File No.15



ఆయా ఆలోచనలు కలిగినప్పుడు, ఆ ఆలోచన వెనుకాల వున్నటువంటి నేను అనే స్ఫురణని గుర్తించాలి. నేను అనే స్ఫురణను ఆశ్రయిస్తే, ఆలోచనలో వున్నటువంటి దేహాభిమానం తనకు తానుగా నశించిపోతుంది. అలాకాకుండా ఆలోచన వెంబడే కనుక మనం ఆచరణలోనికి దిగితే, అప్పుడు వాక్కు అయినా కూడా ఆచరణే. మాట్లాడడం కూడా ఆచరణే. ఆ మాట్లాడడం అనే దానికి ముందే విచారణ చేసి, నేను అనేటటువంటి స్ఫురణను ఆశ్రయించాలి. ఆ తెలివిని, ఆ ఎఱుకని, ఆ బుద్ధిని కనుక ఆశ్రయించినట్లయితే, ఆ ఆలోచనలో వున్నటువంటి దేహాభిమానం తనకు తానే నశించిపోతుంది. ఎట్లా అయితే హారతి కర్పూరం తనకు తాను నశించిపోతుందో, అట్లా అది కూడా నశించిపోతుంది. ఇది మార్గం. ఇది సాధన. ఇలా విచారణ చేయండి అని చెబుతున్నారు. (తరువాత)
            (అహంకారము యొక్క మూలమును విచారించిన అచ్చట ఏవేవో వేర్వేరు భావములు ... నేనుకు ప్రత్యేక తలంపు తోచుట లేదే)
సందేహం అడిగాడు ఇప్పుడు. ఏమండీ! మీరు చెప్పారు. ఆలోచనలని గమనించమన్నారు. ఎన్ని ఆలోచనలని గమనించినా, ఆలోచనల వెంబడి ఆలోచనలే వస్తున్నాయి గానీ, నేను అనేటటువంటి తలంపుగానీ, స్ఫురణగానీ, నాకు తెలియడం లేదు. అవి వస్తున్నాయి, పోతూవున్నాయి ఆలోచనలు, పుడుతూ వున్నాయి, అసంఖ్యాకంగా అవుతున్నాయి, అనేకం అవుతున్నాయి. నేను ఆలోచనల నుంచి పనులు చేస్తున్నాను. పనులకు ఫలితాలు వస్తున్నాయి. కానీ వీటిని ఎంతసేపు చూసినా, 'నేను' అనే స్ఫురణ నాకు తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు? అని అడిగాడు. మన సమస్య అదే కదా! (ఊం... సమాధానం ఏం చెప్పాడు?)

  (...........తోచిననూ తోచకపోయిననూ ఇతర.... లనుగూర్చిన వాక్యములన్నియూ..హృదయము నందలి.... దేహోహం అన్న....నేను అను .... అహంకారము లేకుండటయే, ఇతర తలంపులు లేకుండుటకు కారణం అగును. మూలస్థానము నుండుట చేతనూ, ....)
(ఆగు ఆగు చాలా దూరం చదివేశావు.)

