File No.10



అంతాకూడా ఆత్మ ఘోష, ఆ సారాంశం అంతా యోగవాశిష్టములో వుంది. అలాగే తరువాత జ్ఞానవాశిష్టము. అది కూడా వశిష్ట మహర్షి రామచంద్రునకు బోధించినట్టే వుంటుంది. అది బ్రహ్మానుభవం. ఎట్లాగ, మొదటిది యోగవాసిష్టము ఎట్లాగైతే ఆత్మానుభవము వరకూ మాట్లాడుతుందో, అట్లాగే జ్ఞానవాశిష్టము బ్రహ్మానుభవము, పరమాత్మవిషయము మాట్లాడుతుంది. అయితే దానిపైది బృహద్వాశిష్టము. ఈ బృహద్వాశిష్టాన్ని శివరామదీక్షితులు రచించారు. దానిని తెలుగు సేత భాగవత కృష్ణదేశిక ప్రభువులు చేశారు. ఇది పరమాత్మ విషయం పైన మాట్లాడుతున్నారు. బృహద్వాశిష్టము అనేది, పరమాత్మ విషయము పైన అంటే పరమాత్మ ఎట్లా ఏర్పడ్డాడు? విశ్వం ఎట్లా ఏర్పడింది? విశ్వం ఎట్లా లేకుండా పోతుంది? అనే పై ఆఖరి స్థితిలో విషయం మాట్లాడుతారు. అయితే అద్వైతము, అచలము, ద్వైతము అని మూడు విధానాలు వున్నాయన్నమాట. ద్వైతము అంటే ఏమిటి? యోగవాశిష్టములో జీవుడు - దేవుడు అనే పద్ధతిలో జీవుడు - ఈశ్వరుడు. శరీరము - నేను ఇట్లాగ రెండు రెండుగా వుండేవాటి అన్నిటిమీదా మాట్లాడుతూ దాన్ని ఏమంటున్నామంటే ద్వైతం. అదన్నమాట ద్వైతం. ఎవ్వరైన మనం ప్రారంభించేది, ద్వైతం దగ్గరనుంచీ ప్రారంభిస్తాము. అంటే ఏమిటి? మనమందరము వున్నాము. నేను వున్నాను, భగవంతుడు కూడా వున్నాడు. నేను భగవంతుడిని పూజచేయాలి. భగవంతుడు సృష్టి కర్త. వాడిని పూజిస్తే నాకు ఉపయోగం వుంటుంది. నాకు అతని దయవలనే నేను జీవిస్తు్న్నాను, నేను ఎప్పటికీ భగవంతుడిని కాను, భగవంతుడు ఎప్పటికీ దేవుడు కాడు. ద్వైతం అంటే అర్థం అదన్నమాట. అంటే భగవంతుడు ఎప్పుడూ భగవంతుడే. నేను ఎప్పటికీ జీవుడినే. నేను పుడుతూ వుంటాను, పోతూ వుంటాను. భగవంతుడిని ప్రార్థిస్తూ వుంటాను. కానీ నేను ఎప్పటికీ భగవంతుడిని కాలేను. భగవంతుడు ఎప్పటికీ జీవుడు కాదు. విడిపోయి వుంటాయన్నమాట. ఎప్పటికి కలవవు ఇవి. అది ద్వైత పద్ధతి. ఇది ఇక్కడి నుంచి ప్రారంభించి యోగవాశిష్టము అలా కాదు నాయనా! నీవే అద్వైత స్వరూపుడివి, నీవు ఆత్మ స్వరూపుడివి, ఆ దైవత్వం అంతా కూడా ఆత్మలోనే వున్నది, అదే నీలో కూడా ఆత్మస్వరూపముగా వున్నది. అని చెబుతుంది. అది అద్వైతంలోకి దారి తీస్తుందన్నమాట. ఈ అద్వైత బోధ ఆఖరి స్థితులకు వచ్చేటప్పటికి, ఆత్మానుభవం, బ్రహ్మానుభవం, సమిష్టిగా బ్రహ్మానుభవం, వ్యష్టిగా ఆత్మానుభవం కలగటం, పరమాత్మ విషయం, పరబ్రహ్మ విషయం చెబుతూ, నిరూపించి వదిలేస్తుంది. ఇది అద్వైతానుభవం వరకూ మాట్లాడుతుంది. ఎవరైనా సాధారణంగా ఇక్కడి వరకూ మాట్లాడుతారు. అయితే అద్వైతానుభవం వచ్చిన వాళ్ళకి, ఇంతేనా అసలు, దీని అవతల ఇంకేమైనా వున్నదా? అంటే పరబ్రహ్మ, పరమాత్మ అనుభవం రావడం, అది లేకుండా పోవడం అనే అంశం గురించి మాట్లాడేది బృహద్వాశిష్టము అన్నమాట. కాబట్టి ఇలాగ మూడు వాశిష్ట సాంప్రదాయాలు వున్నాయి.
            అంటే మనకు సాధారణంగా వశిష్టుడు, రాముడు అంటే మనకు ఏం కనబడుతారంటే, ఎవరో గడ్డం పెంచేసుకున్నాయన వశిష్ట మహర్షినూ, కోదండం పట్టుకున్నాయన రాముడని మన పద్ధతి. కానీ అవన్నీ కూడా అవేమీ కావు. అవన్నీ కూడా పౌరాణిక పద్ధతిలో అలా చిన్న పిల్లలకి అర్థం అవ్వడం కోసమని, వాటికి రూపాలు అలా పెట్టి ఏర్పాటు చేశారు. వశిష్టుడు అనే ఆయన ఒక మహర్షే. కానీ వాశిష్టం - అందులోనే వుందండి. శిష్టము అంటే నువ్వు ఏది ఆశ్రయిస్తే జ్ఞానాన్ని పొందుతావో అది శిష్టం. అర్థమైందా అండీ! నీవు ఏ ఆచారాన్ని పాటించాలయ్యా? అంటే శిష్టాచార్యము అని అంటున్నాము కదా! ఆ శిష్టాచార్య సాంప్రదాయం అంటే ఏమిటంటే, ఆ ఆచార సాంప్రదాయములు ఎక్కడినుంచి ప్రారంభం అయినాయి అంటే, దాని లక్ష్యం ఆత్మజ్ఞానమై వున్నదన్నమాట. ఏ ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో పెడితే, అది నీ సాంప్రదాయం అవుతుందో అది శిష్టాచార్య సంప్రదాయం అయ్యిందన్నమాట. మనవాళ్ళు అందరూ ఇవాళ ప్రతీదానికి చెప్పుకునేది ఏమిటి? మాది శిష్టాచార్య సాంప్రదాయం అండీ, మాది వైదికమండీ అని అంటుంటాం కదా! అదంతా ఏమిటయ్యా? అని అంటే, ఆ ఆచార సాంప్రదాయాలలో ఆత్మజ్ఞానం ఆచరణలో వుండాలన్నమాట. అది దాని అర్థం. వాశిష్టము అంటే విశిష్టమైనటువంటిది. అందులో కూడా ఆత్మానుభవం నుంచి బ్రహ్మానుభవం చేరడానికి, ఎటువంటి ఆచరణ కావాలో, అటువంటి ఆచరణ, సాంప్రదాయం కలిగి వుండటం వాశిష్ట సాంప్రదాయం అన్నమాట. అలా ఏర్పడింది వశిష్టం అనేటటువంటి పేరు. అంతేగానీ అదేదో ఒక మనిషి పేరు కాదు, ఒక స్థితి. అలాగే రాముడు అన్నా కూడా ఒక స్థితే. మనిషి పేరు కాదు. అర్థమైందా అండీ!
            రాముడు అనే మహారాజు పరిపాలించాడు భారత దేశంలో అది వేరే అంశము. కానీ ఈ రెండు స్థితులనీ ఆధారంగా చేసుకుని, ఈ వేదాంత విద్యని అందరికీ అందుబాటులోకి తెచ్చారన్నమాట. ఉపనిషత్తులలో, 108 ఉపనిషత్తులలో భాగంగా, అతి రహస్యంగా వున్నటువంటి దానిని, దాన్ని బయటకు తీసుకువచ్చారు. బయటకు తీసుకువచ్చి, అనేకమైనటువంటి సాంప్రదాయాలలో అంటే కర్మ, భక్తి, యోగ, జ్ఞాన సాంప్రదాయాలు నాలుగింటిలో కూడా అనేక రకాల మానవులు వున్నారు కాబట్టి కర్మ సాంప్రదాయంలో వున్నవాడికి కర్మ, అంటే వాడి శక్త్యాను సారము, వాడు ఏ మేరకు ఆచరించగలడు అనే దానిని బట్టి వీటిని ఏర్పాటు చేస్తూ వచ్చారు. వేదభాగములలో అన్నీ వున్నాయి. కర్మమార్గానికి సంబంధించిన మార్గమూ వుంది, భక్తికి సంబంధించినదీ వుంది, యోగానికి సంబంధించినదీ, జ్ఞానానికి సంబంధించినదీ వుంది. అట్లాగే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనే నాలుగు ఆశ్రమ ధర్మాల వాళ్ళు, వాళ్ళు వాళ్ళు ఎలా ఆచరించాలనే పద్ధతిలో కూడా, ఆ పద్ధతిలో కూడా ఉపనిషత్తులు చెబుతూ వున్నాయి. 
            అయితే సాధారణంగా మనమందరం వైదికం అని అంటున్నది ఏదైతే వుందో, వేదము అంటే  ఏమిటంటే వ+ఇదమ్‌ ఉన్నది ఏదో తెలిపేది అన్నమాట. అంటే లేనిది లేనట్టుగా నిరూపించి, ఉన్నది ఉన్నట్లుగా నిరూపించడమే కదా సత్యము అంటే.
