File No.18



తలంపు రూప మనస్సు….అతనియందే…. అతను అంటే నేను, నీ స్వస్థానం నీ స్వరూప స్థితి 
ఉపనిషత్తులన్నీ చెబుతున్న ఆఖరి సిద్ధాంతం ఏమిటి అంటే నీ ఆత్మ స్వరూపాన్ని గుర్తెరిగి అందులో నిలిచి వుండు. అందులో నిలిచి ఉండటమే ఆఖరి సాధన. ఇంకా వేరే వన్ని కూడాను ఇతరములైన సాధనలు.  దేహాభిమానంతో చేసే సాధనలు. కాబట్టి అని జాగ్రత్తగా విచారణ చేసుకొని అందులోని అహంకారాన్ని నిరసించి నీవు నేననే స్ఫురణని గుర్తుపెట్టుకో. ఆ అర్ధాన్ని గుర్తుపట్టు. ఆ స్ఫురణలో ఉండు.  ఏమడుగుతున్నాడు? ఈ ఆత్మవిచారణ కేవలం స్థూల దేహం వరకే సరిపోతుందా సూక్ష్మ కారణ దేహాలకు కూడా ఇదే ఆత్మ విచారణయేన? సమాధానం ఏమి చెబుతున్నారంటే ....స్థూల దేహంలో మీరిప్పుడు మెలకువలో వున్నారు. సూక్ష్మ దేహం అంటే కల. కారణ దేహం అంటే నిద్ర. ఆ కల నిద్ర ఈ స్థూల దేహంలోనే కదా ఏర్పడుతున్నాయి. వేరే దెగ్గరినుండి ఎమన్నా ఏర్పడుతున్నాయా? నీ బయట ఏమి ఏర్పడట్లేదుగా. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలు మూడు ఇందులోనే వున్నాయి కదా. ఒక దాన్ని ఒకటి ఆశ్రయించి వున్నాయి కదా. కాబట్టి ఈ విచారనే మూడింటికి సరిపోతుంది. ఆ మూడు స్థితులలో ఏ అనుభవం కలిగినా ఆత్మ విచారణ చేస్తూవుంటే సరిపోతుంది. కలలో కూడా ఆత్మ విచారనే చేయవచ్చు. గాఢ నిద్రావస్థలో కూడా ఆత్మ విచారణ చేయవచ్చు. అంత బలపడాలని అర్ధం. స్థూల దేహం పంచ కోశాలతో కూడుకొని ఉంది. గుణ త్రయాలతో కూడుకొని ఉంది. ఈశాన త్రయంతో, శరీర త్రయంతో కూడుకొని ఉంది. వీటిలో చేసిన విచారనే మిగిలిన వాటికీ కూడా సరిపోతుంది. ఇదే బలంతోటి మిగిలినవాటిని కూడా విచారణ చేయి.

మనసు బుద్ధి చిత్తము అహంకారము నాలుగుగా చెప్తున్నారు కదా. మరి మనో నాశం ఒక్కటే ముక్తి అంటారేమిటి? అని ప్రశ్న అడుగుతున్నారు. పైన రూప మనో నాశములు కావలి అన్నారు కదా. రూపం అంటే దేహాభిమానం. మనో నాశం అంటే సంకల్పం లేకుండా పోవడం. అట్లా సంకల్పం లేకుండా పోవడానికి మనో నాశం అని పేరు పెడితే, వీరేమో మనసు బుద్ధి చిత్తము అహంకారము నాలుగుగా చెప్తున్నారు కదా. మరి మనో నాశం ఒక్కటే ముక్తి అంటారేమిటి? తప్తాయః పిండ ...మనసే బుద్ధి చిత్తం అహంకారం...అవి నాలుగు లేవు. అవన్నీ కలిపి ఒక్కటే. పని భేదాన్ని బట్టి నిర్ణయ భేదాన్ని బట్టి స్థితి భేదాన్ని బట్టి నాలుగుగా పిలవబడుతోంది అని చెప్తున్నారు. ఆ పని భేదం ఎట్లాగో చెప్తున్నారు. ఇనప గుండు వున్నది, అది జడం కదా. కానీ దాన్ని నిప్పులో వేస్తే ఆ నిప్పులో కాలి కాలి అగ్ని గుండుగా మారింది. అలాగే మనసు అసలు జడం, ఒక ఇంద్రియంగా సృష్టిలోకి వచ్చింది. కాలు చెయ్యి ఎట్లా జడమో అలాగే మనసు కూడా జడం. కానీ నేననే నీ ఉనికికి అతి దెగ్గరగా ఉండడం చేత అగ్ని గోళంగా మారింది. చైతన్యం అందులో బాగా పనిచేసి పనిచేసి ఇప్పుడది ఇనప గుండుగా కనపడుతోందా? కనపడట్లేదు. అగ్ని గోలమై అన్నింటిని కాల్చేస్తోంది. ఎందుకంటే అగ్నిలో ఉండడం చేత. చైతన్యానికి అతి దెగ్గరగా ఉండడం చేత ఈ చైతన్యం యొక్క బలం అంతా దానిలో ప్రవేశించి మొత్తం అన్నింటిని తానే ఆక్రమించేసింది. అన్ని ఇంద్రియాలు తానే ఆక్రమించేసింది. నిజానికి కళ్ళు ముక్కు చెవులు లేవు. అన్ని మనసులో వున్నాయి. ఆ మనసే ఇన్ని ఇంద్రియాలుగా పని చేస్తోంది. ఇట్లాగ అన్ని పాత్రలను అదే పోషించేస్తోంది. ఆ జ్ఞాపకాల రూపంలో వున్నప్పుడు బుద్ధిగాను, వాసనల రూపంలో వచ్చేటప్పటికి చిత్తంగానూ, ఆలోచనల రూపంలో వున్నపుడు మనసుగాను, దేహాభిమానంతో ప్రవర్తిస్తే అహంకారంగాను పిలవబడుతోంది. నీ అంతఃకరణం అనే లోపల ఉన్న పనిముట్టు  అది ఒక్కటే పనిముట్టు. అది ఆలోచనలు చేసినపుడు మనసుగా పిలవబడుతోంది. జ్ఞాపకాలు పని చేస్తున్నపుడు బుద్ధిగా పిలవబడుతోంది. నిర్ణయంగా పనిచేస్తునపుడు బుద్ధి గా పిలవబడుతోంది. దాని వెనకాల వాసనాబలంగా పనిచేసినప్పుడు చిత్తంగా పిలవబడుతోంది. దాని వెనకాల దేహాభిమానంతో పని చేసినపుడు అహంకారంగా పిలవబడుతోంది. పిలవబడుతోందే గానీ వస్తువు ఒకటే. అది ఇనుపగుండు వలె జడ వస్తువు. కానీ అగ్ని అనేటటువంటి చైతన్య స్పర్శ చేత మనసు చైతన్యవంతమైనది.
