File No.12




మేలుకొలుపు (ఆత్మ)
1)         తెల్లవారెను భ్రాంతి చీకటి | దీరిపాయెను జ్ఞానము
            దయంబల్ల నాయెను| మనసు తిరమై | యెల్ల బయ లాయెన్‌ |
            ఆత్మా మేలుకొనవే ||
2)        ఉన్నదున్నట్లుండి పాయెను | విన్న కన్నది లేకపాయెను |
            యెన్నగా యీ యెఱుక మూలము | యేమి లేదాయెన్‌ ||
            ఆత్మా మేలుకొనవే ||
3)        తోచు వృత్తులు దొలగి పాయెను | సూచనయు
            గురువాక్య మాయెను | ఉచ్ఛ నీచంబనెటి పలుకులు
            ఉత్తవై పాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
4)        భూతపంచక శూన్యమాయెను | కూత లేమియు
            లేకపాయెను | పాతకంబులు పారిపాయెను | పరమ
            పదమాయెన్‌ ఆత్మా మేలుకొనవే ||
5)        ఇల్లు బయలై తెల్లనాయెను | కల్ల బోధలు చెల్లి
            పాయెను | పిల్ల లాటల పోలికాయెను | ప్రేమ
            లేదాయెన్‌ ||            ఆత్మా మేలుకొనవే ||
6)        పిండ బ్రహ్మాండముల నుండెటి |
            దండియహముల తెలివి బాయెను | ఖండ
            ఖండములోను జూడ య | ఖండమై పాయెన్‌ ||
            ఆత్మా మేలుకొనవే ||
7)        హరిహరాదుల కందకుండెటి | గురుని
            వాక్యము నమ్మికాయెను | పరమపదమే బట్ట
            బయలై | భావమిక బాయెన్‌ ||             ఆత్మా మేలుకొనవే ||
8)        జనన మరణము జడుపు తీరెను | కనుల వేడుక
            కాలిపాయెను | మనసు యింద్రియ చలము
            లెల్లను | మాయామై పాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
9)        జగతి విబుధుల స్వప్నమాయెను | పగలు రాతిరి
            లేక పాయెను | ఒకటి రెంటి మూలమారెను |
            ఊహా లేదాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
10)      ఇంపుగా నలగండ్ల వెలిగెటి | వెంపటి నరసింహ్వ
            గురువరు | పంపునను గోపాల కవిలో | బయలు
            బయ లయ్యెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
-*-*-*-
1)         తెల్లవారెను మోహతిమిరం | బెల్ల బాయెను జ్ఞాన
            వుదయం | బల్ల ప్రబలం బాయ | తన మనసెల్ల
            స్థిరమాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
2)        మూడు గుణములు | ముణిగి పాయెను |
            ఏడు ధాతువు | లెనుక బట్టెను | ఏడ యేమియు |
            లేకపాయెను | ఎఱిగి మేల్కొనవే ||
            ఆత్మా మేలుకొనవే ||
3)        అష్ట తనువులు అడవి బట్టెను | అష్ట మదము లహామిక
            మణగెను | కష్ట సుఖముల | కాంక్ష దీరెను |
            ఘనత మేల్కొనవే ||         ఆత్మా మేలుకొనవే ||
4)        అష్ట ప్రకృతుల ఆటలుడిగెను | అష్టపాశములపుడె
            వీడెను | ఇష్ట మేమియు లేకపాయెను |
            ఇపుడు మేల్కొనవే ||        ఆత్మా మేలుకొనవే ||
5)        వాసనాత్రయ మొదలి పాయెను | ఈషణ త్ర
            యమిపుడె వీడెను | విన్న దేమియు లేక పాయెను |
            వేగ మేల్కొనవే || ఆత్మా మేలుకొనవే ||
6)        సాగరంబుల చప్పు లుడిగెను | వాద భేదము
            వదలిపాయెను | నాద మప్పుడె నశ్యమాయెను |
            నయమె మేల్కొనవే ||      ఆత్మా మేలుకొనవే ||
7)        మండలములనె మమతమానెను | కుండలస్థలి
            కూలిపాయెను | పండు వెన్నెల భావమాయెను |
            బరగ మేల్కొనవే || ఆత్మా మేలుకొనవే ||
8)        మనసు బుద్ధియు మరల జనియెను | మాని పాయెను
            జనన మరణము | మమత ఏమియు లేక పాయెను
            మరియు మేల్కొనవే || ఆత్మా మేలుకొనవే ||
9)        గురుడు శిష్యుండేక మాయెను | కులము గోత్ర
            ము లేక పాయెను | కుడి యడమలు సమమె
            ఆయెను | గురు తెఱుక బాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
10)      పరశురాముని సీతరాముల | భజన నిత్యము
            సేయుటాయెను | బాగుగా శేషమ్మ భావము |
            బయలులో లే దాయెన్‌ || ఆత్మా మేలుకొనవే ||
                        -*-*-*-

మేలుకొలుపు (జీవ)

1)         కటకట మోసమాయెను |
            మోసమాయెను జీవ చూడగ | మోహపాశము
            లధిక మాయెను | గాశి జెందగ, జేసె నీగతి |
            కర్మ మేమందూ || జీవా మేలుకొనవే ||
2)        కల్పశతముల కన్న మిక్కిలి | కాల మాయెను,
            తిరిగి చూడగ | అల్ప సుఖ మని, కలలో మురి
            యుచు | ఆడుచున్నావు ||  జీవా మేలుకొనవే ||
3)        కోటి జన్మము లెత్తియును | శతకోటి దుఃఖ
            ము లనుభవించుచు | నాటి మాటలు దలచు
            కొంటె నాటు నీ మదికి ||  జీవా మేలుకొనవే ||
4)        ఇరువ దొక వెయ్యి ఆరు నూరులు | జరుగు హం
            సలు తరుగు నాయువు | హరిహరాదులు వచ్చి
            నిలచిన | ఆగదీ తనువూ ||  జీవా మేలుకొనవే ||
5)        లేనిపోని దుఃఖజాలము | లోనబడి చెడి
            పోవు టెందుకు | మాన అవమానంబు లని | నీ మమత    
            విడ లేవూ ||  జీవా మేలుకొనవే ||
6)        నిజగురుండగు సూర్యుడిప్పుడు | నిజముగా
            ఉదయించె చూడుము | త్రిజగముల వారంత
            మేల్కొని | తెలివి గన్నారు || జీవా మేలుకొనవే ||
7)        బట్టబయలును గురుడు జూపిన | నట్టు లేకను
            పుడమి అంచున | పట్టు విడువక గుట్టు మరు
            వక | దిట్టమై పోవె ||  జీవా మేలుకొనవే ||
8)        మాయ తనువై మాయతానై | మాయ పను
            లను జేయుచును మరి | మాయ తన మర్మం
            బుగనే | మాయమై పోవున్‌ ||  జీవా మేలుకొనవే ||
9)        ద్వాదశిషోడషులనె జలధార కర్ణములందు
            సోకిన | బాధలన్నియు తొలగి నీవిక | భ్రాంతి
            వొదిలెదవూ ||  జీవా మేలుకొనవే ||
10)      భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరుండిటు
            రానె వచ్చెను | వేగ గని తను మన ధనంబులు
            వీడి | శరణనవే ||  జీవా మేలుకొనవే ||
11)       పీలుఖాన శంకరుండని పిలిచి | ప్రభువరుం
            డేలినారట | మూలమూ లేనట్టి యెఱుకను |
            ముంచి వేసిరటా ||  జీవా మేలుకొనవే ||
శ్రీ మద్రాజాధిరాజ మహారాజా యోగీంద్ర చంద్ర భాగవత కృష్ణ దేశిక ప్రభు మహరాజుకీ  జై జై జై  o తత్‌సత్‌  ఓం శాంతిః శాంతిః శాంతిః
            గురువును ఆశ్రయించినప్పుడు ఏం తెలుసుకోవాలి అసలు? అంటే, శాస్త్రం ఏం తెలియజేస్తుంది? గురువు ఏం తెలియజేస్తాడు? అసలు గురువును ఆశ్రయిస్తే, మీరు ఏం తెలుసుకోవాలి? ఏం ప్రశ్నించాలి? ఏం తెలుసుకుంటే అది ముక్తి? మోక్షం అవుతుంది? ఎన్నో రకాలుగా, ఎంతోమంది, ఎన్నోవిషయాలుగా దీనిని చెబుతూ వుంటారు. కానీ, సూటిగా ఒకే ఒక పాటలో, ఒకే ఒక పాఠంలో మొత్తము వేదాంతాన్ని ఇమిడ్చినటువంటిది ఇప్పుడు మీరు చదువుకునేటటువంటి మేలుకొలుపు. ఈ మేలుకొలుపు యొక్క అనుభవం, ఎవరికైతే పూర్తిగా వస్తుందో, వాళ్ళకి ముక్తి మోక్షం సాధ్యమౌతాయి. అనుభవజ్ఞానంగా రావాలన్నమాట. అయితే, అసలు గురువు ఏం తెలియజెప్తాడు? శిష్యుడు ఏమి అడగాలి? ఇది కదా తెలియాల్సింది. ఇది తెలియాలి అంటే, గురువుని ఆశ్రయించితే ఏం చెప్తాడయ్యా అంటే, పూర్వకాలం నుంచి ఏం చెప్పేవాళ్ళంటే, ఆయన తరించే మార్గం చెప్తాడు. గురువు ఏం చెప్తాడయ్యా అంటే, దేనికి పనికివస్తాడు ఆయన? తరించే మార్గం చెప్పడానికి పనికి వస్తాడు. అంతకు మించి గురువు దేనికీ పనికిరాడు. ఏం తరిస్తావయ్యా? అంటే, ఏం తరించాలో తెలియదు కదా! అర్థమైందా అండీ? రామ శబ్దానికి ఏమని వుందండి? తారక రాముడు కదా! అంటే అర్థం ఏమిటి? “రామ శబ్దాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, వాళ్ళు తరిస్తారు”. జీవుడు అనేటటువంటి భవసాగరాన్ని తరించడానికి ఒకే ఒక మార్గం రామ శబ్దం. రమయతి ఇతి రామః’ - రమించేటటువంటివాడు రాముడు. అంటే జీవుడు ఆత్మ అనేటటువంటి అనుభవంలో వుండడమే రమించటం అంటే. వేరే ఇంకేమి అర్థములు లేవండి. మనలో వున్నటువంటి హంస, ఈ హంస దాని మూలము ఎందులోనుంచి వచ్చిందటా? పరమాత్మ స్థితినుంచి హంస వచ్చింది. కాబట్టి ఈ హంసని ఆధారం చేసుకుని, ఎప్పుడైతే నీవు పరమాత్మ స్థితి యందు వుండేటటువంటి జీవితాన్ని కలిగివుంటావో, మూడు అవస్థలలోనూ నేను పరమాత్మ స్వరూపుడనే అనే స్థితిలో ఎప్పుడైతే వుంటావో, అప్పుడు ఈ అనంత సృష్టిలో జరుగుతున్నవన్నీ పరమాత్మకు ఎలా కనబడుతాయో, నీవు అలా వున్నావు. అలా వుండే స్థితిని అనుభవింపజేయడానికి కావలసినటువంటి నౌక, నావ ఏమిటయ్యా అంటే రామ శబ్దం. ఆ రా’  ‘’  అనేటటువంటి దాంట్లో రారా కు దీర్ఘం వున్నది కదండీ! రామ శబ్దంలో రమించేటప్పుడు ఆ దీర్ఘం వస్తుంది. ఆ హంస స్థితిని అధిగమించేస్తే అది విడిపోతుంది. కాబట్టి రామ అన్నా, హంస అన్నా అందుకే రెండు రెండు అక్షరాలు వున్నటువంటి శబ్దాలన్నీ కూడాను, తరించేటటువంటి శబ్దాలు. అందుకే పెద్దావాళ్ళు అందరూ సాయి, సాయి, సాయి, సాయి అదికూడా రెండు అక్షరాల శబ్దమే. ఏసు అది కూడా రెండు అక్షరాల శబ్దమే. అల్లా రెండు అక్షరాల శబ్దమే. శివ రెండు అక్షరాల శబ్దమేనండి. రామ, కృష్ణ నువ్వు ఎన్నైనా పెట్టుకోండి, దుర్గ మీరు ఎన్నన్నా తీసుకోండి, లక్ష్మీ అన్నీ రెండు అక్షరాల శబ్దాలే. దైవత్వానికి సంబంధించిన శబ్దాలన్నీ రెండు అక్షరాల శబ్దాలు వుంటాయి. కాళి రెండు అక్షరాల శబ్దమేనండి. ఇట్లాగ అన్నీ ఇంతే నండి. ఇలాగ ఈ రెండు అక్షరాల శబ్దములన్నీ కూడాను, హంసకి జోడించడానికి అనువైనటువంటి శబ్దాలన్నమాట ఇవి అన్నీ కూడాను. కారణం ఏమిటంటే దీని తరువాత ఏకాక్షరమే వుంటుంది. అది ఓంకారం. ఈ రెండు అక్షరాల శబ్దంలోనుంచి ఓంకారంలోకి మారిపోతారన్నమాట. సాధన చేసేటటువంటి వాళ్ళు. అలాగ అసలు మీరు గురువు దగ్గరకు వచ్చి ఏం తెలుసుకోవాలి? ఏమి అడగాలి? ఏం చెయ్యాలి? అని చెప్పాలి అనిఅంటే,

తారకము చూపెరుగ వలెనన్నా
సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుగొనుమా 
తారకము చూపెరుగ వలెనన్నా
సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుగొనుమా

మరపు తెరపనకుండ జాగ్రత నిరతమును స్వప్నా సుషుప్తులు
అరమరలు లేకుండ ఎప్పుడు స్థిరముగను జీవాత్మ చదివెటి

తారకము చూపెరుగ వలెనన్నా
సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుగొనుమా

ధరణి లోపల మూఢ మతులకు దొరకు బహు దుర్లభంబిది
గురు కటాక్షము వలన స్థిరమగు పరమపదవికి చేరె యుక్తిని
నేర్పవలె జీవాత్మ కిపుడన్నా
నేర్పెరిగి యుంటే మరవకను జపియించు తుండన్నా
ఈ జపము నెరిగినవారు నిర్మల బ్రహ్మ జ్ఞానులన్నా
జ్ఞానులైన వెనుకను సారెకును జపస్నాన మేలన్నా
స్నానంబు తెలిసిన వారె పుడమిలో రాజయోగన్నా

నారదాది మహా మునీంద్రుల తరచి బుధులచే కనిరి మంత్రము
మర్మమెరిగి నిమిషమైనను మరువ కుండగ పరంబు చేరిరి

