File No.17





(......) అర్థమైందా అండీ! అదంతా. ముందు ముఖ్యంగా దేనిమీద ఆధారపడి వున్నాడు? రూపం. ఎందుకని? చిన్నప్పటి నుంచి నువ్వు బాగా పట్టుకుంది దేనిని? ఆ రూపాన్ని. రెండవది ఏమిటి? మనస్సు. ఈ రూపం మనస్సులోనుంచి వచ్చిందా? మనస్సు రూపం అయ్యిందా? రూపం మనస్సు అయ్యిందా? ఈ రెండిటిలో ఏది సత్యం? ముందు మనస్సు ఏర్పడ్డాకనే రూపం ఏర్పడింది. కానీ రూపం ఆధారంగా మనసుని గుర్తిస్తున్నాము మనము. అంతే కదా! బుద్ధి వచ్చినాక ఏం చేశాము? రూపం ద్వారా మనసుని గుర్తిస్తున్నాము. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమండీ ఇదంతా చెబుతున్నారు మీరు, ఇదంతా మనోనాశంతోనే సాధ్యమౌతుందా? ఆ మనోనాశం అయితే తప్ప, ఇదంతా సాధ్యం అయ్యేటట్లు కనబడటం లేదు కదా! సత్యమే! మరి అసలు మనోనాశం ఎట్లా అవుతుంది? అంతే కదా! ఏదో చెబుతున్నారు? ఆ మనస్సు అనేది నశించిపోతేనే గానీ, నేనుఅనేది స్ఫురణకు గుర్తురాదని, అసలు మనోనాశం అంత అవసరమా? అది సాధ్యమయ్యేటట్లుగా కనబడడం లేదే నాకు ఎక్కడా కూడాను. మనసు నశిస్తుందా? ఏప్పటికైనా గాని? నశించదు గదా! ఇవన్నీ నా సందేహాలన్నమాట. దానికోసం ఏం చెబుతున్నాడు? అక్కడేమో రెండు పద్ధతులు వున్నాయి ఇప్పుడు ఇందులో. ఎప్పటికైనా ఈ మనసు లేకుండానే పోతుందనే సత్యము నీకు తెలియాలి. అది తెలిస్తేనే గాని, నేనుఅనే దానిని ఆశ్రయించవు. నిద్రావస్థలో మనసు పనిచేస్తుందా? పనిచేయడం లేదు కదా! మరణకాలంలో మనసు పనిచేస్తుందా? పనిచేయడం లేదు కదా! మూర్ఛరోగంలో వున్నప్పుడు మనసు పనిచేస్తుందా? పని చేయడం లేదు కదా! అట్లాగే పిచ్చివాడికి మనసు పనిచేస్తుందా? పనిచేయడం లేదు.
“మరపు, మరణము, మూర్ఛ, సుషుప్తిలు సమములు” కదా! మరచిపోయావు. అప్పుడు మనసు పనిచేసిందా? పనిచేయలేదు. అర్థమైందా అండీ! కాబట్టి ఏం చెబుతున్నాడు? మరపు, మరణము, సుషుప్తి, మూర్ఛ ఈ నాలుగు సమములు. సమస్థితిలో వున్నాయి. అర్థమైందా అండీ! మరణం గురించి ఎందుకు భయపడుతావు? అది మరపు వంటిది. మరపు ఎటువంటిది? మరణము వంటిది. మరపు, మరణములు ఎటువంటివి? సుషుప్తి వంటివి. మరపు మరణము సుషుప్తిలు ఎటువంటివి? పిచ్చివాని వంటివి. ఉన్మత్తుడికి  ఏం తెలిసింది? ఏమీ తెలియలేదు. కాబట్టి నీవు నీ స్వస్థితి యందు ఉన్మత్తుడివికా. అర్థమైందా అండీ! నీవు ఏం చేయలట ఇప్పుడు? నీ స్వరూపజ్ఞానంలో, నీ ఆత్మజ్ఞానంలో, నీ యొక్క స్వరూప స్వప్రకాశ స్థితిలో, ఆ అనుభవంలో ఉన్మత్తుడివై వుండు, పిచ్చివానివలె వుండవయ్యా బాబు. ప్రపంచాన్ని దేహాభిమానాన్ని గుర్తించకుండా, నీ స్వరూపస్థితిలో ఉన్మత్తుడవై వుండు. ఇప్పుడు ఏమైందట అందులో వుంటే? ఏమన్నా ప్రమాదం వచ్చిందా? బాహ్యంలో ఎవరైనా, ఏమన్నా అన్నారండి. పిచ్చివాడిని ఎవరైనా, ఏమైనా అంటే వాడికేమైనా తెలిసిందా? తెలియలేదుగా. ఎందుకు తెలియలేదు? (వాడికి మనసు పనిచేయడం లేదు) మనసు లేదు కాబట్టి. నీవు కూడా అట్లా పరమాత్మస్థితియందు ఉన్మత్తుడవై వుండు. ఆత్మస్థితియందు ఉన్మత్తుడవై వుండు. నేనుఅనే స్ఫురణలో ఉన్మత్తుడవై వుండవయ్యా! ఆ పిచ్చిపట్టినందువల్ల నష్టం లేదు. ఎందుకని? నీకు ప్రమాదం ఏముంది? నీకు అడ్డమైనవన్నీ ఆ ఒక్కదానితో తొలగిపోయినాయి. ఇప్పుడు మనం దేనిని ఒప్పుకోవడం లేదు? దీనిని ఒప్పుకోవడం లేదు. అమ్మో! పిచ్చి వచ్చేస్తుందేమోనండీ! ఏమిటది? రాదమ్మా! ఏం భయపడమాకు. ఎందుకని? వీటి అన్నిటి వెనుకాల వున్నది అదే! సర్వవ్యాపకమై, సర్వే సర్వత్రా వున్నది ఏది? ఆ పరమాత్మ స్థితియే! ఆ పరమాత్మ స్థితియే. దాని యొక్క స్ఫురణవల్ల ఏమైపోయింది? ఈ బాహ్యం అంతా నశించిపోయింది. ఈ రూప మనస్సులు బాహ్యమే కదా! నశించి పోయినాయి. లేకుండా పోయినాయి. నిజంగా లేకుండా పోయినాయా? వున్నా లేకుండా పోయినాయి. నిజంగానే లేకుండా పోయినా నాకు ఏమీ అవ్వలేదు. ఎందుకని? ఎప్పటికైనా పోయేవే కాబట్టి. ఇవి ఎప్పటికైనా పోయేవేఅనే సత్యం నాకు తెలిసిందండి, ఇప్పుడు దాని గురించి ఏమి చింతపడుతావు? అర్థమైందా! ఇప్పుడు ఎందుకు చింతపడుతున్నావు? అవి పోతాయేమో, అవి పోతాయేమో, అని నీ గోలంతా పుట్టింది మొదలు పోయేదాకా, ఈ రూపం ఎక్కడకి పోతుందో, ఆ మనసు ఎక్కడికి పోతుందో అనే గోలే కదా! పట్టుకుంటే ఆగినాయా? పోనీ చూపెట్టు. నీ కళ్ళముందే ఎంతో, ఎన్నో రూపాలు నశించిపోయినాయి. ఈ నశించిపోయిన రూపంతో పాటు, ఆ మనసు నశించిపోలేదా? పోయింది కదా! పోయిందిగా. పోతోందిగా అది. ఎందుకని? మరి అర్థమైందా ఏమైనా? ఇప్పుడైనా గానీ!
