File No.11




ఎవరికి ఝడుపు వుండునో, భయము వున్నదో వాడయ్యా జీవుడు. అంటే అర్థం ఏమిటి? రోజూ నిద్రలోకి పోతున్నాడు. మరల ఉదయం మేల్కొంటున్నాడు. దీన్ని ఏమన్నారయ్యా అంటే నిత్యప్రళయం. దీనిని ఏమంటారు? నిత్యప్రళయం. అంటే రోజూ చస్తాడు, రోజూ పుడతాడు. ఒకసారి 100 ఏళ్ళకేదో చావడం అనేది లేదు. జీవుడు అంటే అర్థం ఏమిటంటే, నిత్యప్రళమును అనుభవించేవాడు. ఉపనిషత్తులు ఏమి చెబుతున్నాయయ్యా అంటే, ఏ ఉపనిషత్తు తీసుకున్నా కూడా మొట్టమొదట జీవుడి విషయం చెబుతారు. అట్లాగే ఈశ్వరుడి విషయం చెబుతారు. జీవేశ్వరులు ఎలా కలిసి వున్నారు? రెండూ ఒకటే ఎలాగ అయివున్నాయి? ఆ ఈశ్వర లక్షణాలే, ఈ జీవుడికి ఎట్లా వున్నాయి? అట్లా గనుక ఆ ఈశ్వర లక్షణాలతో గనుక నువ్వు ఈ శరీరంలో జీవించినట్లయితే, నీవే భగవంతుడివి అని ఎట్లా తెలుసుకుంటావు? నీవే భగవంతుడివి అని ఎట్లా జీవిస్తావు? ఏ ఉపనిషత్తు అయినా ఇదే ప్రాథమిక సూత్రం మీద నడుస్తుంది. అది ఈశావాస్య మిదం సర్వం దగ్గర నుంచి మొదలు పెడితే, చివరికి ముక్తికోపనిషత్‌ వరకు అన్ని ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు కూడా ఇదే ప్రాథమికంగా, మొట్టమొదటలో జీవుడు అంటే ఏమిటి? ఆ తరువాత ఈశ్వరుడు అంటే ఏమిటి? జీవేశ్వరులకు ఒకే లక్షణాలు ఎలా వున్నాయి? జీవుడు ఈశ్వర లక్షణాలతో ఎలా జీవించాలి? అలా జీవిస్తే తాను భగవంతుడని ఎట్లా తెలుసుకుంటాడు? తెలుసుకున్న తరువాత భగవంతుడిగా ఎట్లా జీవిస్తాడు. ఇంతే! ఏ ఉపనిషత్తు అయినా కూడా ఇదే ఆరు వాక్యాలమీద నడుస్తుందన్నమాట. వీటిని షడ్‌లింగములు అని సంస్కృతములో అంటారన్నమాట. ఆరు పద్ధతులు అన్నమాట. ఉపనిషత్తు ఆ ఆరు పద్ధతులుగా వివరిస్తూ వుంటుంది ఎప్పుడూ కూడా. దాని లక్ష్యం అదన్నమాట. ప్రతి ఉపనిషత్తుకి లక్ష్యం ఇదే. ఏ ఉపనిషత్తు మొదటినుంచి, చిన్న ఉపనిషత్తు కావచ్చు, అతి పెద్ద ఉపనిషత్తు కావచ్చు. అది ఈ ఆరు ధర్మాలను కలిగివుంటుందన్నమాట. అందులో ఏమి వివరించబడుతాయి? జీవుడంటే ఏమిటి? అంటే మీరు ఎక్కడైనా, ఏదైనా ఉపనిషత్తులు చెబుతున్నారండీ, వింటున్నామండీ, చదువుతున్నామండీ అన్నారనుకోండి. ఈ ఆరు లక్షణాలను అందులో గమనించాలన్నమాట. ఓహో! ఇందులో జీవుడు అంటే ఏమని చెప్పాడు? ఈశ్వరుడు అంటే ఏమని చెప్పాడు? జీవుడికి ఈశ్వర లక్షణాలు ఏమి వున్నాయి? ఈ ఈశ్వరుడి లక్షణాలతో జీవుడు ఎట్లా జీవించాలి? అలా జీవిస్తే, జీవుడు ఈశ్వరుడిగా ఎలా వున్నాడు? ఇది తరువాత ఎలా గుర్తిస్తావు? ఇక అదంతా, ఆ అనుభవం ఎట్లా గుర్తిస్తావు? ఇంతే సంగతులు. ఇదే, ఇలాగే చెబుతాయన్నమాట. అన్నీ ఇలాగే చెప్తాయి. అన్ని ఉపనిషత్తులు ఈ లక్షణాలనే కలిగివుంటాయి. కాబట్టి జీవుడంటే ఏం చెబుతున్నాయి? అన్నీ కలిపి కొన్ని నిర్ణయాలు చెప్పేశాయన్నమాట. ఏ ఉపనిషత్తులు తిరగేసినా కూడా, కొన్ని కొన్ని విభేదాలు అంటే, ఆచరణ సాధనా భేదములు వున్నాయన్నమాట. అంటే కర్మమార్గాన్ని మాత్రమే చెప్పేటువంటి కొన్ని పద్ధతులు, భక్తి మార్గాన్ని, యోగ మార్గాన్ని, జ్ఞానమార్గాన్ని ఇట్లా ఆయా మార్గాలకు సంబంధించిన సాధనలు చెప్పేటప్పుడు అంటే, జీవుడు ఈశ్వరుడిగా జీవించడము ఎట్లా? అని చెప్పేదగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం కొంచెం ఆయా మార్గాన్ని బట్టి భేదం వుంటుందన్నమాట. మిగిలినవి అన్నీ సమానంగానే వుంటాయి. అయితే ఏమిటంటే, ఈ ఉపనిషత్తులు అన్నీ కలిసి కొన్ని నిర్ణయాలు చేసినాయి. వాటిలో ఏమీ భేదం లేదు. ఏమిటీ అంటే, ‘జీవుడు ఈశ్వరుడే’, అన్ని ఉపనిషత్తులు చెప్పినా కూడా ఒకే నిర్ణయం. జీవుడు ఈశ్వరుడే. జీవేశ్వరులు ఒక్కటే. ఎందుకయ్యా? అంటే, ఆ ఈశ్వరుడే ఈ జీవుడు అయినాడు కాబట్టి. ఎలాగ? ఈశ్వరుడు అనేవాడు మట్టి, జీవుడు అనేవాడు కుండ. మట్టి అనే ఆధారం లేకుండా కుండ అనేది తయారౌతుందా? కుండకు మట్టి లక్షణం కాకుండా ప్రత్యేక లక్షణం వచ్చే అవకాశం వుందా? లేదు కదా! ఆకారం మారినంత మాత్రాన లక్షణం మారిందా? మారలేదు కదా! కాబట్టి జీవుడికి ఏం మారుతున్నాయి? ఆకారాలు మారుతున్నాయి. లక్షణం మారడం లేదు. కాబట్టి నువ్వు ఆకారాన్ని ఆశ్రయించకుండా, లక్షణాన్ని ఆశ్రయించవయ్యా!
            ఇప్పుడు మనమందరం వున్నాము. మనందరికి ఏం భేదము వుంది? ఆకార భేదం వుంది. అంతే కదా! చిన్నకుండ, పెద్దకుండా, ముంత, చట్టి, మూకుడు అంతేనా? ఆకార భేదం వుంది. కానీ మనం అందరం ఎవరం? లోపలికి తిరిగి చూస్తావా? శరీరం వరకూ చూస్తే జీవుడు. ఇంకా లోపలికి చూస్తావా? అంతరాత్మ. ఇంకా లోపలికి చూస్తావా? పరమాత్మ. అక్కడ ఏమైనా భేదం వుందా? అక్కడేమీ భేదం లేదు. జీవుడన్నా భేదం లేదు. అంతరాత్మన్నా భేదం లేదు. పరమాత్మన్నా భేదం లేదు. ఎందుకని? పోయేరోజున ఏం చెబుతున్నావు? ఎవరు పోయినా ఎవడు పోయాడు? జీవుడు పోయాడు అంటున్నారు. (అంతేగా మరి) ఎవడు పోయినా, జీవుడు పోయాడు అంటున్నావు గానీ, ఆకారం పోయింది అంటున్నావా? చూడండి. మనం మరణ కాలంలో ఎక్కడికి... అందుకే చెబుతారు అంత్యకాలంలో తప్పనిసరిగా ఆఖరి చూపు వెళ్ళాలండి. ఎందుకు వెళ్ళాలట? ఆఖరి చూపుకి. అంటే మంచి వాక్యాలు అప్పుడే చెప్తారు. జీవితానికి పనికి వచ్చే వాక్యాలు ఎప్పుడు చెబుతారయ్యా అంటే, అనుభవజ్ఞులంతా అక్కడికి చేరుతారు కదా! వాళ్ళు జీవితానుభవం అంతా కలిపి అప్పుడు చెబుతారన్నమాట. వాక్యాలు. ఏమిటి? జీవుడు పోయాడండి. సరే జీవుడు పోవడం ఏమిటి? అనే ప్రశ్న నీకు అప్పుడు ఉదయిస్తుందన్నమాట. ఇదేమిటి? అదేమిటి? ఎదురుగుండా ఆకారం ఎదురుగుండానే వుంది. ఎవడు పోయాడు ఇప్పుడు? జీవుడు పోయాడు. నిద్రలో కూడా ఎవడు పోయాడు ఇప్పుడు? ఆకారం అక్కడే వుంది. జీవుడు లేడు అందులో. లేడా నిజంగా? ఉన్నాడు. కానీ ఇంద్రియాలను దాటి వున్నాడు. మీరి వున్నాడన్నమాట. అందువలన ఏమైంది? మనకేమీ తెలియలేదు. అర్థమైందా అండీ! మెలకువలోకి వచ్చేటప్పటికి ఏమయ్యావు? మళ్ళీ ఇంద్రియాలలోకి వచ్చావు. కాబట్టి జీవుడు అంటే ఏమిటయ్యా? నిత్యప్రళయమును అనుభవించే వాడు జీవుడయ్యా! అంటే ఏమిటి? వీడు ఏదో యాభై సంవత్సరాలకో, వంద సంవత్సరాలకో ఒకసారి పోయేవాడు కాదు ఎందుకు దుఃఖిస్తావు? నీకు జననమరణముల ఝడుపే కదా జీవుడికి వున్నది? అందులో మరణాన్ని వివరిస్తున్నాడన్నమాట. మరణం అంటే ఏమిటి? రణము+మ అంతే కదండి. రణము అంటే ఏమిటి? యుద్ధము. జీవితం అనే యుద్ధము, పోరాటము చేస్తున్నాడు. మ పోగొట్టుకున్నాడు. ఆ స్థితితో జీవితం అనే యుద్ధము, పోరాటము ముగిసిపోయిందిరా బాబు. మంచిదే కదా! జీవితకాలం అంతా ఆ పోరాటం గురించేగా తగాదా పడ్డావు. ఎప్పుడు ముగుస్తుందా? ఎప్పుడు ముగుస్తుందా? అని ముగిసే టైం వచ్చినప్పుడు దుఃఖిస్తావు ఎందుకు మరి? నీకు ఎందుకు దుఃఖం? కాబట్టి మరణం అంటే ఏమిటయ్యా? దుఃఖించ దగినది కాదు అది. పూర్ణజ్ఞానాన్ని అందించేటటువంటిది. ఎందుకని? ఇప్పుడు అందుకోలేనటువంటి జ్ఞానాన్ని, మరల వచ్చే ఉపాధికి అందుకోవడానికి గొప్ప అవకాశాన్ని తెరుస్తోంది. ఈ ఉపాధి జ్ఞానాన్ని అందడానికి పనికి రాలేదండి. నిర్ణయం చేశాడు, లోపల వున్న అంతరాత్మ. ఇహ నీకు ఈ ఉపాధి పనికిరాదురా బాబు. నువ్వు ఎంతకాలం తన్నుకున్నా కూడా ఈ ఉపాధిలో వుంటే ప్రయోజనము లేదు. ఇట్లాగే వుంటావు ఎంతసేపు చూసినా కాని. ఈ జంతువు బుద్ధి, ఈ కీటకము బుద్ధి పోదు నీకు. ఇహ దీంట్లోనుంచి మారితే కానీ, నీకు పరిణామం రాదు. కాబట్టి దేహాన్ని వదిలేసేయ్‌ అని నిర్ణయం చేయగానే జీవుడు ఏం చేశాడు? వదిలేశాడు. మరి ఇప్పుడు వదిలేసిన జీవుడు ఏమి అడిగాడు? నన్ను ఇది వదిలేయ్‌ మన్నావు, తరువాత సంగతి ఏమిటి? అది ఆ తరువాత సంగతి ఏమిటి అని అడిగేదే మరణ వేదన’.
