File No.14



కాబట్టి వేరే మార్గంలేదు. స్వరూప జ్ఞానాన్ని సాధించవల్సిందే. ముక్తి కావాలి అంటే నువ్వు ఏదై వున్నావో, నీకు తెలియ వల్సిందే. అదే తెలిస్తేనే కానీ విదేహముక్తి వరకూ కూడా సాధ్యమౌతుంది. అది లేకపోతే ముక్తి అనేది సాధ్యం కాదు. ఎందువల్ల? ఎక్కడెక్కడైతే శరీర భావన కలుగుతోందో, అక్కడ దుఃఖం కలుగుతోంది కాబట్టి, దుఃఖం పోవాలి అంటే, నువ్వు ఏదై వున్నావో తెలుసుకుని వుండాలి. నువ్వు ఈ శరీరంలో తాత్కాలికంగా వుండడానికి, నువ్వు ఈ శరీరాన్ని పనిముట్టుగా ఉపయోగించడానికి, వచ్చావు గాని, శరీరం నువ్వు కాదు, అనే సత్యాన్ని తెలుసుకుని, శరీరంలో ప్రవర్తించాలి. కాబట్టి అప్పుడు నీకు, శరీరం పనిముట్టు అవుతుంది, ఇంద్రియాలు పనిముట్లు అవుతాయి, ఇంద్రియ విషయాలు పనిముట్లు అవుతాయి. ఇప్పుడు ఏవైతే అన్నీ ప్రత్యేకం అని అనుకుంటున్నావో, ఆ ప్రత్యేకం అన్నీ కూడాను, సామన్యమే కానీ ఇంద్రియాలే చేస్తున్నాయి కానీ, నేను చేయడం లేదు. మాట్లాడుతున్నది. నోరు మాట్లాడుతున్నది. నేను మాట్లాడడం లేదు. నేను మౌనంగానే వున్నాను. నోరు మాట్లాడుతున్నది.

            స్వరూపస్థితి తెలిసినవాడికి ఏమౌతుందంటే, మాట్లాడుతున్నప్పుడు నేను మౌనంగా వున్నది అని తెలుస్తుంది. అంటే ఏక కాలంలో ఇప్పుడు ఏమైంది? లోపల వున్న సాక్షి మౌనంగా వున్నది. బయట వున్నటువంటి పనిముట్టు పనిచేస్తూ వున్నది. కాబట్టి ఈ రెండు భావములే వుంటాయి అక్కడిక. భోజనం చేసింది, నేను సాక్షిని అనేది ఎప్పుడూ మౌనమే, ఏం చేయదు. భోజనం చేసిందా? సాక్షి ఏమీ భోజనం చేయలేదు. సాక్షి కేవలం సాక్షిగానే వున్నది. బయట వున్నటువంటి ఇంద్రియాలు భోజనం చేసినాయి. లేదూ ఒక పెద్ద బిల్డింగ్‌ కట్టారు, ఎవరు కట్టారు? ఎవరు కట్టిచ్చారు? ఇంద్రియాలు కట్టినాయి. ఇంద్రియాలు కట్టించినాయి. సాక్షి కట్టనూ లేదు, కట్టించనూ లేదు. కాబట్టి సాక్షి అనేది దేనికి కర్తగా లేదు. నేను అనే సాక్షి ఏదైతే స్వరూపంలో వున్నదో, అది దేనికీ కర్తగా లేదు. నేను కర్తగా లేనప్పుడు నేను అనుభవించేవాడిగా వున్నానా? భోక్తగావుంటానా? వుండే అవకాశం లేదు. ఎలాగ ఇది సాధ్యం. ఎలా సాధ్యం అంటే, ఈ అనంత సృష్టికి కూడా పరమాత్మ కర్త అని అనుకున్నారు అనుకోండి. కాబట్టి, ఈ సృష్టిలో వున్నటువంటి అన్ని దుఃఖాలు పరమాత్మ అనుభవిస్తున్నాడా మరి? అనుభవించడం లేదుగా. ఈ దుఃఖాలు ఆయనకు చెందడం లేదు కదా! ఎవరివి వాళ్ళే అనుభవిస్తున్నారు కదా! మనం కర్మలు అనుభవిస్తున్నాము కదా! పరమాత్మ దుఃఖాలను అనుభవిస్తూ వుంటే, నీవు ఎందుకు దుఃఖపడుతున్నావు? కాబట్టి పరమాత్మ కర్తగా వున్నాడా? లేడు కదా! మరి ఎలా వున్నాడు? సృష్టికి సాక్షిగా వున్నాడు కదా! మరి. సాక్షిగా వుండబట్టే కదా, ఈ సృష్టి అంతా కూడా వ్యాపించ గలిగాడు. నీలాగ కర్తగా కనుక వుంటే ఆయన కూడా పరిమితంగానే వుండే వాడు కదా! కాబట్టి దివ్యత్వము అంటే ఏమిటి? వ్యాపకత్వమే దివ్యత్వము. ఎందుకని? సర్వవ్యాపకంగా వుంటేనే తప్ప, సాక్షిత్వము సాధ్యం కాదు. కాబట్టి, సర్వవ్యాపకత్వము, సర్వాధారంగా వుంటుంది. సాక్షిత్వము కూడా సర్వాధారంగా వుంటుంది. కానీ, ఏక కాలంలో అది ఎట్లా వున్నది? నిరాధారంగా కూడా వున్నది. అంటే, శరీరము వున్నంత వరికే సాక్షి వున్నది అని చెపుదామా? సాక్షి ఎప్పుడూ వుంటుంది కదా! ఎందుకని? ఒక ఇంద్రియము పని చేసినా, ఒక ఇంద్రియము పనిచేయకపోయినా, ఇంద్రియాలు అన్నీ కట్టకట్టుకుని, మూటకట్టుకుని నిద్రలో మూలనపడ్డా, సాక్షి ఎప్పుడూ వుంటాడు. మరి మూడు అవస్థలలోనూ సాక్షి ఎప్పుడూ వుంటోంది. కానీ కొన్ని మాత్రం పని చేస్తున్నాయి, కొన్ని విశ్రాంతి తీసుకుంటున్నాయి. కొన్ని అసలు పనిచేయడం లేదు. ఇంద్రియాలలో తర తమ భేదంగా వున్నాయి. మరి ఇంద్రియాలలోనే తరతమ భేదంగా వున్నప్పుడు, విషయాలలో కూడా తరతమభేదంగా వుంటావు కదా! విషయాలలో తరతమ భేదంగా వున్నప్పుడు, పనులలో కూడా తరతమ భేదంగా వుంటావు కదా! పనులలో తరతమ భేదంగా వున్నప్పుడు, ఫలితాలలో కూడా తరతమ భేదంగా వుంటావు కదా! మరి ఫలితాలను అనుభవించేటప్పుడు ఏమయ్యావు? ఇంకా తరతమభేదంగా అయ్యావు. ఇలా ఎప్పుడైతే, నీ స్వరూపస్థితిని మరచిపోయావో, ఒక్కడుగా సాక్షిగా వుండవలసినటువంటి వాడవు, అనేకం అయిపోయావు. కాబట్టి నీకు ఏ ఆలోచన కలిగినా, ఏ భావన కలిగినా, ఇది చెయ్యాలా? ఇది చెయ్యొద్దా? రెండూ ఆలోచనలేగా. వెళ్ళాలా వెళ్ళొద్దా? రెండూ ఆలోచనలే కదా! ఏమన్నా ప్రత్యేకత వుందా? ఒక్కొక్కప్పుడు వెళ్తే ప్రత్యేకత అంటున్నావు, ఒక్కొక్కప్పుడు వెళ్ళకపోతే ప్రత్యేకత అంటున్నావు. సత్యనారాయణ వ్రతం వెళితే ప్రత్యేకత. అంతే కదండీ! మళ్ళా అలాగే ఇంటికి తిరిగి వచ్చావా లేదా? తిరిగి వచ్చావు. ప్రసాదము పట్టుకొచ్చావు, పదిమందికి పంచిపెట్టావు. అంతేనా కాదా? అదే ఒకరి ఇంట్లో చనిపోయారు, చనిపోతే వెళ్ళావు, వెళితే ఏమిటట? మళ్ళా వెళితే సరాసరి మీ ఇంటికే వెళ్ళాలట కానీ, ఇంకొకళ్ళ ఇంటికి పోకూడదు. అర్థముందా ఏమైనా? అక్కడా పెట్టేది ప్రసాదమేగా. అక్కడా నువ్వు ఏం చెబుతున్నావు? పితృదేవతలు అనే అంటున్నావుగా. దివ్యత్వమే అని అంటున్నావుగా. స్థితి భేదమే కదా మార్పు. ఏమన్నా తేడా వుందా? ఏమీ తేడా లేదు కదా! (కానీ అవతలి వాళ్ళకు అది ఇష్టం వుండదు కాబట్టి..) అంటే ఏమైంది ఇప్పుడు? పరిమితం అయిపోయావుగా. అంటే ఏం చేస్తున్నావు? నీ యొక్క అనేకత్వం అంతా కూడా, తరతమ భేదం అంతా ఎందులో వున్నదట ఇప్పుడు? ఏదో ఒక వాసన చేత ముడిపడినప్పుడు, అది తరతమ భేదంగా మారిపోయింది. లోకవాసనకి ముడిపడింది. ముడిపడేప్పటికి ఏమైంది? తరతమ భేదం వచ్చేసింది. ఇది శుభం, అది అశుభం.

            సాక్షిత్వ స్థితిలోనుంచి చూస్తే, ఏది శుభం? ఏది అశుభం? అజ్ఞానం అశుభం, జ్ఞానం శుభం. ఇంక అంతకు మించి అక్కడ ఏమీ లేదు. వాళ్ళు పెట్టినప్పుడు కూడా, సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, ఇట్లా ఆలోచించే పెట్టారు. కానీ, కాలక్రమేణా బుద్ధి మాంద్యం ఆవరించి, అంతదూరం విచారణ చేసే సామర్థ్యం లేక, దానిని తెలుసుకోగలిగే సామర్థ్యం లేక, బుద్ధి వికాసము లేక, బాహ్యమైనటువంటి, సాంప్రదాయకంగా దానిని... సాంప్రదాయకం అనే దాంట్లోనే వుంది అసలు. దాయకముఅంటే ఇచ్చేది. సంప్రతఅనేది వుంది కదా! సంప్రతఅంటే అర్థం ఏమిటి? ‘సంప్రతతేనామా...అంటున్నావు కదా! ప్రతిలేకుండా, అంటే వ్యతిరేకం లేకుండా, ‘సం’- పూర్తిగా, వేదం ఏదైతే చెబుతోందో దానిని అనుసరించి, పూర్తిగా దాని ఆశ్రయం పొందితే నీకు అనుగ్రహం కలిగేది అని అర్థం. సాంప్రదాయం అంటే అర్థం అది.