            సత్యము అంటే అర్థం ఏమిటి? లేనిది ఎలా లేదో నిరూపించాలి, ఉన్నది ఎలా వున్నదో నిరూపిస్తే అదే సత్యము. కాబట్టి 'వ ఇదమ్‌' ఉన్నది ఏదో నిజంగా తెలుపుతుందన్నమాట. సత్యాన్ని తెలిపేది అని అర్థము, వేదము అంటే అర్థము. కాబట్టి దానికి మనం రకరకాల భాగాలు, అనేక రకాల శాస్త్ర పద్ధతుల్లో మాట్లాడితే చాలా, దానికి పెద్ద విషయము. సరే అలాకాకుండా మనకు అవసరమైనంత వరకూ మాట్లాడుకుంటే వైదకము, అవైదికము అంటే అర్థము ఏమిటంటే, ఉన్నది మాత్రమే తెలిపేది, సత్యాన్ని సత్యంగా తెలిపేది ఏదైతే వున్నదో అది వైదికము. సత్యాన్ని మరుగుగా తెలుపుతూ, మరొక పద్ధతిలో తెలిపితే అది అవైదికమ్‌. అంటే సత్యాన్ని వున్నది వున్నట్టుగా చెప్పడన్నమాట. వేరే పద్ధతిలో చెప్తారు. ఏమని? నువ్వు దేవుడివేరా! నువ్వు పరమాత్మవేరా! అని చెప్పరు. నువ్వు శరీరమే నాయనా! ఈశరీరంలోనుంచే బయటపడు. ఈ శరీరంలోనుంచి ముక్తి చెందు. ఈ శరీరంలోనుంచి ముక్తి చెందితే సరిపోతుంది నీకు. శరీరంలో వున్నంతకాలం జాగ్రత్తగా వుండు. శరీరంతో చేసే పనుల్నీ జాగ్రత్తగా చేయి. శరీరంతో చేసే పనులన్నీ కర్మకాండలో జాగ్రత్తగా చేయి. ఆ భగవంతుడిని వుద్దేశ్యించి చేయి. ఇట్లా కర్మకాండకు సంబంధించనటువంటి విధానం అంతా చెబితే అది అవైదికము. అర్థమైందా అండీ! జ్ఞాన పద్ధతిగా చెబితే అది వైదికము. అదే కర్మపద్ధతిగా చెబితే అది అవైదికము. కాబట్టి మనలో మనం చెప్పేవాటన్నింటిలో ఏం చెప్పారు? అపర కర్మ అనీ, పరకర్మ అనీ రెండు భాగాలుగా విభజించుకుని, మళ్ళా కర్మను రెండు భాగాలు చేసుకుని ఇలా ఎక్కడికక్కడ ప్రతీదానిని రెండు రెండు భాగాలుగా చేసి పడేశామన్నమాట. జ్ఞానాన్ని కూడా రెండు భాగాలు చేసేసేటప్పటికి ఏమైపోయింది? ఇలా రెండుగా విడిపోయేటప్పటికి మనలో మనకే లేనిపోని తగాదాలు అన్నీ వచ్చేసినాయన్నమాట. ఇలాగ ఇవన్నీ కూడా పరిష్కరించాడు శంకర భగవత్పాదులు. ఆయన అన్నీ పరిష్కరించి నాయనా! తగాదాలు పడాల్సిన అంశమేమీ లేదు, అందరూ ఎట్లాగైనా గానీ, చిట్టచివరికి అద్వైతాన్ని తెలుసుకోక తప్పదు. మీరు ఎన్ని మతాలలో వున్నాకూడా, ఆ మతమంతా మీ మతిని బట్టి ఆధారపడి వున్నది. దాంట్లో ఏమీ లేదు. నీకు ఏది ఇష్టమైతే అది మతమై కూర్చుంది. కాబట్టి నీకు ఇష్టమైనట్టు ఆచరించు, ఏ ప్రమాదము ఏమీ లేదు. ఆ ఆచరించే దాంట్లో ఆత్మానుసారము జీవించవయ్యా! వచ్చిన తగాదా ఏమీ లేదు. నువ్వు శాక్తేయమైనా, వైష్ణవమైనా, శంకరాద్వైతమైనా లేదూ నేను శైవమైనా, మరకొటైనా, గాణాపత్యమైనా ఏదైనా కానీ సగుణం కానీ రకరకాల మతాలు భారతదేశంలో వున్నాయి. మీరెవరైనా ఏదైనా ఆచరించండి. ఆత్మానుసార జీవితాన్ని జీవించండి. ఆత్మను దృష్టిలో పెట్టుకుని జీవిస్తే, మీరు చేసే పనులు గానీ, అవన్నీ గాని, మిమ్మల్ని ఏమీ అంటకుండా వుంటాయి. కర్మను అంటకుండా చేయగలిగేటటువంటి స్థితిలో మీరు వుంటారు. మొట్టమొదట మానవుడు సాధించివలసినటువంటి ప్రాథమిక లక్ష్యం ఇది. నువ్వు ఏదైనా చేయి, అది చేసినప్పుడు అది నిన్ను అంటకుండా వుందో, లేదో చూసుకో. అంటకుండా వుండటం అంటే ఏమిటి? అంటకుండా వుండటం అంటే ఏమిటంటే, మీకు ఇదే సర్వవేదాంత శిరోభూషణంలో ఇలా నాలుగు శివుని యొక్క స్థితులండి, విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలని నాలుగూ శివస్వరూపాలే ఇవి. అర్థమైందా అండీ! ఇలాగ దీంట్లో ఒక చిత్రం వేశారన్నమాట. ఈ చిత్రం కూడా మీకందరికీ కూడా ఉపయోగపడేదే. తెలుసుకోవలసినదన్నమాట ఇదంతా కూడా. విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలనే పద్ధతిలో ఈ ప్రపంచమంతా వున్నది. ఈ విశ్వం అంతా నడుపబడుతున్నది వాళ్ళ నలుగురి చేత. ఎవరైతే ఈ అనంత విశ్వాన్ని నడుపుతున్న వారి స్థితులు ఏవైతే వున్నాయో, అవి ఏమిటయ్యా అంటే, విరాట్‌ - ఈ అనంత విశ్వం స్థూలంగా కనబడుతున్నది కదా! అదంతా ఎవరయ్యా? విరాట్‌. దానికి సూక్ష్మం వుంటుంది కదా! దాని పేరు హిరణ్యగర్భం. దానికి కారణమైన స్థితి వుంటుంది కదా! దానికి ఆకారం లేదు కాబట్టి అది అవ్యాకృతం. ఇప్పుడన్నీ ఆకారంతో వున్నది కదా! విశ్వం అంతాకూడా. సూక్ష్మానికి కూడా ఆకారం వున్నదండి. దానిని ఆ సూక్ష్మము, స్థూలము లేకుండా వున్న స్థితి అవ్యాకృతము. ఆ అవ్యకృతము ఎక్కడినుంచి ఏర్పడిందయ్యా అంటే, పరమాత్మ స్థితినుంచి ఏర్పడిందయ్యా! ఈ నాలుగు స్థితులలోనే విశ్వం నడుపబడుతున్నది. ఈ సత్యం తెలుసుకోండి మీరు. ఇది తెలుసుకుని నీలో ఎలా పనిచేస్తున్నాయి ఇవి తెలుసుకో! ఈ అనంత విశ్వంలో భాగమే కదా నువ్వు. మరి నీలో కూడా ఇవి వున్నాయి కదా! ఎలా వున్నాయి నీలో అంటే, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మలు. ఆ నలుగురు ఈ నలుగురిగా వున్నారు. అక్కడ విరాట్ ఇక్కడ విశ్వుడిగా వున్నాడు. అంటే విశ్వాన్ని గుర్తిస్తున్నాడు. నీలో వున్న నేను విశ్వాన్ని గుర్తిస్తూవుంది కదా! మెలకువలో. కాబట్టి మెలకువకి సాక్షి ఎవరయ్యా అంటే విశ్వుడు. నువ్వు మెలకువలొ నువ్వు ఆత్మస్వరూపుడు అంటే, వాడి పేరు ఏమిటి? విశ్వుడు. కలలో నేను సాక్షిని అన్నావే అనుకో, ఆ కలలో వున్న జగత్తుకి సాక్షి ఎవరు? ఆ స్వప్న జగత్తుకి సాక్షి ఎవరయ్యా అంటే తైజసుడు. తేజస్వరూపుడన్నమాట. అంటే నీలో ఆ తేజస్సు, కలలో లైట్‌ వెలిగితేనేనా? నీలోపల వెలుగు వుంటేనేనా? కల కనపడేది? లేకపోతే వెలుగు లేకపోతే కనపడుతుందా? గాఢనిద్రావస్థలోకి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది? ఆ వెలుగును గుర్తించే తెలివి పోయింది. కాబట్టి. కలలో మాత్రం నీకు ఆ తెలివి పనిచేస్తుంది. ఏ రూపంలో? వెలుగు రూపంలో పనిచేస్తుంది. ఆ వెలుగే సాక్షి. అది తైజసుడు. అది లేకపోతే కలలేదు. కాబట్టి ఆ తైజసుడన్నమాట, నీ కలలో సాక్షి ఎవరయ్యా అంటే తైజసుడు. అలాగే కారణమైనటువంటి, కారణ జగత్తు అయినటువంటి గాఢనిద్రావస్థలోకూడా ఒక నేను వున్నాడు. వాడు ఎవడయ్యా? ప్రాజ్ఞుడు. ప్రజ్ఞాస్వరూపుడు అన్నమాట. ఆ కలలో, గాఢనిద్రావస్థలో మేల్కొనివున్న సాక్షి ఎవడైతే వున్నాడో వాడే ప్రజ్ఞాస్వరూపుడు. ఆ ప్రజ్ఞే నీకు కలలో పనిచేస్తుంది. మెలకువలో కూడా పనిచేస్తుంది. కాబట్టి నీవు ఎవరివయ్యా? ప్రజ్ఞాస్వరూపుడవు. నీవు ప్రజ్ఞానం. అంతేగాని, శరీరం అనుకుంటున్నావు. కానీ నువ్వు శరీరం కాదు. నీ నేను ఎవరు? ఆ ప్రజ్ఞానం. ఏదైతే గాఢ నిద్రావస్థలో ప్రాజ్ఞుడిగా, ప్రజ్ఞానఘనంగా వున్నదో, అదే కలలో, మిగిలిన వాటిల్లో, మెలకువలో మిగిలిన వాటిల్లో ప్రతిబింబిస్తూ వున్నది. ఆ స్వప్రకాశ జ్ఞానమే కిందవాటిల్లో ప్రతిబింబిస్తూ వున్నది. ప్రతిఫలిస్తూ వున్నది. ప్రకాశిస్తూ వున్నది. ఈ సత్యం తెలుసుకో! మరి దీనికంటే అవతల ఒకటున్నది కదా! ఏమిటది? తురీయం. నాల్గవ స్థితి తురీయం. అయితే ఇది నాల్గవ స్థితా? నాలుగో స్థితి కాదు. ఈ మూడు అవస్థలలోనూ అంటే మెలకువ, కల, నిద్ర మూడు అవస్థలలోనూ ఒక సాక్షి ఎవడైతే వున్నాడో, ఈ సాక్షి మూడు అవస్థలలోనూ గనుక సాక్షిత్వం పొందితే అప్పుడు వాడికి ఏం లేకుండా పోయినాయి? మెలకువా, కల, నిద్ర లేకుండా పోయినాయి. అలా లేకుండా పోయినటువంటి స్థితి. ఎఱుక. దానినే ఎఱుక అన్నారండీ! ఆ ఎఱుక స్థితి పేరేమిటంటే తురీయం. దాని పేరు ఏమిటండీ? తురీయము. దాంట్లో వున్న సాక్షి ఎవరయ్యా? ప్రత్యగాత్మ. ప్రత్యక్‌+ ఆత్మ. నీ యందు వున్నది ఆత్మ, నా యందు వున్నది ఆత్మ. ఆవెడ యందు వున్నది ఆత్మ. అంతటా వున్నది ఆత్మ. ఇట్లా ప్రతిచోటా ప్రత్యక్‌ ఆత్మ. అది ప్రత్యగాత్మ. అర్థమైందా అండీ! అంతా ఆత్మ స్వరూపముగా చూడగలగడమే ప్రత్యగాత్మ. ఆత్మానుభవం కలుగుతుందన్నమాట అప్పుడు. కాబట్టి వ్యష్టిగా చూస్తే నేమో, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మలు. మీరు ఎప్పుడైనా సరే జగత్తుని చూశారు, ఓహో! ఈవెడ చాలా అందంగా వున్నదండీ అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి? ఓహో! నాలో ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు? అయితే కన్ను పనిచేస్తోంది, కన్నుకు దృశ్యవిషయం పనిచేస్తున్నది. ఈ దృశ్యవిషయం ద్వారా నాకు ఆనందం కలుగుతున్నది. మెలకువలోనే కదా! కానీ ఈ ఆనందాన్ని గమనిస్తున్నవాడు ఎవడు? ఈ ఆనందాన్ని గమనిస్తున్నవాడు ఎవడు? నేను. ఈ నేను పేరు ఏమిటి? విశ్వుడు. సాక్షిగా వుంటేనేమో విశ్వుడివి అయ్యావు. లేకపోతే ఒక మెట్టు కిందకు దిగి, ఆనందంలోకి దిగేశావు అనుకో, విషయంలోకి