File No.2



విచారణామార్గంలో తప్ప వేరే మార్గంలో ఆత్మజ్ఞానం లభియించదు. అది వాసుదేవ మననములో చెబుతున్నటువంటి మొట్టమొదటి సూత్రం. ఎందుకనయ్యా? అంటే, నవవిధ భక్తి మార్గాలని ఆచరించాలి చిత్తశుద్ధి కోసం. నీలో వున్నటువంటి విషయాల యెడల వున్న అనురాగాన్ని తగ్గించుకోవడం కోసం నవవిధ భక్తి మార్గాలని ఆచరించాలి. విషయాల యెడల వున్న అనురాగం వల్లనే, నేను శరీరం అని బలపడిపోతున్నావు. ఆ విషయాలలో వున్న అనురాగం తగ్గాలి. అనురాగం తగ్గాలి అంటే రెండు పద్ధతుల్లో తగ్గుతుంది. ఎలాగ? మొట్టమొదట్లో పరోపకారం కోసమని చేయాలి. నీకేమీ ఫలాన్ని అపేక్షించకుండా పరోపకారం కోసమని సేవాభావంతో చేయాలి. అదొక పద్ధతి. దానికంటే ఉన్నతమైన పద్ధతి త్యాగం. కర్మఫలత్యాగంతో చేసే పద్ధతి ఒక పద్ధతి. విషయాలలో మనం జీవించాలి. కానీ రెండు పద్ధతులలో జీవించాలి. ఎట్లాగయ్యా అంటే, నిష్కామకర్మ, అమనస్కం. ఈ రెండు పద్ధతులు వుంటాయన్నమాట. నిష్కామ కర్మ అంటే కర్మ యొక్క ఫలితాన్ని ఆశ్రయించకుండా చేయడం నిష్కామకర్మ. దానికంటే ఉన్నతమైనది ఏమిటయ్యా అంటే అమనస్కం. మనస్సుతో పని లేకుండా, కర్మఫలత్యాగ బుద్ధితో, అసలు కర్తయే లేడు అనే పద్ధతిలో చేస్తే, అది అమనస్కభావానికి చేరుతుందన్నమాట.
ఈ స్థాయికి రావాలంటే కాస్త సాధన అయితే కానీ రాలేరు కదా?
అభ్యాసం - కామకర్మలో బాగా పరిణితి చెందాలి. కామ కర్మ చేసే అలవాటు రావాలి కదా ముందు. ముందు ఇప్పటి వరకూ ఎలా చేశాం మనం? ఫలితాన్ని అపేక్షించి చేస్తూ వచ్చాము. లలితా సహస్రము చదివాము. చదివితే ఫలశృతి చదివేశావు. చివరకు ఆ ఫలితం వచ్చింది, ఈ ఫలితం వచ్చింది అంటున్నావుగా. వ్రతంలో కూడా ఆ ఫలితం వస్తుంది, ఈ ఫలితం వస్తుంది అని ఫలశృతి చదువుకుంటున్నావుగా. ఆ ఫలశృతి చదివేప్పుడు ఈ ఫలంతో నాకు పని లేదు. నేను ఆత్మస్వరూపుడుని వీటితో నాకు పనిలేదు అనే భావం కలిగిందా అప్పుడు? కలుగలేదుగా. అందువల్ల ఏమైంది? ఆ నవవిధభక్తి మార్గాలు ఆచరించావు, కానీ ఏమైంది? కామ్యక కర్మలు అయిపోయినాయి. అంటే కోరికతో చేశావన్నమాట. ఇదిగో ఫలానా నిమిత్తమై ఈ పని చేస్తున్నాను. అని పెట్టుకుని చేశావు. నాకు జ్ఞానం ఒక్కటే కావాలి, నాకు మిగిలింది అవసరం లేదు, వైరాగ్యం ఒక్కటే కావాలి, మిగిలింది అవసరం లేదు, జ్ఞానవైరాగ్యాలు తప్ప మిగిలింది నాకు అవసరం లేదు, అనేటటువంటి స్థితిలో స్థిరపడి ఎప్పుడైతే చేస్తావో, అప్పుడే అది నిష్కామ కర్మ అవుతుందన్నమాట. లేకపోతే అవ్వదు.