ఏం చేయమంటున్నాడు? ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఈ ఆలోచనలన్నింటికీ మూలంలో ఏముంది? అహంకారం వుంది. ఆ అహంకారమనే వేరు వున్నంత వరకూ, ఈ ఆలోచనలు పుంఖాను పుంఖాలుగా ఇలా అనేకంగా వస్తూనే వుంటాయి. ఇవి రాకూడదు అంటే ఆ మూలంలో వున్నటువంటి వేరుని తెగ్గొట్టాలి. అహంకార నిరసన అనేది అభ్యాసం చెయ్యాలి. (అహంకారం అంటే?) అహంకారం అంటే దేహాభిమానము. శరీరమే నేను అనే భావనే అహంకారము. దానిని నిరసించే ప్రయత్నం చెయ్యాలి అంటే, మూడు గుణాలని నిరసించాలి, మూడు అవస్థలని నిరసించాలి, మూడు వాసలని నిరసించాలి, ప్రతి ఆలోచనలో తాపత్రయంకాని, ఈషణత్రయం కాని, వాసనాత్రయం గాని, అవస్థాత్రయం గాని ఇవేమీ లేకుండా వుండేటట్లు చూసుకోవాలి. ఆ ఆకర్షణ లేకుండా వుండేటట్లు చూసుకోవాలి. లోకవాసనచేత గాని, శాస్త్రవాసనచేత గాని, దేహవాసనచేత గాని, సత్వగుణం రజోగుణం తమోగుణం చేతగాని, మెలకువ కల నిద్ర మూడింటిచేత గాని, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ అనే ఈషణత్రయంచేత గాని, వీటివల్ల ఆకర్షించబడకుండా నీ ఆలోచనలు వున్నయా లేవా? చూసుకోవాలి. ఆలోచన అట్లా లేదు. అప్పుడు ఆ ఆలోచనలో వున్నటువంటిది వీటికి సంబంధించినది ఏముందో గుర్తించి దానిని నిరసించాలి. అప్పుడు నిరసిస్తే ఏమైంది? అహంకారం అనే వేరు తెగిపోయిందట. వేరు తెగిపోయిన వృక్షం ఎట్లా అయితే తనకు తానే కూలిపోతుందో, అట్లా నీ అహంకారం కూలిపోతుంది, నీ దేహాభిమానం కూలిపోతుంది. అప్పుడు ఏది మిగిలివుందో, అదే నేను అనే స్ఫురణ. ఇది పోతే ఏది మిగిలివుంది? ఆ స్ఫురణ పేరు నేను. కాబట్టి ఈ ఆలోచన వెనుకాల వున్నటువంటి నేను అనే స్ఫురణను గమనించవయ్యా అంటే, ఆలోచనలు వస్తూవున్నంతవరకూ నేను అనే స్ఫురణ తెలుస్తుందా? తెలియడం లేదు. ఆలోచనలు రావడం ఆగిపోతే, నేను అనే స్ఫురణ తెలిసింది. ఆలోచనలు రావడం ఆగిపోవాలి అంటే దానికి ఆధారం ఎక్కడుంది? అహంకారం అనే వేరులో వుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలయ్యా? భావంలో ఆ దేహాభిమానాన్ని, అహంకారాన్ని నిరసించాలి. అంటే ఏం చెయ్యాలి? ఈ మూడు గుణాల ప్రభావాన్ని నిరసించాలి. మూడు అవస్థల ప్రభావాన్ని నిరసించాలి. ఈషణ త్రయాన్ని నిరసించాలి. ఇట్లాగ చెబుతున్నాడు అన్నీ. ఇవి నీ ఆలోచనలో ఎట్లా వున్నాయో గమనించుకో! వాటిని నిరసించు. అప్పుడు అహంకార నిరసన జరిగి, వేరు తెగిన వృక్షం ఎట్లా అయితే కూలిపోతుందో అట్లా కూలిపోతుంది. అర్థమైందా! ఇది చేయవలసిన సాధన.
            (ప్రతినిత్యం....తలంపులు...మనసు ఆ దారిన పోలేక...శాస్త్రస్వరూపమైన తనయందే నిలచి...తనయెదుట...జరగుచున్న... జరుగునది జరుగనిమ్ము అని సాక్షివలె ... అభ్యాసమే.. అనగా ...)
            ఏమి జరుగునో జరుగనిమ్ము అని చూచు సాక్షి అను అభ్యాసమే చాలా ముఖ్యం. ఇందాక మీకు నేను చూపెట్టాను. సమయం అయ్యింది, దాటిపోతోంది, భోజనం పెట్టలేదు, రోజూ విధానం ఎట్లాగ? వారే భోజనం పెట్టి పిలుస్తారు. సమయమైంది భోజనం పెట్టాను రండి అని. మనం పిలిచి వెళ్ళి అడగడం కానీ, వగైరాలు లేవు. కాబట్టి ఏం జరుగుతుందో చూడడమే గాని మనం, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పడం లేదు. కాబట్టి ఏం చెయ్యాలి ఇప్పుడు? పెట్టే వరకూ వేచి చూడవలెయును. నువ్వు అడగందే నాకు ఎట్లా తెలుస్తుంది? అడిగితే ఏమౌతావు? సాక్షిత్వము పోతుంది, కాబట్టి ఏం చెయ్యాలి? ఏమి జరుగునో చూచెదము అని, గమనిస్తూ సాక్షిగా వుండుము. వుంటే ఏమైంది? వారిప్పుడు రెండు మూడు అంశాలు ప్రతిపాదించారు. ప్రతిపాదించినప్పుడు అందులోవున్న భావాన్ని స్వీకరిస్తే ఏమైంది? నీకు కూడా దేహాత్మభావన కలుగుతుంది. వ్యతిరేకతలు వస్తాయి. సమాధానం చెప్పాల్సివస్తుంది. అదే సాక్షిగా వుంటే ఏమైంది? ఏమీ సమాధానం చెప్పలేదు. దాని అంతట అదే సమసిపోయింది. ఎంతసేపు వుంటుంది. ఇప్పుడు ఎవరివి ఎవరి దగ్గర వున్నాయి? ఇప్పుడు వారివి వారి దగ్గరే వున్నాయి, నా సాక్షిత్వము నా దగ్గరే వుంది. స్వీకరిస్తే... అంతే కదా! కాబట్టి ఏమి చెయ్యాలట ఇప్పుడు? ఏమి జరుగునో చూతము అని ఉపేక్షించి సాక్షివలె వుండుము. ఏమీ జరగదు అనేదే తెలిసిపోతుంది. జీవితకాలం జననం నుంచి మరణం దాకా, ఇంకా అంతే. ఇదే దీనికి మందు. ఆ అహంకారాన్ని నిరసించాలి అంటే, అది ప్రతిదీ ఏదో ఒక రూపంలో, ఒక సంఘటన ద్వారానో, నీలోపల నుంచో, నీ బయట నుంచో, ఏదో ఒక రకంగా నిన్ను దేహాత్మభావనలోకి నెట్టాలని చూస్తూ వుంటుంది. అప్పుడు ఏం చెయ్యాలి? నిరసించాలి దానిని. నిరసించాలి అంటే ఏమి చెయ్యాలి? ఏమి జరుగునో చూతము అని గమనిస్తూ వుండు మౌనంగా. అంతే. (మనం చెయ్యాలని వుంది కూడా చూస్తూ వుంటామా?) మౌనంగా వుండి చేయి. (మాట్లాడకుండానా?) మానసిక మౌనంతో చేయి. అనేకమంది అనేకం ప్రసంగిస్తూ వుంటారు. ఆ సమయంలో. ఎవరు ఏం మాట్లాడుకుంటే మనకు ఏం పని? సాక్షిత్వంలో వుండు. ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి. అప్పుడేమీ స్వీకరించలేదుగా. అప్పుడేమయ్యింది? దేహాభిమానము ఏర్పడలేదు. అహంకారం వేరు తెగిపోయింది. అర్థమైందా? ఇలా ఆచరించాలి. అర్థమైందా అండీ! ఎప్పుడూ కూడా నీవు తప్ప మిగిలినది అంతా ప్రకృతే కదా! సాక్షిత్వములో వున్నప్పుడు నీ శరీరం కూడా ప్రకృతిలో భాగమే. అంతేనా కాదా? కాబట్టి ప్రకృతి ఎంతసేపు నిన్ను ఏం చేస్తుంది? తనవైపు లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల నీకు దేహాభిమానము కలుగుతుంది. నువ్వు ఏం చెయ్యాలి? ప్రకృతి చేత ఆకర్షణ కలిగినప్పుడల్లా, దాన్ని నిరసించాలి. నిరసించాలి అంటే ఏం చేయాలి? ఉపేక్షించి ఊరుకుని వుండాలి. ఉపేక్షించి ఊరక వుండాలి అంటే ఏం చెయ్యాలి? ఏమి జరుగునో చూతము అని గమనిస్తూ వుండు. మాట్లాడమాకు. ఆలోచించమాకు. ఏం చేయమాకు. ఏమీ చేయకుండా, గమనిస్తూ వుండు. ఆ ప్రకృతి ఏం చేస్తుంది? గమనిస్తూ వున్నవాడిని ఏమీ చేయదు. ఆకర్షించబడేవాడిని లాక్కుంటుంది లోపలికి. అర్థమైందా అండీ! మంచినీళ్ళు కావాలా? అక్కర్లేదు. ఎండలోంచి వచ్చారు కదా! మంచినీళ్ళు తాగండి. అక్కర్లేదు. ఎండాకాలం కూడా తాగకపోతే ఎలాగ? మౌనమే సమాధానం. ఇలా నేను 10 సార్లు ఇస్తే, తీసుకోకపోతే నాకు ఇవ్వాలని అనిపించదు. మౌనమే సమాధానం. మీరు ఎందుకు తీసుకోరు? మౌనమే సమాధానం. ఎందుకని? శరీరం ప్రకృతి. ఇక్కడ ఎవరు అడిగారు అన్నది కాదు సమస్య. (అప్పుడిక ఏ ఆలోచనా వుండదా? మనసులో...) ఏమీ వుండదు. ఊరక వుంటుంది అంతే! (అది నెరవేర్చడమే కదా...) ఔనమ్మా! నువ్వు అభ్యాసము చేయి. ఇప్పుడు నీ ఎదురుగుండానే ఇప్పుడు చూస్తున్నావు కదా! ఇప్పుడు ఇదే చిన్న సంఘటన తీసుకో! ఈ చిన్న సంఘటనలో మామూలుగా అందరూ ఎలా స్పందిస్తారు? మంచినీళ్ళు తీసుకుంటావు, తాగేస్తావు. ఆ ఇచ్చినవాడి యెడల కృతజ్ఞతాభావంతో చూస్తావు. ఆప్యాయతతో చూస్తావు. అనురాగంతో చూస్తావు. నా సమస్యను పరిష్కరించారు కదా! అని చూస్తావు. అంతేనా? దాన్ని ఎక్కడ తెగ్గొట్టాలట ఇప్పుడు? ఇది అంతా దేహాభిమానముతో కూడుకుని వున్నది. ఎక్కడ తెగ్గొట్టాలి? ఓహో! శరీరం దాహం. ఇది ప్రకృతి ధర్మం. నేను ఎవరిని? సాక్షిని. దాహాన్ని చూస్తూ వుంటే ఏమౌతుంది? కొంత సేపటికి? దాహం లేదు. నీళ్ళతో అవసరం లేదు. శరీరం అడిగింది మనం ఎందుకు ఇవ్వాలి? శరీరమే ప్రకృతి అయినప్పుడు శరీరం బయటిది? అది ప్రకృతే. అది ఇంకా మరింత దగ్గరగా వచ్చి, నన్ను ఆశ్రయించమని అడుగుతోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెబుతున్నాడు అక్కడ స్పష్టంగా సాధన? ఊరక వుండు. దాంట్లో చేరమాకు. గమనిస్తూ వుండు. సాక్షిగా వుండు. అహంకారం తగ్గిపోతుంది. నిరసించబడుతుంది. వుంటామా? మనం అలాగ? ఇట్లాగ... ఇలా అభ్యాసం చేయాలి, ఇది సాధన అంటే. అంతేగాని, ఎదో ముక్కు మూసుకుని ఏదో జపం చేశాను, ఓ పక్కన కూర్చున్నాను. ఆ సాధనలు అవి బాల్యం అన్నమాట. అక్షరాభ్యాస సాధనలు. అవన్నీ కూడా తాత్కాలికమైన సాధనలు. అవి అహంకారాన్ని మరింత పెంచుతాయి. ఈ సాధన చేయి. అప్పుడు ఏమైంది? ప్రతి రెప్పపాటు మేల్కొనే వుంటావు. ప్రతి రెప్పపాటు జాగ్రత్తగానే వుంటావు. శరీరం వదిలిపోయే వరకూ కూడా ఇదే స్థితిలోనే వుంటావు. అప్పుడు ఏమైంది? అహంకారం కూకటి వ్రేళ్ళతో తెగిపోయింది. దేహాభిమానం ఏర్పడలేదు. ఎందుకని? శరీరంతో సహా ప్రకృతే. నేను ఒక్కడినే పరమాత్మను. దాని పని ఏమిటి? దాని ధర్మం అది చేస్తూ వుంటుంది. నా దగ్గర అవి వున్నాయి, ఇవి వున్నాయి, అది చెయ్యి, ఇది చెయ్యి అంటుంది. అది అనుభవించు, ఇది అనుభవించు, అది విమర్శించు, ఇది విమర్శించు ఇలా చెబుతూ వుంటుంది. ప్రకృతి. నువ్వు ఏం చెయ్యాలి? అంతా ప్రకృతిగా గమనించి, ఊరక వుండు. ఉపేక్షించి వుండు. (దాహం వేస్తూనే వుందిగా?) ఇప్పుడు ఒకరు అడిగితే ఏమైంది? (మరొకటి మరొకరు...) అంతే! నిజంగా అంత అత్యవసరమే అయ్యిందండి. ఏమౌతుంది అప్పుడు? అత్యవసర స్థితి