వచ్చేశావు. ఇంకా ఒక మెట్టు దిగావనుకో, ఆ దృశ్యమే సత్యం. అందంగా వుండడమే సత్యం. ఇంకా ఒక మెట్టు దిగావనుకో, ఈవెడతో పాటు నేను స్నేహం చేస్తే బాగుండు, ఆవెడను అలా చూస్తే బాగుండు, ఇలా చూస్తే... ఇంకా దిగిపోయావన్నమాట. ఇంకా కిందకి దిగావు, ఇలాగ ఇలా దిగిపోతూవుంటావన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే, ఉదాహరణ చెబుతున్నాను మీకు. ఏదైనా ఒక దృశ్యజగత్తు, ఈ జగత్తు అంతా దృశ్యమే కదండీ! ఏదైనా సరే! ఒక దృశ్య జగత్తు వున్నదండీ! ఆ దృశ్యజగత్తులో దృశ్యాన్ని చూశావు. చూడగానే ఏమైంది? (ఆనందం) వెంటనే ఆనందం కలుగలేదు. ఇదంతా ఒక రెప్పపాటులో లోపల జరుగుతూ వుంటుంది. ఈ రెప్పపాటు కాలాన్ని నువ్వు చక్కగా విచారణ చెయ్యి. విభజించు. ఏం చెబుతున్నాడు? నేను ఎవరిని? నేను ఆత్మ స్వరూపుడిని. మెలకువలో ఎవరిని? విశ్వుడిని. అంతేకదా! ముందు మెలకువలో విశ్వుడు రావాలండీ! తరువాత తైజసుడి సంగతి, ప్రాజ్ఞుడి సంగతి. మెలకువలో సాక్షిత్వము రాకుండా వస్తుందా బయట? కలలో, నిద్రలో రాదన్నమాట. కాబట్టి మెలకువలో ఎదైన ఒక పనిలో నువ్వు దిగే ముందు, ఒక ఆలోచనలో దిగే ముందు, అది తప్పనిసరిగా ఎదో ఒక జ్ఞానేంద్రియానికి సంబంధించిన విషయమై వుంటుంది తప్పనిసరిగా. అంతే కదా! ఒకడు ఎవరో మంచిగా వాయిద్యం ఏదో వాయిస్తున్నారండీ! సంగీతం విన్నాము. ఓహో! అద్భుతంగా వాయిస్తున్నారు. అనుకున్నావు నీకు భావన కలిగింది. కలగంగానే ఏమయ్యింది? ఎవరి విషయం ఇది? (శ్రవణానందం) శ్రవణేంద్రియ విషయం. అంతేకదా! శ్రవణేంద్రియం శబ్దాన్ని గ్రహించింది. నేను ఎవరిని? దాని పక్కన ఏం జరిగింది? శ్రవణేంద్రియం వుంది. ఆ ఇంద్రియం శబ్దాన్ని విన్నది. ఆనందించింది. మూడు స్థితులు వున్నాయా లేవా? ఇప్పుడు. ఇంద్రియము వున్నది, దాని విషయము వున్నది, దానికి సంబంధించిన ఆనందము వున్నది. నేను ఎవరిని? నేను గమనించేవాడను. ఆనందాన్ని కూడా గమనించాను. నేను ఎవరిని? సాక్షిని. నేను ఆత్మస్వరూపుడను. ఇప్పుడు ఎవరిని నేను? సాక్షిగా వున్నంత సేపు విశ్వుడు. సాక్షిత్వం పోయింది, ఆహా! ఏం పాడిందండి అద్భుతంగా అన్నమాచార్య కీర్తన. ఈవెడలాగా ఎవరూ పాడలేదండి అన్నావు. ఏమైంది ఇప్పుడు? ఆనందంలోకి దిగావు కదా! ఇంకేం చేశావు? ఈ పాడే ఆవెడ ఎవరో ఈవెడను చూసొద్దాం వెళ్ళి. ఎక్కడకు వెళ్ళింది ఇప్పుడు? సాంతం విషయం దాకా వెళ్ళింది. అక్కడి దాకా వెళ్ళేటప్పటికి ఇప్పుడు శబ్దం విషయం పోయింది, ఆవిడ పాట, ఆవెడ శబ్దం పోయింది. అది పోయి ఏమి వచ్చింది ఇప్పుడు? మనిషికి వచ్చేసింది వ్యవహారం. కన్నుకు వచ్చేసింది. దృగ్విషయానికి వచ్చేశావు. అర్థమైందా అండీ! ఇలాగ ఒకదాని తరువాత ఒకటి విషయసముదాయం పనిచేస్తూ వుంటాయి. అంటే ముందు ఏదో ఒకదానితో మొదలౌతూ వుంటుంది. మొదలైనప్పుడే దానిని నువ్వు చక్కగా పట్టుకున్నట్లయితే, దాంట్లోనుంచి రెండవది, మూడవది, నాల్గవది, ఐదవది రాకుండా వుంటాయి. కానీ ఏం జరుగుతోంది ఇప్పుడు? శబ్దం దగ్గర మొదలు పెడుతావు. తరువాత రూపం - వెళ్ళావు. తరువాత శబ్దం, రూపం అయిపోయిందిగా. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు కదా! ఏం చేశావు? ఆ స్పర్శ, రూపం పనిచేశాయి. ఆ తరువాత గంధం. ఆ తరువాత రసం. దాన్ని అనుభవించాలి. ఆ విషయాన్ని అనుభవించాలి. దాన్ని ఆశ్రయించాలి. దాంట్లో మునిగిపోవాలి. సాంతం మునిగిపోయి దుఃఖం వచ్చినాక అప్పుడు కళ్ళు తెరిచి, ఎందుకు వచ్చింది ఈ దుఃఖం? అని విచారణ చేశావు. చేస్తే ఏం తేలింది? నాకు ఎందుకు వచ్చిన గోల ఇది. అనుకున్నావు. కానీ ఎప్పుడు? అంతా సాంతం పుట్టి మునిగిన తరువాత, ప్రయోజనం ఏముంది? దాని వలన నాకు ఏం ప్రయోజనం వచ్చింది? పశ్చాత్‌ తాపం వల్ల ప్రయోజనం లేదు. మళ్ళా మొదటికి వచ్చేశావు. కాబట్టి నీవేం చెయ్యాలయ్యా? నీవు మెలకువలో సాక్షివి అని తెలుసుకో! విశ్వుడు అని తెలుసుకో! స్వప్న సాక్షివి తైజసుడవి అని తెలుసుకో!
            కల ఏదన్నా జరుగుతూ వుంది. ఇప్పుడు నేను ఎవరిని? ఈ కలని గమనించేవాడను. అంతేకదా! ఈ కల నేను కాదు కదా! కలయందు వున్నటువంటి కదులుతున్న రూపములుగానీ, ఆ మాట్లాడే మాటలు కానీ, ఆ శబ్దార్థములు గానీ, అక్కడ జరుగుతున్న సంఘటన కానీ, అవన్నీ నా కల్పితములు. నా మనసే కల్పించింది. నేను ఎవరిని? సాక్షిని కదా! ఆ స్వప్నంలో ఏం జరిగినా కానీ, అది నేను అవుతానా? అవ్వను కదా! నేను ఎవరిని? తైజసుడను కదా! తేజస్వరూపుడను కదా! ప్రకాశ స్వరూపుడను కదా! నేనే లేకపోతే ఆ కల వుందా? సాధ్యం కాదు కదా! శవానికి కల వుందా? లేదు కదా! అర్థమైందా అండీ! కాబట్టి నేను అనే చైతన్యం వుండబట్టే, ఆ కల పనిచేస్తూ వున్నది. అంతే కదా! తరువాత ఏమైంది? కారణ జగత్తు గాఢ నిద్రావస్థ. సాంతం మునిగిపోయావు. మునిగిపోకుండా వుంటే, నేను అనే తెలివి వుంటుంది. అది ఎలా వుంటుందయ్యా? నీకు మత్తు ఇస్తారు కదా ఎప్పుడన్నా? మత్తు ఇచ్చిన అనుభవం వుంటే, ఆ మత్తు ఇచ్చినప్పుడు నేను పనిచేస్తూనే వుంటుందండి. తెలివి వుంటుంది. అడుగుతాడు నిన్ను, మాట్లాడుతూ వుంటాడు నీతోటి. నీకు అంతా మట్లాడుతూవుంటే నీవు తెలివిలో వున్నట్లు అన్నమాట. అది కోల్పోతే పెద్ద ప్రమాదం. కోమాలోకి అటే వెళ్ళిపోతావు. అందువల్ల ఆ మత్తు ఇచ్చినప్పుడు ఎట్లా అయితే వుంటుందో, నేను పనిచేస్తూనే వుంటుంది. అన్నీ తెలుస్తూనే వుంటాయి. కానీ బాధ తెలియదు. సుఖ దుఃఖాలు తెలియవు అక్కడ. ఇప్పుడు నీ గాఢ నిద్రావస్థలో కూడా ఎలా వున్నావు నువ్వు? ఆ నేను అలాగే వున్నది. ఇంద్రియాల యొక్క ప్రభావం లేదు. మనసు బుద్ధి ప్రభావం లేదు. కానీ, అన్నీ పనిచేస్తూనే వున్నాయి. కానీ నీకు తెలియడం లేదు. నువ్వు వేరుగా వున్నావు. అర్థమైందా అండీ!
            నువ్వు ఎక్కడున్నావో తెలుస్తోంది, సగం తెలివి వుంది. ఆ సగం తెలివి పనిచేస్తూనే వుంది. ఆ నేను నేనుగానే వున్నది. నిద్రపోయేది నిద్రపోతూనే వున్నది. మళ్ళా ఏమైంది? మళ్ళా కాసేపైనాక మేల్కొన్నది. కలలోకి మేల్కొన్నది, తరువాత మెలకువలోకి వచ్చేసింది. ఇది రోజూ నిద్రలో జరిగే కార్యక్రమం. ఇలాగ విశ్వ తైజస ప్రాజ్ఞ పత్యగాత్మలనే నాలుగు సాక్షులు, అలాగే వీటియొక్క సమిష్టి సాక్షులు ఎవరు? విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు. మనం పరమాత్మ పరమాత్మ పరమాత్మ అంటాము కానీ, ఆ పరమాత్మ స్థితిలో కూడా ఆ నాలుగు విభజనలు వున్నాయన్నమాట. అంటే ఏమిటి? విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలనే నాలుగు స్థితులయొక్క అనుభవము వస్తే గానీ, పరమాత్మ అనుభవము పూర్తి అవ్వదు. అట్లాగే విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మ స్థితుల యొక్క అనుభవం వస్తే కానీ ఆత్మానుభవం పూర్తి అవ్వదు. కాబట్టి ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగినా పరమాత్మ సాక్షాత్కారం కలిగినా ఈ నాలుగు స్థితుల యొక్క అనుభవం కోసమే జరుగుతుందన్నమాట. అయితే ఇవన్నీ జరగాలి, ఇవి జరిగితే ప్రయోజనం ఏంటయ్యా అంటే, మరణం నిన్ను ఏమీ చెయ్యజాలదు. జననమరణముల జడుపు తీరెను - ఇందాక అంతా ఏం చెబుతున్నాడు? అంతా జనన మరణం మీదే మాట్లాడుతున్నాడు. మరణం మీద నీకు ఎప్పుడైతే భయం లేకుండా పోయిందో, మరణాన్ని నువ్వు ధిక్కరించగలిగే సామర్థ్యం ఎప్పుడైతే నీకు వచ్చిందో, అప్పుడేమైందంట? నీ జననం గురించిన గోలే లేదు. పుడితే పుడుతుంది శరీరం, పోతే పోతుంది. అనే స్థితిలో సహజంగా వుంటాడు. ఇంక ఎప్పుడైతే మరణాన్ని అధిగమించేసేస్తాడో, అప్పుడు ఏంటట? శరీరమును వదలెను. చివరి స్థితిలో ఎలా వుంటాడండి? శరీరమును వదిలేశాడు. వదిలేస్తే మళ్ళారాదు. విడిస్తే మళ్ళా వస్తుంది. ఇప్పుడు మనము అందరం ఏం చేస్తున్నాము? శరీరము విడుస్తున్నామా? వదల్తున్నామా? విడుస్తున్నాము. తెలిసి అయినా, తెలియక అయినా శరీరాన్ని విడుస్తున్నాము. అర్థమైందా అండీ! శరీరాన్ని విడిస్తే ఏమైంది? మళ్ళా శరీరము వస్తుంది. అలాగే ఏ సాధనైనా గానీ, ఏ విషయమైనా కూడా, విడిచే ప్రయత్నం చేయకూడదు. వదిలే ప్రయత్నం చేయాలి. అది నిన్ను వదిలేయాలి. అది నిన్ను వదిలేసే పద్ధతిగా నువ్వు జీవించాలి. అంటే అర్థం ఏమిటి? ఆ విషయం నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడే, నువ్వు దాని జోలికి వెళ్ళాలి. నువ్వు విషయాన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. మొదటి నియమం అది.