            నాయనా! కడసారి చూపుకు తప్పనిసరిగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? పోతోందని తెలుసుకోవడానికి నాయనా! ఈ రూపం పోతోంది. ఆ మనసు పోతోంది. ఈ అహంకారంతో చేసిన జీవితమంతా పోతోంది. ఇది పోతోంది అని తెలుసుకోవడం కోసం, తప్పనిసరిగా వెళ్ళాలి నాయనా! అని నీకు పోను అంటూ తెలిస్తే వెళ్ళాలి నాయనా! ఏమిటి తెలిస్తే వెళ్ళాలి? రూపం పోతోంది అని నీకు అక్కడికి వెళితే తెలుస్తోంది. అశాశ్వతమని. ఆ అశాశ్వతం అనే సత్యం నీకు దృఢపడే అవకాశం వుంది అప్పుడు. మళ్ళా తిరిగి వచ్చినాక నీవు ఆ సత్యంతో జీవిస్తావు. ఆ బోధ, ఆ అవకాశం నీకు అప్పుడు ఆ క్షణంలో వుంది. అదేగాక అతడు తన జీవితసారమంతా కలిపి అప్పుడు నీకు చెబుతాడు, ఓమాట. అర్థమైందా అండీ! లేదూ.. కనీసం ఆ మరణం ఎట్లా ప్రాప్తిస్తోందో, కనీసం కళ్ళతో చూడవచ్చు. ఓహో! ఈ రూప మనస్సులు కూడా ఒక నాటికి ఇదే కదా! మరి ఇప్పుడు నేను దేనిని ఆశ్రయించాను? ఈ రూపమే కదా! అత్యంత అందమైనదని, దీనిని బాగా అలంకరించావు. ఏమండి? అవునాకాదా? చెవికి వంకీలు పెట్టకపోతే, చెవులు ఎక్కడ బోసిపోతాయో? మెడలో ఆభరణాలు లేకపోతే, దానికి ఎక్కడ ప్రమాదం వస్తుందో, మెడపైకి లేవకూడదు, ఎప్పుడూ క్రిందకు దించే వుండాలని బాగా ఒక కేజీ ఆభరణాలు వేశావు దానికి. ఇదే కదా మన పద్ధతి అంతా కూడా! అర్థముందా ఏమైనా? ఏమండీ? ఇవి (వీటిని) ఎంతసేపు ఆశ్రయిస్తావు? కాసేపు ఆగితే ఇది ఎక్కడుందో, దీనికే తెలియలేదే. కాసేపు ఆగితే దీనికి విలువలేదే. దీన్ని ఎంతో వున్నతంగా చూశాను అనుకుంటున్నావే, నెత్తిన మీద పెట్టుకుని చూసినవారంతా, కాసేపు ఆగాక దీనిని ఎక్కడ పెట్టారు? వుంచుకోమను? ఏమీ ఈ రూపానికి... బ్రతికి వున్నప్పుడే నీకు విలువ లేకుండా చూస్తుంటిరి కదా! ఎందుకని? అక్కరలేదండీ! ఇప్పుడు బ్రతికి వున్నప్పుడు దీనికేమన్నా విలువ వుందనా? ఏమీ లేదండి! ఎందుకని? నీవు శరీరాన్ని ఆశ్రయించి వున్నావు కదా! ఎందుకు విలువ లేదయ్యా? నువ్వు శరీరాన్ని ఆశ్రయించి వున్నావు. అంతే! ఆ శరీరంతో చేసిన విలువని, కాసేపు ఆ సంబంధాన్ని పక్కకు పెట్టి చూడు, నీ విలువ ఎంతో, ఏపాటిదో? ఆత్మీయతా సంబంధం ఎక్కడైనా వుందా? లేదు కదా! అమ్మా... బొమ్మా! ఏమి అమ్మా? బొమ్మా? అక్కడ ఏమైనా ఆత్మీయత వుందా? లేదు కదా! ఎందుకని? శరీరగత సంబంధం కదా! అర్థమైందా? ఏది నీకిప్పుడు పనిచేస్తుంది? ‘నేను ఆత్మస్వరూపుడనుఅనే స్థితిలో వుండి, నువ్వు చూసినప్పుడు అందరూ ఆత్మస్వరూపులుగా కనపడినప్పుడు, అందరూ ఆత్మీయులే. ఇంక అంతకంటే దగ్గర వాళ్ళు లేరు. అహంకార నిరసనకు గొప్పమార్గం లేదు. అందువల్ల ఎప్పుడైనా కూడా ప్రతివాడిని ఎలా చూడమంటున్నాడు? ఆత్మసంబంధీకుడిగా చూడు. ఆత్మానుసార జీవితంతో చూడు. అంతటి విశాల భావంతో చూడు. తన పరాయి అనే భేదాలు వుండవు అప్పుడు అక్కడ. తన పర భేదములు లేవు. తర తమ భేదములు లేవు. అంతా ఆత్మస్వరూపమే. ఎవరికి ఎవరు ఉపయోగం? ఎవరికి ఎవ్వరు ఉపయోగం లేదు. ఎవరికి వారే. నాయనా! నేను నా జీవితమంతా నీకోసమే ధారపోశాను. అర్థం లేదు ఆ మాటల్లో. బుర్ర వుందా ఏమైనా? నాకోసం నువ్వు ధారపోయడం ఏమిటి? మనం అంతా ఏమనుకుంటున్నామండీ? చేస్తున్నాను వీడికి, యాభై ఏళ్ళు రెక్కలు, ముక్కలు కష్టపడి చేశాను వీడికి, ఏమిటి చేశావు? ఏమిటి చేశావు? నీ కోసం చేసుకున్నావు. నీ రూప మనస్సులు అహంకారాన్ని బలపరచుకోవడం కోసం చేసుకున్నావు. అంతేగానీ వాడికి చేశాను అంటావేమిటి? ఒకడు చేసేవాడు లేడు, ఒకడు చేయించుకునే వాడు అంతకంటే లేడు. అర్థమైందా అండీ? మరి అట్లా అయితే ఈ ప్రపంచం ఎలాగండీ? ఆ ప్రపంచమే లేనిది. ఇప్పుడు వున్నదీ? దాని వెంబడి పడిపోతే వుంది. నీ అహంకారం ఎట్లా వుంది? దాని వెంబడి పడి పోతే వుంది. ఇప్పటి వరకూ ఏం చెబుతున్నాడు? అదేగా చెబుతోంది. దాని వెంబడి పడి పోతే, దృశ్యం వెంబడి పడి పోతే, అదే బలపడింది. దృశ్యం వెంబడి పడి పోమాకు. నిలబడి చూస్తూ వుండు. సాక్షిగా గమనించు. ఏమయ్యావు అప్పుడు? ఏది చూపెట్టు ఇప్పుడు? లేదే. నిన్ను కిందకు లాగమను. లాగలేదే. అసాధ్యం కదా! ఎందుకని? నువ్వు శాశ్వతం కదా! ఆ రూప మనస్సులు పోయినా ఇది నిలబడి వుంటుంది కదా! ఈ నేనే లేకపోతే ఆ రూప మనస్సులు ఎట్లా ఏర్పాడ్డాయి? ఏర్పడవు కదా! కాబట్టి మనోనాశనంఅనేటువంటి ఒకే ఒక్క పని నిమిత్తమే నువ్వు ఇందులోకి వచ్చావు. ఏవండి ఇంతకీ నేను జన్మ ఎందుకు ఎత్తానాండీ? ఎందుకు పుట్టామో తెలుసుకో నాయానా!  