            మరణ వేదన అంటే ఏమీ లేదు. అంతరాత్మ నిర్ణయం చేసింది. నీకు ఇది పనికిరాదురా బాబు. అని నిర్ణయం చేసిందండి. అది చేయగానే జీవుడు ఏమన్నాడు, okay ready నేను, నీ అధీనంలో వన్నవాడిని. నా అధీనం ఏమీ లేదు. స్వేచ్ఛ ఏమీ లేదు. రోజూ నిద్రలో పోతూనే వున్నాను కదా నేను. పోతున్నానా? లేదా? మళ్ళా నీ నిర్ణయం మేరకు ఎక్కడ లేస్తున్నాను? అదే ఉపాధిలో నిద్ర లేస్తున్నాను. మేల్కొంటున్నాను. రోజూ నిత్యప్రళయాన్ని అనుభవించేవాడినే. రోజూ పోయేవాడినే. ఇవాళ నేనేం కొత్తగా పోవడం లేదు. నాకేం దుఃఖం లేదు. కాబట్టి జీవుడికి దుఃఖం వుందా ఇప్పుడు? జీవుడికి దుఃఖం లేదు. ఎందుకని? శరీరానికి సాక్షివాడు. అర్థమైందా అండి. అంటే ఏమిటి? ప్రాణమనోబుద్ధులు జీవుడు. ఈ ప్రాణ మనో బుద్ధులు శరీరానికి సాక్షి. ఈ ప్రాణమనో బుద్ధులకి
సాక్షి ఎవరు? అంతరాత్మ. ప్రాణ మనో బుద్ధులకి సాక్షేమో అంతరాత్మ. శరీరానికి సాక్షి ప్రాణమనోబుద్ధులు జీవుడు. అన్నమాట. ఆ జీవుడి పేరే ఈ ప్రాణ మనో బుద్ధులు. మనం ఏమనుకుంటున్నాము ఇప్పుడు? ఈ శరీరం ప్రాణ మనో బుద్ధులు ఒకటే అనుకుంటున్నాము ఇప్పుడు జీవించేటప్పుడు. అది వచ్చిన తగాదా! నిజానికి ఏం చెయ్యాలి? ఈ రెండిటిని వేరు చెయ్యాలన్నమాట. శరీరం వేరు, ప్రాణ మనో బుద్ధులు వేరు. ఈ ప్రాణమనోబుద్ధులు అనే జీవుడు ఏం చేస్తున్నాడు? శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు, నిద్రలో శరీరాన్ని విడిచిపెట్టడం లేదా? ఇంద్రియాలన్నీ విడిచిపెట్టడం లేదా? నీ స్థూల ఇంద్రియాలన్నీ వదిలేయడం లేదా? వదిలేస్తున్నాడు. కలలోకి తిరగగానే నీ స్థూల ఇంద్రియాలతో పని అయిపోయింది. వాడికి ఏమీ అవసరం లేదు. తనకు తానుగా మనసులో వుండగలుగుతున్నాడు. తనకు తానుగా మనసులో అన్నీ సృజించగలుగుతున్నాడు. తనకు తానుగా మనసులో అన్నీ అనుభవించగలుగుతున్నాడు. జీవుడు జీవుడిగానే వున్నాడు అప్పుడు. ఇంద్రియాల సంయోగం లేదు. కానీ, ఈ జీవుడు శరీరం వదిలిపెట్టాలా లేదా అని నిర్ణయం చేసేది ఎవరు? ఆ జీవుడికి స్వేచ్ఛ లేదు. ఎవరు చేయాలి నిర్ణయం? అంతరాత్మ చేయాలి. అంతరాత్మ నిర్ణయం చేసి, నీకు టైం అయిపోయిందిరా బాబు. ఇంక నీకు ఇది పనికి రాదు, ఈ ఉపాధి నీకు పనికిరాదు. అని ఈ జీవుడు ఆ అంతరాత్మకు తెలియజేయగానే, ఈ జీవుడికి ఏం చెబుతుంది? అయితే వదిలేయ్‌. అయితే వదిలేయ్యమన్నావు సరే! నేను ఎక్కడ లేవాలి ఇప్పుడు? ఇది వదిలెయ్యమన్నావు, ఎక్కడ లేవాలి? నీకు తగ్గది వెతు. నీకు వుందిగా శక్తి. ఈ ప్రాణ మనో బుద్ధులకు వున్న శక్తి ఏంటట? భూమండలంలో వున్నటువంటి ఏ జీవి తల్లి గర్భంలోనైనా సరే ప్రవేశించగలదు. ఎందుకని? సూక్ష్మం సర్వవ్యాపకం. కాబట్టి మరలా ఇదే రామలక్ష్మమ్మగారికి ఇదే అన్నపూర్ణమ్మగారు పుడతారా? ఏమీ అవకాశము లేదు. కానీ, ఆ తెలివితేటలు లేక మనము ఏమనుకుంటున్నాము? మా అమ్మే మళ్ళా మా అమ్మాయిగా పుట్టింది. మా అమ్మాయే వాళ్ళ అబ్బాయిగా పుట్టాడు. ఇవన్నీ వట్టి మాటలు నాయనా! ఇలా లేని పోని బంధాలన్నీ, దుఃఖాలన్నీ మనం కొని తెచ్చుకుంటున్నాము. (నిర్ణయించుకుంటే వుండరు) వాడు నిర్ణయించుకున్నది, నీకు ఎట్లా తెలుస్తుంది? అంటే ఏం చేస్తున్నావు? ఆకారంలో వున్న పోలికలను బట్టి, నిర్ణయం చేస్తున్నావు. కానీ, నేను ఏమంటున్నాను? అసలు ఆకారం ఎట్లా వచ్చింది? మట్టి యొక్క ప్రభావం చేత వచ్చింది. అంతేకదండీ! అన్ని కుండలూ తయారు చేశాడండి. కుండలన్నీ ఒక్క రీతిగానే వున్నాయి. అన్ని కుండలు ఒకటేనా? ఎట్లా అవుతాయి? ఏ కుండకు ఆ కుండే. అంతే కదా! మరి ఈ కుండా, ఆ కుండా ఒకటే కదా? అని అంటాడు. కుమ్మరి దగ్గరకి నువ్వు కుండలు కొనడానికి పోయినప్పుడు ఏమన్నాడు? ఒక్కొక్క కుండా చూసి పెడుతున్నావండి. ఏమన్నాడు? అన్ని కుండలు ఒకటే నయ్యా, తయారు చేసింది నేనే. అంటున్నాడా? లేదా? మరి ఇప్పుడు అన్ని కుండలు తయారు చేసినవాడు ఎవడు? పరమాత్మే. మరి అన్ని కుండలలో వున్న లక్షణం ఏమిటి? ఆ మట్టే. లక్షణం దృష్ట్యా చూస్తే, ఒక్కటే. ఆకర భేదంతో చూస్తే, విడివిడిగా వుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమి విడిచిపెట్టాలట? ఆకార భేదాన్ని విడిచిపెట్టాలి. లక్షణాన్ని ఆశ్రయించాలి. కానీ మనం ఇప్పటివరకూ జీవించిన జీవితంలో ఎలా జీవించాము? ఆకర భేదాన్ని పట్టుకున్నాము.
            దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెబుతాను. అన్ని రకాలైనటువంటి తీపి పదార్థాలు ఒకటే కదా! కానీ మనమేమి చేశాము? దానికి రకరకాల అనుపాన భేదాల్ని, ఒకసారి శనగపిండి, ఒకసారి బియ్యపు పిండి, ఒకసారి మినప పిండి, ఒకసారి ఇంకోటి... నీ ఇష్టమొచ్చినవన్నీ దానికి కలిపావు. ప్రధాన ద్రవ్యం ఏమిటి? పంచదార. అది లేకుండా లేదు కదా! ఏది తిన్నా అదేగా. కానీ, ఈ పక్కన చేర్చినటువంటి అనుపాన భేదం చేత, అది ప్రత్యేకం అంటున్నావు. అది ప్రత్యేకం అంటున్నావు. కుండ వేరే. చట్టి వేరే. ఎలా అయ్యింది? కుండ, చట్టి ఒకటేగా. ఎక్కడా? లక్షణం దృష్ట్యా ఒక్కటే. రెండూ మట్టేరా బాబు. పగలేస్తే? రెండూ పగుల్తాయి. ఇదేగా కాటిలో చెప్పేది? ఏం చేశారండి? ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి కుండ పట్టుకెళ్ళాడా? ఈ కర్త ఏం పట్టుకెళ్ళాడండి? కుండ పట్టుకెళ్ళాడా? (నిప్పు ఎందుకు?) ఆఁ.. నిత్యాగ్ని హోత్రం, రోజూ దహించబడుతున్నవాడు నిత్యాగ్ని హోత్రమని తెలుసుకో! నీకు ఏముందయ్యా? దేహం. అంతేనా అండి? ఇప్పటి వరకూ దేనిని ఆశ్రయించి వున్నావు? దేహము. దేహమంటే ఏమిటి? దహించబడునది దేహము. ఎప్పుడో చివరికి కాటి తగలబెడుతున్నది అనుకోమాకు. రోజూ దహించబడుతున్నది నాయనా! ఇది. దహించబడుతున్నది కాబట్టే దీనిపేరు దేహము. శరీరము అన్నావే అనుకోండి ఒకవేళ, శీర్యతి ఇతి శరీరః శీర్యించడం అంటే నశించిపోవడం. ఎప్పుడో ఒకసారి కాటిలోకి పోయినప్పుడు నశించిపోవడం కాదు, రోజూ నశించిపోతున్నదయ్యా! ఒకసారి నశించిపోవటం కాదు ఇది. రోజూ పుడుతూ, పోతూ వుంది. రోజూ దహించబడుతూ వున్నది. రోజూ నశించిపోతూ వున్నది. రోజూ శీర్యతి. చనిపోతూ వున్నది. రోజూ చస్తున్నది. దాని పేరు ఏమిటి అందుకనే? జీవుడు. నిత్యప్రళయమును అనుభవించేవాడు జీవుడు. ఈ బోధ చెప్పడమే అక్కడ కర్త ఉద్దేశ్యము.
            ఇక్కడ అగ్నిహోత్రం చేసి, అంతా చక్కగా చేయించి నీచేత, నువ్వు బ్రహ్మ స్వరూపుడివి, ఈ సృష్టి అంతా అలా వుంది, ఆ అగ్ని ప్రభావం చేత ఈ సృష్టి ఏర్పడింది. అని అంతా చెప్పి ఇక్కడ, ఆ ఈశ్వర లక్షణాలు అన్నీ చెప్పి, ఇప్పుడు ఈ మూకుడులో నిప్పులు పట్టుకుని పదవయ్యా! అన్నాడు. ఏమైంది ఇప్పుడు? మూకుడు లోనేనా? నిప్పులు పట్టుకునేది? కుండ. కింద ఆధారం కుండ. అంతేగా. పైన నిప్పులు వుంటాయి కదా! పైన మూకుడు. నిప్పులు వుంటాయండి. అందుకని ఎందుకని చెప్పారు? ఆ కుండా మూకుడు ఒకటేనా? ఒకటేనా కాదా? (ఒకటేగా మట్టి) కానీ నువ్వేమిటి భేదంగా చూస్తున్నావు? అలా చూడమాకు. మూకుడులో నిప్పులు వేశాను. కుండలో నిప్పులు వేయలేదు. అర్థమైందా అండీ! ఇప్పుడు ఎవరు వేడెక్కారు? కుండా వేడి ఎక్కిందా? మూకుడు వేడి ఎక్కిందా? మూకుడే వేడి ఎక్కింది కదా! కాబట్టి నీలోపల దహించబడేటటువంటి దేహం దహించిపోతోంది కదా. ఎవరి వల్ల? వైశ్వానరాగ్ని. ఆకలి. ఆ ఆకలి ప్రభావం చేత రోజూ దహించబడిపోతూ వున్నది. మృత్యువు కూడా ఈ వైశ్వానరాగ్ని ప్రభావం చేతనే వస్తున్నది. మరణం కూడా దాని ప్రభావం చేతనే వస్తున్నదని బోధిస్తున్నాడు అప్పుడు. ఏమిటట? మరణ కాలం వచ్చేప్పటికి, ఈ వైశ్వానరాగ్ని దేహమంతా ఆవరించేస్తుంది. అర్థమైందా అండి? మృత్యువు రావాలి, నువ్వు ఆ దేహాన్ని విడిచి పెట్టాలి అంటే, ఏం జరగాలట? ఆ లోపల వున్న ఆకలి అంతా కూడా మొత్తం శరీరం వ్యాపించి వేసింది. వ్యాపించగానే, ఆ అగ్ని ప్రభావం చేత సూక్ష్మం వేరైంది. ప్రాణ మనో బుద్ధులు జీవుడనే సూక్ష్మం దేహం లోనుంచి ఏమైంది? వేరైపోయింది. వేరవ్వగానే దానికి స్వేచ్ఛ కలిగింది. ఆ స్వేచ్ఛ ప్రభావం చేత, మరొక దేహంలోకి ప్రవేశించేసింది. (దీనికి తట్టుకోలేక బయటకు పోతుందా?) తట్టుకోలేక కాదు, దాని నిర్ణయమేగా, వదిలెయ్యాలి అంటే ఏం కావాలి? వదిలెయ్యాలి కదండీ! వదిలెయ్యాలి అంటే ఏం కావాలి? దీంట్లోనుంచి వేరు అవ్వాలా? వేరు అవ్వాలి అంటే, దేని చేత అందులో ప్రవేశించిందో, దాన్నే వుపయోగించాలి. వేరే మార్గంలేదు. దేని చేత అందులో ప్రవేశించిందంట? అగ్ని ద్వారా అందులోకి ప్రవేశించింది. అర్థమైందా అండీ!
            తల్లికి మూడవ నెలలో ఆకలి ఎక్కువ వుంటుందా? నాల్గవనెలలో ఆకలి ఎక్కువ వుంటుందా? ఏమోనండి మాకేంగుర్తు? ఎందుకని? ఆ తెలివితేటలు లేవు. మీరందరు గర్భవాసం, అందరినీ కన్నారు గానీ, ఆ తెలివితేటలతో చూడలేదు. అర్థమైందా అండీ! మీరు చూడండి. గమనించండి. ఒకటి రెండు మూడు నెలల్లోనే ఆకలిలో భేదం వస్తుందండి. ముందు తేడా వచ్చేది ఆకలిలో భేదమే. ఏమిటి ఈవెడ? ఆహారం తినేదాంట్లో మార్పు వచ్చేసింది? ఎక్కువ తినేస్తుంది ఈవెడ? ఆవెడకు తెలియదండి. తెలియకుండానే తినేస్తూ వుంటుంది. ఒక్కటో నెల దాటగానేనే మొదలౌతుంది. అంటే తనలో వున్నటువంటి ఆ యొక్క జీవి, మొట్టమొదట దేంట్లో నుంచి ప్రవేశించాడు? అగ్ని ప్రభావం చేత ప్రవేశించాడు. ప్రవేశించి, ఆ అగ్నిని వుపయోగించే దేహాన్ని తయారు చేశాడు. అర్థమైందా అండీ! కుండ తయారు చేయాలంటే, కాల్చాలా? వద్దా? ఆకారం స్థిరపడాలి అంటే ఏం చెయ్యాలి? (గట్టిపడాలి అంటే కాల్చాలి) కాల్చాలి కదా! అక్కడైనా ఏమి వుపయోగించావు? అగ్నినే. ఇక్కడైనా ఈ దేహం గట్టిపడాలి అంటే ఏంచేయాలి? తల్లి గర్భంలో వుపయోగించాలండి. గట్టిపడాలా? అస్థకలు పడాలా. అస్థికలు పడాలంటే ఎలా పడుతాయి? అగ్ని ప్రభావం చేతనే. కాబట్టి జీవుడు ఎలా తయారు చేశాడు దేహాన్ని? అగ్ని ప్రభావం చేతనే. మళ్ళా ఎట్లా విడగొట్టాలి? మళ్ళా అదే అగ్ని ప్రభావం చేతనే విడగొట్టాలి. చూడండి. ఎంత స్పష్టంగా వుందో, సృష్టి నిర్ణయం. ఎక్కడైనా confusion వుందా? no confusion at all. ఏమీ ఎక్కడా ఏమీ ఇసుమంత, కను రెప్పపాటు, దర్భ పోచ అంతకూడా తేడా వుండదు. అలా స్పష్టంగా ఏర్పడి వుంటుంది. ఇదంతా. ఇదంతా చక్కగా మరణ కాలంలో ఆ కర్తకి చెబుతున్నాడు. చేయిస్తున్నాడు. మళ్ళా ఏం చేశాడు? ఈ నిప్పులే పట్టుకెళ్ళి అక్కడ కాష్టంలో వేయి, అని మళ్ళా దాంతోనే మొదలు పెట్టమన్నాడు. ఏమైందట ఇప్పుడు? చివరికి ఏం పోగొట్టావు? ఆకారాన్ని పోగొట్టావు. దేనితో ఆ అగ్నితోనే. అర్థమైందా అండి? ఆకార భేదం నశించిపోయింది. మళ్ళా ఏం చేశాడు? తెచ్చిన కుండలో నీళ్ళు పట్టుకురా ఇప్పుడు వెళ్ళి. కుండ తెచ్చావుగా ఇంటినుంచి. దాంటో ఏం చెయ్యాలి? నీళ్ళు పట్టుకురా. దానిచుట్టూ తిరుగు. ఏమిటి ఇప్పుడు, దేని చుట్టూ తిరగుతున్నావు? నీ ఆకారమే. నీ ఆకారము, ఆ ఆకారము ఒకటే అని తెలుసుకో! ఇప్పుడు అదేదో పోయింది అంటున్నావు కదా, పోయింది ఏం పోయింది? ఆకారము పోయింది. జీవుడు already వేరే దేహంలోకి చేరిపోయాడు. వున్న ఆకారము పోయింది అసలు. ఇది వదిలిపెట్టగానే వెంటనే చేరిపోతాడు. నిర్ణయం అయినాకే వదిలిపెడతాడు. అర్థమైందా అండీ!