            ఇప్పుడు మనమందరము ఏమి చేస్తున్నాము? విషయాన్ని వెతుక్కుంటా వెళ్తున్నాము. అర్థమైందా అండీ! విషయాన్ని వెతుక్కుంటా వెళ్ళినంత కాలం, తప్పనిసరిగా దాని చేత బాధించబడక తప్పదు. ఏం చెయ్యాలట? ముందు నువ్వు ఎట్లా జీవించాలి? ఏ శబ్ద స్పర్శ రూప రస గంధాలకు సంబంధించిన ఏ విషయమైనా, నిన్ను వెదుక్కుంటూ అది వచ్చేవరకూ వేచి వుండి నిగ్రహించగలగే సామర్థ్యం వుండాలయ్యా! ఈ నిగ్రహం పేరే ఇహముత్రార్థఫలభోగ విరాగము. సాధన చతుష్టయ సంపత్తిలో రెండవది. అర్థమైందా అండీ! విషయమే నిన్ను వెతుక్కుంటూ వచ్చేటటువంటి నిగ్రహాన్ని కలిగి వుండటం ఏమిటయ్యా అని అంటే ఇహముత్రార్థ ఫలభోగ విరాగము. అంటే అర్థము ఏమిటి? ఇహం అంటే ఏమిటి? లోకానికి సంబంధించినది, శరీరానికి సంబంధించినది, జగత్తుకు సంబంధించినది, జీవుడికి సంబంధించినది, ఎన్నన్నా, ఎట్లా అన్నా చెప్పుకోండి. ఇదంతా ఇహం. అంటే మార్పు చెందేది అని అర్థం. ఇహం అంటే సూటైన అర్థం ఏమిటంటే, మార్పు చెందుతూ వుండేది. పరం అంటే ఏమిటంటే, మార్పు చెందనిది. శాశ్వతం. సనాతనం. ఆద్యంతములు లేనిది అని ఇహం-పరం అంటే అర్థం ఇది. (అందుకే అంటారు ఇహం లేదు పరంలేదు) ఎప్పుడు లేదు? బృహద్వాశిష్టము ఆ చివరిది, అక్కడిదాకా పరమాత్మ కూడా లేడు, విశ్వం కూడా లేదు అనే స్థితికి మాట్లాడితే పరం లేదు. అప్పుడే ఎక్కడ పరంలేదు. అసలు పరం తెలిస్తే కదా! ఇంకా పరమే తెలియలేదు. ఇహంలోంచి బయటపడా లేదు. కాబట్టి మనవాళ్ళు, పూర్వ వ్యక్తులు ఏంటంటే అన్నీ చెప్పారు. అవి అనుచానంగా, మాటలుగా వచ్చాయి గానీ, విషయం తెలియదు. దాని వల్ల ప్రయోజనం ఏముంది? జ్ఞానం లేకపోవడం వల్ల. అవునండీ! ఎవరు అన్నారు? ఆకాలంలో ఎవడికైతే, చిట్టచివరి వరకూ పరిపూర్ణం వరకూ తెలిసినవాడు వున్నాడో, పరమాత్మకూడా లేడు అనే స్థితి తెలిసినవాడు అన్నమాట అది. (అబ్బా! అది చివరకు వాడుకై పోయిందే తప్పితే, అర్థం కాలేదన్నమాట) ప్రయోజనం ఏముంది? మనం రోజువారీ, మీరు రోజువారీ మాటలాడుకునే మాటల్లో చాలా అంశాలు వున్నాయి. కానీ అవేమీ మీకు తెలియవు కదా! విచారణ లేదు కదా! దాని యొక్క లోతైన విచారణ వుంటే కదా అసలు మీరు ఎందుకు అంటున్నారో, ఏమంటున్నారో (అనడమే కానీ, ఎందుకంటున్నారో విచారణే లేదు) ప్రయోజనం ఏముంది? ఒకటి గుర్తు పెట్టుకోండి. విద్యమీద ఆకాంక్ష వున్నవాడు, తహ వున్నవాడు దానిని నేర్చుకునే ప్రయత్నం చేస్తూనే వుంటాడు. కాబట్టి ఇహముత్రార్థ ఫలభోగ విరాగంలో, దానిని ఏమిటి చెయ్యాలయ్యా అంటే, మనకి ఏముందంట? ఇహం అంటే ఏమని చెప్పాను? మార్పు చెందేది, ఈ మార్పు చెందే దాంట్లో, ఫలభోగం వుంటుందంట మనకి. మనం దేనిని ఆశ్రయించాము ఇప్పుడు? ఫలితాన్ని అనుభవించాలి. అనేదానిని ఆశ్రయించాము. ఇదంతా ఏమిటి? ఇహం కదా! మార్పు చెందుతూ వున్నది. ఈ మార్పు చెందే దాంట్లో విషయం వున్నది. ఆ విషయంలోకి నువ్వు ఎందుకు వెళ్తున్నావయ్యా! అసలు నువ్వు ఇంతకీ? ఆ మార్పు చెందే విషయంలోకి ఎందుకు వెళ్తున్నావు? ఫలబోగాన్ని అనుభవించడం కోసం, ఆ ఫలితాన్ని భోగించాలి, అనుభవించాలి. అనేటటువంటి దాని చేత వెళ్తున్నావు. ఆ భోక్త ఎవడైతే వున్నాడో, వాడు అందులోకి చేరుతున్నాడు. చేరగానే ఏమయ్యాడు? దాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవిస్తే ఏమైంది? సుఖమో దుఃఖమో వచ్చింది. దాంతో వీడు కూడా మార్పు చెందుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా దాన్ని? విరాగము చెయ్యి. విరాగము ఎందుకు చెయ్యాలయ్యా? అంటే దాంట్లో అనురాగము వుంది కాబట్టి. అనురాగము అంటే అర్థము ఏమిటి? మోహం అంటున్నాడు కదా! మోహం అంటే ఏమిటి? ప్రియ మోద ప్రమోదములనే 3 భావములనీ కలిపితే మోహం అవుతుందన్నమాట. ప్రియం మోదం ప్రమోదములు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మీకు ఎవరైనా కాకినాడ నుంచి పూతరేకులు తెచ్చాడండి. దానిగురించి విషయం ప్రస్తావించాడు. ఎప్పుడో నువ్వు పూతరేకులు తిని వుంటావు కదా! ఆ జ్ఞాపకం స్ఫురించింది. స్ఫురించిన తరువాత ఏమైంది? అప్పుడు తిన్న రుచి ఇందులో రికార్డ్‌ అయ్యి వుంటుంది కదా! మైండ్‌లో జ్ఞాపకం రికార్డ్‌ అయ్యి వుంటుంది కదా! ఆ పూతరేకులు తింటే బాగుండు, పూతరేకులు తింటే బాగుండు అని లోపల ప్రేరణ కలుగుతూ వుంటుందన్నమాట. అది పనిచేస్తూ వుంటుంది. ఆ జ్ఞాపకం వృత్తిగా పనిచేసింది. జ్ఞాపకం జ్ఞాపకంగా వున్నంత సేపూ దానికేమీ ప్రమాదం లేదు. అది ఏమైంది ఇప్పుడు? బయటకు వచ్చింది. వృత్తిరూపంలోకి వచ్చింది. ఆ వృత్తిరూపంలోకి వచ్చినప్పుడు దాని పేరు ఏమిటి? చిత్తం. ఆ వృత్తిరూపంలో లోపలే వున్నప్పుడు దానిపేరు ఏమిటి? చిత్తం. అది ఏం చేసిందట? వృత్తి రూపంలో మొదలయ్యి, ఆ దారం అల్లటం మొదలు పెట్టింది. నువ్వు పూత రేకులు తినాలి, నువ్వు పూతరేకులు తినాలి, నువ్వు పూతరేకులు తినాలి అక్కడున్నయ్యి పెట్టుకో అని, లోపల పనిచేస్తూ వుంటుంది. పనిచేసింది ఏం చేసింది? బుద్ధికి వచ్చేసిందన్నమాట. ఆ ప్రవృత్తి ఏమైందండీ? వృత్తి కాస్తా ఏమైంది ఇప్పుడు? బలపడి ప్రవృత్తి అయ్యింది. ప్రవృత్తి అయ్యి బుద్ధిలోకి వచ్చేసింది. బుద్ధిలోకి రాగానే బుద్ధి ఏం చేసింది? నా దగ్గర దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా వున్నాయేమో అందిస్తా చూడు అంది. ఈ పూత రేకులు పలానా స్వగృహా ఫుడ్స్‌లో వుంటుంది లేకపోతే పలానా బందరు రోడ్డులో వుంటుంది. పలానా చోట వుంటుంది, ఫలానా... తినమని తినద్దు అని ఏం చెప్పదు బుద్ధి. ఇదిగో నీవు ఫలానా అడుగుతున్నావు కదా! దానికి సంబంధించిన వివరాలు నా దగ్గర ఇవి వున్నాయి. అని వివరాలను అందించేస్తుంది. అందించగానే ఇదిగో ఫలానా చోట వున్నాయట కదా! ఫలానా చోట వున్నాయట గదా! ఫలానా దగ్గరకు వెళ్ళమంటోంది కదా! నువ్వు వెళ్ళాలా? మరొకడిని పంపించాలా? నువ్వు వెళ్ళాలా? మరొకడిని పంపించాలా? ఇలా లోపల తిరుగతూ వుంటుంది. దానికి చక్కగా అవకాశం బాహ్యంలో ఏర్పడుతుందన్నమాట. లేదంటే సృజించుకుంటావు. ఏం చేస్తావు వెంటనే, దానికి ఇంకా బలపడిందన్నమాట. ఇప్పుడు ఏమిటంటే, ప్రియంగా వున్నప్పుడేమో వృత్తి రూపం అండి, ప్రియంగా వున్నప్పుడు వృత్తి, చిత్తం రూపంలో ప్రియంగా వుంటుందన్నమాట. ప్రియం అక్కడ. ఏమైంది ఇప్పుడు? బుద్ధి రూపంలోకి వచ్చింది. కిందకు వచ్చేసింది కదా! బుద్ధి ఏం చేసింది ఇప్పుడు? మనసును అడిగింది. నువ్వు వెళితే బాగుంటుందా? మనసు ఏం చేసిందిప్పుడూ? వాడిని పంపిద్దామా? వీడిని పంపిద్దామా? వీడిని పంపిద్దామా? వాడిని పంపిద్దామా? లేక మనమే వెళదామా? ఇది మనసన్నమాట. ఐదారు రకాలుగా ఆలోచించేది మనసన్నమాట. బుద్ధి ఏం చేసింది? బుద్ధి ఏమీ ఆలోచించదండీ! దానికి సంబంధించిన జ్ఞాపకాలలో వున్న వివరాలను అందిస్తుంది అంతే. దాని పని అంతే. మనసు ఏం చేసింది? దీనిని సాధించాలి. సాధించే మార్గం అన్నమాట. మనస్సు సాధనోపాయం ఎప్పుడూ కూడా. అందుకనే మనసుని ఆపేయాలి, నిలిపేయాలి, సున్నా చెయ్యాలి ఇదంతా తరువాత విషయం. ముందు ఏం చేయాలి? మనసే సాధనోపాయం ఎప్పుడూ కూడా. అన్నిటికీ సాధనోపాయం మనసే. దానిని నువ్వు గమనించి జాగ్రత్తగా వాడుకుంటే, దానంత వుత్తమమైన పనిముట్టు ఏదీ లేదు. కానీ ఆ మనసుని మనం పనిముట్టుగా వాడుకోవడం చేతకాక ఏమైపోయాము అంటే విషయానికి లోబడుతున్నాము. చక్కగ ఈ మనసు ఏంచేసిందట ఇప్పుడు? నాలుగు రకాలుగా ఆలోచించ గలిగే సామర్థ్యం వున్నదండీ దీనికి. ఈ నాలుగు రకాలుగా ఆలోచించే మనసే లేకపోతే, మనిషివి ఎలా అయ్యావు? కాబట్టి నువ్వు మనిషివి అయ్యావంటే, ఆ మనసనే సాధనోపాయం నీ దగ్గర వుండబట్టే. ఇదే బంధానికి మోక్షానికి కారణం కూడా. దీనిని ఎటు తిప్పితే బంధం అవుతుంది? ఎటు తిప్పితే మోక్షం అవుతుందో తెలుసుకో గలిగితే అదే సాధన. సాధన అంటే వేరే ఏమీ లేదు. ఈ మనసును ఎటు తిప్పితే, నీకు బంధం ఏర్పడుతున్నది? ఎటుతిప్పితే దాంట్లోనుంచి బయట పడిపోతున్నావు? ఇది తెలుసుకోవడమే సాధన. దానికోసమే ఈ సాధన చతుష్టయ సంపత్తిని పెట్టిందండి. ఇదంతా మనస్సు, బుద్ధి, చిత్తం దీనిమీదనే మాట్లాడుతూ వుంటుంది సాధన చతుష్టయ సంపత్తి అంతా కూడా. అందుకే నిన్నేంచెప్పారు? నిత్యానిత్య వస్తు వివేకము. ఎవరు విచారణ చెయ్యాలి? అంటే చిత్తము, బుద్ధి మధ్యలో విచారణ చెయ్యాలన్నమాట. ఆ నిత్యానిత్య వస్తు వివేకం ఎక్కడ చేయాలండి? వృత్తి కలగగానే ప్రియం, చిత్తంలో వృత్తి ప్రియం రూపంలో కలుగగానే, ఈ బుద్ధి మనకు వివరణ, విచారణ అందిస్తుంది కదా! ఆ వివరణ, విచారణ అందించేటప్పుడే, వేదాంత వాక్యాలతో కూడిన విచారణ అందించాలన్నమాట. అసలు బుద్ధి. కానీ ఏమి అందిస్తోంది? విషయాలకు సంబంధించినటువంటి వివరాలను అందించడం చేత, మనసుకూడా సాధనోపాయం ఎందులో పనిచేస్తుంది? విషయాల రూపంలో పనిచేస్తుంది. కాబట్టి ఈ ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము నీకు సరిగా వుండాలంటే, ముందు ఏముండాలట? నిత్యానిత్య వస్తు వివేకము వుండాలి. అంటే అర్థం ఏమిటి?