నువ్వు నిద్రపోతున్నప్పుడు కాళ్ళు చేతులు ఏమైనా కదులుతున్నాయా. ఏమైనా తెలుస్తోందా. జ్ఞాన ఇంద్రియాలకు ఏమైనా తెలుస్తుందా? కర్మేంద్రియాలకు ఏమైనా తెలుస్తోందా? అంతరేంద్రియాలకు ఏమైనా తెలుస్తోందా ? తెలియడం లేదుగా? ఎందుకంటే చైతన్యం విరమించింది.
అదే మెళకువలోకొచ్చేకొద్దీ చైతన్యం ఇంద్రియాలదాకా కిందకి దిగి వచ్చింది. అట్లా దిగి రావడం చేత ఇవే కదులుతున్నట్లుగా కనపడుతున్నాయి. లోపల చైతన్యం కదిలితే కానీ ఇవి కదలటం లేదు అనే స్ఫురణ పోయింది. ఇప్పుడు మాట్లాడుతున్నాము అంటే లోపల చైతన్యం స్ఫురణ ఉంటేనేగా ఇది పనిచేస్తోంది. ఆ చైతన్య స్ఫురణ దృష్టితో ఇంద్రియాలను ఉపయోగిస్తే నీకేం ప్రమాదం రాలేదు. చైతన్య స్ఫురణని తీసేసి, ఈ కాళ్ళు చేతులే చేశాయనేటప్పటికీ అహంకారం వచ్చేస్తుంది. అందువల్ల ఏపని చేస్తూవున్నా ఆ ఆత్మ స్ఫురణలో ఆ చైతన్య స్ఫురణలో ఉండాలి. అప్పుడు మనసును ఇన్ని ముక్కలు చెయ్యాల్సిన అవసరం లేదు. మానసవతల నేను వుంది. కానీ అలా మనసంటే ఒకటిగా చెప్తే నీకు అర్ధం కావట్లేదు కాబట్టి దాని పనులను బట్టి దానికి వేరు వేరు పేర్లు పెట్టి నీకు అర్ధమయ్యేట్లు చేయడం కోసం అలా పెట్టాం. చివరికి జరిగేదేమిటంటే ప్రతి ఇంద్రియం మనసే. అది జడమే. అది నశించిపోతుంది. చైతన్యం విరమిస్తే కొంత కాలానికి...అగ్ని లోంచి తీసుకొచ్చి ఆ ఇనప గుండును బయట పెట్టామండి. చల్లారిపోయి చల్లారిపోయి చల్లారిపోతుంది. చివరికి మరల ఇనప గుండే మిగిలింది. అది చైతన్యవంతం అవ్వలేదు. అలాగే నేను అనే ఉనికిలోకి నీవు చేరేకొద్దీ ఈ మనసు జడమని తెలిసిపోతుంది.
మనసు జడం అని తెలిసాక దానికి విలువ వుందా? ఏమి లేదు?ఎందుకని ? కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకు చైతన్యం లేకపోతె ఎలా విలువలేదో అలాగే అంతరేంద్రియం అయినా మనసుకు కూడా ఏం విలువ లేదు. నిజానికి విలువగాని ప్రజ్ఞ కానీ ఆ స్థితిగాని ఆ శక్తిగాని అదంతా ఎవరివి? చైతన్యానివి. నేను అనే ఆత్మ స్ఫురణ కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకో. వాటిలోంచి చైతన్యాన్ని ఎట్లా విరమింప చేయాలో తెలుసుకో. మనసును ఆపే ప్రయత్నం చేయటం కాదు, ఏది చేరితే మనసు కదులుతోందో ఈ వస్తువు వుంది చైతన్యం దీనికి తగలగానే వస్తువు కదిలింది. లేకపోతె కదలదుగా. అట్లాగే ఆ చైతన్య స్పర్శ వలన మనసు కదులుతోంది. చైతన్యాన్ని విరమింప చేస్తే మనసు కదలదు. ప్రాణమైనా అంతేగా. ఇంద్రియాలన్నీ అంతేగా. కాబట్టి అన్నింటిలో ఆ కదలిక దేనివలన కలుగుతోంది అంటే చైతన్యం వలన కలుగుతోంది. కాబట్టి ఆ చైతన్యాన్ని కదలకుండా చెయ్యి. దానిని విరమింపచేసే ప్రయత్నం చేయి. కాబట్టి ప్రాణ చైతన్యమే చైతన్యం. శ్వాస మీద ధ్యాస పెట్టేసరికి.... ముందు శ్వాసను ఒక క్రమంగా కదలడం ఏర్పాటు చెయ్యాలి. శ్వాస కదలకుండా పోవడము సాధ్యం కాదు. ఒక క్రమమైన పద్ధతిలో లక్ష్యం దిశగా కదలడం రావాలి. ఇప్పుడే దిశగా కదులుతోంది అంటే విషయాల దిశగా కదులుతోంది. దానిని విరమింపచెయ్యాలి, వెనక్కి తిప్పి నేననే స్ఫురణ కలిగేట్లు చేయాలి. అపుడు చైతన్యం దిశగా కదిలేటప్పటికీ ఇవి కూడా చైతన్యమే అయి వున్నాయి. ఇంద్రియాలు కూడా చైతన్యంలో భాగం అయిపోతాయి అపుడు. ఇపుడు ఇంద్రియాలు చైతన్యం వేరుగా వున్నాయి. చైతన్యం అసలు గుర్తుకు రావడం లేదు.ఇంద్రియాలేమో విషయాలవైపే మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి ఇంద్రియాలకు అవి చైతన్యంలో భాగం అని గుర్తుచేయాలి. అపుడు ఇంద్రియాలు చైతన్యం వైపు తిరిగితే అవి విషయాలను విడిచిపెడతాయి. తద్వారా ఇంద్రియాలు చైతన్యంలో అంశీభూతం అయినవి. దాని అంశే ఇందులో వుంది అని తెలిసింది. అపుడు చైతన్యమే సత్యంగా తోస్తుంది. ఇంద్రియాలు సత్యమనే సంగతి మర్చిపోతాము. ఈ విచారణ వాళ్ళ చైతన్యమే సత్యం అని తెలుసుకున్నాము. ఇక ఎప్పుడు ఆత్మ స్వరూపమే సత్యం అనే భావన లో వున్నావు. చైతన్యమే సత్యం అనే భావనలో వున్నావు. అపుడు ఇంద్రియాలు విషయాలు అసత్యం అయిపోయాయి.