విచారణ చేయి నాయనా! అంటూ వుంటావు కదా! మరి పుట్టింది ఎందుకో, తెలిసేది ఎందరికి? అంటే నేను ఎందుకు జన్మనెత్తాను? ఎందుకు శరీరంలోకి వచ్చానయ్యా? అంటే, ఈ మనోనాశ స్థితి కొరకే వచ్చాను. ఇదే ఈ జన్మ లక్ష్యం. అర్థమైందా అండీ! ఎంతకాలం వస్తావు? ఇది అయ్యేదాకా వస్తావు. ఇహ గుర్తు పెట్టుకోండి. నేను ఎన్ని సార్లు పుడతానండి? ఇంక ఎంత కాలం వుంటానండీ? అని ఎవ్వరినీ అడగక్కర్లేదు. నువ్వు ఇంకా ఎంతకాలం వున్నా, లేదూ ఎన్నిసార్లు పుట్టినా, ఏ పని కోసం పుడతావు? ఈ మనోనాశ స్థితి కలిగే వరకూ జన్మ తప్పదు. కాబట్టి స్పష్టంగా చెబుతున్నాడు. నాయనా! నువ్వు ఎంత ఏ పనైనా చేయి, చెయ్యకపో! నీవు ఏ లక్ష్యంతో చేయాలి? రూప మనోనాశములు అవుతున్నాయా? లేదా? ఆ ఆలోచన చేసినప్పుడు, ఆ పని చేసినప్పుడు, ఆ ఫలితం జరుగుతూ వున్నప్పుడు, ఫలితం నీకు అనుభవ జ్ఞానంలో వచ్చినప్పుడు, దానిని ఎట్లా విచారణ చేయాలంట ఇప్పుడు? రూప మనో నాశములు అవుతున్నాయో, లేదో చూడు. ఆ లక్ష్యంతో చూడడం అలవాటు చేసుకో! దృష్టిని మార్చుకో! రూపమనోనాశములను బలపరచవలిసింది పోయి, నువ్వు ఏం చేశావు? రూప మనస్సులను బాగా బలపరిచావు. నశింప జేయాలి. కానీ మనమేమి చేశాము? బలపరిచాము. ఇప్పుడు ఏం చేయాలంట? ఇక్కడి నుంచి ఆత్మానుసారంగా జీవించడం అంటే, ప్రతి ఆలోచనలో, ప్రతి చేతలో, ప్రతి మాటలో ఆ అహంకార వృక్షం ఈ రూప మనస్సులతో ముడిపడి వున్నది. నిరసించాలి దానిని. నిరసిస్తే ఏమైంది? నశించి పోయింది. కొంతకాలం అయ్యేటప్పటికి, బలహీనపడి నశించిపోయింది. కాబట్టి మనోనాశనం అత్యావశ్యకం. చాలా అవసరం అది. ఆ మనోనాశం ఒక్క మానవుడికే సాధ్యం. మిగిలిన జంతువులకి సాధ్యం కాదు. ఎందుకని? .... పై స్థితులైన బుద్ధి, చిత్తము, అహంకారము తెలుసుకోగలిగే సామర్థ్యం ఒక్క మనిషికే వుంది. అందువల్ల నీవు ఈ జన్మలోకి వచ్చావు. ఈ మానవ ఉపాధి లభించింది. బోధించేవారు లభించారు. తెలుసుకోగలిగే శాస్త్రాలు వున్నాయి. చదువగలిగే సామర్థ్యము వున్నది. మాట్లాడగలిగే సామర్థ్యము వున్నది. ఇన్ని ఆశీర్వచనాలు ఒక్కమానవ ఉపాధికి భగవంతుడు ఇచ్చాడు. హృదయస్థానంలో వున్నటువంటి, పరమాత్మ యొక్క అంశని సరాసరి తెలుసుకోగలిగే సామర్థ్యం ఒక్క మానవ ఉపాధికే వున్నది. ఇక ఇంతకు మించి ఏం కావాలి? భగవంతుడు ఇవ్వవలిసినవన్నీ ఒకే సారి ఇచ్చేశాడు. నువ్వు ప్రతి రోజు వెళ్ళి ఒక కొబ్బరి ముక్క పెట్టో, లేకపోతే ఒక అరటిపండు ముక్క పెట్టో, ప్రతి సారి చెప్పక్కర్లేదు నాకు అది ఇవ్వు నాయనా! నాకు ఇది ఇవ్వు నాయనా! అని. ఆయన ఇవ్వదలచుకున్నది ఒకసారే ఇచ్చాడు. మా అబ్బాయికి రిజల్ట్‌ వస్తుందా రాదా? మావాడికి ఇంజినీరింగు సీటు వస్తుందా రాదా? వాడు నెలకు లక్షాయాభై వేలు సంపాదిస్తాడా? లేదా? ఇవన్నీ దేనితో ముడిపడి వున్నాయి? రూపమనస్సులతో ముడిపడి వున్నాయి నాయనా! దాన్ని నిరసించు. ఏమైంది అప్పుడు? కర్తవ్యం. వరకే చేస్తావు. నిమిత్తమాత్రంగా చేస్తావు. ప్రత్యేకంగా చెయ్యవు. అర్థమైందా అండీ!
            అయ్యో! వాడు అలా అనుకున్నానే, వీడు ఇలా అనుకున్నానే, నువ్వు ఏం చెప్పినా దాని వెనుకాల ఏమివుంది? రూప మనస్సులు వున్నాయని తెలుసుకో! మాట వెనుకాల ఏముంది? రూప మనస్సులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావు. మరి రూపమనస్సులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు కదా! నీ ఆత్మ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని, వాడిలో వున్న ఆత్మస్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. ఏమైంది అప్పుడు? ఇరువురికీ క్షేమమే. క్షేమమేనా కాదా? కానీ మనం నిరాశా నిస్పృహలతో మాట్లాడుతాం ఈ వేదాంత వాక్యాలని. గుర్తు పెట్టుకోండి. అక్కడ పోయిందన్నమాట. అందరూ మాట్లాడుతారు కానీ, వేదాంత వాక్యాలని నిరాశ నిస్పృహలను జోడించి మాట్లాడుతున్నారు. ఏమైంది అప్పుడు? రూప మనస్సులను నశింపజేయవలిసింది పోయి, అప్పుడు కూడా బలపడిపోయింది. అర్థమైందా అండీ!
            ఆ అంతా వాడి కర్మ నాయనా! 100 కి 100 రావలసిన వాడికి 60 మాత్రమే వచ్చినాయి. అర్థము వుందా ఏమైనా? చూడండి, ఎంత నిరాశా నిస్పృహలు వున్నాయో, ఆ భావంలో. మాట్లాడుతున్నది సత్యమే. కానీ దాని వెనుక గుణంలో దోషం వుంది. అర్థమైందా? ఆ రజోగుణం, తమోగుణం, సత్వగుణంతో మాట్లాడుతున్నావు. అర్థమైందా అండీ! ఈ గుణదోషాల వల్ల, ఎప్పుడైతే నీవు మాట్లాడుతున్నావో, అప్పుడు అన్ని సమస్యలు వచ్చాయి. కాబట్టి ఆ గుణదోషాలను ఆశ్రయించకుండా, నీవు జాగ్రత్తగా వుండు. ఇవన్నీ రూప, మనస్సులతో కూడుకున్నటువంటివి. ఈ రూప మనస్సులు లేకుండా పోవాలి అంటే, ఒక క్రమమైన సాధన వుండాలి. ఒక క్రమమైన విచారణ వుండాలి. క్రమ విచారణ చాలా అవసరం. క్రమ విచారణ ఎందుకండీ? మూలం నుంచి విచారణ ప్రారంభించాలి. కింద నుంచీ ప్రారంభించకూడదు. ఇప్పుడు మనం చేసింది ఏమిటి? కింద నుంచీ చేశాము. అలా చేయకూడదు. మూలం నుంచి, నేనే ఎవడను? అనే మూలం నుంచీ ప్రారంభించు. నేను ఆత్మస్వరూపుడను అనే సమాధానంతో మొదలు పెట్టి కిందకు రా. ఎట్లా రావాలట? రూప మనస్సులకు ప్రాధాన్యతను తగ్గిస్తూ. రూప మనస్సులను నిరసిస్తూ. అహంకారాన్ని నిరసిస్తూ. ప్రత్యేకతలని నిరసిస్తూ. వేదాంత వాక్యాలనే సమాధానాలుగా మలిచి జీవించు. ఏమయ్యావు అప్పుడు? ‘నేనుఅనే స్ఫురణను తెలుసుకోగలుగుతావు. ఇది విచారణ. ఇది క్రమ విచారణ.