            పూతరేకులు తినాలి అని అనిపించిందండి. అనిపించగానే అది ఎక్కడుందది? చిత్త రూపంలో, వృత్తి రూపంలో, ప్రియరూపంలో వుందన్నమాట. ఆ మోహం కలుగతుందన్నమాట అప్పుడే. ఆ కలుగగానే బుద్ధి ఏం చెయ్యాలి ఇప్పుడు? స్వగృహా ఫుడ్స్‌లో వుందా లేకపోతే బందరు రోడ్‌ లో వుందా వివరాలు అందించకూడదు. బుద్ధుందా నీకు? ఏమైనా వుందా నీకు? ఎంత సేపు తింటావు? మహా అయితే? పోనీ ఒక డజను తింటే ఏమన్నా పనికి వస్తుందా? జీవితం ఏమన్న వెళ్ళమారుతుందా? నీకు బుద్ధి వుందా? అని వేదాంత వాక్యాలు కనుక ఎప్పుడైతే ఇది బుద్ధి రూపంలో, వున్న వివరాలని, జ్ఞపకాలని, వేదాంత వాక్యాల రూపంలో దానికి చెప్పిందో, అప్పుడేమైందట? మనసు దాకా దిగలేదుగా అసలు ఇంకా? చిత్తం వృత్తిరూపంలో వున్న ప్రియం అణగి పోయింది. వృత్తి రూపం ఏమైపోయింది అండీ? ప్రియరూపంలో వున్నప్పుడు బలహీనంగా వుంటుంది. దానికేమీ బలం లేదప్పుడు. అప్పుడు అణగిపోతుంది. ఆ చిత్త వృత్తులు అణగిపోతాయన్నమాట. అణిగిపోతే ఏమైంది? ఇక మళ్ళా కిందకి రాదు ఇక. మనసుదాకా వచ్చి, వాడిని పంపుదామా? వీడిని పంపుదామా దాకా రాదు ఇక. అది అక్కడే అణగిపోతుంది. ( మరి ఆ బుద్ధి ఎప్పుడు అలా వుంటుంది) ఆఁ.. అంటే ఎందుకంటే, బుద్ధిలో మనము ఏం చేశామంటే ఇప్పటి వరకూ విషయానికి అనుకూలంగా వుండే అనురాగంతో ప్రవర్తించే విధానాన్ని ఏర్పాటు చేశాము. అందువల్ల మన దగ్గర ఏమి లేదు? ఇహముత్రార్థ ఫలభోగ విరాగము లేదు. మన దగ్గర ఈ సాధన సంపత్తి లేదు. ఎంతసేపు ఇహ విషయంలో అనురాగంతో ప్రవర్తించడమే. ఆ విషయానికి అనుకూలంగా ప్రవర్తించడమే ఎప్పుడూ కూడా. అంతేగాని, దానిని విచారణ చేసి, వెనక్కి తిప్పుదాము అనేటటువంటి విధానము మనదగ్గర లేదన్నమాట. కాబట్టి ఈ సత్వగుణం, రజోగుణం, తమో గుణం వల్ల అలా విషయాలకు అనుగుణంగా పనిచేయడమే అలవాటు చేసుకున్నాము. ఆ అభ్యాస బలం చేత, బుద్ధిలో మన దగ్గర ఇప్పుడు ఏమున్నాయి? అన్నీ కూడాను? దానికి అనుకూలంగా చెప్పడమే. అంతేగాని  దానిని తిప్పటం, నిరసించగలిగే సామర్థ్యం లేదన్నమాట మన దగ్గర. కాబట్టి గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు మీరు అతను చెప్పినటువంటి వేదాంత వాక్యాలలో ఏముంటాయండీ? నిరసించడం వుంటుందన్నమాట అంతా కూడా. విరమించడం.  నిరసించడం. ఆ ప్రియమనేటటువంటి స్థితిలో నుంచి విరమించడం. ఆ వృత్తిని వెనక్కి తిప్పటం. ఈ పద్ధతిలో వాక్యాలు చెబుతూ వుంటాడు. ఈ వాక్యాలను నువ్వు బుద్ధిలో నిక్షిప్తం చేసుకోవాలి నాయనా! ధారణ చేయాలి నాయనా! అందుకే చెప్పేది. నువ్వు శ్రద్ధతో వింటే తప్ప సాధ్యం కాదు. ఎందుకని? ఒకసారి చెప్పినట్టు మరోసారి చెప్పరు. ఒకసారే చెబుతాడు. మళ్ళా ఆ వాక్యం మరోసారి చెబుతాడో లేదో, ఆయనకు తెలియదు, నీకు అంతకంటే తెలియదు. కాబట్టి వేరే వేరే అన్యథా పోకుండా, గురుస్థానంలో వున్న గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పేటటువంటి విషయాలను యథాతథంగా ఆ వాక్యాన్ని ధారణ చేయి. చేస్తే ఏమౌతుందట? ఆ వాక్యం నీకు, నీకు ప్రియమైన వృత్తి చిత్తంలో ఆ ప్రియమైన వృత్తి కలిగినప్పుడు, వెంటనే ఈ వాక్యం నిద్ర లేస్తుంది. లేచి ఏం చేస్తున్నావు? అక్కడ ఏం చెప్పాడు ఆయన? అక్కడ శాస్త్రం ఏం చెబుతోంది? మొన్న ఏం విన్నావు? ఏం చేసి వచ్చావు? ఏం చెప్పాడు అనుభవజ్ఞానం వున్నటువంటి వాళ్ళు. దీనివల్లే నీకు దుఃఖం కలుగుతోందని చెప్పాడు కదా ! దీన్ని మార్చుకోమని చెప్పాడు కదా! ఈ ప్రియం అనే వృత్తే కదా ప్రమాదకరమైనటువంటిది. ఇదే కదా నిన్ను శరీరం అనుట్టుగా చేస్తు్న్నది. ఇదే కదా నిన్ను జీవుడు అనేట్టుగా చేస్తున్నది. ఇదే కదా మూడుగుణాల్లోకి నిన్ను దించుతోంది. అన్ని దుఃఖాలకు ఇదే కదా మూలకారణం. ఈ మోహమే కదా నీకు సమస్య. దీన్ని వదిలించుకోమనే కదా ఆయన చెబుతున్నాడు. ఇలాగ బుద్ధి వేదాంత వాక్యాలనన్నింటినీ చక్కగా అందిస్తుందన్నమాట. అందించగానే ఏమైంది ఇప్పుడు? చిత్తంలో వున్న వృత్తి అణిగిపోయింది. ప్రియం అనే వృత్తి అణిగిపోయింది. అప్పుడు మోహం కాస్తా లేకుండా పోయింది. మోహక్షయమే మోక్షం. మోహం క్షయించిపోతే మోక్షమే.

మిగిలివున్న స్థితి పేరు మోక్షం. అంతేగాని కొత్తగా ఏదో ఆకాశం నుంచి వచ్చి దిగిపడేది, ఊడిపడేది ఏమీ వుండదండి. ఈ ప్రియం అనే వృత్తి దగ్గరే దానిని నిలపగలిగి, నిగ్రహించగలిగి, ఈ వేదాంత పద్ధతిలో దానిని విచారణ చేసి, శాశ్వతం ఏది, అశాశ్వతం ఏది, నిత్యం ఏది, అనిత్యం ఏది? అనే పద్ధతిలో విచారణ చేసి, ఇది అనిత్యం కదా, ఆ విషయంలో వున్నటువంటి వస్తువు అనిత్యం కదా, ఆ విషయం యెడల వున్న అనురాగం అనిత్యం కదా, నీవు శాశ్వతం కదా, నేను అనేది అక్కడ ఎలా పనిచేస్తోంది, సాక్షిగా వుండాలి కదా, నువ్వు ఆత్మస్వరూపుడివి కదా! ఎందుకు అందులో చేరుతున్నావు? ఆ పదార్థంలోకి ఎందుకు చేరుతున్నావు? ఆ పదార్థంలో వున్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి ఐదు విషయాల్లోకి ఎందుకు చేరుతున్నావు? ఈ ఐదు విషయాలు మార్పు చెందేవి కదా! అశాశ్వతం కదా! అని ఎప్పుడైతే విచారణ చేశావో, ఏమైంది అప్పుడు? ఆ ప్రియం అనే వృత్తి, అణిగిపోయింది. అది ఇలా విచారణ చేయకపోవడం మూలాన ఏమైందయ్యా? ఆ ప్రియం కాస్తా మోదం అయ్యింది. అంటే అర్థం ఏమిటి? ఒక మెట్టు దిగిందన్నమాట. బుద్ధిలోకి వచ్చి, దానికి అనుకూలమైనటువంటి జ్ఞాపకాలన్నింటినీ సమీకరించింది. సమీకరించి ఇహ నిర్ణయం చేసేసింది. మోదం దగ్గరకి వచ్చేటప్పటికి నిర్ణయం చేసేసింది. నువ్వు అనుభవించాల్సిందే ఏమైనా సరే! ఇక నిన్ను ఆపడానికి వీలుకాదు. అనుభవించాల్సిందే, నువ్వు అనుభవించాల్సిందే, నువ్వు అనుభవించాల్సిందే. దాన్ని పొందవలసిందే, దాన్ని అనుభవించవలసిందే... ఇక భోక్త వచ్చేశాడన్నమాట ఇప్పుడు. అర్థమైందా అండీ ! ఏం చెబుతున్నాడు దాంట్లో భోక్త వచ్చేశాడన్నమాట. ఇప్పుడు అదే కదా! ఇహముత్రార్థ ఫలభోగ విరాగము. ఫలభోగము అనుభవించేది ఎవరు? ఈ భోక్త అన్నమాట. ఈ నిర్ణయం చేసేశాడు. ఏమైనా సరే మామిడికాయి పప్పు తినాల్సిందే. ఏమైనా సరే మామిడికాయి పప్పు తినాల్సిందే. ఏం చేశాడు? మనింట్లో లేదు, ఎవరికో ఒకడికి చెప్పాడు. Urgent గా నేను ఆగ్రాకి వెళ్తున్నాను, నాకు మామిడికాయి పప్పు తినాలనిపించింది, వెంటనే ఏం చేశావు? నాకు అక్కడ ఆగ్రాలో మామిడికాయ పప్పు దొరకదు, నాకు మామిడికాయ పప్పు పెడతావా పెట్టవా? అన్నావు. ఇప్పుడు ఇంట్లో మామిడికాయ వుందో లేదో చూసుకోవాలి కదా! ఈవెడేమి చేసింది, పాపం భర్త గారు అడిగిన వెంటనే ఫోను కొడుతుంది. ఫోను కొట్టంగానే ఆవెడేమి చేసింది పోనీ, ఇప్పుడు ఇంట్లో వుందో లేదో ఆవెడైన చెప్పవచ్చు కదా! ఆవెడ అడక్క అడక్క నన్ను అడిగింది. నేను తేకపోతే ఎలాగా అని బండివేసుకుని ఎక్కడుందో అక్కడకు వెళ్ళి ఆ మామిడికాయ తెచ్చి ఆవిడకు ఇచ్చింది. ఆవెడ మామిడికాయ పప్పు వండేసింది, తినేశాడు, ఆనందపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇంతేకదా! ఇది విషయము అన్నమాట. అంటే ఎందుకు చెబుతున్నాను అంటే, మనం సాధారణంగా మన దగ్గర జరిగేవి చెబితే (స్పష్టంగా అర్థమౌతుందని). ఏమైంది ఇప్పుడు? ఎక్కడ విచారణ చెయ్యాలి? బుర్ర, బుద్ధి వుందా? జీవితంలో ఎన్నిసార్లు మామిడికాయ పప్పు తిన్నాను? ఏమన్నా ప్రమాదం వచ్చిందా ఇప్పుడు? ఆ మామిడికాయ పప్పు లేకపోతే జీవితం వెళ్లమారలేదా? జీవితం ఏమన్నా వెళ్ళమారదా. ఏం తింటే వెళ్ళమారదు? అనేటటు వంటి స్థితిలో కనుక నువ్వు వుంటే, విరాగమన్నమాట. విరాగమంటే ఇది. చిత్తంలో వున్న వృత్తిని వెనక్కి తిప్పగలగటం. ఆ ప్రియం అనేటటువంటి వృత్తిని వెనక్కి తిప్పగలగటం. ఆ ప్రవృత్తిని నివృత్తి చేయడం అన్నమాట. ప్రవృత్తి అంటే ఏమిటి? ఈ విషయం వెంబడి పోవడం ప్రవృత్తి. వెనక్కు తిప్పితే నివృత్తి. (మోదం అన్నావు ప్రమోదం అంటే?) చెప్తా, చెప్తా.. కంగారు పడవద్దు. విషయం అంటే ఏమిటి ఇప్పుడు? ఇలా వస్తుందన్నమాట విషయం. ఈ విషయానికి సంబంధించి బుద్ధిలో వెతికితే, అనుభవం వచ్చింది ఇలాగ. ఈ అనుభవం వచ్చేప్పటికి ఏమైంది? అనుభవానికి రావాలి కదా ఇది. ముందు నిర్ణయం చేసేశావు కాదా, ఏమైనా సరే అనుభవించాలి అని నిర్ణయం చేసేశావు కదా! ఇప్పుడు