మరి దానిని ఇప్పుడు ఏం చేశాము మనం? సాంతం దేహం స్థితిలోకి వచ్చి కూర్చొని మనం, దేహం ద్వారా దానిని చూడడం మొదలుపెట్టి, దేహాభిమానంతో దానిని మనం పరిశీలించి, ఆ దేహాభిమానంతోనే ఆచరించి, ఈ దేహాభిమానాన్ని వెళ్లి దానికి తగిలించి, వున్న కొంచెం జ్ఞానాన్ని కూడా మరచిపోయి, అజ్ఞానమే సత్యంగా జీవిస్తున్నావు. అందువల్ల ఏమైంది? అన్ని అశుభాలు, శుభాలు అయినాయి. అన్ని శుభాలు కాస్తా మరచిపోయావు. అసలు శుభం అంటే ఏమిటది? మరుపుకు వెళ్ళిపోయింది. అశుభాలలోనే మళ్ళా శుభాశుభాలు పెరిగిపోయినాయి. రెండూ అజ్ఞానమే. దేహభ్రాంతితో చూస్తే, రెండూ అజ్ఞానమే. ఏం తేడా వుంది? రెండిట్లో ఏనుగుబొమ్మతో ఆడితేనేమో ఆట, పిల్లిబొమ్మతో ఆడితేనేమో ఆట కాకుండా పోయిందా? రెండూ బొమ్మలేగా. కాదా! రెండూ బొమ్మలే. రెండూ ఆటలే. రెండిట్లో ఆనందిస్తున్నావుగా. రెండిట్లో అజ్ఞానమే. కాబట్టి, లౌకికం లోకం చెప్పింది, లోకం ఇట్లా చెబుతోంది కదా! లోకం అలా చెబుతోంది కదా! అన్నావే అనుకో! ఏమైయ్యావు అప్పుడు? లోకవాసన చేత బంధితుడవి అయినావు. అప్పుడు స్వరూప స్థితిలో లేవుగా. అర్థమైందా! కాబట్టి, లోకం ఏం చెబుతోంది? ఒక రెండు డజన్లు, మూడు డజన్లు, నాలుగు డజన్లు, ఐదు డజన్లు నువ్వు వస్త్రాలను అన్నీ కలిగి వుండాలి. బీరువాలను కలిగి వుండాలి. మరీ బండమీద బట్ట, ఒంటి మీద బట్ట వుంటే ఎలా కుదురుతుంది? లోకం ఒప్పుకుంటుందా? లోకం నన్ను చూసి ఏమనుకుంటుంది? అన్నావే అనుకో! అప్పుడు దేని చేత బంధితుడవి అయినావు? లోకవాసన చేత. అవును కదా! కాబట్టి ఎవరైతే, నేను ఎవరని ప్రశ్నించుకోమని చెబుతున్న భగవాన్‌ రమణులు, ఆయన ఏక వస్త్రధారి, కేవలం అంగవస్త్రం, ఆ గోచి ఒక్కటే ధరించేవారు. ఆయన ఆయన వస్త్రాలు ఆయనే ఉతుక్కునే వారు. ఇంక సమస్యేముంది? బరువేముంది? ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇప్పుడు ఆయన ఎందువల్ల అనుకున్నాడు అట్లాగ? అసలు దేహమే మొదటి వస్త్రము. స్వరూప స్థితి నుంచి చూస్తే, సాక్షి ధరించినటువంటి మొదటి వస్త్రం ఏమిటి? దేహం. అందులోనే అనేకం ఏడ్చినాయి. అవన్నీ వస్త్రాలేగా. ఇప్పుడు ఏం చేయాలట మనం? వస్త్రం మీద వస్త్రం, వస్త్రం మీద వస్త్రం, వస్త్రం మీద వస్త్రం పంచకోశాలు వస్త్రాలు కావా? అప్పటికే ఐదు వస్త్రాలు అయినాయా? ఒక కోశం మీద మరొక కోశం, ముందు ఆనందమయ కోశంలోకి దిగావు కదా! స్వరూప స్థితినుంచి, ఒక కోశం కప్పింది. దాని నుంచి ఏం చేశావు? విజ్ఞానమయ కోశంలోకి దిగావు. అది ఇంకొక వస్త్రం కప్పింది. ఇంకొక కోశం లోకి దిగావు. ప్రాణమయం. అదీ కప్పింది. మనోమయం. ప్రాణమయం. అన్నమయం. ఐదు వస్త్రాలు అక్కడ కప్పావుగా. ఒక్క శరీరం పేరుతో, ఇప్పుడు దాని మీద ఏం చేశావు మళ్ళా? మళ్ళా ఒకటి కప్పావు. ఏమంటివి? చాలా గొప్ప అంటివి. అర్థం వుందా? గొప్పకి అశుభానికి ఏమైనా? ఈ పైన కప్పిన ఐదు పీకేసి, అశుభం అంటివి. అర్థం వుందా ఏమైనా? కాబట్టి దేహభ్రాంతితో, పరిమితత్వభావంతో చూసి నిర్ణయం చేసేటటువంటివి అన్నీ కూడాను, ఎప్పటికీ సత్యం కావు. అవన్నీ అశాశ్వతములు. తాత్కాలికములు. లోకము అంటున్నావా? ఆ లోకంలో అట్లా లేదు అది. నువ్వే నీ దేహాభిమానం అనేటటువంటి అజ్ఞానంతో దానిని అట్లా తయారు చేశావు. దానికి పేరు లోకము, లౌకికము అని పేరు పెట్టావు. కాబట్టి నీవు ధర్మం నిమిత్తము జీవిస్తున్నావా? జ్ఞానం నిమిత్తము జీవిస్తున్నావా? లోకం నిమిత్తము జీవిస్తున్నావా? లోకం అడిగింది అని శరీరంలోకి వచ్చావా? రాలేదుగా. లోకం అడిగింది అని శరీరం విడిచిపెడుతున్నావా? లేదు కదా! మరి, లోక నిమిత్తము ఏమిటి చేస్తున్నావు?

            అజ్ఞానావృతమైనటువంటివి అన్నీ, నీ అజ్ఞానమంతా, తీసుకెళ్ళి, లోక నిమిత్తము అని పెట్టావు. మన చుట్టూ ప్రపంచము వుంది కదండీ! ఆ ప్రపంచము ఒప్పకోవాలి కదండి? ఈ సమాజం ఒప్పుకోవాలి కదండీ! అంటున్నావే, నీ మూలంలో ఒక్కసారి విచారణ చేసి చూడు, నీ నిద్రలో ఎక్కడుంది ఆ లోకం? లేదు. నీ కలలో ఎక్కడుంది ఆ లోకం? లేదు. రెండు అవస్థలలో లేనే లేదు. దాని అవతల సాక్షి అంటావా? దాని దగ్గర అస్సలు లేదు. మరి ఎప్పుడు వుందయ్యా? నువ్వు మెలకువలో కాసేపు ఆ ఇంద్రియంతో, గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే వున్నది. ఈ అనంత సృష్టిలో, 84 లక్షల జీవరాశులలో, ఏది నీ లోకం? మానవులే అందాము. 643 కోట్ల మానవులలో, నీవు నీలోకం ఇప్పుడు ఎంత? నువ్వు గుర్తించే లోకం ఎంత? ఒక గుప్పెడు వుంటుందా? ఒక పది మంది వుంటారా? ఓ యాభైమంది వుంటారా? అంటే ఏమిటి? నువ్వు గుర్తించేవాళ్ళు, నిన్ను గుర్తించేవాళ్ళు, ఇదేగా నీ లోకం? ఈ గుర్తింపు అసలు ఎంతసేపు వుంది? ఒక దిక్కుకు చూస్తే, ఒక దిక్కు లేదు. ఒకడిని చూస్తే, ఒకడు లేడు. అంటే, నీవు కొంత మందిని tick పెట్టుకున్నావు. నీ అజ్ఞానం మేరకు ఎవడు సరిపడతాడో, ఆ అజ్ఞానాన్ని ఎవడు మెచ్చుకుంటాడో, అబ్బా! నువ్వు చాలా గొప్ప అండీ! అనే వాడు ఎవడైతే వున్నాడో, వాడి దృష్ట్యా, ఈ అజ్ఞానాన్ని తీసుకు వెళ్ళి వాడికి పెట్టి, వాడి అజ్ఞానం, నీ అజ్ఞానం రెండూ జోగి, జోగి రాసుకుంటే బూడిద రాలిందనట్టుగా, చివరకి అజ్ఞానమే మిగిలిందని, ఏం చేశాము? దానినే ఒప్పుకుని దానినే జీవితమంతా దాన్ని పుచ్చుకుని తిరిగాం. అర్థముందా ఏమైనా? కొంచెం వివేకంతో ఆలోచించి చూస్తే, ఎంత అజ్ఞానంగా కనబడుతుంది అది? జీవితం అసలు మనం దేనికోసం జీవిస్తున్నాము? మనం అనే ఆలోకం ఎంతమంది వున్నారు? మహా అయితే ఐదుగురు వుంటారు, పది మంది వుంటారు. నీ జీవితం మొత్తం మీద ఎంతమంది వ్యక్తులతోటి ప్రవర్తించి వుంటావు? కొన్ని వందలు, వేల మంది. మరి ఈ వందలు, వేల మంది నిన్ను ఎవడూ పట్టించుకోలేదే? ఎందుకని? వాళ్ళకు తెలుసు, సాక్షిగా వుండడం ఎట్లాగో, నీతో నిమిత్తంగా ఎంతమేరకో, అంతమేరకే, బ్రాహ్మణుడు వచ్చాడండీ! ఏవండీ వీళ్ళకు వస్త్రాలు పెట్టాలండి అన్నారు. నువ్వు పట్టు వస్త్రం తెచ్చినా, అదే మంత్రమే. తుండు గుడ్డ పెట్టినా అదే మంత్రమే. ఏమన్నా తేడా వుందా? ఏమి వేరే మంత్రం చెప్పలేదుగా. కాబట్టి భావంలో ఏమన్నా భేదం వుందా? లేదు. కానీ పెట్టే వారు మాత్రం ఏ దృష్టితో పెట్టారు? వారు లక్ష్మీ నారయణులు, పెట్టేవాడు లక్ష్మీ నారాయణుడు, పుచ్చుకునే వాళ్ళు లక్ష్మీ నారాయణులు, అనే భావంతో చూచినప్పుడు, అసలు నువ్వు ఏం పెట్టావు అనే దానికి ఏమన్నా ప్రాధాన్యత వచ్చిందా? రాలేదు కదా! కానీ ప్రతి సంఘటనలో చూడండి. ఏం కనబడుతాయి? ఇలాగ, తరతమ భేదంతో అజ్ఞానంగా జీవించడానికి అభ్యాసంచేసి, అలవాటు పడి, ఆ తరతమ భేదాన్ని గుర్తించే వారిలో, మరలా నీ అజ్ఞానాన్ని పొగిడేవాడిని దృష్టిలో పెట్టుకుని, ఈ లోకం హర్షిందు కదా! అంటున్నావు. ఎప్పుడు హర్షిందు? ధర్మానికి గ్లాని కలిగినప్పుడు హర్షించదు. నువ్వు అధర్మాన్ని కనుక ఆచరిస్తే, అప్పుడు వీడు వాడు అని లేదు, నిన్ను గుర్తించేవాడు, నన్ను గుర్తించేవాడుతో పని లేదు. ప్రపంచం అంతా నిరసిస్తుంది అప్పుడు. ఆ సమాచారం ఎవరికి తెలిస్తే, వాళ్ళు అందరూ నిరసిస్తారు. ఎందుకని? అది అధర్మం కాబట్టి. కానీ మనం చెప్పేది ఈ లౌకికం ఏదైతే వుందో, ఈ లౌకికం అసలు ఎంతమందికి సంబంధించింది? నీ కుటుంబంలోనే కాసేపు ఒప్పుకుంటే, కాసేపు ఒప్పుకోడు. నువ్వే కాసేపు ఒప్పుకుంటే, కాసేపు ఒప్పుకోవు. మరి ఇప్పుడు ఏమైంది? ఇంతకంటే గాఢ తమోగుణం అయిన అజ్ఞానము వుందా? లేదు కదా! మరి ఇప్పుడు మన జీవితం అంతా దేనిని ఆధారం చేసుకుని జీవించాము? ఈ లౌకికాన్నేనా? బుద్ధి వికాసం అంతా ఈ లౌకికం కోసమే కదా! వెచ్చించడం అంతా? వాడేమి అంటాడో, వీడేమి అంటాడో, వాడు లేడు, వీడు లేడని సత్యం తెలుసుకున్నప్పుడు, స్వరూప స్థితినుంచి చూసినప్పుడు, వాడున్నాడా? వీడున్నాడా? వాడు లేడు, వీడు లేడు. ఎవరున్నారు? సాక్షి ఒక్కడే వున్నాడు. వుంటే వాడే వున్నాడు. ఇంకెవ్వరూ లేరు. ఎందుకని? మూడు అవస్థలకి లొంగకుండా, మూడుగుణాలకి లొంగుకుండా, పంచకోశాలకి లొంగకుండా, ఇవన్నీ పైపైన మెరుగులు, పైపైన ఆవరణలు, పైపైన వస్త్రములు లాంటివి అనే సత్యము ఎవడైతే తెలుసుకున్నాడో, అప్పుడు ఏమైంది వాడికి? అప్పుడు వాడిని బాధించే వాడు ఎవడు? మాటలు అంటున్నామండి. ఆ మాటలు అంటున్నది దేనిని? అయితే అన్నమయ్యకోశాన్ని, కాదు ప్రాణమయకోశాన్ని, అదీ కాదు, మనోమయ కోశాన్ని. అంతకు మించి అవతల ఏమన్నా అనగలడా? లేదు కదా! మరి, ఆ కోశములు ఈ కోశములను విమర్శించినాయట. ఈ కోశములు దాని గురించి బాధపడ్డాయట. అర్థం వుందటండీ! ఏమైనా?

నువ్వు ధరించిన వస్త్రం, నేను ధరించిన వస్త్రాన్ని విమర్శించిదట. వస్త్రం వస్త్రాన్ని విమర్శిస్తే, వస్త్రానికి దుఃఖం కలిగిందట. అర్థం వుందా ఏమైనా? స్వరూప స్థితినుంచి చూచినప్పుడు ఇట్లా చూస్తాడన్నమాట. ఇప్పుడు ఏమైంది? ఓహో! అలాగా? అంటాడు అంతే! ఎందుకని? వస్త్రం వస్త్రాన్ని విమర్శించడం ఏమిటి? పెద్ద భ్రాంతి కదా! అది. నువ్వు ధరించిందే శరీరం ఒక పెద్ద వస్త్రం. నేను ధరించిన శరీరం, అంతకంటే పెద్ద వస్త్రం. ఇప్పుడు ఆ శరీరం ఈ శరీరాన్ని విమర్శించింది అంతేనా జరిగింది? ఏమిటట అయితే ఇప్పుడు? ఆ జడవస్తువు, ఈ జడవస్తువును విమర్శించే శక్తిని కలిగివుందా? అథవా అజ్ఞానం చేత ఆ పని అది చేసిందే అనుకో, నీ జ్ఞానం ఏమైంది? నీవు ఎట్లా ఆలోచించాలి? నువ్వు స్వరూప స్థితిలో వుండి కదా! చూడవలసింది. నువ్వు సాక్షిత్వంలో వుండి కదా! చూడవలసింది. అప్పుడేమయ్యింది? ఓహో! జడ చేతన విమర్శ తెలియక అజ్ఞానంచేత మాట్లాడుతున్నావు. చైతన్యం దేనినైనా విమర్శిస్తోందా? లేదు. మరి ఆ చైతన్యానికి మూల స్థానం అయినటువంటి స్వరూప స్థానం నేను కదా! స్వరూపజ్ఞానం నేను కదా! నేనే ఆ చైతన్యానికి మూలం కదా! మరి నేను కర్తను కాదు, భోక్తనూ కాదు కదా! నేను ఆత్మస్వరూపుడను కదా! ఇంద్రియాలే కర్తలు. ఇంద్రియాలే భోక్తలు. ఎందుకని? ఇంద్రియాలే ప్రేరేపణలకి లొంగుతున్నాయి. ఇంద్రియాలే పనులు చేస్తున్నాయి. ఇంద్రియాలే ఫలితాలను అనుభవిస్తున్నాయి. అంతేకదా!
.
            వేడివేడిగా మిరపకాయ బజ్జీలు తినాలి అని కోరిక ఎవరికి కలిగింది? సాక్షికి కలిగిందా? ఇంద్రియాలకా? ఇంద్రియాలకు. తిన్నాయా లేదా? తిన్నాయి. సుఖం ఎవరికి కలిగింది? ఇంద్రియాలకే. నేను ఎవరిని? నేను సాక్షిని.