ప్రతీది అదే (అలాగే) చెయ్యాలిగా? మనమేమో కొన్ని చేస్తాం, కొన్ని చెయ్యము...
            ఆఁ... అంటే అనువైనవి చేస్తావు, దానికి అనువైనటువంటివి చేస్తావు. ఆ విషయంలో ఆ పరిస్థితిలో ఆ సమయానుకూలంగా వుంటే, అలా చేస్తావు. లేకుంటే మామూలుగా చేసేస్తావన్నమాట. అదేకదా జీవుడంటే. శరీరభావమంటే. కాబట్టి ప్రతి అంశంలో, ప్రతి ఆలోచనలో కూడా నేను ఆత్మస్వరూపుడనుఅనే భావంతో చేసినప్పుడే అహం లేకుండా పోతుంది.
            జీవుడనే అహం వున్నంతవరకు అహంకారం తప్పదు. ఆ అహం వెనుక దుఃఖం తప్పనిసరిగా వుంటుంది. దాని వెనకాలే వస్తుందది ఎప్పుడూకూడా.
ఆ అహం ఎందుకు వస్తుంది?
అహం రాలేదు నీకు. అహం అంటే నేను. ఆకారం అంటే శరీరం. నేను శరీరమునే’ - అనుకోవడం చేత అహంకారం అయ్యింది. ఆకార భావన తీసివేస్తే, నేనుకు వచ్చిన సమస్య ఏముంది అసలు? ఇప్పుడు గాఢ నిద్రావస్థలో వున్నావమ్మా... ఇప్పుడు ఆకారం వుందా నీకు? లేదుగా. సుఖంగానే వున్నావుగా. దుఃఖం ఎక్కడ వుంది నీకు గాఢనిద్రావస్థలో, ఏ జీవికైనా దుఃఖం వుందా? లేదు కదా! అవకాశమే లేదు కదా. ఎందుకని? ఆకారభావం లేదు కాబట్టి. మరి మెలకువలోకి రాగానే ఆకారభావాన్ని ఎందుకు తెచ్చుకున్నావు? తెచ్చుకోకూడదు కదా లెక్క ప్రకారం, ఇక్కడ కూడా అలాగే వుండవచ్చుగా. నేను నేనుగానే వుంటే, ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఇది. గాఢనిద్రావస్థలో ఎలా వున్నావు? నేను నేనుగానే వున్నాను. సుఖంగా వున్నాను. పుట్టింది మొదలు, తల్లి గర్భంలో వున్నప్పటి నుంచి ఈ నిద్ర నడుస్తూనే వుంది. ఆఖరి పెద్ద నిద్ర దాకా. మరి అక్కడ ఎలా వున్నావు? నేను నేనుగానే వున్నావు కదా! నేను సుఖంగానే వున్నావుగా. ఏం చేశావట? మధ్యలో ఆకారాన్ని తెచ్చిపెట్టావు. తెచ్చిపెట్టేటప్పటికి ఏమయ్యింది? ఆకారమే నేను అయిపోయింది. అంటే ఈ నేనుకు ఒక లక్షణాన్ని అభ్యాసాన్ని అలవాటు చేశావు. ఏమిటట? ఎందులో దూరితే అది నేనై పోతూ వుంటుంది. అర్థమైందా?
            ఆటవస్తువులతో ఆడేటప్పుడు ఆటవస్తువులే నువ్వు. పుస్తకాలు చదివితే, పుస్తకాలే నువ్వు. విషయాల్లో చేరితే, విషయమే నువ్వు. జ్ఞానంలో చేరితే, జ్ఞానమే నువ్వు. ఈ నేనుకు ఆ లక్షణం వుందన్నమాట. ఎందులో చేరితే అది అదైపోతూ వుంటుంది.
జ్ఞానంలో చేరితే నేను, మంచిదే కదా ?