ప్రమోదం అది. అంటే ఏంటంటే నిలపడానికి వీలుకాదు. ఎంతగా దిగేశావు అంటే, ఇంద్రియాలలోకి దిగేశావు ఇక. సాంతం. మనసుకూడా అయిపోయింది. సాంతం రసనేంద్రియంలోకి వచ్చేశావన్నమాట. వచ్చేసేటప్పటికి ఏమైంది? తినక ముందే నీవు పూర్వం తిన్న అనుభవం లోనుంచి, ఆ జ్ఞాపకంలోనుంచి, తిన్న అనుభవ జ్ఞాపకం లోనుంచి. మళ్ళా తినాలి, మళ్ళా తినాలి, మళ్ళా తినాలి అని బలీయమైపోయిందన్నమాట అది. ఎంతగా బలీయమైపోయింది అంటే, ఆ మళ్ళా తినాలి అనేది ఎప్పటికీ అలానే వుంటుంది ఇక అది. అర్థమైందా అండీ! (అందుకే ఇంత బలంగా వుంటుంది). అవి ప్రమోదస్థాయిలో వున్నవి అన్నమాట. మనం ఇప్పుడు అంతాకూడా ఎక్కడున్నాము అంటే, ప్రమోద స్థాయిలో వున్నాము. ప్రమోదస్థాయిలో వుండేటప్పటికి ఏమైంది? ఇక తిప్పటానికి వీలుకాదండి. అనుభవించడమే. ఇక భోక్త అయిపోయాడు already. ఎందుకని? పైన అనుభవించు అని, అనుభవించాలని నిర్ణయించేశాడు కదా! ఆ అనుభవించాల్సింది నిర్ణయం చేసేటప్పటికి ఏమైపోయాడు? నేను అనే 'కర్త', భోక్త అయిపోయాడు. ప్రియం మోదం ప్రమోదంలో ప్రియంగా వున్నప్పుడేమో నేను కర్తగా వున్నాడు. అనుభవించాలి మోద స్థాయికి వచ్చేటప్పటికి భోక్త అయ్యాడు. ఈ భోక్త ప్రమోద స్థాయికి వచ్చేటప్పటికి సాంతం విషయంలోకి కూరుకుపోయాడు. ఇది మోహం అన్నమాట. ఇది మోహం అంటే. ఇదే జీవుడుకి వున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఇదే, అన్నింటిలో ఇదేనండి. ఈ సూత్రాన్ని మీరు అన్నింటిలో వుపయోగించాలి. చక్కగా. వుపయోగించి చూడాలన్నమాట. ఇప్పుడు ఏమిటిది? ఇది ప్రియం స్థాయిలో వుందా? మోదం స్థాయిలో వుందా? ప్రమోదం స్థాయిలో వుందా? ప్రమోదం దాకా వచ్చేసింది. ఇహదానిని భూప్రపంచంలో ఎవ్వరూ, సాక్షాత్‌ ఈశ్వరుడు వచ్చి, నీ ఎదురుగుండా నిలబడి నిన్ను ఆపడానికి ప్రయత్నించినా వీలుకాదు ఇక. (తిప్పలేరుదానిని) దాన్ని తిప్పలేవు అంతే ఇక. (ఆ time కేనా, ఆ తరువాత ఎప్పటికైనానా?) ఎప్పటికైనా సరే! నువ్వు ప్రమోదస్థాయిలో వుంటే, నిన్ను ఎప్పటికీ, ఎవ్వరూ తిప్పలేరు. దాన్ని ఏం చెయ్యాలట? అందుకనే ఏం చెబుతున్నారు? అందుకే క్రమవిచారణ చేయిస్తారు. ఎట్లా అంటే, నిన్ను అసలు, నువ్వు భోక్తగా అవ్వకుండా వుండే పద్ధతిలో నిన్ను ఇక్కడ మాట్లాడుతూ వుంటాము. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే విధానము అంతా ఎక్కడ మాట్లాడుతున్నాము? తురీయానికి సాక్షివి. నీ చిత్తానికి సాక్షివి. నేను ఎవరు? ఆత్మస్వరూపుడను. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలట? ప్రియాన్ని వెనక్కు తిప్పాలన్నా, మోదాన్ని వెనక్కుతిప్పాలన్నా, ప్రమోదంలో నుంచి నిన్ను వెనక్కు తేవాలన్నా, నువ్వు మొట్టమొదట ఏం చేయాలట దానిని అనుభవించేటప్పుడు నేను ఆత్మస్వరూపుడను అనే పద్ధతిలో అనుభవించు, నేను సాక్షిని అనే పద్ధతిలో అనుభవించు. అప్పుడు ఏమైందట? అనుభవించేటప్పుడైనా కొంచెం ఎడం ఏర్పడింది. సాంతం మునిగిపోకుండా కొంచెం ఎడం ఏర్పడిందన్నమాట. కొంచెం ఎడం ఏర్పడితే అసలు ఇది ఏమిటని చూసే అవకాశం వచ్చింది. అర్థమైందా అండి? పెద్ద జాడీలో ఆవకాయ కలుపుతున్నామండి. ఆవకాయ నువ్వు అవుతావా? అవ్వవు కదా! చుట్టూ నలుగురు చూస్తూ వున్నారండీ! వాళ్ళకు వింతే. అర్థమైందా అండీ! వాళ్ళేదో మధ్యలో రకరకాల ప్రశ్నలు వేస్తూవుంటారు. అది అట్టాగ, ఇది ఇట్టాగ, అది అలా ఎందుకు చేశావు, ఇది ఇలా ఎందుకు చేశావు. వాడికేమో విషయం తెలుసుకోవడం, నీకేమిటి? విషయాన్ని అనుభవించటం. కదా! ఇప్పుడు మీరు చూడండి ఒక్కసారి. ఎప్పుడైనా నేను గమనిస్తూ వుంటా, ఆ కలిపే వాళ్ళని. మహదానందపడిపోతూ కలుపుతూ వుంటారు. ఇప్పుడు అందులో కలిసిపోయేది ఎవరు? అది ఆవకాయ పిండి, పదార్థం, ముక్కలు అనే పద్ధతిలో సాక్షిగా వుండి చేస్తున్నాడా? చేయడం లేదు. ఆ కలిసిపోయేటప్పుడు తానే కలిసిపోతున్నాడన్నమాట అందులో. మహదానందపడిపోతున్నాడు. అలా ఏమైపోయావు ఇప్పుడు? ఆవకాయను తయారు చేయడంలో, కర్త ఏమైపోయాడు ఇప్పుడు? సాక్షిగా వుండాలి. కానీ ఏమైపోయాడు? ఆవకాయలో లీనమైపోయాడు. కలిసిపోయాడు. ఆయన ఏమైపోయాడు ఇప్పుడు? భోక్త అయిపోయాడు. ఇప్పుడు ఏమైందట? ఆవకాయ తినకముందే, తయారు చేసేటప్పుడే భోక్త అనుభవించేశాడు. పూర్వం ఆవకాయ తిన్నటువంటి జ్ఞాపకం వుంది కదా! ఈ జ్ఞాపకం సూక్షరూపంలో ఆ తిన్న అనుభవమంతా నెమరవేసేస్తుంది. కలిపేటప్పటికి ఏమైపోయాడు? తిన్న స్థితికి మారిపోయాడు. భోక్త అనుభవించిన స్థితికి మారిపోయాడన్నమాట. ఎప్పుడైతే ఇట్లా అనుభవించిన స్థితికి మారిపోయాడో, ఫలితం దాటిపోయిన తరువాత, ఆ ఫలితానుభవం వచ్చేసిందన్నమాట. నిజంగా జరిగిందా తినటం? జరగలేదు. కానీ సూక్ష్మంలో ఏం జరిగింది? ప్రాణ మనో బుద్ధులలో? తిన్న అనుభవం వచ్చేసింది already. ఊహ ముందుకు వెళ్ళిపోయింది. ప్రియం మోదం ప్రమోద స్థాయిని ముందే అనుభవించేస్తు్ంది. వాస్తవంలో జరుగక పోయినప్పుడు కూడా ఇలాగ దీనిని వాసనాబలం అంటారు.
            "ఇప్పుడు ప్రస్తుత వర్తమానంలో జరిగి అనుభవం వస్తేనేమో సంస్కారం. జరుగకుండానే అనుభవం వస్తే వాసనా బలం." రెండూ అనుభవించాల్సిందే కదా! రెండూ కూడా ప్రియం మోదం ప్రమోదములే కదా! అనుభవించాల్సిందే కాదు, అవి తిప్పవలిసినవి. అనుభవించకుండానే, (అనుభవం కాదు కర్మఫలం) కర్మఫలం ఎప్పుడైంది? కర్త అనేవాడు భోక్త అయితే కర్మఫలం అయ్యింది. ( భోక్తలోకి వచ్చి తినకపోయినా కూడా భోక్త లోకి వచ్చి) అంటే ఏం చేయాలట ఇప్పుడు? భోక్త కాకుండానే చెయ్యి. కర్మఫలం నీ మీద పనిచేయకుండా వుండాలయ్యా అంటే, నువ్వు ఏం చెయ్యాలట? ఆ వాసనాబలం నీ మీద పనిచేయకుండా, ఈ సంస్కార బలం నీ మీద పనిచేయకుండా వుండాలి. పనిచేయడం వల్ల ఏమయ్యావు? కర్త అనేవాడు భోక్త అయ్యాడు. అలా అవ్వకుండా వుండేటట్లు చూసుకోమనే కదా! ఈ ఇహముత్రార్థ ఫలభోగ విరాగము చెప్పేది. అంటే అర్థం ఏమిటట? విషయంలో ప్రవర్తించేటప్పుడు, నీవు ఎప్పుడూ ఎక్కడ వుండాలట? సాక్షిత్వంలో వుండు. నేను ఆత్మస్వరూపుడిని అనే స్థితిని మర్చిపోమాకు. బాహ్యాన్ని మర్చిపోమాకు. మర్చిపోకుండా ఆ స్థితిలో వుండి చేయి. ఏమైందట అప్పుడు? కర్త కర్తగానే వున్నాడు. భోక్తగా అవ్వలేదు. ఎప్పుడైతే భోక్త అవ్వలేదో, ఏమైందట ఇప్పుడు? సంస్కార బలం పనిచేసే అవకాశం లేదు. అర్థమైందా అండీ! కానీ వాసనాబలం పనిచేసే అవకాశం వుంది. ఎందుకని? కర్తగా వున్నావుగా. కర్తగా వుంటే వాసనాబలం పనిచేస్తుంది. భోక్తగా వుంటే సంస్కార బలం పనిచేస్తుంది. అంటే ఏమటి? సాంతం ఇంద్రియాల దాకా తెలివి వచ్చి పనిచేసి అనుభవాన్ని సుఖదుఃఖాలను పొందినప్పుడేమో భోక్త అయివున్నాడు. సూక్ష్మంలో మాత్రమే పనిచేస్తూ వున్నప్పుడు కర్తగా వున్నాడు. కాబట్టి ఏం చెయ్యాలట? అసలైనటువంటి స్థితి ఏమిటయ్యా అంటే, నీవు కర్త కాదయ్యా! నీవు కర్త ఎలా అయ్యావు? అనంత సృష్టికి, విశ్వానికి ఎవరయ్యా కర్తలు? విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు అయ్యి వుండగా, మధ్యలో నేను అంటావేమిటి? ఏమన్నా బుర్ర, బుద్ధి వుందా? నీ భూమండలం మీద ఎంతమంది ఆవకాయ పెట్టడం లేదు? ఏమిటట నీ ప్రత్యేకత? హోటలు వాడు ఒకేసారి వెయ్యికాయలకి, నాలుగు సార్లు పెడుతాడు, సంవత్సరం మొత్తంమీద. ఏమిటి నీ ప్రత్యేకత? సంవత్సరంలో నాలుగు సార్లు పెడతాడండి హోటల్‌ వాడు. వెయ్యికాయలు పెడతాడు ఒక్కొక్కసారి. ఒక పది మంది కలిసి పెడతారు. ఏంటట అయితే? (వాడికేమీ వుండదు, వాడికది పనికదా!) ఎందుకనిట? నాది కాదు ఇది. నాది కాదు. ఈ ఆవకాయ నాది కాదు. నేను తయారు చేయడం లేదు. ఎవరికోసమో తయారు చేస్తున్నాను. ఎవరో తింటాడు. నాకెందుకు? నిమిత్తమాత్రమే నేను. అనే స్థితిలో వుండి చేస్తున్నాడు. అర్థమైందా అండీ! నీవు ఎందుకు చేయడం లేదు అలాగ. అంటే ఏమయ్యావు? అంటే పనిని ప్రారంభించేటప్పుడే, నాకోసం చేస్తున్నాను. అనే స్థితితో మొదలు పెడుతున్నావు. అందువల్ల ఏమయ్యాడు? నాకోసమనే ప్రేరణ మనసులో ఆ ప్రియం పనిచేయగానే, కర్త అయిపోయి కూర్చున్నాడు. (నాకోసం కాక పోయినా నా పిల్లలు నాకోసం) మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. అదంతా నా కోసంలో భాగమే. నువ్వు వుంటేనే కదా! ఆ సంసారం గోల అంతా కూడా.