            అవతల నిర్ణయం అవ్వడమే మరణ వేదన. తదుపరి దేహ నిర్ణయమే మరణ వేదన. అయిపోతుందది. రెప్పపాటులో జరిగిపోవచ్చు, ఏళ్ళకి ఏళ్ళు పట్టొచ్చు. అది వేరే అంశం. కాబట్టి అలాగ నిర్ణయం అయినాక, ఏం చేశావు? కాటికి వెళ్ళావు. మీరు ఎవరూ కాటికి వెళ్ళరు కాబట్టి, ఇవేమీ చూడరు కాబట్టి మళ్ళా చెబుతున్నా అందుకోసమని. అందరికి ఇంటి దగ్గరనుంచి సాగనంపడం అనే విషయంలో పెట్టారు. కానీ మా అబ్బాయినినూ, శ్రీమతిగారి నేను మా అమ్మగారు చనిపోయినప్పుడు తీసుకెళ్ళాను అక్కడికి. అంతా అక్కడ ఎట్లా జరుగుతుందో చూడాలి. చక్కగా చూస్తేగాని జ్ఞానం రాదు. అందుకు చెప్పేది మీకు. ఒకప్పుడు వుండేది, ఈనాటి కాలంలో మీరందరూ కూడాను, ఆచార సాంప్రదాయాలు దేహానుసారంగా పెట్టుకున్నారు కాబట్టి, ఇలా పెట్టుకున్నారు. ఒకప్పుడు ఈ పద్ధతులు ఏమీ లేవండి. (కొడుకును కూడా తీసుకుపోయినావా?)  ఆ...! అయ్యో! నాతో పాటే, నన్ను మా నాయన తీసుకెళ్ళాడు. అట్లాగే నేను వాడిని పట్టుకెళ్ళాను. ఆ.. నాకు చిన్నప్పటినుంచి అన్నీ సర్వం తెలుసండి. మాకేం ఆ భేదమేమీ లేదు. అయ్యో! తల్లితండ్రి వున్నవాడు రాకూడదే. కుండ పట్టుకోకూడదే. చట్టి పట్టుకోకూడదే. ఈ భ్రాంతులేమీ లేవు. చిన్నప్పటినుంచి, నేను చిన్నప్పటినుంచి అన్ని మరణాలని స్వయంగా కళ్ళతో చూశాను. అలాగ ఎప్పుడైతే మనం చూస్తామో, సహజజ్ఞానం ఏర్పడుతుంది. ఓహో! ఏమున్నది ఇందులో, ఆకారము వచ్చింది, కొంతకాలము ప్రవర్తించింది, ఆకారము గతించింది. ఉన్నవాడు ఎప్పుడూ వున్నవాడే. జీవుడికి మరణం లేదు. ఎందుకని? ఇంకో దేహంలో చేరిపోయాడు. అంతరాత్మ అంటావా? దానికసలు ఎప్పుడూ మరణం లేదు. ఎప్పుడూ సాక్షి స్వరూపం. పరమాత్ముడు అంటావా? అది సర్వవ్యాపకం. ఏమి వచ్చిందటా ఇప్పుడు? కుండ, ముంత, చట్టి. అంతేకదా! ఈ ఆకార భేదమే కదా! ప్రవర్తిస్తున్నది. మరి ఇందులో నిత్యమేది? అనిత్యమేది? ఒక్కసారి విచారణ చెయ్యి. ఈ ఆకార భేదము ఇప్పటి వరకూ నిత్యము అని ఆశ్రయించావు. ఈ ఆకారభేదము సత్యమేనా? ఒక్కసారి విచారణ చెయ్యి. దీనికేగా ఈ అలంకారాలన్నీ, అంతేనా అండీ! ఆ కుండకే రంగులు అద్దితివి, ఆ కుండకే డిజైన్లు వేస్తివి, ఆ కుండకే అన్నీ చేస్తివి, ఓ అద్భుతం అంటివి. తగలేసిన రోజున? కుండ పగలేశావా? దేనిని పగలేశావు? అర్థమైందా అండీ! అందుకని ఏం చెబుతున్నాడు? కుండకి చక్కగా చిల్లులు కొట్టాడు. నీళ్ళు పడిపోతూ వుంటాయి. అలా నీ ఆయుర్దాయం క్షీణించిపోతోంది నాయనా! నీరే ప్రాణాధారం అంటున్నావు కదా! నీ ఆయుర్దాయం ఎలా క్షీణించి పోయింది? ఇదుగో ఈ కుండ చిల్లుల్లోంచి నీళ్ళు ఎట్లా పడిపోతోందో, అలా  నీ ఆయుర్దాయం క్షీణించిపోతోంది నాయనా!
            ఇరువదొకవెయ్యి ఆరు నూరులు జరుగు హంసలు, తరుగునాయువు హరిహరాదులువచ్చినా ఆగదీతనువు. అనే సూత్రాన్ని స్పష్టంగా బోధిస్తున్నాడు. కర్తకి. కర్తకి చెబుతున్నాడు ఇదంతా. ఏం చెప్పాడు ఇప్పుడు? అంతా కారిపోయింది. తగలేసేయినాయనా, వెనక్కితిరిగి చూడకుండా తగలేసేయి నాయనా! ఎందుకనిట? వెనక్కి తిరిగి చూస్తే, నీకు మళ్ళా తగలేసే కుండమీద కూడా భ్రాంతి కలుగుతుందని. అర్థమైందా అండీ! తిరిగి చూడకు. అందుకే మీరు మేలుకొలుపులో చూడండి. తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూడకుండా, ఓసారి మళ్ళా వెనక్కి తిరిగి చూస్తే, అమ్మో! నా ఆకారం అంటావు. అది పనికిరాదు నాయనా! ఎప్పుడూ ముందుకే ప్రయాణం నీది. పరిణామం ఎప్పుడూ జ్ఞానంలోకే. మళ్ళా అజ్ఞానంలోకి తిరిగి చూడమాకు. అయ్యో! పూర్వం నాకు చేతకాలేదే అనే బలహీన క్షణాలను స్ఫురణలోకి తెచ్చుకోమాకండి. నీది కాదు బలం. నాది బలం. పరమాత్మది బలం. ఆధారం, పరమాత్మను ఆధారంగా చేసుకో! అప్పుడు ఏమౌతావు? నీ బలహీన క్షణాలను మరచిపోతావు. నీ బలహీన క్షణాలను అధిగమించేస్తావు. నిన్ను గుర్తుపెట్టుకున్నావా? మళ్ళా జారిపడిపోతావు. అందుకని నీ పూర్వజ్ఞాపకాలలో గతంలోవున్నటువంటి బలహీనమైనటు వంటి అంశాలని గుర్తుకు తెచ్చుకోమాకు. ఇప్పుడు ఎవరి ఆధారంతో వున్నావు? నూతనమైన జీవితాన్ని ప్రారంభించావు. ఆత్మానుసార జీవితాన్ని జీవిస్తున్నావు. పరమాత్మను ఆధారంగా పెట్టుకుని జీవించు. ఎంత స్వేచ్ఛ కలుగుతుందో నీకే తెలియదు. అసలు ఈ సృష్టిలో నిన్ను ఏదీ బంధించజాలదు. ఏదీ బంధిపజాలదు. శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మ కాదు ఏదీ నిన్ను బంధింపజాలదు. నీ అంత స్వేచ్ఛ ఈ సృష్టిలో ఎవరికీ లేనే లేదు. ఎందుకని? తన ఇష్టం వచ్చినట్లు జీవించగలడు. తనని ఏదీ అంటజాలదు. ఎందుకని? పరమాత్మ ఆధారం. దేనికీ భయపడడు. జననమరణముల ఝడుపు తీరెను. కాబట్టి నిత్యానిత్యవస్తువివేకం బలంగా కలిగివున్నవాడి జీవితం ఎలా వుంటుందయ్యా? స్పష్టంగా బోధిస్తున్నాడు. నిత్యము అంటే ఎల్లప్పుడు, ఎల్లకాలము, శాశ్వతము, ఏ పరిణామము లేకుండా, మార్పులేకుండా, సనాతనమై, సచ్చిదానందమై ఏదైతే వున్నదో, అది ఎప్పుడూ ఒక్కతీరుగానే వున్నది నాయనా! దాంట్లో ఏమార్పు లేదు నాయనా! మారేదేమిటి? అంతా ఆకారభేదమే నాయనా! కాబట్టి ఆకారాన్ని ఆశ్రయించమాకు. ఆకారాన్ని ఆశ్రయించడం చేతనే, నీకంతా చికాకులు చిక్కులు వచ్చినాయి. అందువలన ఏమైంది? జీవుడివైపోయినావు? లేకపోతే నీవు ఎల్లప్పుడూ ఆత్మస్వరూపుడవే. నీవు ఎప్పుడూ పరమాత్మస్వరూపుడవే. మధ్యలో ఏం తెచ్చుకున్నావు? ఆకార భ్రాంతిని తెచ్చుకున్నావు. ఈ ఆకారభ్రాంతి ఎట్లా ఏర్పడింది? ఇదిగో ఇట్లా ఏర్పడింది. కాబట్టి జీవించేటప్పుడు ఈ సత్యాన్ని మరువమాకు. ఒక్కసారి తెలుసుకో! విచారణ చేయి. విచారణ చేసి, ఏం మేరకు చెయ్యాలో తెలుసుకో! మొట్టమొదట. నిర్ణయం చేయకుండా ఆచరించమాకు. ఇప్పటి వరకూ ఏం చేశావు? ఆచరించి ఫలితం వచ్చినాక, నిర్ణయం చేయడం మొదలు పెట్టావు. ఇప్పుడు ఏమి చేయాలి? ముందు విచారణ చేయి. ముందు విచారణ చేయి. ముందు విచారణ చేయాలి. విచారణ చేసి, నిత్యానిత్యవస్తు వివేకాన్ని వుపయోగించి, విచారణ చేసి అప్పుడు ఏం చెయ్యాలట? నిర్ణయం  చేయాలి.
            నిర్ణయం చేసేటప్పుడు ఏం కావాలయ్యా? నిన్న చెప్పినటువంటి ఇహముత్రార్థ ఫలభోగవిరాగము కావాలి నాయనా! వట్టి నిత్యానిత్య వస్తువివేకము విచారణ చేసినంత మాత్రాన నిర్ణయం చేస్తావా? చెయ్యలేవుగా. ఎందుకని? పూర్వ అభ్యాసబలం వుంటుంది. పూర్వ అభ్యాస బలం ఏం చేస్తుంది? ఆ...  చెప్పావులే, చాలా కాలం నుంచి చేస్తూనే వున్నావుగా. ఇదే చెయ్యి అంటుంది. అర్థమైందా అండీ! ఎంత పాఠం చెప్పినా గానీ, లోపల వున్నది ఏం చెబుతుంది? ఇప్పుడు కొత్తగా పాఠం చెబుతున్నావు, ఇంతకాలం నుంచి ఏం చేశావు నువ్వు? అట్లాగే చెయ్యి అంటుంది. ఇన్నాళ్ళు జరగలేదా? ఇప్పుడేమి కొంపమునిగింది నీకు? నువ్వు కొత్తపాఠం చెబితే నేను వింటానా? అంటుందది. అంటే అప్పుడు ఏం చేయాలట? ఇహముత్రార్థ ఫలభోగవిరాగమనేటటువంటి సాధన చతుష్టయ సంపత్తిలో రెండవదానిని ఉపయోగించు. నీకు బుద్ధి వుందా, ఇప్పటి వరకూ ఫలభోగాన్ని అనుభవించే కదా ఇంతదూరము వచ్చావు. నువ్వు మళ్ళా చేయమనేది ఏమిటి? ఆ ఫలభోగమే కదా ! ఈ ఫలభోగం అయినాక మళ్ళా నేను విచారణ చేస్తే ఏమిటి ప్రయోజనము? నీకు బుద్ధి వుందా? కాబట్టి ఇదంతా ఇహం కదా! మారిపోయేది కదా! సనాతనం కాదు కదా! శాశ్వతం కాదు కదా! పరిణామ పాఠం రావడం లేదు కదా! మళ్ళా నన్ను తీసుకెళ్ళి అదే పాత భ్రాంతిలో, ఊబిలో పడేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు బుద్ధి వుందా, ఇహాముత్రఫలభోగ విరాగము, నాకు వైరాగ్యము లేకుండా చేసింది నువ్వే కదా! అని దానిని హెచ్చరించాలట. రెండవది ఏమిటండి? హెచ్చరించాలి. మొదటిది ఏమిటి? విచారణ. నిత్యానిత్యవస్తు వివేకమనే విచారణ. రెండవది ఏమిటి? ఇహాముత్రఫలభోగవిచారమని హెచ్చరించడం అన్నమాట. హెచ్చరిస్తే ఏమైందట ఇప్పుడు అది? కాసేపు దాని వేగం తగ్గింది. నెమ్మదించిందన్నమాట. సరే! ఏమిటి ఇప్పుడు చెప్పు, అసలు విషయం ఏమిటి? అంటే, అప్పుడు మూడవది అవసరమైంది. మూడవది ఏమిటి? శమాది షట్క సంపత్తి.
            శమాదిషట్కసంపత్తి అంటే, షట్క అంటే ఆరు. అంటే ఆరు వుంటాయన్న మాట ఇవి. ఏమండీ! మొత్తం నాలుగే అని చెప్పారు కదా! నాలుగే అని చెప్పినా మూడవది అయినటువంటి ఇది చాలా ప్రధానమైనటువంటిదన్నమాట. శమాది షట్క సంపత్తి. ఏమిటి? శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము. ఈ ఆరు లక్షణాలని కలిపితే, శమాది షట్కసంపత్తి అవుతుందన్నమాట. ఈ ఆరు లక్షణాలు ఎవడైతే కలిగివుంటాడో, వాడు తప్పనిసరిగా ఆత్మ స్వరూపుడే అయ్యివుంటాడు ఇక. వాడికి ఏ పరిస్థితులలో కూడా జీవుడయ్యే అవకాశం లేదు. ఆకార భ్రాంతికి లోనవ్వడన్నమాట. అంటే ఏమిటి? కేవలం నిత్యానిత్య వస్తువివేకం మాత్రమే విచారణ చేసినంతమాత్రాన నీకు నిర్ణయం మార్చుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని? కొత్తపాఠం అది. పూర్వ అభ్యాసబలం కదా! కల్పశతములనుంచి నీవు ఏం చేస్తున్నావు? ఈ పాత పద్ధతిలోనే వున్నావు. ఈ పాత పద్ధతి అంతా ఒక్కసారి కొత్త పాఠం చెబితే పోతుందా? పోదు కదా! ఏమంటుంది? అలాగే చెయ్యి అంటుంది. దానిని నిరోధించాలి, మార్పు చెయ్యాలి అంటే ఏం కావాలట? ఇహాముత్ర ఫలభోగ విరాగము కావాలట. ఆ వైరాగ్యము కావాలట. ఆ వైరాగ్య ప్రభావం చేత, దానిని హెచ్చరించి నిలబెట్టగలిగావు, దాని వేగం తగ్గింది. మనకు ఏం కావాలట ఇప్పడు? రెండవది చాలా ఇంపార్టెంటు అండి. వైరాగ్యము లేదు మనదగ్గర. అంతా అనురాగమే వుంది. ఆ అనురాగ ప్రభావం చేత ఏమౌతున్నావు? మళ్ళా దాంట్లోకే చేరుతున్నావు. అనురాగం పోవాలి, వైరాగ్యం కావాలి. వస్తే ఏమౌతుందయ్యా? ఇప్పుడు ఈ శమాది షట్కసంపత్తి మూడవ సంపదని సంపాదించే అర్హత వచ్చింది నీకు. ఈ మూడవ సంపదని అందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ మూడవ సంపదని ముందే ప్రయత్నం చేస్తారండి. అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానములు. ఈ ఆరు లక్షణాలని ప్రతిరోజు మీరు భక్తిలో కూడా చేసేవి ఇవే. కానీ అవి నీకు ఎందుకు ఉపయోగపడలేదయ్యా అంటే, ముందు రెండు లక్షణాలు లేవు.