తారకము చూపెరుగ వలెనన్నా
సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుగొనుమా

అండ పిండ బ్రహ్మాండ మంతటా నిండినది నిజగురుని మహిమ
పండిత జ్ఞానులకు భావంబు ఖండితంబుగ తెలియు
నీలో నుండె భూతంబు లైదు కను మన్నా
వాకిళ్ళు మూసి మండలంబులు దాట వలెనన్నా
ప్రణవమ్ము విడువక కొండనెక్కి తేరి జూడన్నా
వజ్రాలు దాపిన మండపమ్ములు మహిమ కనుమన్నా
తరచంగ పిమ్మట పండు వెన్నెల ప్రబలమగునన్నా

దండిగను పెంజీకటవ్వల యుండె బయలు ప్రభావం బెరిగి
కొండవలె ముందుండు భవమది మండి భస్మమై పొయ్యేటటుల

తారకము చూపెరుగ వలెనన్నా
సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుగొనుమా
ఆత్మారాముల కాన లేకనూ మూత్ర కొంపలో మునిగి చెడుదురు
నేత్రద్వారము నందు వెళ్ళిన సూత్రధారుని కాన లేకనూ క్షేత్రములకును పోదురేమన్నా

త్రేతాయుగము వారి ప్రతిమలు కల్పింప బడెనన్నా
మూఢులకు ముఖ్యము భూత పూజలందు ప్రేమన్నా
తనలో నున్న తత్వము నెవరు తరచి కనరన్నా
పాపిష్టి జన్మము ఎత్తి నందుకు ఫలము ఏదన్నా


మోతగల రుద్రాక్ష మాలలు నీతితో ధరియించి గొణిగిన
సత్యము, జ్ఞానంబు కనకను నిత్యమోక్షము చెందజాలరు

తారకము చూపెరుగ వలెనన్నా
సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుగొనుమా

కామ క్రోథము లారు మరచీ పామరత్వము పాడు చేసి
సోమరివై చెడక ఇలలో నియమ నిష్టలు లేని
ఆత్మారాములను ధ్యానింప వలెనన్నా

ధశరథుని పుత్రుని రాముడని తలచేరు కొమ్మన్నా
యోగులను మదిలో రమించువాడే రాముడగు నన్నా
జన్మాదు లాత్మారాము డెన్నడు ఎరుగ బోడన్నా
పామరులు తెలియక యముని మాయలో చిక్కుపడెరన్నా

బొమ్మలాట ప్రపంచములు కలిగి నమ్మి చెడుదురు నాణ్యమెరుగక
కమ్మటిగ శివ రామ మంత్రము నెమ్మదిగ అనుదినము జరిగేటి

తారకము చూపెరుగ వలెనన్నా
సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుగొనుమా

ఎక్కడెక్కడ వెదకి తిరిగిన అక్కడ వేదములు కలిసెను
నిక్కముగ జ్ఞానంబు కనుకను మక్కువతో పాషాన ప్రతిమకు
మ్రొక్కుదురు ఎటువంటి తెలివన్నా

నీ భ్రమల చేతను తిక్క బుద్ధులు విడువ బోరన్నా
నూటికిని, కోటికిని అక్కడొక్కడు చేరునేమన్నా
అస్థిరము తనువులు గ్రక్కునా గురుని జేరి కనరన్నా
పరస్త్రీల జూచి కుక్కవలె వేడి తిరుగ బోకన్నా

మ్రొక్కవలె పరమాత్మ గనుగొని త్రొక్కవలె అజ్ఞాన వృత్తులు
వెక్కసము లేకుండ రాముల మిక్కిలి కొనియాడె సమయము

తారకము చూపెరుగ వలెనన్నా
సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుగొనుమా

చదువు శాస్త్రము లేల
చిత్తము నిలిపితె నిజపదవి దొరకును
మదగజము వలె పలు విధంబులు మనసు చెదరిన వారికెప్పుడు
కుదురునా యోగంబు వినరన్నా

వైరాగ్యముంచి బుధుల చెంతకు చేరవలెనన్నా
దర్పణంబు గను పదిలంబుగ సాధించ వలెనన్నా
నేత్రద్వయంబులు తుదకు రెండును ఏకమౌనన్నా
ఆ మధ్యమున ఒకటి కద్దు ఆపోజ్యోతిని కనరన్నా

పెద్దల సాంగత్యమున ప్రసిద్ధమైన బోధ కనుగొని
నీ వద్దనున్న వికార గుణములు వదలు మనెను పీరు మొహిద్ది

తారకము చూపెరుగ వలెనన్నా
సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుగొనుమా

ఈ గ్రంథము పేరు తారకామృత సారము. ఈ పుస్తకము అంతా పాటలతోనే వుంటుందండి. పూర్వము అంతా ఇలాగే నేర్పేవాళ్ళు. పూర్వ పద్ధతి అన్నమాట ఇది. ఎందుకంటే ఇలా రోజూ పాడుతూ వుంటే, ఈ పాటలే అలవాటు పడిపోయి ఈ భావంలో నిలబడిపోయి చాలా తేటతెలుగులో వుంటాయండి, ఏమీ అర్థము ఎవ్వరూ విడగొట్టి చెప్పక్కర్లేదు. సూటిగా. ఇదే స్మరణ చేసుకుంటూ, పాటలు పాడుతూ, పనిచేసుకుంటూ ప్రశాంతంగా వుండేవాళ్ళన్నమాట. ఇప్పుడేమిటంటే ఇవన్నీ పోయి, మనకు అర్థం కాని, సంస్కృతభాషలో వున్న విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు పట్టుకునేటప్పటికి, ఆ భాష మనకు తెలియదు. దాని అర్థం మనకు రాదు. కాబట్టి అర్థమయ్యేటటువంటి భాషలో వున్నటువంటివి, మీరు నేర్చుకున్నట్లయితే రోజువారీ మీరు వినటానికి అనుకోవడానికి సూటిగా వుంటాయన్నమాట ఇవి. ఇవి అందరూ అనువు. దీనికి ఏం పెద్ద సంగీతం గట్రా అవసరం లేదు. వచ్చిన వాళ్ళు పాడితే అందంగా వుంటుంది. ఇప్పుడు నాకు సంగీతం రాదు కాబట్టి వూరికే చదివాను. అయితే దీన్ని బాగా పాడే వాళ్ళు కూడా వున్నారు. కాబట్టి ఎప్పటికైనా తెలుసుకోవలసింది ఏమిటయ్యా అంటే, ఈ తారకామృత సారం అంతా కలిపి, ఒక వాక్యంలో చెప్పాలయ్యా అంటే, గురువును చేరి ఏం కనుక్కోవాలయ్యా అంటే, రాను ఎటులో పోను ఎటులో, అయినది ఎటులో కానిది ఎటులో, కనియు కానని తత్వమెటులో తారకము చూపెరుగవలెనన్నా, సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుగొన్నా. రాను ఎటులో పోను ఎటులో, ఎలా వస్తున్నావు? ఎలా పోతున్నావు? చాలా ముఖ్యమైన అంశమండి. ఎందరో ఎన్నో తెలుసుకుంటారు గానీ, ఎలా వస్తున్నావు, ఎలా పోతున్నావు అనే అంశాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం చేత, జీవితం వృధా అయిపోతుంది. ఈ ఒక్క అంశం తప్ప మనం జీవితంలో అన్నీ పట్టించుకొంటాం. అన్నీ ప్రధానమే మనకి. అన్నీ ముఖ్యమే. ఎవరు మనని చూసి నవ్వారు, ఎవరు మనని చూసి ఏడ్చారు? మనము ఎంత సేపు నవ్వాము, మనం ఎంతసేపు ఏడ్చాము ఈ గోల పట్టించుకోవడమే జీవితమంతా సరిపోతుందండి. ఎట్లా వచ్చావు? ఎట్లా పోతున్నావు? ఈ ప్రాథమికమైన సూత్రాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయండి. ఈ మిగిలినటువంటి నవ్వులు, ఏడ్పులు ఎప్పుడూ వుండేవే. ఇవన్నీ మారిపోయేవే కదా! ఎంతకాలము ఎవరి కోసమని నవ్వుతావు, ఎంతకాలము ఎవరి కోసమని ఏడుస్తావు? ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎంతకాలమైనా కానీ, దాని వలన ఉపయోగమూ లేదు. కాబట్టి సాక్షిత్వంతో నిమిత్త మాత్రంగా వుండడం జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఏం తెలుసుకోవాలయ్యా? రాను ఎటులో, పోను ఎటులో, ఎలా తెలియాలట? నీవు ఎలా వస్తున్నావు? ఎలా పోతున్నావు? అంటే జీవుడు ఎలా వస్తున్నాడు? ఎలా పోతున్నాడు? పరమాత్మ నుంచి ఆత్మ ఎలా సృష్టిలోకి వస్తున్నది, ఎలా పోతున్నది? సృష్టి ఎలా వస్తున్నది? ఎలా పోతున్నది? పరమాత్మ ఎలా ఏర్పడుతున్నాడు, ఎలా పోతున్నాడు? నాలుగు స్థితులకి కూడా రాకడ, పోకడ వున్నది.