ఒకవేళ ఇంద్రియాలు ప్రవర్తించిన కూడా తాత్కాలిక సత్యములే. ఒకవేళ ఏదైనా ఆచరించిన కూడా అంటకుండా ఆచరించే స్థితి వచ్చేసింది. అందువలన నీవు స్వరూప స్థాయిలో నిలకడ చెందే అవకాశం వచ్చింది. స్వరూప స్థితిలో నిలకడ చెందితే ఉపయోగం ఏమిటి? అపుడు మనసు జడం అని తెలిసింది. అప్పటి వరకు తెలియడంలేదు. దాంట్లోనే ఉండి అది జడం అంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అందుకే నేను అనే స్ఫురణను పట్టుకునే ప్రయత్నం ఇలా చెయ్యండి. మనసు అరిషడ్వార్గములచేత వృద్ధి చెందింది. ఆ అరిషడ్వార్హ్గల అభ్యాసం ఎలా వచ్చింది? మనం అభ్యాసం చేసుకుంటేనే కదా వచ్చాయి. లేకపోతె వచ్చాయా? బాల్యంలో అరిషడ్వార్గాలు లేవుగా. బుద్ధి వికాసం వచ్చేకొద్దీ వచ్చాయి. ఎలా వచ్చాయి అంటే జగత్తును చూసి దృశ్యాన్ని చూసి అలవాటు చేసుకున్నాము. ఆ విచారణ అప్పుడే సరిగ్గా చేసుంటే ఇలా అయ్యేది కాదుగా. చైతన్య స్ఫురణ అప్పుడే కలుగుతుందిగా. అప్పుడు కలగడం సులభమా ఇప్పుడు కలగడం సులభమా?

అప్పుడే కలగడం సులభం. కానీ అప్పుడు మనకు ఈ తెలివి ఏమైంది. జగత్తుతో పోల్చుకొని, ఇంద్రియాలతో పోల్చుకొని, ఇతరులతోటి విషయాలతోటి పోల్చుకొని ఈ సాపేక్ష ధర్మం చేత చైతన్య స్ఫురణను కోల్పోయావు. అందువల్ల మాలిన్యం పెరిగిపోయింది. అలవాటు చేసుకున్నావు కాబట్టి ఇలా అయ్యావు. సృష్టిలో ఉంటేనే కదండీ నేను అలవాటు చేసుకునేది. ఏది ఎక్కడుంది చూపెట్టూ సృష్టిలో. అదే వచ్చిన చిక్కు. లేని దానిని వున్నదిగా భావించి భ్రాంతి చెందుతున్నావండి. అది లేదురా బాబు అని తెలిసినవారు చెబుతూవుంటే, కాదు వున్నదని వాదిస్తున్నావు అంతే. తేడా. చెట్లు పశు పక్షాదులు వున్నాయండి వాటికీ కామ క్రోధాది అరిషడ్వార్గాలు ఉన్నాయా? లేవుకదా. 84 లక్షల జీవరాసులలో ఒక్క మానవుడికే తప్ప ఈ భ్రాంతి వేరే ఎవరికైనా ఉందా? నేను ఇవ్వాళా కల కన్నానండి అది సత్యమని నీవు వాదిస్తున్నావండి. నాయన కల అసత్యం నాయన అని చెప్తున్నారు. అది అసత్యం అని ఎప్పటికి తెలుస్తుంది నీకు.
నేను కల కన్నాను కాబట్టి ఏమైనా సరే ఇది సత్యమే. ఇవ్వాల జరిగితీరుతుంది జరిగితీరుతుంది అని అనుకున్నవాడి. ఇవ్వాల అయిపోయింది. మరల రాత్రికి ఇంకో కల కన్నావు. మళ్ళీ పొద్దున్నే లేస్తూ నేను రాత్రి ఈ కల కన్నాను కాబట్టి ఇవ్వాల ఇది జరిగితీరుతుంది జరిగితీరుతుంది అనుకున్నావు. ఎప్పటిదాకా చూస్తావు. మళ్ళీ ఇంకో కల కనేదాకా చూస్తావు. ఇది అసత్యం అని నీకే తెలిసిపోయిందిగా. అదేమాట నేను నువ్వు సత్వ గుణంలో ఉంటే నేను ముందే చెప్పానీకు నాయన కల అసత్యం నాయన. కలలో వచ్చేది నీకు ఎప్పటికీ ఇలలో సత్యం కాదు నాయన. వాసనా బలం చేత నీకు ఆ దృశ్యం కనపడుతున్నది. తాత్కాలికంగా నిన్ను భ్రమింపచేస్తోంది. ఎప్పటికీ అది అనుభవజ్ఞానంలోకి రాదు నాయన. అంటే అప్పుడు విన్నవాడు ఏమయ్యాడు. వెంటనే నిర్ణయం చేసుకున్నాడు. ఇక ఈసారి కల వచ్చినపుడు దానికి చెప్పాడు ఈ పాఠం. నువ్వువాసనా బలముచేత కలుగుతున్నావు. నువ్వు అసత్యం.  నేను సత్యం అని కల స్థితిలో ఎప్పుడైతే దాన్ని మనం తిప్పుకోగలిగామో ఏమయిందప్పుడు ఇంకోసారి కల వచ్చిందా?