మంచిదే కదా మరీ. కానీ నిలబెట్టలేక పోతున్నావు కదా! అభ్యాసం లేకపోవడం చేత నిలబెట్టలేక పోతున్నావు అంతే. అభ్యాసం చెయ్యి. నిలబడుతుంది. నడవడానికి ఎంతకాలం ప్రయత్నం చేశావు? రెండు సంవత్సరాలు ప్రయత్నం చేస్తేనే కాని శరీరం నడవడానికి సిద్ధపడలేదు. అంతేనా కాదా? పరిగెత్తడానికి? ఇంకా కొంతకాలం. స్థిరంగా వుండడానికి? ఇంకా కొంతకాలం. ఇప్పుడు? కూర్చుంటే లేవాలంటే కుదరదు. అర్థమైందా? దానికి అభ్యాసం చేస్తున్నావు. కాబట్టి జీవితమంతా అభ్యాసమేనా? కాదా? ప్రతీదీ అభ్యాసమే. కానీ నిన్ను ఏ అభ్యాసం చేయమంటున్నారు? ఏ అభ్యాసం చేస్తే, దుఃఖం తొలగిపోతుందో అది. ఇప్పటివరకూ మిగిలినవన్నీ చేశావు, వాటివల్ల ఏం మిగిలింది? దుఃఖం మిగిలింది.
(అది దుఃఖం అనుకోలేదు కాబట్టి అట్టా చేస్తూ పోయాం....)
అదే సుఖం అనుకున్నావు. ఆ విషయసుఖమే శాశ్వతమనుకున్నావు. ఏమైంది కొంతకాలం అయినాక పోయింది. పోయిందనే అనుభవం వచ్చిందా లేదా? ఇప్పుడు. అప్పుడు చెబితే తెలియదు. అది కాసేపు వుండి పోతోంది అనేది నీకు నీకు తెలియాలి.
ఇప్పుడు ఇందులోకి వచ్చిన తరువాత అది తెలిసింది.
అంటే అర్థం ఏమిటి? ఆత్మజ్ఞానం దృష్టితో చూస్తే గానీ, అది కాసేపు వుండి పోతోందిరా బాబూ అని తెలియడం లేదు. అంటే అర్థం ఏమిటటా? అందులోనే వుండి చూస్తే తెలియదురా నాయనా నీకు. కాసేపు పక్కకురా బయటకి. ఆ విషయంలోనుంచి కాసేపు పక్కకు వచ్చి, అసలు ఆ విషయం బలం ఎంతో చూడు ఒక్కసారి. ఆ విషయానికి శక్తి ఎంత? నిన్ను లాక్కుపోయేంత శక్తి ఎక్కడినుంచి వచ్చింది దానికి? నువ్వు ఆమోదిస్తేనే కదా! నిన్ను ఎవరు ఆమోదించమన్నారు? నిన్ను వెళ్ళి అందులో ఎవరు చేరమన్నారు?
(ఒకటుంది, ఇందులో ఆనందం వుంది అని భ్రమపడి) తెలియక చేరావు. తెలియకపోవడమే కదా అజ్ఞానం. వేరే ఇంకేం లేదయ్యా బాబూ. ఏం చేస్తే దాంట్లోనుంచి బయటపడతావో తెలియకపోవడమే అజ్ఞానం. తెలిసిందిగా మరి ఇప్పుడు. అభ్యాసం మార్చుకో. పోయినదానిని గురించి చింతపడతావే? అభ్యాసం మార్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదుగా నీకు ఇంతకుముందు కూడా. ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవాలమ్మా, నేర్చుకున్నావా? నేర్చుకోలేదా? నేర్చుకున్నావు. అట్లాగే ఇప్పుడూ నేర్చుకోగలుగుతావు. నీ బుద్ధికి ఆ శక్తి  ఎప్పుడూ వుంటుంది.
కానీ అది వచ్చినంత తొందరగా ఇది రావడం లేదు కదా?