            పిండము, పిండములోని సాక్షి. బ్రహ్మాండము, బ్రహ్మాండములోని సాక్షి. ఈ నాల్గింటికి వుందట ఈ జాడ్యం. ఈ అంటువ్యాధి, ఈ రావడం, పోవడం అనే అంటువ్యాధి. అంటువ్యాధి అంటే ఏమిటంటే సంగత్వదోషం అన్నమాట. అంటువ్యాధి అంటే వేరే అనుకునేరు, సంగత్వ దోషం. అంటే జేరిపోవడం అన్నమాట అందులో. ఆ దేవుడికి శరీరంలో చేరగానే మిగిలినది అంతా మరచిపోయి శరీర భ్రాంతి కలిగింది. ఏర్పడనంతసేపూ బాగానే వున్నాడు. తల్లి గర్భంలోంచి విడుదలయ్యేంత వరకూ దైవం బాగా తెలుసు. బయటపడగానే దైవం మరచిపోయాడు. ఈ రకంగా ప్రతిదీ ఇంతే. రాను ఎటులో, పోను ఎటులో. ఇంకేం చేయాలండి? రానుదెటులో, పోనుదెటులో, అయినదెటులో, కానిదెటులో. ఏది ఎట్లా అయివున్నది? ఏది ఎట్లా లేకుండా వున్నది. ఈ రెండూ తెలియాలట. ఇప్పుడు మనం లేనిదానిని ఆశ్రయించాలా? వున్నదానిని ఆశ్రయించాలా? వున్నదానిని ఆశ్రయించడానికి వీలౌతుంది. లేనిదానిని ఎట్లా ఆశ్రయిస్తావు అసలు? సాధ్యం కాదు కదా!
            మనం ఇప్పటి వరకూ వున్న దానిని ఆశ్రయించామా? లేని దానిని ఆశ్రయించామా? (లేని దానిని) ఎందుకని? ఉన్నది తెలియక. కాబట్టి అయినది ఎటులో, కానిది ఎటులో, ముందు ఈ వివరం తెలియాలట.  సద్గురువును ఆశ్రయించి అసలు ఏదయ్యా వున్నది? ఏది లేదయ్యా? ఇది మొట్టమొదట విచారణ చెయ్యి. ఎట్లా వచ్చావు? ఎట్లా పొయ్యావు. ఏది వున్నది? ఏది లేదు. ఇప్పుడు ఇలా విచారణ చేయడాన్ని ఏమన్నారట? కనియు, కానని తత్వ మెటులో. ఇప్పటి వరకూ చూస్తు్న్నది ఏమిటి? అది ఎట్లా లేకుండా పోయింది? వున్నది ఏమిటి? తత్వం. ఇదంటా ఇట్లా విచారణ చేయడాన్ని తత్వం అంటారండీ! తత్వం అంటే వేరే ఏమీ లేదు. M.A philosophy ను PhD చేస్తేనే తత్వం అవ్వదు. తత్వం అంటే ఏమిటి అంటే ఇలా విచారణ చెయ్యాలి. రాను ఎటులో, పోను ఎటులో. అయినది ఎటులో, కానిది ఎటులో. ఈ రెండు విచారణలు కనుక చేస్తే, అది తత్వ విచారణ అవుతుంది. అర్థమౌతుందా అండీ!
            సత్సంగత్వము అంటే ఈ విచారణే సత్సంగము. మిగిలినది అంతా సత్సంగత్వము అవ్వదన్నమాట. అవన్నీ సత్కర్మలు. అంటే అర్థము ఏమిటి? మీరు భగవద్గీత వినొచ్చు, విష్ణుసహస్రనామం వినొచ్చు. లలితా సహస్రనామం వినొచ్చు. పూజలు చెయ్యొచ్చు, జపాలు చెయ్యొచ్చు. నవవిధభక్తి మార్గాలన్నీ ఆచరించవచ్చు. అవి ఏమిటవి? సత్కర్మలు. అవి ఏమిటి? సత్కర్మలు. కర్మ అంటే ఫలితం వుంటుందండి అక్కడ. ప్రేరణ వుంటుంది. ఫలితం వుంటుంది. అంటే ఆ సమయం గంట కొట్టేటప్పటికి విష్ణుసహస్రనామం చదవకపోతే ప్రమాదం వచ్చినట్టు వుంటుంది. ఇలాగ దాంట్లో అన్నీ వుంటాయన్నమాట. కర్మకు ఫలితం వుంటుందన్నమాట. నువ్వు సత్కర్మ చేసినా కూడా ఆశించి చేస్తావన్నమాట. ఆశ, అపేక్ష వుంటుందన్నమాట. అదే తత్వవిచారణలో జ్ఞానాపేక్ష తప్ప ఇంకేమీ వుండదు. ఏది అపేక్షిస్తే మిగిలినవన్నీ తొలగిపోతాయో, అది ఒక్కటే వుంటుందండి. కాబట్టి సత్సంగత్వము అంటే అర్థం ఏమిటంటే, విషయ సంగత్వమేమో కర్మ, గుర్తుపెట్టుకోండి. విషయ సంగత్వము చేరితే కర్మ. సత్సాంగత్యము ఏది సత్యము? అంటే తత్వవిచారణ చేస్తే తెలియబడేది ఏదైతే వున్నదో, అది సత్‌. అర్థమైందా అండీ! తత్వం సత్యం కాదు. మళ్ళా తత్వం సత్యమనుకుంటారు చాలా మంది. తత్వాన్ని గూర్చి విచారణ చేస్తున్నాను కాబట్టి తత్వం సత్యమనుకోమాకు. ఈ తత్వ విచారణ ఒక స్థితిని అందింపచేస్తుంది. ఒకస్థితిని అనుభవజ్ఞానంలో తెలియజేస్తు్ంది. ఆ స్థితి సత్యం. అది సత్‌.
            తత్వవిచారణ అంటే ఏమిటి? తత్‌ త్వం అనే రెండు అక్షరాలున్నాయి. తత్వంలో. తత్‌+త్వం. త్వం అంటే నేను, తత్‌ అంటే అది. రెండు వున్నాయా లేవా ఇప్పుడు? త్వం అనే నేనువున్నాను. తత్‌ అనే జగత్తువున్నది. అంతేకదండీ! బాహ్యంగా చూస్తే ఇద్దరము వున్నామా లేదా? జగత్తువుంది, నేనున్నాను. లోపలికి తిరిగావు. ఇప్పుడేముంది? అంతరాత్మ. త్వం. త్వం ఎవరు? అంతరాత్మ. తత్‌ ఎవరు? పరమాత్మ. అర్థమైందా అండీ! ఇప్పుడు ఇవి రెండు రెండూ వున్నాయి కదా! తెలుసుకోవాలి కదా! నువ్వు జీవితమంతా చేసిన ప్రయత్నం ఏమిటండీ? త్వం అనే నేను. తత్‌ అనే జగత్తుని తెలుసుకుని జీవించడం నేర్చుకున్నాను బాహ్యంలో. స్థూలంగా మాట్లాడితే. లోపలికి తిరగితే. నీ అంతరాత్మ పరమాత్మని ఎరగాలి. ఆ పరమాత్మ స్థితి తెలుసుకుని జీవించాలి.  అంతే కదా! లోపల భాగం ఏమన్నా పనికి పూర్తైందా? కానీ దానికోసం తెచ్చుకున్న పనిముట్టు ముప్పాతిక అరిగిపోయింది, ఇంక పాతిక ఎప్పుడు అరుగుతుందో దానికే తెలియదు. ఎందుకని? మరణం ఎప్పుడో, ఎచ్చటో, ఎలా తెలుసు నీకు? ఇంటనో, నట్టనడివి యందో, బావియందో, ఎక్కడో నీకు ఎట్లా తెలుసు? పొలమందో, కాటియందో ఏమైనా తెలుసా? ఏమీ తెలియదే! మరి దేనికి సంసిద్ధుడువి అవుతున్నావు? జీవితకాలమంతా దేనికి సంసిద్ధుడవి అయినావు? (బాహ్యానికి) ఏమిటి ప్రయోజనం? ఈ బాహ్యం అసలు లేదుగా. ఉన్నదంతా ఏమిటి? ఎప్పుడూ వున్నది ఏమిటి? అంతరాత్మ, పరమాత్మే. (ఇప్పుడు దాకా వున్నది అనుకున్నది ఇదే కదా!) ఆఁ... అందుకని ఇప్పటి వరకూ దేనిని ఆశ్రయించావు? లేనిదానిని ఆశ్రయించావయ్యా బాబు. ఎప్పుడూ వున్నది ఏమిటయ్యా? అంతరాత్మ, పరమాత్మ. నువ్వు దేహాలు ఎన్ని మార్చినా, ఎప్పుడూ వుండేది ఏమిటి? అంతరాత్మ, పరమాత్మ. *అన్ని దేహాలని ప్రశ్నించు. అందరూ ఏమి ఒప్పుకుంటున్నారు? అంతరాత్మ వుందని ఒప్పుకుంటున్నారు. ఎన్ని దేహాల అన్నింటిలో కూడా వున్నదదేగా, అంతరాత్మ వుందని ఒప్పుకుంటున్నాడా లేదా? ఏరా నీకు అంతరాత్మ వుందా లేదా? ఉంది. పరమాత్మ వున్నాడా లేదా? ఒప్పుకుంటున్నావుగా. మరి ఎప్పుడూ వున్నది ఏమిటి? అంతరాత్మ, పరమాత్మ. అంటే అంతరాత్మ, పరమాత్మ స్థితిని ఎరగటం కోసం, దేహం వచ్చింది. కానీ, దేహాన్ని దేనికోసం వినియోగించాము? (కర్మల కోసం) ఏమైంది? ఇలాగ లేనిదానిని ఆశ్రయించేటటువంటి దాంట్లో భ్రాంతి వచ్చింది. లేనిదానిని ఆశ్రయించడమే భ్రాంతి అంటే. అందువల్ల అన్ని భయాలు వచ్చినాయన్నమాట. అర్థమైందా అండీ! ఈ లేనిదానిని ఆశ్రయించడం వల్లే, భ్రాంతి భయము ఏర్పడ్డాయి. భ్రాంతి ఎప్పుడైతే ఏర్పడిందో భయం ఏర్పడింది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. ఏది చెయ్యాలన్నా అమ్మో నాకు భయం అన్నారంటే, దాని వెనుకాల భ్రాంతి వుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మనసులో, భావనలో విచారణ చేసుకోండి. ఏ పనిచేయాలన్నా, ఏ అంశాన్ని ఎదుర్కోవాలన్నా అమ్మో! నాకు భయమండి. భయం అనంగానే ఏమైంది? అప్పుడు? సహజంగానే దాని వెనుకాల భ్రాంతి వున్నది. భ్రాంతి ఎందుకు వున్నది? లేనిదానిని ఆశ్రయించావు కాబట్టి. ఇలా విచారణ తెలియాలన్నమాట మీకు మీకే. మీకు ఏదన్నా ఆలోచన స్ఫురించింది. ఆలోచన స్ఫురించగానే అమ్మో! నాకు భయం అనుకున్నావనుకో, భయం వుందనుకోగానే దాని వెనుక ఏముందని స్ఫురణకు రావాలి? ఓహో! ఎక్కడో భ్రాంతి వుంది కాబట్టి నాకు భయం వచ్చింది. దొంగ అంటే నాకు భయం అండి. ఎందుకని? సంపద మీద భ్రాంతి వుంది కాబట్టి. అర్థమైందా అండి.  సంపదమీద ఎందుకు భ్రాంతి వుందండి? లేనిదానిని ఆశ్రయించావు కాబట్టి. ఎందుకని? వున్న సంపద ఏమిటి? సాధన చతుష్టయ సంపద అనేది వున్న సంపద. లేని సంపద ఏమిటి? వస్తు వాహన ధన ద్రవ్యములు అన్నీ, ధన ధాన్య ద్రవ్యములన్నీ లేని సంపద. అర్థమైందా అండీ! మనం అందరం కూడా మహాలక్ష్మినే కదా అందరం సంపద కోసం ప్రార్థించేది? అవునా అండీ! ఏముందండీ? మహాలక్ష్మీ స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం? “నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే” ఆ మహాలక్ష్మీ స్తోత్రం అంతా చదివి చూడండి. ఎక్కడైనా ఆవెడ ధనం ఇస్తుందని కానీ, ధాన్యం ఇస్తుందని కానీ, ఐశ్వర్యం ఇస్తుందని కానీ ఎక్కడన్నా వుందా? ఎక్కడా వుండదండీ! ఎందుకంటే ఆవిడే మహామాయా స్వరూపిణి. స్పష్టంగా చెబుతున్నారు. నమస్తేస్తు మహామాయే. ఎత్తుకుంటూనే మొదటి వాక్యంలోనే ఏమున్నదండీ? నమస్తేస్తు మహామాయే, అసలు దీనికి మించిన మాయే లేదు నాయనా! ఈ మహాలక్ష్మీ స్వరూపము కంటే మించిన మాయే లేదు. ఎందుకని? అదే మహామాయా స్వరూపము. ఇప్పుడు దేనిని ఆశ్రయించావు? మాయని. అయ్యో! మరి మాయ అంటే లేనిది కదా! మహామాయ అట. మళ్ళా అట్లా కాదు. అనంత సృష్టి ఎట్లా లేకుండా పోతుందో, చెప్పేటటువంటి మాయా స్వరూపిణి. మాయ అంటే ఊరికే పోతుందని అనుకోమాకండి. జ్ఞానాన్ని తెలియజెప్పడం కోసం అది ఏర్పడిందండి. వున్నదానిని తెలియజెప్పడం కోసమే లేనిది ఏర్పడింది. అందరు అంటారు ఇంతా అంటున్నారు కదండీ, అసలు ఈ సృష్టి అంతా ఎందుకు ఏర్పడాలండీ? ఈ లేనివన్నీ ఎందుకు ఏర్పడాలండీ? లేనిది అంతా వున్నది తెలియజెప్పడం కోసమే ఏర్పడింది. ఎందుకని? నీకు ఆ లేనిది అంటే ఏమిటో తెలిస్తేనే కదా! వున్నది గుర్తెరిగేది? అంటే ఆ లేనిది వదిలేస్తేనే కదా! లేనిది తెలియాలి, వదిలేయాలి. లేనిది తెలిసి వదిలేయాలి అంటే, అది ఉన్నదనే భ్రాంతి, నీ భ్రాంతి అది. దానికే సమస్యా లేదు. మహాలక్ష్మీ స్వరూపానికి ఎప్పుడూ ఇబ్బంది లేదు. ఎందుకని? దానికి నారాయణ స్వరూపము ఎప్పుడూ తెలుసు. నారాయణ హృదయమందే మహామాయ వున్నది. లక్ష్మికి నివాస స్థానం ఎక్కడ? నారాయణ హృదయం. నారాయణుడు అంటే ఎవరు? సర్వ జీవుల హృదయమందు వ్యాపించి స్థిరమై వున్నవాడు ఎవడో, వాడు నారాయణుడు. అంతే కానీ వైకుంఠంలో వున్నవాడు కాదు నారాయణుడు. అంటే ఇప్పుడు సర్వ జీవుల హృదయమందు మహాలక్ష్మి వున్నదా లేదా? సర్వ జీవుల పక్కన లేదు పొరపాటు పడుతున్నారు, సర్వజీవుల హృదయమందు నారాయణుడు వున్నాడు, నారాయణ హృదయమందు మహామాయ వున్నది. ఏమిటండి ఇవి? ఒక్కసారి విచారణ చేయండి.