ఇదంతా క్రమ వికాసం. ఒక్క పుటలో ఒక రోజులో ఒక గంటలో ఒక నిముషంలో వస్తుందని చెప్పడంలేదు. నువ్వు అభ్యాసం చేసి మొదలుపెట్టినపుడే బుద్ధి వికాసం ఏర్పడేటపుడే. అందుకే మనవాళ్ళు ఉపనయనం ఎప్పుడూ చేయాలన్నారు? ఐదేళ్లకు చెయ్యమన్నారు. ఎందుకని అంటే అప్పటినుండి నీవు క్రమ విచారణలో కనక ఉంటే నీకు బుద్ధి వికాసం 8 ఏళ్లకు కదా వచ్చేది. అప్పుడు నువ్వు సరిగ్గా ప్రపంచాన్ని గమనించగలుగుతావు. ఈ అరిషడ్వార్గాలతో కాకుండా. ఈ మనసు దృష్ట్యా కాకుండా, చైతన్య దృష్ట్యా ఈ ప్రపంచాన్ని గమనించ గలుగుతావు.

అందుకని అలా పెట్టమన్నారు. మనమేమో రేపు పెళ్లంటే ఇవ్వాల చేసాం. స్వబుద్ధి వికాసం అంతరంగంలో సూక్ష్మంలో ఎనిమిదేళ్ళకు మొదలవుతుంది. స్వనిర్ణయం చెప్పడం మొదలుపెడతాడు. నాకు ఇది ఇష్టం లేదు. నేను ఇది చెయ్యను. నేను ఇదే చేస్తాను. ఎనిమిదేళ్ళనించే చెప్తాడు. సూక్ష్మంలో జరిగిపోతూవుంటుందది. అందుకనే దానికి మూడేళ్ళ ముందే మొదలుపెట్టమన్నారు. ఎందుకని అప్పటికి అభ్యాస బలం వచ్చేస్తుంది. అప్పటికే మూడేళ్లు చేస్తావుకదా. ఎవరైనా విడమరిచి చెప్పాలి. ఉపనయనం అంటే ఎదో సంధ్యావందనం చేసి పోరా బాబు అని చెప్పడం కాదు. మెడలో జంధ్యం వేసి పంపడం కాదు. తండ్రే గురువుగా ఎందుకు పెట్టారంటే ఆ అయిదేళ్ళపుడే వాడికి ఉపనయనం చేసి దానిని విడమర్చి చెప్పాలి అనుభవ జ్ఞానంతో ఆ దృష్ట్యా ప్రపంచాన్ని ఎట్లా చూడాలి. ఆ చైతన్యం దృష్ట్యా ప్రపంచాన్ని ఎట్లా చూడాలి. ఈ చైతన్యం దృష్ట్యా జీవితాన్ని ఎట్లా చూడాలి. చైతన్యం దృష్ట్యా దేహాన్ని ఎట్లా చూడాలి.చైతన్యం దృష్ట్యా వుంటూ పనులు ఎట్లా చేస్కోవాలి. ఇది ఆ మూడేళ్లు దెగ్గరుండీ చక్కగా అభ్యాసం చేయించాలి. అందుకు తండ్రి గురువు ఉపనయనానికి. అంతే కానీ తండ్రి ఒక్కడే చెప్పాలి,తండ్రి ఒక్కడే చెప్పాలి అంటారు. ఎందుకు చెప్పాలి తండ్రి. అతడు బాల్యంలో తండ్రి దెగ్గర ఉంటాడు కాబట్టి. తండ్రి అభ్యాసం చేయించాలి.తండ్రికి ఉండాలిగా ముందు ఈ అనుభవం.
ఈ ఆత్మ విచారణ తండ్రికి ఉంటేనేగా అభ్యాసం చేయించేది. ఈ రోజులలో అలా ఎవరూ చేయించడంలేదుగా. బ్రాహ్మణులు ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళు కూడా అనూచానంగా వాళ్ళచేత చేయిస్తున్నారు గాని ఆత్మ విచారణ పద్ధతిలో వాళ్లకు చెప్పడం లేదుగా. ఆ మంత్రార్ధాన్ని వివరించి చెప్పడం లేదుగా. ఆ సంధ్య వందనం చేస్తున్నపుడు అన్ని ఏవైతే చెబుతున్నాడో అవన్నీ యాంత్రికంగా చేయటానికి అలవాటు చేస్కుంటున్నవేగాని దానిని ఆత్మ విచారణ పద్ధతిలో తిప్పి చెబితే కదా తెలిసేది వాడికి. ఎప్పుడు చెప్పాలట? అయిదేళ్ల వయసప్పుడే ఈ విద్యను నేర్పామన్నారు. అక్షరాభ్యాసం అయిదేళ్ల అయిదు నెలల అయిదు రోజులు. దేనితో మొదలుపెట్టాలి. దీనితో ఉపనయనంతో మొదలుపెట్టాలి. అందుకే "ఓం నమశ్శివాయ సిద్ధం నమః" ఉపనయనం చేసిన తర్వాత అక్షరాభ్యాసం. ఈ రోజులలో రెండున్నరేళ్లకే అక్షరాభ్యాసం. వాడికేమొచ్చు, ఏం తెలుసు.