వరకూ వచ్చినప్పుడు నిన్ను అది బంధించదు. అర్థమైందా? నిమిత్తకర్మ అయిపోతుంది అప్పుడు. అలా కాకుండా మామూలుగా తీసుకుంటే ఏమైంది? ప్రత్యేక కర్మ అయ్యింది. ప్రత్యేకత ఎప్పుడైతే వస్తుందో అది బంధిస్తుంది కదా మరి నిన్ను. బంధిస్తుందా? బంధించదా? ఎప్పుడు వుండదు? ఇచ్చేవాడికి ఇచ్చేవాడుగా వుండకూడదు. పుచ్చుకునే వాడు పుచ్చుకునే వాడుగా వుండకూడదు. (అందరూ అట్లా వుండరు కదా !) సాధ్యమే, అయ్యో! ఇచ్చిన వారు కూడా అట్లాంటి వారు అయ్యుంటే అప్పుడు ఏమౌతుంది? వెంటనే స్వీకరిస్తాము. అక్కడ సమస్య ఏమిటంటే, ఇచ్చేవాడు కూడా ఆ స్థితిలో వుంటే, వెంటనే స్వీకరిస్తాము. అర్థమైందా?
            మీకు చాగంటి కోటేశ్వరరావు చెబుతున్నారుగా... రామాయణం చెబుతున్నాడు టీ.వీలో 9 గంటలకు. రామాయణం చెబుతూ అనేకం చెబుతూ వుంటారు ఇట్లాగ. ఎవరైనా దారేపోయే మహానుభావుడు జీవన్ముక్తుడు మీ ఇంటి ముందు ఆగి ఒక్కగ్లాసుడు మంచి నీళ్ళు అడిగి త్రాగాడంటే చాలు, నీ జీవితం ఉద్ధరించబడిపోతుంది అంటాడు. ఎందుకనిట? వాడు అడగడు. నిన్ను ఉద్ధరించడానికే అడుగుతాడు. అక్కడ విషయం అది. అర్థమైందా? అందుకని వాడు కదలనే కదలడు. కదిలాడా, దానిని ఆపడము అశక్యము. ఆ ఉద్ధరించడాన్ని ఆపడము ఎవరి వల్ల అవ్వదు. అందువల్ల సద్గురు కృప కలగడమే లేట్‌. సద్గురు కృప కలిగినాక అంతా అర క్షణమే. (ఎప్పుడు)
            ఎప్పుడో చూస్తాడు, ఎట్లా చూస్తాడు అంటే, వీడు ఆత్మవిచారణతో కూడిన ఈ అశరీర పద్ధతికి సంబంధించిన సాధనలో వున్నాడా లేదా? అనే దాని చేత ఆకర్షించబడుతాడు. అర్థమైందా అండి! మామూలుగా ఆకర్షించబడడు. ఆయన మామూలు తెలివిలో వుండడు కదా! ఆ తెలివిని ఆకర్షించే ప్రజ్ఞ నీలో వుండాలి. ఆ సంబంధించిన జీవితం వుండాలి నీ దగ్గర. (ఇంకా మేము ఈ మూడు గుణాలు, మూడు అవస్థలు..... మాకు అటువంటి స్థితి ) ఆఁ.. అందుకనే కదా! మరి. అందుకనే, ఏమీ, ఊరక ఉపేక్షించి వుంటారు అందుకే. ఏం మాట్లాడరు. ఏం చేయరు. ఏం తీసుకోరు. ఏం చెయ్యరు. ఎప్పుడంటే, నిన్ను గమనిస్తూ వుంటాడు అంతా, నిన్ను నీవు కూడా గమనించుకోలేవు. అంత దగ్గరగా గమనిస్తూ వుంటాడు నిన్ను. నీ ప్రజ్ఞని, నీ చైతన్యాన్ని, నీ వికాసాన్ని అంతా ఎంతో దగ్గరగా గమనిస్తూ వుంటాడు. గమనిస్తూ ఆ మార్పు వచ్చేస్థితి రాగానే, వెంటనే సంకల్పిస్తాడు. నువ్వు నిద్రపోతూ వుంటావు. కానీ ఆయన మేల్కొని వుంటాడు. నీ హృదయస్థానంలో వుంటాడు. ఎప్పుడూ నిన్ను గమనిస్తూ వుంటాడు పరమాత్మ. అందుకని పరమాత్మకు అంతటి విశిష్ఠత వచ్చింది. ఆ సాక్షికి అంతటి విశిష్ఠత ఎందుకు? నీ తెలివి నిద్రపోతూ వుంటుంది. తెలివికి తెలివైనటువంటి పరమాత్మ మేల్కొని వుంటాడు. కాబట్టి అతని లక్షణం ఏమిటి? గమనించటం. అతని లక్షణం ఏమిటి? సాక్షిగా వుండటం. అతని లక్షణం ఏమిటి? ఉపేక్షించి వుండటం. అతని లక్షణం ఏమిటి? దేనికీ స్పందించక పోవడం. అతని లక్షణం ఏమిటి? ఊరక వుండటం. ఇది నీ హృదయంలో వున్న పరమాత్మ లక్షణాలు. అదే సాధనగా పెట్టుకోవయ్యా బాబు. ఆ లక్షణాలనే నిజజీవితంలో సాధనగా పెట్టుకో. అప్పుడు అహంకారం నిరసించబడుతుంది. నువ్వు సాక్షివి అని తెలుసుకుంటావు. ఆ పరమాత్మానుభవం కలుగుతుంది. నీ హృదయంలోనే వున్నాడు, పరమాత్మ రూపంలో వున్నాడు. ఈ లక్షణాలతో వున్నాడు. ఈ లక్షణాలని నిత్యజీవితంలో అమలు పరుచు. చెయ్యి. ఆచరణలో చెయ్యి ఈ లక్షణాలతో. ఏమౌతావు అప్పుడు? అదే అవుతావు నువ్వు. అప్పుడు నీ అంతరాత్మ పరమాత్మలో లీనమయ్యి వుంటుంది. ఆ పరమాత్మ స్థితి అనుభవిస్తూ వుంటుంది. ఈ లక్షణాలతో జీవించేటప్పుడు.
బయటకు రావాల్సిన అవసరం లేదుగా దానికి.
ఎందుకని?
ఉపేక్షించి వుంది కాబట్టి. ఊరకవుంది కాబట్టి.
నువ్వు బయటకు ఎందుకు వస్తున్నావు?
ఇంద్రియాల అనుభవం కోసం.
ఇంద్రియాల అనుభవం అవసరం లేదన్నవాడికి ఎటుపోయింది అంతరాత్మ?
పరమాత్మలోకి వెళ్ళిపోయింది.
ఇంతే తేడా! బయటకు వచ్చి ఇంద్రియాల ద్వారా పదార్థాన్ని అనుభవించాలి అంటావా?
దేహాభిమానము కలిగింది. అహంకారం కలిగింది.
ఇది నిరసించేశావు. అది ఇటుకాకపోతే అటు కలవాల్సిందే. అటుపోయి కలుస్తుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలని ఎంతమందిని కలిసి అడిగినా ఇదే. ఇదే ఆఖరి సాధన. ఏమిటి? ఆత్మవిచారణ చెయ్యి. ఊరకవుండు. ఎందుకని? నీలో హృదయంలో వున్న పరమాత్మస్థితి అదే కాబట్టి.
ఇప్పుడు ఆ నాలుగు వాక్యాలు మళ్ళా చదవండి. చాలా గొప్పవాక్యాలు అండీ అవి.