           
            అట్లాగే క్రమసాధన. రెండు రెక్కలు కావాలి, పైకి ఎగరాలి కదా మనమిప్పుడు. పైకి ఉన్నతమైన స్థితికి ఎగరాలి అంటే, రెండు రెక్కలు కావాలి. ఒకటి ఏమిటి? విచారణ. రెండు సాధన. సాధన అంటే ఏమిటి? అదే చెబుతున్నాడుగా. ఆఖరి సాధన ఇదే నాయన! నువ్వు ఎన్ని చెప్పినా అవన్నీ సాధనలు అంటావేమో? అవన్నీ రూప, మనస్సులను బలపరిచేసాధనలు. వాటన్నింటిలో ఇది  వుంది. అవి చేసేటప్పుడు ఈ దృష్టితో చేయి. అప్పుడు మాత్రమే వాటిలో వున్నటువంటి రూపమనో భావములు నిరసించబడుతాయి. కాబట్టి నీవు (గాలి) శ్వాస మీద ధ్యాస పెట్టినా, మనస్సుతో మంత్రజపం చేసినా లేదూ ఒక పరమాత్మ రూపాన్నో, భావాన్నో బుద్ధిలో నిలుపుకున్నా... ఇవన్నీ సాధనలే. ఈ సాధనలు క్రమసాధనలుగా చేయి. చేస్తే ఏమౌతుంది? ఈ రూపమనస్సుల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఎప్పుడు? ఈ లక్ష్యంలో వుండి చేస్తే. ఈ లక్ష్యంలో లేకుండా చేశావు వీటిని, మళ్ళా అవే బలపడుతాయి. కాబట్టి లక్ష్యంలో తేడా రాకూడదు. లక్ష్యం ఎప్పడూ స్థిరంగా వుండాలి. ఈ సాధనలు చేయాలి. కాబట్టి రోజూ నేను ఏం చేయాలండి? శ్వాస మీద ధ్యాస పెట్టు. తీరిక దొరికితే ఏం చేయాలి? ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, మళ్ళా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి తిరుగుతుందో లేదో గమనిస్తూ వుండు. మనస్సులో ఏదో ఒక మంత్రజపం చేయి. అదే సమయంలో. ఖాళీ సమయం బోల్డువుంది. ఎందుకని? ఎదుటివాడు బాగా విమర్శిస్తున్నాడండీ! ఏం చేయవచ్చునువ్వు? ఈ పని చేయి. దీని మీద దృష్టిపెట్టు. వినపడితే నీకు ఎందుకు? వినపడకపోతే నీకు ఎందుకు? నీ పని నువ్వు చేయి. ఎందుకని? ఆ విమర్శకోసం వచ్చావా? ఈ సాధన కోసం వచ్చావా? ఏది ఉన్నతమైనది? (సాధన చేయడం వున్నతమైనది). మరి అప్పుడు ఏం చేశావు? ఓహో! అలాగా మంచిది. చివరి సమాధానం అది. అంతా అయిపోయింది. సాధన అంతా అయిపోయింది. ఏమిటి మాట్లాడవు? ఓహో! అలాగా మంచిది. బయటకి వచ్చినప్పుడు ఏం చెప్పాము? ఓహో! అలాగా? మంచిది. అంటే అర్థం ఏమైంది? ఏమిటి మంచిది? ఏం చెప్పినా మంచిదే నాయన. ఎందుకని? ఆ వేదాంత వాక్య స్ఫురణతోనే మాట్లాడుతావు. ఆ వేదాంత వాక్యాలనే సమాధానాలుగా మలిచి చెబుతావు కాబట్టి. అంతా మంచే నాయనా! పరమాత్మ ఏది చేసినా అంతా మంచి కొరకే. ఏమిటి మంచి? నువ్వు చేసినా, నేను చేసినా, ఎవ్వరు ఏం చేసినా, పరమాత్మ పద్ధతిలో ఏది జరిగినా అంతా మంచే నాయనా! ఇప్పుడు వాడు చెప్పే విషయానికి ప్రాధాన్యత వుందా? ప్రాధాన్యత లేదు. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాలని చెబుతున్నావో, అప్పుడేమైంది? వాడికేది ప్రధానం? విషయం ప్రధానం. నీకు ఏం ప్రధానం? లక్ష్యం ప్రధానం. గుర్తుపెట్టుకోండి. ఆ తేడా స్పష్టంగా వుండాలండి.
            నువ్వు రూప మనస్సులని, అహంకారాన్ని ఆశ్రయించినప్పుడు విషయప్రధానంగా వున్నావు. సాధనలో... విచారణలో, సాధనలో వున్నప్పుడు, లక్ష్యప్రధానంగా వున్నావు. ఎందుకని? లక్ష్యం పోతే ఈ విషయం ఏం చేసుకోను? తల తెగిన పక్షికి విలువ ఏముంది? ఏమన్నా వుందా? లేదు కదా! కాబట్టి నీవు ఏం చేయాలయ్యా? చక్కగా విచారణ, క్రమ విచారణ, క్రమ సాధన. విచారణ చేయదలచుకున్నావు, సాక్షీ స్వరూపము నుంచి మొదలుపెట్టు విచారణ. అలాగే సాధన చేయదలచుకున్నావు...  చక్కగా అన్నమయకోశం దాటగానే కనపడే ప్రాణమయకోశం, గాలి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి తిప్పుకోవడం ఒక సాధన. ఇంకా మనస్సులో మంత్రజపం చేయడం, ఇంకా ఒక పరమాత్మ రూపాన్ని ప్రతిష్ఠించడం. ఈ మూడు చేస్తూవుండు నువ్వు క్రమసాధనలుగా. కొంతకాలం అయ్యేటప్పటికి ఏమైపోయింది? ఈ సాధనలోను శక్తి వచ్చింది. ఆ లక్ష్యం వల్ల బలం కలిగింది. ఆ క్రమ విచారణ వల్లా బలం వచ్చింది. ఈ సాధన వల్లా బలం వచ్చింది. ఇప్పుడు 24గంటలూ పనే. ఎందుకని? ఇంకొకడితో నాకు పని ఏముంది? కావాల్సినంత పని వచ్చింది ఇప్పుడు నాకు. ఇప్పటివరకూ పని లేదని, బయటపనులు పెట్టకున్నాను. ఇప్పటి వరకూ బయటపనులు ఎందుకు పెట్టుకున్నావు? ఈ పనులు లేవు కాబట్టి, ఈ పనులు పెట్టుకోలేదు కాబట్టి. మనసుకి ఏం పనిలేక. దానికి ఈ సాధన లేదు కదండీ! ఈ సాధన లేకపోయేప్పటికి ఏం చేశావు? ఆవాల పిండి కొడుదామా? ఇంకో పిండి కొడుదామా? నిమ్మకాయలు తెద్దామా? ఆవకాయలు తెద్దామా? అది తెద్దామా? ఇది తెద్దామా? 10 చేద్దామా? 16 చేద్దామా? ఏమైంది ఇప్పుడు? ఆ 10, 16 చేయకపోతే వూరుకున్నాడా ఇప్పుడు వాడు? వూరుకోడు. ఎంతకాలం చేస్తావు? సాధ్యమయ్యే పనేనా? కాబట్టి ఎంతసేపూ బహిరంగానికి వెళ్ళకుండా, నీ లోపలికి అంతర్ముఖుడవుకా. నీ లోపలికి వెళ్ళడం నేర్చుకో! నీలోపల వున్న యథార్థ నేనును గుర్తించడానికి ప్రయత్నం చేయి. ఆ స్థితిలో వుండడానికి నిలబడు. ఎందుకని? మానవ ఉపాధి తెచ్చుకున్నదే దానికోసం నాయన! ఇది, ఈ పని చేయకపోతే నీవు ఎన్ని పనులు చేసినా వృధానే. ఇప్పటి వరకూ బోల్డుపనులు చేశానంటున్నావుగా, అవన్నీ waste అయ్యా బాబు. ఎందుకని? కాసేపు ఆగితే ఈ రూపం తొలగితే, నీ గురించి ఎవ్వడూ తలవడు నాయన! నువ్వు ఏ తలచావు గనుక, గతించిన వాళ్ళని? నీ తరువాత వాడూ అంతే! అర్థమైందా అండీ!