వాడికి ఏ ఇంద్రియం ఎదో తెలియదు అప్పటికి. మూడేళ్లకు కాలు చెయ్యే సరిగ్గా తెలియదు వాడికి. ఇప్పుడు క్షరమేది అక్షరమేది వాడికేలా తెలుస్తుంది. అయిదేళ్ల వయసు వస్తేగాని తెలుసుకోలేడు. వీలయితే ఐదేళ్లకు చెయ్యండి. లేకపోతె ఎనిమిదేళ్ళకైనా చెయ్యండి. తర్వాత ఎప్పుడు చేసిన ఒకటే. ఎందుకని అంటే బుద్ధి వికాసం వచ్చేసింది కాబట్టి. స్వబుద్ధి ఏర్పడిపోయింది. అరిషడ్వార్గాలు ఏర్పడిపోయాయి. స్థిరపడిపోయారు కాబట్టి. జగత్భావంలో స్థిరపడిపోయాడు. పోలికలతో చూసుకోవడంలో స్థిరపడిపోయాడు. నిరపేక్షంగా చుస్కోడం రాదు. అందుకని వాళ్ళేమి చెబుతున్నారు నాయన నీ మనసు ఇలా అలవాటు పడిపోయింది బాల్యం నుండి. ఏమేమిటో చెబుతున్నాడు. అవన్నీ ఒకొక్కటి మనసు పనులు. మనసంటే ఒకటని అనుకోవచ్చు, లేదంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం అని నాలుగుగా అనుకోవచ్చు. అవేట్లగు తలచుట -మనసు, నిశ్చయించుట - బుద్ధి, జ్ఞానముచే తెలియచేయుబడు దృశ్యం అంటే నీవు ఆత్మ స్థానంలో ఉంటే స్వరూప స్థితిలో ఉంటే నీ మనసు నీకు దృశ్యంగా కనబడుతుంది.


అపుడు మనసు జడమై కనపడింది. మనసు ఒరిజినల్ గా ఇనుపగుండు వంటిది. కానీ అందులోకి జ్ఞానం వచ్చి చేరింది. చైతన్య స్పర్శ చేత ఆ జ్ఞానం కలిగింది. ఆ ఆత్మ యొక్క స్పర్శ చేత. నేననే ఉనికి యొక్క స్పర్శ చేత ఆ జ్ఞానం వచ్చి దీనిలో చేరింది. చేరే సరికి ఇనప గుండులో అగ్ని చేరింది.  మనసిప్పుడు చేతనంవలె తోస్తోంది. నన్ను ఇంకొకటి నడుపుతోంది అనేది పోయింది. నేనే అన్నింటిని నడుపుతున్నాను. అందుకని మనసు చేతనం. అదేమో చైతన్యం. చైతన్యం వచ్చి మనసులో చేరేసరికి, మనసు చేతనం అయ్యింది. ఇప్పుడేమో అన్నింటిని నేనే నడుపుతున్నాను, నేనే రాజుని అంటోంది. స్వేచ్ఛ ప్రకటించేసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత చుడండి పిల్లవాడిని. బట్టలు తనకు తానె ఎంపిక చేసుకుంటాడు. పుస్తకాలూ, ఈ నోట్స్ ఏ కావలి నాకు అంటారు. ప్రతీది అంతే ఇక. అంతే మనసు చేతనం అయ్యింది ఇప్పుడు. నేనే నండి అంతా అంటుంది మనసు. ఈ ఇంద్రియాలన్నీ నేనే. నేను లేకపోతె ఇంద్రియాలు లేవు అంటుంది. కానీ చైతన్యం లేకపోతె నువ్వు లేవు అనే సత్యాన్ని మర్చిపోయింది. కాబట్టి చిన్న వయసునుండే గుర్తుచేస్తూ వుండవలిసింది. తల్లి తండ్రులనుండే కదా సంస్కార బీజాలు వచ్చేది. తల్లి తండ్రులు ఇప్పుడు ఎలా వున్నారు? ఆత్మ విచారణతో ఉన్న వారిని ఒక్కరిని చూపెట్టండి. లేరు కదా. బాల్యంలో అసలు లేదు. వివాహం ముందు అసలు లేదు. సాంతం చావు దెగ్గరికి వచ్చాక అప్పుడు వృద్ధాప్యంలో చావలేనపుడు మొదలుపెడుతున్నారు. పూర్వకాలం వారికి ఇప్పుడున్నంత విషయ వ్యామోహం లేదు కదా. అందువల్ల వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు. మధ్యవయసులో మొదలుపెట్టిన వారు తొంభై ఏళ్ళు వరకు కష్టపడే సామర్ధ్యం ఉంది ఇంద్రియాలలో.

ఇప్పుడు అసలు మనకు అంత సామర్ధ్యం ఏది? నలభై ఏళ్లకే శక్తి సామర్ధ్యాలు లేవు. ఇంద్రియాలలో బలం కోల్పోతున్నాముకదా. అందువలన సాధ్యం అయినంత కాలాన్ని దీనికి వినియోగించితే, నీవు ఎందుకు శరీరంలోకి వచ్చావో బోధ పడుతుంది. మనసు జడం అని తెలియాలి మొట్టమొదట. మనసు కూడా ఒక దృశ్యం లాంటిది. కళ్ళతో బైటికి చూస్తున్న దృశ్యం ఎట్లాయితే సత్యం కాదో నీ మనసు కూడా నీకు దృశ్యమే. నీవు ఆత్మ స్థితిలోనుండి స్వరూపస్థితిలో నుండి చూసినపుడు అది జడమే. అని నిర్ణయంగా అనుభవజ్ఞానంలోనుండి చెబుతున్నాడు. ఆ దృష్టితో నువ్వు చూడడం నేర్చుకోవాలి గానీ అది సత్యం కాదు