            ఆ నారాయణుడు పరమాత్మ. ఈ మహామాయ అంతరాత్మ. నీ అంతరాత్మగా ఆ మహామాయ వున్నది. ఆ అంతరాత్మ ఎవరి హృదయంలో వున్నది? పరమాత్మ హృదయంలో వున్నది. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ యందు వున్నది. నీవు సర్వవ్యాపకత్వాన్ని తెలుసుకుంటే ఏమైంది ఇప్పుడు? మాయ ఎగిరిపోయింది. మహత్తు మిగిలిపోయింది. మహామాయలో రెండు శబ్దాలున్నాయండి. మహత్తు మాయ. నారాయణుడిని తెలుసుకుంటావా? పరమాత్మని తెలుసుకుంటావా? సర్వవ్యాపకత్వాన్ని పొందావా? మాయ పోయింది. సర్వవ్యాపకత్వాన్ని పొందగానే మాయ విడిచింది. అంతే కదా! ఏం మిగిలింది? మహత్తు మిగిలింది. ఇక పరమాత్మవే. అర్థమైందా అండీ! కాబట్టి నమస్తేస్తు మహామాయే, శ్రీ పీఠే - శ్రీ పీఠం అంటే ఏమిటండి? నారాయణ హృదయమే శ్రీ పీఠం. ఎందుకని? ఆయన శ్రీమన్నారాయణుడు. అందుకని శ్రీ చేరిందండి. లేకపోతే ఆయనకి శ్రీ శబ్దం లేదు. శ్రీమన్నారాయణుడు అనే శబ్దం లేదండి. నారాయణ శబ్దమే వుంది. శ్రీ పీఠం. ఈ మహామాయా శబ్దం అంతరాత్మగా వున్నప్పుడు ఈయన శ్రీమన్నారాయణుడు. ప్రకృతి వాచ్యం కూడా కలిసింది. లేకపోతే ఆయన పరమాత్మ వాచ్యుడు. నారాయణుడే. శ్రీ శబ్దం లేదు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. ఎన్ని శ్రీ లు చేరితే, అంత ప్రకృతి బాగా చేరినట్టే. మనం అందరికీ ఏం రాస్తామండి? శ్రీశ్రీశ్రీశ్రీ అంటే బాగా ప్రకృతిలో బంధించబడ్డాడు అని అర్థం. అర్థమైందా అండీ? ఆ రకంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. శ్రీ ని ఆశ్రయించాలా? శ్రీ ఎవరి హృదయంలో వుందో, వాళ్ళని ఆశ్రయించాలా? (శ్రీ ఎవరి హృదయంలో వుందో వారిని ఆశ్రయించాలి) ఎందుకని? వాడిని ఆశ్రయిస్తే, ఈవెడ అందులోనే వున్నది కదా! అర్థమైందా అండీ! వాడిని ఆశ్రయిస్తే, ఈవెడ అందులోనే వుంది. అందుకని ఏం చెప్పారట? సర్వమును హరియించువాడు హరి. అంటే మాయతో సహా హరించెడి వాడు హరి. అని అర్థము. అంటే అప్పుడు ఏమి మిగిలింది? పరమాత్మానుభవము మిగిలింది. ఇప్పుడు మనం ఏం మిగిల్చుకోవాలని ప్రయత్నిస్తున్నాము? (లేనిదానిని మిగిల్చుకోవాలని) ఏమైంది ఇప్పుడు? చూడండి. ఎంతగా లేనిదానిని మిగిల్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో! జీవితమంతా దీని కోసమే కదా! ఒక్కసారి విచారణ చేసి చూడండి. నీ భయాలు, నీ భ్రాంతులు అన్నీ దేని కోసము? ఆ శ్రీ పీఠమేగా. అంతేనా అండీ! శ్రీ పీఠే సుర పూజితే! స్పష్టంగా చెబుతున్నాడండి. సురపూజితే - దేవతలు పూజిస్తున్నారు. ఎవరా దేవతలు? నీ ఇంద్రియ అధిష్టాన దేవతలు అన్నీ దానినే పూజిస్తున్నాయి. ఎందుకని? దాని చేతే ఏర్పడ్డాయి కాబట్టి. నీ ఇంద్రియాల అధిష్టాన దేవతలు అంటే ఎక్కడ వున్నారు? ఎవరున్నారు? ఉన్నారా వాళ్ళంతా? లేరు కదా! ఎందుకని? సర్వవ్యాపక పరమాత్మయందు వాళ్ళందరూ అంశీభూతములు. అంతేనా అండీ! సూర్యప్రకాశములో కిరణములు ఏమిటి? అంశీభూతం. అందులో భాగాలు. అలాగే నీ ఇంద్రియ అధిష్టాన దేవతలు అన్నీ ఎందులో భాగం? ఆ పరమాత్మ యందు భాగం. ఇంద్రుడు, వరుణుడు, యముడు ఇలా ఎంతమందినని పట్టుకుంటావు? సరాసరి సూటిగా ఒక్కటే పట్టుకో. పరమాత్మని పట్టుకో. పట్టుకుంటే, వీళ్ళు అంతా అందులో అంశీభూతమే కదా! ఇన్ని విడిభాగాలు లేవుగా అక్కడ. పరమాత్మను పట్టుకోవడం అంటే ఏమిటట? లేనిదానిని విడిచిపెట్టవయ్యా! ఉన్నదే వున్నది. ఇప్పటి వరకూ ఏం ప్రయత్నం చేశామంటే, పట్టుకోవడం అంటే ఎక్కడికో వెళ్ళి పట్టుకోవాలని అనుకుంటున్నావు. వైకుంఠం వెళ్ళి పట్టకోవాలా? కైలాసం వెళ్ళి పట్టుకోవాలా? అనుకుంటున్నావు. వైకుంఠ కైలాసాలలో దొరికేది కాదది. సర్వవ్యాపక స్థితి అది. అందుకే ఇందాక “తారకము చూపెరుగవలెనన్నా” లో ఏం చెబుతున్నారు? ఎందుకు క్షేత్రాలకు తిరుగుతారు? నీలోపల అంతరాత్మ వున్నది. అది పరమాత్మ స్థితి నుంచి ఏర్పడింది. ఆ పరమాత్మ యొక్క మెస్సెంజర్. భగవంతుడి యొక్క దైవ దూత. ఎవరు? ఆ అంతరాత్మ. ఈ అంతరాత్మ ఎప్పటికైనా, ఏ స్థితిని పొందాలి? ఆ దైవీ స్థితినే అనుభవించాలి. ఆ పరమాత్మ స్థితిని అనుభవించాలి. అందుకోసమే ఈ దేహం వచ్చింది. ఈ ఒక్క సత్యాన్ని గుర్తెరుగు. ఇప్పుడు ఏ క్షేత్రానికి పోతావు? ఏ రుద్రాక్ష మాలను, ఎన్ని రుద్రాక్ష మాలలు వేస్తే ఇది తెలుస్తుంది? ఎన్ని మణుగుల విభూతి పైనుంచి కిందకి రాస్తే తెలుస్తుంది? (బాహ్యానికి ఎంత చేస్తే మాత్రం ఏం ప్రయోజనం) ఈ గుర్తులో వుండు. జీవించేటప్పుడు ఈ గుర్తులో వుండు. కాబట్టి నమస్తేస్తు మహామాయే... శ్రీ పీఠే సుర పూజితే... శంఖ చక్ర గాదా హస్తే... మహాలక్ష్మీ నమోస్తుతే....!
            శంఖము చక్రము గదా ధరించి వున్నదట కదండీ! దేనికి అండీ ఇవి? ఎప్పుడూ మనం విచారణ చేయలేదండి. అందుకోసమే చెబుతున్నాను. చక్రము పేరు సుదర్శన చక్రము. సు+దర్శనము ఆత్మ సాక్షాత్కారమే సుదర్శనము. వేరే ఇంకేమీ లేదండి. ఆ సుదర్శనము వలన అన్ని పాతకములు తొలగిపోయినాయట. అంధకారము నిర్మూలనే సుదర్శనము. అర్థమైందా? మీరు భాగవతము చదవండి చక్కగా.
            ప్రాగ్‌ జ్యోతిష పురము అనే ఒక పురము వుంది. దానికి బాణాసురుడు దాని యొక్క అధిష్టానముగా వున్నాడు. అదంతా ఎప్పుడూ చీకటిలో వుంటుంది. ఆ చీకటిలో వుంటే ఎప్పుడూ ఎవరికీ కనపడదు కదా! అసుర రాజ్యం అన్నమాట అది. శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడట? సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. వెంటనే వెలుతురు వచ్చింది. ఎవరు ఎక్కడున్నారో కనపడింది. బాణాసురుడిని చంపేశాడు. ఇలాగ పౌరాణిక కథ. ఈ కథ ఇలా ఎందుకు చెప్పారు?
            ఎవరు ఆ బాణాసురుడు? మనమే. మనలో వున్నటువంటి ఆ ఆసురీ సంపద అవునా అండీ! కఠినముగా మాట్లాడుట ఆసురీసంపద. దైవాసుర సంపద్విభాగ యోగం భగవద్గీతలో చదవండి. కఠినముగా మాట్లాడుట. ఆసురీ సంపద. రాక్షసుల లక్షణము అది. ఇతరులను బాధించుట ఆసురీ లక్షణము. అర్థమైందా అండీ! ఇవన్నీ మనలో వున్నాయా లేవా చూసుకోండి. అవే. కాబట్టి ఏం చెయ్యాలట ఇప్పుడు? సుదర్శన చక్రాన్ని ప్రయోగించు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగగానే ఇవన్నీ తొలగిపోతాయి. దానికోసం ప్రయత్నం చేయి. ఇవి అవే పోతాయి. అందుకని ఏం చెప్పారట?
            దుర్గుణాలను విడవాలి అంటే, నువ్వు సద్గుణాలను అవలంబించవయ్యా! ఏ జ్ఞానాన్ని అవలంబిస్తే ఇది తొలగిపోతుందో, ఆ జ్ఞానాన్ని అవలంబించు. ఈ గుణాల గురించి ఎప్పుడైతే నువ్వు చింతించావో, ఇవే వస్తాయి కదా! మళ్ళా. దేనిని మననం చేస్తే అదే వస్తుంది. నువ్వు వదిలెయ్యాలి అనుకుంటున్నావా? పోవాలి అనుకుంటున్నావా? మళ్ళా దీన్నే గుర్తులో పెట్టుకుని జీవిస్తే ఏమౌతావు? మళ్ళా అదే వస్తుంది. ఏది వదిలేయాలనుకుంటున్నావో, దానిని వదిలేసి జీవిస్తే, అది లేకుండా పోయింది. అంతేకదా! బాల్యం వదిలేయాలండి. వదిలేయాలంటే ఏం చేశావు? పై స్థితి, రావలసిన స్థితిని స్మరణ చేస్తూ వున్నావు. కీటకము వున్నదండి. తన చుట్టూ గూడు కట్టిందండి. సీతాకోక చిలుక ఎలా అయ్యింది? సీతాకోక చిలుక స్థితిని స్మరిస్తూ వుంటే, సీతాకోక చిలుక అయ్యిందా? గొంగళి పురుగు స్థితినే స్మరిస్తే, సీతాకోక చిలుక అయ్యిందా? గొంగళి పురుగుకూడా పాఠం బోధిస్తుంది చక్కగా. ఏమని బోధిస్తోంది? భవిష్యత్తు. నీ యొక్క యథార్థ జ్ఞానం ఏమిటి? నేను ఎవరిని అసలు? సీతాకోక చిలుకని. కానీ నేను ఎలా వున్నాను ఇప్పుడు? గొంగళిపురుగుగా వున్నాను. ఇది వదిలిపోవాలంటే దేనిని స్మరించాలి ఇప్పుడు? కాబట్టి. పరమాత్మని స్మరించవయ్యా! అనిత్యమైనటువంటివి లేనటువంటి వాటిని స్మరించడం చేతవాటిని ఆశ్రయంచి జీవించడం చేత, ఇలాగయ్యావు. కాబట్టి మీరందరూ కూడా రోజు వారీ చేసేవాటిని అన్నింటినీ ఇలా చక్కగా విచారణ చేసుకోండి. ఎందుకంటే తరించడం అంటే ఇది ఎవరో ఎత్తి తీసుకుని వెళ్ళి పడేసేది కాదు. నీ అంతట నీవు, స్వప్రయత్నము సాధనతో తరించవలసిందే, వేరే మార్గమే లేదు’. అభ్యాస బలంతో, సాధనాబలంతో సాధించవలసిందే. ఈనాటికి పదేళ్ళ తరువాత మళ్ళా వచ్చింది అవకాశం. మాకు చెప్పడం పోయి, నాలుగేళ్ళు అయ్యింది. అంటే నేను చెప్పడం మానేసి, నాలుగేళ్ళు అయ్యిందండి. నాలుగేళ్ళ నుంచి ఎప్పుడూ చెప్పడం లేదు ఇంక. ఎందుకని అంటే చెప్పడం పోయింది. అదే వదిలేసిందండి. మళ్ళా ఎందుకు వచ్చిందో ఇప్పుడు వచ్చింది. మళ్ళా మీరు వచ్చేటప్పకి చెప్పటం అనే స్థితి వుండచ్చు, వుండకపోవచ్చు. ఇలాగ గురువుకు కూడా స్థితులు మారిపోతూవుంటాయి, ఎప్పుడూ కూడా. చెప్పేవాడికి కూడా స్థితులు మారిపోతూ వుంటాయి. వాడూ ప్రయాణం చేస్తూ వుంటాడు కదా! వాడూ సాధకుడే. వాడి జీవనం కూడా అలానే వుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడూ కూడా అందుబాటులోకి వచ్చినటువంటి, సువర్ణ అవకాశాలని వినియోగించుకున్నవాడే సాధకుడు. ఎందుకంటే మాకు కూడా ఇలానే చెప్పారు. మేము మా గురువు దగ్గరకు చేరినప్పుడు వారికి వాక్కులేదండి. వారు మౌనస్థితిలో వున్నారు, ఆ మౌనం నుంచి సాంతం బయటకి రాలేదు అప్పటికి ఇంకా. చివరి స్థితిలో వున్నారన్నమాట. ఆ ఈశ్వరీయ మౌనం చివరి స్థితిలో వుండగా వారి దగ్గరికి చేరాము. అప్పుడు ఆయనేమీ చెప్పేవారు కాదు. అంతా మౌనమే. ఏం చెప్పినా మౌనంలోనే. కాబట్టి మౌనంలో చెబితే, మౌనంలో తెలుసుకోగలిగే సామర్థ్యం నీకు వుంటే వుండమన్నారు, లేకపోతే పొమ్మన్నారు అంతే. నువ్వు నన్ను అడిగేదీ లేదు, నేను నీకు చెప్పేదీ లేదు. (మౌనంలో ఎలా వస్తుంది) వస్తుంది అదే మరి, నీవు సిద్ధపడితే వుండు లేకపోతే పో. దానికి తగ్గవాడివి అయితే వుండు లేకపోతే పో. నేను నా స్థితి ఇది. నేను అయితే ఏం చెప్పేవాడిని కాదు. నువ్వు అడిగినా నేనేమి చెప్పలేను. నేను మౌనంగా వుంటాను అంతవరకే. నేనేం చెప్పను. నువ్వు మౌనంలో, నీకు ఆ స్థితి వుండి, ప్రశ్నిస్తే నీకు సమాధానం వస్తుందని నీకు విశ్వాసం వుంటే వుండు. అంతే రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వెళ్ళడం, కూర్చోవడం, గంటల తరబడి కూర్చోవడం రావడం. గంటల తరబడి కూర్చోవడం రావడం. అలా మౌనంగానే తెలుసుకోవడం వల్ల, కొన్ని వందల మెట్లు ఒకేసారి నన్ను దాటించారు. వందల స్థితులు, మామూలుగా నడవాలి అంటే చాలా టైం పడుతుందండి. అలాంటిది ఇదే కఠిన పరీక్ష. ఈ కఠిన పరీక్షకు నీవు నిలబడు. తక్కువ అని అనుకోమాకు. ఇదేదో. ఈ పని, ఈ మౌనవ్యాఖ్యను తెలుసుకోవడమే అసలు అంతాకూడా. వేదాంతము అంతా ఈ మౌనవ్యాఖ్యను తెలుసుకోవడమే. (మౌనంగా వచ్చేవాటికి, నిజమా, అవునా కాదా? అనే doubt....) అసలు అందుకే చెప్పేది, నీవు విడిగా వుంటే ఇది విడిగా... అందుకనే ఏం చెప్పారు? రోజూ రా. నువ్వురోజూ వుదయం, మధ్యాహ్నం, సాయంత్రం నాలుగు పూటలా వచ్చి పో! మేము ఎలా వున్నామో, నువ్వు అలా వుండు. నీకు చెప్పేది ఏమీ లేదు. మేము ఎలా వున్నామో, నువ్వు అలా వుండు. నీకు ఏమన్నా ప్రశ్నలు, సమాధానలు అన్నీ ఇక్కడ వుంటే, ఏమన్నా పుస్తకాలు తెచ్చుకో, చదువుకో. నీకు చెప్పేది ఏమీ లేదు. ఆ పుస్తకం చదివినా కూడా నువ్వు అదేమిటి, ఇదేమిటి? అన్ని ప్రశ్నించినా నీకు చెప్పేది ఏమీ లేదు. మాట్లాడేదీ ఏమీ లేదు. నువ్వు కూర్చో ఇక్కడ, పో. అలాగే జరిగింది. కూర్చున్నాము వెళ్ళాము అలాగే సమాధానాలు వచ్చేసినాయి. ప్రశ్న సమాధానము అన్నీ అక్కడే పూర్తి అయిపోయినాయి.