ఎందుకనయ్యా అంటే దానికి బలం ఎక్కువ చేకూర్చావుగా మరీ! అవునా కాదా? ఇంతకాలం దేనికి బలం చేకూర్చావు? దానికి బలం చేకూర్చావా? ఇప్పుడు ఆ బలాన్ని నిరసించాలా? అవునా కాదా? ఉదాహరణ చెబుతా చూడు. మీ ఇంట్లో పెరిగినంత కాలం, వివాహం కానంత కాలం నువ్వు ఏమని అన్నావ్‌? మీ అమ్మగారి ఇల్లే నీ ఇల్లుగా వున్నావా? లేదా? వివాహం అయినాక కొంతకాలం పాటు ఏమన్నావు? అది మా అమ్మ ఇల్లు, ఇది మీ ఇల్లు, అది మా అమ్మ ఇల్లు, ఇది మీ ఇల్లు, ఇది మా అమ్మ ఇల్లు, ఇది మీ ఇల్లు అన్నావా? మీ అత్తగారు వగైరాలు అందరూ గతించి నువ్వే యజమానివి అయ్యావండీ, ఏమైంది ఇప్పుడు?
నాది అయిపోయింది. అంటే నీవు యజమానిగా వున్నప్పుడు అంతా నీదే. అర్థమైందా? అప్పుడు పుట్టిల్లు, మెట్టినిల్లు తేడా వుందా? లేదు. మరొకరు యజమానిగా వున్నప్పుడు మాత్రం ఏం చెప్పావు? మీ అత్తగారు, మామగార్లు యజమానులుగా వున్నప్పుడు ఏం చెప్పావు? మీ అమ్మానాన్నలు కూడా వున్నారుగా అప్పుడు. అప్పుడు నా పుట్టిల్లు వుంది, మెట్టినిల్లు వుంది. రెండు ఇళ్ళు వున్నాయి అప్పుడు నీకు. ఎప్పుడైతే పైన యజమాని పోయాడండీ, నువ్వే యజమానివి అయిపోయావు. ఏమైంది అప్పుడు స్వేచ్ఛ రాలా? అట్లాగే, ఇప్పుడేమయ్యావు? విషయంలోకి చేరావండి. విషయము యజమానియై కూర్చుంది. ఏమయ్యావు అప్పుడు? నేను యజమానిగా వుండాలి అసలు ఎప్పుడూ కూడా. కానీ ఏమయ్యింది? విషయం యజమానియై కూర్చుంది. అప్పుడు ఏమైపోయావు? సుఖం దుఃఖం అనే రెండు ఇళ్ళు వచ్చినాయి. విషయం ఎప్పుడైతే యజమాని అయ్యిందో, సుఖం దుఃఖం అనే రెండు ఇళ్ళు వచ్చినాయి. మాటిమాటికి ఏమంటావు? నేను పుట్టింట్లో అయితే సుఖంగా వుండేదాన్ని, అత్తింటికి వచ్చి కష్టపడిపోతున్నాను. అంటున్నావా? లేదా? మళ్ళా ఇక్కడ సుఖం వచ్చినప్పుడు? అక్కడ దుఃఖం గుర్తుకు వస్తుంది. ఇట్లా ఏమయ్యావ్‌ ఇప్పుడు అట్లా రెండు ఇళ్ళు రెండు ఆశ్రయాలు ఏర్పడుతున్నాయి. అయితే, నేను యజమానిగా వున్నానండి ఇప్పుడు, ఇక విషయంలో వున్న సుఖం దుఃఖంతో నాకేం పని? స్వేచ్ఛ వచ్చేసింది ఇప్పుడు నాకు. స్వేచ్ఛ వచ్చేసినాక ఇప్పుడేమై పోయింది? అన్నీ పనుముట్లు అయిపోయినాయి. అన్నీ పనిముట్లు అయిపోయినాయి. ఎప్పుడైతే పనిముట్లు అయిపోయినాయో, అప్పుడు ఏమైంది సహజంగా? సమస్యలు లేకుండా పోయిందిగా. ఎప్పుడైతే నీవు యజమానిగా వున్నావో, అన్నీ నీ ఆధీనంలో వున్నాయి. దేనిని కావాలంటే దానిని పనిముట్టుగా వాడు. అది నువ్వు కామాకు. ఏనుగు నడిపే మావటివాడు, ఏనుగు వాడైతే వాడు ఎట్లా నడుపుతాడు? నడపగలడా? నడపలేడు కదా! గుర్రాన్ని నడిపే రౌతు, వాడు గుర్రమైతే నడుపగలుగుతాడా? నడుపలేడు కదా! మనం ఇప్పటివరకూ ఏమౌతూ వచ్చాము? నువ్వు దాన్ని నడపరా నాయనా అని భగవంతుడు పంపిస్తే, శరీరాన్నీ, ఇంద్రియాల్ని, విషయాల్ని, జగత్తుని అర్థం చేసుకో, వాటిని నడుపు. రాజు వలె నడుపు. యజమాని వలె వుండు. అని భగవంతుడు నీకు ఆ శక్తి సామర్థ్యం ఇచ్చి, మానవ ఉపాధిని ఇచ్చాడు.