(మన ఎదుట ఏమేమి జరుగుచున్నవో, జరుగగలవో, జరుగనివ్వుము. సాక్షివలె విలక్షణముగా ఉపేక్షించు అభ్యాసమే ... అనగా దృశ్యములపూ ... విడుదల పొందుటే... ముందు చెప్పిన ప్రతి బంధములన్నిటికి మూలమైన దేహాత్మ బుద్ధి. రూప మనో నాశములకు  ఉపాయమును, అహంకారమును, ఈ మార్గమునే భక్తి అనియు, ధ్యానమనియు, యోగమనియు, జ్ఞానమనియు చెప్పబడినది.)

ఈ మొత్తము ఆ ఊరక వుండడం, గమనించడానికే మూడు పేర్లు. ధ్యానమని, యోగమని, జ్ఞానమని. హాహా! చూశారా? దీనిని ఇప్పుడు ఎంతమంది, ఎన్ని వేల రకాలుగా చెబుతున్నారు? నువ్వు ఎన్ని లక్షల రకాలుగా దానిని బోధించినా, వాటి అన్నింటిలో చేసేది ఏమిటి? నీ హృదయంలో వున్న పరమాత్మ యొక్క లక్షణాలు ఏవైతే వున్నాయో, ఆ లక్షణాలని నిజజీవితంలో ఆచరించు నాయనా! ఆయనేం చేస్తున్నాడు? ఏం చేయడం లేదు. ఏం జరుగునో చూతమని ఊరక చూస్తూ వున్నాడు. గమనిస్తూ వున్నాడు. స్పందించకుండా వున్నాడు. కదలకుండా వున్నాడు. మార్పులేకుండా వున్నాడు. ఇది ఆయన లక్షణాలు. అదే లక్షణాలతో నువ్వు రోజువారీ జీవించు. ఆ రోజువారీ జీవిస్తే, నీవు చేసే సాధనలకు పేర్లు పెట్టవలసివస్తే వాటి పేర్లు ఏమిటి? మొదటి స్థితిలో ధ్యానం, అంటే మనసు పరిధిలో చేస్తే ధ్యానం. బుద్ధి పరిధిలో చేస్తే యోగం, దాని అవతల పరిధిలో చేస్తే, సాక్షి పరిధిలో చేస్తే జ్ఞానం. అర్థమైందా? ఆ ఊరక వుండడం అనేది, మనోపరిధి వరకూ వుండగలిగాము అనుకో అప్పుడు ధ్యానం, బుద్ధి పరిధిలో కూడా వుండగలిగాము అనుకో యోగం, సాక్షిగా వున్నావనుకో జ్ఞానం. ఆ స్థితి పేర్లే అవి. అంతే కాని అవి సాధనల పేర్లు కావు. ఆయా స్థితుల పేర్లు. దీనినే ధ్యానమనీ, యోగమని, జ్ఞానమని బోధించుచున్నారు. చేసే చేత ఇది. అర్థమైందా?