అన్నావనుకో ఇక చూసేదెట్లగా. తెలిసిన మహానుభావుడు ఆ అనుభవజ్ఞానముతోటి ఆ మాటలు చెబుతున్నాడు. మనం ఆచరణలో దానిని ప్రయత్నం చేసి అదెట్లా చూడాలో సాధన చేయాలి. పరిఛిన్నం అంటే ఇంతకముందు ఒకటిగా ఉంది. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా అనేకం అయింది. ఛిన్నమూ అంటే ముక్కలు ముక్కలు అయిపోడం. పరిఛిన్నం అంటే లెక్కపెట్టడానికి వీలులేనన్ని ముక్కలు అయిపోవడం. ఎందుకంటే అన్ని ఇంద్రియాలలోను ప్రతిఫలించింది. నేనే మొత్తం అంది. అన్ని విషయాలే అదే అయిపోయింది. పనులు అదే అయింది. ఫలితాలు అదే అయింది. ఎన్ని లెక్కపెట్టండి. పరిఛిన్నం అయిపోయింది. మనసుకి పరిమితులు ఉన్నాయి. కానీ లేవని అంటున్నది. మెళకువలోనే దాని ప్రతాపం అంతా. కాసేపాగితే నిద్రలోకి పోతే దాని ప్రతాపం లేదు. మరణంలో దాని ప్రతాపం అసలు లేదు. పోనీ దాని పనిముట్లయినటువంటి ఇంద్రియాలకు పరిమితులు లేవా? ప్రతి ఇంద్రియానికి పరిమితులు వున్నాయి. మెలకువలో కళ్ళు మూసుకొని కూర్చోమను చూద్దాం. నిద్రపోమంటే పోతుందేమో కానీ, నిద్రపోకుండా తెలివితో కళ్ళు మూసుకొని కూర్చోమను చూద్దాం. అలా కూర్చోలేదు. పెద్ద పెద్ద శబ్దాల మధ్యలో నిశ్శబ్దంగా ఉండమను చూద్దాం. వుండలేదు. అంటే ఇంద్రియాలకు అనుకూలమైన పద్ధతిలో అయితేనే ఉంటుంది. వ్యతిరేక పద్ధతులలో వుండలేదు. ఎందుకంటే అది కూడా జడ వస్తువే కాబట్టి. ఇప్పుడు ఈ కుర్చీని ఇలా నాలుగు కాళ్ళమీద నిలపెడితే ఉందండి. దీన్ని బోర్లిస్తే అటు ఇటు దొర్లిపడిపోతుంది. మనసు కూడా అంతే. అందుకే మనం కూడా వ్యతిరేకం వచ్చినపుడు ఏమైంది ఇటు అటు దొర్లి పడిపోతూవుంటుంది. బాలన్స్ కోల్పోతుంది ఎందుకంటే అది జడ వస్తువు. అదే చైతన్యమే అయితే, అదే ఆత్మ స్వరూపం అయితే, అదే శాశ్వతం అయితే , మరపుడు అది దొర్లకూడదు కదా. స్థిరంగా ఉండాలి కదా. అలా ఉండటం లేదుగా. ఎందుకంటే అది జడం. ఆ జడాన్ని ఏ తీరుగ వుంచాలో ఆ తీరుగ ఉంచితేనే అది సరిగ్గా ఉంటుంది. బోర్లిస్తే దాని స్థితిని కోల్పోయింది. గొడవ చేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే జడం.

ఇటు అటు దొర్లిపోతూ ఉంటుంది. బాలన్స్ పోయింది. ఇటు తిప్పుకో స్థిరంగా ఉంది. తెలియక అజ్ఞానంచేత అవిద్యచేత మొహం చేత అటుతిరిగింది. తిరిగి అటు ఇటు దొర్లిపడిపోతోంది. అలా పడిపోతున్నప్పుడైనా తెల్సుకోవాలిగా అరె ఇప్పుడెందుకు అస్థిరంగా ఉంది. ఎందుకు దొర్లి పడిపోతోంది. ఇప్పుడు దీనికి ఏమైంది. ఏమడుగుతోందసలు. ఏమాశిస్తోంది. ఏం పొందుతోంది. ఒకసారి విచారణ చెయ్యి. ఎందుకు ఈ అస్థిరత్వం? ఓహో ఇటు తిరిగుంది కాబట్టి. ఈ సత్యం తెలుసుకో. తెలుసుకుంటే ఏమైందంటే ఇదంతా లేనిది కదా. దీనిని సరిగ్గా సరైన స్థానంలో కూర్చోబెడితే కదలదు. తనంతట తానూ కదలమంటే కదలదు. ఎందుకంటే అది జడ వస్తువు. ఇలా తెలుసుకోవాలి దీన్ని. ఇప్పుడది నిన్నేమీ చెయ్యలేదు. ఆమ్మో మనసును నేనెక్కడ కడతానండి, అనే బేల మాటలు మాట్లాడరు ఎవరూకూడా. సాధకుడు అసలు మాట్లాడడు. ఇవన్నీ బయట మాములుగా ఏ సాధన మొదలెట్టకుండా తప్పించుకోవాలని చూసే వారు మాట్లాడే మాటలు. మన వల్ల ఎక్కడవుతుందండి. అది జడ వస్తువయ్యా. దాని స్థానం తప్పించి స్థితిని తప్పించి ఉపయోగించడం చేత అస్థిరత్వం పాలైపోయింది. దానిని సరైన స్థానంలో కూర్చోబెట్టు. ఏ దిశగా చూడాలో ఆ దిశగా చూపెట్టూ దానికి. దాని లక్ష్యం దానికి గుర్తుచెయ్యి, అపుడు కదలదు.