            అలాగ మహానుభావులు అయినటువంటి గురువులు ఏం చెప్తారయ్యా అంటే, వాళ్ళు ఎప్పుడూ ఇదే చెప్పేది. “సమయం మించిపోతోంది. శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. శరీరం రాలిపోయి, స్థితి మారిపోయిన తరువాత నువ్వు వచ్చినా ప్రయోజనం లేదు”. కాబట్టి ఎప్పుడైనా సరే, దొరికిన సదవకాశాన్ని, జీవితంలో ఇహం కోసం ఎన్నో అవకాశాలనీ జారవిడుచుకున్నాం అండీ ఇప్పటి వరకూ. ఇప్పుడు కూడా ఏమంటున్నావు మళ్ళా? మళ్ళా గురువు దగ్గరకు వచ్చినాక కూడా, ఆ పాత అభ్యాసబలం విడవలేక, అయ్యో! అక్కడేదో ప్రమాదం వచ్చేస్తుంది, నిన్ను విడిచిపెడుతా నాయనా! మళ్ళా దానికి టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు వస్తాను అన్నావు. నువ్వు టైం వచ్చినప్పుడు వస్తే, ఇక్కడ సిద్ధంగా వుండద్దూ? చెప్పడానికి?
            కాబట్టి, గురువు అంటే ఏమిటంటే, అందుకే సశరీరులైన గురువులతో ఇదే ఇబ్బంది. అందుకని సశరీరులైన గురువులు కూడా అశరీర స్థితిలో వుండే చెబుతారు. శరీరంలో వుంటే చెప్పలేడు. అందుకని అశరీర స్థితిలో వుండి ఎప్పుడూ చెప్పేటటువంటి వాడు, వాడు ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, “నాయనా! ప్రతి రెప్పపాటు విలువైనదే.” ఎందుకని? ఏ రెప్పపాటులో శరీరం వదిలేస్తుందో నాకే తెలియదు. ఎందుకని? నా చేతిలో వుండదిక. ఎందుకని? ప్రకృతి అధీనమైపోయింది. దేన్ని దానికి అప్పజెప్పేసినవాడే ముక్తుడండి. నువ్వు మరణించిన తరువాత అప్పజెప్పే ప్రయత్నం చేస్తావు, అప్పజెప్పే అవకాశం లేక మరలా దేహంలోకి వస్తావు. వాళ్ళు జీవించి వుండగానే దేనిని దానికి అప్పజెప్పేస్తారండి. ఏ శక్తికి ఆ శక్తి, ఈ దేహాన్ని ఎప్పుడైనా కూడా అవి స్వీకరించవచ్చు. పంచభూతాలు, పాంచభౌతిక దేహాన్ని ఎప్పుడైనా కూడా స్వీకరించడానికి సిద్ధంగా వుంటాడు. ఎలావుంటాడయ్యా అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను.
            భగవాన్‌ రమణులు చాలా గొప్ప ఉపమానం జీవితంలో బాగా గర్తుపెట్టుకోండి. ఎలాగయ్యా అంటే, “పిచ్చివాని వంటిపై తుండుగుడ్డ ఎప్పుడు జారిపోయిందో అతనికి ఎట్లు తెలియదో, అట్లు దేహము జారిపోవును ముక్తునకు”. వీడయ్యా ముక్తుడు. నిర్ణయవాక్యం అన్నమాట ఇది. ఆ జ్ఞానానికి నిర్ణయవాక్యం ఇది. దేహం జారిపోయిందట. ఎట్లా జారిపోయిందట? పిచ్చివాని వంటిమీద తుండుగుడ్డవలె జారిపోయిందట. కాబట్టి ఇతను ఎందులో ఉన్మత్తుడై వున్నాడు? పరమాత్మ స్థితియందు ఉన్మత్తుడై వున్నాడు. దేహభావన లేదు. జగత్భావన లేదు. బాహ్యస్ఫురణ లేదు. ఆ దేహము ఎలా వుందట? ఒంటి మీద తుండుగుడ్డవలె వుందట. ఎప్పుడు జారిపోయినా అతనికి ఏమీ పనిలేదు. అలా వుంటాడయ్యా ముక్తుడు. ఎందుకని? భావంలో, అంతరాత్మలో దానిని వదిలేశాడు దానిని. కాబట్టి అలాగ ఎవడైతే వుంటాడో, ఈ వాక్యం నాకు 1996 లో తెలుసండి. అప్పటికి మా గురువుగారికి, బాహ్యస్ఫురణ లేదు. ఆయన ఏక వస్త్రధారి అప్పుడు. ఒక్క ఉత్తరీయము మాత్రమే చుట్టుకునేవారు అంతే. అలా వెళ్ళిపోతూ వుండేవారు. అంతే! ఒంటిమీద ఇంకా వస్త్రము వుండేది కాదు. (పుస్తకము చూసి చెప్పేది ఏమీలేదా? అంతా వాక్కేనా) ఏమీ లేదండి. అంతా సహజసిద్ధ జ్ఞానమే. (వారు పుస్తకము చూడందే...) ఏమీ అట్లాంటిది ఏమీ లేదండి. వట్టిదేనండి. అదే ఇప్పుడు ఇందాక చదివింది. మీకు అందుకే. తారకము చూపెరుగవలెనన్నా... చదువమన్నది. అందులో మీకన్నీ చక్కగా వుంటాయండి. శాస్త్రజ్ఞానం, పండిత జ్ఞానం ఇదంతా కేవలం (కవిత్వము ఎట్లా అయితే వస్తున్నదో, వాక్కు కూడా అట్లే వస్తున్నది) అయ్యో! ఒక్కటి గుర్తు పెట్టుకోండి. సర్వము ప్రణవనాదంలో వున్నాయని వారే ఒప్పుకుంటున్నారు కదా! శాస్త్రజ్ఞానులు, పండితులు అంతా కూడా. ఆ ప్రణవ నాదం నీలో కూడా వున్నదండి. అదే హంసస్వరూపమండి. ఎవరికైతే ఈ హంస జ్ఞానము సహజసిద్ధముగా వున్నదో, వారిలో జ్ఞానము సహజసిద్ధముగా వుంటుందండి. మరి మేము ఎవరం పుస్తకాలు చదివి నేర్చుకోలేదండి. మేం నేర్చిన విధానం కూడా ఏమీ పుస్తకాలు చదివి నేర్చుకోలేదండి. మా చేత పుస్తకాలు చదివించలేదు అసలు. ఏ పుస్తకము చదివించలేదండి. ఒకవేళ అథవా ఎప్పుడైనా కానీ మాట్లాడాలంటే ఇప్పుడు మీతో మాట్లాడాలి అంటే ముందు ఏదన్నా చదివించడం లేదా? ఒక వాక్యమో, అర వాక్యమో, ఇట్లా ఏదన్నా, ఎవరన్నా పక్కన ఇట్లా కూర్చుండే వాళ్ళు. వస్తారు కదా ఎవరో ఒకళ్ళు. వాళ్ళు ఏదో పుస్తకము తెస్తే, ఆ పుస్తకములో ఏదన్నా ఒక వాక్యము చదవండి అనే వాళ్ళు. ఒక వాక్యం చదవగానే, ఆ చదివిందంతా అది పోయే, పుస్తకం పోయే, ఆ వాక్యం పోయే, అంతా పోయే, ఇటు తిరిగిపోతుందన్నమాట ఇక. ఇట్లా తిరిగి చెప్పేసెయ్యడమే. ఇట్లా చెప్పడమే ఇంతే. ఆ చెప్పేటప్పటికి పుస్తకము పూర్తైపోతుంది. (అంతే గానీ ఆయనకేమీ పుస్తక జ్ఞానమేమీ లేదు) అబ్బే! అసలు పుస్తకంతో ఏం పని లేదండి. అందుకే మొన్న మీరంత వచ్చినప్పుడు వారిని ఒక ప్రశ్న అడిగారు. దీనికి భగవద్గీతలో ఎక్కడ సమన్వయమండి? ఉపనిషత్తుల్లో ఎక్కడ సమన్వయమండి? అని ఒక ప్రశ్న అడిగారు. అందుకే మేము అప్పుడు సూటిగా చెప్పింది.

అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గరకు వచ్చి, శాస్త్రవిషయమును అడుగువాని కంటే మూఢుడు మరొకడు లేడు.” ఎందుకని? పుస్తకం అనుభవాన్ని ఇవ్వదు నాయనా! జీవితం అనుభవాన్ని ఇస్తుంది. నిన్ను కడతేర్చాలంటే అనుభవజ్ఞానం వున్న గురువుకి సాధ్యం కాని, పుస్తకానికి సాధ్యం కాదు. పుస్తకం వల్లే సాధ్యం అయితే, గ్రంథాలయాలు ఎన్ని వున్నాయి? పుస్తకాలు అమ్మే షాపులు ఎన్ని వున్నాయి? ఎంతమంది పుస్తకాలు చదవడం లేదు. చదివినంతమాత్రాన ముక్తుడు అవుతాడా? అసాధ్యం. బుద్ధికి పదనుపెడతావు. అంతకు మించి వేరే ఏమీ లేదు నాయనా! నీ బుద్ధే నీకు అడ్డమని తెలుసుకోలేవు. ఏ బుద్ధి అయితే నీకు అడ్డమో, దానిని అధిగమించేటటువంటి తెలివివున్నవాడు కావాలి. దానిని అధిగమించినటువంటి జ్ఞానము వున్నవాడు కావాలి. వాడిని ఆశ్రయిస్తే, ఎందుకు చెబుతున్నాను అంటే, నీవు ఏ ఇంద్రియాన్ని ఆశ్రయించినా కూడా అహం బలపడుతుంది. బలపడుతుందా? బలపడదా? ఉదాహరణ చెబుతాను చూడండి.
            ఇప్పుడు మీ పిల్లలు అందరూ బాగా చదువుకున్నారు. వాళ్ళల్లో ఏమి వుంటుంది? అహం. వుంటుందా వుండదా? నేను M.Sc B.Ed, నేను double గ్యాడ్యయేట్‌, నేను పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎప్పుడైతే వాడు కష్టపడి చదివాడు కదా మరి అందులో, ఆ కష్టపడి చదివినప్పుడు వాడిలో వుంటుందా? వుండదా? వుంటుందా? వుండదా? ఎందుకని? కష్టపడితే, అహం ఏర్పడుతుంది. ఎందుకని? అది గుణం. దాని ధర్మం సహజంగా చూపెడుతుంది. మాకేమి వుందయ్యా అందుకని? మాకు చదువు లేదు నాయనా! వాడికి చదువు లేదు, ఇప్పుడేమి పోయింది? మాకేమీ ఇహలోక విద్యలు లేవు. నేనేమీ పెద్ద డిగ్రీలు చదువుకోలేదు. పెద్ద విద్యలేమీ చదువుకోలేదు. కానీ చావులేనివిద్య ఒక్కటే నా దగ్గర వుంది. నీ దగ్గర వున్న డిగ్రీలు నా దగ్గర లేవు. కానీ సర్వ జీవులకు, ఏది వుపయోగమో, ఆ విద్య వున్నది. అది ఎలా వచ్చిందయ్యా? సహజంగా వచ్చింది. అంతేగానీ సహజజ్ఞానమే కానీ, తెచ్చిపెట్టుకున్న జ్ఞానము కాదు. అంటే ఏమిటి మరి? వీడికి శృతిజ్ఞానము వుండదా? నీలోపల నుంచే శృతులు వచ్చినాయయ్యా! ఉపనిషత్తులు ఎలా వచ్చినాయి? మహర్షులు అసలు ఉపనిషత్తులు ఎలా చెప్పారు? ఏ పుస్తకము చూసి చెప్పారు? ఏ పాండత్యము చూసి చెప్పారు? ఇప్పుడంటే పుస్తకాలు అంటున్నారండి. ఆనాడు ఉపనిషత్తులు ఎలా చెప్పారు? ఆ సహజజ్ఞాన స్థితిలో వుండి చెబుతూ వుంటే, గ్రంథస్తం అయినాయి. ఆ గ్రంథస్తం అయినవి ఎవరి పరంపరలో వాళ్ళు, తరువాత ఎన్ని మార్పులు చేశారో ఎవరికి తెలుసు? కానీ, సహజజ్ఞానము ఎప్పుడూ సహజజ్ఞానమే. దాంట్లో ఏ మార్పు వుండదండి. నువ్వు శృతి స్మృతి పురాణములు ఎన్ని చదివినా, ఆ సహజజ్ఞానము వున్నవాడికి అవన్నీ ఎట్లా కనబడుతాయంటే, పిల్లలాటలవలె కనపడుతాయి. ఎందుకనంటే, నువ్వున్న స్థితిని బట్టి అర్థం తీస్తూ వుంటే, దానిలో రకరకాల అర్థాలు వస్తాయి. మహాభారతము ఒక రాజకీయనాయకుడు చదివాడనుకోండి, వాడికి రాజకీయం లాగా కనబడుతుంది. అర్థమైందా అండీ! ఒక సామాజికుడు చదివాడనుకోండి, సంఘసంస్కర్తగా కనపడుతాడు శ్రీకృష్ణుడు. ఒక భక్తుడు చదివాడనుకోండి, భగవంతుడిలాగా కనపడుతాడు. ఒక జ్ఞాని చదివాడు అనుకోండి, నేను శ్రీకృష్ణుడినే అనే స్థితిలో వుండి చూస్తాడు దానిని. మరి ఇప్పుడు ఎలా ఎవరి ధోరణికి ఎట్లా తోచింది అది. అలా రాయటమే శాస్త్ర సమ్మతం. పుస్తకం అంటే ఏమిటంటే, ఎవరు ఏ భావంలో చూస్తే, అది అలా కనపడాలి. అట్లా రాస్తేనే అది శాస్త్రం. అందుకే ఇంతకాలం ఇన్ని యుగాలైనా కూడా అది అట్లా నిలబడి వున్నాయి. ఎవరు దానికి గురుడు శిష్యుడు లేకపోయినా ఎందుకు నిలబడి వున్నాయి? ఎవరు ఏ భావంతో చూస్తే, అలా అవి కనబడుతాయి. ఆ భావాన్ని బోధిస్తాయి అవి. మరి నీకు నీవున్న స్థితికి బోధించేవాడు ఎవడు? అందుకు అవసరం వచ్చింది నాయనా గురువు.
            ఒకటి గుర్తుపెట్టుకోండి. న శాస్త్రం వినా జ్ఞానంఅంటే శాస్త్రం చదువక పోతే జ్ఞానం లేదు. అనేది సూత్రం. అయితే న గురుర్వినా ముక్తిః’ (అది జ్ఞానం వస్తుంది కానీ ముక్తి రాదు) అర్థమైందా అండీ! న శాస్త్రం వినా జ్ఞానం శాస్త్రం లేకుండా జ్ఞానం రాదు. కానీ, న గురు వినా ముక్తిః ముక్తి రావాలంటే మాత్రం నువ్వు శాస్త్రం పట్టుకుంటే ప్రయోజనం లేదు నాయనా! శాస్త్రం చదువుకోవాలి, మీతో చదివించడం లేదా? కావలసినంత మేరకు చదివితే చాలు. ఎందుకయ్యా అంటే, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది జీవితకాలం గుర్తుపెట్టుకోవాలండి. ఎంతోమంది కొన్ని లక్షల కోట్ల మంది, ఈ శాస్త్ర అరణ్యములో చిక్కుకుని వుంటారండి. ప్రాథమిక సాధన దగ్గరే ఈ శాస్త్రారణ్యములో చిక్కుకుని వుంటారండి. కొన్ని జన్మల పాటు ప్రయత్నించాలండి, దీనిలోనుంచి బయటకు రావాలంటే, కొన్ని జన్మలు అని చెబుతున్నాను, స్పష్టంగా. కొన్ని జన్మలు, ఎంతోమందిని చూశాము మేము.
            ఉదాహరణ చెబుతాను వినండి దానికి. భగవాన్‌ రమణుల దగ్గరకి కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు చేరాడండి. ఆయన 108 ఉపనిషత్తులు తెలిసినవాడు. శృతి స్మృతి పురాణములు చక్కగా తెలిసినటువంటి వాడు, ఆ దినం ఏంచేశాడయ్యా అంటే, ఆ మహానుభావుని దగ్గరకి చేరాడు. ఏవండి అన్నీ శృతి స్మృతి పురాణములు అన్నీ నేను చదివాను. వేదములు చదివాను. వేద భాగములు చదివాను. 18 పురాణములు చదివాను. సంస్కృత భాషలో దిట్ట.   అంతటి దిట్ట ఎవరూ లేడన్నమాట. అలాంటి కావ్యకంఠ గణపతి ముని భగవాన్‌ రమణులను ఆశ్రయించగా, భగవాన్‌ రమణులు వారిని, ఒక సంవత్సరం పాటు వున్నాడండి, భగవాన్‌ రమణుల దగ్గర. ఆయనేమీ చెప్పలేదు. ఈ మహాపండితుడు ఆయన దగ్గర చేరితే, ఆయనేమీ చెప్పలేదండి, ఒక సంవత్సరం పాటు. మౌనం. ఆయనెప్పుడూ మౌన స్వామి భగవాన్‌ రమణులు. అంతా మౌనమే బోధ. అలాగ ఎప్పుడైతే ఆయన చేరిన తరువాత ఆయన ఒక్కటే మాట చెప్పాడండి. సంవత్సరం తరువాత ఒక్కటే వాక్యం. అదే ఉపదేశం. “ఇప్పటి వరకూ తెలుసుకున్నదంతా విడిస్తే, ముక్తి సాధ్యం” అన్నారు. ఏమనలేదండీ. ఇంతే ఒకటే మాట అన్నారు. ఇప్పటి వరకూ నువ్వు తెలుసుకున్నదంతా విడిస్తే, ముక్తి సాధ్యం అన్నారండి. ఇక అంతే. ఆయన వెంటనే తాను చదివిన విద్యా జ్ఞానం శృతి స్మృతి పురాణ ఇతిహాసములను మొత్తం ఒక్క క్షణంలో నేను విడిచి పెడుతున్నాను అన్నాడండి. ఎందుకని? సంవత్సరం పాటు ఆయన దగ్గర వున్నాడు. సంవత్సరం పాటు వేచి చూస్తే, ఈ ఒక్క వాక్యం చెప్పాడండి. కాబట్టి గురువు ఒక వాక్యం చెప్పాడు, ఒక మాట చెప్పాడు అనుకోమాకండి. అందులో అనంతమైనటువంటి శక్తి వుంటుంది. నిన్ను జన్మ జన్మల పాటు దాటించ గలిగేటటువంటి, ఇవాళ పనికొస్తుంది అనుకుంటున్నావేమో, గురుసత్తాని ఆశ్రయించి గనుక నీవు జీవిస్తే, ఈ జన్మకు కాదయ్యా నిన్ను ఎన్ని జన్మల పాటైనా తరించగలిగేంత శక్తి, సామర్థ్యం అందులో వుంటుంది. అందుకే సద్గురువు యొక్క గొప్పతనం. ఆ సద్గురువు యొక్క అద్భుతం ఏంటయ్యా అని అంటే, ఇదేనయ్యా! ఈ సద్గురువు యొక్క మహత్యం ఏమిటయ్యా అంటే, అదే! సద్గురు మహత్యం వల్ల, ఎవడైతే సద్గురువుని ఆశ్రయించి జీవిస్తున్నాడో, అతని ప్రభావం చేత, ఈతనికి కొన్ని జన్మల పాటు, అవతలికి జారిపోతాడు. ఆ జన్మలన్నీ కూడాను దాటించగలిగే సామర్థ్యం అతని చేతిలో వుంటుంది. అందుకే చెప్పేదండి. బ్రహ్మరాతను మార్చగలిగినటువంటి వాడు ఎవరైనా వున్నారా అంటే వాడు సద్గురువు. ఎందుకని? బ్రహ్మరాత అంటే నీ జీవితం. అంతే కదా!