            కానీ ఆ మానవ ఉపాధిలోకి వచ్చినా, పూర్వ జంతు అభ్యాసము పోలేదు. అర్థమైందా? నీకు పాకే జంతువు నుంచి, నడిచే జంతువుకు వచ్చావా? రాలేదా? ఆవిధంగా రాబట్టేగా ఇక్కడ ఎవరూ నేర్పకుండా పాకడం నుంచి నడవడానికి వస్తున్నావు.
* మానవ జన్మలలో చాలా జన్మలు అయిపోయినాయి కదా, ఇంకా ఆ జంతు జన్మల అభ్యాసాన్నే ఎందుకు తీసుకోవాలి?
ఎందుకు రాలేదు అంటే, నీ బుద్ధి వికాసంలో ఎప్పుడూ ఇలా విచారణని పెట్టలేదుగా. ఇప్పుడేగా మొదలు పెట్టావు. ఆ బుద్ధి వికాసం పూర్తయ్యే పని చేయలేదుగా. ఎంతసేపూ. బుద్ధి వికాసం ఎప్పుడు పూర్తయ్యింది? విచారణ జ్ఞానం పెడితే బుద్ధి వికాసం పూర్తై పోయింది. అప్పుడు నీకు మానవజన్మ ఎందుకు వచ్చిందో స్థిరంగా అర్థమయిపోయింది. ఇప్పుడు మానవ ఉపాధిని అసలు ఎట్లా ఉపయోగించుకోవాలనే పద్ధతిలో జీవించడం మొదలు పెట్టావు. అప్పుడు కదా ఆఖరి మానవ జన్మ అయిపోయింది. ఎప్పటికప్పుడు నీకు జంతువు జన్మ ఎట్లా అయిపోయింది? ఆ జంతువు జన్మలో నీవు సాధించవలసినది, పొందవలసిన జ్ఞానాన్ని నీవు పొందేస్తే ఆ జంతువు ఉపాధి అక్కడితో అయిపోయి దాని పైస్థితిలోకి వస్తూ వచ్చావు. అట్లాగే, ఆఖరికి మానవ ఉపాధి లభించింది. ఈ మానవ ఉపాధికి ఆఖరు ఏమిటయ్యా? దీని తరువాత ఏమిటి? బుద్ధి వికాసం పూర్తవ్వాలి నాయనా! ఏమిటి పూర్తవ్వాలి? విచారణ జ్ఞానం చేత నేనే పూర్తిగా అంతటా వ్యాపించి వున్న వాడను. నేనే సత్యం, నేనే శాశ్వతం, నేనే సనాతనుడను, నేనే పరమాత్మను, నేనే ఆత్మస్వరూపుడను, నేనే భగవంతుడను. అనే జ్ఞానం కనుక నీకు లభిస్తే, మానవ ఉపాధి నీకు ఎందుకు వచ్చిందో దాని పని అయిపోయినట్లే. ఇంక అప్పుడు నీకు ఆ ఉపాధితో పనిలేదు. పనిలేదు కాబట్టి నీవు ఏం చేస్తావు? మళ్ళా పుట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకు పుడుతున్నావు? (ఇది తీరలేదు కాబట్టి పుడుతున్నావు) ఈ జ్ఞానం లేదు కాబట్టి పుడుతున్నావు. మరల మరలా మానవుడిగానే పుడుతున్నావు. కానీ ఏమౌతావో తెలియదుగా. అందుకని మానవోపాధి నీకు ఎందుకు లభించిందో మొట్టమొదట నీవు తెలుసుకో. బుద్ధి వికాసం కోసం మానవోపాధి లభించింది. ఆ బుద్ధి వికాసం పూర్తి అవ్వాలంటే విచారణాజ్ఞానం కావాలి.