కాబట్టి సరైన జీవన విధానం కలిగివుంటే సరైన వివేకాన్ని కలిగిఉంటే సరైన ఆత్మ విచారణ నీవు చేసినట్లయితే క్రమ సాధన క్రమ విచారణ నువ్వు కలిగివున్నట్లైతే అది జడ వస్తువని నీకే తెలుస్తుంది. దృశ్యము లేనిదని తెలుస్తుంది. నేను చూచేవాడిని. దృక్ స్వరూపమును, సాక్షిని. అది దృశ్యం. ఇలా తెలుసుకో. అప్పుడు దానిని మనసు బుద్ధి చిత్తం అహంకారం అని నాలుగుగా బద్దలుకొట్టాల్సిన అవసరం వుందా. నువ్వు కుర్చీని ఏ కీలుకాకీలు విరిస్తే కానీ తెలీదా. స్థిరంగా వున్నపుడు తెలీటంలే. అస్థిరంగా వున్నపుడు మాత్రం దానిని సరిగ్గా కూర్చోబెడితే కానీ తెలీడంలేదు. ఇప్పుడు మనం ఎందుకు దానిని నాలుగు చేసాం? అస్థిరంగా ఉంది కాబట్టి. దానిని అవగాహనా చేసుకోడం కోసం నాలుగు చేసాం దాన్ని. దానిని సరిగ్గా ఆత్మ విచారణతో స్థిరంగా దాని స్థితిలో కూర్చోబెట్టు, మానసన్నా అదే బుద్ధన్నా అదే చిత్తం అహంకారం అన్ని అదే. ఒకసారి స్థిరపడి అది జడ వస్తువు అని తెలిసిపోయాక అది ఏదైతే ఇప్పుడేంపోయింది. జడ వస్తువు నిన్నేమీ చెయ్యలేదుకదా. నేను చైతన్య స్వరూపుడను, నేను ఆత్మ స్వరూపుడను. నేను పరమాత్మను. ఈ ధోరణితో చూడడం రావాలి. ఇలా విచారణను మార్చుకోవాలి. ఇలా వివేకాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా స్థిరత్వాన్ని పొందాలి. శాశ్వతత్వాన్ని పొందాలి. పరిమితత్వాన్ని త్యజించాలి. పరిఛిన్నం అవ్వకుండా ఉండాలి. అనేకం అవ్వకుండా వుండాలి. ఆత్మ స్వరూపం అనే ఏకత్వ దిశగా ఉండాలి. అవయవాకారమై అనిత్యమై...అస్థిరంగా వున్నపుడు అన్ని అవయవాకారములు అదే అయిపోయింది. మనసు అనిత్యం అంతే ఒక దెగ్గర కనపడితే ఒక దెగ్గర కనపడదు. ఓ స్థాయిలో ఉంటే ఒక స్థితిలో ఉండదు. ఒక క్షణం వున్నానంటుంది ఒక క్షణం లేనంటుంది. ఒక క్షణం ఇటు పొమ్మంటుంది ఒక క్షణం అటు పొమ్మంటుంది. ఒక క్షణం ఇది సత్యమంటుంది ఒక క్షణం ఇంకోటి సత్యం అంటుంది. దానికే సరిగ్గా తెలీదు ఎటు చూపెట్టాలో.
కాబట్టి అనిత్యం. అన్ని అవయవాల ఆకారం అదే చెందుతోంది. ఎలా అయితే నీళ్లను ఏ ఆకారం గ్లాసులో పోస్తే ఆ ఆకారం చెందుతోంది. అలాగే మనసుకూడా ఏమైంది ఏ ఇంద్రియాన్ని ఉపయోగిస్తే అదే అయిపోయింది. అవుతోంది కదా అని చైతన్యం అనుకుంటున్నావేమో. నీళ్లు చైతన్యం అవుతాయా? నీళ్లు కూడా జడ వస్తువేగా.  గాలిని బెలూన్లో వూదితే బెలూన్ లాగ అయింది. దుండులో వూదితే దుండయింది. పరుపులో పెడితే పరుపు అయింది. అలా అయినంత మాత్రాన గాలి చైతన్యం అవుతుందా. గాలి కూడా జడ వస్తువే. భూమి అగ్ని ఎలా జడ వస్తువులో, అలాగే శరీరం కూడా ఒక జడ వస్తువు. మనసు కూడా ఒక జడ వస్తువు. అన్ని ఇంద్రియాలు జడ స్వరూపాలే. కానీ వీటిని కదిలించేవేమిటి. అది చైతన్యం. గాలి స్వయంగా కదలటంలేదు. చైతన్య ప్రభావం చేత కదులుతోంది. నీరు స్వయంగా కదలటంలేదు. చైతన్య ప్రభావం చేత కదులుతోంది. కాబట్టి వాటిలో చైతన్య స్పర్శ ఉండటం చేత అవి కదులుతున్నాయి. అంతేగాని అవి స్వయంగా కదలజాలవు. అదెవరు నేను. ఆత్మ స్వరూపుడను పరమాత్మను. అని తెలుసుకో. స్వర్ణము మైనం ఒకదానితో ఒకటి అంటుకుపోయివున్నాయి. ఈ స్వర్ణం ఏమైనా మైనంతో కలిసిపోయిందా. స్వర్ణమును లక్కలో పెడితే లక్క ఆకారాన్నే చెందింది. లక్ష్మి రూపు చెయ్యాలండి. లక్కలో ఆ ఆకారాన్ని తయారుచేసాడు, తయారుచేసి స్వర్ణాన్ని దానిలో పోస్తే రూపు తయారయింది. ఆ రూపు నిలబడాలంటే ఆ డొప్ప వెనకాల ఉన్న చిల్లులో మరల లక్క పెట్టాలి. చూడండి దేనితో తయారైందో దాన్ని పెడితే గాని దానికి స్థిరత్వం రాదు. వదిలేస్తే క్షణంలో వంగిపోయింది. బంగారమేగా మరి. నీ మనసుకూడా ఎలావుందీ అదిగో దానివలె ఉంది. అదీ జడమే ఇది జడమే. అగ్ని స్పర్శ చేత లక్క కరుగుతుంది, స్వర్ణము కరుగుతుంది. ఒక ఆకారాన్ని ఇది ధరిస్తోంది, ఒక ఆకారాన్ని అదీ ధరిస్తోంది. రెండు జడవస్తువులే. కానీ అగ్ని అనే చైతన్య స్పర్శ చేత రూపం మార్చుకుంది. అయినంతమాత్రాన జడ వస్తువు కాకపోయిందా ఇప్పుడు. బంగారం జడ వస్తువే లక్క జడ వస్తువే. తనంతట తానుగా మారలేదు. చైతన్య స్పర్శచేత మారింది. కాబట్టి ఇన్ని అవయవ ఆకారం చెందుతున్న మనసు కూడా జడ వస్తువు. అందుకని ఈ ఉపమానం చెప్పాము. ఇంతకముందు ఇనప గుండు గురుంచి చెప్పారు. ఇప్పుడేమో లక్క స్వర్ణం. సర్వతత్వాత్మకమై అంటే అన్ని తత్వాలు కూడా ఈ మనసే. తత్వములు అంటే తత్ + త్వం అందులో రెండు అక్షరాలు వున్నాయి. త్వం అంటే నేను. తత్ అంటే అది. అదంటే పంచ భూతాలు, పంచ తన్మాత్రలు. అవి తత్వములు. స్థూలంగా చుస్తే పంచ భూతాలు, సూక్ష్మంగా చుస్తే పంచ తన్మాత్రలు. అక్కడ కూడా పేర్లు ఇవే. పృథ్వి, ఆప, తేజో, వాయు, ఆకాశాలు. ఈ అయిదే అక్కడ కూడా. వాటి పేర్లు అవే. శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు పంచ తన్మాత్రలు. భూతాలుగా చుస్తే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. వాటి వెనకాల ఉన్నటువంటి తన్మాత్రలు శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు. ఆకాశంలో శబ్ధ గుణం ఉంది. గాలిలో ఏముంది స్పర్శ. అగ్నిలో ఏముంది అంటే రూపం. నీళ్లలో రస గుణం ఉంది. పృథ్విలో గంధ తన్మాత్ర ఉంది. వాసన చూడగలిగే సామర్ధ్యం. సూక్ష్మంగా తన్మాత్రలంటే ఇవే. అంటే ఈ పంచభూతాలు ఏర్పడకముందు వీటి గుణాలు లక్షణాలు అలా వున్నాయి. ఆ లక్షణాలనుండి అవి ఉత్పన్నమయినాయి. శబ్ద లక్షణం నుండి ఆకాశం ఉత్పన్నమైంది. అది ఎక్కడుంది అంటే అవి ఏర్పడక ముందు స్థితిలో బ్రహ్మములో వున్నాయి అవి. సంకల్ప మాత్రంచేత ఆ లక్షణాలే పంచభూతాలు అయినాయి. పంచ భూతములనుండి మరల లక్షణాలను తీసుకొని శరీరాలు తయారయినాయి. కాబట్టి ఎన్ని పోల్చి చుసినా అన్ని జడ వస్తువులే. పంచ భూతాల దృష్ట్యా చూసినా జడ వస్తువులే. పంచభూతాలతో ఏర్పడిన శరీరం దృష్ట్యా చూసినా ఇదీ జడ వస్తువే. పోనీ తన్మాత్రలు చూస్తావా ఆ బ్రహ్మము దృష్ట్యా చుస్తే ఇవన్నీ జడ వస్తువులే. నేను వ్యష్టిగా ఆత్మ స్వరూపుడిని, సమిష్టిగా బ్రహ్మ స్వరూపుడిని. కాబట్టి నేననే దృష్ట్యా చూసినపుడు ఇవన్నీ జడ వస్తువులే. అప్పటివరకు అవి చైతన్యంగానే కనపడుతున్నాయి. నీకంటే విశాలమైనవే. అపరిమితమైనవే, కానీ శాశ్వతమా? కాదు. అనిత్యం. మనసు యొక్క పుట్టుక స్థానం హృదయ కమలం. హృదయం నుంచి ఈ మనసు పుడుతుంది. తలంపు రూపంలో పుడుతున్నది. కాబట్టి తలంపే బంధం. సంకల్పమే బంధం నిస్సంకల్పమే ముక్తి. మరల అవి హృదయంలో అణిగిపోతే ముక్తి. అదే మనోనాశమ్. ఇంద్రియాలు విషయాలు ఎలా కూడుతున్నాయి అంటే ముందు నేను స్ఫురణతో మొదలై అహంకారమై, అహంకారం నుంచి చిత్తమై, చిత్తం నుండి బుద్ధి అయ్యి, బుద్ధి నుండి మనసై ఇంద్రియాలతో కూడి ఆ విషయాకారమై ప్రవర్తిస్తున్నాయి. ఒక వ్యక్తికే అనేక పేర్లు పెడుతున్నట్లుగా కూతురు తల్లి అమ్మ అమ్మమ్మ వ్యక్తి ఏమైనా మారాడా? మారలేదుగా. ఆయా పనులను బట్టి ఆయా స్థితి భేదాన్ని బట్టి పేర్లు పెట్టాము. అట్లాగే మనసు కూడా పని చేసే తీరును బట్టి మనసు బుద్ధి చిత్తం అహంకారం లాగ పిలవబడుతుంది. అయితే అన్ని వస్తువుగా ఒకటే.
సర్వ సత్వాత్మకం. సమిష్టిగా చుస్తే సర్వ సత్వములు అదే. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అదే. పంచ భూతాలు అదే. అన్ని అదే అయింది. సమిష్టిగా మాట్లాడినపుడు. జాగత్తన్న అదే జీవుడన్న అదే. ఈశ్వరుడన్న అదే. అన్ని అదే అయింది. నేను వీటన్నింటికి సాక్షిని. అదీ పరమాత్మకు మాట్లాడినపుడు. ముందు ఏమో ఆత్మకు మాట్లాడినపుడు. ఎప్పుడైతే నీకు ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము కలగగానే ఇవన్నీ అందులో కలిసిపోయాయి. ఆ ఆకారాన్ని పొందినాయి. అపుడు దృశ్యం లేదు. చిత్రం లేదు. ఇంద్రియాలు లేవు. జగత్తు లేదు. తన్మాత్రలు లేవు. పంచ భూతాలు లేవు. విషయాలు లేవు. ఏమి లేవు. అన్ని కూడా ఏకాకారమును పొందాయి. అదే కైవల్యం కేవలత్వం.ఒక్కటిగా ఉండటం. కేవలమంటే ఒకటి. మిగిలినవేమీ లేకుండా ఇవన్నీ ఒకటిగా అయిపోవడమే కైవల్యం. ఈ ఒకటిగా అయిపోవడాన్ని మనవాళ్ళు ఎలా చూపెడతారు అంటే ఇక్కడి నుంచి ఒక జ్యోతి అలా వెళ్ళిపోయి ఆ పైన జ్యోతిలో కలిసిపోయింది అనే పద్ధతిలో సినిమాల్లో చూపెడుతుంటారు. నీ యందు స్వరూప స్థితిని గుర్తించి ఆ స్వరూప స్థితిలో నిలకడ చెందడమే ముక్తి అంతే గానీ సినిమాల్లో చూపెట్టినట్లు జ్యోతి ఏమి ఎక్కడికి వెళ్ళదు.

(CREDITS: This Content is provided by American Sathsang Member’s)