నీ జీవితాన్ని మార్పు చేసేస్తాడు. ఎందుకని? నువ్వు సద్గురుని ఆశ్రయిస్తే, సద్గురువు సృష్టిని అధిగమించి వుంటాడు కాబట్టి.
            నువ్వు ఏ సృష్టి కర్త అంటావో, ఆ సృష్టి కర్త స్థితిని అధిగమించి వుంటాడు సద్గురువు ఎప్పుడూ కూడా. కాబట్టి అట్టి సద్గురువును ఆశ్రయించవయ్యా ! తరించాలంటే సద్గురువును ఆశ్రయించు. ఇందాక ఏంచెప్తున్నాడు? ‘తారకము చూపెరుగవలెనన్నా, సద్గురుని కృపచేవేరే మార్గము లేదు నాయనా! సద్గురువు కృప తప్ప వేరే మార్గము లేదు ముక్తి కావాలంటే. అందుకే ఇందాక చెప్పింది. న శాస్త్రం వినా జ్ఞానం. న గురు వినా ముక్తిః. చాలామంది మొదటి వాక్యం వరకే పట్టుకుంటారండి. శాస్త్రం వినా జ్ఞానం వరకే చెప్తారండి. ఎందుకని? జ్ఞానం వస్తే కదా నీకు ముక్తి సంగతి. ముక్తికి జ్ఞానంతో పని లేదయ్యా! సద్గురువే అంతా. గురుసేవ, గురునిష్ఠ, గురుభక్తి, గురువాక్యం ఈ నాలుగండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. గురుసేవ, గురునిష్ఠ, గురుభక్తి, గురువాక్యము. ఈ నాలుగు పాటించిన వాడికి ముక్తి సహజము. జ్ఞానము సహజము. సహజజ్ఞానము వుంటుందండి వాడికి. ఏం నేర్చుకుని అతుకులు, బొతుకులు వేసినటువంటి అతుకులబొంతేమీ వుండదు వాడి దగ్గర. వాడిలో సహజజ్ఞానము వుంటుంది. ఆ సహజజ్ఞానమే నీకు మరణంలో పనికి వచ్చేది. ఈ అతుకుల బొంత వేసునటువంటి శాస్త్రజ్ఞానం అంతాకూడా బుద్ధి జారగనే పడిపోతుంది. అక్కడ అడుగుతాడండి ఆయన, కావ్యకంఠ గణపతిముని ఈ ప్రశ్న అడుగగానే ఒకమాట అడుగుతాడండి. మౌనంలోనే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారన్నమాట. అదే తరువాత మీరు ఎక్కడైనా కానీ, భగవాన్‌ రమణమహర్షి యొక్క సంవాదము, కావ్యకంఠముని భగవాన్‌ రమణలకి జరిగిన సంవాదం గ్రంథస్తం చేశారండి. అది ఎప్పుడైనా చదివి చూడండి. అందులో వుంటాయన్నమాట. ఎన్నో రహస్యాలు వున్నాయండి అందులో. ఏమిటంటే, ఏమండి మీరంతా కష్టపడి జీవితమంతా సంస్కృత పాండిత్యం నేర్చుకుని వచ్చాం కదా! ఇవన్నీ వదిలేయమన్నారు ముక్తి కోసం అంటే, నాయనా! ఈ సృష్టిమొత్తం మీద వెలుగు చొరవడిని అడవి ఎక్కడైనా వుందా? సూర్యకిరణాలు సోకనటువంటి అడవి ఎక్కడైనా వుందా? అని అడిగారు. అదేమిటండీ? సూర్యుని వెలుగు సోకకుండా భూమి మీద ఏముంటుంది? మా శాస్త్రంలో ఎక్కడా లేదండి అన్నారు. ఆ శాస్త్రారణ్యమే సూర్యుడ సోకని అడవి నాయనా! నీవు అనుకునే జ్ఞానం అంతా కూడా, నీ బుద్ధి చిన్న నిద్రలోకి పోగానే ఎక్కడుంది? భగవద్గీత కంఠోపాఠమే, 780 శ్లోకాలు బాగా వచ్చినాయి. నిద్రపోయేటప్పుడు, వెళ్తున్నావా? రోజూ నిద్రలోకి వెళ్తున్నావా? చూడు ఒక్కసారి. నీ భగవద్గీత జ్ఞానము ఎక్కడుంది? ఎంతసేపు వుంది? ఏమైందిప్పుడు మరి? ఉండాలిగా మరి ఎప్పుడూ నీతోటి? కాబట్టి శాస్త్రజ్ఞానము అసహజం. అది అతుకుల బొంత. ఇప్పుడు ఈ శాస్త్రాన్ని నమ్మావు. ఇంతకు ముందు ఇంకో శాస్త్రాన్ని నమ్మలేదా? అప్పుడూ నమ్మావుగా. ఇది అయిపోయినాక ఇంకో శాస్త్రాన్ని నమ్మవా? స్థితి మారిపోతే ఇంకో శాస్త్రాన్ని నమ్ముతావుగా. ఏమైంది ఇప్పుడు? కాబట్టి నీవు సహజజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయినాయనా. గురువు అంటే ఏమిటంటే, గురువుని నమ్మమని ఏ గురువు చెప్పడండి. నన్ను నమ్మమని ప్రపంచంలో ఏ గురువు చెప్పినా ఆయన గురువు కాదు. ఒక్కటే గుర్తు పెట్టుకోండి. నీకు గురువు ఎందుకు కావాలయ్యా? సహజజ్ఞానం కోసం కావాలి. నీలో వున్నటువంటి సహజజ్ఞానాన్ని నిద్రలేపేవాడన్నమాట అతను. శాస్త్రజ్ఞానాన్ని బోధించేవాడు కాదండి. నీవు సహజంగా జ్ఞానస్వరూపుడివి అయివున్నావు. నీవు సహజంగా ఆత్మస్వరూపుడివై వున్నావు. నిన్ను ఆ స్థితిలో మేలుకొల్పేవాడు. అది అతను చేసేటటువంటి పని. ఒకటే పని చేస్తాడు. తన సత్తాని, శక్తిని ఉపయోగించి, తాను ఏది అనుభవిస్తున్నాడో, ఆ స్థితిలో వుండి, ఆ స్థితిలో వుండే వాక్యం చెబుతూ, నీకు అనుభవం వచ్చేటట్టుగా చేస్తూ, మార్పుచేస్తూ, నిన్ను సహజజ్ఞానస్వరూపుడిగా చేస్తాడు. అప్పుడేమైంది? చిన్న నిద్రలో అది పోదు. పెద్దనిద్రలోకూడా అదిపోదు. అది సహజంగా ఆ జ్ఞానం అలానే వుంటుంది. ఎందుకని? నీవు ఆత్మస్వరూపంలో జ్ఞానస్వరూపుడివే అయివున్నావు. నీవు జ్ఞానస్వరూపుడివే అయివుండగా, మళ్ళా ఇప్పుడు ఆత్మకు ఏం చేస్తు్న్నావు? నీకు ఈశావాశ్యోపనిషత్తు బోధిస్తానండి, నీకు కఠోపనిషత్తు బోధిస్తానండి, నీకు భగవద్గీత బోధిస్తానండి, అవన్నీ ఎందులోనుంచి వచ్చినాయి? నీ స్వరూపజ్ఞానంలోనుంచేనా? నీ స్వరూప జ్ఞానాన్ని పుస్తకంలో, అక్షరరూపంలో వ్యక్తీకరించ పూనుకుంటే, అది అయ్యింది. అంతేనా అండి. వ్యక్తీ కరణ సత్యమౌతుందా, నువ్వు సత్యమౌతావా? నువ్వే కదా సత్యం. అర్థమైందా అండీ!
            కాబట్టి నీవు ఇట్లా విచారణ చేసుకో నాయనా! ఇలా విచారణ చేసుకుని అనుభవజ్ఞానాన్ని పొందు. కాబట్టి మరణకాలంలో కూడా నీకు ఉపయోగపడేది ఏమిటి? సహజజ్ఞానమే ఉపయోగపడుతుంది. అదే తరించడానికి అవకాశం. ఆ సహజజ్ఞానం నీకు సాధన చతుష్టయ సంపత్తిని అభ్యాసం చేసి జీవిస్తేనే సాధ్యమౌతుంది. ఆ సాధన చతుష్టయ సంపత్తిని ఎల్లకాలము మరువకూడదు. అలాగే, చతుర్విధ శుశ్రూషలు. గురువుకు చేసేటటువంటి నాలుగు శుశ్రూషలు, అంగ, స్థాన, భావ, ఆత్మ శుశ్రూషలు. ఈ నాలుగు, ఆ సాధనచతుష్టయ సంపత్తి, చతుర్విధ శుశ్రూషలు. ఆ నాలుగు ఈ నాలుగు నిజజీవితంలో ఎవడైతే త్రికరణ శుద్ధిగా పాటిస్తాడో, వాడికి ముక్తి సిద్ధము. వాడు ఏమీ చదవక్కర్లేదు. ఏమీ వాడికి పాండిత్యము అవసరం లేదు. సంస్కృత భాష అవసరం లేదు. తెలుగు భాషకూడా రాని వాళ్ళు వున్నారండి. భూసం వెంకయ్యగారని, కావాలంటే చూపెడుతాం. చల్లపల్లికి దగ్గర భూసం వెంకయ్యగారు వుండేవాళ్లు. ఆయన నిరక్షరకుక్షి. ఆయన సద్గురువు. మహానుభావుడన్నమాట. ఆయన ఫోటో అక్కడ ఆశ్రమంలోవుంటుంది. బళ్ళా సుబ్బనాగన్నగారి ఆశ్రమంలో వుంటుంది. ఆయనకు ఏమీ రాదండి. అక్షరజ్ఞానం లేదు. అంతా వేలి ముద్రే. సాలి పని చేసుకునేవారు. బూసం వెంకయ్యగారు. ఏమీ లేదు. అలా సహజజ్ఞానం సిద్ధించింది. వాళ్ళు పాటించేవి ఇవి నాలుగేనండి. నాయనా సాధన చతుష్టయ సంపత్తి అంటే ఇదిగో ఇది. ఇలా ఈ నాలుగు సంపదలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని సాధించు నిజజీవితంలో. నాలుగు శుశ్రూషలు, గురువుకి నాలుగు శుశ్రూషలు చెయ్యి. ఏమిటవి? అంగ, స్థాన, భావ, ఆత్మ శుశ్రూషలు. అంగ శుశ్రూష అంటే ఇందులో బాహ్యార్థాలు, అంతరార్థాలు రెండూ వున్నాయి. అంగశుశ్రూష అంటే గురువుగారి శరీరానికి సేవచేయమని, కానీ అది కాదండి. గురువు శరీరము, నా శరీరము వేరుగా లేవండి. రెండూ ఒకటే. అనే భావనలో నిలిపివుండు. నీ శరీరం మీద నీళ్ళు పోసుకున్నావు. ఇప్పుడు ఎవరికి అభిషేకం చేస్తున్నావు? గురువుగారికి. నువ్వు భోంచేస్తున్నావు, ఎవరికి ఆహారము పెడుతున్నావు? గురువుగారికి. ప్రతిదీ. ఈ శరీరంతో చేసే ప్రతి పని, ప్రతి భావాన్ని, ప్రతి ఆలోచనని, ఈ గురువు యొక్క దృష్టిలో వుండి చేయి. అప్పుడు అంగ శుశ్రూష అవుతుంది. అదే శుశ్రూష. అంతేగాని నీ కాళ్ళు నొక్కడాని, నీ చేతులు నొక్కడాలు, నీ కంఠం నొక్కడాలు ఆయనకు ఏమీ అవసరం లేదు. అర్థమైందా అండీ! ఇవన్నీ అధిగమించేసిన వాడు ఆయన. అంతేగాని నువ్వు ఆయన కాళ్ళమీద పడినంతమాత్రాన ఆయనకు ఒరిగేది ఏమీ లేదు. ఆయన కాళ్ళ మట్టి నీకు అంటటం తప్ప ప్రయోజనం లేదు. అది అవసరమైన వాళ్ళకి చెబుతాం. ఎందుకంటే బాగా అహంకారం వున్నటువంటి వాళ్ళు, పడితేనే గాని, ఆకాళ్ళమీద పడితేనే గాని, తల బాదుకుంటేనే కాని పోనప్పుడు చెబుతాం. అయినా కూడా మా పద్ధతి అది కాదు. మాది సహజజ్ఞానపద్ధతి. కేవలం ఇహంతో పని లేకుండా, నీవు సహజంగా జ్ఞాన స్వరూపుడవని, నీతో కలిసివుండి, నీతో సమంగా వుండి బోధించడమే మా పద్ధతి. ఎందుకనిట? ఒకటి గుర్తు పెట్టుకోండి. గోష్టి. మనం ఇప్పుడు మాట్లాడుకున్నదంతా కూడా గోష్టి. అంటే పూర్తి స్వేచ్ఛ వున్నది ఎవరికైనా సరే. నాకే కాదు మీకు కూడా మాట్లాడడానికి పూర్తి స్వేచ్ఛ వున్నది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శ్రీ కృష్ణుడు ఉద్ధవుడికి ఏమౌతాడు? గురువా శిష్యుడా? మిత్రుడా? మిత్రుడు కదా! * మిత్రుడు, ప్రాణ మిత్రుండి. కాబట్టి పరమాత్మ... గోపికలు ఎలా వున్నారు? ఏమన్నా ఎడం వుందా వాళ్ళకి? లేదు కదా! అలాగ గురుశిష్యులు కలిసివుండాలి నాయనా! నేను గురువుని అనే అహం అతనికి పనికిరాదు. నేను శిష్యుడను అనే న్యూనతాభావం నీకు పనికి రాదు. అమ్మో! నేను శిష్యుడని, నేను దూరంగా వుండాలి, నేను భయం... అనుకోమాకు. గురువుతో మమేకంగా కలిసి జీవించు. ఉన్నతమైన వాటితో కలిసి జీవిస్తే నీకు ఉన్నతమైన జీవితమే లభిస్తుంది.నీచమైన జీవితం లభించే అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళ దగ్గర వున్న లక్షణమే అది. అర్థమైందా అండి?
వాళ్ళు పతనం చెందరు, మరొకరిని పతనం చెందనివ్వరు. ఎందుకని? జన్మజన్మల యొక్క సంస్కార బలం, వాసనాబలం మొత్తాన్ని అధ్యయనం చేసినటువంటి సామర్థ్యం వున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. నీవు ఏం చేస్తే బాగుపడుతావో నీకు తెలియకపోవచ్చు కానీ, వాళ్ళకు తెలుసు. అర్థమైందా అండి? నీకు ఎంత కష్టమైనా సరే! నీకు దుఃఖం వచ్చినా సరే, వాళ్ళు చెబుతూనే వుంటారు. ఎందుకని? ఆ దుఃఖం పోవాలి కదా! మరి. కాబట్టి వాళ్ళని ఆశ్రయించాలి అని అంటే, నీవు ఈ అంగ, స్థాన, భావ, ఆత్మ శుశ్రూషలు చేయాలి నాయనా! స్థాన శుశ్రూష అంటే ఏమిటి? స్థాన శుశ్రూష అంటే, గురువు గారు కూర్చునే ధ్యాన మందిరం, పూజా మందిరం, ఆ గురువుగారి ఇల్లు అవి బాహ్యార్థం. అంతరార్థం ఏమిటంటే, గురువు సర్వవ్యాపి కదా! మరి ఎక్కడుంటాడు? సర్వవ్యాపకం అయినటువంటి వాడు నీ హృదయంలో వున్నాడు. కాబట్టి నీ హృదయం అంటే ఏమిటి? ప్రాణ మనో బద్ధులు ఎక్కడైతే లీనమౌతున్నాయో అదే నీ హృదయం. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. నీ హృదయ స్థానం ఎక్కడా? అని ఎవరైనా అని ప్రశ్నిస్తే, మిమ్మల్ని మీరు అడిగితే, నా హృదయం ఎక్కడా? ఎక్కడైతే ప్రాణ మనస్సులు లీనమౌతున్నాయో, ఆగిపోతున్నాయో, అది నీ హృదయస్థానం. ఇప్పుడు గాఢనిద్రావస్థలో నీకు నీ మనస్సు ఆగిపోతుందా లేదా? ఎక్కడదాకా వచ్చావు? అప్పుడు ఎక్కుడున్నావు? కంఠం వరకూ వచ్చావు. అందుకే తల వాలిపోతుందండి. నిద్రలోకి పోగానే ఏం వాలిపోయింది? తల వాలిపోయింది. అంటే కంఠస్థానం వరకే వచ్చావు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రాణం, ఈ ప్రాణం కూడా హృదయస్థానంలో లీనమైపోతుంది. నువ్వు దేనినో ఒకదానిని ఆశ్రయించు, ప్రాణాన్నో, మనస్సునో. నీకు ఏది చేతనైతే దానిని ఆశ్రయించు. ఈ మనస్సును వెంబడిస్తూ పో. గమనిస్తూ పో. కొంతసేపటికి మనసు లేకుండా పోతుంది. కదలకుండా ఆగిపోతుంది. ఆ కదలకుండా, ఆలోచనలు లేకుండా, ఆగిపోయిన స్థానమే హృదయస్థానం. అలాగే ప్రాణం మీద ఆధారపడి చేస్తానంటావా? ఆ ప్రాణాన్ని గమనిస్తూ పో. కొంతసేపు అయ్యేప్పటికి ప్రాణ చలనం ఆగిపోతుంది. ఆగిపోయిన స్థితి ఎక్కడైతే వుందో అదే నీ హృదయస్థానం. అని భగవాన్ రమణులు హృదయస్థానం గురించి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు. ఆయన ఒకటి రెండు వాక్యాలే చెప్పారండి చక్కగా. ఆయన ఉన్నది నలుబది అని నలభై శ్లోకాలు చెప్పారండి. (ఆగి పోయిన స్థితి పోదా) పోలా ఇట్లా తెలుసుకో, నీకు అదే తెలుస్తుంది. ప్రాణాన్ని గాని, మనస్సుని గాని, ఏదో ఒకదానిని గమనించు, అది కొంతదూరం అయ్యేటప్పటికి చలనం ఆగిపోతుంది. నువ్వేమి, నీ ప్రయత్నం అవసరం లేదు, నువ్వు గమనిస్తూ వుంటే చాలు. వాటి చలనం ఆగిపోతూ వుంటుంది. ఆ ఆగిపోయిన స్థానంలో నీకు తెలివి వుంటుంది. ఆగిపోయిన స్థితిలో తెలివి వుండాలి మళ్ళా. మళ్ళా నిద్రలో కూడా, తెలివి లేకుండా పోతే, నిద్రలోకి పోతే ప్రయోజనం లేదు. నీకు తెలివి వుండాలి. వాటి చలనం ఆగిపోతుంది. సహజంగా ఏ ప్రయత్నం లేకుండా. (ఆగిపోయింది తెలియటం లేదు ఇప్పుడు) తెలుస్తుంది, తెలుస్తుంది.  నిద్రయొక్క ప్రభావం తగ్గిపోతే తెలుస్తుంది. తమోగుణ ప్రభావం తగ్గిపోతే తెలుస్తుంది. తగ్గిపోతుంది. అన్నీ తగ్గిపోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. నీ స్వప్రయత్నం వున్నప్పుడు ఎప్పటికీ తెలియదండి. నిన్ను నువ్వు బయటే సరిగ్గా తెలుసుకోలేకపోతున్నావు, లోపల ఎట్లా తెలుసుకుంటావు? ఈ శాస్త్రజ్ఞానంలో వున్నంత సేపు, ఈ మిడిమిడి జ్ఞానం వున్నంత సేపు, ఇలాగే ప్రయత్నం చేస్తారు. నిన్ను మర్చిపో కాసేపు. భారం భగవంతుడి మీద వెయ్యి. గురువు మీద వెయ్యి. చక్కగా ఆ గురువును ధ్యానించు. గురువు రూపాన్ని ఉపాసించు. అదే దైవం. ఆ రూపాన్నే పట్టుకో. దాని మీదే దృష్టి నిలబెట్టు. మనసు, ప్రాణాన్ని అట్లా గమనిస్తూ వుండు. చివరకు ఆ రూపం మిగిలి పోతుంది. ఈ ప్రాణ మనస్సుల చలనం ఆగిపోతుంది. ఆ రూపం అట్లా మిగిలిపోతుంది అంతే. ఏ కదలిక లేకుండా రూపం అట్లా మిగిలిపోతుంది. ప్రాణ మనస్సుల యొక్క చలనం ఆగిపోతుంది. కొంతకాలం అయ్యేటప్పటికి ఆ రూపం ఎగిరిపోతుంది. ఆ స్థానంలో ఆత్మ సాక్షాత్కరిస్తుంది. అంతే. నీ హృదయంలోకి చేరితే నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. అంతే. వేరే ఏమీ లేదు. నీకు ఎందుకు కలగడం లేదయ్యా? నీ హృదయంలోకి నీవు చేరడం లేదయ్యా బాబు. ఎంతసేపూ బయటే వుంటున్నావు. ఎంతసేపు బయట వున్న ఇంద్రియాలలోనే ప్రవర్తిస్తున్నావు. కాబట్టి, స్థాన శుశ్రూష అంటే ఏమిటంటే, ఈ హృదయస్థానం దీనిని చక్కగా తెలుసుకుని, దీనిని చక్కగా బాగుచెయ్యి. దీనిని చక్కగా హృదయాన్ని బాగచేయి, చిత్తశుద్ధిని కలిగివుండు. ఆ వృత్తి కలిగినప్పుడల్లా, అయ్యో! నాకు మళ్ళా ప్రియం కలిగిందే, మోహానికి దారితీస్తుందే, అని గుర్తెరుగు, వైరాగ్యభావాన్ని కలిగివుండు. అర్థమైందా అండీ! మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీకు అనుకూలమైనవే ప్రియం కాదు. మీకు వ్యతిరేకమైనవి కూడా ప్రియమే. అదికూడా అందులో భాగమే. అర్థమైందా అండీ! అలాగ ఈ సత్యాన్ని తెలుసుకో, ఇదేమిటిది స్థాన శుశ్రూష. అంగ, స్థాన. భావ శుశ్రూష - భావం అంటే ఏమిటి ఇప్పుడు? నేను ఎవరిని? నేను ఫలానా అన్నపూర్ణగారిని, నేను ఫలానా ... కాదు మీరెవ్వరు. నేను ఎవరిని? నేను సచ్ఛిష్యుడను. నేనెవరిని భావంలో? నేను సచ్ఛిష్యుడను. ఆ సత్‌ అనేటటువంటి జ్ఞానానికి శిష్యుడను. ఆ సత్‌ అనే స్థితికి శిష్యుడను. సత్‌శిష్యుడను నేను. అర్థమైందా అండీ !
