File No.1



శరీరము నేనుఅనే భావనను నిరసించడానికైనా, ‘నేను ఆత్మ స్వరూపుడనుఅనే భావనను స్థిరపరచాలన్నా “అధ్యారోప అపవాదం” అనే మార్గం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకనయ్యా? అంటే, ఇప్పటి వరకు శరీరమే గొప్పది, శరీరమే విలువైనది, నేను శరీరమునే అనే పద్ధతిలో మనం మెలకువలో వున్నంత కాలం అలాగే జీవించాము. కాబట్టి అలా జీవించినది అంతాకూడా నిరసించాలి. నిరసిస్తే తప్ప సాధ్యం కాదు. అది నిరసించాలి అంటే, దాని కంటే గొప్పది అయినటువంటి అధ్యారోపము అధి ఆరోపము, దానికంటే అధికమైనటు వంటి దానిని దాంట్లో ఆరోపించాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది. దానికంటే అధికమైన దానిని ఆరోపిస్తే, దానికంటే తక్కువది అపవాదంగా నిరసించడానికి వీలౌతుంది. ఇది మన జీవితంలో మనం ప్రతినిత్యం చూస్తూనే వున్నాం. ఎలాగయ్యా?

బాల్యంలో వున్నది, బాల్యంలో మొట్టమొదట ఏం చేశాడు? ఆటలు ఆడుకున్నాడు. తరువాత దానికంటే అధికమైనది ఏమిటి? చదువు అధికమైనది. ఎందుకని? ఆ చదువు వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది.  ఆ బుద్ధి వికాసం కలిగినటువంటి దాని వల్లనే జ్ఞానం వస్తుంది అనేటటువంటి ఆధిపత్యం అధిష్ఠానంగా దానిని పెట్టాము. కాబట్టి దాని వలన ఏం జరుగుతోంది? అప్పుడు ఆ అధ్యారోపం ఆ చదువు కోసమని ఆ ఆటల్ని అపవాదంగా వదిలేస్తున్నాడు. వదిలేస్తున్నాడా? లేదా? ఆ చదువుకోసమని ఆటల్ని వదిలేశాడా? కాసేపు ఆడుకుంటున్నాడు, ఎక్కువ సేపు చదువుకుంటున్నాడు. కొంతకాలం అయ్యాక అసలు ఆటలు మానేశాడు, కేవలం చదువుకుంటూనే వున్నాడు.  అలా ఎప్పుడైతే మీరు, జీవితం అంతా గమనిస్తూ వుంటారో అప్పుడు, “ఏ విషయమైనా ఇంతే. అది కొంత కాలం వుంటుంది. దానికంటే అధికమైనది మరొకటి వస్తుంది. ఇంతకు ముందు వున్నది అపవాదంగా నిరసించబడుతూ వుంటుంది” అనేది తెలుసుకుంటారు.

బాల్యమైనా, కౌమారమైనా, యవ్వనమైనా, వృద్ధాప్యమైనా ఏదైనా కూడా ఈ నాలుగు అవస్థలు ఇట్లాగే జరుగుతూవుంటాయి. అట్లాగే జాగ్రదావస్థ, అట్లాగే స్వప్నం, అట్లాగే నిద్ర.
ఇదే మానవ జీవితం మొత్తం అంతా వున్నదే అసలు ఈ అధ్యారోప అపవాదం. బుద్ధి అంతా దీనిమీదే ఆధారపడి వున్నదన్నమాట. కాబట్టి మీరు నిత్య జీవితంలో రోజువారీ చేసే ప్రతి ఆలోచన, ప్రతి చేత, ప్రతి మాట, ప్రతి కర్మ, ప్రతి సారీ కూడా నేను ఆత్మస్వరూపుడనుఅని ప్రారంభిస్తే తప్ప ఈ అభ్యాసం రాదు. అలా మీరు ప్రతి ఆలోచనని ప్రారంభించాలి. నిత్య జీవితంలో దానిని అలవాటు చేసుకోవాలి. అలా జీవిస్తున్నప్పుడు మాత్రమే నేను శరీరం కాదుఅని స్థిరపడుతుంది. అప్పుడు మీరు ఏ పని చేసినా కూడా, ఏ సాధన చేసినా కూడా, ఏ విచారణ చేసినా కూడా ఆత్మభావనలో స్థిరపడడం కోసం మాత్రమే చేస్తారు. శరీరభావనలో స్థిరపడడానికి అవకాశం వున్నవి చెయ్యరన్నమాట. ఎందుకనీ? తెలిసిపోతూ వుంటుంది అప్పుడు. శరీరభావంలో స్థిర పడుతున్నాం అనంగానే వెంటనే పూర్వ దుఃఖాలు, పూర్వ అజ్ఞానం అంతా గుర్తుకొస్తుంది. మళ్ళీ అయ్యో నేను మళ్ళా అందులోకే పోతున్నాను అని తెలుసుకుని వెనక్కి విరమించుకో గలుగుతారన్నమాట. అట్లా విరమించు కోగలిగినప్పుడే  సాధ్యమౌతుంది. ఎన్నైతే మనకి లోపల అహంతో కూడుకుని, అజ్ఞానంతో కూడుకుని వున్నటువంటి పంతాలు ఎన్నైతే వుంటాయో అవన్నీ దుఃఖానికి హేతువులే తప్పదు ఎప్పటికైనా వాటితో దుఃఖం తప్పదు.

ఎందుకయ్యా? దుఃఖం నీకు కలుగుతోంది అంటే, దుఃఖానుభవం వుంది అంటే, తప్పని సరిగా దానివెనుకాల అహం వుంటుంది. అంతే. దాని వెనుకాల అజ్ఞానం వుంటుంది. నిన్ను చూసుకో. ప్రతి అనుభవంలో చూసుకో. దుఃఖం కలుగుతోందండి ఈ విషయంలో, అయితే అహం వున్నట్లే. అయితే అజ్ఞానం వున్నట్లే.

ఎవరికైతే దుఃఖం నిశ్శేషంగా పోయిందో, వాడే జీవన్ముక్తుడు. దేనివలన కూడా అతనికి దుఃఖం కలుగదు. ముక్తుడైనటువంటి వాడికి దేని వలన కూడా దుఃఖం కలుగదు. అది మరణం వలన కూడా అతనికి దుఃఖం కలుగదు. శరీరాన్ని వదిలేస్తున్నానని సహజంగా వుంటాడు. అలాగే శరీరం పుట్టటం అనేది లేదు. శరీరం చనిపోవటం అనేది లేదు. నేను పుట్టలేదు. నేను చావలేదు. అని సహజంగా వుంటాడు. ఆ రెండిటికే లేనప్పుడు మధ్యలో వాటి గురించి అస్సలు చింతపడడు.
ఏది వచ్చినా ఏది పోయినా ఏది వున్నా ఏది లేకున్నా ఏది జరిగినా ఏది జరుగక పోయినా ఏది చేసినా ఏది చేయకపోయినా సహజంగా వుంటాడు. ఏ బాధను, ఏ దుఃఖాన్ని పొందడు. మరొకరెవరో తనకోసం ప్రవర్తించలేదని కానీ, ప్రవర్తించారని కానీ, సమాజం తనకు అనుకూలంగా వున్నదని కానీ, వ్యతిరేకంగా వున్నదని కానీ ఎట్టి దుఃఖాన్ని పొందడు. కాబట్టి ముక్తుడైనటువంటి వాడికి వున్న స్వేచ్ఛ ఎవరికీ లేదన్నమాట.


భగవద్గీత అంతా ఈ రెండు వాక్యాల మీదే మాట్లాడుతుంది. ఎంతసేపూ. నువ్వు ఎన్ని గుణాలనైనా నేర్చుకో, ఎన్ని ధర్మలైనా ఆచరించు, ఏదైనా చెయ్యి చేసి చెయ్యని వాడివిఅవ్వాలి. విని వినని వాడివి అవ్వాలి. చూచి చూడని వాడివి అవ్వాలి. తిని తినని వాడివి అవ్వాలి. అన్నీ అంతే. జీవించి జీవించని వాడివి అవ్వాలి. జీవిస్తూనే వున్నావు. కానీ నేను ఆత్మస్వరూపుడను అనే భావంతో శరీరంలో వున్నాను. శరీరం అనే గృహంలో యజమానిగా, నేను ఆత్మ స్వరూపంగా వున్నాను. శరీరమే నా గృహం. అంతేకానీ, శరీరం నివసించే గృహం కాదు నా గృహం. ఎందుకని? ఎప్పటికైనా శరీరమనే గృహాన్నే విడిచిపెట్టి వెళ్ళాలి కదా నేను. అపవాదంగా నిరసించివేయాలి కదా దీనిని నేను. ఇది మధ్యలో తెచ్చుకున్నది కదా. మధ్యలోనే పోతుంది కదా. ఎల్లప్పుడూ వుండేది ఆత్మస్వరూపం కదా. మధ్యలో వచ్చిన గృహం మనతోనే చివరిదాకా వుంటుందా? ఎట్లా వుంటుంది? వుండదు కదా! శరీరం అనే గృహాన్ని విడిచిపెడుతున్నాను కదా మరీ. దేహమనే ఇంటిని దేహి విడిచిపెడుతున్నాడు కదా. అధ్యారోప అపవాదమంటే అర్థం ఇది.