ధ్యానం అంటే కాళ్ళు చేతులు కట్టేసుకుని, కళ్ళు ముక్కు కట్టేసుకుని, ఒక మూలన కూర్చుని చేసేది కాదు ధ్యానం అంటే. అన్ని ఇంద్రియాలని ఉపయోగించేటప్పుడు నేను ఎవరిని? సాక్షిని. గమనించేవాడిని. అనంతమైనటువంటి విశ్వానికి ప్రకృతికి సాక్షిని. నేను పరమాత్మను. ఏమిజరుగునో... ఇప్పుడు ఇదంతా దృశ్యం కదా నాకు. ఈ దృశ్యప్రపంచం అంతా కూడా, శరీరంతో సహా, ఇంద్రియాలతో సహా, ఇదంతా దృశ్యప్రపంచం సాక్షికి. ఏమి జరుగునో, జరుగనిమ్ము. అని చూచెదము. అంటున్నాడు చూడండి. ఆ వాక్యం మళ్ళా చదవండి. చక్కగా.
(మన ఎదుటనే ఏఏ చిత్రములు జరుగుచున్నవో) మన ఎదుటనే ఏఏ చిత్రములు జరుగుచున్నవో, అంటే ఎదుటనే అంటే ఏమిటి? బయటకి కాదు, నీ ఇంద్రియాలలో జరిగేవి కూడా చిత్రములే. అవి కూడా దృశ్యములే. ఎక్కడికి సాక్షికి. సాక్షి స్థితి నుంచి చూస్తున్నప్పుడు, కన్నుతో పలానా దానిని చూడాలి అను మనసుకు కలిగిందండి. మనసుకు సాక్షివి కదా! అప్పుడు మనసులో ఏమిటి? దృశ్యరూపంగానేగా కదిలింది. చిత్రరూపంగానేగా కదిలింది. బుద్ధిలో పలానా మామిడిపండు తీయగా వుంటుంది అనే జ్ఞాపకం కలిగిందండి. అది ఏ రూపాన్ని ధరించింది వెంటనే? మామిడి పండు దృశ్యాన్ని ధరించిందిగా. కాబట్టి నీ ఇంద్రియాలలో కదిలే కదలికలు అన్నీ ఎలా కదులుతున్నాయి? చిత్రరూపంలోనే కదులుతున్నాయి. అర్థమైందా? ఈ చిత్రరూపంలో కదిలేవాటికి అన్నింటికీ, నీలోపల నీ బయిటా కూడా, ఏమి జరుగునో చూతము. (ఇప్పుడు చదువు)