            ఎప్పుడైతే సాక్షిత్వ స్థితిలో వున్నావో, అప్పుడు నీ ఇంద్రియాలు కోరిన కోర్కెలను నువ్వు ఇప్పుడు ఎలా చూశావు? నిమిత్రమాత్రంగా చూడలేదా? అప్పుడు ఆ కదలికను అసలు ఎవడు గుర్తించాడు? (కదలిక వున్నది కదా) కదిలిందండి. కదలికను మాత్రం ఎట్లా చూస్తాడు? ఓహో! దారి వెంబడి పోయే ఒక మనిషి ఎవడో వెళ్ళాడండి, దారి వెంబట. నువ్వు ఇప్పుడు ఆయన సమాచారం కనుక్కున్నావా? కనుక్కోలేదుగా. ఎందుకని? నాకు అవసరం లేదు కాబట్టి. ఇంద్రియాలలో ఏవో కదలికలు కదులుతూ వుంటాయి. కదలటం దాని ధర్మం. కదిలింది. ఇప్పుడు నాకు ఏమైంది? నాకు ఏమీ అవ్వలేదుగా. నేను ఏమీ పట్టించుకోలేదుగా. అవి కోరుతూ వుంటాయి. అందుకోసమే వచ్చాయి అవి. కోరని. నాకేం పని? అని ఉపేక్షించి చూడగలుగుతాడు. ఎప్పుడైతే ఉపేక్షించి చూశావో, అప్పుడు నీ ఇంద్రియాలు ఎంతసేపు పోరాడుతాయి నీతో? ఎందుకని? నీ అనుమతి లేకుండా వాటికి జీవితం లేదు. నీ అనుమతి లేకుండా వాటిలో  కదలికలు ఏమీ ఫలించవు. నీ అనుమతి లేకుండా వాటిలో కలిగే చలనములకు ఏమీ ఫలితాలు రావు. (అనుమతి అంటే ఏది అనుమతి ఇస్తు్ంది? మనసా?) అంటే ఏమిటి అసలు ఆ స్థితిలో నువ్వు వున్నావు. కానీ, ఇప్పడు అసలు సాక్షి అసలు దేనినైనా అనుమతి ఇస్తున్నాదా? అనుమతించడం లేదు కదా! ఎందుకని? అనుమతిస్తే అది స్వీకరించాలి కదా! కర్తగా వుంటేనే అనుమతిస్తు్ంది. కర్తగా వుంటే అది స్వీకరించాలి కదా! ఎప్పుడైతే, సాక్షిత్వము కర్త కాదో, అప్పుడది అనుమతించే పని వుందా దానికి? అనుమతించే పనికూడా లేదు. అనుమతించే పనిలేనప్పుడు స్వీకరించే పని వుందా? అదీ లేదు. మరి ఏమైంది ఇప్పుడు? నేను నేనుగా వున్నాను అంతే! స్వరూప స్థితిలో. ఇప్పుడు దుఃఖం వుందా? లేదు కదా! ఇంద్రియాల స్థితిలోనూ లేదు. ఇది లక్ష్యం. ముక్తి అంటే, ఇదిగో ముక్తిని వర్ణిస్తున్నాడు. ముక్తి అంటే ఎలా వుంటుంది? నీకు అంతరంగంలో ఆ ముక్తి స్థితిని ఎట్లా అనుభవిస్తావు? అంటే ఇట్లా అనుభవిస్తావు నాయనా! జనన మరణాలు కూడా విషయాలే. జనన మరణాలు కూడా ఇంద్రియాలకు సంబంధించినవే. జనన మరణాలు కూడా ప్రకృతిలో ఏర్పడుతున్న కదలికలే. కాబట్టి సాక్షి ఏ కదలికా లేని వాడు కదా! మరి జనన మరణాలు వున్నాయా? లేవు కదా! జనన మరణాలే లేనప్పుడు, ఈ మధ్యలో వచ్చిపోయేటటువంటి కనురెప్పపాటు మాత్రమే వుండేటటువంటి, ఇంద్రియాల యొక్క కదలికలు, వాటి యొక్క ప్రేరేపణలు, ఇంతదూరం ఎవడు చూశాడు ఇప్పుడు? ఏమన్నా అవసరమా?

            ఆకాశంలో ప్రకాశమానంగా వెలుగుతున్న సూర్యుడికి, ఒకపొలంలో పంట పండింది, ఒక పొలంలో కరువు వచ్చింది అనే దానితో ఏమైనా పని వుందా? ఆ సూర్యుడు లేకుండా ఈయన పంటపండించాడా? ఆ సూర్యుడు లేకుండా ఈ కరువు వచ్చిందా?


            కానీ, ఈ కరువు వచ్చినా ఆ పంట పండినా, సూర్యుడు ఏమైనా పట్టించుకున్నాడా? (స్పందించలేదు) ఎందుకని? సాక్షి కాబట్టి. నీవు కూడా అలా వుండమనే కదా చెబుతున్నాడు, రోజూ వుదయిస్తూనే నీకు బోధిస్తున్నాడు, నా వలె వుండవయ్యా బాబు. అదేగా సంధ్యావందనం అంటే మరి. మరి రోజూ సంధ్యావందనం, జపం తిప్పుతావు, మంత్రం తిప్పుతావు, నీళ్ళు పోస్తావు, ఈ నీళ్ళు అందులో పోస్తావు, ఆ నీళ్ళు ఇందులో పోస్తావు, పైకీ కిందకి తిప్పుతావు, ఏదో ఆకాశంలోకి చూస్తావు, భూమిమీదకు చూస్తావు. నిజంగా సూర్యుడు బోధిస్తున్నది ఏమిటి? ఆ తిప్పే దాని యొక్క సారంశము ఏమిటి? తన వలె నిన్ను వుండమని చెబుతున్నాడు. నాతో పాటు లెగువు. నేను ఎలా వస్తు్న్నానో తెలుసుకో, ఈ సృష్టిలో నేను ఎట్లా వున్నాను? నీ శరీరంలో నువ్వు అట్లా వుండు. ఎప్పుడైతే శరీరంలో సాక్షిగా వున్నావో, అప్పుడు ఈ సృష్టి నిన్ను ఏం చేసింది? చేసే అవకాశం వుందా? లేదు కదా! ఎందుకని? సృష్టి పంచభూతాలతో ఏర్పడింది. శరీరం పంచభూతాలతో ఏర్పడింది. ఏమైనా జరిగితే, ఈ పంచభూతాల మధ్య, ఆ పాంచభౌతిక దేహం మధ్య, అనుకూల వ్యతిరేకాలు జరుగుతూ వున్నాయి కదలికలు. మార్పులు, చేర్పులు జరుగుతూ వున్నాయి. అది సృష్టి ధర్మం. పుట్టింది, పెరిగింది, వున్నది కొంతకాలం, కొంతకాలం తరువాత లేకుండా పోయింది. ఇవన్నీ మార్పులే కదా! ఈ మార్పులకి నువ్వు ఒక పేరు పెట్టుకున్నావు. ఏర్పడడాన్ని జననము అన్నావు. పెరగడాన్ని స్థితి అన్నావు. సృష్టి అన్నావు, స్థితి అన్నావు. మళ్ళా లేకుండా పోవడాన్ని లయం అన్నావు. ఈ పేరులన్నీ ఎవడు పెట్టుకున్నాడు? నువ్వే పెట్టుకున్నావు. దేని దృష్ట్యా పెట్టుకున్నావు? దేహం దృష్ట్యా పెట్టుకున్నావు. సాక్షి దృష్ట్యా? సృష్టి లేదు, స్థితి లేదు, లయం లేదు. మరి ఏమి వుంది? ఎల్లప్పుడూ అదే వుందయ్యా బాబు. సృష్టికి ముందు అదే వుంది. సృష్టి వచ్చినాక అదే వుంది. సృష్టి పోయినాక కూడా అదే వుంది.

మరి ఇప్పుడు ఈ సాక్షి ఎవడయ్యా? ఆ పరమాత్మే ఈ సాక్షి. కాబట్టి సాక్షిత్వాన్ని కనుక అనుభవానికి, నువ్వు నీ శరీరంలో తెచ్చుకోగలిగితే, అప్పుడు నీకు ఆత్మానుభవం కలిగింది. ఆ నేను ఎవడను అంటే? నేను ఆత్మస్వరూపుడను అని సహజంగా వుండగలుగుతున్నావు. అదే ఆత్మ స్వరూపభావనతో, సమిష్టిలో కూడా వున్నావు. అప్పుడు ఏమైంది? బ్రహ్మానుభవం కలిగింది. వ్యష్టి సాక్షిపేరు ఆత్మ అయితే, సమిష్టి సాక్షి పేరు బ్రహ్మ. పేరులో భేదమే కానీ, స్థితి భేదమే కానీ, సాధనా భేదం లేదు. కాబట్టి ఆ రకంగా, నీవు వుండే ప్రయత్నం చేయి. అప్పుడు ఏమైంది? వ్యష్టి దుఃఖము లేదు, సమిష్టి దుఃఖము లేదు. ఇక్కడైనా ఇంద్రియాలు, అక్కడ ఇంద్రియ అధిష్టాన దేవతలు. తేడా ఏముంది? ఇక్కడ ఇంద్రియాలు వున్నాయి. సమిష్టిలో ఇంద్రియ అధిష్టాన దేవతలు వున్నాయి. ఆ ఇంద్రియ అధిష్టాన దేవతల అనుగ్రహబలం చేత ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. మరి నేను ఎవరిని? నేను సాక్షిని. అక్కడ ఇంద్రియ అధిష్టాన దేవతలను నియమిస్తున్నాను సృష్టి నిమిత్తమై. ఇక్కడ ఇంద్రియాలను నియమిస్తున్నాను. పని నిమిత్తమై. జ్ఞానం నిమిత్తం. ఆ పని ఏమిటి? జ్ఞానం. నేను ఎవడను అని తెలుసుకునే పని నిమిత్తమై, ఈ ఇంద్రియాలను నియమిస్తూ వున్నాను. అక్కడా అంతే! సమిష్టిలో కూడా అంతే! మరి ఈ వ్యష్టికైనా, ఆ సమిష్టికైనా, ఎల్లప్పుడూ వండే ఆ స్థితిపేరు ఏమిటి? సాక్షి. అది దానికి శరీరం వుందా? లేదు. ఆశరీరం. మరి శరీరంలో వుంటూ, అశరీరిగా వుండాలి కదా! నువ్వు. అప్పుడు కదా! నీకు ఈ సాక్షిత్వము అవగాహన అయ్యేది? అనుభవం అయ్యేది? కాబట్టి నీ స్వరూప స్థితి ఏమిటయ్యా? శరీరంలో వుంటూ అశరీరగా వుండాలి. చేస్తూ చేయనివాడివి అవ్వాలి. వింటూ విననివాడివి అవ్వాలి. చూస్తూ చూడని వాడివి అవ్వాలి. తింటూ తినని వాడివి అవ్వాలి. కర్త లేకుండా పోవాలి. భోక్త లేకుండా పోవాలి. అదయ్యా బాబు! ఇది స్వరూప స్థితి అంటే. ఇది ముక్తి అంటే.

            ఇట్లా ఎవడైతే సహజంగా వున్నాడో, వాడికి విదేహముక్తి సాధ్యం అయ్యింది. ఎందుకని? శరీరంలో వుండగా ముక్తుడు. జీవన్ముక్తుడు. వీడికి కొంతకాలం తరువాత సమిష్ట్యానుభవం కలిగి, ఆ బ్రహ్మానుభవంతో, ఆ సమిష్టిని, ఈ వ్యష్టిని, రెండింటిలోనూ ముక్తుడు అయిపోయాడు. అది విదేహ ముక్తి. కాబట్టి ఆ విదేహ ముక్తి పర్యంతమూ కూడా, నీకు తోడుగా వున్నది ఏది ఇప్పుడు? నువ్వు ఏదైతే అయివున్నావో, ఆ స్వరూప స్థితే నీవు అయివున్నావు. మధ్యలో తెచ్చుకున్నవన్నీ, మధ్యలోనే పోయినాయి. మధ్యలో తెచ్చుకున్న వాటిలో మళ్ళా ఏం చేశావు? మళ్ళా ఆ తెచ్చుకున్నదానిని మళ్ళా అనేకం చేశావు. అనేకంలో ఏం చేశావు మళ్ళా? ఇంకా లెక్కలు, జమలు పెంచేశావు. ఇంకా ఏం చేశావు? పరిమితులు పెంచేశావు. మరింతగా పెంచేకొద్దీ ఏమైపోయావు? మరింత కుంచించుకు పోయావు. ఎంతగా పరిమితం అయిపోయావంటే ఇప్పుడు ఇక, ఇహ నిన్ను బయటకు లాగాలంటే సాధ్యం కానంతగా కూరుకుపోయావు.