            శమము అంటే ఏమిటి? శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము. ఒకే వాక్యము అండీ! శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము. అంతరేంద్రియాలు అంటే ఏమిటి? ప్రాణము, మనస్సు, బుద్ధి వీటిలో ఏమున్నాయి? అంతరేంద్రియాలు ఇవన్నీ కదా! వీటిలో అంతరేంద్రియాలని ప్రత్యేకంగా చెప్పేవి ఏమిటయ్యా అంటే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాత. అంతరేంద్రియాలు అంటే అర్థం ఏమిటండి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాత. జ్ఞాత కలిస్తేనే అంతరేంద్రియాలు అవుతాయి. జ్ఞాతను తీసేశామనుకోండి, జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, వేరే ఏమీ లేదు. జ్ఞాత అంటే ఏమిటి? తెలుసుకునేవాడు. ఎప్పుడూ గమనించేవాడు, ఆ తెలసుకునేవాడిని, గమనించేవాడిని కలిపితే అవి అంతరీంద్రియాలు అయినాయి. వాటిని వేరు చేశామనుకోండి, ఇవి పనిముట్లు అయినాయి. కరణములు అయినాయి. నీ అంతఃకరణము అంటే ఏమిటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వరకే మాట్లాడితే అంతఃకరణము. నాలుగే అవి. అంతరింద్రియము వాటికి తెలివి ఎక్కడినుంచి వచ్చింది? శక్తి ఎక్కడినుంచి వచ్చింది? ఆ జ్ఞాత కలిస్తే వచ్చింది వీటికి శక్తి. మనసుకి స్వయంగా శక్తి లేదు. ఈ జ్ఞాతయొక్క శక్తి మనసులో పనిచేస్తే మనసు ఆలోచించగలుగుతుంది. ఆ జ్ఞాతయొక్క శక్తి బుద్ధిలో పనిచేస్తే, బుద్ధి జ్ఞాపకాలను అందించ గలుగుతుంది. ఆ జ్ఞాతయొక్క శక్తి, చిత్తంలో పనిచేస్తే, ప్రియం మోదం ప్రమోదాలు అనే వృత్తులను అందిస్తుంది. ఆ జ్ఞాత యొక్క శక్తి అహంకారంలో పనిచేస్తే నేను నేను అంటోంది. కాబట్టి ఈ నాలిగిటికి స్వయంగా ఏమీ శక్తి లేదు. నీ ఓటు. నీ అనుమతి. ఆ జ్ఞాతే నువ్వు. ఆ జ్ఞాత వాడుకూడా నీకు బంధమే అయ్యివున్నాడు. ఎందుకని? వాడుకూడా పరమాత్మ స్థితిలో వుండవలసినవాడిని కిందకి తెచ్చాడు. అర్థమైందా అండీ! ఎక్కడుండాలి అసలు నువ్వు? నీవు నేనే పరమాత్మను అనే స్థితిలో వుండాలి. కానీ ఏమయ్యావు? నాకు అంతరేంద్రియాలు కావాలి అనే స్థితికి వచ్చావు. పరిమితమయ్యావు అన్నమాట. అట్లాంటి పరిమితత్వానికి కారణమయ్యాడు కాబట్టి వాటిల్లో కూడా కొంచెం దోషముంది. కానీ వాడి కంటే మిగిలినవాటిలో ఇంకా ఎక్కువ దోషముంది. కాబట్టి ఏం చెయ్యాలట ఇప్పుడు? శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము. దమము అంటే, బాహ్యేంద్రియ నిగ్రహము. సూటిగా ఒకటే వాక్యమండి. బాహ్యేంద్రియాలు ఏమిటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అంతే కదా! ప్రాణం కూడా బాహ్యేంద్రియాలే. ఎందుకని? మనకు తెలుస్తోందిగా బయటికి. తెలుస్తోందా? తెలియడం లేదా? కాబట్టి పంచప్రాణాలు, పంచప్రాణాలు అంటే ఏమిటి? ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదానములు ఇవన్నీ పంచప్రాణాలు. కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏమిటి? వాక్‌, పాణి, పాద, పాయు, ఉపస్థలు. అర్థమైందా అండీ! వాక్‌ మాట్లాడడం, పాణి చేతులు, పాదములు, పాయువు, ఉపస్థలు విసర్జక అవయవాలు. ఈ ఐదూ కూడా కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏమిటి? చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములు  అంతే కదండీ! రసము అది వేరే. రెండు పనులు చేస్తోందిగా మరి అది. రుచిచూస్తున్నది, మాట్లాడుతున్నది కదా! అదీ సంగతి. కాబట్టి జ్ఞానేంద్రియాలు ఐదు. కర్మేంద్రియాలు ఐదు. పంచప్రాణాలు ఐదు. ఈ మూడు ఐదులు పదిహేనూ కూడా బాహ్యేంద్రియాలు. అర్థమైందా అండీ! ఇప్పుడు లోపల ఏమున్నాయి? అంతరేంద్రియాలున్నాయి. అంతేకదండీ! అంతరేంద్రియాలు ఏమిటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాత. ఇవి అంతరేంద్రియాలు. మరి ప్రాణం కూడా తెలుస్తుంది కదా మనకి? బయటకు తెలిసేవన్నీ బాహ్యమే. తెలియక పోతే అంతరము. అంతేకదా! కరెక్టుగా ఇప్పుడు మనం దేనిని పట్టలేకపోతున్నాము? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమును పట్టలేకపోతున్నాము కదా! కాబట్టి అవి అంతరేంద్రియాలు. లోపల పనిచేస్తూ వుంటాయి. బాహ్యానికి తెలిసేవన్నీ బాహ్యేంద్రియాలు. ప్రాణం బయటకు తెలుస్తుంది కదా! ఇక పోతే ఇవి కాక ఐదు విషయాలు వున్నాయా? లేవా? ఏమిటవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. అవి ఏమిటి? జ్ఞానేంద్రియాల యొక్క శక్తి. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కు వాసనలు చూస్తూ వుంది ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పనులు చేస్తూ వున్నాయా? చర్మం స్పర్శ. అంతే కదండీ! ఈ ఐదు జ్ఞానేంద్రియాల యొక్క శక్తులు, బాహ్యమా అంతరమా? ఇప్పుడు? బాహ్యమే కదా! కాబట్టి బాహ్యేంద్రియ నిగ్రహము అంటే, ఇవి కూడా అందులోకి వస్తాయి కదా! కాబట్టి ఇరవై బయట వున్నాయి. ఐదు లోపల వున్నాయి. అంతేనా కాదా? ఇరవై బయట వున్నాయి. ఐదేమో లోపల వున్నాయి. కాబట్టి శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. కాబట్టి ఇరవయ్యేమో బయట వున్నాయి. ఐదేమో లోపల వున్నాయి. ఇంతేనయ్యా నువ్వు. నీ గురించి చెప్పవయ్యా అంటే ఈ ఇరవయ్యే. నిన్ను విభజించి చూస్తే, ఇంతకు మించి ఏం కనబడుతున్నాయి చెప్పండి? ఎవరైనా సరే, అది జీవుడనండి, ఆకారమనండి, మరొకటి అనండి, ఏ పేరు అయినా పెట్టు దానికి. ఇవి ఇరవై అయిదేగా. ఏమన్నా వున్నాయా? ఈ ఇరవై అయిదు కాక. ఏ ఎవ్వరినైనా తీసుకోండి ఈ సృష్టి మొత్తం మీద ఏ జీవి అయినా తీసుకోండి. ఏ మనిషినైనా తీసుకోండి. ఈ ఇరవై అయిదు కాక ఏమైనా వున్నాయా? నీ జీవితం అంతా ఏమిటి? ఈ ఇరవై అయిదే. ఈ ఇరవై అయిదు కాక ఇంకొకటి ఏమన్నా వుందా?

            నువ్వు ఎన్ని ప్రత్యేకతలు అన్నా చెప్పండి. ఆ ప్రత్యేకతలన్నీ ఈ 25లో ఒకదానికి చెందినదేనా? ఆహా! బాగా పాడుతారండి. వాగీంద్రియము. కర్మేంద్రియమేగా. అథవా కాదు, శబ్దం విషయం. విషయం అదే బాహ్యమేగా. నువ్వు బాహ్యం కానిది ఏదో ఒకటి చెప్పు. కళలండి మనసులో, బుద్ధిలో సంగీత జ్ఞానము వున్నదండి. అదీ అంతరేంద్రయము. మరి నేను ఎవరిని? 25కి సాక్షిని కదా! నేను ఈ 25లో వాడిని కాదు కదా! నేను ఆత్మస్వరూపుడిని, నేను ఈ 25ని కాదు. ఈ ఇరవై అయిదింటిని చూస్తున్నవాడిని. గమనిస్తున్నవాడిని. నాకు ఇందులో ఏమీ ఏమి లేదు? మనందరికీ ఏముంది ఇందులో? సంగత్వ దోషం వుంది. ఇందాక చెప్పింది ఇదే. దోషమంటే ఏమిటి ఆ దోషమంటే సంగత్వ దోషం అన్నారు. సంగత్వము అంటే ఏమిటి? కలిసిపోవడం. ఈ 25లో ఏదో ఒకదానితో కలిసిపోతూ వుంటావండి, ఎప్పుడూ కూడా. కలిసిపోకుండా వుండవు. నువ్వు ఏ ఆలోచన చేసినా, ఆలోచన ప్రారంభం అవ్వగానే, ఏదో ఒకదాంట్లో కలుస్తావు. ఒకదానితోనే కలుస్తావా? విషయం రాదూ వెంటనే? ఒక ఆలోచన కలగగానే, అంతరేంద్రియం కావాలి, దానికి ఇంకేంకావాలి? విషయం కావాలి. విషయం రాగానే అదేం అడిగింది? ఆలోచన విషయం వచ్చేస్తుందండి. అంతరేంద్రియం వచ్చింది, బాహ్యేంద్రియం వచ్చింది. ఇంకేం కావాలి ఇప్పుడు? అయితే జ్ఞానేంద్రియమో, లేకపోతే కర్మేంద్రియమో, సహాయం కావాలి దానికి. కావాలా వద్దా? జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల సహాయం అడిగింది వెంటనే. ఎందుకని? అది అనుభవించాలి కాబట్టి. ప్రియం నుంచి మోదానికి వచ్చింది. మోదానికి రాగానే ఏం కావాలి ఇప్పుడు? ఇంద్రియాలు కావాలి. బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల సహకారం కావాలి. అడగంగానే ఏమి అడిగింది? నన్ను అడిగితే నా దగ్గర ఎలా వుంది? నీకూ నాకూ మధ్య వారధి ఏది? ఆ మనసుకీనూ, ఈ బాహ్యేంద్రియాలకి మధ్య వారధి ఒకటి కావాలి కదా! అది ఎవరు? ప్రాణం. ప్రాణ శక్తి పనిచేసినంత సేపే, ఆ మనసు ఈ ఇంద్రియాలమీద ప్రభావం చూపెట్ట గలుగుతుంది. ప్రాణ శక్తి పనిచేయక పోతే, మనసు ఇంద్రియాలు, అంతేరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు వేరు అయిపోయినాయి. అర్థమైందా అండీ!
            ఇప్పుడు శవానికి ఏమి వున్నాయి? బాహ్యేంద్రియాలు వున్నాయి. జ్ఞానేంద్రియాలు అక్కడే వున్నాయా? వున్నాయి. కర్మేంద్రియాలు అక్కడే వున్నాయా? వున్నాయి. ఏం లేదు? రెండు ఎగిరి పోయినాయి, బాహ్యంలో కూడా. విషయాలు పోయినాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలను గ్రహించే శక్తి లేదు. పంచ ప్రాణాలు లేవు. అర్థమైందా అండీ! రెండు ఐదులు పది మాత్రమే అక్కడ వున్నాయి. బాహ్యేంద్రియాలలో పది పోయినాయి. ఈ బాహ్యేంద్రియాలలో వున్న, ఈ పంచప్రాణాలు, విషయాలు ఎవరి ప్రభావం వలన పనిచేస్తున్నాయి? అంతరేంద్రియ ప్రభావాల పనిచేస్తున్నాయి. ఇప్పుడు అంతరేంద్రియాలు అనేటటువంటి జీవుడు ఏమయ్యాడు? తప్పుకున్నాడు. ఆ జ్ఞాత అనే జీవుడు ఏమయ్యాడు? తప్పుకున్నాడు. తప్పుకోగా ఏమైపోయింది? ఈ బాహ్యేంద్రియాలలో వున్న రెండూ వేరైపోయినాయి. ఏం మిగిలిపోయినాయి? రెండు ఐదులు పది మిగిలిపోయినాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మిగిలిపోయినాయి. ఇప్పుడు శవానికి ఏమున్నాయి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వున్నాయి. మనకు ఏమి వున్నాయి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వున్నాయి. అంతరేంద్రియాలు వున్నాయి. ఈ అంతరేంద్రియాలు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను ఉపయోగించాలంటే ఏం కావాలి ఇప్పుడు? పంచ ప్రాణాలు కావాలి. పంచ విషయాలు కావాలి. పంచ ప్రాణాలు, పంచ విషయాలు. ఈ రెండిటి యొక్క సంఘర్షణలో పుడుతున్నాయన్నమాట ఈ పంచ విషయాలు. శబ్ద స్పర్శ రూప రస గంథాలు ఎక్కడ పుడుతున్నాయి? ఆ అంతరేంద్రియాలకి, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకి మధ్య ఒక ఘర్షణ, ఒక రాపిడి అందులో పుడుతున్నాయి ఇవి. ఆ పంచ విషయాలు కూడా. లేకపోతే పుడతాయా? ఈ చెవులు వింటున్నాయండీ! ఈ వినగలిగే శక్తి ఎక్కడిది? మనసులోది. మనసే చెవి అయ్యింది. మనసే కన్ను అయ్యింది. మనసే అన్నీ, అన్ని ఇంద్రియాల రూపాలు ఎందులో వున్నాయి? మనసులో వున్నాయి. ఆ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము జ్ఞాతలో వున్నాయి. అసలు గట్టిగా మాట్లాడితే మనసులో వున్నాయా? జ్ఞాతలో వున్నాయా? జ్ఞాతలో వున్నాయి. మనసులో లేవు. ఆ జ్ఞాత అనే జీవుడిలో వుండబట్టి, 24లోకి వచ్చినాయి అవి. (కానీ నీకీ పని మనసుకి చేయబుద్ధి కావడం లేదు) అంటున్నావు. ఎందుకని? బాహ్యమే సత్యంగా వున్నావు కాబట్టి. జ్ఞాతదాకా విషయం తెలియదుగా అప్పుడు. ఎంతసేపు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వరకే వున్నావు కాబట్టి విచారణలో, ఆకార భేదాన్ని పాటిస్తున్నావు కాబట్టి. లక్షణాన్ని ఆశ్రయించలేదు కాబట్టి, అప్పుడు ఎలా వున్నావు? మనసు మనసు మనసు అంటున్నావు. కానీ మనసు, బుద్ధి జడమయ్యా బాబు. ఈ ఇంద్రియాలు ఎట్లా జడమో, అవి కూడా జడమే. ఎందుకని? ఆ జ్ఞాత పనిచేయడం లేదు కాబట్టి. ఆ జ్ఞాత ఇందులో పనిచేస్తేనే, దాని తెలివితేటలు ఏమైనా సరే. ఆ జ్ఞాత కనుక మనసులో పనిచేయక పోతే, మనసు కూడా ఈ వస్తువు లాంటిదే. నువ్వు ఉపయోగిస్తేనే ఆ వస్తువు వుపయోగపడుతుంది. అలాగే జ్ఞాత ఉపయోగిస్తున్నాడు మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని. తన శక్తిని అందులో ప్రవేశపెడుతున్నాడు. ఆ ప్రవేశపెట్టగానే వాటికి చైతన్యం వస్తున్నది. లేకపోతే రావడం లేదు. మరి గాఢనిద్రావస్థలో ఎవరున్నారయ్యా? జ్ఞాత ఒక్కడే వున్నాడు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము కూడా పనిచేయడం లేదు కదా! గాఢ నిద్రావస్థలో. లేవా మరి అవి? వున్నాయి. ఎలా వున్నాయి? పనిముట్లవలె వున్నాయి. ఆ జ్ఞాత మెలకువలోకి దిగిరావడానికి, ఎందులోకి వచ్చాడు? మొట్టమొదట. అంతరేంద్రియాలలోకి దిగాడు. తన అంతఃకరణంలోనికి దిగాడు. దిగిన తరువాత ఏం చేశాడు? ఆ అంతఃకరణంలో ఏమున్నాయి? వాసనా బలం, సంస్కార బలం వున్నాయి. గుణబలం వుంది. వాటితోటి ప్రేరణ పొందాడు. ప్రేరణ పొంది ఏమడిగాడు ఇప్పుడు? నాకేంకావాలి ఇప్పుడు? విషయాలు కావాలి. విషయాలు అనంగానే ఏమైంది? పంచప్రాణాలు కావాలి. విషయాలను ఆచరించాలి అంటే ఏం కావాలి? పంచ ప్రాణాలు కావాలి. పంచ ప్రాణాలు, విషయాలు రాగానే, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు నిద్ర లేచినాయి. ఇదండీ బాబు. మీరు రోజూ నిద్రలోనుంచి మెలకువలోకి వచ్చే విధానము.
