్తూ వున్నప్పటికీ, నీలోపల ఏం బలపడిపోయింది ఇప్పుడు? పరమాత్మ పద్ధతిగా జీవించాలనే తహ లేదుగా. నేను ఆలయంలో వున్నాను, భగవంతుడిని లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తాను. పరమాత్మ పద్ధతిలోనే జీవిస్తాను అనే నిర్ణయం లేదుగా. అందువలన ఏమైంది? నువ్వు ఎన్నిసార్లు ఆలయానికి వెళ్లినా మళ్ళా అక్కడ నీ శరీరమే స్ఫురించింది కానీ, భగవంతుడు స్ఫురించలేదు. ఎప్పుడైతే ఆ నిర్ణయంతో బయటకు వచ్చావో, అప్పుడేమౌతుంది? దేనినైనా ఎదురించ గలుగుతావు. ఏ పరిస్థితినైనా ఎదురించగలుగుతావు. ఏ మార్పునైనా ఒప్పుకుంటావు. జీవితాన్ని స్థిరమైన పద్ధతిలో నడుపుతావు. కాబట్టి ధర్మార్థ కామాలను ఇట్లా ఆచరించాలి. ఆ స్వర్గ నరకాలు కానీ అన్నీ నీ బుద్ధి రూపంలో వున్న జ్ఞాపకాలే. అవన్నీ ఎప్పటికైనా క్షీణించిపోయేవే. అవన్నీ లేకుండా పోయేవే. ఎప్పటికైనా సరే! శాశ్వతమైన బ్రహ్మజ్ఞానం లభించాలి అంటే, ఆత్మ విచారణ వల్లనే లభిస్తుంది. అది అధ్యారోప అపవాదం వల్లనే లభిస్తుంది. వేరేదాని వల్ల లభించదు. తరువాత వాక్యం అదే.
(అధ్యారోపం అనగా మోక్షం బ్రహ్మజ్ఞానము వలన లభిస్తుంది, వేరు మార్గము లేదు. ఆ బ్రహ్మం అధ్యారోప అపవాదం వల్లనే తెలియబడుతున్నది) తెలియబడుతున్నదట అంతే! గుర్తుపెట్టుకోండి.  బ్రహ్మం అనేది ఎట్లా వుందట? తెలియబడుతుంది. ఇప్పుడు మనము సూర్యుడిని తెలుసుకుంటున్నామా? అనుభవిస్తున్నామా? సూర్యుడిని. సూర్యప్రకాశాన్ని కాదు. సూర్యుడిని తెలుసుకోవడమే. సూర్యుడిని అనుభవించడానికి కొత్తగా అక్కడేమీ లేదు. దాని యొక్క ప్రకాశ ప్రభావాన్ని మాత్రం అనుభవిస్తాము. అట్లాగే, బ్రహ్మానికి సంబంధించినటు వంటి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి మొట్టమొదట. అది జీవితం అంతా ఆక్రమిస్తే, ఆ జీవిత ప్రభావం ఏమిటో మార్పు చెందితే అప్పుడు అనుభవం వస్తుంది. కాబట్టి ముందు ఏం చెయ్యాలట? తెలుసుకో! "కని చేరి పొందవలయురా" అనేది సూత్రం అన్నమాట. కని అదేమిటో చూడాలి మొట్టమొదట. చేరి - ఆ స్థితికి చేరి, పొందవలయురా - నీ జీవితంలో దానిని ఆశ్రయించి జీవిస్తే అనుభవం వస్తుంది. కని, చేరి, పొందవలయురా! ఇదే సూత్రం, వేదాంతం మొత్తానికి ఇదే సూత్రం. కని, చేరి, పొంద వలయురా! నాలుగో స్థితి వుంది, 'అధిగమించ వలయురా'. పొందావయ్యా! అక్కడే ఆగిపోతావా ఏమిటి? దానిని కూడా అధిగమించాలి నాయనా! కని, చేరి, పొంది, అధిగమించవలయురా!