            ఎందుకు కూరుకు పోయావని అంటున్నాడు?
            నువ్వు ఏదైతే అయివున్నావో, ఆ స్వరూప స్థితి అనే సాక్షిత్వాన్ని, ఎంతగా మరచిపోయావు అంటే, నిరంతరాయంగా గుర్తు చేసినా, గుర్తుకురానంతగా మరచిపోయావు. ఎందువల్ల? నువ్వు ఆ సింహమై వుండి కూడా, మేకలతో సహవాసం చేశావు. చేసి, చేసి, చేసి, చేసి, చేసి చివరకు సింహగర్జననే, నేను గర్జించాలనే స్థితి కూడా, సహజత్వాన్ని కోల్పోయావు. (అందరూ సింహాలే కదా! మేకలని ప్రత్యేకంగా లేవు కదా) ఆఁ.. ఏమిటంటే, ఎందుకని అలా పెట్టారంటే, ఇంద్రియాలతే కలిసి ప్రవర్తించేటప్పుడు నువ్వు సింహం అని గుర్తుంచుకుని ప్రవర్తించాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇంద్రియాలలోకి దిగంగానే, నువ్వు సింహం అనే గుర్తింపు పోయింది. సింహం గర్జిస్తే మేకలు వుంటాయా? వుండవు కదా! పారిపోతాయి. అలా అంత సామర్థ్యం వుంది నీ దగ్గర. కానీ, నీవు సింహం అని మరచిపోయేటప్పటికి ఏమయ్యావు? మేకలతో పాటు చేరి మే, మే, మే అంటున్నావు. నువ్వు గర్జిస్తేనే... నువ్వు ఏం చెయ్యక్కర్లేదు వాటిని. ఒక్క హుంకరిస్తే, ఒక్క గర్జింపు చేస్తే పారిపోతాయి. అంతటి పిరికిపందలు ఆ ఇంద్రియాలు. ఆ విషయాలు. ఈ ప్రకృతికి సంబంధించినటువంటివి అన్నీ! కానీ, నీవు పరమాత్మవు అయివుండి కూడా, ప్రకృతికి లొంగిపోయినట్లుగా జీవిస్తున్నావు. నువ్వు ప్రకృతిని నియమించేవాడవు కదా! ఈ సృష్టిని ఏర్పరచే వాడవు కదా! సృష్టికే సాక్షీ భూతుడవు కదా! కానీ అటువంటి జ్ఞానం ఎందువల్ల పోయింది? అంటే ఇంద్రియాలలో చేరి జీవించేటప్పుడు నువ్వు ఏం చేశావు? ఇంద్రియాలే సత్యంగా, విషయాలే సత్యంగా, గుణాలే సత్యంగా, అవస్థలే సత్యంగా, కట్టుకున్న వస్త్రమే నీవుగా, కుమ్మరి - కుండ ఒకటి అయ్యిపోయే పద్ధతిలో, నేను కుండను తయారు చేసేవాడిని అయినా గానీ, కుమ్మరి కుండ అవుతాడా? ఎప్పటికైనా? అవ్వడు కదా! ఇలాంటి ఉపమానాలు ఎందుకు చెబుతున్నాడు అంటే, నువ్వు శరీరం కాదు అని ధృవ పరచడం కోసం. ఒక్కసారి నీకిది బలమైన జ్ఞాపకం గనుక నీలో పడింది అంటే, అన్ని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోతాయి. అన్ని సంకల్పాలు తుడిచిపెట్టుకుపోతాయి. అన్ని ఆలోచనలు తుడిచిపెట్టుకుపోతాయి. అన్ని వాసనలు తుడిచి పెట్టుకు పోతాయి. అంతబలంగా నాటుకోవాలన్నమాట ఇది. ఎందుకనిట?

            ఒక వస్త్రంలో ముల్లు చిక్కుకున్నాయి అండి. ఏం చెయ్యాలట ఇప్పుడు? ఒక పెద్ద ముల్లు తీసుకో. ఈ ముల్లులన్నీ దానితో ఏరి పారేయి. అప్పుడు వస్త్రం చిరగలేదు, ముల్లు తీసేశావు. ముల్లు తీసేసినాక, ఈ పెద్ద ముల్లుతో నీకేమిటి పని? అవసరం లేదు, అప్పుడు అది కూడా పారేయి. అర్థమైందా? చిన్న ముళ్ళులన్నీ పారేస్తే జీవన్ముక్తి, పెద్ద ముల్లు కూడా పారేస్తే విదేహముక్తి. కానీ స్వరూప స్థితి? అక్కడైనా ఇక్కడైనా ఒక్కటే. కాబట్టి నీ స్వరూపస్థితికి ఇంత ప్రభావం వుంది నాయనా! జన్మ జన్మలుగా నువ్వు తెచ్చుకున్నటువంటి 84 లక్షల జీవరాశుల శరీరాలు అన్నింటిలో, ఏది ఆధారంగా వున్నది? ఈ సాక్షి ఆధారంగా వున్నది. ఏది (ఆధేయము) దాని మీద ఆధారపడి వున్నది? శరీరము ఆధారపడి వున్నది. మరి ఆధారపడి వున్నది నువ్వు అవుతావా? ఎప్పటికైనా గానీ? ఎట్లా అయినా కానీ? ఎట్లా అవుతావు?