( సాక్షివలె విలక్షణంగా చూచు అభ్యాసమే, అనగా దృశ్యముల మయముగాక, దృక్‌ రూపమును విడువక,.... అన్నిటికి, మూలమైన దేహాత్మబుద్ధి)

ఇంతకు ముందు చెబుతున్నావే, నాకు అది కుదరడం లేదు, ఇది కుదరడంలేదు, అవి అడ్డం వస్తున్నాయి, ఇవి అడ్డం వస్తున్నాయి అది ప్రతిబంధకము అంటే. నువ్వు చెయ్యాలనుకున్నదానికి అడ్డం వస్తుందని చెప్పడం ప్రతిబంధకము. అవన్నీ నివర్తించాలి అంటే ఏం చెయ్యాలి? ఇలా వుండు. అది అడ్డము వచ్చింది. నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు దానికి అడ్డము? (అసలు ముందు ఈ దేహ భ్రాంతి పోతేనే గాని సాక్షిగా చూడలేము) కదా! దేహభ్రాంతి పోవాలి అంటే నువ్వు సాక్షిగా చూడాలి అంటున్నాడు. దేహభ్రాంతి పోయినాక సాక్షిగా చూడడం కాదు.
(పోకముందే చూడడానికి ఇదే పెద్ద ప్రతిబంధకము)
ఆ ప్రతిబంధకాలు పోవాలి అంటే, వాటిని ఎలా చూడలట నువ్వు? దృశ్యము వలె. గోడమీద చిత్రము వలె. ఒక గోడమీద పటము వుందండి. దానిని ఎలా చూస్తున్నావు? ఆ ప్రతిబంధకాన్ని అలా చూడు. ఆ పటము ఏమన్నా స్పందించిందా? ఏం స్పందించలేదు. ఏమన్నా మాట్లాడిందా? మాట్లాడలేదు. నువ్వు ఎలా వుండాలట? నువ్వు కూడా దాని వలెనే వుండు. ఆ ప్రతిబంధకాన్ని నిన్ను ఎవడు స్మరించమన్నాడు? ఆ ప్రతిబంధకాన్ని నిన్ను ఎవడు దాంట్లో చేరమన్నాడు? ఆ ప్రతిబంధకాన్ని దేహాత్మ భావంగా ఎవడు స్వీకరించమన్నాడు? ఊరక వుండవచ్చు కదా! చిత్రములు చూచెడివాడు, ఏమన్నా స్పందిస్తున్నాడా? ఏం స్పందించడం లేదు కదా! అలా నువ్వు కూడా స్పందించకుండా వుండు. ఉపేక్షించివుండు, ఊరకవుండు. అప్పుడేమైంది? ఆ ప్రతిబంధకానికి మూలమైనటువంటి అహంకారం అనే వేరు ఎక్కడుందో, నీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేశావు? దాన్ని నిరసించావు. గురువాక్యంతో కాని, వేదాంత వాక్యాలతో కాని, దాని వ్యతిరేక వాక్యాలు వుంటాయి కదా! ఆ నిరసనభావంతో దానిని త్యజించావు. ఎక్కడ? భావంలో. ఎప్పుడైతే దానిని నిరసించగానే ఏమైపోయింది? ప్రతిబంధకం లేకుండా పోయింది. ఇదీ ప్రతిబంధకాన్ని తొలగించే విధానం. అంతేగాని ఎదురు వెళ్ళి డిష్యుం అంటే డిష్యుం అన్నావనుకో ఏమైంది? ప్రతిబంధకము పెరిగిందా? తగ్గిందా?

(ఇప్పటివరకూ ఊరికనే స్పందిస్తున్నది ఇట్లా) మనస్సు. ( ఆ మాట అంటే ఊరుకున్నా మనస్సు స్పందిస్తుంది) కాబట్టి ఇప్పుడు మనస్సుకి సాక్షిగా వుండాలి. బయటికి సాక్షిగా వుంటున్నావు. నీ అంతరంగానికి నువ్వు సాక్షిగా వుండాలి. అంటే నీ అంతరంగంలో స్పందన కలుగుతోంది కదా! దానిని గమనించు. దానికి వేదాంత వాక్యం చెప్పు. బుర్ర, బుద్ధి వుందా నీకేమైనా? ఎందుకు స్పందిస్తు్న్నావు? మళ్ళా దేహాత్మభావంలోకి ఎందుకు పోతున్నావు? అహంకారంలోకి ఎందుకుపోతున్నావు? నేను ఆత్మస్వరూపుడినై వుండగా మళ్ళా నువ్వు పాత పద్ధతిలో ఎందుకు స్పందిస్తున్నావు? అని మనసుకి బుద్ధి చెప్పావా? ఎప్పుడైనా? చెప్పాలన్నమాట. ఎప్పుడు చెప్తావు? గమనిస్తే చెప్తావు. ముందు గమనింపు వుండాలి. తరువాత ఆత్మ విచారణలో బలం వుండాలి. గురువు మీద విశ్వాసము వుండాలి. ఈ మూడూ కలిస్తేనే గాని, నీ అంతరంగానికి చెప్పలేవు. అర్థమైందా? (తరువాత)