            మళ్ళా ఇలాగే నిద్రలోకి పోతావు. ముందు ఏమి పడిపోతాయి? కర్మేంద్రియాలు పడిపోతాయి. తరువాత ఏం పడిపోతాయి? జ్ఞానేంద్రియాలు పడిపోతాయి. ఆ తరువాత ఏమి పడిపోతాయి? విషయాలు పడిపోతాయి. ఆ తరువాత ఏం పడిపోతుంది? ప్రాణం పడిపోతుంది. ఆ తరువాత ఏం పడిపోతుంది? అంతరేంద్రియాలు పడిపోతాయి. మరణం కూడా ఇంతే నాయనా! ముందు ఏం జరుగుతుంది? ముందు కర్మేంద్రియాలు పడిపోయినాయి. తరువాత ఏం పడిపోయినాయి? మాట్లాడటం లేదండి. * ధారకం లేదండి. జ్ఞానేంద్రియాలు పడిపోయినాయి. అంతేనా అండీ! ఇంకేం కనపడలేదండి? నాయనా మనం చెప్పేది వినపడడం లేదు, కదిపినా కానీ వున్నాడు కానీ, నువ్వు పిలిస్తే మాట్లాడటం లేదు. ఏం పోయింది ఇప్పుడు? విషయేంద్రియాలు పోయినాయి. ఇప్పుడేమి పోవాలిక next? next ఏం పోవాలి? ప్రాణం పోవాలి. అయిపోయింది నాయనా! అయిపోయింది నాయనా! అంటున్నావు గానీ, క్రింద పెట్టలేదు. నీ పంచప్రాణాలు ఒక్కొక్కటీ విరమిస్తున్నాయి. ఎక్కడికి విరమిస్తున్నాయి? అంతరేంద్రియాలలోకి విరమిస్తున్నాయి. ఇంకా సాంతం విరమించేసింది. అప్పుడేమైంది? జ్ఞాత దేహాన్ని వదిలేశాడు. ఇప్పుడు దేహాన్ని వదిలేసే జీవుడి పేరేమిటి? జ్ఞాత. ఇప్పటి వరకూ ఎలా చేశావు? ప్రాణ మనో బుద్ధులు అంటూ చెప్పుకొచ్చావు. అలాకాదు విధానంగా చెబుతున్నది. ఇది సరైన నిర్ణయం అన్నమాట. జ్ఞాత అనే జీవుడు, శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరి నిర్ణయం మేరకు? ఆత్మ నిర్ణయం మేరకు. అంతరాత్మ, కూటస్థుడు ఎవరైతే మార్పు చెందకుండా వున్నాడో, ఆ కూటస్థుని నిర్ణయం మేరకు, ఈ జ్ఞాత ఏం చేశాడు? వదిలేశాడు. ఎందుకని? ఈ జ్ఞాతకు స్వయంగా శక్తి లేదు. ఈ జీవుడికి స్వయంగా శక్తిలేదు. వాడి శక్తి, ఆ పరమాత్మశక్తే ఇందులో పనిచేస్తోంది. ఎందుకని? సర్వ వ్యాపకంగా ఎవరున్నారు? పరమాత్మ వున్నాడు. ఆత్మస్వరూపం వున్నది. దానిలో వున్న శక్తే, దానిలో వున్న చైతన్యమే, ఆ పరమాత్మ సత్తాయే ఈ జ్ఞాతలో పనిచేస్తుంది. అంతే కానీ, జ్ఞాతకు స్వయంగా శక్తి లేదు.  కాబట్టి ఈ జ్ఞాత స్వయంగా శక్తి లేకపోయినా కూడా, ఈ ఐదైదులు 25 ని నడుపుతున్నాడా? లేదా? కాబట్టి నీ ఇంద్రియాలకు రాజు ఎవరు? జ్ఞాత. నీ ఇంద్రియాలకు రాజు ఎవరు? జ్ఞాత. ఇప్పటి వరకూ ఎవరు రాజు అంటున్నావు? మనసుని రాజు అంటున్నావు. అక్కడ పోయింది. అర్థమైందా? నీ ఇంద్రియాలకు రాజు ఎవరయ్యా అంటే? మనస్సు చెప్పినట్టు ఇంద్రియాలు వినవయ్యా బాబు. ఆ మనసే మరొకడి ఆధీనంలో వుంది. ఆ మనసే మరొకడి పనిముట్టుగా వుంది. అదే జడం. అర్థమైందా అండీ! మనసు పెద్ద జడం. దాంట్లో ఏమీ స్వయంగా పనిచేసే శక్తి లేదు. ఎందుకని? నేను అనుమతి ఇస్తేనే అది పనిచేస్తుంది. ఆ జ్ఞాత అనేవాడు అనుమతి ఇస్తేనే పనిచేస్తుంది. పనిచేస్తే గాఢనిద్రలో పనిచేయమను ఆ మనసుని. ఏం పనిచేయడంలేదే? అది స్వయంగా పనిచేయగలిగిన శక్తి సామర్థ్యం వున్నది అయితే, మనసుని గాఢ నిద్రలో పనిచేయమను. పనిచేయటం లేదు కదా! కాబట్టి దానికి కూడా పరిమితులు వున్నాయి కదా! అది స్వయం, స్థూల ఇంద్రియాలతో పోలిస్తే, దాంట్లో శక్తి ఎక్కువ వుంది. ఇప్పుడు కాళ్ళకి, చేతులకీనూ ప్రాణానికి పోల్చామండి, ప్రాణశక్తి ఎక్కువా? కాళ్ళల్లో, చేతుల్లో వుండే శక్తి ఎక్కువా? ప్రాణ శక్తే ఎక్కువ. ఎందుకని? ప్రాణం పోతోందిరా బాబూ అంటున్నావుగా. అర్థమైందా? ఏదైనా వస్తే ఏమౌతుంది? అనారోగ్యమే వచ్చిందండి. ఏమంటున్నావు? నా ప్రాణము పోతోందిరా బాబూ! చూడండి. అక్కడ కూడా స్పష్టంగా చెబుతున్నాడు. నా ప్రాణం పోతుంది అంటున్నావు గానీ, నేను పోతున్నాను అంటున్నావా? చూడండి. అంటే ప్రాణం కూడా నీ చేతిలో పనిముట్టే. ప్రాణం మీద ఏమీ ఆధారపడి లేవు. నీ మీద ఆధారపడి ప్రాణం వున్నది. ఈ సత్యాన్ని తెలుసుకోవాలండీ ఎప్పుడూ కూడా. జ్ఞాతమీద ఆధారపడే ఈ పంచప్రాణాలుగానీ, ఆ అంతరేంద్రియాలు గానీ, ఈ బాహ్యేంద్రియాలు గానీ, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు (అన్నింటికీ సాక్షి అది ఒక్కడే) ఆ జ్ఞాత. సాక్షి కాదు, ఆ జ్ఞాత ఈ ఇరవై ఐదింటికి అధికారి. రాజు అన్నమాట. కానీ ఈ జ్ఞాత సాక్షిగా పనిచేస్తున్నాడా? పనిచేయడం లేదు. వచ్చిన చిక్కు వీడితో ఇది. ఈ జీవుడితో వచ్చిన చిక్కు ఇది. (చూడడం కాదు, వాడు  చేస్తేనే ఇది) వాడు చేస్తేనే ఇది కదా! మరి అసలు కర్త ఎవరు? జ్ఞాతే కర్త. అర్థమైందా అండీ! భోక్త ఎవరు? 24 ఇంద్రియాలు భోక్త. అర్థమైందా అండీ!
            కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, పంచప్రాణాలు, అంతరేంద్రియాలు ఈ 24 వున్నాయే, 24కు అధికారిగా వున్న జ్ఞాత ఏమో కర్త. ఈ 24 ఏమిటి? భోక్త. అంతేనా అండీ? తినేది ఎవరు? ఇంద్రియాలు. అనుభవం నిర్ణయించేది ఎవరు? అంతరేంద్రియాలు. అది ఎవరి ఆధీనంలో వుండి పనిచేస్తున్నాయి? జ్ఞాత అధీనములోవుండి పనిచేస్తున్నాయి. కాబట్టి కర్త ఎవరయ్యా? ఆ జ్ఞాత. భోక్త ఎవరయ్యా? 24. అర్థమైందా అండీ? ఇలాగ నిర్ణయం చెయ్యాలి మొట్టమొదట. దీన్నే ఏమన్నారు? పిండాండ పంచీకరణ. దీనిని ఏమన్నారండీ! పిండాండ పంచీకరణ. స్థూలంగా చెబుతున్నా మీకు. ఇంకా లోపలకి చెప్పకుండా కేవలం పిండాండ పంచీకరణ అంటే ఎట్లాగ? అంటే నిత్యానిత్యవస్తువివేకము ఎందుకు వుండాలయ్యా? ఇందులో ఈ 25లో నిత్యము ఏదీ? పరమాత్మ నిత్యము అసలు. ఆ పరమాత్మ సత్త మొట్టమొదట ఎవరిలో పనిచేస్తోంది? జ్ఞాతలో పనిచేస్తోంది. కాబట్టి పరమాత్మ యొక్క లక్షణం సరాసరి ఎవరిలో కనపడుతోంది నీకు పరమాత్మని ఆశ్రయించాలి అంటే? మొట్టమొదట ఆ జ్ఞాత తెలియాలయ్యా బాబూ నీకు. నేను అనే జ్ఞాతని కనుక నీవు గుర్తు పెట్టుకుంటే, వాడిలో వున్న లక్షణం ఏమిటి? ఈశ్వర లక్షణం వున్నది వాడిలో. ఆ ఈశ్వర లక్షణము వుంది కాబట్టి వీడు ఆ 24 మీద అధికారిగా వున్నాడు. ఆ ఈశ్వర లక్షణమే కనుక జ్ఞాతలో లేకపోతే, ఈ ఇరువది నాల్గింటినీ నడుపగలడా? పనిచేయించగలడా? పని చేయించలేడు. కానీ, జ్ఞాతను ఆశ్రయించకుండా, క్రింద వున్న ఇరువది నాల్గింటిలో ఆకార భేదాన్ని ఆశ్రయించడం చేత, జ్ఞాతకంటే దగ్గరగా ఒక మెట్టు క్రింద ఎవరున్నారు? అహంకారం. ఒక మెట్టు జ్ఞాతలోంచి క్రిందకు దిగగానే ఏం వచ్చిందండి? అహంకారం. అంటే ఆకార భేదం వచ్చేసి అందులో కలిసిపోయింది. నేను కాస్త ఏమైపోయాడు? నేను శరీరాన్ని అనేశాడు అంతే. ఒక్క మెట్టు దిగితే చాలు కిందకి. సాక్షిత్వంలోంచి ఒక్క మెట్టు ఆ లక్షణాన్ని, ఈశ్వర లక్షణాన్ని విడిచిపెట్టి, ఒక్క మెట్టు క్రిందకు దిగగానే ఏమయ్యాడు? నేను శరీరాన్ని అనేశాడు. అహంకారం వచ్చేసింది. కాబట్టి ఆ ఒక్క మెట్టూ దిగమాకయ్యా! ఆ మొదటి మొట్టు దిగకుండా వుండు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ఆఖరి మెట్టు దగ్గర వున్నావు. 24వ దాని దగ్గర వున్నావు. అంతేనా కాదా? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసేంద్రియాలు, విషయేంద్రియాలు ఓ చిట్టచివరికి వచ్చేసింది సాంతం. అంతేనా కాదా? ఒక్కటి దగ్గర వుండవలసిన వాడు, ఎక్కడున్నాడు ఇప్పుడు? 24, 25వ దగ్గర వున్నాడు. సాంతం అడుగుమెట్టుకు వచ్చేశావు. ఇప్పుడు ఎలా వున్నావయ్యా? ఏం వరుసలో ఎక్కక్కర్లేదు. ఎందుకని? 24వది అయినా, 25వది అయినా, ఆ ఒక్కదాని ప్రభావమేనా కాదా? (అంతేగా మరి, జ్ఞాతదేగా) వాడు లేకపోతే మరి ఇదేం పనిచేసింది? ఒక్కసారి విచారణ చేసి చూడు. అంతేనా కాదా? ఓహో! అద్భుతం అండీ, చంద్రహారం. ఎవరికి అద్భుతం? (జ్ఞాతకి) ఎలాగా? వాడు సాక్షి కదా! వాడికి ఏ లక్షణం వుండి? ఈశ్వర లక్షణము వుంది. ఈశ్వరుడు సర్వ సాక్షి కదా! ఆయనకేమీ ఎవ్వరితో పనిలేదు కదా! ఏమయ్యాడు? ఒక మెట్టు దిగాడు ముందు. ఒక మెట్టు దిగగానే ఏమయ్యాడు? అహంకారం వచ్చేసింది. ఆకార భేదం తగిలింది దానికి. తగల గానే ఏమయ్యింది? చంద్రహారం పెడితే బాగుండు అనే జ్ఞానం బుద్ధిలో నిద్ర లేచింది. దాని మీద కాంక్ష వుందన్నమాట. ఆశ వున్నదన్నమాట. ఎప్పుడో, ఎక్కడో వాళ్ళు చంద్కహారాలు పెట్టుకోగా నువ్వు చూశావు. ఆ చూసిన అపేక్షను పొందాలనే ప్రియం లోపల వుంది. జ్ఞానంలో. ఆ బుద్ధిలో వుందన్న మాట. ఏమైంది? ఆ జ్ఞాపకం నిద్రలేచింది. చంద్రహారం పెట్టుకుంటే బాగుండూ అనేటటువంటి ప్రియం ప్రేరణ చేసింది. చేయగానే ఏమయ్యింది? చంద్రహారం ఎవరు పెట్టుకున్నారో వాడిని గుర్తించింది. లేకపోతే అసలు వాడు ఎట్లా కనపడ్డాడు నీకు? అది చంద్రహారమనీ, వాడు పెట్టుకున్నాడనీ, అది పెట్టుకుంటే బాగుంది అనీ, ఈ వివరణ అంతా ఎక్కడినుంచి వచ్చింది? ఇదీ మనస్సు. అంతే కదా! అహంకారం నుంచి ఇప్పుడు ఏమయ్యావు? మెల్లగా ఒక్కోమెట్టూ క్రిందకు దిగావు. చిత్తవృత్తిలోకి దిగేటప్పటికి, ప్రియం అయ్యింది. ఇంకో మెట్టు దిగావు. మనసు బుద్ధిలోకి దిగావు. మోదం అయ్యింది. ఇప్పుడు ఏం చేశావు? వాడెవడో అంతదూరం నుంచీ పోతున్నాడు కదా! నీకెందుకు గోల? వున్నావా? వుండలా. వాడి దగ్గరకి పోయి, ఏవండీ! ఈ చంద్రహారం ఎంతైంది? ప్రమోదంలోకి జారావు. ఎక్కడ కొన్నారు మీరు, ఎక్కడ చేయించారు? ఎంతైంది? ఓహో! కోటి రూపాయిలు అయ్యిందా? చాలా బాగుందండి. ఏమిటట ఇప్పుడు? దృశ్య జగత్తు. కన్నులోకి వచ్చేశావు సాంతం. కర్మేంద్రియంలోకి వచ్చేశావు. దాంట్లో ఏముంది? దృశ్యం అనే విషయం వుంది. ఆ దృశ్య విషయంలోకి కూడా వచ్చేశావు. విషయేంద్రియంలోకి వచ్చేశావు. వీటికి సహకరిస్తున్నది ఏదీ? పంచప్రాణాలు. నీ ప్రాణం పనిచేస్తేనే కదా! నువ్వు అక్కడి దాకా పరుగెత్తింది. వాడిని విచారణ చేసింది. నీకెందుకండీ? వాడెక్కడో అండమాన్‌ నికోబార్‌ దీవులలో చేయించాడు చంద్రహారం నీకెందుకు? ఏమన్న ప్రయోజనముందా నీకేమైనా? ఆ విషయ సమాచారంతో నీకు ఏమన్నా ప్రయోజనం వుందా? (బంగారం మీద భ్రాంతి వుందిగా) ఆఁ.. అంటే మొట్టమొదట ఎక్కడుంది? నువ్వు ఒక మెట్టు కిందకు దిగావు. అహంకారంలోకి దిగి, శరీర భ్రాంతిని పొంది, ఇంకోమెట్టు దిగావు. ప్రియంలోకి దిగావు. చిత్త వృత్తిలోకి దిగావయ్యా. అర్థమైందా అండీ! శమము, దమము అని ఎందుకు చెప్పాడయ్యా అని అంటే, శమము అంటే ఏమిటి? ఇందాక చెప్పిన బాహ్యేంద్రియాలని నిగ్రహించాలి, దమము అంటే ఏమిటి? అంతరేంద్రియాలను నిగ్రహించాలి. శమము, దమము. శమము అంటే ఏమిటి? అంతరేంద్రియ నిగ్రహము. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. ( ఆ చంద్రహారానికి అంతరేంద్రియాలు నిగ్రహించాలి) అంతరేంద్రియాలు ముందు శమములోపే ఆచరించాలండీ! ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ముందు శమాన్ని ఆచరించాలి గానీ, దమాన్ని ఆచరించకూడదు. మనం భక్తిలో ఎందుకు తప్పు చేశామయ్యా అంటే, ముందు దమాన్ని ఆచరించాము. ముందు ఏం చేశావు? బాహ్యేంద్రియాలను నిగ్రహించడం మొదలు పెట్టావు. ఎట్టా నిగ్రహించబడుతాయి? సాధ్యం కాదు కదా! నువ్వు అందరికీ ఏం చెబుతున్నావు? అది ఏముందిరా దాంట్లో? అంటావు. అది ఏముందిరా దాంట్లో అంటే, వాడు బాహ్యేంద్రియాలలోకి వచ్చేశాడు సాంతం. నిగ్రహించమంటున్నావు. ఎక్కడ నిగ్రహించాలి అసలు మొట్టమొదట? అంతరేంద్రియాలలో నిగ్రహించాలి నువ్వు. (అదే నేను చెప్పింది ఇప్పుడూ) అంతరేంద్రియాల ద్వారానే కదా చంద్రహారము వాళ్ళు వేసుకున్నారని, అటు వెళ్తున్నారని గుర్తించింది. (చేతులు, కాళ్ళు కాదు కదా గుర్తించింది.) వారి శరీర ఆకారాన్ని గుర్తించలేదు. వాడు ఏం ధరించాడో, దాని మీద వెళ్ళింది సరాసరి. దానికి కారణం ఏమిటంటే నీకు దాని మీద అపేక్ష వుందని. ఆ ప్రియం, ఆ లోపల వుంది. దాన్ని ఏమన్నారయ్యా? చిత్తవృత్తి. దానిని ఏమన్నారండీ? చిత్తవృత్తి. ఆ అపేక్షలు అన్నీ చిత్తవృత్తుల రూపంలో వున్నాయి, అదే వాసనాబలం అంటే. గుర్తుపెట్టుకోండి. “చిత్తంలో వుండేదంతా వాసనాబలం. బుద్ధిలో వుండేది అంతా సంస్కార బలం”. మనసులో ఏమీ వుండదు. ఉన్న ప్రమాదం అంతా చిత్తంలో, బుద్ధిలో, అహంకారంలో. ఆ మూడింటిలోనే. అహంకారంలోకి దిగంగానే నేను శరీరమనే భ్రాంతి కలిగింది. ఆ భ్రాంతి నుంచి ఇంకో మెట్టు దిగాడు, చిత్తంలోకి దిగగానే అన్ని అపేక్షలు, వాసనాబలంతో కూడినది అంతా నిద్ర లేచింది. ఆ వాసనా బలంలోనుంచి, సంస్కార బలం బలీయంగా మారింది. బుద్ధిలోకి వచ్చేటప్పటికి జ్ఞాపకాలన్నింటినీ సమీకరించింది, దానికి తగినవాటన్నింటినీ కూడాను. సమీకరించగానే ఏదో ఒక మార్గం ద్వారా ఇంద్రియాలలోకి రావాలి కదా! బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలలోకి రావాలి కదా! రావడానికి ఉపయోగపడే ద్వారం మనస్సు. ఈ ద్వారం లాంటిది మనస్సు అంతే. ఆ మనస్సుకేమీ అంతకు మించి శక్తి లేదు. ఈ లోపల బలం, వాసనాబలం, సంస్కార బలం, బలీయం అవ్వగానే తలుపులు తెరుచుకున్నాయి. అర్థమైందా అండీ! అది దానంతట అదేం ఇవ్వలేదు. ఈ వాసనాబలం, సంస్కార బలం. చిత్తంలో, బుద్ధిలో బలం పెరిగిపోయింది. కావాలి. కావాలి. కావాలి. కావాలి. ఆ లోపల బలం పెరిగిపోయింది. పెరిగిపోయేటప్పటికి తలుపులు తెరుచుకున్నాయి. తెరుచుకుని వచ్చేసింది బాహ్యేంద్రియాలలోకి. రాగానే ఏమైంది? అది దానికి అనుగుణమైనటువంటి, ఇంద్రియం ఏ స్థితిలో వున్నా, టక్కుమని స్పందించింది అంతే. ఇక్కడ ఏదో, తీవ్రమైనటువంటి discussion లో వుంటాము. కానీ, తోటకూర బయట వినపడంగానే, ఏమైందండీ? (ఇది అటు పనిచేసింది.) ఇప్పుడు ఎక్కడ పనిచేస్తోంది? తెలివి ఎక్కడుండాలి అసలు ఇప్పుడు? సాక్షిత్వంలో నిలబడి వుండి, మనం విచారణ చేస్తున్నాం కదా! కానీ మధ్యలో తోటకూర ఎలా వచ్చింది? అంటే ముందే నిర్ణయం చేశావు. అట్లా కాదు, ముందే నిర్ణయం చేసి, దీంట్లోకి దిగావు, ఎట్లా దిగావు? ముందు ఒక నిర్ణయం చేశావు. 7.30-8గంటల వరకూ ఈయన వుంటారు, 8-8.30 నిమిషాల టైంలో తోటకూర వాడు వస్తాడు. తోటకూర వాడు వచ్చి వెళ్ళిపోతే నాకు ప్రమాదం వస్తుంది. అందుకనే అది కొనుక్కోవాలని ముందు నిర్ణయం చేసి ఇందులోకి దిగావు. ఏమైంది ఆ టైం వచ్చేటప్పటికి? ఆ శబ్దం వినపడగానే, నువ్వు ఎంత గొప్ప స్థితిలో వున్నా, సరాసరి రెప్పపాటులో ఎక్కడికి వచ్చావు? అమ్మో! తోటకూర సంగతి పట్టించుకో, జ్ఞాత ఎక్కడికి పోతాడు? ఇక్కడే వుంటాడు ఎక్కడికీ పోడు వీడు. విచారణ ఎక్కడికీ పోదు అన్నావు. ముందు తోటకూర సంగతి పట్టించుకోమన్నావు. ఎందుకని? అంటే ఎంతసేపటిలో వచ్చింది కిందకి? రెప్పపాటులో వచ్చేస్తుంది. ఎలా రాగలిగాడయ్యా? అన్నీ అతని ఆధిపత్యంలో వున్నాయి కాబట్టి రాగలుగుతున్నాడు. ఆ జ్ఞాత ఆధిపత్యంలో ఈ 24 వున్నాయని చెప్పడం కోసమని ఈ ఉదాహరణ చెబుతున్నాను. నువ్వు అక్కడినుంచి ఇక్కడికి రావాలి అంటే, నిజానికి అయితే ఎంత టైం పట్టాలి అసలు లెక్కప్రకారమైతే? జ్ఞాత అహంకారంలోకి దిగాలి, అహంకారం చిత్తంలోకి దిగాలి. చిత్తం బుద్ధిలోకి దిగాలి. బుద్ధి మనసు ఓపెన్‌ చేయాలి. మనసు నుంచి బాహ్యేంద్రియాలలోకి రావాలి, బాహ్యేంద్రియాలు విషయాన్ని గుర్తించాలి. విషయం అప్పుడు నిర్ణయం చేయాలి, అప్పుడు దాని దగ్గరకి వెళ్ళాలి. (వాడు వెళ్ళిపోతాడు ఈలోపల) చూశారా? ఎక్కడికీ పోడు, ఎక్కడికి పోతాడు? వాడు కాకపోతే ఇంకొకడు. అని ఉపేక్షించగలగడమే. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఉదాహరణ ఎందుకు చెబుతున్నానయ్యా అంటే, శమము, దమము. శమము, దమము మూడవది ఏమిటండీ? ఉపరతి, తితీక్ష. ఉపరతి, తితీక్ష.
            ఈ ఉపరతి, తితీక్ష చాలా గొప్పవండి. ఎంత గొప్పవయ్యా అంటే, అంతరేంద్రియాలలో నిన్ను జ్ఞాత స్థానంలో నిలబెట్టగలిగేవి అంటూ ఏమైనా వున్నాయి అంటే, కిందకి పడిపోకుండా నిన్ను నిలబెట్ట గలిగే గొప్పసాధనలు ఏమిటయ్యా? అంటే, ఆ ఉపరతి, తితీక్ష. చాలా గొప్పవండి. ఎంతగొప్పవి అయ్యా అంటే, ప్రతిమానవుడూ కూడా, తాను ఈశ్వరుడను అని తెలుసుకోవాలంటే, ఈ రెండు సాధనలే చాలు. ఉపరతి, తితీక్ష. అందుకనే, శిష్యులు అందరికీ చెబుతారండీ! నాయనా! జీవితకాలమంతా మానవుడు ఈ ఉపరతి, తితీక్ష తెలుసుకున్న దగ్గర నుంచి, జీవిత కాలమంతా చేయదగినది ఏదైనా వున్నదంటే, ఈ ఉపరతి, తితీక్షే. (అంటే ఏంటి ఉపరతి?) చెబుతా, ఆఖరి శ్వాస వరకూ కూడా, ఆచరించదగినటువంటి, గొప్పసాధన ఏమిటయ్యా అంటే, ఈ ఉపరతి తితీక్ష. మహానుభావులు ఎవరైనా సరే, నీవు మహర్షి అని పిలవబడాలి అంటే, నీ యొక్క వ్యవహారంలో, ప్రతి చోట, ప్రతి ఆలోచనలో, ప్రతి చేతలో, మాటలో, నడకలో, నీ సర్వస్వం జీవనం అంతా కూడా ఈ ఉపరతి, తితీక్షా కనపడుతూ వుంటాయి. ఆ రెండూ కాపాడితే చాలు నీవు మహర్షివే. అంతటి గొప్ప స్థితిని అందిస్తాయన్నమాట అవి. నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాలయ్యా అంటే, ఆ ఈశ్వరుని యొక్క జ్ఞానం రావాలి అంటే, ఆ పరమాత్మ సాక్షాత్కారం కావాలి అంటే, ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే, తప్పని సరిగా, 24 గంటలు, నిత్యము, ఇదే నిత్య పూజ అండి. అన్ని సాధనల కంటే ఉత్తమమైన సాధన ఏంటయ్యా అంటే, ఈ ఉపరతి, తితీక్షే. ఈ ఉపరతి,తితీక్ష లేక పోతే, ఆత్మజ్ఞానం అసాధ్యం. బ్రహ్మజ్ఞానం అసాధ్యం. ఈశ్వరీయ జ్ఞానం అసాధ్యం. ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. ఆ పరమాత్మ సాక్షాత్కారం అసాధ్యం. ఏదైనా సరే, నువ్వు ఎన్నన్నా పెట్టుకో, అవన్నీ కూడా ఈ ఉపరతి తితీక్షలోనే ఇమిడి వున్నాయి. అంత గొప్పవన్నమాట ఇవి. వీటికంటే మించిన సాధన లేదు.