            ఒక వేళ అథవా తలంచినా కూడా, ఏమని తలుస్తాడు? మా అమ్మ వుంటే అబ్బ! మా కుటుంబము మొత్తానికి ఆవకాయ పెట్టేదండి. ఇప్పుడు ఆవకాయ పెట్టేదే అనే స్ఫురణతో తలుస్తాడే గానీ, దేనిని అభిమానిస్తావు? దేహాన్ని అభిమానిస్తావు. అంతే కదా! ఆత్మాభిమానం వుందా? అసలు ఆత్మకు అభిమానం లేదు కదా! కాబట్టి అభిమానం వుంటే ఏమైపోయావు? ఇప్పుడు. దేహంలోకి వచ్చేశావు. ఆప్యాయత వుంటే ఎక్కడికి వచ్చేశావు? దేహంలోకి వచ్చేశావు. అనురాగం వుంటే ఎక్కడికి వచ్చేశావు? దేహంలోకే వచ్చేశావు. ఆత్మకి ఇవి ఏమీ లేవుగా. కాబట్టి అసలైన పద్ధతి ఏమిటి? ఆత్మానుసార జీవితం. ఆత్మీయతే ప్రధానం. వాడికేమైంది? వాడికి ఏమీ లేదు. వాడు నీ రూప మనస్సులని పట్టించుకోలేదు. కేవలము స్వస్థితి, స్వరూప స్థితిని మాత్రమే ఆశ్రయంగా తీసుకున్నాడు. ఆ లక్ష్యంలో వుండి చూస్తాడు నిన్ను. ఆ లక్ష్యపద్ధతిగానే నీతో ప్రవర్తిస్తాడు. నువ్వు ఏం చేసినా ఆ లక్ష్యస్థితి నుంచే మాట్లాడుతాడు. అతను ఏదైనా విమర్శించినా, చెప్పినా కూడా ఆ స్థితినుంచే విమర్శిస్తాడు. నీ ఉద్ధరణకే అది వుపయోగపడుతుంది. నీకు నష్టం కలగదండీ, ఎప్పుడూ కూడా! చాలామంది అంటారు. ఇవాళ గురువుగారు చాలా కోపంగా వున్నారండి. ఆయనకు ఏం పని కోపం తోటి? ఆయనకు ఏమన్నా పని వుందా? ఏం పని లేదు కదా! ఆయనకి. ఎందుకని? స్వస్థితిలో వున్నవాడికి కోపంతో ఏం పని అంటే, స్వస్థితిలో వున్నటువంటి వాడు, ఈ కోపమనే పనిముట్టుని భావాన్ని రమ్మనాలి. ఆ పనిముట్టుని ఒక నిమిత్తమే రమ్మనాలి. దానిని ఆశ్రయించమనాలి. ఆవేశించమనాలి. దాని పనంతా జరిగి ఇంద్రియాలలో కోపం ఆవేశించబడాలి. పడటానికి ఎంతో సమయం తీసుకుంటుంది. నీకు రెప్పపాటులో వస్తే, వాడికి ఎంతో సమయం పడుతుంది. ఎంతో దిగి రావాలి కిందకు వాడు. ఎందుకని? ఒక పని నిమిత్తమై, ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుంటాడు, దాని నిమిత్తం, ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని కిందకు దిగి వస్తాడు. వచ్చినవాడు ఎంతసేపు వుంటాడు? రెప్పపాటులో మళ్ళా వెళ్ళిపోతాడు, స్వరూపస్థితికి. నువ్వు? వస్తే వెళ్ళలేవు. అర్థమైందా అండీ! ఇలాగ, నీకు అతనికి ఎంతో భేదం వుంది. కాబట్టి అతడు చేసినట్లు చేయమాకు. అతను చెప్పినట్లు చేయి. అర్థమైందా అండీ! అతను చెప్తాడు నీకు చక్కగా ప్రతి ఒక్క స్థితి గురించి వివరించి చెబుతాడు, ఇదిగో ఇది ఇలా వుంటుంది, ఇలా వుంటుంది. ఇక్కడ ఈ అడ్డంకి వుంటుంది. ఇప్పుడు ఇది ఇట్లా తప్పించుకోవాలి. ఇదిగో ఈ మార్గం ఇట్లా చేయాలి. దీని ఉపాయం ఇట్లాగ. ఇలా ప్రతీది చెబుతున్నాడుగా. అలా చెప్పినట్లు చేయి. రోజంతా ఖాళీయే కదా! ఆ నాలుగు క్రమసాధనలు చేయి. ఆ క్రమవిచారణ చేయి. ఈ రెండూ చేయకుండా, మిగిలినవన్నీ ఏదో చేశావనుకుంటున్నావేంటి? అర్థమైందా అండీ!
            మీరు త్రిపురా రహస్యమే సీడీ విన్నారండి. వింటే ఏమైంది? (విన్న కాసేపే) విన్నకాసేపు కూడా ఏమైంది? క్రమవిచారణ వుందా? లేదు. క్రమసాధన వుందా? లేదు. కానీ బోల్డు తెలుసుకున్నావు. శాస్త్రజ్ఞానానికి సంబంధించినది బోల్డు తెలుసుకున్నావు. దాంట్లో నుంచి ఒక్కటి ఉపయోగించు నిత్యజీవితంలో. ఉపయోగిస్తున్నావా? అంటే అర్థం ఏమిటి? నీకు ఎంతగా అనుభవజ్ఞానం వుంటే, అంత సామర్థ్యం వుంటుంది అవగాహన చేసుకోవడానికి. ఓహో! ఈ లక్ష్యంతో, ఇంత గొప్ప, అంత ఉన్నతమైన స్థితిని వుద్దేశ్యించి, ఆ పదం వేస్తున్నాడు. (పది నిమిషాల్లో చదివేదానిని మీరు ఇప్పుడు రెండు మూడు గంటల సేపు చెప్పారు) ఎట్లా తెలుస్తుందది? నీకు అనుభవజ్ఞానం వుండాలి. వుంటే తెలుస్తుంది. అనుభవజ్ఞానం లేకపోతే చదువుకుంటూ పోతావు అంతే. ఎందుకని? అక్కడ కూడా అలా దేహభావనతోనే చూస్తున్నావు. అహంకారంతోటే చూస్తున్నావు. (ఆ అర్థం కూడా మాకు ఇంకో రకంగానే స్ఫురిస్తుంటుంది) నువ్వు ఏ స్థితిలో వుంటే అలా స్ఫురిస్తుంది. కాబట్టి ఈ స్థితి నీకు ఎందుకు స్ఫురించడం లేదు? ఇట్లా ఎందుకు నీకు రావడం లేదు? అంటే, నువ్వు నిజజీవితంలో అట్లా ఆచరించి లేవయ్యా బాబు. నువ్వు నిజజీవితంలో ఎట్లా వున్నావో, అట్లాగే వస్తుంది నాయానా ఇది. ఆయన అట్లాగే చెబుతాడు లేండి. అందులోనుంచి ఆయన బయటకు వస్తే మళ్ళా మామూలే! అన్నావే అనుకో? ఏది నువ్వు వుండు చూద్దాం అట్లాగ? వుండలేవు అట్లాగ. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఆయన ఎట్లా చెబుతున్నాడో చక్కగా విచారణ చేసుకో! ఆ క్రమ విచారణ చేయి, క్రమ సాధన చేయి. బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇది. జీవితం మొత్తం మీద ఇంకెప్పుడూ ఎవరినీ ఏం చేయాలని అడుగకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి.