(ముందు ముల్లులు తీయాలిగా...) ఆఁ... అంటే ఏం చేయాలట? నువ్వు మొట్టమొదట నీలో నువ్వు విచారణ చెయ్యాలి. నీలో నువ్వు విచారణ చేసి, ఇందులో శరీరభావముతో నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను? ఒకసారి గమనించాలి. గమనించి ఏం చెయ్యాలి? మాట్లాడక ముందే గమనించుకోవాలి ఇవన్నీ. మాట్లాడేసినాక గమనిస్తే ప్రయోజనం లేదు. అప్పుడు పని అయిపోతుంది. ఎందుకని? ఆ మాటలు ఎదుటివాడు వినేస్తాడు. వీడికి వాడిలో గుణాల ప్రభావం పనిచేస్తుంది. వాడికి అవే కదా వున్నాయి. నీకు ఏ దుర్లక్షణాలు వున్నాయో వాడికీ అవే వున్నాయి. నీకు ఏ దురభ్యాసాలు వున్నాయో, వాడికీ అవే దురభ్యాసాలు వున్నాయి. నీ ఏ అజ్ఞాన ప్రభావము వుందో వాడికీ అదే వుంది. నీకు ఏ దేహాభిమానం వుందో వాడికి అదే వుంది. ఇద్దరికీ జబ్బు ఒక్కటే. అంతే కదా! నీకు రియాక్షన్‌ వస్తే వాడికి రాదా? వాడికీ వస్తుంది. నువ్వు విచారణ చేసేవాడికే అంత రియాక్షన్‌ వస్తే, చెయ్యని వాడికి? వాడికి అసలు తెలియదుగా. విచారణ చెయ్యని వాడికి అస్సలు తెలియదు. పోనీ విచారణ చేసేవాడికి ఎందుకు తెలియడం లేదట? విచారణకు తగిన సాధన లేదు కాబట్టి. అంటే ఏం కావాలట ఇప్పుడు? విచారణ వుండాలి. సాధన కూడా వుండాలి. అంటే ఏం చెయ్యాలి? అర్థమైందా అండీ! కాబట్టి ముందు ఏం చేయమంటున్నారు? నువ్వు ఆత్మ విచారణలో స్థిరంగా విచారణ చెయ్యడం నేర్చుకో! స్వరూప స్థితి సత్యమని తెలుసుకో! స్వరూపస్థితి మీద నిలబడే ప్రయత్నం చేయి. స్వరూపస్థితి యొక్క గొప్పతనం అంతా తెలుసుకో! సాక్షిత్వంలో వున్నటువంటి ఆ శక్తి యేదో నీకు అవగాహన అయితే, దానికోసం నువ్వు ప్రయత్నం చేసేది అంతా సాధన అవుతుంది.
ఆ సాధనలో బలపడే కొద్దీ, నీకు విచారణ బలపడితేనే కానీ, సాధన బలపడదు. అంతే కదా! మనం ఏం చేస్తున్నాము? విచారణ చేయలేదు ఇంతకు ముందు. అన్ని పనులు చేసుకొచ్చావు. నవవిధ భక్తి మార్గాలలో వున్న అన్ని పనులు, అన్ని సాధనలు చేసేశావు. ఏమి లేదు? ఆత్మ విచారణ లేదు. అందువలన ఏమైంది? ఒక రెక్కతో ఎట్లా ఎగురుతావు? ఎగరలేవు. ఇప్పుడేమయ్యింది? ఆత్మ విచారణ నేర్చుకున్నావు, కానీ పూర్వ సాధనలు అన్నీ కూడా నేను చేసేశాను కదా! నాకెందుకు ఇంకా? అని నీవు విడిచిపెట్టావు. విడిచిపెడితే ఏమయ్యింది? అవి పోయినాయా పూర్తిగా? పోలేదుగా. ఎవడైనా ఆ పని చేసినప్పుడు, నీకు ఆ స్ఫురణ కలుగుతోందిగా, కలిగినప్పుడు దాని అర్థం ఏమిటి? ఇంకా నీలో అది మిగిలి వుందనే కదా! మిగిలివుందా లేదా? కాబట్టి ఏం చెయ్యాలట ఇప్పుడు? ఆత్మ విచారణ జ్ఞానం ప్రారంభించిన తరువాత, ఈ ఆత్మ విచారణ జ్ఞానంతో, నీలో బలీయంగా ఏదైనా, ఒక పూజ చెయ్యాలనో, ఒక జపం చెయ్యాలనో, ఆ నవ విధ భక్తి మార్గాలకు సంబంధించినది కనుక స్ఫురణకు వస్తే, ఈ ఆత్మ విచారణా జ్ఞానంలోనుంచి బయటకు రాకుండా, స్వరూపస్థితి అనేటువంటి స్థితిలోనుంచి బయటకు రాకుండా, దానిని ఆచరించు. అప్పుడు ఏమైంది? పూర్వము ఆచరించినప్పుడు ఏ అనుభవము మిగలలేదు. ఫలితము మీద తాపత్రయం తప్ప. ఇప్పుడు ఏమైంది? ఫలితం మీద తాపత్రయం లేదుగా. స్వరూపస్థితి నుంచి ఒక లక్ష్యములోనే నిలబడి చేస్తున్నావుగా. అప్పుడు ఈ సాధన అంతా ఏమైపోయింది? జ్ఞానమైన జ్ఞానానుభవాన్ని ఇచ్చినాయి. ఈ నవవిధ భక్తి మార్గాలే, ఈ సంస్కారాలే, ఈ వాసనలే, ఈ శరీరమే, ఈ ప్రపంచమే. (మీరు చెబుతున్నప్పుడేమో తేలికగా వుంటుంది కానీ, అది ఆచరణలో పెట్టేటప్పుడు?) అంటే అర్థం ఏమిటి? అట్లా కాదమ్మా! ఈ కొండను పగులగొట్టు అని చెప్పాను నేను. పగలగొట్టడం ఎట్లాగో చెప్పాను. చెప్పినంతమాత్రాన నువ్వు కొండను పగుల గొడతావా? పగలుగొట్టే ప్రయత్నం మొదలు పెట్టావు. అబ్బో! మీరు చెప్పినంత తేలికగా లేదండి, కొండ పగులగొట్టడం. ఇప్పుడు నేను తేలికగా వుంటుందని చెప్పానా నీకు? ఎప్పుడు తేలికగా వుంటుంది? దాని యొక్క రహస్యం తెలిస్తే నీకు తెలివి వస్తుంది. తేలికగా వుంటుంది. నువ్వు ఇప్పుడు రహస్యం తెలుసుకుని చేస్తున్నావా? చేయడం లేదు. మొద్దుగా చేస్తున్నావు. తమోగుణంతో చేస్తున్నావు. అంటే అర్థం ఏమిటి?
            ఏదన్నా ఎదురు వచ్చింది, ఎదైనా ఎదురు రాగానే అసలు ఏం చెయ్యాలి మొట్టమొదట? మొదట ఏం చెయ్యాలి? మొదట ఏం చెయ్యాలి అంటే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? మొదట ఏం చెయ్యాలి అనేదాక నువ్వు ఆగడం లేదుగా. వెంటనే మాట్లాడేస్తున్నావు, రియాక్షన్‌ వచ్చేస్తుంది. ముందు ఏం చెయ్యమన్నారు? ఏం మాట్లాడవద్దు. ఏదన్నా జరగనీ, అనుకూలం జరగనీ, వ్యతిరేకం జరగనీ. అనుకూలంలోనూ మాట్లాడమాక, వ్యతిరేకంలోనూ మాట్లాడమాక. (మాట్లాడకపోతే మనసు ఊరుకోదుగా) ఆగు, అప్పుడు ఏం చెయ్యాలి? మనసుని విచారణ చెయ్యాలి మొట్టమొదట. (వచ్చిన చిక్కు అంతా అదేగా) ఆఁ.. ఆగాలి. నువ్వు ఏదన్నా ప్రయత్నం చేయి, అక్కడ ఆపాలి. అక్కడ ఆపాలి అంటే, నువ్వు ముందుగా గుర్తించాలి. నువ్వు ముందుగా గుర్తించాలి అంటే, రెండు పనులు ఏకకాలంలో చెయ్యాలి. ఏమిటి? నీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. నీ మనసు మీద కూడా ధ్యాస పెట్టాలి. ఇప్పటి వరకూ ఏం చేశావు? ఒక్కటే చేశావు. ఒక్కటి చేస్తే, ఒకటి పోయింది. శ్వాసను గుర్తిస్తే, మనసు పోయింది. మనసుని గుర్తిస్తే, శ్వాస పోయింది. అంతే కదా! కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలట? అట్టా కాదమ్మా! నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. నీకు ఉపదేశ మంత్రము ఏదైతే వుందో, ఆ మంత్రజపం మనసుతో చేయాలి. రెండు పనులు ఏక కాలంలో చెయ్యాలి.
            మనసు రెండు పనులు చేయగలుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దానికి రెండు వున్నాయి, సామర్థ్యాలు. (రెండూ ఒకేసారి చేయగలుగుతుందా?) చేస్తుంది. ప్రయత్నం చెయ్యి. ఎట్లా ప్రయత్నం చెయ్యాలి అంటే, నేను ఇప్పుడు ఏకకాలంలో, ముందు ఏమి చేయాలి? మొదటి రెండు మూడు నిమిషాలు, ఐదు నిమిషాలు శ్వాసను గమనించాలి, గమనిస్తూ వుండంగానే మనసు ఏం చేస్తుంది? అది రెండవ పని చేయగలుగుతుందిగా. రెండవ పని ఏం చేసింది? జ్ఞాపకాలను తవ్వడం మొదలు పెట్టింది. అంతే కదా! ఆ జ్ఞాపకాలను త్రవ్వటం మొదలు పెట్టకముందే, నువ్వు ఏం చెయ్యాలట ఇప్పడు? నీ ఉపదేశ మంత్రం ఏదైతే వుందో, ఆ మంత్రజపం మానసికంగా చేయడం మొదలుపెట్టు. ఇప్పుడు మనసు శక్తి ఎంత? రెండు పనులు. ఒకపని ఏం చేస్తోంది? శ్వాసమీద ధ్యాస. రెండవపని ఏం చేస్తోంది? మంత్ర జపం. అర్థమైందా? ఇవి రెండూ ఎప్పుడైతే చేసేసిందో, మూడవపని చేసేటంత శక్తి సామర్థ్యాలు, దాంట్లో అప్పుడే వుండవు. నువ్వు ఈ పని చేసేకొద్దీ, ఏమైపోతుందంటే, శ్వాస మీద ధ్యాస వెంటనే వచ్చేస్తుంది కాదా! నిలకడ వచ్చేస్తుంది. ఒక దాంట్లో నిలకడ రాగానే, ఇప్పుడు అదేం చెబుతుంది? అది నేను ఇప్పుడు గమనించనక్కర్లేదు అది సహజమై పోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? మంత్రజపం ఒక్కటే చేస్తున్నాను. ఇప్పుడు రెండోపని సామర్థ్యం వచ్చింది. మిగిలింది. అప్పుడేమీ చేశావు? మళ్ళా జ్ఞాపకాలు రావడం మొదలు పెడుతుంది. ఇప్పుడేమి చెయ్యాలి? ఆ జపం చేసేటప్పుడు, జపానికి సంబంధించినటువంటి సద్గురు మూర్తో, దేవాతామూర్తో వుంటుంది. దానిని జోడించాలన్నమాట. ఇప్పుడు మనసు ఏం చేసింది? సహజంగా శ్వాస మీద ధ్యాసను కలిగివుంది. రెండవ పని మొదటి పని కింద జపాన్ని చేసింది. రెండవపని కింద భావ రూపాన్ని ఎదురుగుండా పెట్టు్కుంది. బాహ్యరూపంతో పనిలేదు అప్పుడు ఇక. ఏ గురువునైతే నువ్వు విశ్వసించావో, ఏ పరమాత్మనైతే నువ్వు విశ్వసించావో, ఆ పరమాత్మ యొక్క, నీవు అనుకున్నటువంటి, భౌతిక రూపాన్ని, మనసులో ముద్రించి, జపం రూపం, జపం రూపం, మెట్టు దిగింది రూపం చెడిండి. వెంటనే ఏమి వస్తుంది? దీనికింద ఏముంది? శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస, జపం, రూపం. శ్వాస మీద ధ్యాస, జపం, రూపం. ఈ మూడిటి మీదా తిరగుతూ వుంటుంది. కొంతకాలం అయ్యేప్పటికి ఏమైపోయింది? శ్వాస మీద ధ్యాస సహజమైపోతే, జపం రూపం, చెడింది, ఒక వేళ పైన రూపం చెడింది, ఏదో ఆలోచన వచ్చి ముందు ఏం చెడుతుంది? భావ రూపం చెడుతుంది. చెడగానే వెంటనే కిందకి చూడాలి. కిందకి చూస్తే ఏమైంది? మళ్ళా ధ్యాసలోకి వచ్చేస్తావు. మళ్ళా పైకి చూడు ఇప్పుడు. మళ్ళా రూపం వస్తుంది. ఇలాగ అభ్యాసం చెయ్యగా చేయగా, ఈ సాధన చేయగా, చేయగా కొంతకాలానికి ఏమైపోతావు? ఈ శ్వాసమీదధ్యాస సహజమైపోయింది. మనసు జపము, రూపము కలిగివుంది. ఇంకా నువ్వు స్థిరపడేటప్పటికి, జపంతో పనిలేకుండా పోతుంది. వట్టి రూపం కళ్ళముందు వుంది. ఇంకా కొంతకాలం అయ్యేప్పటికి, ఆ ఎదురుగుండా ఏ రూపమైతే పెట్టావో, ఆ రూపమే నేను అయిపోతావు. ఇప్పుడు ఇక్కడుంది కదా రూపం, భావ రూపం, ఇటు అయిపోయింది. దానికి నాకు భేదం లేదు. ఇహ నిర్ణయం వచ్చేసింది. నిర్ణయం రాగానే ఇప్పుడు ఏమైంది? మనసు బుద్ధిలోకి మారిపోయింది. అర్థమైందా? బుద్ధి ఎన్ని పనులు చేస్తుంది? ఒకే పని చేస్తుంది. నిర్ణయం చెబుతుంది అంతే. ఆ గురు రూపానికి నాకు భేదం లేదు. ఆ పరమాత్మకి నాకు భేదం లేదు. నిర్ణయం చేసెయ్యగానే, ఇక మనసులో ఏ ఆలోచన ప్రారంభం అయినా, ముందు ఈ ఆలోచనతో మనసులో ఆలోచన ప్రారంభం అవుతుంది. కాబట్టి సాధన యొక్క ఫలితం ఇదన్నమాట. విచారణ చేస్తేనేమో అవగాహన వచ్చింది. విచారణ చేస్తే ఏం కలిగింది? అవగాహన కలిగింది. కానీ వట్టి అవగాహనతో నీకు బలం వుందా మరి ఇప్పుడు? లేదు. అర్థమైందా?
            నీ ఇంట్లో అన్నం వుంది, పప్పువుంది, కూర వుంది, అది వుంది, ఇది వుంది. పేర్లు చదివినంతమాత్రాన నీకు శక్తి కలుగుతుందా? కలుగదు కదా! ఏం చెయ్యాలి? వాటిని స్వీకరించాలి. అంతేనా కాదా? నీకు స్వరూప స్థితి వుంది అని తెలిసింది. పంచకోశాలు వున్నాయి అని తెలిసింది. మూడు అవస్థలు వున్నాయి అని తెలిసింది. మూడు గుణాలు వున్నాయి అని తెలిసింది. సాక్షిత్వం ఎలా చెడిపోతున్నదో తెలిసింది. ఎలా దుఃఖం వస్తుందో తెలిసింది. ఎలా దుఃఖం నివృత్తి పొందుతుందో తెలిసింది. ఇవన్నీ ఎట్లా తెలిసినాయి? వాటి address లు తెలిసినాయి. వాటి స్థితులు తెలిసినాయి. పేర్లు తెలిసినాయి. దానిమీద అవగాహన వచ్చింది. కానీ ఏమి రాలేదు? అనుభవం రాలేదు. అనుభవం రావాలి అంటే ఏమి చెయ్యాలి? సాధన చెయ్యాలి. ఆ విచారణ అవగాహన వుండాలి. ఆత్మ విచారణతో కూడిన అవగాహన వుండాలి. సాధన చెయ్యాలి. ఈ రెండిటితో కలిసినటువంటి జీవితాన్ని జీవించాలి. ఇప్పుడు మనం మన జీవితంలో ఈ రెండూ వున్నాయా? ఒకటి వుంటే, ఒకటి లేదు. ఏమైంది దాని వల్ల? ఒక రెక్కతో ఎట్లా ఎగురుతావు? ఎగరలేవు. కాబట్టి నీవు ఆత్మవిచారణను అభ్యాసం చెయ్యాలి మొట్టమొదట. ఆత్మ విచారణను అభ్యాసం చేస్తూ, నీ వాసనాబలం మేరకు, నీ సంస్కార బలం మేరకు ఏ ఏ సాధనలు నీకు అనుకూలము అని తోస్తే, ఈ విచారణని కొనసాగిస్తూ, ఈ విచారణా దృష్టితో, ఆ సాధనలను చేయాలి. ఏమైంది అప్పుడు? అప్పుడు సాధన, అవగాహన రెండూ వున్నాయి. రెండింటి వల్ల నిర్ణయం కలుగుతుంది. ఒక్కదాని వల్ల నిర్ణయం కలుగదు. ఒక్కసారి ఆ నిర్ణయం కలిగితే ఆ బుద్ధిలో, ఆ నిర్ణయం ప్రభావంతో ఆలోచించడం మొదలు పెడుతావు. తద్వారా ప్రతి ఆలోచనలోనూ, ఆ నిర్ణయమే ప్రతి ఫలిస్తుంది. అట్లా కొంతకాలం ఆ నిర్ణయంతో జీవించేటప్పటికి, నీలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. అప్పుడు నీ జీవితం అంతా మారిపోయినటువంటి, నూతనమైనటువంటి జీవితం, ఆత్మానుసార జీవితంగా పరిణామం చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలండీ సాధన? ఏమండి, నన్ను సహస్రనామం చేయమంటారా? అష్టోత్తరం చేయమంటారా? ఎదో ఒకటి చెయ్యి. ఏం చేస్తే ఏం తేడా వుంది? అది నీకే కదా లేక్క. ఆయనకు ఏమన్నా లెక్క వుందా? సహస్రం అయినా, అష్టోత్తరం అయినా, ఏకనామమైనా ఆ దేవతకు ఏమైనా తేడా వుందా? పరమాత్మకు ఏమన్నా తేడా వుందా? ఏమీ లేదు. ఎందుకని? అవి స్వరూప స్థితులు కదా! నీ స్వరూపస్థితిలో ఏముందో, అక్కడా అదే వుంది కదా! కాబట్టి నీవు మొట్టమొదట ఏం చెయ్యాలి? ఆత్మ విచారణ చెయ్యి. ఈ విచారణతో ఒకే ఒక్క సాధన చెయ్యగలుగుతాడు. ఏమిటది? ఇందాక చెప్పింది. ముందు ఏం చెయ్యాలి? విచారణ చేయి. రెండవది ఏం చేయాలి? శ్వాసమీద ధ్యాస పెట్టు. మూడవది ఏం చెయ్యాలి? మంత్ర జపం చేయి. నాల్గవది ఏం చెయ్యాలి? దానికి తగ్గ గురువు యొక్క రూపాన్ని కానీ, పరమాత్మ యొక్క రూపాన్ని కానీ అనుసంధానించు. నీవు ఎప్పుడైతే ఈ క్రమంలో చేశావో, ఏమైంది అప్పుడు? నీకు మానసికంగా బలం లభించింది. మానసికంగా అనుసరించగలిగే సామర్థ్యం వచ్చింది. బుద్ధికి సామర్థ్యం వచ్చింది. బుద్ధి వికాసం పూర్తి అయ్యింది. ఆ బుద్ధి వికాసం పూర్తి అయినప్పుడు, ఏ నిర్ణయంతో అయితే స్వరూప స్థితికి సంబంధించిన నిర్ణయము వున్నదో, ఆ నిర్ణయంతోటే మనసులోకి దిగుతూ వుంటావు ఇక. కాబట్టి అప్పుడు మనసు యొక్క పూర్ణమైనటువంటి రూపాంతరం చెందింది. సంస్కార బలం అంతా రూపాంతరం చెందింది. కొత్త సంస్కారాలు, జ్ఞానపరమైనటువంటివి ఏర్పడ్డాయి. అజ్ఞాన పరమైనవి తోచినప్పుడల్లా అభ్యాసబలం చేత, వాటిని నిరసించేసుకోవాలి. అది లోకంలో కాని, వ్యక్తిగా నీకు కాని. నిరసించేసేస్తాడు అంతే! ఎందుకని? తను ఆచరించడు ఇక వాటిని. అజ్ఞాన పద్ధతిలో ఆచరించడు ఇక అంతే! ఆచరిస్తే జ్ఞానపద్ధతిలోనే ఆచరిస్తాడు. ఎప్పుడు? అది నిమిత్త కర్మ, ధర్మం అనుకున్నప్పుడే ఆచరిస్తాడు. ప్రత్యేకత కోసం ఆచరించడు.
            జీవితం మొత్తం మీద సత్యనారాయణ స్వామి వ్రతం ఎన్ని సార్లు చెయ్యాలి? నీకు శక్తి వుంటే రోజూ చేసుకో! లేకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా చెయ్యి. లేకపోతే నామకరణం, వివాహం, ఇంకా వగైరా ఏవో నాలుగైదు చెప్తావు. అప్పుడు చేయి. మరణకాలంలో ఎందుకు చెయ్యొద్దు? మరణకాలం కూడా గొప్పదే కదా! కాదా? మరి ఎందుకు అప్పుడు చేయడం లేదు? ఒకసారి విచారణ చెయ్యి. మరణం అశుభంగా చూశావు. సత్యనారాయణ వ్రతం? శుభంగా చూశావు. అర్థముందా ఏమైనా? ఎందుకని? నిజమైన జ్ఞానం అసలు అప్పుడే బోధిస్తున్నాడు నీకు. సరియైన జ్ఞానం అప్పుడే తెలుస్తోంది. ఉత్తమోత్తమ జ్ఞానం లభించిన తరువాత దేహభ్రాంతితో కూడిన వ్రతం చేయమని చెబుతాడా ఎవడైనా? కానీ, వింతైనా విషయం ఏమిటో చూడండి. 13వ రోజు తరువాత, పుణ్యాహ వచనం తరువాత, ఇవాళ అందరూ ఏం చేస్తున్నారండీ? ... అర్థం వుందా ఏమైనా? ఉత్తమోత్తమమైన జ్ఞానం 13 రోజులు బోధించాడు నీకు నిత్య కర్మద్వారా. నీవు ఆత్మస్వరూపుడవు నాయనా! నీవు జీవుడవు కాదు. నీవు శరీరము కాదు. నీవు ఇంద్రియాలు కాదు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఇదిగో సృష్టి ఇట్లా ఏర్పడుతోంది. పోతోంది అని 13 రోజులు ఏకరువు పెట్టి నిత్య కర్మ చేయించారు. 13వ రోజున మళ్ళీ ఏం చేశాడు? ఇప్పుడు ఇది మన సంప్రదాయమని ఒప్పుకుందామా? ఏ సాంప్రదాయం అందాము ఇప్పుడు? అజ్ఞాన సాంప్రదాయమా? జ్ఞాన సాంప్రదాయమా?
            ఆఁ.. అంటే అర్థం ఏమిటి? (ఏదో అందరూ చేస్తున్నారు, మనము చేస్తున్నాము) అంటే అర్థం ఏమిటి? (తెలియకుండా చేస్తున్నాము) అజ్ఞానంలో ఇంకా గాఢ తమోగుణం. నిద్రపోతూ చేయడమే. ఎందుకని? నిద్రపోయేవాడికి ఏం చేశాడు, ఏం చేయలేదు అని ఏం తేడా తెలుసు? (ఈ తమోగుణాన్ని ఎట్లా అధిగమించాలి?) ఆఁ.. విచారణ. అందుకే మొట్టమొదట విచారణ అని చెప్పేది. ఎంతగా నువ్వు విచారణలో బలపడితే, అంతగా నీకు సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. సత్వగుణం అభివృద్ధి చెందితేగానీ, నీ శ్వాసమీద ధ్యాసగానీ, మనుసు చేత పనిచేయడం గానీ, ఆ రూపం నిలపడం గానీ, అవేవీ సాధ్యం కావు. అర్థమైందా? ఎందుకని వాళ్ళు అందరూ ఒక్కటై చేయమంటున్నారంటే, అందరూ తమోగుణం వాళ్ళేగా. ఆ ఒక్కడు చేయడమే కష్టసాధ్యం. నువ్వు ఒక్కసారి నాలుగు చేయమంటే? సాధ్యం కాదు. అందుకని ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు? సరేలే! ఈ గోల అంతా నీకు ఎందుకు గానీ, ఆ శ్వాస మీద ధ్యాస ఏదో ముంది అది చేయి, అది వచ్చినాక చూద్దాము. అది వచ్చినాక ఆత్మ విచారణ చెబుతారన్నమాట. అక్కడ వుద్దేశ్యం అది. ఆత్మవిచారణ అప్పుడు చెబుతాడు. అప్పుడు చెప్పి మళ్ళా ఈ శ్వాసమీద ధ్యాసను చేయిస్తాడు. రెండూ చేతనైన వాడు, మీకు బోధించేవాడు ఇప్పుడు అక్కడ. ఒకడు కూర్చొని ధ్యానం బోధిస్తున్నాడు కదా! వాడు ఎవడు? వాడికది తెలుసు. ఆత్మ విచారణ తెలుసు, శ్వాసమీద ధ్యాస తెలుసు. కానీ ఏం తెలియదు? పై స్థితులు తెలియదు ఇంకా! పై సాధనలు తెలియవు. అది కూడా తెలిసిన వాడు ఏం చేస్తాడు? అది చెప్తాడు. ఇట్లా ఎవరికి వాళ్ళు, వాళ్ళు ఏ సాధన ద్వారా పరిణామం చెందుతూ వచ్చారో, ఆ స్వరూప స్థితిని తెలుసుకోగలిగారో, ఆ పద్ధతిలో వాళ్ళు చెబుతూ వుంటారు. నీ సంస్కార బలానికి ఏది అనుకూలంగా వుంటుందో, ఆ మార్గాన్ని ఎంపిక చేసుకో! ఈ మార్గం, ఆ మార్గం, ఇది గొప్పది, అది తక్కువది అని నేను చెప్పడము లేదు. నీ సంస్కార బలానికి ఏది అనుకూలమో, అది ఎంపిక చేసుకో! ఆయా సాధనలను ఆత్మవిచారణతో చేయి. అంతే కానీ, ఆత్మ విచారణ విడిచిపెట్టి చేస్తే ప్రయోజనము లేదు. కాబట్టి ముందు నీకీ తమోగుణ ప్రభావం తగ్గిపోవాలన్నా, రజోగుణ ప్రభావం తగ్గిపోవాలన్నా, ఆత్మవిచారణ చెయ్యాలి. ఎంతగా ఆత్మవిచారణ చెయ్యాలి అంటే, సత్వగుణం వృద్ధి చెంది, ఎప్పుడూ ఆత్మవిచారణతో, జీవితం గడుస్తూ వున్నది అనుకుని స్థిరపడేంత వరకూ ఆత్మవిచారణ చెయ్యాలి. మరి రెండోపని చెయ్యొచ్చు కదండీ! చెయ్యి, ఎవరు చేయద్దన్నారు? ఏ సాధనైనా చేయి, ఆత్మవిచారణ తోటి. కానీ, అంతర్ముఖ ప్రయాణము అంటున్నావే, అంతర్ముఖ ప్రయాణం మాత్రం ఎలా సాధ్యమయ్యా అంటే, ఈ ఆత్మవిచారణ తరువాత, మొదటి స్థితిలో ఏమి తెలుసుకోవాలి? ప్రాణమయకోశాన్ని తెలుసుకోవాలి. కాబట్టి శ్వాస మీద ధ్యాస. ప్రాణమయాన్ని దాటావు, ఇప్పుడేమి తెలియాలి? మనోమయం తెలియాలి. కాబట్టి మనస్సుతో జపం చేయి. అప్పుడు మనోమయం తెలిసింది. అర్థమైందా? దానిపైన ఏమి తెలియాలి? విజ్ఞానమయం తెలియాలి. దానికేం చేయాలి? ఆ గురుమూర్తి యొక్క రూపాన్ని పెట్టు భద్రంగా. ఈ జపం, ఆ రూపం, ఈ కింద ధ్యాస బయటకు వస్తే ఆత్మవిచారణ. ఇహ నిన్ను చెడగొట్టమనండి ఇప్పుడు? రక్షణ కవచాలు ఎన్ని ఏర్పరచావు? పంచకోశాలు కదా! పంచకోశాలకి ఐదు కోటలు ఏర్పాటు చేశావు. ఇప్పుడు నీ మీద దాడి చేయమను. ఎలా చేస్తాయి? ఎందుకని? బయటకి అన్నమయ్య కోశ పరిధిలోకి వచ్చావా? ఆత్మ విచారణ. నోరు తెరిస్తే ఆత్మవిచారణే ఇక. ఇంద్రియాలు ఓపెన్ చేస్తే, ఇంద్రియాలను మొదలు పెట్టాలంటే ఆత్మవిచారణతోనే మొదలు పెడుతాడు ఇక. ఇలా బహిరంగం. లోపలికి తిరిగావు శ్వాస మీద ధ్యాస. ఇంకా లోపలికి తిరిగావు, మనస్సుతో జపం, ఇంకా లోపలికి తిరిగావు, గురుమూర్తి యొక్క రూపం, పరమాత్మ యొక్క రూపం, ఇంకా లోపలికి తిరిగావు, స్వరూపస్థితి అనే నిర్ణయం. Finish. ఎందుకని? అదేనయ్యా బాబు సాక్షి. ఆ సాక్షిత్వ స్థితిలో వుంటాడు అంతే. చూడాలి క్రిందకి, ఇంద్రియాలలోకి పైనుంచి, కొండమీదనుంచి ప్రపంచాన్ని ఎట్లా చూస్తాడో, అప్పుడు ఎట్లా కనబడుతుంది ప్రపంచం? కొండ మీద వున్న దేవుడిని, కింద వున్న ప్రపంచం ఏమన్నా చేయగలదా? ఏమీ చేయలేదు కదా! అంతా చిన్నదిగా కనపడలేదా? ప్రపంచం అంతా. కిందనుంచి పైకి చూస్తే, ఇవి పెద్ద ప్రమాదకరంగా కనపడ్డాయి. అంత భేదం వుంటుందన్నమాట. (స్వరూప స్థితి..... ) అంతేకదా మరి! ఎప్పుడైతే ఈ క్రమంలో వెళ్ళావో, ఆ ఆధారంగా పెట్టుకున్న రూపమే నేను అయిపోతానో  ఎప్పుడైతే, వెంటనే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. అర్థమైందా అండీ!
            ఈ సాధనా క్రమంలో వెళ్ళేవాడికి, ఎప్పుడైతే ఆ బుద్ధి స్థితిని దాటి పోతాడో, వెంటనే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. అప్పుడేమైంది ఇక? బుద్ధిలో ఏ జ్ఞాపకం పని చేయాలన్నా, నేను ఆత్మస్వరూపుడను అనే నిర్ణయంతో మొదలైతేనే, ఆ జ్ఞాపకాలు పని చేస్తాయి. దానికి సరిపడని జ్ఞాపకాలని బుద్ధి ఏం చేస్తుందంటే, చెరిపివేస్తేస్తుంది. దానికి ఆ సామర్థ్యం వచ్చేస్తుందన్నమాట అప్పుడు. ఆ బుద్ధి వికాసం పూర్తి అయ్యేటప్పటికి, దీనికి సరిపడే వాటినే వుంచుతుంది. మిగిలినవాటిని అన్నింటినీ చెరిపివేసేస్తుంది. ఎందుకని? వీడేమీ అమలు చేయడుగా వాటిని. అమలు చేయనివి నీ దగ్గర ఏమన్నా వున్నాయా ఇప్పుడు? ఏమీ లేవు. చిన్నప్పుడు కొన్ని పనులు చేశామండి. పెద్ద అయినాక అవేమీ ఇప్పుడు చేయలేదండి, వాటికి సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పుడు నీ దగ్గర ఏమన్నా వున్నాయా? లేవు. ఎందుకని? బుద్ధి స్పష్టంగా చెరిపివేసింది. ఆ... కొన్ని మిగిలినవి ఏమిటి? అదే ప్రారబ్ధం. ఇప్పుడు ప్రారబ్ధం తెలిసి, వాటిని రద్దు చేయాలి అంటే, ఇంత దూరం రావాలన్నమాట.
            ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగితే గానీ, ప్రారబ్ధం రద్దు అవ్వదు. ఎట్లాగ? ఆ జ్ఞానంతో అప్పుడు కర్మకాండను చూస్తాడు. ఆ కర్మ ప్రభావాన్ని చూస్తాడు. ఆ జ్ఞానంలో ఈ కర్మ బీజాలు దగ్ధం అయిపోయినాయి. (మనకు తెలియకుండా జరిగినవి కూడానా?) అన్నీ అప్పుడు తెలుస్తాయి. నీ బుద్ధి యొక్క అంతరాంతరాళలోకి వెళ్ళగలిగే సామర్థ్యము ఇప్పుడు లేదు. అర్థమైందా? ఈ క్రమంలో సాధన చేస్తూ, నేను ఎవడను అని ప్రశ్నించుకుంటూ, నేను ఆత్మ స్వరూపడను అనే నిర్ణయాన్ని నువ్వు, చివరివరకూ ఎప్పుడైతే నిలబెట్టుకోగలిగావో, అప్పుడు ఆ ఆత్మసాక్షాత్కారజ్ఞాన ప్రభావంతో నీ బుద్ధిలోకి చూస్తే, నీ బాల్యం కాదు, నీ జన్మజన్మాది క్రమంలో నీకు వచ్చినవన్నీ కూడా అప్పుడు తెలియబడిపోతాయి. అన్నీ దగ్ధమైపోతాయి. ఎందుకని? గుణాతీతంగా వుంటావు కాబట్టి. గుణాలకు లొంగావా? మళ్ళా దగ్ధం కావు. అలాగే వుండిపోతాయి, ఆ బీజాలు. మళ్ళా మొలకెత్తుతూ వుంటాయి. కాబట్టి ఎంతజ్ఞానం వచ్చినా కూడా వీడు మళ్ళా అజ్ఞానానికి సంబంధించిన పనే చేస్తూవున్నాడని అనుకుంటావనుకో! ఎందువల్ల కలుగుతోంది? అంటే, అవి ఇంకా సాంతం పోలేదు. వాటిలోంచి విడుదల పొందలేదు. అవి రద్దవలేదు. ఎప్పటికైనా అవి రద్దు అవ్వాల్సిందే. ఎందుకని? అప్పుడే నీకు ముక్తి సాధ్యం. కాబట్టి ఏం చెబుతున్నాడు అక్కడ? నేనెవడను? అనేటటువంటి స్వరూపస్థితి సంబంధించినటువంటి విచారణని బలపరుచుకో! ఇది మొదటి సాధన. ఆ క్రమంలో పంచకోశాల క్రమం ఎట్లా వుందో, అదే క్రమంలో సాధన చేస్తూ పో! ఎప్పుడైతే నువ్వు విజ్ఞానమయ కోశ పరిధిని దాటి, ఆనందమయ కోశ పరిధిని దాటి, నేను అనే స్వరూప స్థితిని తెలుసుకో గలిగావో, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగిందో, అప్పుడు ఆ స్థితినుంచి కిందకి చూస్తావు. ఆ స్థితినుంచి పంచకోశాలని చూస్తావు. అప్పుడు నీవు పంచకోశ వ్యతిరిక్తుడవు, గుణత్రయాతీతుడవు, అవస్థాత్రయాతీతుడవు, అని నీకు నీకే అనుభవానికి వస్తుంది. అది సాక్షియొక్క అనుభవం. ఇటువంటిది వున్నవాడికే ముక్తి సాధ్యమౌతుంది.
            చదవండి! కింద స్పష్టంగా చెబుతాడు ఇదంతా...
(తన యదార్థ స్వరూపము విచారించి తెలుసుకొనుటయనగా నేమి?)
ఎల్లవారికీ స్వభావముగా గలుగు పోతిని, వచ్చితిని, వుంటిని, చేసితిని ఇత్యాది అనుభవములకు తగిన క్రియలకు మూలమైన నేను యొక్క బోధ, తెలివి కలుగుచున్నది.) అది.
            ఏం చేస్తున్నామంట? ఇప్పుడు మనం? పోయితిని, వచ్చితిని, తింటిని, వుంటిని అంటున్నావు కదా! వాటి అన్నిటికీ మూలం ఎవరు? నేను. ఆ నేను అనే గుర్తు. నేను అనే ఎఱుక. నేను అనే బోధ. ఆ నేను అనే నిర్ణయం. నువ్వు ఎప్పుడైతే దానిని ఆశ్రయించావో, అప్పుడు ఇచ్చితిని, వచ్చితిని, పోతిని అనేది నీకు ఏమన్నా ప్రాధాన్యత వుందా? లేదు కదా!  అట్లా చెయ్యి వాటిని. ఇప్పటి వరకూ దేనికి ప్రాధన్యత ఇచ్చావు? ఇచ్చితిని, వచ్చితిని, పోతినికీ ప్రాధన్యత ఇచ్చావు. అందువల్ల ఏమయ్యావు? దుఃఖభారం పొందుతున్నావు. దుఃఖానికి లొంగిపోయావు. దుఃఖానుభవం కలుగుతోంది నీకు. అజ్ఞానానుభవం కలుగుతోంది. దేహాభిమానం కలుగుతోంది. దీంట్లోనుంచి బయటపడు. ఎలాగ? వీటన్నింటికీ మూలం ఎవరు? నేను. ఆ నేనును ఆశ్రయించు, ఆ స్వరూప స్థితిని ఆశ్రయించు, ముక్తిని పొందు. (తరువాత చదవండి)
            (ఆ తెలివి యొక్క నిజస్వరూపము, నేను ఎవడను? అను విచారణముచే విచారించి తాను తానుగా మిగులుటయే తన యథార్థ స్వరూపమును విచారించి తెలుసుకొనుట).
            తాను తానెవడనో తెలుసుకొనీ, ‘తానుగా వుండుటయే, తెలుసుకున్న తరువాత మళ్ళా కిందకు వచ్చేయకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? తెలుసుకున్నాను అంటున్నావు. కానీ పాతపద్ధతిలోనే చేస్తామంటున్నాము, ఏమైందప్పుడు? అజ్ఞానానుభవమే కలుగుతుంది కానీ, జ్ఞానానుభవం వస్తుందా? రాదు కదా! కాబట్టి తాను ఎవడినో తెలుసుకుని, తానుగా జీవించవలయును.
            (నేను ఎవడను అని విచారించి తెలుసుకుని, )
            ఊఁ... ఇది ముఖ్యం.
            (పోవుట, వచ్చుట ఆదిగా కల కార్యములు దేహసంబంధమైనవే గానీ, ఇతరములు కావనుటయే దేహమే నేను అని చెప్పినట్లు కదా! )
            నేను హైదరాబాదు నుంచి ఇక్కడికి వచ్చాను. దేహం వచ్చిందా? నేను వచ్చానా? దేహం వచ్చింది. కానీ నేను వచ్చాను అని అంటున్నావు. నువ్వు రాలేదు, దేహం వచ్చింది. ఈ సత్యం తెలుసుకున్నవాడు ఏమంటాడు ఇప్పుడు? రావడం జరిగింది. విజయవాడ రావడం జరిగింది. ఎవరు? శరీరం. నేను? అక్కడా నేనే, ఇక్కడా నేనే. తమరితో మాట్లడడం జరిగింది. గురువుగారిని ఆశ్రయించడం జరిగింది. పెళ్ళి బాగా జరిగింది. వ్రతం బాగా జరిగింది. ఎందుకని? బాహ్యం అదంతా. జరుగుతూ వుంటుంది అది. నేను? ఏమీ జరగను. కదలను. సాక్షిని. పూర్వం పెద్దవాళ్ళు ఏం మాట్లాడే వాళ్ళు? నాయనా! ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా చేశావా? అని అడిగారా? ఎవ్వరూ అడగరండి. ఇప్పుడు ఏమి అడుగుతున్నారు? చూసుకోండి ఎంత భేదం వుందో, మాటలో. అనుభవ వాక్యం అన్నమాట అది. నాయనా! ప్రయాణం బాగా జరిగిందా? క్షేమంగా రాగలిగారా? ఇట్లాగ పూర్వం పెద్దలు ఆ అనుభవజ్ఞానంతో మాట్లాడేవారు. మనం కూడా ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాం ఇప్పుడిక? ఆ జ్ఞానం వచ్చినప్పుడు అట్లా మాట్లాడుతాం. జ్ఞానం లేనప్పుడు ఏమైపోయింది? అజ్ఞానంగానే మాట్లాడాము. ఏసీ బాగుందా? సీటు కుషన్‌ బాగుందా? ఇలా అడుగుతామన్నమాట. ఇప్పుడు ఏమైందప్పుడు? పూర్తిగా దేహ భ్రాంతిలో మునిగిపోలేదా? అర్థమైందా? కాబట్టి నువ్వు మాట్లాడుదామనుకున్న మాటల్లోనే అజ్ఞానం వుందిరా బాబు. దాని వలనే అసలు బలపడుతోంది. నువ్వు మాట్లాడకుండా ముందు విచారణ చెయ్యి. దేహంగా మాట్లాడుతున్నావా? ఆ దేహమనే తెలివితో మాట్లాడితే, అదే బలపడిపోతోంది. కాబట్టి దేహమనే తెలివిలో మాట్లాడమాకు. నేను దేహం కాదు. నేను ఆత్మస్వరూపుడను. ఆ స్వరూపస్థితిని గుర్తుంచుకుని మాట్లాడు. ఆ స్వరూపస్థితిని గుర్తుంచుకుని ఆలోచన చేయి. ఆ స్వరూపస్థితిని గుర్తుంచుకునే ఏ పనిలోకైనా దిగు. ఆత్మవిచారణ లేకుండా దేంట్లోకి అనుమతించమాకు. దేంట్లోకీ దిగమాకు. ఇది అభ్యాసము చేయి. ఈ అభ్యాసము బలపడవలసిందే. (తరువాత)
            (................. దేహము పుట్టుక ముందు... పంచభూతాత్మకముల చేతను... తగునా?)
అదే నేను అని అందామా? అదే నేను అని అంటే ఏమైంది? నిద్రలో వుండడం లేదు. జననమరణాలకు లోనౌతోంది. కొద్దికాలమే వుంటోంది, కొంతకాలం తరువాత వుండడం లేదు. శాశ్వతంగా లేదు. సర్వవ్యాపకముగా లేదు. పరిమితముగా వున్నది. మరి ఇదే నేను అని చెబుదామా? ఎట్లా అంటావు? అనడానికి వీలుకాదు కదా! నేను శాశ్వతుడను కదా! నేను సాక్షిని కదా! నేను ఆధారం కదా ! మరి నామీద ఆధారపడ్డది కదా దేహమనేది? అది శవం వలె వున్నది కదా! నేనుంటేనే కదా అది కదులుతోంది? మరి దేహం నేను అని బోధించవచ్చా? బోధించరాదు కదా! కాబట్టి మనం ఇతరులకు ఏమైనా చెప్పేటప్పుడు, దేహభ్రాంతితో చెబుతున్నామా? దేహభ్రాంతి లేకుండా చెబుతున్నామా చూసుకో! మామూలు మాటలైనా సరే! అప్పుడు ఏమైంది? జ్ఞానపద్ధతిగా బలపడతావు.
            (కట్టె మొదలగువానిని పోలిన జడపదార్థము శరీరము, నేను అని స్ఫరించి వ్యవహించునా?)
ఆగండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు సూటిగా? శరీరం జడపదార్థం, ఈ జడపదార్థం, ఇది నేను అనే తెలివి దానికి వుందా? లేదు కదా! ఎలా లేదు? నీ ఎదురుగుండా ఒక కట్టె వుంది. ఆ కట్టె నేను అంటోందా? అనేక జడపదార్థాలు వున్నాయి ఈ సృష్టిలో, అవి ఏమైనా నేను అంటున్నాయా? నేను అనే తెలివి దానికి వుందా? లేదు కదా! కాబట్టి మరి ఈ శరీరం కూడా జడపదార్థం కదా! మరి శరీరం నేను అనే అవకాశం దానికి వుందా? అసలు. లేదు కదా! నీవు కూడా మాట్లాడేప్పుడు ఏమంటున్నావు? నా శరీరం అంటున్నావు కదా ! కాబట్టి నేను వేరే, శరీరం వేరే కదా! శరీరానికి ఎప్పటికీ నేను అనే తెలివి రాదుకదా! మరి శరీరం నేను అని అంటావే? అది ఎప్పటికీ సాధ్యం కాదు కదా! ఇలా తెలుసుకో! (తరువాత)
            (...... దేహము... దేహములేదను బోధయే...బోధయని,.... అహంకారమని.... )
ఇట్లా ఎప్పుడైతే ఈ నేను శరీరాన్ని అనేదాన్ని కనుక నీవు ఆశ్రయించి ఏది చేసినా కూడా, అది అహంకారమై కూర్చుంటుంది. దీనిని నిరసిస్తే, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
            (అవిద్యయని, మాయయని, .... పలువిధములుగా చెప్పబడుచున్నది)
ఎన్ని పేర్లు పెట్టనీ వేదాంతములో, నువ్వు జీవుడు అను, మలిన మాలిన్యమను, మలం అను, మలము అంటే ఆణవ మలము, మాయయేమలము, మాయిక మలము అని మూడు రకాల మలములన్నమాట. (పంచ మలాలు అంటే ఏమిటి?) అది వేరే! ఇది త్రివిధ మలములు, ఇంకో రెండు add చేస్తే, అవి పంచమలములు. నీ బ్రహ్మవిద్యలో అన్నీ వుంటాయి అవన్నీ! మీకు ఇచ్చాం కదా! బ్రహ్మవిద్య అనే పుస్తకం, అందులో అన్నీ వుంటాయి. అలాగే తాపత్రయాలు అను, గుణ త్రయాలు అను, నువ్వు ఎన్నన్నా చెప్పుకో, అవన్నీ ఏమిటి? అహంకారం బాబు. దేహాభిమానం నాయనా! ఆ ఒక్కటే ఇన్ని అయ్యింది. ఏ పేరుతో చెప్పినా, ఆ దేహాభిమానమే. అది స్థూల దేహాభిమానం అను, సూక్ష్మదేహాభిమానం అను, కారణ దేహాభిమానం అను, మహాకారణ దేహాభిమానం అను. ఏదైనా దేహమే కదా! కాబట్టి దానికే అనేక పేర్లు. అనేక స్థితులు. కానీ అదంతా కలిపితే ఏమిటి? దేహాభిమానమే. అజ్ఞానమే. మాయ అన్నా అజ్ఞానమే. మిథ్య అన్నా అజ్ఞానమే. ఇన్ని రూపాలలో వుంది ఆ దేహాభిమానం. అర్థమైందా? అందుకనే ఏమంటున్నాడు? నువ్వు ఎటుచూసినా అదే కనబడుతోందిరా బాబు. చూచినప్పుడల్లా నువ్వు ఏం చెయ్యాలట ఇప్పుడు? కనబడుతున్న దేహాభిమానంలో, నువ్వు అది ఎట్లా కావో చూడు. అర్థమైందా?