            కానీ విచారణాజ్ఞానాన్ని విషయం వరకే పరిమితం చేసుకోవడం చేత, శరీరము, విషయము వరకే పరిమితం చేయడం వల్ల ఏమైపోయావు?
తాత్కాలిక సుఖాన్ని మాత్రమే ఆశ్రయించే పద్ధతిలో జీవించావు. అందువల్ల ఏమైంది? విషయాలు రాజై కూర్చున్నాయి. యజమానై కూర్చున్నాయి. అవి బలబడిపోయినాయి. అందువల్ల ఇప్పుడు ఏం చెయ్యాలట? అసలు నాకు మానవ ఉపాధి ఎందుకు లభించింది? ఈ విషయం కోసమేనా? నేను పుట్టింది దేనికోసం? అనే ప్రశ్న వేసుకో మొట్టమొదట. ఎవడికో ఒకడికి రోజూ ఒక వంకాయ కూర చేసిపెట్టడానికో, ఒక గోంగూర చేసిపెట్టడానికో, ఒక సాంబార్‌ చేసి పెట్టడానికో పుట్టానా? నేనేమన్నా? నేను దేని కోసం పుట్టాను? తోముకోవటం, అన్నం వండుకోవడం, గిన్నెలు తోముకోవడం, అన్నం వండుకోవడం, గిన్నెలు తోముకోవడం, తినడం, పడుకోవడం ఇంతేనా?
            వేరే పని లేదా ఇంకా? ఎందుకు పుట్టా నేను అసలు? మనం రోజూ ఇదేగా పనిచేస్తోంది? వేరే ఇంకా ఏమన్నా పనిచేశామా? 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వెనక్కి తిరిగి చూడండి, అందులోనే సుఖాన్ని వెతుక్కున్నావు. ఆ అంట్లు తోమడంలోనే శుభ్రంగా తోమాను, తళ తళలాడేటట్లు తోమాను, సర్ఫ్‌ పెట్టి తోమాను, విమ్‌ పెట్టి తోమాను... ఇట్లా ఏమైపోయావ్‌? తాత్కాలిక సుఖం, తాత్కాలిక ప్రాధాన్యత, తాత్కాలిక ప్రత్యేకత... ఎవరైన బాగుందంటే? అయిపోయే... మహదానంద పడిపోయావ్‌. మహదానందం అందులోనే వుందనుకున్నావ్‌ అంతే. అబ్బా! మీరు పెట్టిన సాంబారు అద్భుతమండీ అంటే, ఇకచాలు ఓ పొంగిపోయావు. ఏనుగంత అయిపోయావు అంతే. అవునా కాదా? మరి విషయం కదా ఇది. ఈ సాంబారు ఎంత సేపు వుంటుంది? రేపటికి ఏమైపోతుంది? ఎంత గొప్పదైనా తీసి దిబ్బలోకి కొట్టాల్సిందేనా? నువ్వు చేసినా, నేను చేసినా? మరి ఇందులో శాశ్వతత్వం ఏమైనా వున్నదా? లేదు. ఇవాళ పొగిడినవాడు, రేపు సరిగా నువ్వు చేయలేదండీ, ఏమన్నాడు? (తిట్లు) అప్పుడేమైంది మరీ? నిన్న బాగా చేశాను, ఇంకా బాగా చెయ్యాలనే భ్రాంతిలోనే వున్నాను. ఏమయ్యావప్పుడు? అర్థమైందా? అంటే అర్థం ఏమిటి? నాయనా విచారణా జ్ఞానం లేక చేయడం వల్ల ఇలా అయిపోయావ్‌. కాబట్టి అభ్యాస బలాన్ని మార్చుకో. అంతేకాని గతంలోకి వెళ్ళి ఊరికే చిక్కు పడమాక. గతం గడిచిపోయింది కదా! గడిచిపోయిన అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని మళ్ళా అందులోకి పోమాక. అదీ చేయవలసినది.