           
            నీ నేను అనే కర్త వీళ్ళందరినీ భుజాన వేసుకున్నాడు. వేసుకోగానే ఏమయ్యాడు? కర్తైకూర్చున్నాడు ఇక వాడికి స్థిరంగా వచ్చేసింది కర్త. అంతకు ముందు కర్త బలహీనంగా వున్నాడు. అర్థమైందా అండీ ! నేను నేనుగానే వున్నప్పుడు కూడా కర్త వున్నాడు. కానీ బలహీనంగా వున్నాడు. వాసనాబలం అతని మీద పనిచేయటం లేదు. ఎప్పుడైతే తనతో సహా మిగిలినటువంటి సంబంధాలు వున్నటువంటి అందరినీ కలుపుకున్నాడో, ఏమయ్యాడు? స్థిరపడిపోయాడు కర్తగా ఇక. ఇప్పుడు ఏం చేయాలట చచ్చినట్టు వాళ్ళకోసం పనిచేయక తప్పదు. వాడు భోక్త అవ్వక తప్పదు. కాబట్టి నువ్వు ఈ విచారణ క్రమం చక్కగా చెయ్యి. చేస్తే ఏమౌతుందయ్యా? ఇహమిది. మారిపోయేది ఇది. పరిణామం చెందేది ఇది. మార్పు చెందేది. శాశ్వతమైనటువంటిది కాదు. ఆద్యంతములు లేనటువంటిది కాదు. సనాతనమైనది కాదు. దీని వల్ల ఎట్టి జ్ఞానము లభించే అవకాశము లేదు. మార్పు చెందే జ్ఞానమే కానీ, మార్పు చెందని స్థితి యొక్క జ్ఞానం ఇందులో లేదు. ఇది విషయానికి సంబంధించినదే. రసనేంద్రియం అనే విషయానికి సంబంధించినది. చూడండి. ఆ కలపటం తోనే మీరు ఏమంటారు? అబ్బా! ఎంత ఎర్రగా వుందో, తినక ముందే ఈవెడ చూశారు, దృశ్యరూపం. కళ్ళతో చూచాడండీ, తినలేదు. కళ్ళతో చూచి, పూర్వం కళ్ళతో చూచినప్పుడు తిన్నదానికి tally చేశాడు, సరాసరి తీసుకువెళ్ళి. ఒక పది సార్లు కలిపింది చూచింది వుంటుంది కదా! అప్పుడు ఎర్రగా వుంది, తక్కువ ఎర్రగా వుంది. ఎక్కువ ఎర్రగా వుంది. ఆ వాటికి ఏమైంది? రసనేంద్రియానికి సంబంధించిన జ్ఞాపకం జోడించబడింది. జోడించి రెండూ కలిపి ఇది పనిచేసి, ఇప్పుడు తినకముందే, కలిపినటువంటి దృశ్యవస్తువుని చూడగానే, ఇది గ్యారెంటీగా కారంగా వుంటుంది, ఇది గ్యారెంటీగా ఉప్పు ఎక్కువ వుంటుంది. ఇది గ్యారెంటీగా.... ఇలా నిర్ణయం చేసేసే స్థితి దాకా వచ్చేశాడు. చూడండి ఒక్కసారి. ఎక్కడున్నామో ఇప్పుడు మనం. ఇదయ్యా మోహం అంటే. మోహం అంటే అందురూ అసలు ఏవో మోహాలు అనుకుంటారు. అవి మాత్రమే మోహాలు కాదండీ, ప్రతీదీ మోహమే. ఏదో ఆడవాళ్ళు మగవాళ్ళను కాంక్షించడం, మగవాళ్ళు ఆడవాళ్ళను కాంక్షించడమే మోహం అనే స్థితిలో మనమందరం మాట్లాడుతాం అండీ! దానంత తప్పు ఏదీ లేదు. అర్థమైందా అండీ! ప్రతీ విషయంలో, నీకు అసలు ప్రతీ విషయంలోనూ వున్నది మోహమే. ఎందుకని? అది పొందకుండా నీవు ఆగలేకపోతున్నావుగా. ఆగలేకపోవడం ఏదైతే వున్నదో అదే మోహము. గుర్తుపెట్టుకోండి. ఏవండీ! దీన్ని చూడకుండా నేను ఆగలేకపోతున్నానండీ! మోహం. ఈ సీరియల్‌ చూడకుండా నేను ఆగలేకపోతున్నానండీ, మోహం. ఏదైనా సరే! ఈ పని చేయక నేను ఆగలేకపోతున్నానండీ, ఆగలేకపోవడం అనే వేగం ఏదైతే వున్నదో, అదంతా మోహమే. ఒక్కసారి ఆ స్థితి వరకూ వచ్చింది అంటే, నిన్ను ఆపడానికి వీలుకాదు. ఎందుకని? ఆ వేగం వచ్చేస్తుంది దానికి. ఇంద్రియ వేగం వచ్చేస్తుందన్నమాట. మనసుకి వేగం వచ్చేస్తుంది. ఇంద్రియాలకు వేగం వచ్చేస్తుంది. ఇంద్రియ వేగం వచ్చేస్తుంది. నీవు ఆ విషయరూపాన్ని ధరించివేస్తావన్నమాట. ఇంకా నిన్ను ఆపడానికి వీలుకాదు. అప్పుడు అన్ని ధర్మాలను అతిక్రమిస్తావు. దాన్ని అప్పుడు పొందడమే నీ లక్ష్యం అంతే. వీడు బాధపడతాడా? బాధపడలేదా? వీడు వున్నాడా? పోయాడా? అవన్నీ ఏవీ ఆలోచించవన్నమాట ఇంకా. పరమాత్మతో ఏ నిమిత్తము వుండదు. ఇది కావాలి. చేసేశాను  అంతే. నాకిది కావాలండీ, నేను చేసేశాను అంతే. అంటాడు అంతే. తమోగుణం వచ్చేస్తుందన్నమాట అప్పటికి. సాంతం మోహంలోకి వచ్చేసేటప్పటికి, తమోగుణ ప్రభావం వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు చెప్పడానికి వీలౌతుందా? వీలుకాదు.  ప్రియంగా వున్నప్పుడు సత్వగుణం. మోద రూపంలో వున్నప్పుడు రజోగుణం. ప్రమోద రూపంలోకి వచ్చేసేటప్పటికి తమోగుణం. కాబట్టి మీలో వున్నటువంటి విషయ విచారణని చక్కగా చేస్తూ, ఆ విషయ విచారణ అంతా కూడా ఎలా చెయ్యాలయ్యా అంటే ఇలా చేయాలి.
            ఏవండీ! నాకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? ఎందుకు ఇంత దుఃఖం కలిగింది? నేను ఎందుకు ఇలా వున్నాను? నాకు పరమాత్మ ఎందుకు తెలియలేదు? నాకు ఆత్మస్వరూపం ఎందుకు బోధపడలేదయ్యా అంటే, అన్నింటిలో మనం మన మానవ జీవితంలో ఇప్పటివరకూ జీవించిన జీవితంలో వున్నవన్నీ ఏమిటి? ఈ ప్రియం మోద ప్రమోదములే వున్నాయి. అన్నిటిలో. ఎక్కడెక్కడైతే మీకు ఈ ప్రియం మోద ప్రమోదములు వున్నాయో, మళ్ళా ఇప్పుడు అవే కలుగుతూ వుంటాయండి. కొత్తగా ఏమీ కలగవు. అన్నీ పాతవే. నువ్వు పుట్టి బుద్ధి ఎరిగనప్పటి నుంచి ఇప్పటి వరకూ చూచినవి, చేసినవే వుంటాయి. ఇంకా కొత్తవి ఏమీ చూసేదీ, చేసేదీ లేదు. ఎందుకని? నీ జ్ఞాపకాలలో ఎప్పటి నుంచి వున్నాయండీ? 'కల్పశతముల కన్న మిక్కిలి కాల మాయెను తిరిగి చూడగ ' - ఈ విశ్వమంతా తిరిగి చూస్తూనే వున్నావు. ఎప్పటి నుంచి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తూ వున్నావు. అసలు నీకు కొత్తదనే అవకాశమే లేదు. నీకు ఈ సృష్టి మొత్తం మీద. ఇంటర్నెట్‌ అదీ ఎప్పుడో చూసేశాము. కంప్యూటర్‌ - అదీ అంతకంటే ముందే చూసేశాము. అన్నీ చూసేసినవే, కొత్తవి ఏమీ కాదు. ఇప్పుడు ఎలా కొత్తవి కాదు? కాసేపు ఆ పని చేసి చూడు. 10 నిమిషాలు అయ్యేటప్పటికి నీకు అది పాతదై పోతుంది. కొత్తదైతే ఎప్పుడూ కొత్తగా వుండాలి కదా! వుంటోందా? వుండడం లేదు కదా! (మరి పాతదానినే మరలా మరల కోరుకుంటున్నాము కదా!) ఎందుకని అంటే, ఆ పాతదాంట్లో కొంచెం మార్పు వచ్చిందన్నమాట. శబ్దంలోనో, స్పర్శలోనో, రూపంలోనో, రసంలోనో, గంధంలోనో ఒక పది శాతమో, ఒక శాతమో మార్పు వచ్చిందన్నమాట. దాన్ని కొత్తది అంటున్నావు. ఎందుకని? మారటం దాని సహజ లక్షణం. అంతే కదండీ! మీరు అన్నీ ఒకే రంగున్న, ఒకే రకమైన చీరలు కడతారా? ఎందుకని? ఎందుకని కట్టరండీ? కాదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఆలోచించి పెట్టారు. వైధవ్యం - భర్త గతించిన తర్వాత కేవలం ఒకే రంగు తెలుపె చీరే కట్టాలని పెట్టారండి. ఎందుకని పెట్టారు? identification కాదు. పాపం. అది అంతకంటే పొరపాటు. అయ్యో! విషయవైరాగ్యం పొందమని. విషయము అంటే రంగులతో కూడుకుని వుంటుంది. కొంచెం కొంచెం మార్పులతోటి నిరంతరాయంగా పరిణామం చెందుతూ వుంటుంది. పరిణామం లేనటువంటి శాశ్వతమైన స్థితి కోసం, నేను జీవిస్తున్నాను అనే ప్రతీక. శాశ్వతత్వము, పరిణామము లేని, మార్పులేనటువంటి స్థితిని తెలుసుకునే నిమిత్తమై నేను ఇక నుంచీ జీవిస్తున్నాను అని తనకు తానే దీక్ష తీసుకోవడం అండీ అది. సన్యాసము ఎలాగో, ఇది కూడా అంతే. తనకు తానే స్వీకరించేటటువంటి దీక్ష. కానీ ఈ వాస్తవం పోయింది. ఈ వాస్తవం పోయి ఇప్పుడు ఏమైందండి? ఒక్కసారి ఆలోచించుకోండి. అర్థమైందా అండీ!
            తనకు తానే తన జీవితం మీద వెనక్కు తిరగి చూచుకుని, ఓహో! ఏముంది ఇందులో? అంతా విషయమే తప్ప, ఇక్కడేమీ లేదు. అని ఇహముత్రార్థ ఫలభోగ విరాగము చేత, సాధన చతుష్టయ సంపత్తిలో వున్నటువంటి, గొప్పదైనటువంటి ఈ రెండవ దీక్ష అండి. ఈ రెండవ సాధనే. ఈ రెండవ సాధన యొక్క ప్రభావన్ని అక్కడ పెట్టారన్నమాట. అర్థమైందా అండీ!