            నువ్వు అది కావు కదా! అది ఎట్లా కావు అనే దృష్టితో దానిని చూడడం నేర్చుకో. ఎలాగయ్యా? ఇది సాధ్యం? ఒక వ్యక్తి వచ్చాడండి. ఇవాళే మొదటిసారి చూస్తున్నావు. అతన్ని ఎలా చూశావు? ఇతనికి నాకు ఏమిటి సంబంధం? ఏ సంబంధమూ లేదు. అంటున్నావా? లేదా? అవునా కాదా? అలా చూడు. వీటిని కూడా. అలా చూడాలనే దృఢమైన నిర్ణయం వుండాలి నీకు. అప్పుడు ఏమి చేస్తావు? అలా చూస్తావు. అప్పుడు ఏమయ్యావు? పూర్వం గతానికి సంబంధించినటువంటి దేహాభిమానము, నేను దేహాత్మ స్వరూపుడను, శరీరమే నేను, ఆ అభిమానంతో చేసిన విధానము, ఆ జ్ఞాపకాలు అవేమీ నీమీద పనిచేయ జాలవు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్ళే. (బాగున్నావా?) నువ్వు కొత్తవాడివి కాదు నాయనా సనాతనుడవు. ఎవరు వాడు? సాక్షి. ఆ ఆత్మ స్వరూపము. అది పాతది. అది ఎప్పుడూ కొత్తది కాదు. మరి కొత్తది ఏమిటి? దేహం ఎప్పుడూ కొత్తదే. పనిముట్టు ఎప్పుడూ కొత్తదే. ఈ పనిముట్టుతో పని అయిపోయింది విసిరి అవతల పారేశావు, కొత్త పనిముట్టు తెచ్చుకున్నావు. ఇంతే జనన మరణాలు అంటే. దేనికి భయపడతావు? పనిముట్టు పారేసినందుకు ఆనందిస్తావా? కొత్తపనిముట్టు తెచ్చుకున్నందుకు ఆనందిస్తావా? ఇదీ కాదు, అదీ కాదు. (ఇది కొత్తది అని తెలిసినప్పుడు భ్రాంతి వుండదు కదా!) భ్రాంతి వుండదు కదా! ఆఁ... దీనికీ నాకు ఏమిటయ్యా సంబంధము. నాకేమీ సంబంధము లేదు దీనితోటి. ఈ పనిముట్టు తెచ్చుకున్నాను, ఒక పని నిమిత్తమై. ఆ జ్ఞానం నిమిత్తమై ఈ పనిముట్టును తెచ్చుకున్నాను. అజ్ఞానం పోగొట్టుకోవాలి. జ్ఞానం పొందాలి. ఆ పని నిమిత్తం ఈ పనిముట్టు తెచ్చాను. వాడాను, పారేశాను. ఎక్కడ పారేస్తే ఏమిటి? వల్లకాటిలో పారేస్తే ఏమిటి? నీళ్ళల్లో పారేస్తే ఏమిటి? అడవిలో పారేస్తే ఏమిటి?