            నేను ఎవడను? అనే ప్రథమ తలంపుతోటి మొదలు పెట్టాలి. ప్రతి ఆలోచన ముందుకూడా నేను ఎవడను? ‘నేను ఆత్మ
స్వరూపుడను’, నేను పరమాత్మ యొక్క అంశను. నేనే శాశ్వతుడను. నేను సనాతనుడను. నేను సచ్చిదానంద స్వరూపుడను. నేను అప్రమేయుడను. అనేటటువంటి ఏ వాక్యాలైతే వున్నాయో, వాటితో ఆరంభించాలి ప్రతి ఆలోచనని. అట్లా ప్రారంభించి, వచ్చిన ప్రతి ఆలోచనలో రూపానికి సంబంధించినవి ఏమున్నాయి? మనసుకు సంబంధించినవి ఏమున్నాయి? పంచకోశాలకు సంబంధించినవి ఏమున్నాయి? స్థూల దేహానికి, సూక్ష్మదేహానికి, కారణ దేహానికి సంబంధించినది ఏముంది? అని వీటికి సంబంధించినది ఏమున్నా సరే, అదంతా కూడా అహంకారమే. వేరే ఏమీ కాదు. అర్థమైందా అండీ! ఏమన్నా తేడా వచ్చింది, తేడా వస్తే దేనికి తేడా వచ్చింది? వెంటనే విచారణ చేయాలండి. ఆ తేడా రాగానే దేంట్లో వచ్చింది? స్థూలంలోనా, సూక్ష్మంలోనా, కారణంలోనా? నాకేం తేడా వుంది? నాకు ఏ తేడా లేదు కదా! నేనెవరిని? నేను ఆత్మస్వరూపుడను. ఇలా క్రమవిచారణ చేయాలి. ఇంకా సమయం దొరికింది, ఏం చెయ్యాలి ఇప్పుడు? క్రమసాధన చేయి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి శ్వాసను తిప్పుకో! మనసుతో జపం చేయి. మూడవది ఏమిటి? పరమాత్మరూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించు. ప్రతిష్ఠించి ఈ మూడూ ఎప్పుడైతే చేశావో, ఈ మూడు శక్తులు ఒక్కటైపోతాయి. అర్థమైందా అండీ? ఈ ప్రాణము, మనస్సు బుద్ధి ఏకమైపోయి, నీకు ఆ లోపల వున్నటువంటి నేనుఅనేటటువంటి స్ఫురణ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ మూడు ఇప్పుడు విడివిడిగా వున్నాయి. అర్థమైందా అండీ? ప్రాణం చేతిలో ప్రాణం కొట్టుకుంటుంది, మనసు చేతిలో మనసు పనిచేస్తుంది, బుద్ధి చేతిలో బుద్ధి పనిచేస్తుంది. కాబట్టి క్రమసాధన అంటే అర్థం ఏమిటి? ఈ మూడింటినీ ఒక లక్ష్యంలోకి తెచ్చి, ఒకే తీరుగా నడపడం అన్నమాట. అది క్రమసాధన. అందుకే దీని పేరు ఏంటి? క్రమసాధన. విచక్షణతో ఒక క్రమంలోకి రావాలి. వేరువేరుగా వున్నవి ఒక క్రమంలోకి రావాలి. ఒక లక్ష్యం దిశగా పనిచేయాలి. ఎప్పుడైతే ఇలా చేశావో ఏమైందట? ఈ మూడు ఏక త్రితం అవ్వగానే, త్రితం అంటే మూడు అన్నమాట. ఈ మూడు ఏకమైనాయి. అవ్వగానే నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే ఏమిటి? అదిగో ఆ నేను అనేటటువంటి స్ఫురణ తెలుస్తుంది. నేను నేను నేను అంటోంది కదా! ఆ నేను అనేది తెలియబడుతోంది నాయనా! ఇదే అన్నిటికంటే ఉన్నతమైన సాధన. ఇహ ఇంతకు మించింది లేదు. ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్ని తిరగేసినా, ఎన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎన్ని వైదిక కర్మలు చేసినా, చెయ్యకపోయినా, ఈ సాధన చెయ్యకపోతే... ఎందుకని? మరణకాలంలో ఏ యజ్ఞం చేద్దాము? చండీ యాగం చేద్దామా? శతరుద్రచండీయాగం చేద్దామా? ఎలా సాధ్యం? సాధ్యమా? కాబట్టి యజ్ఞభావంతో చేయి. నిరంతరం యజ్ఞం జరుగుతుంది ఇప్పుడు. ఇలా చేస్తే ఏమైంది? ఎప్పుడూ యజ్ఞమే. ఎందుకని? నీ ప్రాణమే శ్రోతస్సులు, హవిస్సులు, ఆ యజ్ఞంలో వేసేవి. నీ మనస్సు, నీ బుద్ధి అవి అన్నీ ఏమిటి? యజ్ఞంలో పడిపోతున్నాయి. ఆత్మయజ్ఞం అర్థమైందా అండీ! సాధనాయజ్ఞం, స్వాధ్యాయం అంటారు. దీనిని ఏమంటారు? స్వ+అధ్యాయం. నిన్ను నువ్వు అధ్యయనం చేయడం. ఇంతకు మించిన యజ్ఞం లేదు. స్వాధ్యాయమును మించిన తపస్సు లేదు. స్వాధ్యాయమును మించిన యజ్ఞము లేదు. స్వాధ్యాయమును మించిన సాధన లేదు. ఈ స్వాధ్యాయము తప్ప మిగిలినవన్నీ చేశాము మనమిప్పుడు. అర్థమైందా అండీ? ఈ ఉన్నతమైన సాధనని స్వీకరించలేదు. ఎందుకట? ఇది స్వీకరిస్తే జీవితకాలం చెయ్యాలి. మన గోల అది. మిగిలినవన్నీ ఏమిటంటే ఆ కాసేపూ చేసి వచ్చేస్తే పని అయిపోతుంది. మళ్ళా మన పనిలో, మన గోలలో మనం వుండవచ్చు. సంధ్యావందనం ఎందుకు చేస్తున్నావయ్యా? ఆ కాసేపూ సంధ్యావందనం చేస్తే, నా పని నేను చేసుకుంటా తరువాత. ఆ పూజలు చేస్తే ఏమిటట ఉపయోగం? ఆ పూజలు అయిపోయినాక నా పని నేను చేసుకోవచ్చు. ఇది 24 గంటలు చేయాలిగా మరిప్పుడు. 24 గంటలు చేయాలి, కొస ప్రాణం దాకా చేయాలి, మరణ కాలంలో కూడా చేయాలి.
            ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకో! పిల్లాడు స్కూల్‌ కి వెళ్తున్నాడండి. వాడికి  Doubt వచ్చింది. ఏమండీ! బండెడు పుస్తకాలు ఇచ్చారు, ఇవి చదువుతున్నాను. ఇంతకాలం చదివేసి నాకు విరక్తి వచ్చేసింది ఇకపైన నేను చదవను అంటున్నాడు. అప్పుడు వాడితో నాయనా! నువ్వు జీవితకాలం చదవాలి నాయన అన్నావనుకో, ఏమౌతుంది? కొంతకాలమే చేద్దామనే వుద్దేశ్యంతో అందులోకి ప్రవేశించాడు. ఇప్పడు వాడంతట వాడు నేను జీవితకాలం విద్యార్థిని అని తెలుసుకుంటే ఏ సమస్యా లేదు. మనం చెబితే ఏమైంది? ప్రమాదం వచ్చింది. కాబట్టి ఏం చేస్తే వాడంతటవాడు తెలుసుకోగలుగుతాడో అది చేయి. అట్లాగే నువ్వు కూడా అంతే. నీకు నువ్వు తెలియాలి. నీకు నువ్వు తెలియకుండా వున్నావిప్పుడు. ఏ సాధన చేస్తే నీకు నువ్వు తెలుస్తావో, అది చేయి. ఇప్పటి వరకూ ఏ సాధన చేశావు? నిన్ను నువ్వు ఏ మార్చడానికి చేశావు అంతే. తప్పుదారిలో పడడానికి చేశావు అంతే. నీకు నీవు తెలియడానికి చేయలేదు. కాబట్టి ఇక నుంచి క్రమ విచారణ, క్రమ సాధన ఈ రెండు పనులు చెయ్యాలి. ఆత్మ విచారణ, ఇప్పుడు చెబుతున్నటువంటి క్రమసాధన. అంటే ఏమిటి? సమయం దొరికింది. ఎవ్వరితో నీకేం పనిలేదు నాయనా! సమయం దొరకలేదు, పని చేస్తూ కూడా ఇదే పని. అర్థమైందా అండీ! మనసులో జపం చేస్తూ పని చేసుకో! ఏమౌతుంది? ఏమి అవ్వదు. పప్పు మాడిపోతుందేమో? పోనీ! నిజంగా నీకు స్థితి కుదిరిందండి, బయటకు వచ్చే బాహ్య స్ఫురణ లేదండి. అప్పుడు పప్పు వుందా? పప్పుకింద మంట వుందా? మాడిందా అప్పుడు? ఏమవ్వదు. బాహ్యస్ఫురణలో వుండి నువ్వు పట్టించుకోలేదనుకోండి. నీకే తప్పు వస్తుంది. అర్థమైందా? కాబట్టి నువ్వు ముందు ఏం చెయ్యాలి? పని చేస్తూ కూడా, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. పని చేస్తూ కూడా మనసుతో జపం చేయాలి. పని చేస్తూ కూడా బుద్ధియందు పరమాత్మను ప్రతిష్ఠించాలి. (చేసే పని కూడా అప్పుడు తెలుస్తూనే వుంటుంది కదా!) స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు అస్పష్టంగా తెలుస్తుంది. ముందే తెలుస్తుంది. ఈ పని చేస్తే ఏమిటయ్యా ఉపయోగం అంటే, ఏదో పరిస్థితి జరగబోతోందని నీకు ముందే తెలుస్తుంది. దానికి వ్యతిరేకంగా అహంకారం బలపడటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని ముందే తెలిసిపోతోంది. (ఆ పప్పు పెట్టింది ఉడికిందని) ఆ సమయానికి తెలిసిపోతుంది. ఏమీ ఎవరూ వచ్చి చెప్పనక్కరలేదు. అన్నీ స్పష్టంగా వుంటాయండి. దీనిని మించినటువంటి శక్తి ఏదీ లేదండి. ఈ క్రమసాధన చేసిన వాడికి అన్నీ పూర్ణవికాసము చెందుతాయి. ప్రక్కనే కూర్చొని, దానినే నిలబడి చూసేవాడికి కూడా దానిని గుర్తించడం తెలియదు. ఇహ లోకానికి సంబంధించిన పని కూడా, ఇక్కడ కూర్చొని దేనినైనా చెప్పగలుగుతావు. ఎలాగ? ఆ సూక్ష్మపరిజ్ఞానం, బుద్ధి వికాసం వచ్చేస్తుంది. పూర్ణంగా వికసించేస్తుంది. దేనినైనా తెలుసుకోగలిగే సామర్థ్యం వచ్చేస్తుంది. అక్కడినుంచి చెబుతూ వుంటారు అంతే! ఫోనులో చెబుతూ వున్నా తెలిసిపోతుంది. నాయనా! ఇది నాయన, అది నాయన, అలా చేసుకో, ఇలా చేసుకో, ఇలా మార్చుకో, అలా మార్చుకో... చెప్పేస్తాడు. ఆ రకంగా పరిణామం చెందుతావు. ఈ సత్యాన్ని తెలుసుకో! ఈ క్రమసాధన వలన ఇహం చెడిపోతుంది అనుకుంటున్నావేమో? ఇహం సమర్థవంతముగా చేయబడుతుంది. కానీ, ఇప్పుడు చేస్తున్న పద్ధతిగా కాదు. చేసి చేయనివాడను అనే పద్ధతిలో చేయబడుతావు. ఇంకోటి ఏమిటి? తక్కువ పనులు చేస్తావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేశంలో వున్న చెత్త అంతా నీదే! (ఇది వరకూ అనవసరమైన పనులన్నీ నెత్తిన వేసుకున్నాం) ఇప్పుడు నిలబడుతావు, స్థిరత్వం పొందుతావు. నీ స్వరూప జ్ఞానంలో స్థిరంగా వుంటావు. ఏది సరైన విధానం? రోజుకో 1000 పనులు చేసి, చెత్తంతా నెత్తిన పోసుకోవడం సరైన విధానమా? ఎంతవరకు? ఈ రెండు పనులే నా పనులండి, మిగితావన్నీ నావి కాదు. (తప్పించుకోవడం) తప్పించుకోవడం కాదు, మళ్ళా అదిగో...!  తప్పించుకోవడం కాదు, అది అనవసరం. అర్థమైందా అండీ? అది అనవసరం. ఎందుకని? దీని వల్ల ఏమిటి ప్రయోజనం? అహంకారం బలపడడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు నాయనా! నీ వెంబడి వచ్చాను, నువ్వు బట్టలు కొన్నావు, నేను కూడా నీ వెంబడి తోక లాగా వచ్చాను, ఏమిటట ప్రయోజనం? నాకేమిటి ప్రయోజనం? పని ఎవరిది? నీది. అంతేనా? నా మీద ప్రేమ కొద్దీ, వల్లమాలిన అభిమానం కొద్దీ నన్ను పిలిచావని అనుకుంటున్నానండి. ఆహా! నీకు బాగా తెలుసుకదా, నువ్వు నాతో పాటు రా అన్నాను. ఎందుకమ్మా? నాకు. శరీరమే వస్త్రం కదా! అన్నావనుకోండి, ఇప్పుడు నిన్ను ఎవడైనా వస్త్రాల షాపుకి పట్టుకెళతాడా? ఎప్పుడైతే నీ స్వాధ్యాయము, నీ స్వ+అధ్యయనము అనేటటువంటి పని ఎప్పుడైతే వున్నదో, ఈ వేదాంత వాక్యాలను ఎప్పుడైతే సమాధానంగా చెప్పావో, ఏమైంది అప్పుడు? ఇప్పుడు ఎప్పుడూ సమయమే. సాధన చేయడానికి ఎప్పుడూ సమయమే కదా! ఇంతకు ముందు ఏమన్నావు? ఎక్కడండీ? సాధన చేయడానికి సమయం లేదండి! ఏది? ఇప్పుడు చూపెట్టు? (సాధన చేయడానికి సమయము) ఎప్పుడూ వుంటుంది కదా అది. ప్రాణము, మనస్సు, బుద్ధి ఎప్పుడూ వున్నాయి నీ దగ్గర. నువ్వు ఈ పని చెయ్యి. (అంటే ఏం చేయాలట) ఈ పని చేస్తూ.... ముందు దీనికి (సాధనకి) ప్రాధాన్యతను ఇవ్వు. అంటే ఏమిటి? ఈ పని... ఉదాహరణ చెబుతానండి.