(హృదయము నందుగల అహం స్వరూపానుసంధానం .... భగవంతుడుండుట చేతను...సంకల్ప మాత్ర... తలంపు మాత్రమే బంధమని మొదల... తలంపు రూపమనస్సులతని యందే నిలిపి, ఎప్పుడూ అతనిని మరువక ... సాధనము. ఇదే... సిద్ధాంతము)

            అదీ సంగతి. శ్రేష్ఠమైన సాధన ఏమిటయ్యా? అంటే, నేను అనే తలంపు, అహం వుంది కదా! అహం వృత్తి. అది ఆకార భావం ధరించకముందు దైవంగా వుంది. ఆకార భావం ధరించగానే జీవుడు అయ్యింది. కాబట్టి నీ అంతరంగ రూపంలోకి మారక ముందు, నీ జ్ఞాపకాల రూపంలోకి మారక ముందు, ఆలోచనల రూపంలోకి మారక ముందు, దానిని ఆశ్రయించి, గమనించి, ఆ స్థితిలో వుండే ప్రయత్నం చేస్తే, అది జీవితం మొత్తానికి ఉపయోగపడి, జ్ఞానానుభవాన్ని కలిగించి, నీకు ఉత్తమమైన సాధనగా పరిణమించి, సరైనటువంటి జ్ఞానానుభవాన్ని ఇస్తుంది. కాబట్టి ఇట్టి శ్రేష్ఠమైనటువంటి సాధనని చేయి. మిగిలినటువంటి సాధనలు ఏమిటి? అవి కూడా సాధనలే. కానీ, ఇట్లాంటి ఫలితాన్ని ఇవ్వవు.

            (ప్రశ్న. విచారణము స్థూల దేహము నందుగల ఆత్మభావము మాత్రం ... సాక్షిత్వ సాధనమా...)

అంటే అర్థం ఏమిటి? ఈ ఆత్మవిచారణ చేశాము, కేవలము స్థూలంగా వున్నటువంటిదే పోతుందా? నాకు స్థూలం మీద ఆకర్షణా, భావన వుందండి, అది మాత్రమే పోతుందా? ఇంకేమన్నా ప్రయోజనం వుందా అని అడుగుతున్నారు.

            (సూక్ష్మ, కారణ దేహమునందు గల ఆత్మభావము కూడా నిరసించ సాధ్యమా?....)

కేవలము స్థూల దేహము వరకే పరిమితమా ఈ ఆత్మవిచారణ? దీనిపై అవతల సూక్ష్మదేహం, కారణ దేహం కూడా వున్నాయి కదా! ఈ ఆత్మవిచారణ అక్కడ కూడా పనికి వస్తుందా? సందేహం అన్నమాట. (సమాధానం)

            (స్థూలదేహమును బట్టియే ఇతర దేహములు జీవించి యుండుట ...) ఆగు సరిగ్గా చదువు. (స్థూల దేహమును బట్టియే...) ఆ..
ఈ స్థూల దేహాన్ని ఆశ్రయించే, ఆ సూక్ష్మ దేహము వుంది. ఆ సూక్ష్మదేహాన్ని ఆశ్రయించే కారణ దేహము వుంది. కాబట్టి అవి దేని వలన ఉనికిని కలిగి వున్నాయి? దీనిని (స్థూలదేహన్ని)  బట్టే ఉనికిని కలిగివున్నాయి. కదా! కాబట్టి దీనికి పనికి వచ్చింది, వాటికి పనికిరాదా? ఇప్పుడు? పనికి వస్తుంది అని కదా! చెబుతున్నాడు. చూడండి. ఎట్లా చెబుతున్నాడో.

            (నేను... పంచకోశరూప శరీర త్రయమయ్యి... స్థూల దేహమందుగల ఆత్మభావ నాశమే...ఇతర దేహములనందు ఆత్మభావ నాశము అగుట చేతను, విచారణ మూడు శరీరములలో గల ఆత్మభావమును పోగొట్టుటకు..కారణమగుచున్నది)

            కాబట్టి ఆత్మవిచారణ అనేది మూడు దేహముల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి, సాక్షిత్వాన్ని తెలుసుకోవడానికి, వాటని పోగొట్టడానికి ఉపయోగపడుతోంది. కాబట్టి ఇప్పుడు చేసేది, ఇక్కడి వరకే అనుకోమాకు. ఇది కలలో ఉపయోగపడుతుంది. గాఢనిద్రావస్థలోకూడా ఉపయోగపడుతుంది. (అయిపోయిందా అక్కడికి ఆ సమాధానం?)

ఓం ఓం ఓం
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం తత్‌ సత్
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మావిద్వషావహై

ఓం శాంతిః శాంతిః శాంతిః