కానీ మనమేమి చేస్తున్నాము? (అటు పోవద్దన్నా మళ్ళా మనసు వెళ్ళిపోతుంది కదా అక్కడికి) పోతేపోని మళ్ళా తిరిగి ఇక్కడికే వస్తుంది. నువ్వు స్థిరంగా వుండు. ఇంకా నేనంటే ఏమిటి? ఆఁ... అంటే ముందు ఏం చెప్పాలి? మనసు నేను కాదని చెప్పాలి. మనసుకు చెప్పాలి. అది. నువ్వు నా చేతిలో పనిముట్టువు కానీ, నేను నువ్వు కాదు. ఆ ఆలోచన వచ్చిన ప్రతి నిమిషం చెబుతూ వుండాలి దానికి. ఏయ్‌ నువ్వు మళ్ళీ వచ్చావా? చూస్తున్నాను నిన్ను. నేను గమనిస్తున్నా నిన్ను. మళ్ళా వచ్చావు నువ్వు. నేను గమనిస్తున్నాను. నాలో రజోగుణం పనిచేస్తుంది. నాలో తమో గుణం పనిచేస్తుంది. నాలో సత్వగుణం పనిచేస్తుంది. నాలో ఈ మూడు గుణాలు ప్రారంభమైనాయి, నేను గమనిస్తున్నాను. నేను నిన్ను చూస్తున్నాను. నిన్ను గమనిస్తున్నాను. నేను గమనించేవాడను. నేను సాక్షిని. నిన్ను గమనిస్తున్నాను. నువ్వు నేను కాదు ఎప్పటికీ, నా చేతిలో నువ్వు పనిముట్టువి. ఈ వాక్యాలు నీ మనసుకి చెబితే, ప్రతి ఆలోచనకి దానికి నువ్వు ఇట్లా చెప్పాలి. ప్రతీ క్షణం ఇక అదేపనిలో వుండాలి. అప్పుడు అభ్యాసం మారిపోయింది. ఎంతసేపు ఎంతో టైం పట్టదు దీనికేమీ, ఒక్క సంవత్సరం గట్టిగా కష్టపడు ప్రతి ఆలోచనకు ఇట్లా చెప్పడంతో స్థిరపడిపోతావు అంతే. ఒక్క సంవత్సరం చాలు. విచారణా జ్ఞానంలో ఒక్క సంవత్సరం పాటు ఎవడైతే, త్రికరణ శుద్ధితో ప్రతి ఆలోచనకి నేను మనసును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఇంద్రియాలను కాదు, నేను శరీరమును కాదు, నేను ఆత్మ స్వరూపుడను, (ఇది ముందు గుర్తు వుండాలి కదా, పనిలో పడిపోయి ఇది మరచిపోతున్నాము కదా!) పని కంటే ముందు ఆలోచన. ఆలోచన కంటే ముందు విచారణ. అర్థమైందా? ఇలాగ చూసుకోండి. అలా ఆ పుస్తకం చదవండి. చక్కగా విచారణ చేయండి. ప్రశాంతంగా ఈ వారంపాటు ఆ వాసుదేవ మననముచదవండి. జరిగిపోతూ వుంటుంది. మళ్ళా మళ్ళా వింటూ వుండండి. అందరు తెచ్చుకున్నారు కదా! ఇది.