            ఇప్పుడు నేనెవరిని, నేను సచ్ఛిష్యుడను అని ఎవరైతే భావన చేస్తారో, వాడయ్యా భావ శుశ్రూష. గురువు కోరేది ఇదన్నమాట. అంతేకానీ నీ పండ్ల, ఫలాలు, నీ అరటి గెలలు ఏం చేసుకుంటాడాయన అవన్నీ? నీ దొంతరలు, దొంతరలు వస్త్రాలు, ఏం ప్రయోజనము లేదు, హంస తూలికా తల్పాలు, ఎందుకు అవన్నీ? ఆయనకు ఏం ప్రయోజనము లేదు. అర్థమైందా అండీ! ఓ మామిడి పండ్ల బుట్ట ఇస్తే సంతోషించే వాడు కాదు. అర్థమైందా అండీ? ఎలాంటి వాడట? హృదయమును మీరి వున్నాడయ్యా! నీవు హృదయానికి చేరటమే తెలియని వాడివి. ఆయన హృదయ స్థితిని మీరి వున్నటువంటి వాడు. అర్థమైందా అండీ! కాబట్టి భావ శుశ్రూష అంటే ఏమిటి? నేను సచ్ఛిష్యుడను, ఆ సచ్ఛిష్య స్థితిని కాపాడుకుంటాను. సచ్ఛిష్య స్థితిని పోషించాలి. ఇప్పుడు ఎట్లా అయితే భార్యస్థితిని, భర్త స్థితిని, ఈ రకరకాల స్థితులను పోషిస్తున్నావే, ఉపాధ్యాయ స్థితిని, పాఠం చదువుకునే విద్యార్థి స్థితిని, పోషిస్తున్నావు కదా ఇవన్నీ పాత్రలే కదా! అట్లా ఏ పాత్రలను పోషించాలంట జీవితం మొత్తం మీద? సచ్ఛిష్యుడను అనే స్థితిని పోషించే ప్రయత్నము చెయ్యి. అప్పుడు నీవు భావ శుశ్రూష చేసినటువంటివాడవు. ఇక ఆత్మ శుశ్రూష. ఆత్మ శుశ్రూష అంటే ఏమిటి? ఇదే ఆఖరి ఉన్నతమైన శుశ్రూష అండి. ఇదే నవవిధ భక్తి మార్గాలలో వున్నటువంటి చివరి సాధన ఆత్మనివేదన. అక్కడ కూడా చెబుతారండి ఆత్మ నివేదన. తొమ్మిదవది అన్నమాట అది. అట్లాగే గురువుకి చేసేటటువంటి ఉత్తమమైనటువంటి శుశ్రూష ఏమిటంటే, ఆత్మ శుశ్రూష. అంటే నా అంతరాత్మ, ఆ పరమాత్మ, ఆ గురు స్వరూపము రెండూ ఒక్కటే. నేను గురువు ఒక్కటే. అనే స్థితిలో నిలచి వుండటమే, ఆత్మ శుశ్రూష. ఇలా ఎవడైతే తెలుసుకుంటాడో, వాడికి ముక్తి సిద్ధము. వాడికి ఏ రకమైనటువంటి భేదము వుండదు. కాబట్టి ఈ రకంగా ఎవరైతే, ఆ సాధన చతుష్టయ సంపత్తి, నిత్యానిత్యవస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము ఈ నాలుగూ వుండాలి. ఈ నాలుగు శుశ్రూషలు చేయాలి. ఆ నాలుగు సంపాదించాలన్నా, ఈ నాలుగూ చేయాలన్నా, కీలకము ఎందులో వుందయ్యా అంటే, నిన్నకూడా చెప్పా. ఉపరతి, తితీక్ష జీవితంలో జీవించాలి. అవి చెయ్యాలి అంటే, నీకు ఏమి వుండాలి అంటే, తీవ్రమోక్షేచ్ఛ వుండాలి. ముముక్షుత్వము తీవ్రంగా వుండాలండి. ఆ నాల్గవ సాధన అయినటువంటి ముముక్షుత్వము తీవ్రంగా వుండాలి. నేనే ముక్తి ఈ జన్మలో చెందవలసిందే. ఎందుకని? ఈ జన్మకు కుదిరినట్లుగా వచ్చే జన్మలో కుదురుతుందో లేదో నాకు తెలియదు. ఆ వచ్చే జన్మకు రూపం లేదు కదా! గతించిన జన్మలేమో జ్ఞాపకాల రూపంలో వున్నాయి కదా! కాబట్టి దేనిని పట్టుకుంటావు ఇప్పుడు? ఇప్పుడున్న వర్తమానాన్నే పట్టుకో. ఈ జన్మలో నేను ఏమైనా సరే ముక్తిని సాధించవలసిందే. అని ఎవడైతే నిర్ణయంతో జీవిస్తాడో, ఆ తీవ్ర మోక్షేచ్ఛ చేత, ఆ నాలుగు సాధన చతుష్టయ సంపత్తి ఏర్పడుతాయి, ఈ నాలుగు శుశ్రూషలు చేయగలుగుతావు. ఈ నాలిగిటికి, ఆ నాలిగిటికి ఆధారం ఏమిటయ్యా అంటే, ఆ తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ. ఆ మోక్షంలో కోరిక వుండాలి. మోక్ష ఇచ్ఛ. ఆ కోరిక వుంటే తప్ప సాధ్యం కాదు. (ఇది కూడా ఒక కోరికే కదా!) ఎవ్వరికి? మోక్షసన్యాస యోగం, మోక్షం కూడా త్యజించగలిగే అనుభవం వచ్చినప్పుడు, నీకు పరమాత్మ... అందుకే మీకు ఇందాక చెప్పలేదా? పరమాత్మ స్థితి అనుభవం వచ్చేసిందండి. ఇంకా జ్ఞానం ఎవరికి కావాలి? అక్కర్లేదు కదా! అనుభవజ్ఞానం వచ్చి సహజంగా ముక్తుడిగా వున్నప్పుడు అతను ఏ పాఠం చదవాలి? ఏదీ చదువక్కర్లేదు. ఏ సాధన చెయ్యాలి? ఏం చెయ్యక్కర్లేదు, ఎందుకని? అన్ని సాధనలు అతనిలోనే వున్నాయి. ఏదైనా రెప్పపాటులో చేయగలడు. ఆ సామర్థ్యము వున్నటువంటి వాడు. అర్థమైందా అండీ! అంత సామర్థ్యం వుంటేనే కదా! ఆ స్థితిలో వున్నాడు. అర్థమైందా అండీ? ఇప్పుడు నేను పిరమిడ్‌ ధ్యానానికి వెళ్ళానండి. అందరూ ధ్యానం చేస్తున్నారండి. నేను కూడా వాళ్ళతో పాటు కూర్చున్నానండి, ఆ పిరమిడ్‌ మాస్టర్‌ గారన్నారు, ఏమండి? ఏమిటి మీకు ధ్యానం కుదరడం లేదు అన్నారు. ఏమిటోనండి మరి కుదరటం లేదు అన్నాను. అర్థమైందా అండి? మరి మీరు రోజూ రండి, చక్కగా మాతో పాటు సాయంత్రం వచ్చి శ్వాస మీద ధ్యాస నిలపండి చక్కగా ధ్యానం కుదురుతుంది అన్నారు. సరే నండి, అలాగే చూద్దాం పరిస్థితిని బట్టి చేద్దాం అన్నాను, ఇప్పుడు మనకు ఎందుకు ఆయనతో తగాదా? మీరు ఏం చేస్తున్నారు అయినా కానీ ఇంత మంది ధ్యానం చేస్తుంటే అన్నారు. ధ్యానం చేసేవాళ్ళ అంతరంగాలను గమనిస్తున్నానండి అన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇప్పుడు అది ధ్యానమా అది ఏమిటంటావు ఇప్పుడు? నువ్వు చేసే ధ్యానం ఏమిటి? నీ అంతరంగాన్ని గమనించే ప్రయత్నము చేస్తున్నావు. అక్కడున్న అంతమంది అంతరంగాలను కళ్ళు మూసుకుని గమనిస్తున్నానండి. నేను చేసే ధ్యానమిది. కాబట్టి నేను కళ్ళు మూసుకోవటం లేదండి, వాళ్ళలాగా నేను లేను, అంతే తేడా అంతకు మించి ఏమీ లేదు. ఈ గోల అంతా ఆయనకు అర్థం కాలేదు. అదంతా నాకెందుకు కానీ, మీరు రేపటి నుంచి వస్తారా? రారా? చెప్పండి అన్నాడు. సరేలేండి అలాగే, వీలుకుదిరితే అలాగే వద్దాము, ఇప్పుడు ఏమి పోయింది? నష్టమేముంది? తరువాత ఆయన ఈ వాక్యము వెళ్ళి వాళ్ళ వాళ్ళను అడిగాడు. వాళ్ళ మాస్టర్స్‌, పై మాస్టర్స్‌ వుంటారు కదా! వాళ్ళని అడిగాడు. వాళ్ళు చెప్పారు. ఒరేయ్‌ నాయనా వాళ్ళు ధ్యానం నేర్పటటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు already ధ్యానం దాటినటువంటి వాళ్ళు. నువ్వు వాళ్ళకు నేర్పడం కాదు, వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకోవలసినవాళ్ళు అని చెప్పారు. తరువాత ఆయన వచ్చాడు, అయ్యో! పొకపాటు పడ్డానండి, మీకు ధ్యానం నేర్పుతానని నేనన్నాను పొరపాటు పడ్డాను. కాబట్టి సహజజ్ఞానము వున్నవాడిలో అంత సామర్థ్యము వుంటుందండి. ఏమీ చేయడు. మీరందకూ అన్నీ చేస్తే వుంటే చక్కగా చూస్తూ వుంటాడు. అన్నీ చేయగలిగిన సామర్థ్యము వున్నటువంటి వాడు. అన్నీ విప్పి తెలుసుకున్నవాడు. అన్నీ దాటేసిన వాడు, వాడికేమిటి? అన్నీ సహజంగా వుంటాయి. ఆ సహజత్వంలో వుంటాడన్నమాట ఎప్పుడూ కూడా. నువ్వు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. మీరంతా కూడా ఏ పనిచేసినా కూడా, సాత్వికం, రాజసికం, తామసికం తప్పనిసరిగా వుంటాయి. అంటే శక్యానుసారమే చెయ్యాలని పెద్దల నిర్ణయము. అంటే అర్థము ఏమిటి? శక్తికి లోబడి తక్కువగా చేస్తావనుకో, నీకు దానం చేయగలిగే సామర్థ్యానికి తక్కువ చేశావనుకో, అది తామసిక దానం అవుతుంది. అర్థమైందా అండీ! శక్తికి మించి చేస్తే రజోగుణం అవుతుందండి. ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ శక్తికి మించి ఏ పని చేసినా సరే అది రజోగుణమే అవుతుంది. యథాశక్తి చేస్తే అది సత్వగుణం అవుతుంది. ఎప్పుడూ కూడా ఆచరణ యథా శక్తి చెయ్యాలి. ఆ శక్తిని నిర్ణయం చెయ్యాలి అంటే ఒక విధానం వుందండి. ఇక్కడే అందరూ తప్పుదారి పడతారన్నమాట. యథాశక్తి అంటే ఏమిటంటే, అప్పటికప్పుడు చూసుకుంటాం అన్నమాట. అప్పటికప్పుడు చూసుకోవడం కాదు, జ్ఞాన లక్ష్యంతో చూడాలి. నీ శక్తిని అంతా ఆ జ్ఞాన లక్ష్యంతో చూస్తే, సరిపోయి వుండాలి. అది సరిపడటం అంటే. జ్ఞాన లక్ష్యం కంటే మించి చేశావనుకోండి, శరీర భ్రాంతిలో పడిపోతావు. అర్థమైందా అండీ! జ్ఞానలక్ష్యం కంటే మించి చేసినప్పుడు ఏం చేస్తావు? శక్తికి మించి చేస్తావు. నీ ప్రత్యేకత నిలుపుకోవాలని చేస్తావు. అప్పుడు రజోగుణంతో చేస్తావు. అప్పుడు శరీర భ్రాంతిలో పడిపోతావు. కాదయ్యా! జ్ఞాన లక్ష్యం కంటే మించి, తగ్గించుకున్నావు ఇప్పుడు. మించద్దని చెప్పాను కదా! తగ్గించుకున్నావు, తగ్గించి, లోపించి చేశావు జ్ఞానం. జ్ఞానలక్ష్యంతో కాకుండా చేశావు. అజ్ఞానలక్ష్యంతోనే చేశావు అసలు. లక్ష్యమే పోయింది. అప్పుడేమైంది? తమోగుణం, జగద్భ్రాంతి లోకి వచ్చేశావు. అది ఇంకా ప్రమాదము. శరీర భ్రాంతియైన పర్వాలేదు కొంతవరకు, ఎందుకని రజోగుణం, తగ్గించవచ్చు దానిని. ఎలాగొలా పరిణామం చెందవచ్చు. ఇప్పుడు జగద్భ్రాంతి. మొదటికే మోసం అన్నమాట. జగద్భ్రాంతి వంకాయే సత్యమన్నమాట ఇప్పుడిక. దానిని మార్చడానికి వీలుకాదు. అది తమోగుణం. పదార్థభ్రాంతిలో వుంటావన్నమాట. కాబట్టి నీవు ఏదైనా ఆచరించేటప్పుడు ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకోవాలి. వీటిని ఆచరణ చేసేటప్పుడు, ఆ సాధన చతుష్టయ సంపత్తిని, ఈ చతుర్విధ శుశ్రూషలని, నీ శక్త్యాను సారం చేయడం అనే జ్ఞాన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేయడాన్ని, మనమందరం ఆచరణ సిద్ధంగా నిజజీవితంలో వాడుకుని, ఉపయోగించి జీవించేటట్లయితే, మనం ముక్తిని చెందడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. ఇది సద్గురు కృప వల్లనే సాధ్యమౌతుంది. ఇదంతా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. గురు కరుణాకటాక్షము లేక, ముక్తి అసాధ్యము. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది అనుభవ వాక్యం అన్నమాట. ఎంతమంది, ఎంతోమంది మహానుభావులు, ఆఖరికి వేదవ్యాసుడు సర్వమూ, అన్ని వేదాలను విభజించినటువంటివాడు, అష్టాదశ పురాణాలను విరచించినటువంటివాడు, ఇదే అందుకే చివరికి చెప్తారండి. అందరికీ ఈ మాటలు చెప్పరు. ఏం చేశారంటే చిట్టచివరికి దేహ అవసాన దశ వచ్చేస్తుందండి, వచ్చేసినా కూడా ఆయనకు దుఃఖం విడువలేదండి, ఏమిటట? ఒక అరణ్యములో తలక్రింద చేయిపెట్టకుని పడుకుని వున్నాడు. ఒక వట వృక్షం కింద. పడుకుని వుంటే, ఆ దారి వెంబడి ఎవరో ముని కన్యలు వెళుతూ వున్నారు. ఓహో! ఎవరో మహానుభావుడు, మహర్షి, ఈయన అన్నీ గడ్డం పెంచుకున్నాడు, చూడబోతే ఈయన చాలా కాలం నుంచి, ఈయనకు వేల సంవత్సరాల వయస్సు వున్నట్టుంది. చాలా తపస్వి లాగా వున్నాడే. కానీ తలకింద చేయిపెట్టుకుని నిదురపోతున్నాడే, ఇంకా తలకింద చేయపెట్టుకోవాలి, ఆ సుఖం మీద అపేక్ష వుందే ఈయనకి. అని అన్నారట ముని కన్యలు. ఇది ఆయన విన్నాడు. విని ఏం చేశాడట? మళ్ళా మునికన్యలు ఎప్పుడు వస్తారో చూసి, ఈ తలకింద చేయి తీసివేశాడట. తీసేయగానే వాళ్ళు, అయ్యో! ఈయనకి సుఖాపేక్షే వుందనుకున్నాను, ఈయనకు అహం కూడా వుందే! మనం అన్నామని చెప్పి తీసేశాడు కానీ, సుఖం మీద అపేక్షపోయి కాదు కదా! మనకి చూపెట్టడం కోసమని తీసేశాడు కదా! అన్నారట.
అప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయ్యిందట. కాబట్టి శాస్త్ర జ్ఞానమైనా, మరొకటైనా, మరొకటైనా ప్రతి అనుభవజ్ఞాని... నేను చెప్పేది అదే నండి,
నీ నిజజీవిత జ్ఞానంలో ప్రతి మాట, చేతలో సహజజ్ఞానం ఎప్పుడూ వుండాలి. అదే శాశ్వతం. అంతే కాని, మరొకరి కోసం చేస్తున్నావంటే అదంతా అహం యొక్క ప్రతిపాదన.

ఓం ఓం ఓం
ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం తత్‌ సత్‌
ఓం సహనా వవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతవస్తు మావిద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః
సాయిరాం.