            అంటే ఏమిటి ఇట్లా చూడాలయ్యా! నువ్వు రోజువారీ జీవితంలో, జనన మరణాలకు సంబంధించినవి గానీ, జనన మరణాల మధ్యలో వున్న జీవితానికి సంబంధించినవి కానీ, ఇట్లా చూడడం అలవాటు చేసుకుని, నిరసించాలి వాటిని. అజ్ఞానాన్ని నిరసించాలి. ఆ లోకవాసన, శాస్త్ర వాసన, దేహవాసనని నిరసించాలి. మూడు గుణాలను నిరసించాలి. ఈ నిరసించే పద్ధతిలోకి నువ్వు రానంత వరకూ కూడా, నీవు ఆత్మ అనేటటువంటి స్థితిలో నిలబడలేవు. దేహాభిమానాన్ని నిరసించమని చెబుతున్నాడు అందుకోసమే. ఇప్పటి వరకూ ఏం చేశావు? దేహాభిమానాన్ని బాగా బలపరిచావు. అర్థమైందా అండీ! ఎందుకని? దానికి అదేగా బోధించావు. వాటికి పుట్టి, బుద్ధి ఎరిగినప్పటినుంచి మనం బోధించింది ఏమిటి చెప్పండి. ఎంతసేపు నాయనా! జాగ్రత్తగా వుండు. వాడికి ఏమీ పెట్టమాకు. అన్నీ నువ్వే శుభ్రంగా తిను. ఇదేగా మనం చెప్పేది చిన్నపిల్లలకి. మొదటి నుంచి. ఈ వస్తువు నీదేనా? ఈ పెన్సిల్‌ ఎవడిదిరా. నాదే. వాడు నాదే అనంగానే, మనం మహదానంద పడిపోతూ వుంటాము. ఈ చొక్క ఎవడిది? నాదే. ఇదేగా పిల్లలకి చిన్నప్పటినుంచి నేర్పించింది. ఎందుకని? బాగా మనం దాంట్లో బలపడి వున్నాము. వాడుకూడా బలపడితే మహదానందం. అంతా పరమాత్ముడు ఇచ్చిందే కదా! ఈ సృష్టి. అనే దివ్యత్వ భావనలో చూస్తే, నీదేది? నాదేది? వున్నదా ఇక్కడ? నువ్వు తెచ్చుకున్న పనిముట్టే నీది కాదు. అది ప్రకృతిలో భాగం. నీవు అంటావా? నీవు సాక్షివి. అది పరమాత్మలో భాగం. నువ్వే లేనివాడవు. ఈ ప్రకృతి అంతకంటే లేనిది. మరి ఆ లేనిదానిని పట్టుకుని, బలపడిపోయాను అంటావేమిటి? అర్థముందా ఏమైనా? కాబట్టి నీవు ఇలా విచారణ చేయడం నేర్చుకో! దేహాభిమానాన్ని నిరసించాలి. ఆ దృష్ట్యా వున్నటువంటి లోకవాసనా, శాస్త్రవాసనా, దేహవాసనా నిరసించాలి. మూడుగుణాలని నిరసించాలి. మూడు అవస్థలని నిరసించాలి. ఇదంతా ఎందులో భాగం? అదంతా దేహాభిమానమేరా బాబు. ఇలా ఎప్పుడైతే నువ్వు నిజజీవితంలో జీవిస్తావో, అప్పుడు నీకు ఆత్మానుభవం సాధ్యం అవుతుంది. ఇవి నిరసించకుండా ఎప్పటికీ సాధ్యంకాదు. నిరసించినప్పుడు ప్రపంచం ఎవరూ ఒప్పుకోరు కదండీ!