            సాధారణంగా స్త్రీలకు విషయాలు ఎక్కువ వుంటాయి కదా! ఈ ప్రకృతి ధర్మంగా వారిలో ఒకింత ఎక్కువ పనిచేస్తూ వుంటుందండి. అందువల్ల, ఆ విషయ వైరాగ్యం, ఆ వైరాగ్య నిర్ణయం కోసం, శాశ్వతత్వాన్ని నేను గుర్తించే నిమిత్తమై ఇక శేషజీవితాన్ని గడపబోతున్నాను. అనే ఒక నిర్ణయాన్ని తనకు తానే దీక్షగా స్వీకరించింది కాబట్టి అలా ఏర్పాటు చేసుకుంది. ఆవెడకు ఆవెడే. మరొకరు ఏర్పాటు చేసే అవకాశము లేదు. ఎట్లా అయితే సన్యాసం తనకు తానే స్వీకరించాలో, అలాగే ఇది కూడా అంతే. అర్థమైందా అండీ? అలాగ ఎప్పేడైతే ఈ విధానంలో ఏర్పాటు చేశారో, చివరకు ఏం మిగిలింది ఇప్పుడు? అందుకే ఒక్కసారి విచారణ చేసుకోండి. అందుకే మన సంప్రదాయంలో... ఇదంతా శిష్టాచార సాంప్రదాయం. అంతా ఆత్మజ్ఞాన ప్రబోధం అందులో వున్నది. కానీ ఆత్మజ్ఞానం పోయింది. పోయి చివరకు ఏమి మిగిలింది? బాహ్యం మిగిలిపోయింది. అందువల్ల ఆ శిష్టాచార సాంప్రదాయం ఎవ్వరూ పాటించరు ఇక. ఎందుకని? లక్ష్యం పోయింది. ఇప్పుడు ఎవ్వరూ పాటించడం లేదండి. అసలు ఈ విధానమే పోయింది ఇప్పుడు. అందుకే నండి, ఆయన వుంటే వున్నాడు, లేకపోతే పోయాడు ఏమిటట ఇప్పుడు? ఆయన వుంటే, పోతే ఇప్పుడు నాకు ఏం తేడా వచ్చింది? నేను ఎప్పుడూ వున్నాను. నాకేమన్నా తేడా వచ్చిందా? పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గరనుంచీ అన్నీ వున్నాయి నాకు. నేను పోతే కదా ఏకంగా. నేను పోయినప్పుడు నాతోపాటు అన్నీ పోతాయి. బోడి ఇప్పుడు ఆయన వుంటే ఏంటట? పోతే ఏంటట? అనే స్థితిదాకా వచ్చేసింది. ఎందుకని? ఆచారము, సాంప్రదాయము అని చెప్పేదాంట్లో ఈ ఆత్మజ్ఞానము లోపించింది. ఎప్పుడైతే నిజజీవితంలో ఆత్మజ్ఞానం లోపించిందో, బాహ్యమే మిగిలిపోయింది ఇప్పుడు. అర్థమైందా అండీ! కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలట? మీరు ఆచరించే టప్పుడు ఆత్మజ్ఞానంతో ఆచరించు. అప్పుడు ఆ ఆచార సాంప్రదాయం బ్రతుకుతుందండి. మీరు నిజంగా ఆచార సాంప్రదాయాన్ని బ్రతికించాలి అని అన్నారనుకోండి, మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఆత్మజ్ఞానంతో ఆచరించు. నువ్వు ఆత్మజ్ఞానంతో ఆచరిస్తే, నీ చుట్టుపక్కల వున్న జీవులన్నింటి మీదా దాని ప్రభావం వుంటుంది. ఆ ప్రభావం ఏం చేస్తుంది? అది బ్రతికించేట్టు చేస్తుంది, దాన్ని వాడు ఆచరించేట్టు చేస్తుంది. మీరు ఎంత చెప్పినా వాళ్ళు ఆచరించడం లేదండి, ఎందుకు ఆచరించడం లేదు? నువ్వు ఆచరించేటప్పుడు ఆత్మజ్ఞానంతో ఆచరించడం లేదు. విశాల భావంతో ఆచరించడం లేదు. పరిమితత్వ భావంతో ఆచరిస్తున్నావు. ఏమైనా సరే చేయాల్సిందే అని బలవంతముగా రుద్దుతున్నావు. ప్రపంచంలో బలవంతముగా ఏపనీ చేయించడానికి వీలుకాదు. తల్లి గర్భంలోంచి శిశువు బయట పడాలన్నా కూడా బలవంతపు బ్రాహ్మణార్థం పనికిరాదు. అసాధ్యము. కానీ మనమేమి చేస్తున్నాము? అన్నీ ఇప్పుడు బలవంతముగా చేయిస్తున్నామండీ! ఏమైంది? తప్పు కదా! ఆచరణ సాధ్యం కాదు కదా! కాబట్టి నిజజీవితంలో ఈ సాధన చతుష్టయ సంపత్తిని ప్రతినిత్యము, ప్రతి విషయములోనూ, ప్రతి క్షణము, ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి ఆలోచనలో నిత్యానిత్యవస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగవిరాగము అనే రెండింటి యొక్క, ఈ రెండు సాధనలు చాలా అవసరం అండి. మరణకాలంలో వెంటనే, నీకు బుద్ధి విరమించే లోపల, వుపయోగపడేటటువంటి సంపదలు వున్నాయి ఏమన్నా అంటే అవి ఇవి రెండే. బుద్ధి విరమించిన తరువాత అసలు ఈ రెండూ కూడా ఉపయోగపడవండి. అందుకనే చెప్పేది, మరణ వేదన ప్రారంభం కాకముందే, నీకు ముందే తెలుస్తు్ందండి, తెలివి వున్నవాడికి ఏం జరుగుతుందయ్యా అంటే, మొదటే చెప్పాను కదా! శరీరం వదిలి వేస్తాడు. తెలివితో వదిలి వేస్తాడండి. ఆ తెలివి వుంటుంది. మరణం వచ్చేస్తుంది. ఇహ సమయం ఆసన్నమైంది అని తెలియగానే ఏం చేస్తాడంటే, ఈ నిత్యానిత్య వస్తువివేకాన్ని, ఇహముత్రార్థ ఫలభోగ విరాగాన్ని జీవితమంతా ఆచరిస్తాడు కదా! సహజమైపోతాయి అప్పుడన్నమాట. ఆ సహజమైనటువంటి స్థితిలో, తాను ఆత్మస్వరూపుడు అని స్థిరపడిపోయి, చూస్తూ వుంటాడు అంతే. ఎలా ఇంద్రియాలు ఒక్కొక్కటి ఎలా పడిపోతున్నాయో, సహజంగా చూస్తూవుంటాడు అంతే. అలాగే పడిపోతాయి. పోతే పోనీ అని అనుకుంటాడు అంతే. ఏమీ చలించడన్నమాట. అలాగ అలా చలించని స్థితిలో వుండాలి మరణంలో కూడా అంటే, ఈ సాధన చతుష్టయ సంపత్తి ఎంతో అవసరం. ఇలా ఈ సాధన చతుష్టయ సంపత్తితో జీవించేవాడే సాధకుడు. దీంట్లో సహజత్వం పొందినవాడు శిష్యుడు. అట్టి సహజత్వం పొందినవారిలో అగ్రగణ్యుడు సచ్ఛిష్యుడు. వీరిలో భేదాలు ఇవండి. ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించకుండా తిరిగేవాళ్ళు అనుసరించే వాళ్ళు. ఒకటే గుర్తు పెట్టుకోండి. మీరందరూ కూడా భవిష్యత్తులో ఏమౌతారు అనేది, దీన్ని బట్టి తెలుస్తుంది. ఎప్పటికీ మీరు మీ నిజజీవితంలో ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించకుండా కూడా ఇలాగే వింటూవుండవచ్చు, వెళుతూ వుండవచ్చు, వింటూవుండవచ్చు, వెళుతూ వుండవచ్చు, వింటూవుండవచ్చు, అనేక ఆశ్రమాలకు వెళుతూ వుండవచ్చు, పురాణ శ్రవణం వింటూ వుండవచ్చు, వెళుతూ వుండవచ్చు. వీళ్ళందరూ ఎవరు? అనుసరించేవాళ్లు. అంతే. వీళ్ళకు ఏమీ ఉపయోగం వుండదండి. వీళ్ళకు ఏ సాధన చతుష్టయ సంపత్తితో పనిలేదు. తెలుసు వీళ్ళకు కాకపోతే అన్నీ కూడా. కానీ వాళ్ళ దగ్గర ఏమీ వుండదన్నమాట. వాడి దగ్గర ధనమేమీ వుండదు. కానీ ధనము అంటే ఏమిటో తెలుసు. అర్థమైందా అండీ? బ్యాంకులో క్యాషియర్‌ లాంటివాడన్నమాట వీడు. ఎన్ని కోట్లు అయినా వస్తూ వుంటాయి, ఇస్తూవుంటాడు, కానీ వాడిది అనేది ఏమీ అక్కడ వుండదు. కానీ, కనీసం వీడికి ఏంటంటే, విషయభోగం మీద అపేక్షపోదండి. ఎందుకంటే, వీడిదగ్గర సాధన చతుష్టయ సంపత్తి లేదు కాబట్టి. విషయం వచ్చినప్పుడు దాంట్లో మునిగిపోతూ వుంటాడన్నమాట. విషయం లేనప్పుడు మాత్రం ప్రశాంతంగానే వుంటాడన్నామాట. ఈ అనుసరించే వాళ్ళకు కూడా ఉపయోగం వుందండి. ఏంటట? విషయం లేనప్పుడు మాత్రం ప్రశాంతంగా వుంటాడు, విషయం వస్తే మాత్రం వీడంత ప్రమాదకారి మరొకడు లేడు. ఎందుకంటే అందరికంటే ముందు వీడే మునిగిపోతాడు కాబట్టి. అర్థమైందా అండీ! ఎందుకని? ఆనకట్ట కట్టీ, కట్టీ, కట్టీ వుంటాడు. విషయం రాగానే ఏమైపోతాడండి? తెంచుకుని విరుచుకు పడుతుందండి. ఈ అనుసరించే వాడికి వచ్చిన ప్రమాదం ఇది. అయితే దీంట్లోనుంచి ఒక మెట్టు పైకి ఎక్కాలి. సాధన చతుష్టయ సంపత్తిని నిజజీవితంలో మనం నిజంగా సంపాదించాలి అండి. ఇదే నీ సూక్ష్మాన్ని బాగు చేసేటటువంటి సరైన సాధన. ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించడం కోసమే, అన్ని ఉపనిషత్తులు, వేదాంతమంతా బోధించేది అంతా వీటికోసమే. ఈ సాధన చతుష్టయ సంపత్తి లేకుండా, ఏదీ సాధ్యము కాదు. అసాధ్యము. నీవు ఎన్నన్నా చదువు, ఎన్ని విను, ఎన్ని చేయి అంతా నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్ళి వదిలేస్తాయి? అనుసరించే వాడిదాకా తీసుకెళ్ళి వదిలేస్తాయి. గురువు అవసరం ఏమిటయ్యా అని అంటే, ఈ సాధన చతుష్టయ సంపత్తిని నీకు వివరించి చెప్తాడు. నన్ను మార్గదర్శకత్వం చేస్తాడు, నన్ను మార్గదర్శకత్వం చేస్తాడు, ఏం చెయ్యాలో చెప్తాడు అంటున్నావే, ఏంటయ్యా? ఆయన చెప్పేది అంటే ఇదిగో ఇదే! ఆ సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి? అది ఎట్లా సంపాదించాలి అనేది వివరంగా చెప్తాడన్నమాట. నిజజీవితంలో వాటిని ఎట్లా ఆచరించాలో చెప్పడమే, గురువు చేసేటటువంటి పని. ప్రాథమికంగా గురువు చేసేటటువంటి పని. ఆయన్ని ఏమన్నారయ్యా అంటే శ్రీ గురువు అన్నారు. ఇట్లా చెప్పే ఆయన్ని ఎవరంటారు? శ్రీ గురువు అంటారండి. కాబట్టి  ఆ రకంగా మీరు నిత్యానిత్య వస్తువివేకము నిన్న చూశారు. ఇవాళ ఇహముత్రార్థ ఫలభోగవిరాగాన్ని గమనించాము. రేపు మరొకటి.

ఓం ఓం ఓం పూర్ణమదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణమదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం పూర్ణమదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం తత్‌ సత్‌
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః
సాయిరాం.