            వీటికంటే మించినటువంటి ఆయుధం లేదు. దేనినైనా సరే జయించాలన్నా ఇవే, సాధించాలన్నా ఇవే. వీటిని మించిన సాధనలే లేవండి. మూడు గుణాలను అధిగమించాలన్నా, మూడు అవస్థలను అధిగమించాలన్నా, దేన్నైనా సరే, వాసనాబలాన్ని అధిగమించాలన్నా, నీవు జీవుడు కాకుండా ఆత్మ స్వరూపుడిగా జీవించాలన్నా, ఆత్మానుభవం పొందాలన్నా, పరమాత్మానుభవం పొందాలన్నాకూడా ఈ ఉపరతి, తితీక్షలను మించినటువంటి సాధనే లేదు. కాబట్టి వీటిని జీవితకాలం ఆచరించాలండి. ఒక రెప్పపాటు కూడా ఎడం ఇవ్వకుండా ఈ ఉపరతి, తితీక్షలలో వాడు ఆచరిస్తే వీడే సచ్ఛిష్యుడు అనబడతాడు. ఎవడైతే ఒక్కరెప్పపాటు కూడా, ఒక్క ఆలోచనలో కూడా ఈ ఉపరతి, తితీక్షలను ఎడబాయకుండా వుంటాడో, ఇదే గమనిస్తారండీ, నీవు సచ్ఛిష్యుడవు అవునా కాదా అని గమనించేది ఈ రెండింటి మీదే గమనిస్తారన్నమాట. ఉపరతి, తితీక్ష. ఉపరతి, తితీక్ష ఈ రెండు లక్షణాలు పరిపూర్ణంగా వుండాలన్నమాట. వట్టి పూర్ణంగా కాదు, పరిపూర్ణంగా వుండాలి. ఎక్కడా వడ్లమొన మోపినంత కూడా తేడా లేకుండా, ఉపరతి, తితీక్షలు ఎవరికైతే నిత్యజీవితంలో ఆచరణలో వుంటాయో, వాడికి ముక్తి సిద్ధము. ఒక్క క్షణము కూడా లేటు వుండదండి. ఈ రెండూ సాధించడమే లేట్‌. ఇవి రెండూ సాధించిన తరువాత ఒక్క క్షణము కూడా, అంతా అయ్య దయంతా అరక్షణమే’ - ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని. అయ్యా దయైతే అంతా అరక్షణమే. అయ్య దయ దేనిమీద ఆధారపడి వుంటుందయ్యా? ఇదిగో ఈ రెండింటి మీదా ఆధారపడి వుంటుంది. ఉపరతి, తితీక్ష. వేదాంతంలో ఎన్నో విషయాలను చెబుతారండి. అది ఇది, ఇది అది అని విచారణగా ఎన్నో చెబుతారండి. ఇది ఇట్లా వుంది. అది అట్లా వుంది. అంతా ఏమిటంటే, నీ పూర్వం నువ్వు చేసిన అభ్యాసబలంలోంచి మార్పు చేయడం కోసం చెబుతాడన్నమాట ఇదంతాకూడా. కానీ నిజంగా ఆచరించేది, జీవితం మొత్తం నిజంగా ఆచరించేదంటూ ఏదైనా వుందంటే, అది ఉపరతి, తితీక్ష. కారణం ఏమంటాడంటే, నిత్యానిత్య వస్తు వివేకం ఎంతసేపు విచారణ చేస్తావు? అది ఎంతసేపు వుంటుంది? విచారణ చేసినంత సేపే వుంటుంది. తరువాత మళ్ళా, మళ్ళా మామూలే. మళ్ళా విచారణ మామూలే. అర్థమైందా అండీ! ఇహముత్రార్థఫలభోగ విరాగము వైరాగ్యము ఎంతసేపు వుంటుంది? వుంటుంది. దాంట్లో బలం వుంటుందండి. తాత్కాలికంగా వున్నప్పుడు అలానే వుంటుంది. తీవ్రంగా వైరాగ్యం లభించినప్పుడు మొత్తం మారిపోతావు. ఆ తీవ్రవైరాగ్యం వచ్చినప్పుడు, ఆ తీవ్రవైరాగ్యం రావాలంటే ఏమి వుండాలి? ఉపరతి, తితీక్ష వుండాలి. నిత్యానిత్య వస్తువివేకం స్థిరంగా నువ్వు విచారణ చెయ్యాలి. ఎల్లప్పుడూ ఆ విచారణ చెయ్యాలి. ఏం కావాలి? ఆ ఉపరతి, తితీక్ష కావాలి. ఎల్లప్పుడు అంతరేంద్రియాలని, బాహ్యేంద్రియాలని నీ అధీనంలో వుంచుకోవాలి, నువ్వు జ్ఞాత స్థానంలో వుండాలయ్యా! ఎప్పుడూ కూడా. అది కదా ఇందాకడి నుంచి చెబుతున్నది. వుండాలంటే ఏం కావాలి? ఉపరతి తితీక్ష కావాలి.
            ఇప్పటివరకూ చెప్పినవాటిని అన్నింటినీ సవ్యంగా చేయాలి అంటే కీలకం ఉపరతి, తితీక్ష. ఈ ఉపరతి, తితీక్ష లేకపోతే సాధకుడు ఎప్పటికీ కూడా ఈ స్థితిని అందజాలడు.
            (ఇంతకీ ఉపరతి అంటే ఏమిటి?) ఉపరతి, తితీక్ష చెప్పాలంటే మళ్ళా ఒక క్లాసు పడుతుంది. అర్థమైందా అండీ? అది టైం పడుతుంది. అందుకని మీరు క్రమంగా, మీరేమీ కంగారు పడవద్దు, అందులో ఏమీ ప్రమాదము లేదు. క్రమంగా నేర్చుకోండి విద్యని. స్థిరంగా నేర్చుకోండి. ఎందుకంటానంటే, ఆచరణ సాధ్యమైనటువంటిదిగా మీరు నేర్చుకోవాలి. కేవలం పాఠంగా నేర్చుకుంటే వదిలిపోతుంది. దానివల్ల మీకు ప్రయోజనం వుండదు. అందుకని నిత్యానిత్య వస్తువివేకం అంటే ఏమిటి? నిత్యమేది, అనిత్యమేది? చాలా స్పష్టంగా తెలుసుకోవాలండి. ఎలా తెలుసుకోవాలయ్యా? ఐదు ఐదుల ఇరవై ఐదు. ముందు దేనినైనా సరే ఐదు ఐదులు ఇరవైఐదుగా విడగొట్టాలండి. నిత్యమేదో అనిత్యమేదో తేల్చాలంటే ఏం చెయ్యాలండీ మొట్టమొదట? 1st దానిని 25గా విభజించు, దేంట్లోకి వస్తుందో విభజించు, 25లో దేంట్లోకి వచ్చింది? ఓహో! ఫలానా దాంట్లోకి వచ్చింది. నేను ఎవరిని ఇప్పుడు? నేను జ్ఞాతను. దేంట్లోకి వచ్చాను? ఇదిగో దీంట్లోకి వచ్చాను. దీంట్లోకి ఎలాగ వచ్చాను? ముందు అహంకారంలోకి దిగాను. అందువల్ల ఏమైంది? ఆకార భ్రాంతి కలిగింది. తరువాత ఏమైంది? ఆ వస్తువు మీద, ఆ పదార్థం మీద, ఆ సుఖం మీద అపేక్ష వున్నది కాబట్టి, చిత్తములోకి దిగాను. ప్రియం వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఏమైంది? ఈ చిత్తంలోనుంచి ఏమి వచ్చాను? బుద్ధిలో వున్న జ్ఞాపకాలను పోగేశాను. పోగేస్తే ఏమైంది? అది అక్కడ దొరుకుతుంది, ఇది ఇక్కడ దొరుకుతుంది, అది అట్లా వుంది, ఇది ఇట్లా వుంది అనే జ్ఞానం అది అందించింది. అందించగా ఏమైంది? లోపల వున్న దేహవాసనో, లోకవాసనో, శాస్త్రవాసనో బలపడింది. ఈ జ్ఞాపకాలన్నీ పోగేసినాక ఏమైంది? ఆ లోపల వున్న వాసనాబలం, ప్రియం బలపడింది. ప్రియం బలపడేటప్పటికి మోదం అయ్యింది. మోదం అయ్యేటప్పటికి ఏమైంది? తలుపులు తెరుచుకున్నాయి. మనసు అనే తలుపు తెరుచుకుంది. తెరుచుకోగానే ఏమైంది? బాహ్యేంద్రియాలలోకి వచ్చాను. బాహ్యేంద్రియాలు అంటే ఏమిటి? ప్రాణం. పంచప్రాణాలు పనిచేసినాయి. ఆ తలుపు తెరుచుకోవాలంటే ఏం కావాలట? పంచప్రాణాలు పనిచేస్తేనే మనసు తలుపు తెరుచుకుంటుంది. పంచప్రాణాల్లోనుంచి ఐదు విషయాల్లోకి వచ్చాను. అందులో ఏముంది? అయితే శబ్దమో, లేకపోతే స్పర్శో, లేకపోతే రూపమో, లేకపోతే రసమో, లేకపోతే గంథమో. ప్రాణేంద్రియాలు తరువాత విషయేంద్రియాలలోకి వచ్చాను. ఇంకేంచేశానయ్యా? ఇప్పుడు జ్ఞానేంద్రియాలలోకి దిగాను. కన్ను రూపం, శబ్దం చెవి, ముక్కు వాసన, చర్మం స్పర్శ ఇట్లాగ ఐదు జ్ఞానేంద్రియాలలోకి దిగాను. ఇంకేంచేశానయ్యా? ఐదు జ్ఞానేంద్రియాలు అనుభవించాలి అంటే అవి ఇక్కడున్నాయి, వస్తువు అక్కడుంది. ఇప్పుడు అక్కడ ఏంచెయ్యాలి? ఈ కర్మేంద్రియాలు పనిచేసి వస్తువు దగ్గరికి పోయింది. ఇప్పుడు ఈ ఐదు ఐదులు ఇరవై ఐదు వున్నయా? లేవా? దేంట్లో అయినా సరే? వున్నాయి కదా! ఎక్కడ ఎప్పుడు విచారణ చెయ్యాలయ్యా? పని చేయకముందు. ఆలోచనని అనుమతించే ముందు విచారణ చెయ్యాలి. (ఆలోచనకి దీనికి మధ్యలో GAP ఎక్కడుంది?)  ఇంత వున్నది కదా! ఇదే పెట్టాలి. కావాలి అంటే ఇదుగో ఇదంతా పెట్టాలి. పెడుతూ వుంటే, నువ్వు అభ్యాసం చేసేటప్పటికి ఏమైపోయింది? నేను జ్ఞాతను అనే స్ఫురణ బలపడిపోతుంది. నీకు జ్ఞాతను అనే స్ఫురణ బలపడితేనే తప్ప, నువ్వు దీనిని అధిగమించలేవు. ఇప్పటి వరకూ నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు మనసు అనుకుంటున్నావు. ఇప్పటి వరకూ ఎందుకు బలపడలేదు? ఆ తేడా, మధ్యలో ఎందుకు సమయం లేదయ్యా అంటే, నీవు ఎక్కడిదాకా వెళ్ళావు లోపలికి? మనసు అనే gate దాకా వెళ్ళావు. తన్నుకున్నావు బయటకు వచ్చేశావు. ఇంద్రియాల నుంచి మనసు వరికే, ఆ గేటు వరకే వచ్చావు. మనస్సు తలుపులు తెరుచుకోలేదు. శరీరం అంటే మనసుతో కలిపేగా. ఇప్పటి వరకూ శరీరం అంటే, శరీరం వేరే, మనసు వేరే అనే ధోరణిలో చూస్తున్నావు. అలాకాదు నీ శరీరమే ఆ మనస్సు, ఆ మనస్సే నీ శరీరం. తేడా ఏమీ లేదు. ఆ సంసారమే ఈ మనస్సు, ఈ మనస్సే సంసారం. మనస్సు అని ఎందుకు అంటున్నావయ్యా? ఆ గేటు తెరుచుకుంటే తప్ప ఇవన్నీ ఓపెన్‌ అవ్వడం లేదు. మనసు అనేది ఏమీ లేదు, ఒక ద్వార బంధం లాంటిది. దాని లోపల పనిచేస్తున్నటువంటిది ఏమిటి? బుద్ధి, చిత్తం. ఆ చిత్తంలో ప్రియం వుంది.  ఈ బుద్ధిలో మోదం వుంది. అర్థమైందా అండీ! ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఈవెడకి పిల్లలకి బోధించే పని వుందనుకోండి. ఈవెడకి క్లాస్‌కి వెళ్ళి రోజూ పాఠం చెప్పడం ఆనందమేనా? ఆనందమేనా కాదా? (ఆనందమే కదా!) మరి ఆనందం అని ఎట్లా తోచింది? చిత్తంలో. ముందు చిత్తంలో బోధించడం అనే సంస్కారబలం, వాసనాబలం వుందన్నమాట. ప్రపంచాన్ని ఉద్ధరించే నిమిత్తమై నేను బోధించాలి. లోకవాసన. దానివల్ల నాకు భోజనం వస్తుంది. దేహవాసన.  అర్థమైందా అండీ! నిజానికి మాట్లాడితే భోజనం వస్తుంది అని మనం ఎవరైనా పనిచేస్తామా? చెయ్యమండి. దాని వల్ల నీ ప్రత్యేకత నిలబడుతుంది. ఈ సమాజంలో అనుకో, ఈ కుటుంబంలో అనుకో, నీలో అనుకో, ఏదో ఒక ప్రత్యేకత దాంట్లో వుంటుందన్నమాట. ఆ ప్రత్యేకతయే చిత్తంలో వృత్తిరూపంలో వుంటుంది. అన్ని ప్రత్యేకతలు వాసనాబలం రూపంలో చిత్తంలో వుంటాయి. ప్రపంచంలో ఎన్ని కోట్లమంది టీచర్లు వున్నారు? అందులో మనం ఎవరం? ఎంత ప్రభావం వుంది? జగత్తులో ఆదిశంకరాచార్యుడు కూడా ఉపాధ్యాయుడే, టీచరే, బోధకుడే. ఆయనతో పోల్చిచూడు. ఇప్పుడు మనం ఏమయ్యాము? ఏం బోధిస్తున్నాము? చావులేని విద్యను బోధిస్తున్నామా? చనిపోయే విద్యను బోధిస్తున్నామా? చనిపోవడానికి కారణం అయ్యేది? కాబట్టి అసలు విద్యఅంటే ఏమిటి? జ్ఞానము. అజ్ఞానాన్ని పోగొట్టేది. ఏ అజ్ఞానం పోవాలి అసలు? దేని వలన జనన మరణాలు ప్రాప్తిస్తున్నాయో, అది అజ్ఞానం. దేని వలన జనన మరణాలు తొలగుతాయో అది జ్ఞానం. ఎందుకని? ఆ జనన మరణాల మధ్యలోనే ఈ గొడవ అంతా వున్నది. వేరే ఎక్కడన్నా వుందా? లేదు కదా! ఇలా విచారణ చేసేటప్పటికి ఆ బోధించడంలో వున్న ప్రత్యేకత పోయిందా? పోలేదా? పోయేటప్పటికి ఏమైంది? సాక్షిగా చేయగలిగింది. మనం అందరం ఏమనుకుంటాం అంటే, ఆనందిస్తూ చేస్తే స్వేచ్ఛ ఎక్కువ వుందని మనందరి అభిప్రాయము. ఎందుకని? దుఃఖిస్తూ చేయడం కంటే అది ఉత్తమం కాబట్టి. ఏడుస్తూ చేయడం కంటే నవ్వుతూ, ఆనందిస్తూ చేయడం ఉత్తమం. కానీ ఆ నవ్వుతూ, ఆనందిస్తూ చేసే దాంట్లో ఏమి ఏర్పడింది? సంగత్వ దోషం ఏర్పడింది. అందులో చేరిపోతున్నావు నువ్వు. దూరిపోతున్నావు. అది మళ్ళా రాకపోతే మళ్ళా దుఃఖిస్తున్నావు. దుఃఖం అసలు ఎట్లా వచ్చింది నీకు? ఈ సంగత్వ దోషం, ఈ సుఖము, ఈ ఆనందము లోపిస్తే, దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చింది కదా అని చెప్పి ఇందులో చేరావు. కానీ అసలు దోషం అంతా ఇందులో వుంది. సుఖం ఆనందంలో వుందన్నామాట. ఏమిటి? అబ్బా! టీచర్‌గారు ఎంతబాగా చెప్తారండీ? అని పది మంది విద్యార్థులో, పది మంది మాస్టర్లో, పదిమంది కుటుంబంలో వున్నవాళ్ళో, ఎవరో అన్నారండి. ఏమైంది అప్పుడు ఈవెడకి? ఓహో! ఎంత అద్భుతము అండీ! ఇంకా బాగా ప్రయత్నము చేసింది. కాళ్ళు చేతులు నొప్పులు వచ్చినా గానీ, చేతులు కాళ్ళు కొంకర్లు పోయినా గానీ, ప్రమాదం వచ్చినా సరే, అయినా సరే, ఏమైనా సరే, బ్లాక్‌బోర్డ్‌ అంతా నింపేసి, రాసేసి, చేసేసేయాలని, ఇప్పుడు ఏమైందట ఇప్పుడు? తనకు మాలిన ధర్మము మొదలు చెడిన బేరము అయ్యింది. ఎందుకని ఆ మాట చెబుతున్నారు? నీవు నిర్ణయం చేసేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయం చేయి. కర్తవ్యం చేయాలి. కానీ “కర్తవ్యం ఎట్లా చేయాలి? ఆత్మజ్ఞానం వచ్చేటట్లుగా చెయ్యాలయ్యా!. కర్తవ్యమే ఎవరు కాదన్నారు? ఎవరికి కర్తవ్యం? జ్ఞాత అనే కర్తకి కర్తవ్యం అండి. అంతేనా కాదా? ఎవరీ జ్ఞాత? ఆ ఈశ్వర లక్షణంతో, ఆత్మస్వరూపుడిగా, పరమాత్మ స్వరూపుడిగా పనిచేయాలండి. కానీ వీడు ఏ లక్షణంతో పనిచేస్తున్నాడు? ఇంద్రియాల లక్షణంతో పనిచేస్తున్నాడండీ! బయట వున్న ప్రత్యేకతలని, భుజాన వేసుకుని, మూట కట్టుకుని దాంతో పనిచేస్తున్నాడండి. ఇప్పుడు ఏం చెయ్యాలంట కర్తవ్యం అంటే? చెయ్యాలి కర్తవ్యం. ఏమిటి కర్తవ్యం? ముందు ప్రధానం ఏది? జ్ఞానం ప్రధానమా? కర్తవ్యం ప్రధానమా? (జ్ఞానం). జ్ఞానం వచ్చినాక కర్తవ్యం చేసినప్పుడు ఏమైందట? ‘కర్మ సు కౌశలం’.  ఏమైందట? మంచి నైపుణ్యంతో చేయగలిగే సామర్థ్యం వచ్చిందండి ఇప్పుడు. అర్థమైందా అండీ! ఈ జ్ఞానం వుంటే ఏంటయ్యా ఉపయోగం? నీ టీచర్‌ పనే నువ్వు చేసుకో! నా వుద్యోగం నేను చేస్తా. ఎవరు ఏం చేసినా ఏం భేదం లేదు. కానీ ఈ జ్ఞానంతో చేస్తే ఏమౌతావయ్యా? ఈ జ్ఞానంతోనే ఆ పనిని చేస్తావు కాబట్టి, ఫలితం కూడా ఈ జ్ఞానం రూపంలోనే లభిస్తుంది. ఒకరు సంధ్యావందనం చేసినా, ఒకరు ఉద్యోగం చేసినా, ఒకరు పౌరోహిత్యం చేసినా, బయట వున్నటువంటి బాహ్యేంద్రియాల ప్రవర్తనే కదా! అది. అంతేనా కాదా? లోపల ఇంకేమన్నా వుందా? అంతరేంద్రియాలలో వున్న వాసనాబలం, సంస్కార బలం, చిత్తంలో, బుద్ధిలో పనిచేసేది ఏదైతే వుందో, అది ఏం చెబుతోంది? ఇప్పుడు నువ్వు సంధ్యావందనం చెయ్యి నీకు ఆనందంగా వుంది. ఇప్పుడు నీవు బోధించు నీకు ఆనందముగా వుంది. ఇప్పుడు నీవు విను నీకు ఆనందముగా వుంది. ఇలా చెబుతూ వుంటుందన్నమాట. అది ఎప్పుడూ ప్రియం మోదం ప్రమోదాలలో కొట్టుకుంటూ వుంటుంది. నీ చిత్తవృత్తి అంటే ఏం లేదు, అది ఎంత సేపూ ఏం చేస్తుంది? నీ వాసనాబలంలో వున్నటువంటి ప్రియములన్నీ, ఏకరువు పెడుతూ వుంటుంది. నువ్వు అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. దాని పని ఎప్పుడూ ఇదే. ఆ చిత్త వృత్తి ఎప్పుడూ ఏం చెబుతూ వుంటుందండి? అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. దాని పని ఇంతే. ఇంతకు మించి వేరే ఏమీ లేదక్కడ. అన్నీ ప్రియములు వుంటాయన్నమాట. బుద్ధిలో ఏముంటాయి? ఆ ప్రియములకు సంబంధించినటువంటి, వ్యతిరేక అనుకూలమైనటువంటి జ్ఞాపకాలు అన్నీ వుంటాయన్నమాట. ఆ Data అంతా వుంటుంది. సమాచారం అంతా వుంటుంది. ఆ ప్రియం తోచగానే ఇవన్నీ దాని ముందు ఎదురుగా పెడుతుంది. అది చేస్తే ఇలా అవుతుంది, ఇది చేస్తే అలా అవుతుంది. అది చేస్తే నీకు దుఃఖం వచ్చింది, ఇది చేస్తే నీకు సుఖం వచ్చింది. ఇట్లా డేటా అంతా దానిముందు పెడుతుందన్నమాట. పెట్టగానే ఏమైంది? ప్రియం కాస్తా? మోదం అయ్యింది. ఈ మోదం ఏమైంది? లోపల వాసనాబలం, సంస్కార బలం గిరగిరగిరగిర తిరిగినాయి. ఎంతసేపు? ఎంత వేగంగా తిరుగుతుందంటే, దాని అంత వేగంగా ఏదీ తిరగదు అన్నమాట. అంత వేగంగా తిరిగి దాంట్లో బలం పెరిగింది. చలిస్తే వేగం పెరిగిందా? చలించకపోతే వేగం పెరిగిందా? చలించబట్టే కదా! కాబట్టి నిగ్రహించమని కదా చెబుతున్నది. (అంతేకదా మరి) అర్థమైందా ఇప్పుడు? ఏం చెబుతున్నాడు? శమము, దమము. అంటే ఏమిటి? బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము. బాహ్యేంద్రియ నిగ్రహము ఏమిటి? దమము. శమము అంటే ఏమిటి అంతరేంద్రియ నిగ్రహము. ముందు ఏం చెయ్యాలి? అంతరేంద్రియ నిగ్రహము చేయి. అంటే అసలు చలిస్తున్నది ఏమిటి? ముందు అంతరేంద్రియాలు విపరీత వేగముతో చలిస్తున్నాయి. ఆ విపరీతమైన వేగంతో చలించే కొంత భాగము, బాహ్యేంద్రియాలలోకి వస్తుంది. ఇప్పుడు నేను ఈ చేయి ఇలా తిప్పుతున్నానండి. ఇలా తిప్పుతున్నాను అంటే లోపల ఈ మనో బుద్ధులు ఎంత వేగంతో పనిచేస్తే, ఇట్లా తిప్పగలుగుతున్నాను? అంతే కదా! మీరు బాహ్యంలో యంత్రాలను చూడడం లేదా? విపరీతమైన వేగంతో చలించే మోటర్‌ వుంటే, ఆ మోటర్‌ అనుసంధానించబడిన కొంచెం వేగంతో, దానికంటే కొంచెం వేగంతో, ఈ మోటర్‌ పనిచేయాలంటే, కరెంట్‌ ఎంత వేగంతో తిరుగుతుంది లోపల? ఎలక్ట్రాన్‌లు ఎంత వేగంతో, దీనికంటే కొన్ని వేల రెట్లు వేగంతో అవి చలిస్తేనే, దీంట్లో కొంత భాగం వచ్చింది. కాబట్టి, మీ అంతరేంద్రియాలు ఇప్పుడు ఎంత వేగంతో చలిస్తున్నాయి? ఇలా విచారణ చేయాలి. చేస్తే ఏమైందట ఇప్పుడు? దాని యొక్క వేగం తగ్గిపోయింది. అప్పుడు నేను ఎవరిని? జ్ఞాతని. ఎక్కడికి దిగకూడదు? ప్రియం మోదం ప్రమోదాలలోకి దిగకూడదు. ఎక్కడికి దిగకూడదు? అహంకారంలోకి దిగకూడదు. చిత్తంలోకి దిగకూడదు. బుద్ధిలోకి దిగకూడదు. అథవా దిగినా కూడా, దానిని అక్కడే నిగ్రహించాలి. అంతరేంద్రియ నిగ్రహము అనే శమమును పాటించాలి. అక్కడ పాటించావు. తరువాత ఏమయ్యింది? ఎంతో కొంత భాగం చలించింది కాబట్టి, బాహ్యేంద్రియాలలోకి రాక తప్పదు. వచ్చెను పో! ఏమైంది ఇప్పుడు? బాహ్యేంద్రియ నిగ్రహము, దమమును ఆశ్రయించు. బాహ్యేంద్రియాల దగ్గరైనా నిగ్రహించు. మరలా ఇట్లా అమలులో పెట్టమాకు, అమలులో పెడితే ఏమైంది? ఫలితం వచ్చేసింది. కర్త కాస్తా ఏమయ్యాడు ఇప్పుడు? భోక్తై కూర్చున్నాడు. “ఈ శమము, దమము ఎవరైతే ఆచరిస్తారో, వాడికి భోక్త లేకుండా పోతాడు”. అర్థమైందా అండీ! ఈ శమము, దమము వల్ల ఉపయోగం ఏంటంటే, జ్ఞాత అనెడి కర్త భోక్త అవ్వకుండా వుంటాడు. ఎప్పటికీ మరలా ఈ విచారణ చేసి, ఈ నిగ్రహాన్ని పాటిస్తే, మళ్ళా జ్ఞాత అవుతూ వుంటావన్నమాట. కింద పడిపోతూ వుంటావు, లేస్తూవుంటావు. పర్వలేదు, కొంత సేపు అభ్యాసం చేసేటప్పటికి, మళ్ళా ఎప్పటికీ జ్ఞాతగా వుండేటటువంటి, స్థిరత్వం వస్తుందన్నమాట. ఈ శమము, దమము వల్ల ఉపయోగం ఏంటంటే అది. భోక్త లేకుండా, ఫలితాన్ని ఆశ్రయంచేటటువంటి వాడు లేకుండా పోతాడు. ఈ భోక్త లేకుండా పోయి, ఉపరతి తితీక్ష చేయగలిగే సామర్థ్యం వస్తుందండి. అర్థమైందా అండీ! ఉపరతి తితీక్ష ఏమిటంటే, కర్తను పోగొడుతాయి అవి. జ్ఞాతను పోగొడుతాయి అవి. నీవు ఆత్మస్వరూపుడవు అనే నిర్ణయంలోకి నిలబెడుతాయన్నమాట అవి. ఆ జ్ఞాతలో వున్నటువంటి కర్తృత్వభావం, కర్తవ్యభావం పోగొట్టే ప్రయత్నం చేసేది ఉపరతి, తితీక్ష. కానీ అది పోవాలి అంటే ముందు ఏం పోవాలి? ఫలితాన్ని ఆశ్రయించే భోక్త పోవాలి. మొట్టమొదట. ఎందుకని? మనం ఇప్పటి దాకా ఎందులో వున్నాము? ఆ ఫలితాన్ని ఆశ్రయిస్తున్నాము, ఆ ప్రత్యేకతని ఆశ్రయిస్తున్నాము. ఆ ప్రత్యేకతలోన, అపేక్షలో వున్న సుఖాన్ని ఆశ్రయిస్తున్నాము. అందువల్ల ఈ భోక్త బలపడిపోయి వున్నాడు. ముందు వీడిని ఎగరగొట్టాలి. ఎప్పుడూ కూడా. భోక్త ఎగిరిపోవాలి అంటే, ఒకే ఒక నియమాన్ని పాటించాలి. ఏమిటయ్యా అంటే, నిత్యవర్తమానుడవై జీవించాలి. నిత్య వర్తమానుడు అంటే ఏమిటి? ఎల్లప్పుడూ ఈ క్షణమే సత్యం. గత క్షణం ఇప్పుడు లేదు. రాబోయే క్షణం అస్సలు లేదు. కాబట్టి నేను ఎవరను? అనే వాడు ఎక్కడున్నాడు? ఈ క్షణంలోనే వున్నాడు. ఎప్పటికప్పుడు ఇదే చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ క్షణమే, ఎప్పటికప్పుడు ఈ క్షణమే. గతక్షణం సంగతి వదిలేయటమే. బాధ్యతలు చేయడం, చేయకపోవడం. అవ్వటం, అవ్వకపోవడం అన్నీ తీసి ఒకే మూల, ఒక కట్టగా... మీరు ఎప్పుడైనా గానీ ఒక ఉదాహరణ చూడండి. చెత్త బయట పడేసేముందు మనం విచారణ చేస్తాం కదా! ఏం బయట పడేస్తు్న్నాము అని (అవును). కానీ అలా విచారణ చేయకూడదు. ఎందుకని? అంతా పారేసేదే కదా! అర్థమైందా అండీ! అంతా పారేసేదే అయినప్పుడు ఏం విచారణ చేస్తావు ఇంక? ఒక నిర్ణయం చేశావు. అంతా పారేయవలసిందేరా బాబు. ఎందుకని? జీవుడు కదా! వీడు ఎవడు? జీవుడు కదా! మొదటి నుంచి ఏం చెబుతున్నాడు? జీవుడు కదా! ఈ జీవుడు ఏం చేస్తున్నాడట? ఇందులోకి దిగి రకరకాల వ్యాపకాలని, రకరకాల వికారాలని పొంది, రోజూ నిత్యప్రళయాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి వీడు శాశ్వతమైనటువంటి స్థితిలోకి చేరాలి అంటే, తప్పనిసరిగా ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించాలి. అందులో నిత్యానిత్యవస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తిలో శమము, దమము వరకు అయినాయి.

ఓం ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే

ఓం తత్‌ సత్‌

ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః

సాయిరాం.