            పూర్వీకులు మీకు ఏం నేర్పారు? వంట వండటం మొదలు పెట్టేముందు కృష్ణార్పణం, రామార్పణం... అంటూ మొదలుపెట్టమన్నారు. అర్థమైందా? అయిపోయింది. అప్పుడు కూడా అలాగే పూర్తి చేయమన్నారు. ఎందుకని అట్లా చేయమంటున్నాడు? ఇదే స్వాధ్యాయము. నువ్వు ముందు సాధన చేయి. (అట్లాకాదు). ఈ క్రమసాధన కొంతసేపు నిలకడ పొందేవరకూ చేసి, అప్పుడు పనిలోకి దిగు. మీరు చూడండి. ఏ పనైనా చేసేటప్పుడు... ఓం భూః భువః... అనమంటాడు. అదే శ్వాస మీద ధ్యాస. చెప్పేటప్పుడు నీ పూజలో లేదా? ఉత్తిష్ఠంతు భూత ప్రేత పిశాచాః... ఎట్లా పోతాయి అవి? నీ శ్వాస మీద ధ్యాస పెడితే, అవి నిన్నేమీ చేయలేవు. ఎప్పుడైతే శరీర భావనలోనికి వచ్చేశావో, ఆ భూత ప్రేత పిశాచములు అన్నీ నీ లోపలనే వున్నాయి. ఎక్కడో వున్నాయి అనుకుంటున్నావేమో, అవి వేరే ఎక్కడా లేవు. దేహాభిమానమే అది. నువ్వు రోజూ పూజలో చెబుతున్నావు కానీ ఎందుకు చేస్తున్నావో, ఏమి చేస్తున్నావో నీకు తెలియదు. అర్థమైందా అండీ! ఆ రకంగా చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. మనస్సుతో జపం చేయండి. అలాగే బుద్ధిలో పరమాత్మ రూపాన్ని ప్రతిష్ఠించండి. ఈ మూడు చేసినాకే దేహంతో పనిలోకి దిగండి. ఈ మూడు చేసినాకే, నిద్రలోకి ఉపక్రమించండి. ఆ స్థితినుంచే నిద్రలోకి ఉపక్రమించండి. లేస్తూ కూడా ఈ మూడింటితోనే లేవండి. క్రమ విచారణ చేయండి. ఏదన్నా తలంపు కలిగింది, వెంటనే ఆహా తలంపు కలిగింది. ఎందుకని అంటే, ఈ సాధన చేసేటప్పుడు, ఈ క్రమసాధన చేసేటప్పుడు, తలంపు కలుగగానే నీకు ముందు తెలిసిపోతుంది. ఓహో! మనసు పని చేస్తుంది. వేరే పని చేస్తోంది. మనసు ఏం చేయాలి అసలు? జపం చేయాలి. బుద్ధి ఏం చేయాలి? పరమాత్మ రూపం మీద నిలబడి వుండాలి. కానీ ఏం చేసింది? పక్కనుంచి ఇంకో వైపు చూపెడుతోంది. చూపెడుతోంది అనంగానే లక్ష్యం మారుతున్నప్పుడు మనకు వెంటనే తెలిసిపోతుందండి. ఓహో! ఏమిటి ఇప్పుడు వచ్చింది? దీంట్లో నేను ఇప్పటి వరకూ ఎలా చేశాను? ఇప్పుడు ఎలా చేయాలి? ఆత్మవిచారణతో చేయడం అంటే ఎలాగు ఇది? నేను ఎవడను? నేను ఆత్మస్వరూపుడను. మరి నేను జయపిన్నిని కాను కదా! నేను ఫలానా వారి భార్యను కాదు కదా! నేను ఫలానా వారికి అమ్మని కాదు కదా! వీటిలో నేను ఎలా ఆలోచిస్తున్నాను? నేను ఆత్మస్వరూపుడిగా చూస్తున్నానా? దేహసంబంధంతో చూస్తున్నానా? ముందు రెండు నిమిషాలు చెయ్యాలి ఈ పని. చేస్తే ఏమైంది? అటు క్రమ సాధన, ఇటు క్రమ విచారణ. క్రమ విచారణ చేస్తే, క్రమ సాధనలో కుదురుకుంటావు. క్రమ సాధన చేస్తే, క్రమ విచారణ బలపడుతుంది. దీంట్లో వున్న గొప్ప విషయం ఇదేనండి. ఈ సాధన వల్ల ఉపయోగం ఏమిటి? ఈ సాధన చేస్తే, దీనికి అన్యం అయినది చక్కగా తెలిసిపోతోంది. తెలియంగానే క్రమవిచారణ చేస్తావు. ఒక్కటి చేస్తే ఒక్కటి తప్పనిసరిగా వచ్చేస్తుందండి. విచారణ చేశావా ఈ సాధన చేయక తప్పదు. సాధన చేశావా విచారణ చేయక తప్పదు. ఈ ఆత్మవిచారణ ఈ సాధన రెండూ అతి దగ్గరగా వున్నాయి అన్నమాట. అందుకే ఏం చెప్పాడు? ఆత్మ విచారణ చేసేవాడు సాధకుడు స్వ+అధ్యయనం చేయాలి. స్వాధ్యాయ యజ్ఞమును మించిన యజ్ఞము లేదు నాయానా, స్వాధ్యాయమును మించిన తపస్సు లేదు నాయన. ఎన్నో వేల జన్మలనుంచి మహానుభావులు చెట్టుకు వేలాడి చేసినటువంటి వాళ్ళు చేసిన ఘోర తపస్సులతో నీకు ఏం పని లేదు నాయనా. ఎందుకని? జ్ఞాన యజ్ఞము చేయి నాయన. స్వాధ్యాయ యజ్ఞం చేయి. స్వాధ్యాయ యజ్ఞంలో నీవే, నీ ప్రాణ మనో బుద్ధులే యజ్ఞంలో వేసేటటువంటి సమిధలు. ఏమైంది అప్పుడు? సహజంగా వుంది. ఏం ప్రమాదం లేదు. ఎందుకని? ఆత్మస్వరూపంలో సహజంగా స్థిరమై వున్నావు కనుక. మానవ దేహం వచ్చినందుకు, ఏ నిమిత్తమైతే వచ్చిందో ఆ నిమత్తం నెరవేరుతుందన్నమాట.
సాయిరాం.

ఓం ఓం ఓం
ఓం పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం తత్‌ సత్‌
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః

సాయిరాం.