            నువ్వు పనిముట్టు ప్రపంచం కోసం తెచ్చుకున్నావా? జ్ఞానం కోసం తెచ్చుకున్నావా? ప్రపంచం కోసం తెచ్చుకోలేదుగా. వీళ్ళల్లో ఎవరు చెబితే తెచ్చుకున్నావు? ఈ పనిముట్టుని? పోనీ వీళ్ళల్లో ఎవరు చెబితే రేపొద్దిన వదిలేస్తావు? నీ జనన మరణాలకు వీళ్ళా కారణం? కాదు కదా!

            మరి నెపం వాళ్ళ మీద పెడుతావెందుకు? తప్పించుకోజూస్తున్నావు. ఎవరినుంచి తప్పించుకుంటావు? నువ్వు జన్మజన్మలు ఎత్తినా నీ అజ్ఞానం నీవెంటే వస్తుంది. నువ్వు జన్మజన్మలు ఎత్తినా నీ జ్ఞానము నీవెంటే వస్తుంది. అది ఎక్కడికీ పోదు కదా!  ఆ అజ్ఞానము పోయేది కాదు, ఈ జ్ఞానమూ పోయేది కాదు. సృష్టిలో వున్నటువంటి అందరిలో వుంది ఇది. ఎందుకు వుంది? దానిని తెలుసుకుని, ప్రయత్నం చేసి, “మారే దాంట్లో మారని దానిని గుర్తించాలి”. అజ్ఞానావృతంగా కనబతున్నదాంట్లోనే జ్ఞానం వుంది. ఆ జ్ఞాన దృష్టితో చూడడం నీకు రావాలి అంటే, నువ్వు ఇట్లా వుండాలి కాబట్టి పరమాత్మ అట్లా ఏర్పాటు చేశాడు. అప్పుడు ఏమైంది? ఈ సృష్టి అంతా గురువు అయ్యింది. ఈ సృష్టి అంతా బోధించేదే. అది చక్కగా చెబుతోంది, దేహాభిమానాన్ని నిరసించమంటోంది. దుఃఖాన్ని వదిలెయ్యమంటోంది. ప్రపంచంలో ఎవడైనా మనదగ్గరకు వచ్చి, నువ్వు బాగా దుఃఖిస్తావా? అంటే మనం ఏం చెబుతాం? వీడెవడురా బాబు, నన్ను దుఃఖిస్తావా అని అడుగుతాడు ఏమిటి? అంటామా లేదా? ఈ సృష్టి ఎప్పుడైనా నిన్ను దుఃఖించమని కోరిందా? కోరలేదు కదా! మరి నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఈ సృష్టి ఏదో బోధించింది అంటావేమిటి? సృష్టి ఎప్పుడూ జ్ఞానాన్నే బోధిస్తున్నది. నీవు అజ్ఞాన దృష్టితో చూడడం చేత, ఈ సృష్టి అంతా అజ్ఞానంలా, మాయలాగా కనబడుతోంది. జ్ఞాన దృష్టితో చూస్తే, అంతా పరమాత్మయే. అసలు మాయకు వునికి యేది? మిథ్యకు ఉనికి యేది? లేదు కదా అది. లేనివి కదా! మాయ అంటేనే అర్థం లేనిది అని. మిథ్య అంటే అర్థం లేనిది అని. మరి ఈ ప్రపంచం అంతా ఏమిటి? అంతా పరమాత్మే. నేను పరమాత్మను అయితే, ఈ సృష్టి పరమాత్మ కాదా? అది కూడా పరమాత్మే. ఇది సమిష్ట్యానుభవం. ఇది బ్రహ్మానుభవం. వ్యష్టిగా చూస్తే ఆత్మానుభవం. సమిష్టిగా చూస్తే బ్రహ్మానుభవం. ఈ రకంగా జీవన్ముక్తిని, విదేహముక్తిని పొందుతారు. అట్లా పొందాలి అంటే, క్రమం ఎలాగ? దేహాభిమానాన్ని నిరసించాలి. మూడుగుణాలని నిరసించాలి. మూడు వాసనలని నిరసించాలి. మూడు అవస్థలని నిరసించాలి. ఎంతటి కష్టమైనా సరే! ఆ కష్టం అంతా ఏమిటి? నీ అజ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, అంతకు మించి ఏమీ చేయటం లేదు. ఏం ప్రపంచాన్ని ఉద్ధరించే కార్యక్రమం ఏమీ చేయడం లేదు. నీవు స్తంభానికి కట్టివేయబడి వున్నావు. ఎవరు కట్టేశారు? నిన్నునువ్వే కట్టేసుకున్నావు. ఎవరు విముక్తి చేయాలి? నువ్వే చేసుకోవాలి. మరి గురువు పరమాత్మ ఏం చేస్తారు? నీకు ఆ శక్తి వచ్చేట్టుగా చేస్తారు. నువ్వు ఎట్లా విప్పుకుంటే, విప్పుకోగలవో మార్గదర్శనం చేస్తారు. నీకు ఆ సామర్థ్యం వచ్చేట్టు చేస్తారు. ఎలా నువ్వు మారితే, నిరసించుకోగలవో నీకు ఆ తెలివి వచ్చేట్టు చేస్తారు. అంతేగాని, తాను వచ్చి స్వయంగా నీ కట్లు విప్పే అవకాశం లేదు. ఎందుకని? అట్లా విప్పితే ఏం చేస్తావు? నాకు మళ్ళా బంధమే బాగుంది అని, మళ్ళా చుట్టేసుకుంటావు. నీవు స్వానుభవజ్ఞానంతో ముక్తిని పొందాలి కానీ, నిన్నేదో తీసుకెళ్ళి ఆ అటక మీద కూర్చోపెడితే ఎంతసేపు వుంటావు? కిందే బాగుంది అని ఢాం అని పడుతావు. కాబట్టి ఈ ప్రపంచంలో అనుభవజ్ఞానం వున్న ఎవ్వరూ కూడా అలా చెయ్యరు. నీకు ఆ సామర్థ్యం వచ్చేట్టు చేస్తాము. అందుకని ఏం చేయమంటున్నాడు? నేను ఎవడను అని విచారణ చేయి మొట్టమొదట. ఆ ప్రశ్నతో, ఆ నిర్ణయంతో మొదలుపెట్టు. అప్పుడు స్వరూపస్థితిని పొందగలుగుతావు. సాయిరాం.